సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [పుస్తకం]

Important-lessons-for-every-muslim-ibn-baz

అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ
(సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు)

క్రింది లింక్ క్లిక్ చేసి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు – ఇమాం ఇబ్నె బాజ్ [డైరెక్ట్ PDF]

  1. మొదటి పాఠం – సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు.
  2. రెండవ పాఠం – ఇస్లాం ములస్తంభాలు.
  3. మూడవ పాఠం – ఈమాన్ (విశ్వాస) మూలస్తంభాలు.
  4. నాల్గవ పాఠం – తౌహీద్ రకాలు మరియు షిర్కు రకాలు.
  5. ఐదవ పాఠం – ఇహ్సాన్
  6. ఆరవ పాఠం – నమాజు షరతులు
  7. ఏడవ పాఠం – నమాజు యొక్క విధులు
  8. ఎనిమిదో పాఠం – నమాజులో అనివార్య కార్యాలు
  9. తొమ్మిదవ పాఠం – తషహ్హుద్ యొక్క వివరణ.
  10. పదవ పాఠం – నమాజు యొక్క సున్నతులు
  11. పదకొండవ పాఠం – నమాజును భంగం చేసేవి.
  12. పన్నెండవ పాఠం: – వుజూ షరతులు.
  13. పదమూడవ పాఠం – వుజూలో తప్పనిసరి చేయవలసిన కార్యాలు.
  14. పద్నాల్గవ పాఠం – వుజూను భంగపరిచే విషయాలు.
  15. పదిహేనొవ పాఠం – ప్రతీ ముస్లిం చట్టబద్ధమైన గుణములతో అలంకరించుకోవటం
  16. పదహారవ పాఠం – ఇస్లామీయ పద్దతులను అవలంభించటం.
  17. పదిహేడవ పాఠం – షిర్కు మరియు తదితర పాపముల నుండి హెచ్చరించటం.
  18. పద్దెనిమిదవ పాఠం – మృతుని జనాజా సిద్ధం చేయటం, అతని జనాజా నమాజు చదవటం, అతనిని పూడ్చటం.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వ సల్లల్లాహు వ సల్లమ అలా అబ్దిహి వ రసూలిహి నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ అస్హాబిహీ అజ్మయీన్. (స్థుతులన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, మంచి పర్యవాసనం దైవభీతి కలవారి కొరకే, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక).

అమ్మా బాద్:

ఇస్లాం ధర్మం గురించి ప్రజలు తెలుసుకోవలసిన కొన్ని పదాల ప్రకటనలో ఇవి సంక్షిప్త పదాలు. వాటిని నేను అద్దురూసుల్ ముహిమ్మతు లి ఆమ్మతిల్ ఉమ్మ (సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్య పాఠాలు) అని నామకరణం చేశాను.

వాటితో ముస్లిములకు ప్రయోజనం కలిగించమని మరియు నా నుండి వాటిని స్వీకరించమని నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.

అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్

సూరతుల్ ఫాతిహ మరియు చిన్న సూరాలు అంటే జిల్ జాల్ సూరా నుండి నాస్ సూరా వరకు అయినంతవరకు చదివించటం, ఖిరాఅత్ ను సరిచేయటం, కంఠస్తం చేయటం మరియు అర్థం చేసుకునే వాటిని వివరించటం.

ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాల గురించి తెలపటం. వాటిలో మొదటిది మరియు వాటిలో గొప్పది:  లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసులుల్లాహ్ ను వాటి అర్థముల వివరణతో మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క షరతులను తెలుపుతూ సాక్ష్యం పలకటం. మరియు వాటి అర్ధం:  (లా ఇలాహ) అల్లాహ్ ను వీడి ఆరాధించబడే దైవాలన్నింటిని తిరస్కరించటం, (ఇల్లల్లాహ్) అల్లాహ్ ఒక్కడి కొరకు ఆరాధన చేయటమును, ఆయనకు ఎవరు సాటి లేరని నిరూపించటం. అయితే (లా ఇలాహ ఇల్లల్లాహ్) షరతులు ఇవి:  అజ్ఞానమునకు విరుద్దమైన జ్ఞానము, సందేహమునకు విరుద్ధమైన నమ్మకము, షిర్క్ నకు విరుద్ధమైన చిత్తశుద్ధి, అసత్యమునకు విరుద్ధమైన సత్యము, ధ్వేషమునకు విరుద్ధమైన ప్రేమ, షిర్కునకు విరుద్ధమైన విధేయత, తిరస్కారమునకు విరుద్ధమైన స్వీకరణ, అల్లాహ్ ను వీడి ఆరాధించబడే వాటి తిరస్కారము. మరియు అది ఈ రెండు కవిత్వములలో సమీకరించబడినది:

