మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
బహిస్టు ప్రకరణం [PDF]
1వ అధ్యాయం – బహిష్టు స్త్రీతో లోఉడుపుపై శారీరక కలయిక
مباشرة الحائض فوق الإِزار
168 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَتْ إِحْدَانَا إِذَا كَانَتْ حَائِضًا، فَأَرادَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ يُبَاشِرَهَا، أَمَرَهَا أَنْ تَتَّزِرَ فِي فَوْرِ حَيْضَتِهَا، ثُمَّ يُبَاشِرُهَا قَالَتْ: وَأَيُّكُمْ يَمْلِك إِرْبَهُ كَمَا كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَمْلِكُ إِرْبَهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض
168. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ అయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- “మాలో ఎవరైనా బహిష్టు అయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె దేహానికి దేహం ఆనించ దలచుకుంటే, ఆమెను (లంగోటి లాంటి) లోఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు. ఆ తరువాత ఆమె దేహానికి దేహం ఆనించేవారు… లైంగికవాంఛపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కున్న ఇంతటి నిగ్రహశక్తి మీలో ఎవరికైనా ఉందా?” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 5వ అధ్యాయం – ముబాషిరతిల్ హాయిజ్]
169 – حديث مَيْمُونَةَ، قَالَتْ: كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يُبَاشِرَ امْرَأَةً مِنْ نِسَائِهِ، أَمَرَهَا فَاتَّزَرَتْ وَهِيَ حَائِضٌ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 5 باب مباشرة الحائض
169. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన భార్యలలో ఎవరితోనైనా దేహానికి దేహం ఆనించ దలచుకున్నప్పుడు, * ఆమె బహిష్టు అయి ఉంటే, (లంగోటిలాంటి) లో ఉడుపు కట్టుకోమని ఆమెను ఆదేశించేవారు.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం, – హైజ్, 5వ అధ్యాయం]
* ఇక్కడ మూలభాషలో ‘ముబాషిరత్‘ అనే పదం వచ్చింది. అంటే శరీరంతో శరీరం కలపడం అని అర్థం. అంతేగాని ఇక్కడ సందర్భాన్ని బట్టి లైంగిక సంపర్కం అనే భావం రాదు. ఎందుకంటే దివ్యఖుర్ఆన్ఆ “రుతుస్రావం గురించి ఆజ్ఞ ఏమిటని అడుగుతున్నారు వారు, ఆదొక అపరిశుద్ధావస్థ అనీ, ఆ స్థితిలో భార్యలకు దూరంగా ఉండాలని, వారు (స్నానం చేసి) పరిశుభ్రం కానంత వరకు వారి దగ్గరకు వెళ్ళకూడదని చెప్పెయ్యి” అని ఉంది. (2:222)
2వ అధ్యాయం – ఒకే దుప్పటిలో బహిష్టు స్త్రీతో కలసి పడుకోవడం
الاضطجاع مع الحائض في لحاف واحد
170 – حديث أُمِّ سَلَمَةَ، قَالَتْ: بَيْنَا أَنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مُضْطَجِعَةٌ فِي خَمِيلَةٍ، حِضْتُ، فَانْسَلَلْتُ، فَأَخَذْتُ ثِيَابَ حَيْضَتِي؛ فَقَالَ: أَنُفِسْتِ قُلْتُ: نَعَمْ فَدَعَانِي فَاضْطَجَعْتُ مَعَهُ فِي الْخَمِيلَةِ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 22 باب من اتخذ ثياب الحيض سوى ثياب الطهر
170. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మెసల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒకసారి, నేను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకే దుప్పటి కప్పుకొని పడుకున్నాము. కాస్సేపటికి నాకు హఠాత్తుగా రుతుస్రావం మొదలయింది. వెంటనే నేను మెల్లగా దుప్పటి నుంచి బయటికి వచ్చి బహిష్టు బట్ట కట్టుకున్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇది గమనించి “ఏమిటీ, నువ్వు బహిష్టు అయ్యావా?” అని అడిగారు. నేను ఔనన్నాను. అయినప్పటికీ ఆయన నన్ను పడక మీదికి పిలుచుకున్నారు. నేను వెళ్ళి ఆయన దగ్గర అదే దుప్పటి క్రింద పడుకున్నాను.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 22వ అధ్యాయం]
171 – حديث أُمِّ سَلَمَةَ، قَالَتْ: وَكُنْتُ أَغْتَسِلُ أَنَا وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ مِنَ الْجَنَابَةِ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 21 باب النوم مع الحائض وهي في ثيابها
171. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాస వ్రత స్థితిలో నన్ను ముద్దాడేవారు. పోతే నేను, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకే పాత్రలోని నీళ్ళతో (లైంగిక అశుద్ధత తొలగింపు) స్నానం చేసేవాళ్ళము.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 21వ అధ్యాయం]
3వ అధ్యాయం – బహిష్టు స్త్రీ తన భర్తకు తలంటవచ్చు, తల దువ్వవచ్చు
جواز غسل الحائض رأس روجها وترجيله
172 – حديث عَائِشَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: وَإِنْ كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَيُدْخِلُ عَلَىَّ رَأْسَهُ وَهُوَ فِي الْمَسْجِدِ فأُرَجِّلُهُ، وَكَانَ لاَ يَدْخُلُ الْبيْتَ إِلاَّ لِحَاجَةٍ إِذَا كَانَ مُعْتَكِفًا
__________
أخرجه البخاري في: 33 كتاب الاعتكاف: 3 باب لا يدخل البيت إلا لحاجة
172. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్లో ఉండి (ఏతెకాఫ్ (తపోనిష్ఠ) స్థితిలో) తన శిరస్సును నా వైపుకు రానిచ్చేవారు. అప్పుడు నేను ఆయనకు తల దువ్వేదాన్ని. ఆయన ఏతెకాఫ్ పాటిస్తున్న రోజుల్లో అనవసరంగా (మస్జిద్ వదిలి) ఇంటికొచ్చేవారు కాదు.
[సహీహ్ బుఖారీ : 33వ ప్రకరణం – ఏతెకాఫ్, 3వ అధ్యాయం]
173 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُبَاشِرُنِي وَأَنَا حَائِضٌ، وَكَانَ يُخْرِجُ رَأْسَهُ مِنَ الْمَسْجِدِ وَهُوَ مُعْتَكِفٌ فَأَغْسِلُهُ وَأَنَا حَائِضٌ
__________
أخرجه البخاري في: 33 كتاب الاعتكاف: 4 باب غسل المعتكف
173. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- నేను బహిష్టు అయిన రోజుల్లో (కూడా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను దేహానికి దేహం ఆనిచ్చి (*) స్పర్శించేవారు. అలాగే ఏతెకాఫ్ (తపోనిష్ఠ)లో (కూడా) ఆయన మస్జిద్లో ఉండి తమ శిరస్సును నా వైపుకు పెడితే నేను బహిష్టు అయి ఉండి కూడా ఆయనకు తలంటేదాన్ని.
[సహీహ్ బుఖారీ : 33వ ప్రకరణం- ఏతెకాఫ్, 4వ అధ్యాయం]
(*) ఈ హదీసులో కూడా ‘ముబాషిరత్’ అనే పదమే వాడబడింది. అంటే దేహాన్ని దేహంతో కలపడం, ఆనించడం, తాకించడం అని శాబ్దిక అర్థం, సంభోగం అనే అర్థం రాదు.
174 – حديث عَائِشَةَ، حَدَّثَتْ أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَتَّكِى فِي حَجْرِي وَأَنَا حَائِضٌ ثُمَّ يَقْرأُ الْقُرْآنَ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 3 باب قراءة الرجل في حجر امرأته وهي حائض
174. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- నేను బహిష్టు అయిన రోజుల్లో (కూడా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా ఒడిని తలగడగా ఉపయోగించుకుని దివ్యఖుర్ఆన్ పఠించేవారు.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 3వ అధ్యాయం]
4వ అధ్యాయం – శుక్ర నష్టం శుద్ధి (المذي)
175 – حديثُ عَلِيٍّ، قَالَ: كُنْتُ رَجُلاً مَذَّاءً فَاسْتَحْيَيْتُ أَنْ أَسْأَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَمَرْتُ الْمِقْدَادَ ابْنَ الأَسْوَدِ فَسَأَلَهُ؛ فَقَالَ: فِيهِ الْوُضُوءُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 34 باب من لم ير الوضوء إلا من المخرجين
175. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కథనం:- నాకెక్కువగా శుక్రనష్టం (*) జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యను గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగడానికి నేనెంతో సిగ్గుపడేవాడ్ని. అందువల్ల దీన్ని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడిగి పరిష్కారం తెలుసుకోవలసిందిగా ఓ రోజు నేను హజ్రత్ మిఖ్దాద్ బిన్ అస్వద్ (రదియల్లాహు అన్హు)తో అన్నాను. ఆయన వెళ్ళొచ్చి “శుక్రనష్టం జరిగితే (వెంటనే) వుజూ చేసుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నార”ని తెలియజేశారు. (సహీహ్ బుఖారీ)
(*) సాధారణంగా లైంగికాలోచన కలిగినపుడు స్త్రీ పురుషుల మర్మావయవాల నుండి పల్చటి జిగట ద్రవం వెలువడుతుంది. దీన్నే శుక్రనష్టం అంటారు. దీనివల్ల లైంగికోద్రేకం చల్లారదు. పూర్తిగా వీర్యస్ఖలనం జరిగినపుడే ఆ ఉద్రేకం చల్లారుతుంది.
