షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? 
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/vsNjT5L40VE [6 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) చేస్తూ సత్కార్యాలు చేస్తే ప్రయోజనం ఉంటుందా అనే అంశాన్ని ఖురాన్ ఆధారంగా వివరించబడింది. షిర్క్‌కు పాల్పడితే ఎలాంటి మంచి పనులు చేసినా అవి నిష్ఫలమవుతాయని, ప్రయోజనం శూన్యమని స్పష్టంగా చెప్పబడింది. దీనికి నిదర్శనంగా సూరా జుమర్ మరియు సూరా అన్’ఆమ్‌లోని ఆయతులను ఉటంకించారు. ప్రవక్తల వంటి ఉన్నతమైన వ్యక్తులు సైతం షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అవుతాయని అల్లాహ్ హెచ్చరించినప్పుడు, సాధారణ మానవుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, షిర్క్‌కు దూరంగా ఉండి ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.

అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఎనిమిదవ ఎపిసోడ్లో, షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? ఓ పక్కన షిర్క్ చేస్తున్నాము, మరో పక్కన మంచి పనులు చేస్తున్నాము, సత్కార్యాలు ఆచరిస్తున్నాము. ప్రయోజనం ఉందా? అభిమాన సోదరులారా, సూటిగా సమాధానం ఏమిటంటే ప్రయోజనం లేదు, ఉండదు.

ఇది స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా జుమర్‌లో ఇలా తెలియజేశాడు.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్‌బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్)

నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను నీ వైపు మరియు నీకంటే పూర్వం వచ్చిన ప్రవక్తల వైపు సందేశాన్ని పంపించాను, వహీని పంపించాను. అది ఏమిటి? ఓ ప్రవక్తా, నువ్వు గనక షిర్క్ చేస్తే నువ్వు చేసిన సత్కార్యాలన్నీ, మంచి పనులన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతాయి. మరియు నువ్వు నష్టం చేసేవారిలో చేరుకుంటావ్, నష్టపోయేవారిలో చేరుకుంటావ్. అభిమాన సోదరులారా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ చేస్తారా? చేయరు. తర్వాత కూడా చేసే అవకాశం లేదు. కాకపోతే, మనం మనల్ని సంస్కరించుకోవాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క అభిమతం.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా అన్’ఆమ్ ఆయత్ 88లో ఇలా తెలియజేశాడు.

وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
(వలవ్ అష్రకూ లహబిత అన్హుమ్ మా కానూ యఅమలూన్)

ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.” (6:88)

ఒకవేళ వీరు సైతం షిర్క్ చేస్తే వీరు చేసిన సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ నాశనమైపోతాయి, వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో తెలియజేశాడు. వీరు సైతం అంటే ఎవరు? ఈ ఆయత్ కంటే ముందు ఆయత్, సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి ఈ 88 వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 18 ప్రవక్తల ప్రస్తావన చేసి, ఈ ప్రవక్తలు కూడా షిర్క్ చేస్తే వారి కర్మలు వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు.

ఒకసారి మనం పరిశీలిద్దాము. సూరా అన్’ఆమ్ ఆయత్ 83 నుంచి 88 వరకు :

ఈ 18 ప్రవక్తల ప్రస్తావన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంటున్నాడు, వారు సైతం షిర్క్ చేస్తే వారు చేసిన కర్మలన్నీ, సత్కార్యాలన్నీ, పుణ్యాలన్నీ వృధా అయిపోతానని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హెచ్చరిస్తున్నాడు. అభిమాన సోదరులారా, ప్రవక్తల స్థానం ఏమిటి? మన స్థానం ఏమిటి?

మనం ఓ వైపు షిర్క్ చేస్తూ మరోవైపు నమాజులు చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ, ఉమ్రాలు చేస్తూ, దానధర్మాలు చేస్తూ, దుఆలు చేస్తూ ఉన్నాము. మరోవైపు షిర్క్ చేస్తున్నాము, దర్గాలకి పోతున్నాము, మూఢనమ్మకాలకి గురవుతున్నాము, పెద్ద షిర్క్ చేస్తున్నాము, చిన్న షిర్క్ చేస్తున్నాము. మరి మన ఈ సత్కర్మలకి ప్రయోజనం ఉంటుందా? ఈ ఆయత్ ఆయతుల పరంగా ప్రయోజనం ఉండదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్ నుండి కాపాడుగాక, మరియు షిర్క్ లేకుండా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44444

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/