జ్ఞానము, నమ్మకము, చిత్తశుద్ధి, నిజాయితీ మరియు ఎనిమిదో విషయం అధికం చేయబడింది.

ప్రేమ, విధేయత, వాటిని స్వీకరించడం మరియు అల్లాహ్ ను వీడి ఆరాధించబడే ఆరాధ్య దైవాల తిరస్కారము.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటముతో పాటు దాని లక్ష్యాలను పూర్తి చేయాలి. అవి:  ఆయన తెలిపిన విషయములలో ఆయనను సత్యవంతుడిగా గుర్తించటము, ఆయన ఆదేశించిన వాటి విషయంలో ఆయనకు విధేయత చూపటం, ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండటం మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ధర్మబద్ధం చేసిన వాటితోనే అల్లాహ్ ఆరాధన చేయటం. ఆ తరువాత అభ్యసించే వారికి ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలలో నుంచి మిగతా వాటి గురించి తెలియపరచాలి. అవి:  నమాజ్, జకాత్, రమజాన్ మాసపు ఉపవాసాలు మరియు స్తోమత కలిగినవారు అల్లాహ్ గృహపు హజ్ చేయటం.

అవి ఆరు:  ఈమాన్ అంటే నీవు అల్లాహ్ పై, ఆయన దూతలపై, ఆయన గ్రంధములపై, ఆయన ప్రవక్తలపై మరియు అంతిమ దినంపై విశ్వాసమును చూపటం మరియు అల్లాహ్ తరపు నుంచి అయిన మంచి చెడు విధివ్రాతపై విశ్వాసం చూపటం.

తౌహీద్ యొక్క మూడు రకాలు కలవు అవి:  

  1. తౌహీదె రుబూబియత్,
  2. తౌహీదె ఉలూహియత్,
  3. తౌహీదె అస్మా వస్సిఫాత్.

తౌహీదె రుబూబియత్:  అల్లాహ్ ప్రతీది సృష్టించినవాడని, ప్రతీ వస్తువులో అధికారము కలవాడని మరియు ఆయనకు ఎవరు సాటి లేరని విశ్వసించడం.

తౌహీదె ఉలూహియత్:  అల్లాహ్ వాస్తవ ఆరాధ్య దైవమని, అందులో ఆయనకు ఎవరు సాటి లేరని విశ్వసించడం. ఇదే లా యిలాహ ఇల్లల్లాహ్ అర్థము. అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరని దాని అర్థము. కావున నమాజు, ఉపవాసాలు మరియు తదితర ఆరాధనలన్ని అల్లాహ్ ఒక్కడి కొరకు ప్రత్యేకించటం తప్పని సరి. వాటిలో నుంచి దేనినీ ఇతరుల కొరకు చేయటం సమ్మతం కాదు.

తౌహీదె అస్మా వస్సిఫాత్:  ఖుర్ఆన్ లో లేదా సహీహ్ హదీసులలో వచ్చిన అల్లాహ్ పేర్లను మరియు గుణాలను అన్నింటిని విశ్వసించడం. మరియు వాటిని ఎటువంటి వక్రీకరణ, అంతరాయం, వర్ణత, పోలిక లేకుండా అల్లాహ్ ఒక్కడి కొరకు ఆయనకు తగిన విధంగా నిరూపించటం.

అల్లాహ్ యొక్క ఈ వాక్కుపై ఆచరిస్తూ:  

మీరు ఇలా చెప్పేయండి ఆ అల్లాహ్ ఒక్కడే (1) అల్లాహ్ నిరపేక్షాపరుడు (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. (3) {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.[1][సమద్:  పూర్తిగా]

మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:

{ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన సర్వం వినేవాడూ, సర్వం చూసేవాడూను}.[2][షూరా: 11]

కొందరు పండితులు వాటిని రెండు రకాలుగా విభజించారు. వారు తౌహీదె అస్మా వస్సిఫాత్ ను తౌహీదె రుబూబియత్ లో చేర్చారు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే రెండు విభజనలలో ఉద్దేశము స్పష్టమవుతుంది.