6వ అధ్యాయం – లైంగిక అశుద్ధావస్థలో వుజూ చేసి పడుకోవాలి
جواز نوم الجنب واستحباب الوضوء له
176 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا أَرَادَ أَنْ يَنَامَ وَهُوَ جُنُبٌ غَسَلَ فَرْجَهُ وَتَوَضَّأَ لِلصَّلاَةِ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 27 باب الجنب يتوضأ ثم ينام
176. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లైంగిక అశుద్ధావస్థలో పడుకోదలచుకుంటే, తమ మర్మాంగాన్ని కడుగుకొని, నమాజు కోసం చేసే విధంగా వుజూ చేసేవారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 27వ అధ్యాయం – అలుంబి యత వజ్జావు సుమ్మయనామ్]
177 – حديث ابْنِ عُمَرَ، أَنَّ عُمَرَ بْنَ الْخَطَّابِ سَأَلَ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَيَرْقُدُ أَحَدُنَا وَهُوَ جُنُبٌ قَالَ: نَعَمْ، إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ فَلْيَرْقُدْ وَهُوَ جُنُبٌ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 26 باب نوم الجنب
177. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఓ సారి “దైవప్రవక్తా! లైంగిక అశుద్ధావస్థలో అలాగే పడుకోవచ్చా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆ…. లైంగిక అశుద్ధావస్థలో వుజూ చేసి పడుకోవచ్చు” అని సమాధానమిచ్చారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 26వ అధ్యాయం]
178 – حديث عَبْدِ اللهِ بْنِ عُمَرَ، قَالَ: ذَكَرَ عُمَرُ ابْنُ الْخطَّابِ لِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ تُصِيبُهُ الْجَنَابَةُ مِنَ اللَّيْلِ، فَقَالَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: تَوَضَّأْ وَاغْسِلْ ذَكَرَكَ ثُمَّ نَمْ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 27 باب الجنب يتوضأ ثم ينام
178. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఓసారి “దైవప్రవక్తా! రాత్రివేళ నాకు వీర్యస్ఖలనం జరుగుతుంది. (ఆ సమయంలో నేను స్నానం చేయలేను. ఏం చెయ్యాలి)?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “వుజూ చెయ్యండి.(*) మర్మావయం కడుక్కొని పడుకోండి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 27వ అధ్యాయం]
(*) అంటే అప్పటికప్పుడే వుజూ చేయాలని అర్థం కాదు. నమాజు కోసం లేచినప్పుడు వుజూ చేసుకోవచ్చు అని భావం.
179 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَطُوفُ عَلَى نِسائِهِ فِي اللَّيْلَةِ الْوَاحِدَةِ وَلَهُ يَوْمَئِذٍ تِسْعُ نِسْوَةٍ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 34 باب الجنب يخرج ويمشي في السوق وغيره
179. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకే రాత్రి తన భార్యలందరి దగ్గరికి పోయి వచ్చేవారు. ఆ రోజుల్లో ఆయనకు తొమ్మిది మంది భార్యలున్నారు.
[సహీహ్ బుఖారీ – 5వ ప్రకరణం – గుసుల్, 24వ అధ్యాయం]
7వ అధ్యాయం – స్త్రీకి స్ఖలనమయితే ఆమె కూడా స్నానం చేయాలి
وجوب الغسل على المرأة بخروج المني منها
180 – حديث أُمِّ سَلَمَةَ؛ قَالَتْ: جَاءَتْ أُمُّ سُلَيْمٍ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ؛ فَقَالَتْ: يَا رَسُولَ الله إنَّ اللهَ لاَ يَسْتَحْيِي مِنَ الحَقِّ، فَهَلْ عَلَى الْمَرْأَةِ مِنْ غسْلٍ إِذَا احْتَلَمَتْ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا رَأَتِ الْمَاءَ، فَغَطَّتْ أُمُّ سَلَمَةَ، تَعْنِي، وَجْهَهَا، وَقَالَتْ: يَا رَسولَ اللهِ وَتَحْتَلِمُ الْمَرْأَةُ قَالَ: نَعَمْ، تَرِبَتْ يَمِينُكِ، فَبِمَ يُشْبِهُهَا وَلَدُهَا
__________
أخرجه البخاري في: 3 كتاب العلم: 50 باب الحياء في العلم
180. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒకసారి ఉమ్మె సలీం (రదియల్లాహు అన్హా) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి నచ్చి “దైవప్రవక్తా! సత్యం తెలపడంలో అల్లాహ్ సిగ్గుపడడు. స్త్రీలకు స్వప్న స్ఖలనమయితే వారు కూడా విధిగా గుసుల్ (స్నానం) చేయాలా?” అని అడిగింది. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “చెయ్యాలి, స్వప్న స్ఖలనంలో వీర్యం కన్పిస్తే వాళ్ళు కూడా విధిగా గుసుల్ చేయవలసిందే” అని సమాధానమిచ్చారు.
(విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని సిగ్గుతో ముఖం దాచుకుంటూ “దైవప్రవక్తా! స్త్రీలక్కూడా స్వప్న స్ఖలనమవుతుందా?” అని అడిగారు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “పిచ్చిదానా! స్త్రీకి కూడా వీర్యస్ఖలనమవుతుంది. లేకపోతే పిల్లవాడికి తల్లి పోలికలు ఎలా వస్తాయనుకున్నావు?” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 3వ ప్రకరణం – అల్ ఇల్మ్, 50వ అధ్యాయం]
9వ అధ్యాయం – లైంగిక అశుద్ధావస్థలో స్నానం చేసే పద్ధతి
صفة غسل الجنابة
181 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا اغْتَسَلَ مِنَ الجَنَابَةِ بَدَأَ فَغَسَلَ يَدَيْهِ، ثُمَّ يَتَوَضَّأُ كمَا يَتَوَضَّأُ لِلصَّلاَةِ، ثُمَّ يُدْخِلُ أَصَابِعَهُ فِي الْمَاءِ فَيخَلِّلُ بهَا أُصُولَ شَعَرِه، ثُمَّ يَصُبُّ عَلَى رَأْسِهِ ثَلاَثَ غُرَفٍ بِيَدَيْهِ، ثُمَّ يُفِيضُ الْمَاءَ عَلَى جِلْدِهِ كُلِّهِ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 1 باب الوضوء قبل الغسل
181. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) లైంగిక అశుద్ధతను తొలగించుకోవడానికి స్నానం చేయసిద్ధమయినప్పుడు ముందుగా రెండు చేతులు కడిగి శుభ్రపరుచుకుంటారు. తరువాత నమాజు కోసం చేసే విధంగా వుజూ చేస్తారు. ఆ తరువాత చేతి వ్రేళ్ళను నీటిలో ముంచి తీసి దువ్వెనలా తలలోకి జొనిపించి తిప్పుకునేవారు. ఆ తరువాత రెండు చేతుల్లో నీళ్ళు తీసుకొని మూడుసార్లు తలమీద పోసుకుంటారు. ఆపై పూర్తి శరీరంపై నీళ్ళు పోసుకుంటారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 1వ అధ్యాయం]
182 – حديث مَيْمُونَةَ، قَالَتْ: صَبَبْتُ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ غُسْلاً، فَأَفْرَغَ بِيَمِينِهِ عَلَى يَسَارِهِ، فَغَسَلَهُمَا ثُمَّ غَسَلَ فَرْجَهُ، ثُمَّ قَالَ بِيَدِهِ الأَرْضَ، فَمَسَحَهَا بِالتُّرَابِ، ثُمَّ غَسَلَهَا، ثُمَّ تَمَضْمَضَ وَاسْتَنْشَقَ، ثُمَّ غَسَلَ وَجْهَهُ وَأَفَاضَ عَلَى رَأْسِهِ، ثُمَّ تَنَحَّى فَغَسَلَ قَدَمَيْهِ، ثُمَّ أُتِيَ بِمِنْدِيلٍ، فَلَمْ يَنْفُضْ بِهَا
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 7 باب المضمضة والاستنشاق في الجنابة
182. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్నానం చేయడానికి (ఓసారి) నేను నీళ్ళు తోడిపెట్టాను. ఆయన (మొట్టమొదట) కుడిచేత్తో ఎడమ చేతిపై నీళ్ళు పోసుకొని, రెండు చేతులు కడుక్కున్నారు. తరువాత మర్మాంగాన్ని కడుక్కున్నారు. ఆ తరువాత ఎడమ చేతిని మట్టితో రుద్ది (నీళ్ళతో) కడుక్కున్నారు. ఆ తరువాత నోరు పుక్కిలించారు. దాని తరువాత ముక్కులోకి నీరు ఎక్కించి శుభ్రపరుచుకున్నారు. దాని తరువాత ముఖం కడుక్కున్నారు. ఆ తరువాత తలపై నీళ్ళు పోసుకున్నారు. ఆ తరువాత ఆ చోటు నుంచి పక్కకు జరిగి రెండు కాళ్ళు కడుక్కున్నారు. ఆ తరువాత తువాలు తెచ్చిస్తే దాంతో ఆయన (శరీరం) తుడుచుకోలేదు.
[సహీహ్ బుఖారీ – 5వ ప్రకరణం – గుసుల్, 7వ అధ్యాయం]
183 – حديث عَائِشَةَ، قَالَتْ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا اغْتَسَلَ مِنَ الْجَنَابَةِ دَعَا بِشَيْءٍ نَحْوَ الْحِلاَبِ فَأَخَذَ بِكَفِّهِ فَبَدَأَ بِشِقِّ رَأْسِهِ الأَيْمَنِ ثُمَّ الأَيْسَرِ، فَقَالَ بِهِمَا عَلَى رَأْسِهِ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 6 باب من بدأ بالحلاب أو الطيب عند الغسل
183. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లైంగిక అశుద్ధావస్థలో స్నానం చేయడానికి సిద్ధమైనప్పుడు ఓ పాత్రలో (*) నీళ్ళు తెప్పించుకుంటారు. అందులో నుంచి చేత్తో నీళ్ళు తీసుకొని మొదట తల కుడి భాగం, తరువాత ఎడమ భాగం కడుక్కుంటారు. ఆ తరువాత రెండు చేతులలో నీళ్ళు తీసుకొని తలమీద పోసుకుంటారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 6వ అధ్యాయం]
(*) హదీసులో అసలు పదం ‘హిలాబ్’ అని ఉంది. హిలాబ్ అంటే జానెడు పొడవు జానెడు వెడల్పు గల ఒక విధమైన పాత్ర. ఇందులో సుమారు నాలుగు సేర్ల నీళ్ళు పడ్తాయి.
