ఉపవాసాల నియమాలు | హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) 

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా

عَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ, إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا, فَلْيَصُمْهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

527. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : “మీలో ఎవ్వరూ రమజాన్ కు ముందు ఒకటి లేక రెండు ఉపవాసాలు ఉండకండి. అయితే ఎవరన్నా అంతకు ముందు నుంచి ఉపవాస వ్రతాలు పాటిస్తూ వస్తున్నట్లయితే ఆ రోజు ఉపవాసాన్ని పూర్తిచేసుకోవచ్చు.” (బుఖారీ, ముస్లిం)

وَعَنْ عَمَّارِ بْنِ يَاسِرٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { مَنْ صَامَ اَلْيَوْمَ اَلَّذِي يُشَكُّ فِيهِ فَقَدْ عَصَى أَبَا اَلْقَاسِمِ ‏- صلى الله عليه وسلم ‏-} وَذَكَرَهُ اَلْبُخَارِيُّ تَعْلِيقًا, وَوَصَلَهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

528. హజ్రత్ అమ్మార్ బిన్ యాసిర్ (రదియల్లాహు అన్హు) కథనం : “ఎవరయితే సందేహాస్పదమయిన రోజున ఉపవాసం (రోజా) పాటించాడో అతడు అబుల్ ఖాసిం (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అవిధేయత చూపాడు.”

(బుఖారీ దీనిని ‘ముఅల్లఖ్’గా పేర్కొన్నారు. ఐదుగురూ దీనిని ‘మౌసూల్’గా పరిగణించారు. కాగా; ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఇస్లామీయ షరియత్ ప్రకారం ఉపవాసాలు మొదలెట్టినా (రమజాన్) నెలవంకను చూసి మొదలెట్టాలి. ఉపవాసాలు విరమించినా (షవ్వాల్) నెలవంకను చూసి మరీ విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనిపించకపోతే ఆ మరుసటి రోజు షరియత్ పరంగా సందేహాస్పదమయిన రోజుగా భావించబడుతుంది. ఆ దినాన ఉపవాసం ఉండటం భావ్యం కాదు. ఈ సందర్భంగా ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కలపై ఆధారపడటం కూడా షరియత్ స్ఫూర్తికి విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు కూడా అనేకసార్లు నిజం కాలేదు.

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا [ قَالَ ]: سَمِعْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يَقُولُ: { إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا, وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا, فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ وَلِمُسْلِمٍ: { فَإِنْ أُغْمِيَ عَلَيْكُمْ فَاقْدُرُوا [ لَهُ ] 2‏ .‏ ثَلَاثِينَ } 3‏ .‏ وَلِلْبُخَارِيِّ: { فَأَكْمِلُوا اَلْعِدَّةَ ثَلَاثِينَ } 4‏ .‏

وَلَهُ فِي حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- { فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلَاثِينَ } 1‏ .‏

529. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించగా తాను విన్నానని హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) తెలిపారు: “నెలవంకను చూసిన మీదట మీరు ఉపవాసాలుండండి. (పండుగ కోసం) నెలవంకను చూసిన మీదట ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేయండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమయివుంటే లెక్క వేసుకోండి.” (ముత్తఫఖున్ అలైహ్).

‘ముస్లిం’లోని వాక్యం ఇలా వుంది: “ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే 30 రోజుల లెక్క కట్టండి.” బుఖారీలో ఈ విధంగా ఉంది – “మరి 30 రోజాల లెక్కను పూర్తిచేయండి.” బుఖారీలోనే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా వుంది: ‘మరి మీరు షాబాన్ నెలలోని 30 రోజులను గణించండి.’

وَعَنِ اِبْنِ عُمَرَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا قَالَ: { تَرَاءَى اَلنَّاسُ اَلْهِلَالَ, فَأَخْبَرْتُ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَنِّي رَأَيْتُهُ, فَصَامَ, وَأَمَرَ اَلنَّاسَ بِصِيَامِهِ } رَوَاهُ أَبُو دَاوُدَ, وَصَحَّحَهُ اِبْنُ حِبَّانَ, وَالْحَاكِمُ 1‏ .‏

530. హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలు నెలవంకను దర్శించసాగారు. నేను కూడా దైవప్రవక్త కు నెలవంకను చూశానని సమాచారం అందజేశాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఉపవాసం ఉండటమే గాక, ఉపవాసాలుండమని జనులను ఆజ్ఞాపించారు.”

(అబూదావూద్ దీనిని ఉల్లేఖించారు – హాకిమ్, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
ఈ హదీసులన్నింటి ద్వారా అవగతమయ్యేదేమిటంటే నెలవంకను చూసి ఉపవాసాలు మొదలెట్టాలి. నెలవంకను చూసిన మీదట ఉపవాసాలు విరమించాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ తేదీన నెలవంక కనబడకపోతే ఆ నెలను 30 రోజుల నెలగా పరిగణించాలి. అలాగే రమజాన్ నెల 29వ తేదీన నెలవంక దర్శనమివ్వకపోతే 30 రోజుల ఉపవాసాలు పూర్తిచేయాలి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉన్న కారణంగా నెలవంక కనబడక, ఆకాశం నిర్మలంగా ఉన్నచోట నెలవంక కనబడితే దీని ఆధారంగా ఆ ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాలన్నింటిలో ఉపవాస వ్రతాలు ప్రారంభించాలి. పండుగ జరుపుకునే విషయంలో కూడా ఈ విధానాన్నే అనుసరించాలి. ఒకవేళ చంద్రుడు దర్శనమిచ్చిన ప్రాంతం భౌగోళికంగా పూర్తిగా భిన్నమైనదైనపుడు దాన్ని లెక్కలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఉపవాసం ఉండటానికి నమ్మకస్థుడైన ఒక వ్యక్తి నెలవంకను చూసినట్లు సాక్ష్యమిస్తే సరిపోతుంది. కాని పండుగ జరుపుకోవటానికి మాత్రం ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం ఇవ్వాలి.

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا أَنَّ أَعْرَابِيًّا جَاءَ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: { إِنِّي رَأَيْتُ اَلْهِلَالَ, فَقَالَ: ” أَتَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اَللَّهُ? ” قَالَ: نَعَمْ.‏ قَالَ: ” أَتَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اَللَّهِ? ” قَالَ: نَعَمْ.‏ قَالَ: ” فَأَذِّنْ فِي اَلنَّاسِ يَا بِلَالُ أَنْ يَصُومُوا غَدًا” } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ وَرَجَّحَ النَّسَائِيُّ إِرْسَالَهُ 2‏ .‏

531. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం : ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి తాను నెలవంకను చూచినట్టు విన్నవించుకున్నాడు. “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని నీవు సాక్ష్యమిస్తున్నావా?” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ‘అవునన్నాడా వ్యక్తి. “ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని నీవు సాక్ష్యమిస్తున్నావా?” అని నిలదీశారు ఆ వ్యక్తిని. దానికతను ‘అవును’ అన్నాడు. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “బిలాల్! లేవండి. రేపు ప్రజల్ని ఉపవాసాలుండమని ప్రకటించండి.’