షిర్కు మూడు రకాలు:  

  1. పెద్ద షిర్కు,
  2. చిన్న షిర్కు,
  3. గోప్యమైన షిర్కు

పెద్ద షిర్కు: ఆచరణ వృధా అవటమును మరియు దానిపై మరణించే వాడిని నరకంలో శాశ్వతంగా ఉండటమును అనివార్యం చేస్తుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఒకవేళ వారు దైవత్వంలో భాగస్వామ్యానికి ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోతాయి[3]. [అన్ఆమ్:  88]

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

బహుదైవారాధకులు (ముష్రికీన్), తాము సత్యతిరస్కారులమని సాక్ష్యమిస్తూ, అల్లాహ్ మస్జిదులను నిర్వహించటానికి (సేవ చేయటానికి) అర్హులు కారు. అలాంటి వారి కర్మలు వ్యర్థమై పోతాయి మరియు వారు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు.[4][తౌబా:  17]

మరియు దానిపైనే మరణించిన వాడి పాపములు మన్నించబడవు. మరియు స్వర్గము అతని పై నిషేధము.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:  

నిశ్చయంగా అల్లాహ్ తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు[5]. [నిసా:  48]

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:  

ఎవడైతే అల్లాహ్’కు ఇతరులను సాటికల్పిస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గం’ నిషేధించాడు, మరియు అతని నివాసం నరకాగ్ని అవుతుంది మరియు దౌర్జన్యపరులకు సహాయం చేసేవాడు ఎవడు ఉండడు[6]. [అల్ మాయిదా:  72]

మరియు మృతులను, విగ్రహాలను వేడుకోవటం మరియు వారితో సహాయం కొరకు మొరపెట్టుకోవడం, వారి కొరకు మొక్కుకోవటం, వారి కొరకు వధించటం మరియు అటువంటి ఇతర కార్యాలు చేయటం దాని రకాలలోంచివే.

ఇక షిర్కె అస్గర్ (చిన్న షిర్కు) అది ఏదైతే ఖుర్ఆన్ లేదా హదీసుల ఆధారాలతో షిర్క్ అనే పేరుతో నిరూపించబడినదో. కాని అది షిర్కె అక్బర్ (పెద్ద షిర్కు) లోంచి కాదు. ఉదాహరణకు కొన్ని ఆచరణలను ప్రదర్శనా బుద్దితో చేయటం, అల్లాహేతరులపై ప్రమాణం చేయటం, అల్లాహ్ తలచుకుంటే మరియు ఫలా తలచుకుంటే అని పలకటం మరియు అటువంటి ఇతర కార్యాలు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:  ‘మీ విషయం లో నన్ను ఎక్కువగా భయాందోళనలకు గురిచేస్తున్న విషయం ‘షిర్కే అస్గర్( చిన్న షిర్క్) దాని గురించి అడిగితే ‘ప్రవక్త అర్రియ ‘ప్రదర్శనాబుద్ది’ అని తెలియజేశారు.[7]దీనిని ఇమామ్ అహ్మద్ మరియు తబ్రానీ మరియు బైహఖీ మంచి సనదుతో మహ్మూద్ బిన్ లబీద్ అల్ అన్సారీ నుండి ఉల్లేఖించారు. మరియు తబ్రానీ మంచి సనదులతో మహ్మూద్ బిన్ లబీద్ నుండి మరియు ఆయన రాఫె బిన్ ఖదీజ్ నుండి మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు.[8]

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం:

{అల్లాహ్ ను వదిలి ఏదైన వస్తువుపై ప్రమాణం చేసినవాడు షిర్క్ చేశాడు}[9]