10వ అధ్యాయం – లైంగిక పారిశుధ్య స్నానం కోసం నీటి పరిమాణం
القدر المستحب من الماء في غسل الجنابة
184 – حديث عَائِشَة، قَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ، مِنْ قَدَحٍ يُقالُ لَهُ الْفَرَق
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 2 باب غسل الرجل مع امرأته
184. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఫర్ఖ్’ (*) అని ఒకే బాన (గంగాలం)లోని నీటితో స్నానం చేసేవాళ్ళము. [సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్; 2వ అధ్యాయం]
(*) ‘ఫర్ఖ్‘ అంటే మదీనాలో వాడే ఒక విధమైన బాన. ఇందులో దాదాపు 8 సేర్ల నీళ్ళు పడ్డాయి.
185 – حديث عَائِشَة سَأَلَهَا أَخُوهَا عَنْ غُسْلِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَدَعَتْ بِإِنَاءٍ نَحْوٍ مِنْ صَاعٍ، فَاغْتَسَلَتْ وَأَفَاضَتْ عَلَى رَأْسِهَا؛ وَبَيْنَنَا وَبَيْنَهَا حِجَابٌ (قَوْلَ أَبِي سَلَمَةَ)
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 3 باب الغسل بالصاع ونحوه
185. హజ్రత్ అబూ సల్మా బిన్ అబ్దుర్రహ్మాన్ (రహిమహుల్లాహ్) కథనం:- హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా)ని ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ బిన్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్నానం గురించి అడిగినప్పుడు ఆమె ‘సా’ (*) (4 సేర్ల)కు సమానమైన పరిమాణం గల ఒక బాన నిండా నీళ్ళు తెప్పించారు. ఆ నీటితో ఆమె స్నానం చేశారు; తలపై నీళ్ళు పోసుకున్నారు. అప్పుడు ఆమెకు, మాకు మధ్య ఒక తెర కట్టారు.
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం, గుసుల్, 2వ అధ్యాయం]
(*) ఒక ‘సా’ అంటే దాదాపు నాలుగు సేర్లకు సమానమైన పరిమాణం. అయితే ధర్మవేత్తల ఏకాభిప్రాయం ప్రకారం స్నానం (గుసుల్) చేయడానికి అవసరమైనంత నీరు వాడవచ్చు. ఇంత నీరే వాడాలన్న నిబంధన ఏదీ లేదు.
186 – حديث أَنَسٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَغْسِلُ، أَوْ كَانَ يَغْتَسِلُ بِالصَّاعِ إِلَى خَمْسَةِ أَمْدَادٍ، وَيَتَوَضَّأُ بِالْمُدِّ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 47 باب الوضوء بالمد
186. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) స్నానం చేయడానికి ఒక ‘సా’ (4 సేర్ల) నుండి ఐదు ‘ముద్’ (సేరు)ల వరకు నీటిని వాడేవారు. ఒక ‘ముద్’ (సేరు) (*) నీటితో వుజూ చేసేవారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 47వ అధ్యాయం]
(*) ‘సా’, ‘ముద్’ – ఈ రెండూ ఆనాటి ప్రసిద్ధ కొలమానాలు. ‘సా’ పరిమాణం అయిదునుండి ఎనిమిది పౌండ్ల వరకు ఉంటుంది. ‘ముద్’ పరిమాణం దాదాపు ఒక సేరు ఉంటుంది. ఏమయినప్పటికీ వుజూ, గుసుళ్ళ కోసం ఒక నిర్ణీత పరిమాణం మేరకే నీటిని వాడాలన్న నిబంధన ఏదీ లేదు. అవసరాన్ని బట్టి ఎక్కువ కూడా వాడవచ్చు. కాకపోతే నీటిని అవసరానికి మించి వాడుతూ వృధా చేయకూడదు.
11వ అధ్యాయం – దేహం పై ఇతర అవయవాలపై మూడేసి సార్లు నీళ్ళు పోసుకోవడం
استحباب إِفاضة الماء على الرأس وغيره ثلاثا
187 – حديث جُبَيْرِ بْنِ مُطْعِمٍ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَمَّا أَنَا فَأُفِيضُ عَلَى رَأْسِي ثَلاَثًا، وَأَشَارَ بِيَدَيْهِ، كِلْتَيْهِمَا
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 4 باب من أفاض على رأسه ثلاثًا
187. హజ్రత్ జుబైర్ బిన్ ముతయిమ్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “నేను తలమీద ఇలా మూడుసార్లు నీళ్ళు పోసుకుంటాను” అంటూ తన చేతుల వైపు సైగచేసి చూపారు.
[సహీహ్ బుఖారీ: 5వ ప్రకరణం – గుసుల్, 4వ అధ్యాయం]
188 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ أَبُو جَعْفَرٍ: إِنَّهُ كَانَ عِنْدَهُ هُوَ وَأَبُوهُ، وَعِنْدَهُ قَوْمٌ، فَسَأَلُوهُ عَنِ الْغُسْلِ، فَقَالَ: يَكْفِيكَ صَاعٌ، فَقَالَ رَجُلٌ: مَا يَكْفِينِي؛ فَقَالَ جَابِرٌ: كَانَ يَكْفِي مَنْ هُوَ أَوْفَى مِنْكَ شَعَرًا، وَخَيْرٌ مِنْكَ ثُمَّ أَمَّنَا فِي ثَوْبٍ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 3 باب الغسل بالصاع ونحوه
188. హజ్రత్ అబూ జాఫర్ (రహిమహుల్లాహ్) కథనం:-
నేను మా నాన్నగారు (ఇమామ్ జైనుల్ ఆబిదీన్) కలసి హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) గారి దగ్గర కూర్చున్నాము. ఆ సమయంలో ఆయన దగ్గర మరికొందరు వ్యక్తులు కూడా కూర్చొని ఉన్నారు. వాళ్ళు జాబిర్ (రదియల్లాహు అన్హు) గారిని స్నానం గురించి ప్రశ్నించారు. అప్పుడు జాబిర్ (రదియల్లాహు అన్హు) గారు “ఒక ‘సా’ (నాలుగు సేర్ల) నీరు సరిపోతుంది” అన్నారు. వెంటనే వారిలో ఒక వ్యక్తి “నాకు ఒక ‘సా’ (నాలుగుసేర్ల) నీరు సరిపోదు” అన్నాడు. దానికి జాబిర్ (రదియల్లాహు అన్హు) గారు “నీ కంటే (ప్రతి విషయంలో అగ్రగణ్యుడు, నీ శిరోజాల కంటే ఎక్కువ శిరోజాలు కలిగిన మహనీయునికి ఒక ‘సా’ (నాలుగుసేర్ల) నీరే సరిపోయేది (నీకు సరిపోదా?)” అని అన్నారు. ఆ తరువాత ఆయన మాకు నాయకత్వం వహించి నమాజు చేశారు. అప్పుడాయన ఒంటిపై ఒకే ఒక వస్త్రం ఉండింది.
[సహీహ్ బుఖారీ: 5వ ప్రకరణం – గుసుల్, 3వ అధ్యాయం]
13వ అధ్యాయం – రుతుమతి కస్తూరీ వాసన బట్ట కట్టుకొని స్నానం చేయడం
استحباب استعمال المغتسلة من الحيض فرصة من مسك في موضع الدم
189 – حديث عَائِشَةَ أَنَّ امْرَأَةً سَأَلَتِ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ غُسْلِهَا مِنَ الْمَحِيضِ، فَأَمَرَهَا كَيْفَ تَغْتَسِلُ، قَالَ: خُذِي فِرْصَةَ مِنْ مِسْكٍ فَتَطَهَّرِي بِهَا، قَالَتْ: كَيْفَ أَتَطَهَّرُ بِهَا قَالَ: تَطَهَّرِي بِهَا، قَالَتْ: كَيْفَ قَالَ: سُبْحانَ اللهِ تَطَهَّرِي بِهَا فَاجْتَبَذْتُهَا إِلَيَّ، فَقُلْتُ تَتَبَعِي بِهَا أَثَرَ الدَّمِ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 13 باب دلك المرأة نفسها إذا تطهرت من المحيض
189. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- ఒక స్త్రీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, బహిష్టు తరువాత స్నానం చేసే పద్ధతి ఏమిటని అడిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్నానం చేసే పద్ధతి వివరించి “కస్తూరీ వాసన గల గుడ్డ పీలికతో శుభ్రపరచుకో” అని చెప్పారు. దానికి ఆమె (విషయం అర్థంగాక) “సువాసన గల బట్టతో ఎలా శుభ్రపరచుకోవాలి?” అని అడిగింది “ అంతే, దాంతో శుద్ధి చేసుకో” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). (అప్పటికీ విషయం అర్థంగాక) “ఎలాగండీ?” అని అడిగింది మళ్ళీ. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆశ్చర్యం వెలిబుచ్చుతూ “సుబ్ హానల్లాహ్ (నువ్వు ఆ మాత్రం మాట కూడా అర్థం చేసుకోలేవా)! సువాసన బట్టతో శుద్ధి చేసుకో, అంతే” అని అన్నారు. అప్పుడు నేనా స్త్రీని పక్కకు లాక్కెళ్ళి విషయం ఏమిటో వివరిస్తూ “సువాసన బట్టతో రక్తస్రావమయిన శరీర భాగాన్ని తుడుచుకో” అని చెప్పాను.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 13వ అధ్యాయం]
14వ అధ్యాయం – గడువు దాటినా రక్తస్రావం అయ్యే రుతుమతి స్నానం చేసే పద్ధతి
المستحاضة وغسلها وصلاتها
190 – حديث عَائِشَةَ، قَالَتْ: جَاءَتْ فَاطِمَةُ ابْنَةُ أَبِي حُبَيْشٍ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَتْ يَا رَسُولَ اللهِ إِنِّي امْرَأَةٌ أُسْتَحَاضُ، فَلاَ أَطْهُرُ، أَفَأَدَعُ الصَّلاَةَ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: [ص:71] لاَ، إِنَّمَا ذَلِكَ عِرْقٌ وَلَيْسَ بِحَيْضٍ، فَإِذَا أَقْبَلَتْ حَيْضَتُكِ فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ فَاغْسِلِي عَنْكِ الدَّمَ ثُمَّ صَلِّي ثُمَّ تَوَضَّئِي لِكُلِّ صَلاَةٍ حَتَّى يَجِيءَ ذَلِكَ الْوَقْتُ
__________
أخرجه البخاري في: كتاب الوضوء: 63 باب غسل الدم
190. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- అబూ హుదైష్ కుమార్తె అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! నాకు నిరంతరాయంగా రుతుస్రావమవుతుంది. నేను పరిశుద్ధురాలయ్యే సూచనలే కన్పించడం లేదు. ఇలాంటి స్థితిలో (నేనేం చెయ్యాలి?) నమాజు మానెయ్యాలా?” అని అడిగింది.
