అన్నింటి కంటే పెద్ద పాపం ఏది ? – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అన్నింటి కంటే పెద్ద పాపం ఏది ?
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/oCuJTzug-YA [ 4 నిముషాలు]

ఈ ప్రసంగంలో, పాపం యొక్క నిర్వచనం, దాని రకాలు మరియు ఇస్లాంలో అన్నింటికంటే పెద్ద పాపం గురించి వివరించబడింది. ఒకరి మనస్సాక్షిని ఇబ్బంది పెట్టే మరియు ఇతరులకు తెలియకూడదని కోరుకునే చర్యే పాపం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. పాపాలు పెద్దవి (కబాయిర్) మరియు చిన్నవి (సఘాయిర్) అని రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. హత్య, వ్యభిచారం, దొంగతనం వంటివి పెద్ద పాపాల జాబితాలోకి వస్తాయి. అయితే, ఈ అన్నింటికంటే ఘోరమైన, అల్లాహ్ ఎప్పటికీ క్షమించని పాపం ‘షిర్క్’ – అంటే అల్లాహ్ కు భాగస్వాములను కల్పించడం లేదా బహుదైవారాధన చేయడం. పవిత్ర ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా, సృష్టికర్త అయిన అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించడమే అత్యంత ఘోరమైన పాపమని స్పష్టం చేయబడింది.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఆరవ ఎపిసోడ్ లో, మనం అన్నింటికంటే పెద్ద పాపం ఏది అనేది తెలుసుకుందాం.

అసలు పాపం దేనిని అంటారు? ఓ ఉల్లేఖనంలో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి ఇలా తెలియజేశారు.

الْإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ
(అల్ ఇస్ము మా హాక ఫీ సద్రిక్, వ కరిహ్త అన్ యత్తలిఅ అలైహిన్నాస్)
పాపమంటే నీ హృదయంలో సంకోచం, సందేహం కలిగించేది మరియు ఇతరులకు తెలియటాన్ని నీవు ఇష్టపడనిది.

ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఏ పని పట్ల నీ మనసులో శంక కలుగుతుందో, మరీ దేని గురించి ప్రజలు తెలుసుకోవటం నీకు ఇష్టం లేదో, దీన్ని దురాచరణ అంటారు, పాపం అంటారు.

ఇక పాపం రెండు రకాలు. అల్ కబాయిర్ (పెద్దవి) వ స్సఘాయిర్ (చిన్నవి). పెద్ద పాపాలలో మనిషి చాలా రకాలుగా పాపాలు చేస్తాడు. అన్యాయం, మోసం, వ్యభిచారం, దగా, ద్రోహం, హత్య, దొంగతనం, సారాయి, జూదం ఇలాంటి ఎన్నో రకరకాల పాపాలు చేస్తాడు.

కాకపోతే, ఈ పాపాలలో అన్నింటికంటే, అతి పెద్ద పాపం, అది బహుదైవారాధన. పెద్ద షిర్క్ చేయటం. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం.

ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతున్ నిసాలో తెలియజేశారు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
(ఇన్నల్లాహ లా యఘ్ ఫిరు అన్ యుష్రక బిహీ వ యఘ్ ఫిరు మా దూన జాలిక లిమన్ యషా)

“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (4:48)

నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించనిది కేవలం అది షిర్క్, బహుదైవారాధన. బహుదైవారాధనను, షిర్కును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించడు. అది తప్ప ఏ పాపాన్నయినా తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు.

అభిమాన సోదరులారా, ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దర్యాప్తు చేయడం జరిగింది.

أَىُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللَّهِ؟
(అయ్యు జ్జంబి అ’అజము ఇందల్లాహ్?)
ఓ ప్రవక్తా, ఏ పాపం అల్లాహ్ వద్ద అన్నింటికంటే పెద్దది?

అతి పెద్ద పాపం అల్లాహ్ దగ్గర ఏది? ఈ ప్రశ్నకి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు.

أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهْوَ خَلَقَكَ
(అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక)
నిన్ను సృష్టించిన అల్లాహ్ కు వేరొకరిని సాటి కల్పించటం.

అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం, వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు. అంటే షిర్క్ చేయటం అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఘోరమైన పాపం, పెద్ద పాపం అని ఈ హదీస్ మరియు ఆయత్ ద్వారా మనకు అర్థమయింది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి రక్షించు గాక, కాపాడు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.