(దీనిని ఐదుగురు ఉల్లేఖించారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు – నసాయి మాత్రం దీనిని ‘ముర్సల్’ గా భావించారు)

وَعَنْ حَفْصَةَ أُمِّ اَلْمُؤْمِنِينَ رَضِيَ اَللَّهُ عَنْهَا, عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ لَمْ يُبَيِّتِ اَلصِّيَامَ قَبْلَ اَلْفَجْرِ فَلَا صِيَامَ لَهُ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَمَالَ النَّسَائِيُّ وَاَلتِّرْمِذِيُّ إِلَى تَرْجِيحِ وَقْفِهِ, وَصَحَّحَهُ مَرْفُوعًا اِبْنُ خُزَيْمَةَ وَابْنُ حِبَّانَ 1‏ .‏ وَلِلدَّارَقُطْنِيِّ: { لَا صِيَامَ لِمَنْ لَمْ يَفْرِضْهُ مِنَ اَللَّيْلِ } 2‏ .‏

532. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని ఉమ్ముల్ మోమినీన్ హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హా) తెలిపారు: “ఎవరయితే ఉషోదయానికి ముందే ఉపవాస సంకల్పం చేసుకోలేదో వారి ఉపవాసం ఉపవాసమే కాదు.”

(దీనిని ఐదుగురు ఉల్లేఖించారు ఈ హదీసు ‘మౌఖూఫ్’ అయి ఉంటుందని తిర్మిజీ, నసాయి తలపోశారు. ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ లు మాత్రం ‘మర్ఫూ’గా పరిగణించారు) దారెఖుత్నీ లోని ఉల్లేఖనంలో ఇలా వుంది: “ఎవరయితే రాత్రిపూట ఉపవాసాన్ని తన కొరకు తప్పనిసరిగా చేసుకోలేదో అతని ఉపవాసం నెరవేరదు.”

సారాంశం:
తెల్లవారకముందే ఫర్జ్ రోజాల సంకల్పం చేసుకోవటం అవసరమని ఈ హదీసు ద్వారా వెల్లడవుతోంది. సంకల్పం (నియ్యత్) సూర్యాస్తమయం మొదలుకుని ఫజ్ర్ నమాజ్ వేళ వరకూ ఎప్పుడయినా చేసుకోవచ్చు. ఉపవాసం ఒక ఆచరణ. ఆచరణలు సంకల్పంపై ఆధారపడి ఉంటాయి గనక రోజా (ఉపవాసం) అనే ఆచరణ కోసం కూడా సంకల్పం అనివార్యం. ప్రతిరోజూ ఉపవాసానికి ముందు సంకల్పం అవసరమవుతుంది. అయితే సంకల్పం కోసం ప్రత్యేకంగా నోటితో పలకవలసిన అవసరం లేదు. మనసులో దీక్ష బూనితే సరిపోతుంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)గానీ, ప్రియ సహచరులు (రదియల్లాహు అన్హు) గానీ సంకల్ప వచనాలు నోటితో పలికిన దాఖలాలేమీ లేవు.

హదీసు ఉల్లేఖకులు:
హఫ్సా బిన్తె ఉమర్ బిన్ ఖత్తాబ్(రదియల్లాహు అన్హా). మొదట ఈమె ఖునైస్ బిన్ హుజాఫా సహ్ మీ నికాహ్ లో ఉన్నారు. బద్ర్ యుద్ధ సందర్భంగా ఈయన మరణించారు. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను నికాహ్ చేసుకుని తన దాంపత్య జీవితంలోనికి తెచ్చుకున్నారు. ఇది హిజ్రీ 3వ సంవత్సరంలో జరిగిన సంఘటన. ఈమె 60 ఏళ్ల వయస్సులో – హిజ్రీ 45వ సంవత్సరంలో మరణించారు.

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { دَخَلَ عَلَيَّ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-ذَاتَ يَوْمٍ.‏ فَقَالَ: ” هَلْ عِنْدَكُمْ شَيْءٌ? ” قُلْنَا: لَا.‏ قَالَ: ” فَإِنِّي إِذًا صَائِمٌ ” ثُمَّ أَتَانَا يَوْمًا آخَرَ, فَقُلْنَا: أُهْدِيَ لَنَا حَيْسٌ, فَقَالَ: ” أَرِينِيهِ, فَلَقَدْ أَصْبَحْتُ صَائِمًا ” فَأَكَلَ } رَوَاهُ مُسْلِمٌ 1‏ .‏

533. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : ఒకనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా వద్దకు వచ్చి, “మీ దగ్గర (తినడానికి) ఏ వస్తువు అయినా ఉందా?” అని అడిగారు. ‘లేదు’ అని మేము సమాధానమిచ్చాము. “అలాగైతే నేను (ఈ రోజు) ఉపవాసం ఉంటాను” అన్నారు. అలాగే మరో రోజు ఆయన వచ్చినపుడు ‘(ఎక్కడినుంచో) పాయసం కానుకగా పంపబడింది’ అని మేము చెప్పాము. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “ఏదీ నాకు చూపెట్టండి, పొద్దున్నుంచి నేను ఉపవాసం ఉన్నాను” అని అన్నారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పాయసం ఆరగించారు. (ముస్లిం)

సారాంశం:
ఇది నఫిల్ ఉపవాసాలకు సంబంధించినదేగాని, రమజాన్ మాసంలో పాటించే ఫర్జ్ ఉపవాసాల వ్యవహారం కాదు. నఫిల్ ఉపవాసాల సంకల్పం తెల్లవారక మునుపే చేసుకోవలసిన అవసరం లేదు. సూర్యోదయం తరువాత కూడా ఈ సంకల్పం చేయవచ్చు. నలుగురు ఇమాములలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు, నఫిల్ ఉపవాసం కోసం కూడా తెల్లవారక ముందే సంకల్పం అవశ్యమని భావిస్తున్నారు. కాని హదీసులో ఈ మేరకు ఎలాంటి ఆంక్ష లేదు.