అప్పుడు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “అలా చెయ్యకు. ఇది రుతుస్రావం కాదు. ఒక విధమైన నరం నుండి కారుతున్న రక్తం ఇది. అందువల్ల నీ రుతు గడువు దినాల్లో మాత్రమే నమాజు చెయ్యడం మానేసి, ఆ తరువాత ఒంటి మీది రక్తాన్ని కడిగేసుకొని నమాజు ప్రారంభించు. కాకపోతే తిరిగి నీ రుతు గడువు దినాలు వచ్చే వరకు ప్రతి నమాజు కోసం కొత్తగా వుజూ చేస్తూ ఉండాలి.”
[సహీహ్ బుఖారీ: 4వ ప్రకరణం – వుజూ, 63వ అధ్యాయం]
191 – حديث عَائَشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، أَنَّ أُمَّ حَبِيبَةَ اسْتُحِيضَتْ سَبْعَ سِنِينَ، فَسَأَلَتْ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذَلِكَ فَأَمَرَهَا أَنْ تَغْتَسِلَ، فَقَالَ: هذَا عِرْقٌ فَكَانَتْ تَغْتَسِلُ لِكُلِّ صَلاَةٍ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 26 باب عرق الاستحاضة
191. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- (జహష్ కుమార్తె అయిన) ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హా)కు ఏడేండ్లగా రుతుస్రావం అవుతూ ఉంటే, ఆమె దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి పరిస్థితి విన్నవించుకున్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(రుతు గడువు దినాలు ముగిసిన తరువాత) స్నానం చెయ్యి” అని అన్నారు. ఆ తరువాత “ఇదొక విధమైన నరం నుండి కారుతున్న రక్తం (రుతుస్రావం కాదు)” అని అన్నారు. అప్పటి నుంచి ఉమ్మె హబీబా (రదియల్లాహు అన్హు) ప్రతి నమాజు కోసం వుజూ * చేయడం ప్రారంభించింది.
[సహీహ్ బుఖారీ : 6వ ప్రకరణం – హైజ్, 26వ అధ్యాయం]
(*) రుతుస్రావ వ్యాధిగ్రస్తురాలి విషయంలో అత్యధిక ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం ఆమె ప్రతి నమాజు కోసం గుసుల్ (స్నానం) చేయనవసరం లేదు. రుతుస్రావం గడువు ముగిసిన తరువాత ఒకసారి గుసుల్ చేస్తే సరిపోతుంది. అయితే ప్రతి నమాజు కోసం వుజూ మాత్రం తప్పకుండా చేయవలసి ఉంటుంది. ప్రతి నమాజు కోసం గుసుల్ చేయాలి అనే ప్రస్తావన ఉన్న హదీసులన్నీ బలహీనమైనవి. – ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్)
15వ అధ్యాయం – బహిష్టు స్త్రీలు తప్పనిసరిగా ఖజా రోజాలు పాటించాలి
وجوب قضاء الصوم على الحائض دون الصلاة
192 – حديث عَائِشَةَ، أَنَّ امْرَأَةً قَالَتْ لَهَا: أَتَجْزِي إِحْدَانَا صَلاَتَهَا إِذَا طَهُرَتْ فَقَالَتْ: أَحَرُورِيَّةٌ أَنْتِ كُنَّا نَحِيضُ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلاَ يَأْمُرُنَا بِهِ، أَو قَالَتْ: فَلاَ نَفْعَلُهُ
__________
أخرجه البخاري في: 6 كتاب الحيض: 20 باب لا تقضي الحائض الصلاة
192. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) దగ్గరకు ఒక స్త్రీ వచ్చి “బహిష్టు రోజుల్లో తప్పిపోయిన నమాజులను పరిశుభ్రమయిన తరువాత (అంటే గడువు తీరి స్నానం చేసిన తరువాత) ఖజా నమాజులుగా తిరిగి చేసుకోవాలా?” అని అడిగింది. దానికి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) “నువ్వు ఖార్జీ (వర్గం) మహిళవా? దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో మేము బహిష్ఠు అయితే, (బహిష్ఠు దినాల్లో) తప్పిపోయిన నమాజులకు ఖజా పాటించాలని మమ్మల్ని ఆయన ఆదేశించేవారు కాదు” అని అన్నారు. లేక “మేము మాత్రం ఇలా చేసే వాళ్ళం కాదు” అని అన్నారు ఆమె.
[సహీహ్ బుఖారీ: 6వ ప్రకరణం – హైజ్, 20వ అధ్యాయం]
16వ అధ్యాయం – స్నానం చేసేటప్పుడు మరుగు ఏర్పరచుకోవాలి
تستر المغتسل بثوب ونحوه
193 – حديث أُمِّ هَانِىءٍ بِنْتِ أَبِي طَالِبِ، قَالَتْ: ذَهَبْتُ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَامَ الْفَتْحِ فَوَجَدْتُهُ يَغْتَسِلُ، وَفَاطِمَةُ ابْنَتُهُ تَسْتُرُهُ، قَالَتْ، فَسَلَّمْتُ عَلَيْهِ؛ فَقَالَ: مَنْ هذِهِ فَقُلْتُ: أَنَا أُمُّ هَانِىءٍ بِنْتُ أَبي طَالِبٍ؛ فَقَالَ: مَرْحَبًا بِأُمِّ هَانِىءٍ فَلَمَّا فَرَغَ مِنْ غُسْلِهِ، قَامَ فَصَلَّى ثَمَانِيَ رَكَعَاتٍ، مُلْتَحِفًا فِي ثَوْبٍ وَاحِدٍ، فَلَمَّا انْصَرَفَ [ص:72] قُلْتُ يَا رَسُولَ اللهِ زَعَمَ ابْنُ أُمِّي أَنَّهُ قَاتِلٌ رَجُلاً قَدْ أَجَرْتُهُ، فُلاَنَ بْنَ هُبَيْرَةَ؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: قَدْ أَجَرْنَا مَنْ أَجَرْتِ يَا أُمَّ هَانِىءٍ، قَالَتْ أُمُّ هَانِىءٍ: وَذَاكَ ضُحًى
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 4 باب الصلاة في الثوب الواحد ملتحفًا به
193. అబూ తాలిబ్ కుమార్తె హజ్రత్ ఉమ్మెహాని (రదియల్లాహు అన్హు) కథనం:- మక్కా పట్టణం జయించబడిన సంవత్సరం ఓ రోజు నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన స్నానం చేస్తున్నారు. ఆయన కుమార్తె ఫాతిమా (రదియల్లాహు అన్హా) ఆయనకు తెర ఏర్పరచి పట్టుకొని ఉన్నారు. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం చేశాను. ఆయన (తెర వెనుక నుంచి స్నానం చేస్తూ) ఎవరూ? అని అడిగారు. “నేను అబూ తాలిబ్ కూతురు ఉమ్మెహానీని” అన్నాను నేను. “ఉమ్మెహానీ! రామ్మా!” అన్నారు ఆయన నన్ను ఆహ్వానిస్తూ. ఆ తరువాత ఆయన స్నానం ముగించుకొని, ఒక వస్త్రం చుట్టుకొని ఎనిమిది రకాతులు నమాజ్ చేశారు. నమాజ్ చేశాక నా దగ్గరికి వచ్చారు. (నేను వచ్చిన విషయం తెలియజేస్తూ) “దైవప్రవక్తా! నా సోదరుడు (హజ్రత్ అలి), ఇబ్నె హుబైర్ని చంపుతానంటున్నాడు. నేను ఇబ్నె హుబైర్కు ఆశ్రయమిచ్చాను” అని అన్నాను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఉమ్మెహానీ ఆశ్రయమిచ్చిన వ్యక్తికి నేను కూడా ఆశ్రయం (రక్షణ) ఇస్తున్నాను” అని అన్నారు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన నమాజ్ ‘ఛాష్త్’ నమాజ్.
