అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా?
https://youtu.be/d0gnnL2PGE8 [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ‘అల్లాహ్ తన దాసునికి చాలడా?’ అనే ఖురాన్ వాక్యం యొక్క లోతైన భావాన్ని వివరించబడింది. దాసులలో రెండు రకాలు ఉంటారని, సాధారణ దాసులు (సృష్టి మొత్తం) మరియు ప్రత్యేక దాసులు (అల్లాహ్ కు సంపూర్ణంగా విధేయత చూపి, ఆయన దాస్యాన్ని వాస్తవ రూపంలో నెరవేర్చేవారు) అని బోధించారు. అల్లాహ్ తన ప్రత్యేక దాసులకు అన్ని కష్టాలు, శత్రువుల కుతంత్రాల నుండి తప్పకుండా సరిపోతాడని, వారిని కాపాడుతాడని నొక్కిచెప్పారు. దీనికి ఉదాహరణగా, రాజు హింస నుండి అల్లాహ్ ను వేడుకుని రక్షణ పొందిన నవయువకుని గాథను (సూరతుల్ బురూజ్) వివరించారు. మనం కూడా అల్లాహ్ యొక్క నిజమైన దాసులుగా మారినప్పుడు, ఎలాంటి కష్టంలోనైనా ఆయనపై సంపూర్ణ నమ్మకంతో ధైర్యంగా ఉండాలని, ఎందుకంటే ఆయనే మనకు చాలినవాడని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్. ఇక్కడ దీని యొక్క భావం తన దాసుడు. కానీ ఇందులో మరో గొప్ప భావం దాగి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా, ఖురాన్ వ్యాఖ్యానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏంటి?

ఒక రకంగానైతే ఈ సర్వ సృష్టి కూడా అల్లాహ్ దాస్యంలో ఉంది. మనం మానవులందరమూ కూడా అల్లాహ్ యొక్క దాసులమే.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ
ఖుల్ యా ఇబాది యల్లజీన అస్రఫూ అలా అన్ఫుసిహిమ్
(ఓ ప్రవక్తా!) చెప్పు: “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై హద్దుమీరారో…”

ఇదే సూరతు జ్జుమర్ లో అల్లాహుతాలా, “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారో” అని అన్నాడు. మనమందరం ఈ రకంగా చూస్తే అల్లాహ్ యొక్క దాసులమే. కానీ అల్లాహ్ యొక్క దాసులం అన్న ఈ సర్వసామాన్య భావంలో విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మేవారు, నమ్మనివారు, ఆస్తికులు, నాస్తికులు అందరూ వచ్చేస్తున్నారు. కానీ

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్ – తన దాసుడు అన్న భావంలో మరో మాట ఏదైతే మర్మంగా ఉందో, దాచి ఉందో, దాగి ఉందో అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క సామాన్య దాసునిగా కాకుండా అతని యొక్క ప్రత్యేక దాసుడైపోతాడో, అంటే వాస్తవ రూపంలో అల్లాహ్ యొక్క దాస్యాన్ని మరియు తనకు దాసుడుగా ఉన్న ఈ ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడో అతడికి, అలాంటి వానికి అల్లాహ్ తప్పకుండా సరిపోతాడు. అల్లాహు అక్బర్. తప్పకుండా అల్లాహ్ సరిపోతాడు.

అందుకొరకే ఒక హదీసులో మనకు ఏం తెలుస్తుంది? ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఆ హదీసును తన తఫ్సీర్ లో, ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. ఫుదాలా బిన్ ఉబైద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా ఆయన విన్నారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్:

أَفْلَحَ مَنْ هُدِيَ إِلَى الإِسْلامِ، وَكَانَ عَيْشُهُ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ
అఫ్లహ మన్ హుదియ ఇలల్ ఇస్లాం, వకాన ఐషుహు కఫాఫన్, వ ఖన్న అహుల్లాహు బిమా ఆతాహ్
ఇస్లాం వైపు మార్గనిర్దేశం పొందినవాడు, అతని జీవనం సరిపడినంతగా ఉంది, మరియు అల్లాహ్ అతనికి ఇచ్చిన దానితోనే అతన్ని సంతృప్తిపరిచినవాడు సాఫల్యుడయ్యాడు.

ఎవరైతే ఇస్లాం యొక్క సన్మార్గాన్ని పొందారో, అతని యొక్క ఇహలోకపు జీవితం, అతని యొక్క ఆర్థిక వ్యవస్థ అతనికి సరిపడే విధంగా ఉంది, అల్లాహ్ ఎంత ఇచ్చాడో అంతలోనే సరిపుచ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఇస్లాంపై స్థిరంగా ఉన్నాడు. అఫ్లహ! అతడు సాఫల్యుడైపోయాడు.

గమనించండి. ఖురాన్ లో సూరతుల్ బఖరాలో మొదటి పారా, అలిఫ్ లామ్ మీమ్ అది ఎండ్ అయ్యేకి ముందు, ఒక నాలుగైదు ఆయతుల ముందు

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ
ఫస యక్ఫీక హుముల్లాహ్
అయితే వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) అల్లాహ్ నీకు సరిపోతాడు.

ఫస యక్ఫీక హుముల్లాహ్. అల్లాహ్ వారి నుండి నీ కొరకు సరిపోతాడు. అంటే, నీకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అల్లాహ్ నీ కొరకు చాలు. నిన్ను కాపాడడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ అవసరాలు తీరడానికి, నీవు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి.

ఆ నవయువకుని సంఘటన మీకు తెలుసు కదా? సూరతుల్ బురూజ్ లో వచ్చి ఉంది. ఏమిటి సంఘటన? చాలా పొడుగ్గా ఉంది. సహీ హదీసులో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అతడు ఒక మాంత్రికుని దగ్గర మంత్రజాలం కూడా నేర్చుకుంటాడు, మరోవైపు ధర్మ విద్య కూడా నేర్చుకుంటాడు. తర్వాత అతనికి తెలుస్తుంది, ఈ మంత్ర విద్య, జాల విద్య అల్లాహ్ కు ఇష్టం లేనిది. ఇందులో షిర్క్, కుఫ్ర్, బహుదైవారాధన, అవిశ్వాసం, సత్య తిరస్కారం ఇంకా ఎన్నో చెడులు ఉన్నాయి. ఈ ధర్మ బోధకుడు అల్లాహ్ గురించి ఏ విషయాలైతే చెబుతున్నాడో ఇవి సత్యమైనవి, నిజమైనవి. అల్లాహ్ ను నమ్ముకుంటాడు.

ఆ తర్వాత ఒక దారిలో ఏదో పెద్ద జంతువు ప్రజల రాకపోకలను కూడా అది ఆపేస్తుంది. దాన్ని అల్లాహ్ యొక్క పేరుతో ఒక రాయి దాని మీద విసిరితే అది చనిపోతుంది. ప్రజలు తమ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఆ సందర్భంలో ప్రజలకు ఈ నవయువకుని గురించి, ఇతడు ఎంత మహిమ గలవాడు, అంత పెద్ద జంతువును ఎవరు కొట్టగలుగుతారు, ఎవరు చంపగలుగుతారు, దాన్ని దారిలో నుండి ఎవరు తీయగలుగుతారు? ఈ అబ్బాయి తీశాడు అని అతని వద్దకు వచ్చి అతన్ని చాలా గొప్పగా చెప్పుకుంటే, అతడు చాలా స్పష్టంగా చెప్పేస్తాడు, “నేను చేసింది ఏమీ లేదు, ఆ అల్లాహ్ సర్వశక్తిమంతుడే చేశాడు. మీరు అల్లాహ్ ను నమ్ముకోండి.” ఇక మన సమాజంలో చూస్తాము కదా, ఎక్కడైనా ఏదైనా కొత్త బాబా పుట్టగొడుగుల్లా మొలకెత్తుకొని వచ్చాడు అంటే, ప్రజలు పిచ్చోళ్ళ మాదిరిగా వారి వెంట పడి, నా ఈ కష్టం దూరం కావాలి, నాకు సంతానం కావాలి, నా ఫలానా పని కావాలి అని ఎలా వస్తారో, అలా రావడం మొదలుపెట్టారు ఆ అబ్బాయి దగ్గరికి. అప్పుడు అతను తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ఇస్లాం యొక్క దావత్ ఇచ్చాడు. అల్లాహ్ ను నమ్ముకోండి అని చెప్పాడు. చివరికి ఈ విధంగా ఆ కాలంలో ఉన్న రాజు వద్ద ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, అతడు అంధుడైపోయాడు, అతనికి ఈ విషయం తెలిసింది. అతడూ వచ్చాడు. అతనికి కూడా ఈ అబ్బాయి అదే మాట చెప్పాడు, “నేను ఎవరికీ కన్ను ప్రసాదించను, చూపులు ఇవ్వను, ఎవరి ఏ కష్టాన్ని దూరం చేసేవాణ్ణి నేను కాదు. అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ను నమ్ముకోండి, అతనితో దుఆ చేయండి.” ఆ మినిస్టర్ కూడా అల్లాహ్ ను నమ్ముకుంటాడు, అల్లాహ్ తో దుఆ చేస్తాడు, అల్లాహ్ అతనికి కళ్ళు ప్రసాదిస్తాడు, చూపు ఇచ్చేస్తాడు. అక్కడి నుండి ఇక కష్టాలు, పరీక్షలు, ఎన్నో రకాల హింసా దౌర్జన్యాలు ఆ మినిస్టర్ పై మొదలవుతాయి, తర్వాత ఆ బోధకునిపై వస్తాయి, చివరికి ఈ అబ్బాయిపై కూడా వస్తాయి.

ఆ సందర్భంలో సంక్షిప్త మాట ఏమిటంటే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, గుట్ట మీదికి తీసుకెళ్ళిన తర్వాత మీరు కలిసి ఇతన్ని కింద పారేసేయండి, మీరు తిరిగి రండి. ఆ అతని యొక్క సైనికులు కొందరు ఈ అబ్బాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ గుట్ట మీద నిలబడతారు. ఇక ఇతన్ని విసిరేద్దాము, పారేద్దాము అని అనుకునే సందర్భంలో ఆ అబ్బాయి ఏం దుఆ చేస్తాడు?

اللَّهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ
అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్
ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) నాకు సరిపో.

ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వీరి కుతంత్రాల నుండి, వీరి దుశ్చేష్టల నుండి నీవే నాకు సరిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. యా అల్లాహ్, తూ మేరే లియే కాఫీ హో జా. ఓ అల్లాహ్, నీవు నాకు సరిపడిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఆ గుట్టలో ఒక భూకంపం మాదిరిగా ఏర్పడింది. అతన్ని తీసుకొచ్చిన సైనికులందరూ కూడా అక్కడే నాశనమైపోయారు, ధ్వంసమైపోయారు. ఈ అబ్బాయి క్షేమంగా తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి.

ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంతమంది సైనికులను ఇచ్చి, ఇతన్ని తీసుకెళ్ళండి, షిప్ లో, ఒక బోట్ లో కూర్చోబెట్టుకొని, పడవలో నడి సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని పారేయండి, మీరు తిరిగి వచ్చేసేయండి. తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళాక ఇతన్ని పారేయాలని అనుకున్నప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ దుఆ చేస్తాడు: అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్. అల్లాహుతాలా వారందరినీ అందులో ముంచేస్తాడు, ఇతన్ని కాపాడుతాడు.

సోదర మహాశయులారా! చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. మనకు కావలసింది ఏంటి? అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం ఉండాలో, మనం అల్లాహ్ యొక్క నిజమైన దాసులమవ్వాలి. నిజంగా, వాస్తవ రూపంలో అతని దాస్యత్వాన్ని పాటించాలి. మనం గమనించాలి, సత్య నిజమైన దాసుడు ఎప్పుడూ కూడా తన యజమానికి అవిధేయత చూపడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం అల్లాహ్ యొక్క దాసులమన్నటువంటి సత్య భావనలో ఎల్లప్పుడూ ఉంటామో, అల్లాహ్ ను మనం ఆరాధించడంలో, అల్లాహ్ ను నమ్మడంలో, మనపై ఏమైనా కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ యే మనల్ని కాపాడువాడు, రక్షించేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో మనం ధైర్యంగా ఉండాలి.

ధర్మపరమైన నిషేధాలు -11: అల్లాహ్ తప్ప మరెవ్వరిపై భారం మోపకు, నమ్మకం ఉంచకు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:04 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 11

11- అల్లాహ్ తప్ప మరెవ్వరిపై భారం మోపకు, నమ్మకం ఉంచకు.

నీ వ్యవహారాన్ని ఆయన తప్ప మరెవ్వరికీ అప్పగించకు. అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[أَلَيْسَ اللهُ بِكَافٍ عَبْدَهُ] {الزُّمر:36}

అల్లాహ్ తన దాసునికి సరిపోడా?. (సూరె జుమర్ 39: 36).

[وَعَلَى اللهِ فَتَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] {المائدة:23}

మీరు నిజంగానే విశ్వాసులైతే అల్లాహ్ పై నమ్మకం ఉంచండి [1]. (సూరె మాఇద 5: 23)..


[1]  ఆయనపై నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి మంచివాటిని పొందుటకు, చెడుల నుండి దూరముండుటకు యోగ్యమైన సాధనాలు ఉపయోగించడం కూడా అల్లాహ్ పై సంపూర్ణ నమ్మకంలో వస్తాయి.


పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు