అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క పరిచయం
అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.
అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)
ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.
إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అపారమైన శుభాలు కలవాడు.(7:54)
ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.
ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,
اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)
ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,
اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)
وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)
మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.
اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)
మానవ సృష్టి మరియు మార్గదర్శకత్వం
అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,
هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)
ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.
ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.
اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)
అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.
ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.
ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,
أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)
మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.
మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.
ఇస్లాం – సర్వ సృష్టి యొక్క ధర్మం
అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,
كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)
సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.
స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)
ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.
అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,
يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)
ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,
الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.
ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.
شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)
రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.
అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.
ఇస్లాం పై అపోహలు
కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.
అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.
ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.
أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)
ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?
وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)
మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.
సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.
అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.
ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.
మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?
فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.
అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?
وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.