[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 4వ అధ్యాయం]
18వ అధ్యాయం – ఏకాంతంలో నగ్నంగా స్నానం చేయవచ్చు
جواز الاغتسال عريانًا في الخلوة
194 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: كَانَتْ بَنُو إِسْرَائِيلَ يَغْتَسِلُونَ عُرَاةً يَنْظُرُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ، وَكَانَ مُوسى يَغْتَسِلُ وَحْدَهُ؛ فَقَالُوا وَاللهِ مَا يَمْنَعُ مُوسى أَنْ يَغْتَسِلَ مَعَنَا إِلاَّ أَنَّهُ آدَرُ، فَذَهَبَ مَرَّةً يَغْتَسِلُ فَوَضَعَ ثَوْبَهُ عَلَى حَجَرٍ، فَفَرَّ الْحَجَرُ بِثَوْبِهِ، فَخَرَجَ مُوسى فِي إِثْرِهِ يَقُولُ ثَوْبِي يَا حَجَرُ حَتَّى نَظَرَتْ بَنُو إِسْرَائيلَ إِلَى مُوسى، فَقَالُوا وَاللهِ مَا بِمُوسى مِنْ بَأْسٍ؛ وَأَخَذَ ثَوْبَهُ وَطَفِقَ بِالْحَجَرِ ضَرْبًا
فَقَالَ أَبُو هُرَيْرَةَ: وَاللهِ إِنَّهُ لَنَدَبٌ بِالْحَجَرِ سِتَّةٌ أَوْ سَبْعَةٌ ضَرْبًا بِالْحَجَرِ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 20 باب من اغتسل عريانًا وحده في الخلوة
194. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- ఇస్రాయీల్ సంతతి ప్రజలు ఒకరి మర్మాంగాలు మరొకరు చూసుకుంటూ నగ్నంగా సామూహిక స్నానం చేస్తారు. మూసా (అలైహిస్సలాం) మాత్రం ఏకాంతంగా స్నానం చేసేవారు. దాంతో ఇస్రాయీల్ సంతతి ప్రజలు (లేనిపోని అనుమానానికి గురయి) “మూసా (అలైహి)కు వరిబీజం ఉంది. అందుకే ఆయన (ఎవరితోనూ కలవకుండా) ఒంటరిగా స్నానం చేస్తారు” అని చెప్పుకోసాగారు. ఆ తరువాత ఓ రోజు మూసా (అలైహిస్సలాం) బట్టలు ఊడదీసి ఓ బండరాయి మీద పెట్టి స్నానం చేయడానికి ఉపక్రమించారు. అంతే, ఆ బండరాయి బట్టలతో సహా పైకి లేచి పరుగు తీసింది. అది చూసి మూసా (అలైహిస్సలాం) “నా బట్టలు, నా బట్టలు!” అంటూ దాని వెనుక పరుగెత్తారు. ఆ విధంగా ఆయన పరుగెత్తుతుంటే చివరికి ఒక చోట ఇస్రాయీల్ సంతతి వారు ఆయన (నగ్న) శరీరాన్ని కళ్ళారా చూసి, “దేవదేవ! మూసా(అలైహిస్సలాం)కు ఎలాంటి వ్యాధి లేదు (అనవసరంగా మనం ఆయన్ని అనుమానించాము)” అని అన్నారు. (బండరాయి ఒక చోట నిలిచిపోయింది. బండరాయిని వెంబడిస్తున్న) మూసా (అలైహిస్సలాం) తన బట్టలను తీసేసుకున్నారు. అయితే ఆయన (కోపంతో) బండరాయిని బాదడం ప్రారంభించారు.
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసును విన్పించిన తరువాత “అల్లాహ్ సాక్షి! మూసా (అలైహి) కొట్టిన దెబ్బల వల్ల ఆ రాయి మీద ఆరు గుర్తులు (ఇప్పటికీ) ఉన్నాయి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ: 5వ ప్రకరణం – గుసుల్, 20వ అధ్యాయం]
19వ అధ్యాయం – మర్మావయవంపై ఆచ్ఛాదన చాలా అవసరం
الاعتناء بحفظ العورة
195 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَنْقُلُ مَعَهُمُ الْحِجَارَةَ لِلْكَعْبَةِ، وَعَلَيْهِ إِزَارُهُ؛ فَقَالَ لَهُ الْعَبَّاسُ عَمُّهُ يَا ابْنَ أَخِي لَوْ حَللْتَ إِزَارَكَ فَجَعَلْتَهُ عَلَى مَنْكِبَيْكَ دُونَ الْحِجَارَةِ قَالَ فَحَلَّهُ فَجَعَلَهُ عَلَى مَنْكِبَيْهِ، فَسَقَطَ مَغْشِيًّا عَلَيْهِ؛ فَمَا رُئِيَ بَعْدَ ذلِكَ عُرْيانًا/ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 8 باب كراهية التعري في الصلاة وغيرها
195. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం:- కాబా పునర్నిర్మాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా (తన తోటి తెగ) ఖురైష్ వాళ్ళతో కలసి రాళ్ళు మోశారు. ఆయన (ఆ చిరుప్రాయంలో) లుంగీ కట్టుకొని రాళ్ళు మోస్తుంటే, ఆయన పెదనాన్న హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వచ్చి, “బాబూ! ఆ లుంగీ ఊడదీసి భుజం మీద రాయి క్రింద పెట్టుకో మెత్తగా ఉంటుంది” అని అన్నారు. అలా అన్న వెంటనే ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కట్టుకున్న లుంగీ ఊడదీసి, దాన్ని ఆయన భుజం మీద పెట్టారు. ఒంటిమీద అంగవస్త్రం ఊడదీయగానే ఆయన సిగ్గుతో (బక్కచిక్కి) స్పృహ తప్పిపోయారు.(*) ఆ రోజు నుండి ఆయన మరెప్పుడూ నగ్నంగా ఉండటాన్ని జనం చూడలేదు.
[సహీహ్ బుఖారీ : 7వ ప్రకరణం – సలాత్, 8వ అధ్యాయం]
(*) ఈ హదీసును బట్టి దైవప్రవక్త (సల్లం) బాల్యం నుండే మూఢకాలం నాటి దురలవాట్లకు, దుర్లక్షణాలకు దూరంగా ఉండేవారని తెలుస్తోంది.
21వ అధ్యాయం – వీర్య స్ఖలనం అయినప్పుడే స్నానం తప్పనిసరి అవుతుంది
إِنما الماء من الماء
196 – حديث أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَرْسَلَ إِلَى رَجُلٍ مِنَ الأَنْصَارِ فَجَاءَ وَرَأْسُهُ يَقْطُرُ؛ فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لَعَلَّنَا أَعْجَلْنَاكَ، فَقَالَ: نَعَمْ؛ فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِذَا أُعْجِلْتَ أَوْ قُحِطْتَ فَعَلَيْكَ الْوُضُوءُ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 34 باب من لم ير الوضوء إلا من المخرجين
196. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సారీ ముస్లింని పిలుచుకు రావడానికి ఒక వ్యక్తిని పంపారు. (కాస్సేపటికి) ఆ అన్సారీ ముస్లిం పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో అతని శిరోజాల నుండి స్నానం తాలూకు నీటి బిందువులు రాలి పడుతున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడ్ని చూసి “బహుశా నేను పిలవడం వల్ల నీవు రావడంలో తొందర చేయవలసి వచ్చింది” అని అన్నారు. దానికతను “ఔనండీ!” అన్నాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “త్వరగా బయటపడవలసిన పరిస్థితి వస్తే, లేదా వీర్యస్ఖలనం జరగకపోతే వుజూ చేస్తే చాలు (స్నానం చేయనవసరం లేదు)”(*) అని అన్నారు.
(సహీహ్ బుఖారీ: 4వ ప్రకరణం – వుజూ, 34వ అధ్యాయం]
(*) ఈ ఆజ్ఞ తర్వాత రద్దయిపోయింది. 199వ హదీసు పాదసూచిక చూడండి.
197 – حديث أُبَيِّ بْنِ كَعْبٍ، أَنَّهُ قَالَ: يَا رَسُولَ اللهِ إِذَا جَامَعَ الرَّجُلُ الْمَرْأَةَ فَلَمْ يُنْزِلْ قَالَ: يَغْسِلُ مَا مَسَّ الْمَرْأَةَ مِنْهُ ثُمَّ يَتَوَضَّأُ وَيُصَلِّي
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 29 باب غسل ما يصيب من فرج المرأة
197. హజ్రత్ అబీ బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: – నేనొకసారి “దైవప్రవక్తా! ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించినప్పుడు అతనికి వీర్యస్ఖలనం కాకపోతే స్నానం తప్పనిసరి (వాజిబ్)గా చేయాలా?” అని అడిగాను. దానికాయన ఇలా సమాధానమిచ్చారు: “అతని దేహానికి స్త్రీ దేహం నుండి అంటిన మలినాన్ని కడిగివేయాలి, ఆ తరువాత వుజూ చేసి నమాజు చేసుకోవచ్చు.”
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం – గుసుల్, 29వ అధ్యాయం]
198 – حديث عُثْمَانَ بْنِ عَفَّانَ رضي الله عنه، قَالَ لَهُ زَيْدُ بْنُ خَالِدٍ: أَرَأَيْتَ إِذَا جَامَعَ فَلَمْ يُمْنِ قَالَ عُثْمَانُ: يَتَوَضَّأُ كَمَا يَتَوَضَّأُ لِلصَّلاَةِ وَيَغْسِلُ ذَكَرَهُ؛ قَالَ عُثْمَانُ: سَمِعْتُهُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 34 باب من لم ير الوضوء إلا من المخرجين
198. హజ్రత్ ఉస్మాన్ బిన్ అప్పాన్ (రదియల్లాహు అన్హు) కథనం:- జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఓ రోజు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో మాట్లాడుతూ “ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించినప్పుడు అతనికి వీర్యస్ఖలనం కాక పోయినా స్నానం విధిగా చేయాలా?” అని అడిగారు. దానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) సమాధానమిస్తూ “నమాజు కోసం వుజూ చేసినట్టు వుజూ చేస్తే చాలు. (దానికి ముందు) మర్మాంగాన్ని కడుక్కోవాలి” అని అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం చెప్పిన తరువాత “నేను దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) నోట విన్నది మాత్రమే నీకు తెలియజేశాను” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 34వ అధ్యాయం]
22వ అధ్యాయం – స్త్రీ పురుషుల మర్మాంగాలు పరస్పరం కలసిపోతే చాలు స్నానం తప్పనిసరి (نسخ (الماء من الماء) ووجوب الغسل بالتقاء الختانين)
199 – حديث أَبِي هُرَيْرَةَ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: إِذَا جَلَسَ بَيْنَ شُعَبِهَا الأَرْبَعِ ثُمَّ جَهَدَهَا فَقَدْ وَجَبَ الْغُسْل
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 28 باب إذا التقى الختانان
199. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు – “పురుషుడు స్త్రీ తొడల మధ్య కూర్చొని బలం ప్రయోగిస్తే చాలు, (వీర్యస్ఖలనం కాకపోయినా) అతను విధిగా స్నానం చేయవలసి ఉంటుంది”. (*)
[సహీహ్ బుఖారీ : 5వ ప్రకరణం, గుసుల్, 28వ అధ్యాయం]
(*) ఈ హదీసు భావం గురించి ఇమామ్ నవవీ (రహిమహుల్లాహ్) ప్రకారం గుసుల్ చేయడం వాజిబ్ (తప్పనిసరి) కావడానికి స్త్రీ పురుషులిరువురి మర్మాంగాలు కలిస్తే చాలు, వీర్యస్ఖలనం జరగనవసరం లేదు. ఈ విషయం గురించి ప్రారంభంలో ప్రవక్త అనుచరుల మధ్య భేదాభిప్రాయాలుండేవి. ఆ తర్వాత ఏకాభిప్రాయం ఏర్పడింది. ఇప్పుడు అన్ని వర్గాల ఏకాభిప్రాయం ప్రకారం గుసుల్ చేయడం వాజిబ్ కావడానికి వీర్యస్ఖలనం జరగనవసరం లేదు. ఇద్దరి మర్మావయవాలు కలిస్తే చాలు, ఇద్దరూ తప్పనిసరిగా గుసుల్ చేయవలసి ఉంటుంది.
24వ అధ్యాయం – ఉడకబెట్టిన ఆహార పదార్థం తింటే వుజూ భంగం అనే హదీసు రద్దయింది (نسخ الوضوء مما مست النار)
200 – حديث عَبْدِ اللهِ بْنِ عَبَّاسٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَكَلَ كَتِفَ شَاةٍ ثُمَّ صَلَّى وَلَمْ يَتَوَضَّأْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 50 باب من لم يتوضأ من لحم الشاة والسويق
200. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ రోజు మేక కాలి మాంసం తిన్నారు. ఆ తరువాత నమాజు చేశారు; తిరిగి వుజూ చేయలేదు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 50వ అధ్యాయం]
201 – حديث عَمْرِو بْنِ أُمَيَّةَ، أَنَّهُ رَأَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَحْتَزُّ مِنْ كَتِفِ شَاةٍ، فَدُعِيَ إِلَى الصَّلاَةِ فَأَلْقَى السِّكِّينَ، فَصَلَّى وَلَمْ يَتَوَضَّأْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 50 باب من لم يتوضأ من لحم الشاة والسويق
201. హజ్రత్ అమ్ర్ బిన్ ఉమయ్య (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేక కాలి మాంసం తింటూ ఉండగా నేను చూశాను. అంతలో నమాజు కోసం పిలుపు (అజాన్) వచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే కత్తి ఓ పక్కన పడేసి, వుజూ చేయకుండానే వెళ్ళి నమాజు చేశారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 50వ అధ్యాయం]
202 – حديث مَيْمُونَةَ، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَكَلَ عِنْدَهَا كَتِفًا، ثُمَّ صَلَّى وَلَمْ يَتَوَّضَّأْ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 51 باب من مضمض من السويق ولم يتوضأ
202. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ మైమూన (రదియల్లాహు అన్హా) కథనం:- దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంట్లో (ఓ రోజు) మేక కాలి మాంసం తిన్నారు. ఆ తరువాత వుజూ చేయకుండానే నమాజు చేశారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 51వ అధ్యాయం]
203 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَرِبَ لَبَنًا فَمَضْمَضَ وَقَالَ: إِنَّ لَهُ دَسَمًا
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 52 باب هل يمضمض من اللبن
203. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలు త్రాగిన తరువాత నీటితో నోరు పుక్కిలించి “పాలు త్రాగడం వల్ల నోరు తైలయుతమవుతుంది (అంచేత నీళ్ళతో పుక్కిలించి నోరు శుభ్రపరచుకోవాలి)” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ]
26వ అధ్యాయం – వుజూ భంగమైందని కేవలం అనుమానం వల్ల నమాజ్ ను మధ్యలో విరమించరాదు (الدليل على أن من تيقن الطهارة ثم شك في الحدث فله أن يصلي بطهارته)
204 – حديث عَبْدِ اللهِ بْنِ زَيْدِ بْنِ عَاصِمٍ الأَنْصَارِيِّ، أَنَّهُ شَكَا إِلَى رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، الرَّجُلُ الَّذِي يُخَيَّلُ إِلَيْهِ أَنَّهُ يَجِدُ الشَّيْءَ فِي الصَّلاَةِ، فَقَالَ: لاَ يَنْفَتِلْ أَوْ لاَ يَنْصَرِفْ حَتَّى يَسْمَعَ صَوْتًا أَوْ يَجِدَ رِيحًا
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 4 باب لا يتوضأ من الشك حتى يستيقن
204. హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను “నమాజు చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఏదో అయి (అపానవాయువు వెడలి) నట్లు అన్పిస్తుంది; అప్పుడేం చేయాలి?” అని అడిగాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “(అపానవాయువు వెడలినట్లు) శబ్దం వినపడనంతవరకు లేదా దుర్వాసన రానంతవరకు నమాజ్న భంగపరచకు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 4వ అధ్యాయం]
27వ అధ్యాయం – మృత జంతువు చర్మాన్ని పదును పెడితే శుద్ది అవుతుంది
طهارة جلود الميتة بالدباغ
205 – حديث ابْنِ عَبَّاسٍ، قَالَ: وَجَدَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ شَاةً مَيِّتَةً أُعْطِيَتْهَا مَولاَةٌ لمَيْمُونَةَ مِنَ الصَّدَقَةِ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: هَلاَّ انْتَفَعْتُمْ بِجِلْدِهَا، قَالُوا: إِنَّهَا مَيْتَةٌ؛ قَالَ: إِنَّمَا حَرُمَ أَكْلُهَا
__________
أخرجه البخاري في: 24 كتاب الزكاة: 61 باب الصدقة على موالي أزواج النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
205. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- విశ్వాసుల మాతృమూర్తి మైమూన (రదియల్లాహు అన్హా) గారి సేవకురాలికి ఎవరో ఒక మేకను దానంగా ఇచ్చారు. (తరువాత అది చచ్చిపోయింది). దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) (ఓ చోట) దాన్ని పడి ఉండటం చూసి “మీరు దీని చర్మాన్ని ఎందుకు ఉపయోగించుకోరు?” అని అడిగారు. దానికి వారు “ఇది మృత జంతువు కదా?” అని అన్నారు. “మృత జంతువును తినడం నిషిద్ధం. కాని దాని చర్మాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 24వ ప్రకరణం – జకాత్, 61వ అధ్యాయం]
28వ అధ్యాయం – తయమ్ముమ్ التيمم
206 – حديث عَائِشَةَ زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَتْ: خَرَجْنَا مَعَ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي بَعْض أَسْفَارِهِ حَتَّى إِذَا كُنَّا بِالْبَيْدَاءِ، أَوْ، بِذَاتِ الْجَيْشِ، انْقَطَعَ عِقْدٌ لِي؛ فَأَقَام رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى الْتِمَاسِهِ، وَأَقَامَ النَّاسُ مَعَهُ، وَلَيْسُوا عَلَى مَاءٍ؛ فَأَتَى النَّاسُ إِلَى أَبِي بَكْرٍ الصِّدِّيقِ فَقَالُوا: أَلاَ تَرَى إِلَى مَا صَنَعَتْ عَائِشَةُ أَقَامَتْ بِرَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالنَّاسِ، وَلَيْسُوا عَلَى مَاءٍ وَلَيْسَ مَعَهُمْ مَاءٌ فَجَاءَ أَبُو بَكْرٍ وَرَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَاضِعٌ رَأْسَهُ عَلَى فَخِذِي قَدْ نَامَ فَقَالَ: حَبَسْتِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَالنَّاسَ، وَلَيْسُوا عَلَى مَاءٍ، وَلَيْسَ مَعَهُمْ مَاءٌ؛ فَقَالَتْ عَائِشَةُ: فَعاتَبَنِي أَبُو بَكْرٍ، وَقَالَ مَا شَاءَ اللهُ أَنْ يَقولَ، وَجَعَلَ يطْعُنُنِي بِيَدِهِ فِي خَاصِرَتِي فَلاَ يَمْنَعُنِي مِنَ التَّحَرُّكِ إِلاَّ مَكَانُ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى فَخِذِي، فَقَامَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ أَصْبَحَ عَلَى غَيْرِ مَاءٍ، فَأَنْزَلَ اللهُ آيَةَ التَّيَمُّمِ، فَتَيمَّمُوا؛ فَقَالَ أُسَيْدُ بْنُ الْحُضَيْرِ: مَا هِيَ بِأَوَّلِ بَرَكَتِكُمْ يَا آلَ أَبي بَكْرِ قَالَتْ: فَبَعَثْنَا الْبَعِيرَ الَّذِي كُنْتُ عَلَيْهِ فَأَصَبْنَا الْعِقْدَ تَحْتَهُ
__________
أخرجه البخاري في: كتاب التيمم: 1 باب حدثنا عبد الله بن يوسف
206. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:- మేమొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ప్రయాణం చేస్తున్నాం. బైదా లేక జాతుల్ జైష్ అనే ప్రాంతానికి (ఈ రెండింటిలో ఏ ప్రాంతమో ఉల్లేఖకులు అనుమానంలో పడ్డారు) చేరుకునేసరికి నా కంఠహారం తెగి ఎక్కడో పడిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాన్ని వెతకడానికి అక్కడ ఆగిపోయారు. ఆయనతో పాటు మిగిలినవాళ్ళు కూడా ఆగిపోయారు. ఆ ప్రదేశంలో ఎక్కడా నీటి చుక్కలేదు. జనం హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు వెళ్ళి “మీ అమ్మాయి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఏం చేసిందో చూశారా? ఆమె మూలంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇక్కడ ఆగిపోవలసి వచ్చింది. ఆయనతో పాటు ప్రజలంతా ఆగిపోయారు. కాని ఈ ప్రదేశంలో చూస్తే నీటి చుక్క కూడా లేదు. జనం దగ్గర కూడా నీళ్ళు అయిపోయాయి” అని అన్నారు.