దీనిని ఇమామ్ అహ్మద్ గారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు నుండి ప్రామాణికమైన సనదుతో ఉల్లేఖించారు. మరియు అబూ దావూద్, తిర్మిజీ గారు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమ యొక్క ప్రామాణికమైన సనదుతో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు – ఆయన ఇలా పలికారని:  ఎవరైతే అల్లాహ్ ఏతర పై ప్రమాణం చేస్తాడో అతను కుఫ్ర్ లేక షిర్కు కు ఒడగట్టినట్లే[10]/ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: మీరు (మా షా అల్లాహ్ వ షాఅ ఫులాన్ ) అల్లాహ్ మరియు ఫలా కోరినట్లు అని అనకండి కానీ (మా షా అల్లాహ్ సుమ్మ షాఅ ఫలా) అల్లాహ్ కోరినట్లు పిదప ఫలా కోరినట్లు అని పలకండి.[11] దీనిని అబూ దావూద్ గారు హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు నుండి ప్రామాణికమైన సనదుతో ఉల్లేఖించారు.

మరియు ఈ రకము మతభ్రష్టత్వమును అనివార్యం చేయదు మరియు నరకములో శాశ్వతంగా ఉండటమును అనివార్యం చేయదు. కానీ అది అనివార్య ఏకేశ్వరవాదం యొక్క పరిపూర్ణతకు విరుద్ధం.

ఇక మూడో రకము:  గోప్యమైన షిర్క్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులు దానికి ఆధారం- తస్మాత్ జాగ్రత్త! మసీహ్ దజ్జాల్’ ఉపద్రవం కంటే కూడా నాకు మీ పట్ల ఎక్కువ ఆందోళన చెందించే విషయం ఒకటి తెలుపనా ?. ఖచ్చితంగా చెప్పండి దైవప్రవక్త అంటూ అనుచరులు అన్నారు ‘ప్రవక్త చెబుతూ “షిర్కుల్ ఖఫీ”(కనపడని షిర్క్), ఒక వ్యక్తి నిల్చుని నమాజును ప్రారంభించి దాన్నికేవలం మరొకరు చూస్తున్నారని అందంగా చక్కగా శ్రద్ద తో చదువుతూ ఉండటం.[12]దీనిని ఇమామ్ అహ్మద్ గారు తన ముస్నద్ లో అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించారు.

షిర్కును కేవలం రెండు రకాలుగా విభజించటం సమ్మతమగును:

పెద్దది, చిన్నది. ఇక గోప్యమైన షిర్కు రెండిటిలోను వస్తుంది.

కావున అది పెద్ద షిర్కులో కూడా వస్తుంది. ఉదాహరణకు కపటుల షిర్కు. ఎందుకంటే వారు తమ అసత్య విశ్వాసాలను దాచేవారు. మరియు ప్రదర్శనా బుద్దితో తమ ప్రాణముల పై భయంతో ఇస్లాంను బహిర్గతం చేసేవారు.

మరియు గోప్యమైన షిర్కు చిన్న షిర్కులో వస్తుంది. ఉదాహరణకు ప్రదర్శనా బుద్ది. మహ్మూద్ బిన్ లబీద్ అల్ అన్సారీ యొక్క మునుపటి హదీసులో వచ్చినట్లు మరియు అబూ సయీద్ యొక్క హదీసులో ఉన్నట్లు. అల్లాహ్ భాగ్యమును కలిగించేవాడు.

ఇహ్సాన్ మూలము. ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లు ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూడకపోయిన ఆయన నిన్ను చూస్తున్నాడు.

అవి తొమ్మిది:

  1. ఇస్లాం,
  2. బుద్ది,
  3. వ్యత్యాసం,
  4. వుజూతో ఉండటం,
  5. మాలిన్యములను తొలగించటం,
  6. మర్మాంగమును కప్పటం,
  7. సమయం అవటం,
  8. ఖిబ్లాకి అభిముఖమవటం,
  9. సంకల్పం.

అవి పద్నాలుగు:

  1. శక్తి ఉంటే నిలబడటం,
  2. తక్బీరె తహ్రీమా,
  3. ఫాతిహ సూర చదవటం,
  4. రకూ చేయటం,
  5.  రకూ తరువాత తిన్నగా నిలబడటం,
  6.  ఏడు అవయవములపై సజ్దా చేయటం,
  7. సజ్దా నుండి తల పైకి లేపటం,
  8.  రెండు సజ్దాల మధ్య కూర్చోవటం,
  9. నమాజ్ యొక్క అన్ని కార్యాలను మనశ్శాంతిగా చేయటం,
  10. విధులలో క్రమ పద్దతిని పాటించటం,
  11. చివరి తషహ్హుద్,
  12. చివరి తషహ్హుద్ కొరకు కూర్చోవటం,
  13. దైప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదవటం,
  14. రెండు వైపుల సలాం తిరగటం.

