అల్లాహ్ యందు భయభక్తి కలిగిన వారి జీవితం – జనాబ్ షేక్ షరీఫ్ [వీడియో]

అల్లాహ్ యందు భయభక్తి కలిగిన వారి జీవితం – జనాబ్ షేక్ షరీఫ్
https://youtu.be/W640_mfJ4iM [52 min]

షేఖ్ షరీఫ్, మదీనా గ్రాడ్యుయేట్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0AKZXyDn6KYNFu5ok4ZFtb

అల్లాహ్ కు ప్రియమైన దాసుల లక్షణాలు (Khutbah Juma in Telugu) [వీడియో]

అల్లాహ్ కు ప్రియమైన దాసుల లక్షణాలు (Khutbah Juma in Telugu)
https://youtu.be/V_Q8pcEvJ20 [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


తఖ్వా (అల్లాహ్ భయభీతి) ఘనత, లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

ఈ వీడియోలో మీరు తఖ్వా లాభాలు వింటారు, దాని అర్థ భావాలను కూడా తెలుసుకుంటారు.

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/t2Ar]
[ 29 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (రది అల్లాహు అన్హు) తఖ్వా గురించి హజ్రత్‌ ఉబై బిన్‌ కాబ్‌ (రది అల్లాహు అన్హు) గారికి ప్రశ్నించగా ఆయన (రది అల్లాహు అన్హు) ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ‘ఓ అమీరుల్‌ మోమినీన్‌! మీరు ఎప్పుడైనా ముళ్ళులతో నిండున్న దారిలో నడిచారా?’ అని ప్రశ్నిస్తే, ”ఔను, ఆ పరిస్థితి నాకు ఎదురయ్యింది” అని బదులిచ్చారు. ‘అటువంటి దారిలో మీరు ఎలా నడుస్తారు?’ అని మరోసారి ప్రశ్నించగా ”నా దుస్తులను ముళ్ళులతో గుచ్చుకోకుండా వాటిని కాపాడుకుంటూ నడుస్తాను” అని జవాబిచ్చారు ఉమర్‌ (రది అల్లాహు అన్హు). ‘తఖ్వా విషయం సైతం ఇంతే. ఎలాంటి దుష్టకార్యాలకు గురి కాకుండా, చెడు చేష్టల దరిదాపులకు పోకుండా, దైవ మార్గంలో తన జీవితాన్ని గడపటమే తఖ్వా’ అని హజ్రత్‌ ఉబై బిన్‌ కాబ్‌ (రది అల్లాహు అన్హు) పేర్కొన్నారు.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి
https://teluguislam.net/whatsapp/

ఇతరములు: [విశ్వాసము]

తఖ్వా – దైవభీతి (Taqwa) [Audio]

తఖ్వా అంటే దైవభీతి గురించి ఈ ఉపన్యాసంలో ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

Listen / Download Mp3 Here (Time 52:58)