ఈ మాటలు విని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో దైవప్రవక్త వా వడిలో తలపెట్టి నిద్రపోతున్నారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వచ్చీ రాగానే “నీ మూలంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆగిపోవలసి వచ్చింది. ఆయనతో పాటు ప్రజలూ ఆగిపోవాల్సి వచ్చింది. కాని ఇక్కడెక్కడా నీటి చుక్క కూడా లేదు. జనం దగ్గర కూడా నీళ్ళు లేవు” అని మండిపడ్డారు నా మీద. ఆయన చేత్తో నా వీపు మీద కొడ్తూ అనదలచిన మాటలన్నీ అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా తొడల మీద తల ఆనిచ్చి పడుకొని ఉండటం వల్ల నేను (దెబ్బలు సహిస్తూ) కదలకుండా ఉండవలసి వచ్చింది.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్లవారు జామున మేల్కుంటే (వుజూ చేయడానికి) నీళ్ళే లేవు. అప్పుడు అల్లాహ్ ‘తయమ్ముమ్’కు సంబంధించిన ఆదేశాలు అవతరింపజేశాడు. దాంతో అందరూ ‘తయమ్ముమ్’ చేశారు. ఆ సందర్భంలో ఉసైద్ బిన్ హజీర్ (రదియల్లాహు అన్హు) మాట్లాడుతూ “అబూ బకర్ సంతానమా? మీ మూలంగా (ముస్లింలకు) శుభం కలగడం ఇది మొదటిసారి మాత్రమే కాదు (ఇంతకు పూర్వం కూడా అనేకసార్లు శుభం కలిగి ఎంతో ప్రయోజనం పొందారు)” అని అన్నారు. ఆ తరువాత నేను ఎక్కి కూర్చున్న ఒంటెను పైకి లేపారు. దాని క్రింద నా కంఠహారం దొరికింది.
[సహీహ్ బుఖారీ : 7వ ప్రకరణం – తయమ్ముమ్, 1వ అధ్యాయం]
207 – حديث عَمَّارٍ عَنْ شَقِيقٍ قَالَ: كُنْتُ جَالِسًا مَعَ عَبْدِ اللهِ وَأَبِي مُوسَى الأَشْعَرِيِّ، فَقَالَ لَهُ أَبُو مُوسى لَوْ أَنَّ رَجُلاً أَجْنَبَ فَلَمْ يَجِدِ المَاءَ شَهْرًا، أَمَا كَانَ يَتَيَمَّمُ وَيُصَلِّي [ص:76] فَكَيْفَ تَصْنَعُونَ بِهذِهِ الآيَةِ فِي سُورَةِ الْمَائِدَةِ (فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا) فَقَالَ عَبْدُ اللهِ: لَوْ رُخِّصَ لَهُمْ فِي هذَا لأَوْشَكُوا إِذَا بَرَدَ عَلَيْهِمُ الْمَاءَ أَنْ يَتَيَمَّموا الصَّعِيدَ قُلْتُ: وَإِنَّمَا كَرِهْتُمْ هذَا لِذَا قَالَ: نَعَمْ فَقَالَ أَبُو مُوسى: أَلَمْ تَسْمَع قَوْلَ عَمَّارٍ لِعُمَر: بَعَثَنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فِي حَاجَةٍ فَأَجْنَبْتُ فَلَمْ أَجِدِ الْمَاءَ، فَتَمَرَّغْتُ فِي الصَّعِيدِ كَما تَمَرَّغُ الدَّابَّةُ، فَذَكَرْتُ ذَلِكَ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: إِنَمَا كَانَ يَكْفِيكَ أَنْ تَصْنَعَ هكَذَا؛ فَضَرَبَ بِكَفِّهِ ضَرْبَةً عَلَى الأَرْضِ، ثُمَّ نَفَضَهَا، ثُمَّ مَسَحَ بِهَا ظَهْرَ كَفِّهِ بِشِمَالِهِ، أَوْ ظَهْرَ شَمَالِهِ بِكَفِّهِ، ثُمَّ مَسَحَ بِهَا وَجْهَه
فَقَالَ عَبْدُ اللهِ: أَفَلَمْ تَرَ عُمَرَ لَمْ يَقْنَعْ بِقَوْلِ عَمَّارٍ
__________
أخرجه البخاري في: 7 كتاب التيمم: 8 باب التيمم ضربة
207. హజ్రత్ షఖీఖ్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు), అబూ మూసా అష్అరీ (రదియల్లాహు అన్హు) ల దగ్గర కూర్చుని ఉన్నాను. అప్పుడు అబూ మూసా (రదియల్లాహు అన్హు), అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) తో మాట్లాడుతూ “ఎవరికైనా లైంగిక అశుద్ధావస్థ ఏర్పడి, ఒక నెల వరకూ స్నానం చేయడానికి నీళ్ళు లభించకపోతే అలాంటి వ్యక్తి తయమ్ముమ్ చేసి నమాజు చేయకూడదంటారా?” అని అడిగారు. దానికి హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) “నెల రోజుల దాకా నీళ్ళు లభించకపోయినా సరే తయమ్ముమ్ చేయకూడదు” అని అన్నారు. “ఏమిటీ, ‘నీళ్ళు లభించకపోతే పరిశుభ్రమైన మట్టి ఉపయోగించుకోండి’ అనే మాయిదా సూరాలోని సూక్తిని మీరు విస్మరించగలరా?” అని అడిగారు హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు). “ఇలా చేయడానికి ప్రజలకు అనుమతినిస్తే ఇక వారు నీళ్ళు చల్లగా ఉన్నాయని భావించినప్పుడు కూడా వాటిని వదలి తయమ్ముమ్ చేసుకుంటారు మరి” అన్నారు హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు). “అయితే మీరు అందుకేనా తయమ్ముమ్ అంటే ఇష్టపడటం లేదు?” అని అడిగాను నేను. దానికాయన ఔనన్నారు. అప్పుడు హజ్రత్ అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు – మీరు హజ్రత్ అమ్మార్ (రదియల్లాహు అన్హు) తెలిపిన ఈ విషయాన్ని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నోట వినలేదా? ఆయన ఈ విధంగా తెలియజేశారు. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక పని మీద నన్ను ( ఓ ప్రాంతానికి) పంపించారు. (దారిలో ఒక చోట) నేను స్నానం చేయవలసి వచ్చింది. అయితే నాకు ఎక్కడా నీళ్ళు లభించలేదు. అప్పుడు నేను పశువులా నేలమీద అటూ ఇటూ బాగా దొర్లాను. దాంతో వంటి నిండా మన్ను అంటుకున్నది. నేను ప్రయాణం నుంచి తిరిగొచ్చి ఈ సంగతి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలియజేశాను. అప్పుడాయన “నువ్విలా చేస్తే సరిపోయేది” అంటూ తన చేతిని ఓ సారి నేలమీద తట్టి విదిలించారు. తరువాత కుడిచేత్తో ఎడమ చేయి వెనుక భాగాన్ని లేక ఎడమ చేత్తో కుడి చేయి వెనుక భాగాన్ని తడిమి, రెండు చేతులతో ముఖాన్ని రుద్దుకున్నారు.”
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ మాటలు విని “హజ్రత్ అమ్మార్ (రదియల్లాహు అన్హు) మాటలను హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నమ్మలేకపోయిన సంగతి మీరు గమనించలేదా?” అని అన్నారు హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు). (*)
[సహీహ్ బుఖారీ :7వ ప్రకరణం – తయమ్ముమ్, 8వ అధ్యాయం]
(*) హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మొదట్లో వీర్యస్ఖలనం జరిగినప్పుడు తయమ్ముమ్ చేయాలన్న విషయాన్ని సమర్ధించేవారు కాదు. ఇతర సహాబీలు, తాబాయిలూ మాత్రం ‘తయమ్ముమ్’ తప్పకుండా చేయాలని భావించేవారు. ఆ తరువాత కొన్నాళ్లకు హజ్రత్ ఉమర్, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) కూడా దీన్ని సమర్థించారు. నీరు లభించని పరిస్థితిలో లైంగిక అశుద్ధావస్థను తొలగించి పరిశుధ్ధం కావడానికి ‘తయమ్ముమ్’ చేసి నమాజు చేయాలని సంస్కర్తలందరూ నిర్ణయించారు.
208 – حديثُ عَمَّارٍ جَاءَ رَجُلٌ إِلَى عُمَرَ بْنِ الْخَطَّابِ؛ فَقَالَ: إِنِّي أَجْنَبْتُ فَلَمْ أُصِبِ الْمَاءَ، فَقَالَ عَمَّارُ بْنُ يَاسِرٍ لِعُمَرَ بْنِ الْخَطَّابِ: أَمَا تَذْكُرُ أَنَّا كُنَّا فِي سَفَرٍ أَنَا وَأَنْتَ؛ فَأَمَّا أَنْتَ فَلَمْ تُصَلِّ، وَأَمَّا أَنَا فَتَمَعَّكْتُ فَصَلَّيْتُ، فَذَكَرْتُ لِلنَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: إِنَّمَا كَانَ يَكْفِيكَ هكَذَا، فَضَرَبَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِكَفَّيْهِ الأَرْضَ، وَنَفَخَ فِيهِمَا وَجْهَهُ، ثُمَّ مَسَحَ بِهِمَا وَجْهَهُ وَكَفَّيْهِ
__________
أخرجه البخاري في: 7 كتاب التيمم: 4 باب المتيمم هل ينفخ فيهما
208. ఓ రోజు ఒక వ్యక్తి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు వచ్చి, “నేను లైంగిక అశుద్ధావస్థకు లోనయి స్నానం చేయడానికి నీళ్ళు లభించని పక్షంలో ఏం చెయ్యాలి?” అని అడిగాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశించి హజ్రత్ అమ్మార్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీకు గుర్తుందా? ఓసారి మనిద్దరం ప్రయాణం చేస్తుంటే (*) (ఓ చోట నమాజు వేళకు) మీరు నమాజు చేయలేదు. నేను మాత్రం (నీళ్ళు లభించకపోయినా) మట్టిలో పడి అటూ ఇటూ దొర్లి ఆ తరువాత నమాజు చేశాను. ఈ సంగతి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ప్రస్తావించినప్పుడు ఆయన “నువ్విలా చేస్తే సరిపోయేది” అంటూ రెండు చేతుల్ని నేలమీద తట్టి వాటి మీద ఊదారు (దుమ్ముపోవడానికి). ఆ తరువాత రెండు చేతులతో ముఖాన్ని, రెండు చేతుల్ని రుద్దుకున్నారు.”
[సహీహ్ బుఖారీ : 7వ ప్రకరణం – తయమ్ముమ్, 4వ అధ్యాయం]
(*) సహీహ్ ముస్లిం గ్రంథంలో అదనంగా “మనిద్దరం లైంగిక అశుద్ధావస్థకు లోనయి ఉన్నాము” అనే మాట కూడా పేర్కొనబడింది.
209 – حديث أَبِي الْجُهَيْمِ الأَنْصَارِيِّ عَنْ عُمَيْرٍ مَوْلَى ابْنِ عَبَّاسٍ، قَالَ: أَقْبَلْتُ أَنَا وَعَبْدُ اللهِ بْنُ يَسَارٍ مَوْلَى مَيْمُونَةَ، زَوْجِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى دَخَلْنَا عَلَى أَبِي جُهَيْمِ بْنِ الْحرِثِ بْنِ الصِّمَّةِ الأَنْصَارِيِّ، فَقَالَ أَبُو الْجُهَيْمِ: أَقْبَلَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ نَحْوِ بِئْرِ جَمَلٍ، [ص:77] فَلَقِيَهُ رَجُلٌ فَسَلَّمَ فَلَمْ يَرُدَّ عَلَيْهِ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، حَتَّى أَقْبَلَ عَلَى الْجِدَارِ، فَمَسَحَ بِوَجْهِهِ وَيَدَيْهِ، ثُمَّ رَدَّ عَلَيْهِ السَّلاَمَ
__________
أخرجه البخاري في: 7 كتاب التيمم في الحضر إذا لم يجد الماء
209. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) చేత విముక్తి నొందిన బానిస ఉమైర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను, అబ్దుల్లా బిన్ యసార్ కలసి హజ్రత్ అబూ జహీం బిన్ హారిస్ బిన్ సుమ అన్సారీ దగ్గరకు వెళ్ళాము. అప్పుడు అబూ జహీం ఇలా తెలిపారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బైర్ జమల్ (ప్రాంతం) నుండి తిరిగి వస్తుంటే దారిలో ఒక చోట ఒక వ్యక్తి తారసపడి సలాం చేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని సలాంకు ప్రతి సలాం చెప్పకుండా ఒక గోడ వైపుకు తిరిగి నిల్చున్నారు. దాని మీద చేతులు తట్టి వాటితో ముఖాన్ని, చేతుల్ని రుద్దుకున్నారు. ఆ తరువాత ఆ వ్యక్తికి ప్రతి సలాం చెప్పారు.”
[సహీహ్ బుఖారీ : 7వ ప్రకరణం – తయమ్ముమ్, 3వ అధ్యాయం]
29వ అధ్యాయం – విశ్వాసి ఎట్టి స్థితిలోనూ అపరిశుద్ధుడు కాడు
الدليل على أن المسلم لا ينجس
210 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، قَالَ: لَقِيَنِي رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنَا جُنُبٌ فأَخَذَ بِيَدِي، فَمَشَيْتُ مَعَهُ حَتَّى قَعَدَ، فَانْسَلَلْتُ مِنْهُ وَأَتَيْتُ الرَّحْلَ فَاغْتَسَلْتُ، ثُمَّ جِئْتُ وَهُوَ قَاعِدٌ؛ فَقَالَ: أَيْنَ كُنْتَ يَا أَبَا هِرٍّ فَقُلْتُ لَهُ، فَقَالَ: سُبْحَانَ اللهِ يَا أَبَا هِرٍّ إِنَّ الْمُؤْمِنَ لاَ يَنْجُسُ
__________
أخرجه البخاري في: 5 كتاب الغسل: 24 باب الجنب يخرج ويمشي في السوق وغيره
210. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి (దారిలో) నన్ను కలిశారు. అప్పుడు నేను లైంగిక అశుద్ధావస్థకులోనై ఉన్నాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నా చేయి పట్టుకొని నడిచారు. చివరికి ఒక చోటికెళ్ళి కూర్చున్నారు. అప్పుడు నేను అక్కడ్నుంచి మెల్లిగా జారుకొని నా బసకు చేరుకున్నాను. అక్కడ స్నానం చేసి తిరిగి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చాను. అప్పటిదాక ఆయన అక్కడే కూర్చొని ఉన్నారు. ఆయన నన్ను చూడగానే “అబూహురైరా! ఎక్కడి కెళ్ళావు?” అని అడిగారు. నేను విషయం తెలియజేశాను. అప్పుడాయన “సుబ్ హానల్లాహ్ !! విశ్వాసి కూడా అపరిశుద్ధుడవుతాడా ఎక్కడైనా?” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ: 5వ ప్రకరణం – గుసుల్, 24వ అధ్యాయం]
32వ అధ్యాయం – మరుగుదొడ్డికి పోయే ముందు చేయవలసిన వేడుకోలు (దుఆ)
ما يقول إِذا أراد دخول الخلاء
211 – حديث أَنَسٍ، قَالَ: كَانَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا دَخَلَ الْخَلاَءَ، قَالَ: اللهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبُثِ وَالْخَبَائِثِ
__________
أخرجه البخاري في: 4 كتاب الوضوء: 9 باب ما يقول عند الخلاء
211. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరుగుదొడ్డికి పోయేటప్పుడు ఈ వచనాలు పఠించేవారు. “అల్లాహుమ్మ ఇన్నీ అవూజుబిక మినల్ ఖుబ్ సి వల్ ఖబాయిస్. [ఓ అల్లాహ్ నేను అపరిశుభ్రమైన స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుచున్నాను.]
[సహీహ్ బుఖారీ : 4వ ప్రకరణం – వుజూ, 9వ అధ్యాయం]
33వ అధ్యాయం – కూర్చొని కునుకుపాట్లు పడటం వల్ల వుజూకు భంగం కలగదు
الدليل على أن نوم الجالس لا ينقض الوُضوء
212 – حديث أَنَسِ بْنِ مَالِكٍ، قَال: أُقِيمَتِ الصَّلاَةُ، وَالنَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُنَاجِي رَجُلاً فِي جَانِبِ الْمَسْجِدِ، فَمَا قَامَ إِلَى الصَّلاَةِ حَتَّى نَامَ الْقَوْمُ
__________
أخرجه البخاري في: 10 كتاب الأذان: 27 باب الإمام تعرض له الحاجة بعد الإقامة
212. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఒకసారి (ఇషా నమాజు కోసం) ఇఖామత్ పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్లో ఓ మూలన ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోయారు. ఆ (సంభాషణ ముగిసిన) తరువాత ఆయన నమాజు కోసం లేచారు. అప్పటి వరకు (ఆయన) అనుచరులు కునుకుపాట్లు పడుతూనే ఉన్నారు. దైవప్రవక్తతో పాటు వారూ లేచి, తిరిగి వుజూ చేయకుండానే నమాజు చేశారు.
[సహీహ్ బుఖారీ : 10వ ప్రకరణం – అజాన్, 27వ అధ్యాయం]
—
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .