మహా సంపన్నుడు ఖారూన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

(పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ సంపద’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.)

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ

“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)

ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.

జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.

ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.

ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.

అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు [వీడియో & టెక్స్ట్]

ధర్మపరమైన నిషేధాలు – 39
అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు
https://youtu.be/HzdBTTa3fGc [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ఈ భాగంలో, అల్లాహ్ యొక్క ఆయతులను (వచనాలను) ఎగతాళి చేసే వ్యక్తులతో కూర్చోవడం చేయడం నిషేధించబడిన విషయం గురించి చర్చించబడింది. ఎవరైనా అలాంటి వారిని ఆపగల శక్తి, జ్ఞానం, మరియు సదుద్దేశంతో వారి మధ్య కూర్చుంటే తప్ప, కేవలం వారి ఎగతాళిని వింటూ వారితో ఉండటం కూడా పాపంలో భాగస్వామ్యం అవ్వడమేనని వక్త స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సూరతున్నసా (4వ అధ్యాయం)లోని 140వ ఆయతును పఠించి, దాని భావాన్ని వివరించారు. ఆ ఆయతు ప్రకారం, అల్లాహ్ ఆయతులను తిరస్కరించడం లేదా పరిహసించడం విన్నప్పుడు, ఆ సంభాషణను విడిచిపెట్టాలి, లేకపోతే వారు కూడా ఆ పాపులతో సమానం అవుతారు. వక్త ఈనాటి ముస్లింల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, సినిమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇలాంటి పాపభూయిష్టమైన విషయాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ, కనీసం ఖండించకుండా మౌనంగా ఉండటం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించారు. చెడును చేతితో, లేదా మాటతో ఆపాలని, కనీసం మనసులోనైనా దానిని ద్వేషించాలని చెప్పే హదీసును ఉటంకిస్తూ, విశ్వాసంలోని బలహీన స్థాయిని కూడా కోల్పోకూడదని ఉద్బోధించారు.

39వ విషయం: అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్న వారితో నీవు కూర్చోకు.

శ్రద్ధ వహించండి, కన్ఫ్యూజ్ కాకండి. 38వ విషయం ఏమి విన్నారు? అల్లాహ్, అతని ఆయతులు, ఆయన ప్రవక్త పట్ల ఎగతాళి చేయకూడదు. కానీ ఇక్కడ 39వ విషయం, ఎవరైతే ఇలా ఎగతాళి చేస్తూ ఉన్నారో, అలాంటి వారికి తోడుగా ఉండకు. ఆ ఎగతాళి చేస్తున్న సందర్భములో వారితో కలిసి కూర్చోకు. ఆ సందర్భములో వారితో కలిసి ఉండకు. ఒకవేళ, నీవు వారిని ఆపగలుగుతున్నావు, అతను మాట పూర్తి చేసే వరకు మధ్యలో ఆపేది ఉంటే మన మాటను శ్రద్ధ వహించడు అందుకొరకే, కొంచెం మాట పూర్తి చేసిన వెంటనే, అతన్ని బోధ చేస్తాను, అతనికి నేను నసీహత్ చేస్తాను, అతను చేసిన ఈ పాపం ఎగతాళి నుండి నేను అతన్ని ఆపుతాను, ఇలాంటి సదుద్దేశం ఉండి, ఆపే అంతటి శక్తి ఉండి, ఆపే అంతటి జ్ఞానం ఉండి, అక్కడ కూర్చుంటే పాపం లేదు. కానీ అలా కాకుండా, ఆపడం అయితే లేదు, కానీ వారితో కలిసి కూర్చోవడం, ఇది కూడా పాపంలో వస్తుంది, ఇది కూడా ఒక నిషేధం, మనం దీనిని వదులుకోవాలి.

ముందు దీనికి సంబంధించి సూరతున్నసా, సూర నెంబర్ నాలుగు, ఆయత్ నెంబర్ 140 వినండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన మరి చిన్నపాటి వివరణ కూడా మనం తెలుసుకుందాం.

[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}

అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి  ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఎంతటి హెచ్చరిక ఇందులో ఉంది ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆయతులు చదవడం లేదు. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు, అల్లాహ్ ఈ దివ్య గ్రంథము ఖురాన్ లో మీకు ఇంతకు ముందే ఆదేశం ఇచ్చి ఉన్నాడు దీనికి సంబంధించి. ఏంటి? అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా, తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే, అలా చేసే వారితో మీరు, వారు తమ ఆ సంభాషణ వదిలే వరకు వారితో కూర్చోకండి. ఫలా తఖ్’ఉదూ, గమనించండి, ఫలా తఖ్’ఉదూ, మీరు వారితో కూర్చోకండి. హత్తా యఖూదూ ఫీ హదీసిన్ గైరిహ్. వారు వేరే మాట ఎప్పటివరకైతే మాట్లాడారో మీరు వారితో, ఖురాన్ కు ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ పట్ల ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి జరిగినప్పుడు, వారితో పాటే అక్కడ కూర్చోవడం, ఇది మీకు తగని విషయం. అంతే కాదు, ఇక్కడ గమనించండి, ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. మీరు గనక నా ఈ ఆదేశాన్ని వినలేదంటే, మీరు కూడా వారిలో కలిసిపోయినవారే. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. అతన్ని ఆపడం లేదు. నీకు చెప్పే అధికారం లేదు, అయ్యో నేను ఎగతాళి చేస్తలేనండి అని. నీవు కూడా ఇతనితో సమానం అని నేను అనడం లేదు, అల్లాహ్ అంటున్నాడు. ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. నిశ్చయంగా మీరు కూడా వారితో సమానం.

అంతేనా? అల్లాహ్ ఇంకా హెచ్చరించాడు, గమనించండి. ఇన్నల్లాహ జామిఉల్ మునాఫిఖీన వల్ కాఫిరీన ఫీ జహన్నమ జమీఆ. అల్లాహ్ త’ఆలా వంచకులను మరియు అవిశ్వాసులను, కపట విశ్వాసులను, అవిశ్వాసులను కలిపి నరకంలో ఉంచుతాడు అని. వాస్తవానికి మనలో విశ్వాసం ఉంటే, వాస్తవానికి విశ్వాసం పట్ల కపటత్వం, వంచకపుతనం మనలో లేకుంటే, మనం ఆపాలి వారిని, లేదా అక్కడి నుండి వెళ్ళిపోవాలి.

సహీహ్ ముస్లిం యొక్క హదీస్ కూడా ఇక్కడ మీకు గుర్తొస్తుంది కదా? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్. మీలో ఎవరైతే ఒక చెడు పనిని చూస్తారో, ఫల్ యుగయ్యిర్హు బియదిహ్. తన శక్తి ఉండేది ఉంటే తన చెయ్యితో అతన్ని ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబిలిసానిహ్. చెయ్యితో ఆపే శక్తి లేకుంటే, నోటితో ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబికల్బిహ్. ఆ శక్తి లేకుంటే హృదయంలో దాన్ని చెడుగా భావించి అక్కడి నుండి దూరం ఉండాలి. వ దాలిక అద్’అఫుల్ ఈమాన్. ఇదే విశ్వాసం యొక్క చివరి మెట్టు. ఇది బలహీన స్థితి విశ్వాసం యొక్క. ఈ పని కూడా కనీసం చేయలేదు అంటే ఇక విశ్వాసం లేనట్టే భావం.

సోదర మహాశయులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ తో భయపడుతున్నామా నిజంగా? ఈ విషయంలో మనం నిజంగా అల్లాహ్ తో భయపడుతున్నామా? ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నాము. ఈ రోజుల్లో మన సమాజంలో, మన వాట్సాప్ గ్రూపులలో, మన సోషల్ మీడియాలో, ఎన్ని చెడులైతే చూస్తూ ఉన్నామో, ఆ చెడును ఖండించే అటువంటి శక్తి, ఆ చెడును ఖండించే అంతటి జ్ఞానం లేకపోతే, దానిని చూసుకుంటూ ఉండడం… అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్ అస్తగ్ ఫిరుల్లాహ్.

ముస్లిం యువకులు, ముస్లిం యువతులు, ఏ ఫిలింలు చూస్తూ ఉంటారో, ఏ పాటలు వింటూ ఉంటారో, ఏ సీరియల్ లు చూస్తూ ఉంటారో, ఏ కార్టూన్లు చూస్తూ ఉంటారో, ఏ గేమ్ లు ఆడుతూ ఉంటారో, ఏ వాట్సాప్ గ్రూపులలో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలోని అప్లికేషన్లలో ఫాలో అవుతున్నారో, షేర్ చేస్తున్నారో, వీరందరూ కూడా గమనించాలి, అల్లాహ్ కు ఇష్టమైన వాటిలో వారు పాల్గొన్నారంటే, అల్ హందులిల్లాహ్. అల్లాహ్ కు ఇష్టం లేని వాటిలో పాల్గొన్నారంటే, అక్కడ ఖురాన్ పట్ల, హదీసుల పట్ల, ప్రవక్త పట్ల మరియు అల్లాహ్ యొక్క ఆయతుల పట్ల ఎగతాళి, పరిహాసం జరుగుతూ ఉన్నది. వారితో పాటు నవ్వులో నవ్వు మీరు కలిసి ఉన్నారు, లేదా కనీసం వారిని ఖండించకుండా మౌనం వహించి ఉన్నారు, వారి యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి యొక్క ఫాలోవర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి సంఖ్య పెద్దగా కనబడే విధంగా ఉన్నారు. ఆలోచించండి, ఈ పాపంలో మనం కలిసిపోతలేమా? ఖురాన్, హదీసులను మనం ఈనాటి కాలంలో ఎక్కువ ప్రచారం చేయాలి, మంచిని మనం ఎక్కువగా ప్రజల వరకు చేరవేయాలి. అలా కాకుండా ఏ చెడులోనైతే మనం పాల్గొంటామో, దాని వల్ల మనం ఎంత పాపానికి గురి అవుతామో ఎప్పుడైనా గమనించారా? అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705