అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్ (సర్వానికి ఆధారభూతుడు)” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్” యొక్క వివరణ
https://youtu.be/Y9EhNR3PhYw [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క రెండు గొప్ప నామాలైన “అల్-హయ్యు” (సజీవుడు) మరియు “అల్-ఖయ్యూమ్” (సర్వానికి ఆధారభూతుడు) యొక్క లోతైన అర్థాలను వివరిస్తారు. “అల్-హయ్యు” అంటే అల్లాహ్ శాశ్వతంగా, సంపూర్ణంగా జీవించి ఉన్నవాడని, ఆయన జీవంలో ఎలాంటి లోపం లేదని, మరియు సమస్త జీవరాశులకు ఆయనే జీవప్రదాత అని అర్థం. “అల్-ఖయ్యూమ్” అంటే అల్లాహ్ స్వీయ-ఆధారితమైనవాడని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని, అదే సమయంలో సృష్టి మొత్తాన్ని ఆయనే పోషిస్తూ, నిర్వహిస్తున్నాడని భావం. ఈ రెండు నామాలు కలిసి అల్లాహ్ యొక్క అన్ని ذاتي (దాతి) మరియు فعلي (ఫి’లీ) గుణాలను కలిగి ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు. ఈ నామాల ప్రాముఖ్యతను వివరించడానికి ఖురాన్ (సూరహ్ అల్-బఖరా, సూరహ్ ఆల్-ఇమ్రాన్, సూరహ్ తాహా) మరియు హదీసుల నుండి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కష్ట సమయాల్లో ఈ నామాలతో అల్లాహ్‌ను ప్రార్థించడం చాలా పుణ్యప్రదమని, ఆయన సహాయం మరియు క్షమాపణ పొందటానికి ఇది ఒక మార్గమని చెప్పబడింది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, కేవలం అల్లాహ్‌పైనే ఆధారపడటానికి ఈ నామాలను అర్థం చేసుకుని, వాటిపై ధ్యానం చేయాలని వక్త ప్రోత్సహించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క శుభ నామాలలో చాలా గొప్ప నామాలలో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.

మీకు తెలిసిన విషయమే, అల్-హయ్యు అల్-ఖయ్యూమ్, ఇవి రెండూ కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు.

అల్-హయ్యు అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి, ప్రతీ ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు.

అల్-హయ్యు అన్న పేరు అల్లాహ్ ది ఏదైతే ఉందో,

أَلْحَيَاةُ الْكَامِلَة
అల్-హయాతుల్ కామిలా
సంపూర్ణమైన జీవం

అందులో అల్లాహ్ యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తఆలా యొక్క గొప్ప గుణం, అల్లాహ్ సజీవుడు. స్వతహాగా, ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తఆలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు.

మన జీవితం, సృష్టి రాశుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వేలాది, లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉన్నా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమీ లేకుండా ఉన్నారు. ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది. కానీ అల్లాహు తఆలా ఆది, అంతము లేనివాడు. అల్లాహ్ మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాహ్ కే తెలుసు. అప్పటినుండి ఉన్నాడంటే, చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహ్ కు మరణం అన్నది, మరియు అలసట అన్నది, నిద్ర, కునుకు అన్నది ఏదీ కూడా లేదు. అదే విషయం సూరత్ అల్-బఖరా లోని ఆయతల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ ఇలా అంటాడు:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌ وَلَا نَوْمٌ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, అల్-హయ్యు (సజీవుడు), అల్-ఖయ్యూమ్ (సృష్టి యావత్తుకు ఆధారభూతుడు). ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.

ఇక్కడ అల్-హయ్యు యొక్క వివరణలో, “లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్” అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా.

ఏంటి ఆ దుఆ?

اللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبْتُ وَبِكَ خَاصَمْتُ اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ

అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వఅలైక తవక్కల్తు, వఇలైక అనబ్తు, వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ, అంతల్ హయ్యుల్లదీ లా యమూత్, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన్.

ఓ అల్లాహ్, నీకు నేను విధేయుడనయ్యాను, నిన్నే నేను విశ్వసించాను, నీపైనే నేను భారం మోపాను, నీ వైపునకే నేను మరలాను, నీ ఆధారంగానే నేను వాదిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీ ఘనత యొక్క శరణు కోరుతున్నాను, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయకుండా కాపాడు. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రాని వానివి. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారే.

అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా గానీ, వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ
అల్లాహుల్లదీ ఖలఖకుమ్
అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. (సూరతుర్-రూమ్)

సూరతుర్-రూమ్ లో ఇంతకుముందు మనం ఆయత్ విని ఉన్నాము. అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తఆలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు.

అయితే సోదర మహాశయులారా, అల్-హయ్యు, ఇందులో అల్లాహు తఆలా యొక్క దీనిని “ఇస్మే దాత్” అని కూడా అంటారు. అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప, స్వతహాగా ఉండే అటువంటి గుణాలన్నిటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో తెలియజేశారు:

الحَيُّ الْجَامِعُ لِصِفَاتِ الذَّاتِ
అల్-హయ్యు అల్-జామిఉ లి-సిఫాతిద్-దాత్
అల్-హయ్యు (అనే పేరు) అల్లాహ్ యొక్క స్వతస్సిద్ధమైన గుణాలన్నిటినీ సమీకరించేది.