నఫిల్ ఉపవాసాలు అకారణంగా కూడా – మధ్యాంతరంలో – విరమించవచ్చని ఈ హదీసు ద్వారా తేటతెల్లమవుతోంది. ముగ్గురు ఇమాముల (ఇమామ్ మాలిక్, ఇమామ్ షాఫయి, ఇమామ్ అహ్మద్)తో పాటు పెక్కుమంది ధర్మవేత్తలు దీంతో ఏకీభవించారు. కాని ఇమామ్ అబూ హనీఫా (రహిమహుల్లాహ్) దృష్టిలో అకారణంగా రోజాను మధ్యలో విరమించటం ధర్మసమ్మతం కాదు. ఎవరయినా విందుకు ఆహ్వానిస్తేనే నఫిల్ ఉపవాసాన్ని విరమించవచ్చనీ, వేరితర కారణాలపై విరమించరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

وَعَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا, أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { لَا يَزَالُ اَلنَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا اَلْفِطْرَ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

وَلِلتِّرْمِذِيِّ: مِنْ حَدِيثِ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { قَالَ اَللَّهُ عَزَّ وَجَلَّ أَحَبُّ عِبَادِي إِلَيَّ أَعْجَلُهُمْ فِطْرًا } 1‏ .‏

534. హజ్రత్ సహ్ల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు – “ప్రజలు ఉపవాసాన్ని విరమించటం (ఇఫ్తార్ చేయటం)లో శీఘ్రత కనబరచినంత కాలం క్షేమంగా ఉంటారు.” (ముస్లిం)

తిర్మిజీలో హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం ఈ విధంగా ఉంది: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు “నా దాసులలో ఇఫ్తార్ కొరకు త్వరపడేవారే నాకు అత్యంత ప్రియతములు” అని అల్లాహ్ సెలవిచ్చాడు.

సారాంశం:
సూర్యాస్తమయం అయిందని ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయిన తరువాత అనవసరంగా కాలయాపన చేయకుండా తొందరగా- ఇఫ్తార్ చేసుకోవాలి. ఆలస్యంగా ఇఫ్తార్ చేయటం యూదుల, క్రైస్తవుల పద్ధతి, కనుక మనం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనానుసారం ఇఫ్తార్ కొరకు వేగిరపడాలి. కాస్త ఆలస్యంగా ఇఫ్తార్ చేస్తే ఎక్కువ పుణ్యం దక్కుతుందనుకొని- ఉద్దేశ్యపూర్వకంగా – ఆలస్యం చేయటం బిద్అత్ క్రిందికి వస్తుంది.

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ تَسَحَّرُوا فَإِنَّ فِي اَلسَّحُورِ بَرَكَةً } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

535. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు- “సహరీని భుజించండి. ఎందుకంటే అందులో ఎంతో శుభం ఉంది.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:
సహరీ తినవలసిన ఆవశ్యకతను ఈ హదీసు సూచిస్తోంది. ఎందుకంటే యూదులు, క్రైస్తవులు సహరీ ఏర్పాట్లు చేసుకోరు. వారికీ – మనకూ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. సహరీ భుజించటం వల్ల ఉపవాసి నిస్సత్తువకు, నీరసానికి గురికాకుండా ఉంటాడు.

وَعَنْ سَلْمَانَ بْنِ عَامِرٍ اَلضَّبِّيِّ ‏- رضى الله عنه ‏- عَنِ اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { إِذَا أَفْطَرَ أَحَدُكُمْ فَلْيُفْطِرْ عَلَى تَمْرٍ, فَإِنْ لَمْ يَجِدْ فَلْيُفْطِرْ عَلَى مَاءٍ, فَإِنَّهُ طَهُورٌ } رَوَاهُ اَلْخَمْسَةُ, وَصَحَّحَهُ اِبْنُ خُزَيْمَةَ وَابْنُ حِبَّانَ وَالْحَاكِمُ 1‏ .‏

536. హజ్రత్ సల్మాన్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “మీలో ఎవరయినా ఉపవాసాన్ని విరమించేటప్పుడు ఖర్జూరంతో ఇఫ్తార్ చేయాలి. ఖర్జూరం గనక లభ్యం కాక పోతే మంచి నీరుతో ఇఫ్తార్ చేయండి. ఎందుకంటే అది పరిశుద్ధమైనది.”

(దీనిని ఐదుగురూ ఉల్లేఖించారు – ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ దీనిని ప్రామాణికంగా ఖరారు చేశారు)

సారాంశం:
వీలయినంతవరకు ఖర్జూర పండ్లతో ఇఫ్తార్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఖర్జూరం జీర్ణకోశానికి శక్తినీ, పుష్ఠినీ సమకూరుస్తుంది. పగలల్లా ఉపవాసం ఉండటం వలన కలిగిన బలహీనతను అది చాలా వరకు దూరం చేస్తుంది. ఒకవేళ ఖర్జూరం గనక దొరక్కపోతే మంచినీళ్ళతోనే ఉపవాసాన్ని విరమించాలి. పండ్లు దొరక్కపోతే ఎండు ఖర్జూరంతోనే ఇఫ్తార్ చేయాలి. అదీ లభ్యం కాని పరిస్థితిలో మంచినీరు త్రాగాలి.

హదీసు ఉల్లేఖకులు:
సల్మాన్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) పూర్తి వంశపరంపర ఇలా ఉంది: సల్మాన్ బిన్ ఆమిర్ బిన్ ఔస్ బిన్ హుజ్ర్ బిన్ అమ్ర్ బిన్ హారిస్ జబ్బి. ప్రఖ్యాత సహచరులు. బస్రాలో స్థిరపడ్డారు. దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోనే వృద్ధ సహాబీలలో ఒకరుగా పేరుపడ్డారు. ముఆవియ పరిపాలనా కాలం వరకూ బ్రతికి ఉన్నారని ప్రతీతి. మరో కథనం ప్రకారం జమల్ యుద్ధంలో అమరగతి నొందారు. అప్పటికి ఆయనకు నూరేళ్ళు నిండాయి.

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { نَهَى رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-عَنِ اَلْوِصَالِ, فَقَالَ رَجُلٌ مِنَ اَلْمُسْلِمِينَ: فَإِنَّكَ يَا رَسُولَ اَللَّهِ تُوَاصِلُ? قَالَ: ” وَأَيُّكُمْ مِثْلِي? إِنِّي أَبِيتُ يُطْعِمُنِي رَبِّي وَيَسْقِينِي “.‏ فَلَمَّا أَبَوْا أَنْ يَنْتَهُوا عَنِ اَلْوِصَالِ وَاصَلَ بِهِمْ يَوْمًا, ثُمَّ يَوْمًا, ثُمَّ رَأَوُا اَلْهِلَالَ, فَقَالَ: ” لَوْ تَأَخَّرَ اَلْهِلَالُ لَزِدْتُكُمْ ” كَالْمُنَكِّلِ لَهُمْ حِينَ أَبَوْا أَنْ يَنْتَهُوا } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

537. హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘విసాల్ ‘ను (నిరంతరం ఎడతెగకుండా ఉపవాసముండటాన్ని) వారించారు. ‘దైవప్రవక్తా! మరి తమరు ఎడతెగకుండా ఉపవాసాలుంటున్నారు కదా!’ అని ముస్లింలలోని ఒక వ్యక్తి ప్రశ్నించగా; “మీలో నా లాంటి వారెవరు న్నారు? నేను రాత్రి నా ప్రభువు సమక్షం లో గడుపుతాను. ఆయన నాకు తినిపిస్తాడు, త్రాగిస్తాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. ఎంతకీ ప్రజలు వినకపోవటంతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలసి ఒక రోజు, రెండవ రోజు కూడా ఎడతెగని ఉపవాసం (విసాల్) మొదలెట్టారు. ఆనాడు నెలవంక కనిపించటంతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరుల నుద్దేశ్యించి, “ఈ రోజు నెలవంక దర్శనమివ్వ బట్టి సరిపోయింది. లేకుంటే మీ కోసం మరిన్ని రోజులు ‘విసాల్ చేసేవాణ్ణి” అని అన్నారు. అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రియసహచరులు తన మాటను లెక్క చేయనందుకు వారిని శిక్షించదలిచారన్న మాట! (బుఖారీ, ముస్లిం)

సారాంశం
‘విసాల్’ అవాంఛనీయం అని హదీసులో చెప్పబడింది. విసాల్ అంటే ఏమీ తినకుండా, త్రాగకుండా నిరంతరం ఉపవాసాలుండటం అని అర్థం. ఇలాంటి అతివాదాన్ని ఇస్లాం ఇష్టపడదు. అల్లాహ్ తన దాసులను కష్టాల్లో పడవేయదలచుకోడు. అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారం ప్రత్యేకమైనది. దైవసన్నిధిలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసే ధ్యానం వల్ల ఇతోధిక శక్తి ఆయనకు లభించేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉపవాసాలను గమనించిన సహచరులు, తాము కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న తపనతో నిరంతర ఉపవాసాలు ఆరంభించారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులను గట్టిగా వారించారు. అప్పటికీ వారు వెనుకాడకపోవటంతో, వారిని దండించే ఉద్దేశ్యంతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా వారితో పాటే ఉపవాస దీక్ష మొదలెట్టారు. అంతలోనే నెలవంక దర్శనమిచ్చింది. ‘చంద్రుడు కనిపించకుండా ఉంటే ఈ దీక్షను మరింత సుదీర్ఘం చేసి ఉండేవాడిని. అప్పటికిగాని మీకు బోధపడేది కాదు” అని చురక అంటించారు.

وَعَنْهُ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ لَمْ يَدَعْ قَوْلَ اَلزُّورِ وَالْعَمَلَ بِهِ, وَالْجَهْلَ, فَلَيْسَ لِلَّهِ حَاجَةٌ فِي أَنْ يَدَعَ طَعَامَهُ وَشَرَابَهُ } رَوَاهُ اَلْبُخَارِيُّ, وَأَبُو دَاوُدَ وَاللَّفْظُ لَهُ 1‏ .‏

538. హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రబోధించారు: “ఎవరయితే అబద్ధం చెప్పటం, అబద్ధంపై ఆచరించటం విడనాడలేదో, మూర్ఖత్వపు ధోరణిని వదలలేదో అతడు అన్నపానీయాలను పరిత్యజించటంపట్ల అల్లాహ్ కు ఏ మాత్రం ఆసక్తి లేదు”.

(బుఖారీ, అబూదావూద్ హదీసు వాక్యాలు మాత్రం అబూదావూద్ లోనివి)

సారాంశం:
ఉపవాసి అనేవాడు అబద్ధాన్ని, బూటకపు ప్రేలాపనలను, మూర్ఖత్వపు చేష్టలను పూర్తిగా విడనాడాలని ఈ హదీసు చెబుతోంది. అసత్య ప్రకటనలవల్ల, వ్యర్థ ప్రేలాపనలవల్ల ఉపవాసం లోని ఆధ్యాత్మికత హరించుకుపోతుంది. అందుకే ఉపవాస దీక్షకు పూనుకున్న వ్యక్తి నీతిబాహ్య మైన విధానాలకు, అనర్థదాయకమైన పోకడలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఉపవాసం ద్వారా అల్లాహ్ తన దాసులలో దైవభీతిని, సాత్వికతను, ఆత్మ నిగ్రహాన్ని పెంపొందించగోర్తున్నాడు. అబద్ధం, దగా, మోసం, అవినీతి, అరాచకం వంటి చెడుల నుంచి కాపాడదలుస్తున్నాడు. ఈ లక్ష్యాలే గనక ఉపవాస వ్రతం ద్వారా అతనికి ప్రాప్తించకపోతే పొద్దస్తమానం అతడు ఆకలి దప్పులతో బాధపడి ప్రయోజనం ఏమీలేదు.

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا قَالَتْ: { كَانَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-يُقَبِّلُ وَهُوَ صَائِمٌ, وَيُبَاشِرُ وَهُوَ صَائِمٌ, وَلَكِنَّهُ أَمْلَكُكُمْ لِإِرْبِهِ } مُتَّفَقٌ عَلَيْهِ, وَاللَّفْظُ لِمُسْلِمٍ 1‏ .‏ وَزَادَ فِي رِوَايَةٍ: { فِي رَمَضَانَ } 2‏ .‏

539. హజ్రత్ ఆయిషా తెలిపారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపవాస స్థితిలో తన భార్యను ముద్దు పెట్టుకునేవారు, కౌగిలించుకునే వారు. అయితే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మీకన్నా అధికంగా తన పై పూర్తి అదుపు, నిగ్రహం ఉండేవి.

(బుఖారీ, ముస్లిం – ఈ వాక్యాలు మాత్రం ముస్లింలోనివి) ‘ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రెండు పనులనూ రమజాన్ నెలలో చేసేవార’ని వేరొక ఉల్లేఖ నంలో ఉంది.

وَعَنِ اِبْنِ عَبَّاسٍ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِحْتَجَمَ وَهُوَ مُحْرِمٌ, وَاحْتَجَمَ وَهُوَ صَائِمٌ } رَوَاهُ اَلْبُخَارِيُّ 1‏ .‏

540. హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కట్టుకుని ఉన్న ప్పుడు, ఉపవాసస్థితిలో ఉన్నప్పుడు (కూడా) శరీరానికి సూది గుచ్చుకున్నారు (అంటే చెడు రక్తాన్ని తీశారు). (బుఖారీ)

సారాంశం:
సూది గుచ్చటంవల్ల (శస్త్ర చికిత్స వల్ల, శరీరంలో ఎక్కడైనా పేరుకుని ఉన్న చెడు రక్తాన్ని, చీము నెత్తురును తొలగించటం వల్ల) ఉపవాసానికిగానీ, ఇహ్రామ్ దీక్షకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లదని ఈ హదీసు వల్ల స్పష్టమవుతున్నది. అయితే ఈ సాహసానికి పూనుకునే ముందు ఉపవాసులు తమలో గల శక్తినీ, ఓపికను సరిగ్గా బేరీజు వేసుకోవాలి. నీరసంవల్ల ఉపవాసం భంగమయ్యే ప్రమాదముంటే దాని జోలికి పోకూడదు.

وَعَنْ شَدَّادِ بْنِ أَوْسٍ ‏- رضى الله عنه ‏- { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-أَتَى عَلَى رَجُلٍ بِالْبَقِيعِ وَهُوَ يَحْتَجِمُ فِي رَمَضَانَ.‏ فَقَالَ: ” أَفْطَرَ اَلْحَاجِمُ [ وَالْمَحْجُومُ ] ” } رَوَاهُ اَلْخَمْسَةُ إِلَّا اَلتِّرْمِذِيَّ, وَصَحَّحَهُ أَحْمَدُ, وَابْنُ خُزَيْمَةَ, وَابْنُ حِبَّانَ 1‏ .‏

541. హజ్రత్ షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘బఖీ’లో ఒక వ్యక్తిని సమీపించారు. అతడు రమజాన్ (నెల)లో శరీరం నుంచి రక్తం తీస్తున్నాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి చూచి, ‘శరీరానికి సూదులు పొడిచే, పొడిపించుకునే వారిద్దరి ఉప వాసం భంగమైనట్లే’ అని అన్నారు.

(‘ఐదుగురి’లో తిర్మిజీ తప్ప మిగిలినవారు దీనిని ఉల్లేఖించారు. అహ్మద్, ఇబ్నె ఖుజైమ, ఇబ్నె హిబ్బాన్ దీనిని ప్రామాణికమైన హదీసుగా ఖరారు చేశారు)

సారాంశం:
ఈ హదీసు రద్దయిపోయిందని ఒక ఉల్లేఖనం ఆధారంగా తెలుస్తోంది. రాబోయే హదీసులలో ఏమనబడిందో గమనించండి.

హదీసు ఉల్లేఖకులు:
అసలు పేరు షద్దాద్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు). మారు పేరు అబూ యాల. అన్సార్ వర్గానికి చెందిన వారు. మదీనా వాస్తవ్యులు. హజ్రత్ హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)కు భ్రాతృజులు. జ్ఞాన సంపన్నులు. మృదు స్వభావులు. హిజ్రీ 58 లో సిరియాలో మరణించారు. అప్పటికి ఆయనకు 75 ఏండ్లు.

وَعَنْ أَنَسِ بْنِ مَالِكٍ ‏- رضى الله عنه ‏- قَالَ: { أَوَّلُ مَا كُرِهَتِ اَلْحِجَامَةُ لِلصَّائِمِ; أَنَّ جَعْفَرَ بْنَ أَبِي طَالِبٍ اِحْتَجَمَ وَهُوَ صَائِمٌ, فَمَرَّ بِهِ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: ” أَفْطَرَ هَذَانِ “, ثُمَّ رَخَّصَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بَعْدُ فِي اَلْحِجَامَةِ لِلصَّائِمِ, وَكَانَ أَنَسٌ يَحْتَجِمُ وَهُوَ صَائِمٌ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ وَقَوَّاهُ 1‏ .‏

542. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: అన్నిటికన్నా ముందు ఉపవాసికి శరీరానికి సూది పొడుచుకోవటం ఎందుకు అయిష్టకరంగా భావించబడిందంటే జాఫర్ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉపవాసస్థితిలో సూది పొడిపించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన వైపునుంచి వెళుతూ, “వీరిరువురి ఉపవాసం భంగమైపోయింది” అని అన్నారు. తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఉపవాసి సూది పొడిపించుకు నేందుకు అనుమతినిచ్చారు. ఉపవాస స్థితిలో అనస్ (రదియల్లాహు అన్హు) కూడా సూది పొడిపించుకునే వారు.

(దారె ఖుత్నీ దీనిని ఉల్లేఖించడం తోపాటు దృఢమైన హదీసుగా నిర్థారించారు)

సారాంశం:
సూది గుచ్చటంవల్ల ఉపవాసం భంగమైపోతుందన్న హదీసు రద్దయిపోయిందనటానికి ఈ హదీసు ప్రబలనిదర్శనం.

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا, { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-اِكْتَحَلَ فِي رَمَضَانَ, وَهُوَ صَائِمٌ } رَوَاهُ اِبْنُ مَاجَهْ بِإِسْنَادٍ ضَعِيفٍ 1‏ .‏ قَالَ اَلتِّرْمِذِيُّ: لَا يَصِحُّ فِيهِ شَيْءٌ 2‏ .‏

543. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రమజాన్ నెలలో – ఉపవాస స్థితిలో-‘సుర్మా’ పెట్టుకున్నారు. (దీనిని ఇబ్నెమాజ వివరించారు. ఈ విషయంలో ఏ ఒక్క హదీసు కూడా ప్రామాణికమైనది లేదని ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) అన్నారు)

సారాంశం:
కళ్లకు సుర్మా పెట్టుకునే విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఇమామ్ అహ్మద్, ఇస్ హాఖ్, ఇబ్నె ముబారక్, సుఫియాన్ సౌరీ ప్రభృతులు ఉపవాస స్థితిలో సుర్మా పెట్టుకోవటాన్ని అయిష్టకరం (మక్రూహ్) గా భావించారని ఇమామ్ తిర్మిజీ (రహిమహుల్లాహ్) ప్రస్తావించారు. అయితే ఇమామ్ షాఫయి ఇందుకు అనుమతించారు. అత్యధికమంది ధర్మవేత్తలు కూడా దీన్ని సమర్థించారు.

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ نَسِيَ وَهُوَ صَائِمٌ, فَأَكَلَ أَوْ شَرِبَ, فَلْيُتِمَّ صَوْمَهُ, فَإِنَّمَا أَطْعَمَهُ اَللَّهُ وَسَقَاهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

وَلِلْحَاكِمِ: { مَنْ أَفْطَرَ فِي رَمَضَانَ نَاسِيًا فَلَا قَضَاءَ عَلَيْهِ وَلَا كَفَّارَةَ } وَهُوَ صَحِيحٌ 1‏ .‏

544. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు – “ఏ ఉపవాసి అయినా మరచిపోయి ఏదన్నా తిన్నా, త్రాగినా (ఫరవాలేదు) అతడు తన ఉపవాసాన్ని కొనసాగించాలి. ఎందుకంటే అతనికి అల్లాహ్ తినిపించాడు, త్రాపాడు.” (బుఖారీ, ముస్లిం)

“ఒకవేళ ఎవరయినా మరచిపోయి రమజాన్ ఉపవాసాన్ని విరమిస్తే అతనిపై ‘ఖజా’గానీ, కఫ్ఫారా (పరిహారం) గానీ లేదు” అని ఇమామ్ హాకిమ్ ద్వారా ఉల్లేఖించబడింది. (ఈ హదీసు ప్రామాణికమైనది)

وَعَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-{ مَنْ ذَرَعَهُ اَلْقَيْءُ فَلَا قَضَاءَ عَلَيْهِ, وَمَنْ اسْتَقَاءَ فَعَلَيْهِ اَلْقَضَاءُ } رَوَاهُ اَلْخَمْسَةُ 1‏ .‏ وَأَعَلَّهُ أَحْمَدُ 2‏ .‏ وَقَوَّاهُ اَلدَّارَقُطْنِيُّ 3‏ .‏

545. హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా చెప్పారు – “అప్రయత్నంగా వాంతి అయిన వ్యక్తి ఉపవాసాన్ని తిరిగి పాటించనవసరం లేదు. అయితే ఉద్దేశ్య పూర్వకంగా వాంతి చేసినవాడు ఉప వాసాన్ని ‘ఖజా’ చేయాలి (అంటే తిరిగి ఉపవాసం పాటించాలి).”

(దీనిని ఐదుగురు ఉల్లేఖించారు ఇమామ్ అహ్మద్ దీనిని ‘మాలూల్'(లోపభూయిష్టమైనది) గా ఖరారు చేశారు. ఇమామ్ దారె ఖుత్నీ మాత్రం ఈ హదీసును ‘దృఢమైనది’గా వ్యాఖ్యానించారు)

సారాంశం:
ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), ఇమామ్ బుఖారీ (రహిమహుల్లాహ్) తదితరులు ఈ హదీసును ‘మాలూల్’గా అంటే, లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు. అయితే ఇమామ్ దారె ఖుత్నీ, ఇమామ్ ఇబ్నె హిబ్బాన్, ఇమామ్ హాకిమ్లు దీనిని ‘సహీహ్ హదీసు’గా ఖరారు చేశారు. హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు), ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు), జైద్ బిన్ అర్ఖం (రదియల్లాహు అన్హు), మరియు పలువురు ఇస్లామీయ విద్వాంసులు కూడా ఈ ఉల్లేఖనానికి అనుకూలంగా స్పందించారు. అంటే – ఉద్దేశ్యపూర్వకంగా వాంతిచేస్తేనే ఉపవాసం భంగమవుతుందని అభిప్రాయపడ్డారు. పైగా ఈ అంశంపై ధర్మవేత్తల మధ్య ఏకాభిప్రాయం ఉండేదని ఇమామ్ ఇబ్నె ముంజిర్ దావా చేశారు.

وَعَنْ جَابِرِ بْنِ عَبْدِ اَللَّهِ رَضِيَ اَللَّهُ عَنْهُمَا; { أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-خَرَجَ عَامَ اَلْفَتْحِ إِلَى مَكَّةَ فِي رَمَضَانَ, فَصَامَ حَتَّى بَلَغَ كُرَاعَ الْغَمِيمِ, فَصَامَ اَلنَّاسُ, ثُمَّ دَعَا بِقَدَحٍ مِنْ مَاءٍ فَرَفَعَهُ, حَتَّى نَظَرَ اَلنَّاسُ إِلَيْهِ, ثُمَّ شَرِبَ, فَقِيلَ لَهُ بَعْدَ ذَلِكَ: إِنَّ بَعْضَ اَلنَّاسِ قَدْ صَامَ.‏ قَالَ: “أُولَئِكَ اَلْعُصَاةُ, أُولَئِكَ اَلْعُصَاةُ” } 1‏ .‏

فِي لَفْظٍ: { فَقِيلَ لَهُ: إِنَّ اَلنَّاسَ قَدْ شَقَّ عَلَيْهِمُ اَلصِّيَامُ, وَإِنَّمَا يَنْظُرُونَ فِيمَا فَعَلْتَ، فَدَعَا بِقَدَحٍ مِنْ مَاءٍ بَعْدَ اَلْعَصْرِ، فَشَرِبَ } رَوَاهُ مُسْلِمٌ 1‏ .‏

546. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం : మక్కాను జయించిన సంవత్సరం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మక్కా వైపునకు రమజాన్ మాసంలో బయలుదేరారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం కూడా పాటిస్తున్నారు. కడకు ఆయన ‘కురా అల్ – ఘమీమ్’ స్థలానికి చేరుకున్నారు. ఆ రోజు సహచరులు కూడా ఉపవాసం ఉన్నారు. ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) మంచినీళ్ల చెంబు తెప్పించారు. చెంబు అందరికీ కనబడేలా పైకి ఎత్తారు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మంచినీరు త్రాగారు. కొంత మంది ఇప్పటికీ ఉపవాసం ఉన్నారని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలియజేయగా; “అవిధేయులు వీరే, అవిధేయులు వీరే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.

వేరొక హదీసు ఇలా వుంది: “నిశ్చయంగా జనులను ఉపవాసం బాధపెడుతోంది. మీరేం చేస్తారోనని ఎదురు చూస్తుండటం తప్ప వాళ్లు చేయగలిగిందేమీ లేదు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)తో విన్న వించుకోగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్ర్ (నమాజ్) అనంతరం మంచినీళ్ల చెంబు తెప్పించి త్రాగారు. (ముస్లిమ్)

وَعَنْ حَمْزَةَ بْنِ عَمْرٍو الْأَسْلَمِيِّ رِضَى اَللَّهُ عَنْهُ; أَنَّهُ قَالَ: { يَا رَسُولَ اَللَّهِ! أَجِدُ بِي قُوَّةً عَلَى اَلصِّيَامِ فِي اَلسَّفَرِ, فَهَلْ عَلَيَّ جُنَاحٌ? فَقَالَ رَسُولُ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏- ” هِيَ رُخْصَةٌ مِنَ اَللَّهِ, فَمَنْ أَخَذَ بِهَا فَحَسَنٌ, وَمَنْ أَحَبَّ أَنْ يَصُومَ فَلَا جُنَاحَ عَلَيْهِ “ } رَوَاهُ مُسْلِمٌ 1‏ .‏

وَأَصْلُهُ فِي ” اَلْمُتَّفَقِِ ” مِنْ حَدِيثِ عَائِشَةَ; { أَنَّ حَمْزَةَ بْنَ عَمْرٍو سَأَلَ1

547. హజ్రత్ హమ్జా బిన్ అమ్ర్ అస్లమీ (రదియల్లాహు అన్హు) కథనం : ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో ఇలా అన్నారు – “నాకు ప్రయాణంలో సయితం ఉపవాసం పాటించగల శక్తి ఉంది. (ఒకవేళ నేను’రోజా’ ఉంటే) ఇది అభ్యంతరకరమా?” దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “ఇది వాస్తవానికి అల్లాహ్ తరఫున ఇవ్వబడిన రాయితీ. ఎవరైనా దాన్ని వినియోగించుకుంటే అది వారికే మేలు. ఒకవేళ ఎవరయినా ఉపవాసమే ఉండదలిస్తే అందులో ఆక్షేపణీయం ఏమీ లేదు. అని అన్నారు”.

(ముస్లిం – హదీసు దానికి మూలం మాత్రం హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) గారి ముత్తఫకున్ అలైహ్ హదీసులో ఇలా ఉంది: ‘హమ్జా బిన్ అమ్ర్ ప్రశ్నించారు.’)

హదీసు ఉల్లేఖకులు:
హమ్జా బిన్ అమ్ర్ అస్లమీ (రదియల్లాహు అన్హు). హిజాజ్ ప్రాంతానికి చెందిన సహాబీ. మారు పేరు అబూ సాలిహ్ లేక అబూ ముహమ్మద్. ఈయన కుమారుడు మరియు ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హా) ఈయన గారినుంచి హదీసులను ఉల్లేఖించేవారు. హిజ్రీ 61లో ఈయన – 80 ఏళ్ల వయస్సులో- కన్ను మూశారు.

وَعَنِ اِبْنِ عَبَّاسٍ ‏-رَضِيَ اَللَّهُ عَنْهُمَا‏- قَالَ: { رُخِّصَ لِلشَّيْخِ اَلْكَبِيرِ أَنْ يُفْطِرَ, وَيُطْعِمَ عَنْ كُلِّ يَوْمٍ مِسْكِينًا, وَلَا قَضَاءَ عَلَيْهِ } رَوَاهُ اَلدَّارَقُطْنِيُّ, وَالْحَاكِمُ, وَصَحَّحَاهُ 1‏ .‏

548. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం : “వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇఫ్తార్ చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. (అయితే) వారు ఒక్కో ఉపవాసానికి బదులుగా ఒక్కో పేద వానికి అన్నం పెట్టాలి. ఇంకా వారు ఉపవాసాన్ని ‘ఖజా’ చేయవలసిన అవసరం కూడా లేదు.

(దారె ఖుత్నీ, హాకిమ్ ఈ హదీసును ఉల్లేఖించటమేగాక, ప్రామాణికమైనదిగా ధృవీకరించారు)

సారాంశం:
వార్ధక్యానికి చేరి, శరీరంలోని జవసత్వాలు ఉడిగిపోయినవారు, ఉపవాసం పాటించటంవల్ల కోలుకోలేమన్న భయం ఉంటే వారు ఉపవాసాలు పాటించనవసరం లేదు. అలాగే సుదీర్ఘ వ్యాధికి గురై స్వస్థత చేకూరే ఆశను వదలుకున్నవారు కూడా ‘రోజా’ పాటించనక్కరలేదు. అయితే ఇలాంటి వారు – తమకు అల్లాహ్ తరఫు నుండి లభించిన ఈ మినహాయింపుకు బదులుగా – ఒక పేదవానికి ‘ఫిదియా’ గా భోజనం చేయించాలి. 30 మంది పేదలకు ఒకేసారి అన్నం పెట్టినా సరిపోతుంది. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ముసలివారైపోయినపుడు భోజనం తయారు చేయించి 30 మంది బీదవారికి తినిపించారు. ఒక ఉపవాసానికి బదులుగా కనీసం అర్థ ‘సా’ గోధుమలు కూడా ఇవ్వవచ్చని ఒక ఉల్లేఖనం ప్రకారం తెలుస్తున్నది.

గర్భవతి మరియు బాలింత కూడా ఉపవాసం పాటించగలిగే స్థితిలో లేకుంటే ఇలాగే ఫిదియా చెల్లించాలని హజ్రత్ ఇబ్న్ అబ్బాస్, ఇబ్నె ఉమర్ పేర్కొన్నారు.

పేదవారికి అన్నం పెట్టే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మెజారిటీ విద్వాంసులు ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇమామ్ మాలిక్ గారు దీనిని వాంఛనీయంగా ఖరారు చేశారు. అన్నం పెట్టవలసిన అవసరం లేదనీ, దానం చేస్తే సరిపోతుందని మరి కొంతమంది అభిప్రాయపడ్డారు.

وَعَنْ أَبِي هُرَيْرَةَ ‏- رضى الله عنه ‏- قَالَ: { جَاءَ رَجُلٌ إِلَى اَلنَّبِيِّ ‏- صلى الله عليه وسلم ‏-فَقَالَ: هَلَكْتُ يَا رَسُولَ اَللَّهِ.‏ قَالَ: ” وَمَا أَهْلَكَكَ ? ” قَالَ: وَقَعْتُ عَلَى اِمْرَأَتِي فِي رَمَضَانَ، فَقَالَ: ” هَلْ تَجِدُ مَا تَعْتِقُ رَقَبَةً? ” قَالَ: لَا.‏ قَالَ: ” فَهَلْ تَسْتَطِيعُ أَنْ تَصُومَ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ? ” قَالَ: لَا.‏ قَالَ: ” فَهَلْ تَجِدُ مَا تُطْعِمُ سِتِّينَ مِسْكِينًا? ” قَالَ: لَا, ثُمَّ جَلَسَ, فَأُتِي اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-بِعَرَقٍ فِيهِ تَمْرٌ.‏ فَقَالَ: ” تَصَدَّقْ بِهَذَا “, فَقَالَ: أَعَلَى أَفْقَرَ مِنَّا? فَمَا بَيْنَ لَابَتَيْهَا أَهْلُ بَيْتٍ أَحْوَجُ إِلَيْهِ مِنَّا, فَضَحِكَ اَلنَّبِيُّ ‏- صلى الله عليه وسلم ‏-حَتَّى بَدَتْ أَنْيَابُهُ، ثُمَّ قَالَ: “اذْهَبْ فَأَطْعِمْهُ أَهْلَكَ ” } رَوَاهُ اَلسَّبْعَةُ, وَاللَّفْظُ لِمُسْلِمٍ 1‏ .‏

549. హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సన్నిధిలోకి వచ్చి, ‘దైవ ప్రవక్తా! ‘నేను నాశనమైపోయాను’ అని మొత్తుకున్నాడు. “ఎలా నాశన మయ్యావో చెప్పావు కాదు” అని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. ‘ఏం చెప్పమంటారు? నేను రమజాన్ (ఉపవాస స్థితిలో) ఇల్లాలితో సంభోగించాను’ అన్నాడు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒక మెడను (బానిసను) విడిపించే తాహతు నీకుందా?” అని అడిగారు. ‘లేదు’ అన్నాడా వ్యక్తి. “పోనీ నువ్వు రెండు మాసాలు నిరంతరం ఉప వాసాలు పాటించగలవా?” అని అడిగారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం). ‘ఇదీ నావల్ల కాదు’ అన్నాడతను. “పోనీ 60 మంది అభాగ్యులకు అన్నంపెట్టే స్థోమత నీకుందా?’ అని ప్రశ్నించారాయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘లేదు’ అన్నాడతను. మరి అతను అలాగే కూర్చుని ఉన్నాడు. అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు ఒక తట్ట తేబడింది. అందులో ఖర్జూర పండ్లు ఉన్నాయి. “సరే. వీటిని దానంగా ఇవ్వు” అని చెప్పారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం). ‘ఏమిటి, నాకన్నా అభాగ్యునికి దానం చేయమంటారా? ఈ పురము (మదీనా)లోని రెండు పర్వత లోయల మధ్య నన్ను మించిన దరిద్రుడు ఎవడూ లేడు’ అని విన్నవించుకున్నాడా వ్యక్తి. ఇది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెద్దగా నవ్వేశారు. ఆ సమయంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దంతాలు కూడా కనిపించసాగాయి. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : “వెళ్లు, వెళ్లి వీటిని నీ ఇంటివారలకు తినిపించు.”

(దీనిని ఏడుగురూ ఉల్లేఖించారు. హదీసు వాక్యాలు ‘ముస్లిం’ లోనివి)

సారాంశం:
లేమికి గురై ఉన్న వ్యక్తి కఫ్ఫారా(పరిహారం) చెల్లించనవసరం లేదని ఇమామ్ ఔజాయి, ఇమామ్ అహ్మద్ ఈ హదీసు ఆధారంగా వ్యాఖ్యానించారు. కాని ఇమామ్ మాలిక్, ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ సౌరి, ఇమామ్ అబూ సౌర్ ఈ తర్కంతో ఏకీభవించలేదు. పరిహారం పరిహారమేననీ, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని వీరు అభిప్రాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తికి, పేదవాడైన కారణంగా ఖర్జూర పండ్లు దానం చేశారేతప్ప పరిహారంగా ఇవ్వలేదని వీరు వ్యాఖ్యానించారు. అదీగాక, ఈ హదీసులో ‘ఖజా రోజా’ గురించిన ప్రస్తావన లేదు. ఇతర హదీసులలో ఖజా రోజా గురించి కూడా చెప్పబడింది. దీని ఆధారంగా నలుగురు ఇమాములు మరియు మెజారిటీ పండితులు ఏమంటారంటే, ఇలాంటి స్థితిలో స్త్రీ పురుషులిరువురూ ఖజా రోజా ఉండాలి. ఆ సమయంలో స్త్రీ ఒకవేళ ఉపవాసవ్రతం బూని ఉండకపోతే, ఆమెపై ‘ఖజా’ బాధ్యత లేదు. ఈ హదీసుపై కొందరు ధర్మవేత్తలు కొనసాగించిన చర్చ రెండు సంపుటాలలో వచ్చిందని హాఫిజ్ ఇబ్నే హజర్ (రహిమహుల్లాహ్) ‘ఫతుల్ బారీ’లో పేర్కొన్నారు.

وَعَنْ عَائِشَةَ وَأُمِّ سَلَمَةَ رَضِيَ اَللَّهُ عَنْهُمَا { أَنَّ اَلنَّبِيَّ ‏- صلى الله عليه وسلم ‏-كَانَ يُصْبِحُ جُنُبًا مِنْ جِمَاعٍ, ثُمَّ يَغْتَسِلُ وَيَصُومُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏ زَادَ مُسْلِمٌ فِي حَدِيثِ أُمِّ سَلَمَةَ: [ وَ ] لَا يَقْضِي 2‏ .‏

550. హజ్రత్ ఆయిషా, హజ్రత్ ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) లిరువురూ ఇలా వివరించారు: “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లైంగిక అశుద్ధతకు లోనై ఉన్నస్థితిలో తెల్లవారిపోతే (సహరీ వేళ దాటిపోతే) అప్పుడు స్నానం చేసి ఉపవాసాన్ని మాత్రం కొనసాగించేవారు.” (బుఖారీ, ముస్లిం)

‘ఖజా మాత్రం చేసే వారు కాదు’ అని ఉమ్మె సలమా (రదియల్లాహు అన్హా) పలికినట్లు ‘ముస్లిం’లో ఉంది.

సారాంశం
‘జనాబత్ ‘లో వున్న మనిషికి ఫజ్ర్ సమయానికి ముందే మెలకువ రాకపోతే అతడు తెల్లవారాక కూడా స్నానం చేసి- ఉపవాసాన్ని కొనసాగించవచ్చనీ, ఉపవాసాన్ని కేవలం ఈ కారణంగా విడనాడ వలసిన అవసరం లేదనీ ఈ హదీసు ద్వారా బోధపడుతున్నది. ధర్మవేత్తలలో అధిక సంఖ్యాకులు దీంతో ఏకీభవించారు.

وَعَنْ عَائِشَةَ رَضِيَ اَللَّهُ عَنْهَا; أَنَّ رَسُولَ اَللَّهِ ‏- صلى الله عليه وسلم ‏-قَالَ: { مَنْ مَاتَ وَعَلَيْهِ صِيَامٌ صَامَ عَنْهُ وَلِيُّهُ } مُتَّفَقٌ عَلَيْهِ 1‏ .‏

551. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు – “ఏ వ్యక్తయినా చనిపోతే, అతనిపై ఉపవాసాలు విధిగా పాటించవలసిన (ఖజా చేయవలసిన) బాధ్యత ఉండివుంటే అతని తరపున అతని వారసుడు వాటిని పాటించాలి.” (బుఖారీ, ముస్లిం)

సారాంశం:
‘హజ్’ మాదిరిగా ‘రోజా’ విషయంలో కూడా వారసులు మృతుని తరఫున వసీయతును నెరవేర్చవచ్చని హదీసువేత్తలు ఈ హదీసు ఆధారంగా అభిప్రాయపడ్డారు. అయితే ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ మాలిక్ ల ఆలోచనా సరళి తద్భిన్నంగా ఉంది. వారసులు మృతుని తరఫున ఉపవాసాన్ని పాటించనక్కర లేదనీ, పేదవానికి అన్నం పెడితే సరిపోతుందని వీరు అన్నారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ల తీర్పు కూడా ఇదే. అయితే మృతుని తరఫున ఉపవాసం ఉండటం ధర్మసమ్మతం అని హదీసులో స్పష్టంగా ఉంది. కాబట్టి మృతునిపై ఉన్న బాధ్యతను వారసులు నెరవేరిస్తే అందులో ఆక్షేపణీయం ఏమీ లేదు. పైగా అభిలషణీయం.

హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) (Bulugh-al-Maraam)
సంకలనం  : అల్లామా హాఫిజ్ ఇబ్నె హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్)
వ్యాఖ్యానం  : మౌలానా సఫీవుర్రహ్మాన్ ముబారక్ పూరీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్ , హైదరాబాద్ –ఇండియా