అవి ఎనిమిది:

  1. తక్బీరె తహ్రీమా కాకుండా మిగిలిన తక్బీరులన్ని,
  2. ఇమామ్ మరియు ఒంటరిగా చదివేవాడు సమిఅల్లాహు లిమన్ హమిదహ్ పలకటం,
  3. ప్రతి ఒక్కరు రబ్బనా వలకల్ హమ్ద్ పలకటం,
  4. రకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ చదవటం,
  5. సజ్దాలో సుబహాన రబ్బియల్ ఆలా చదవటం,
  6. రెండు సజ్దాల మధ్య రబ్బిగ్ఫిర్లీ చదవటం,
  7. మొదటి తషహ్హుద్,
  8. మొదటి తషహ్హుద్ లో కూర్చోవటం.

తషహ్హుద్ లో ఇది చదవాలి:

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.

ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవటం మరియు ఆయన పై శుభాలు కలగాలని దుఆ చేయటం. కావున ఇలా చదవాలి:  

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్, కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్

(ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్’ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు’స్తోత్రానికి అర్హుడవు, ఘనత కలవాడవు నీవే’ఓ అల్లాహ్! ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్’ మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురుపించు.)

ఆ తరువాత చివరి తషహ్హుద్ లో నరకము యొక్క శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి, జీవితం, మరణం యొక్క ఉపద్రవాల నుండి మరియు మసీహె దజ్జాల్ ఉపద్రవాల నుండి అల్లాహ్ శరణు కోరాలి. ఆ తరువాత ఏ దుఆ ఇష్టముంటే ఆ దుఆ చేయాలి. ముఖ్యంగా మాసూరహ్ దుఆలను చేయలి. వాటిలో నుంచి:

అల్లాహుమ్మ అయిన్ని అలా జిక్రిక వషుక్రిక వహుస్ని ఇబాదతిక, అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్, వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అన్త, ఫగ్ఫిర్లీ మగ్ఫిరతన్ మిన్ ఇందిక వర్హమ్ని ఇన్నక అన్తల్ గఫూరుర్రహీమ్.

(ఓ అల్లాహ్ నీ స్మరణ చేయుటమునకు మరియు నీ కృతజ్ఞతలు తెలుపుటకు మరియు నీ ఆరాధన మంచిగా చేయుటకు నాకు సహాయము చేయి. ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నా మనస్సుపై బాగా హింసకు పాల్పడ్డాను, నీవు తప్ప పాపములను మన్నించే వాడు ఎవడూ లేడు, కావున నీవు నీ యందు నుండి నన్ను మన్నించు మరియు నాపై కరుణించు. నిశ్చయంగా నీవే మన్నించేవాడవు కరుణించేవాడవు.

ఇక మొదటి తషహ్హుద్ లో షహాదతైన్ తరువాత జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులలో మూడవ రకాతు కొరకు నిలబడాలి. ఒకవేళ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదివితే అది మంచిది. దీని గురించి చాలా హదీసులు ఉన్నవి. ఆ తరువాత మూడవ రకాతు కొరకు నిలబడాలి.

అవి:

  1. ఇస్తిఫ్తాహ్ దుఆ చదవటం.
  2. నిలబడినప్పుడు, రుకూ ముందు మరియు రకూ తరువాత కుడి చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతీ పై కట్టుకోవటం.
  3. మొదటి తక్బీర్ చదివేటప్పుడు, రకూ చేసేటప్పుడు, రకూ నుండి తల లేపినప్పుడు మరియు మొదటి తషహ్హుద్ నుండి మూడవ రకాతు కొరకు లేచినప్పుడు రెండు చేతుల వేళ్ళను జమ చేసి రెండు ముండెములకు లేదా చెవులకు సమాంతరంగా లేపటం.
  4. రుకూ మరియు సజ్దాలో ఒక సారి కంటే మించి తస్బీహ్ చదవటం.
  5. రుకూ నుండి లేచిన తరువాత రబ్బనా వలకల్ హమ్దు కి మించి చదవటం. మరియు రెండు సజ్దాల మధ్య మన్నింపు దుఆను ఒక సారికి మించి చదవటం.
  6. రుకూలో తలను వీపుకి సమాంతరంగా ఉంచటం.
  7. సజ్దాలో రెండు రెక్కలను రెండు ప్రక్కల నుండి, పొట్టను రెండు తొడల నుండి మరియు రెండు తొడలను రెండు పిక్కల నుండి ఎడంగా ఉంచటం.
  8. సజ్దా చేసినప్పుడు రెండు మోచేతులను నేల నుండి పైకి ఎత్తి ఉంచటం.
  9. నమాజ్ చదివే వ్యక్తి.మొదటి తషహ్హుద్ లో మరియు రెండు సజ్దాల మధ్యలో ఎడమ కాలును పరచి కూర్చొని, కుడి కాలును నిలబెట్టి ఉంచడం.
  10. నాలుగు రకాతుల, మూడు రకాతుల నమాజులో చివరి తషహ్హుద్ లో తవర్రుక్ చేయటం అంటే కుడి కాలును నిలబెట్టి దాని క్రింది నుంచి ఎడమ కాలును తీసి పిరుదులను నేలకు ఆనించి కూర్చోవటం.
  11. మొదటి, రెండవ తషహ్హుద్ లో కూర్చున్నప్పటి నుంచి తషహ్హుద్ ముగింపు వరకు చూపుడి వ్రేలితో సైగ చేయటం మరియు దుఆ చేసే సమయంలో దానిని కదపటం.
  12. మొదటి తషహ్హుద్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు ఆయన కుటుంబముపై మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన కుటుంబముపై దరూద్ చదవటం, శుభాల కొరకు దుఆ చేయటం (దరూదె ఇబ్రాహీం చదవటం).
  13. చివరి తషహ్హుద్ లో దుఆ చేయటం.
  14. ఫజర్ నమాజులో, జుమా నమాజులో, రెండు పండుగల నమాజులలో, వర్షం కోరటం కోసం చేసే నమాజులో మరియు మగ్రిబ్, ఇషా నమాజుల మొదటి రెండు రకాతులలో ఖిరాఅత్ ను బిగ్గరగా చదవటం.
  15. జుహర్, అసర్, ఇషా నమాజు యొక్క చివరి రెండు రకాతులలో మరియు మగ్రిబ్ నమాజు యొక్క మూడవ రకాతులో ఖిరాఅత్ ను నెమ్మదిగా లోలోపల చేయటం.
  16. సూరే ఫాతిహానే కాకుండా ఖుర్ఆన్ నుండి ఇతర సూరాలను చదవటం. మేము ప్రస్తావించిన ఈ సున్నతులే కాకుండా ఇంకా వచ్చిన సున్నతులపై కూడా శ్రద్ధ చూపాలి. వాటిలో నుంచి రుకూ నుండి పైకి లేచిన తరువాత ఇమామ్, ముఖ్తదీ మరియు ఒంటరిగా నమాజు చదివేవాడు రబ్బనా లకల్ హమ్ద్ కన్న మించి దుఆ చదవటం. ఎందుకంటే ఇది సున్నత్. ఇంకా వాటిలో నుంచి:  రుకూ చేసిన సమయంలో రెండు చేతులను మోకాళ్ళపై వేళ్ళను ఎడంగా చేసి ఉంచడం.

అవి ఎనిమిది:

  1. జ్ఞానము, గర్తుండి ఉద్దేశపూర్వకంగా నమాజులో మాట్లాడటం. ఇక మరచిపోయి, అజ్ఞానంతో మాట్లాడే వారి నమాజు భంగం కాదు.
  2. నవ్వటం.
  3. తినటం.
  4. త్రాగటం.
  5. మర్మాంగము బహిరంగము అవటం
  6. ఖిబ్లా వైపు నుండి అధికంగా తిరిగిపోవటం.
  7. నమాజులో నిర్విరామంగా అధికంగా సంబంధం లేని కార్యాలు చేయటం.
  8. వుజూ భంగమవటం.