అల్లాహ్ యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్-ఇల్మ్ (జ్ఞానం), వస్-సమ్’అ (వినడం), వల్-బసర్ (చూడడం), వల్-యద్ (చెయ్యి), ఇలాంటి అల్లాహ్ యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్, సహీహ్ హదీసులలో, వాటన్నిటినీ, అవన్నీ కూడా ఈ అల్-హయ్యు అన్న పేరులో వచ్చేస్తాయి.

ఇక అల్-ఖయ్యూమ్. దీని భావం ఏమిటంటే, అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే, ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ, వాటికి బాధ్యత తీసుకుని ఉన్నాడు. అందుకొరకే, సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్-ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు “సర్వ సృష్టికి ఆధారభూతుడు” అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ పేరు గురించి చెప్పారు,

القَيُّومُ الْجَامِعُ لِصِفَاتِ الأَفْعَالِ
అల్-ఖయ్యూమ్ అల్-జామిఉ లి-సిఫాతిల్-అఫ్ఆల్
అల్-ఖయ్యూమ్ (అనే పేరు) అల్లాహ్ యొక్క కార్యాలకు సంబంధించిన గుణాలన్నిటినీ సమీకరించేది.

ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్-ఖల్ఖ్ (సృష్టించడం), అర్-రిజ్ఖ్ (ఉపాధి కలిగించడం), వల్-ఇన్ఆమ్ (అనుగ్రహాలు నొసంగడం), అల్-ఇహ్యా (బ్రతికించడం), వల్-ఇమాత (చంపడం), ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు “రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్” (అల్-ఖయ్యూమ్ అనే పేరు వైపు మరలుతాయి). ఇవన్నీ కూడా అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చేస్తాయి.

అల్-హయ్యు వల్-ఖయ్యూమ్, ఇవి రెండూ ఖురాన్ లో కూడా వచ్చి ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్ లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీహ్ హదీస్ కూడా ఉంది. అబీ హాతిమ్ లో, తిర్మిదీ లో, ఇబ్నే మాజా లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారు “సహీహుల్ జామిఅ” లో ప్రస్తావించారు (హదీస్ నం. 979).

اِسْمُ اللَّهِ الأَعْظَمُ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى
ఇస్ముల్లాహిల్ అ’జమ్ అల్లదీ ఇదా దుఇయ బిహి అజాబ్, వ ఇదా సుఇల బిహి అ’తా
అల్లాహ్ యొక్క గొప్ప పేరు, దాని ద్వారా దుఆ చేస్తే ఆయన వెంటనే స్వీకరిస్తాడు మరియు దాని ద్వారా అర్ధించడం జరిగితే ఆయన ప్రసాదిస్తాడు.

ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ లోని సూరతుల్ బఖరాలో, సూరత్ ఆల్-ఇమ్రాన్ లో మరియు సూరతు తాహా లో ఉన్నాయి. ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరహ్ బఖరాలో గనుక మనం చూస్తే ఆయత్ నంబర్ 255, ఆయతుల్ కుర్సీలో:

ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ
అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

సూరత్ ఆల్-ఇమ్రాన్ యొక్క ఆరంభంలోనే:

الٓمٓ (١) ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ (٢)
అలిఫ్-లామ్-మీమ్. అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్.

ఇక సూరత్ త్వాహాలో గనుక మనం చూస్తే, ఆయత్ నంబర్ 111:

وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ
వ అనతిల్ వుజూహు లిల్-హయ్యిల్ ఖయ్యూమ్.

సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి.

ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతులలో గమనించారు కదా, సూరత్ బఖరాలోని 255, ఆల్-ఇమ్రాన్ లోని స్టార్టింగ్ ఆయత్లో, అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాహ్ ను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో, వారు ఒక్కసారి ఆలోచించాలి.

ఖురాన్ లో అల్లాహ్ ఏమంటున్నాడు?

وَتَوَكَّلْ عَلَى ٱلْحَىِّ ٱلَّذِى لَا يَمُوتُ
వ తవక్కల్ అలల్-హయ్యిల్లదీ లా యమూత్.
నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి, ఆధారపడి, అతని మీదనే భరోసా ఉంచు.

భరోసా ఉర్దూ పదం, కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇ’తిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడో, ఎన్నటికీ మరణించనివాడో. మరి ఈ రోజుల్లో మనలో ఎంతో మంది తాయెత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా?

ఏ అల్లాహ్ సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని ఆధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి, ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తమూ నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్ మనకు సృష్టికర్తగా, ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత్ నంబర్ 41 చదవండి.

إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا
ఇన్నల్లాహ యుమ్సికుస్-సమావాతి వల్-అర్ద అన్ తజూలా.
యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుండి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు.

ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నామా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా? సూరహ్ అంబియా లోని ఆయత్ చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి. కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మనం నివసించుటకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అవి గనుక తమ స్థానాల నుండి తొలగిపోతే, అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు.

ఈ ఆయత్ కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్-రూమ్ ఆయత్ నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం, మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా, బలంగా చేస్తుంది.

అల్లాహ్ అంటున్నాడు:

وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ
వ మిన్ ఆయాతిహీ అన్ తఖూమస్-సమాఉ వల్-అర్దు బి-అమ్రిహ్
మరియు ఆయన సూచనలలో ఒకటి, ఆకాశం మరియు భూమి ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి.

ఈ “తఖూమ” అన్న పదం ఏదైతే ఉందో, దీని నుండే “ఖయ్యూమ్” అన్న అల్లాహ్ యొక్క పేరు వస్తుంది. (కాఫ్, యా, మీమ్) భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతుర్-ర’అద్ ఆయత్ నంబర్ 33లో కూడా కనబడుతుంది.

أَفَمَنْ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ
అఫమన్ హువ ఖాఇమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్
ప్రతి ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షించేవాడు (అల్లాహ్).

అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నిలకొలిపి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. గమనించండి. అలాంటి అల్లాహ్ కు మనం ఎంత విధేయులుగా ఉండాలి.

ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేసి అల్లాహ్ పై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లాహ్ యొక్క దయతో మనకు ఏమీ కాదు, అల్లాహ్ మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు?

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్-హయ్యు లో అల్లాహ్ యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లాహ్ యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీసును చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనం గనుక వాస్తవంగా ఈ హదీసును అర్థం చేసుకుంటే, ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దుఆ చేస్తే, ఎలా ఈ దుఆ స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదీ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524.

كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَرَبَهُ أَمْرٌ قَالَ
కానన్-నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా కరబహు అమ్రున్ ఖాల్
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దుఆ చేసేవారు.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్.

(నోట్ చేసుకోండి మీరందరూ కూడా ఈ దుఆను. గుర్తుంచుకోండి. యాద్ చేసుకోండి. చిన్నదే. నాలుగే పదాలు ఉన్నాయి)

ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్“. నీ యొక్క కరుణ ఆధారంగా, తేరే రహ్మత్ కే వాస్తే సే, నీ కరుణ యొక్క వసీలాతో “అస్తగీస్”, నీ యొక్క సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఎక్కడా ఏ సహాయం దొరకనప్పుడు, అల్లాహ్ నే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు, ఏదైనా పని జరిగే మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో ముందు అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని? ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లాహ్, నఊజుబిల్లా అస్తగఫిరుల్లా, అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు, అల్లాహు తఆలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు, ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అల్లాహ్ చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకుని దుఆ చేస్తూ ఉంటావో, అంతే అల్లాహు తఆలా నీ యొక్క పనులను చక్కబరుస్తూ ఉంటాడు.

ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా కి నేర్పిన దుఆ ఏమిటి? అల్లాహు అక్బర్, గమనించండి. మరియు ఈ దుఆను కూడా మీరు గుర్తుంచుకోండి, ఉదయం సాయంకాలం దుఆలలో చదవండి.

يَا حَىُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلاَ تَكِلْنِي إِلَى نَفْسِي وَلاَ إِلَى أَحَدٍ مِنْ خَلْقِكَ طَرْفَةَ عَيْنٍ
యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్, అస్లిహ్ లీ ష’అనీ కుల్లహ్, వలా తకిల్నీ ఇలా నఫ్సీ, వలా ఇలా అహదిన్ మిన్ ఖల్ఖిక తర్ఫత ఐన్.

నా సర్వ వ్యవహారాలను అల్లాహ్, నీవు చక్కబరుచు. స్వయం నా వైపునకు గానీ, ఇంకా వేరే ఎవరి వైపునకు గానీ, రెప్ప కొట్టేంత సమయంలో కూడా, అంత కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు, నా వైపునకు అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబరుచు.

అంతేకాదు సోదర మహాశయులారా, ఈ అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ రెండు పేర్లతో మనం ఏదైనా దుఆ చేస్తే కూడా అల్లాహ్ స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకోవాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు తిర్మిదీ లో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే:

أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَىُّ الْقَيُّومُ وَأَتُوبُ إِلَيْهِ
అస్తగఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్-హయ్యుల్-ఖయ్యూమ్, వ అతూబు ఇలైహ్

అని చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా గానీ, ఇలాంటి దుఆ అర్థ భావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తఆలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు.

సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు, మరియు ఖురాన్ లో ఆయతు, ఖురాన్ లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మనం మన యొక్క అఖీదా బాగు చేసుకుందాము, ఇలాంటి గొప్ప అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ, దుఃఖ, కష్టం మరియు ఆరాం, స్వస్థత, అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ ను మాత్రమే మనం సజీవంగా, సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు, అలాంటి అల్లాహ్ “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్” అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల వివరణ ముగిస్తున్నాను.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాలు & లక్షణాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1