అవి పది:

  1. ఇస్లాం,
  2. బుద్ది,
  3. వ్యత్యాసం చూపటం,
  4. సంకల్పించటం,
  5. వుజూ పూర్తయే వరకు సంకల్పంను ఉంచటం,
  6. వుజూ యొక్క కారణం ముగియటం,
  7. వుజూకి ముందు నీటితో లేదా రాయితో ఇస్తింజా చేయటం,
  8.  దాని నీరు పరిశుభ్రంగా ఉండటం మరియు దానిని వాడటం సమ్మతమవటం,
  9. చర్మం వరకు నీటిని చేరకుండా ఆటంకమును కలిగించే వాటిని తొలగించటం,
  10. ఎల్లప్పుడు అశుద్ధత కలిగి ఉండే వ్యక్తికి నమాజు వేళ అవటం.

అవి ఆరు:

  1. ముఖమును కడగటం. పుక్కిలించటం, ముక్కులో నీటిని తీసుకుని ఛీదరించటం ముఖము కడగటంలోనే వస్తాయి.
  2. రెండు చేతులను మోచేతులతో సహా కడగటం.
  3. పూర్తి తలను మసాహ్ చేయటం. చెవులు కూడా అందులోనే వస్తాయి.
  4. రెండు కాళ్ళను చీలమండలంతో సహా కడగటం.
  5. క్రమ పద్దతి.
  6. వరుసగా నిర్విరామంగా చేయటం. ముఖము, రెండు చేతులను, రెండు కాళ్ళను కడగటం మూడు సార్లు చేయటం మంచిది. అలాగే పుక్కిలించటం మరియు ముక్కులో నీటిని తీసుకుని ఛీదరించటం కూడా మూడుసార్లు చేయటం మంచిది. వాటిని ఒకసారి చేయటం తప్పనిసరి. ఇక తల మసాహ్ చేయటం ఒకసారి కన్న ఎక్కువ చేయటం సమ్మతం కాదు. సహీహ్ హదీసుల ద్వారా అది బోధపడుతుంది.

అవి ఆరు:

  1. మలమూత్ర విసర్జన చోటు నుండి వెలువడే వస్తువు,
  2. శరీరం నుండి బయటకు వచ్చే దృఢమైన మలినం,
  3. నిద్ర వలన లేదా మరోవిధంగా బుద్ది కోల్పోవటం,
  4. ముందు వైపు నుండి లేదా వెనుక వైపు నుండి ఎటువంటి అడ్డు లేకుండా మర్మాంగములను చేతితో ముట్టుకోవటం,
  5. ఒంటె మాంసము తినటం,
  6. ఇస్లాం నుండి మరలిపోవటం అల్లాహ్ మమ్మల్ని మరియు ముస్లిములని దాని నుండి రక్షించుగాక.

ముఖ్య గమనిక:  

ఇక మృతుడిని గుసుల్ చేయించటం:  వాస్తవమేమిటంటే దాని నుండి వుజూ భంగమవదు. దాని గురించి ఎటువంటి ఆధారం లేకపోవటం వలన, ఇది చాలా మంది పండితుల మాట. కానీ గుసుల్ చేయించే వ్యక్తి చేయి ఎటువంటి అడ్డు లేకుండా మృతుని మర్మాంగమునకు తగిలితే అతని పై వుజూ అనివార్యమగును.

గుసుల్ చేయించే వ్యక్తి మృతుడి మర్మాంగమును ఎటువంటి అడ్డు లేకుండా ముట్టుకోకూడదు. మరియు ఇలాగే స్త్రీని ముట్టుకోవటం వలన చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం వుజూ భంగమవదు. అది కామంతో అయిన లేదా కామంతో కాకపోయినా అతని నుండి ఏదైన వెలువడనంతవరకు. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సతీమణులలో నుంచి ఒకరిని ముద్దు పెట్టుకుని ఆ తరువాత నమాజు చదివారు. ఆయన వుజూ చేయలేదు.

ఇక సూరే నిసా మరియు మాయిదా యొక్క రెండు ఆయతులలో అల్లాహ్ వాక్కు:  

{లేదా మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే}[13][నిసా:  43] [మాయిద:  6]

పండితుల సరైన మాట ప్రకారం దాని అర్థం సంభోగము. మరియు అది ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు పూర్వికులలోంచి ఒక జమాఅత్ యొక్క మాట. మరియు అల్లాహ్ భాగ్యమును కలిగించేవాడు.

వాటిలో నుంచి:

  • నీతి,
  • నిజాయితీ, పవిత్రత,
  • నిరాడంబరత,
  •  ధైర్యం,
  • ఔదార్యం,
  • విశ్వసనీయత అల్లాహ్ నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండటం,
  •  పొరుగు వారిని ఆదరించటం,
  • శక్తి ప్రకారం అవసరమైన వారికి సహాయం చేయడం మరియు చట్టబద్దమైనవని ఖుర్ఆన్ లేదా సున్నత్ ద్వారా నిరూపించబడిన ఇతర విషయాలు.

వాటిలో నుంచి:  

  1. సలాం చేయటం,
  2. నగుమోముతో పలకరించటం,
  3. కుడి చేయితో తినటం మరియు త్రాగటం,
  4.  తినటం, త్రాగటం ఆరంభించేటప్పుడు బిస్మిల్లాహ్ అని, ముగించినప్పుడు అల్హమ్దులిల్లాహ్ అని పలకటం,
  5. తుమ్మిన తరువాత అల్హమ్దులిల్లాహ్ పలకటం, తుమ్మిన వాడు అల్హమ్దులిల్లాహ్ అని పలికినప్పుడు అతనికి జవాబు యర్ హముకల్లాహ్ అని ఇవ్వటం,
  6. వ్యాధిగ్రస్తుడిని పరామర్శించటం,
  7. జనాజా నమాజు చేయటానికి, పూడ్చటానికి జనాజా వెనుక వెళ్ళటం.
  8. మస్జిదులో లేదా ఇంటిలో ప్రవేశించేటప్పుడు, వాటి నుండి బయటకు వచ్చేటప్పుడు,
  9.  ప్రయాణం చేసేటప్పుడు,
  10.  తల్లీదండ్రులతో, బంధువులతో, పొరుగువారితో, పెద్దవారితో, చిన్నవారితో ఉన్పప్పుడు,
  11. అప్పుడే పుట్టిన బిడ్డ గురించి శుభవార్తనిచ్చేటప్పుడు,
  12. వివాహం గురించి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు,
  13. ఆపదకు గురైన వారిని ఓదార్చేటప్పుడు,
  14. దుస్తులు ధరించేటప్పుడు, విడిచేటప్పుడు మరియు
  15. చెప్పులు తొడిగేటప్పుడు విడిచేటప్పుడు ఇస్లామీయ పద్దతులను అవలంభించాలి.

వాటిలో నుంచి:  

వినాశకరమైన ఏడు పాపాలు అవి

  1. షిర్కుబిల్లాహ్ (అల్లాహ్’కుఇతరులను భాగస్వామ్య పర్చటం)
  2. చేతబడి
  3. అకారణంగా అల్లాహ్ నిషేధించిన ప్రాణిని హతమార్చటం
  4. వడ్డీ తినడం
  5. అనాధల సొమ్మును అన్యాయంగా తినటం
  6. యుద్దం నుండి వెనుతిరిగి పారిపోవటం
  7. అభాగ్యురాలైన, అమాయకులైన మహిళలపై అపనిందలు మోపటం.

ఇంకా వాటిలో నుంచి:  

  1. తల్లిదండ్రుల పట్ల అవిధేయత,
  2. బంధుత్వమును త్రెంచటం,
  3. అబద్దపు సాక్ష్యం పలకటం,
  4.  అబద్దపు ప్రమాణాలు చేయటం,
  5. పొరుగువారిని బాధించటం,
  6.  రక్తం విషయంలో, సంపదల విషయంలో, మానం విషయంలో ప్రజలపై దుర్మార్గమునకు పాల్పడటం,
  7. మత్తు పదార్ధములను సేవించటం,
  8. జూదమాడటం, వీపు వెనుక చెడు మాట్లాడుకోవటం,
  9. చాడీలు చెప్పటం మరియు
  10. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించిన ఇతర కార్యాలు.

దాని వివరణ ఇది మీ ముందు ఉన్నది:

[1] మరణం ఆసన్నమైన వారికి కలిమా ఉపదేశించటం

ఎరికైన మరణఘడియలు దగ్గరైనప్పుడు అతనికి లా యిలాహ ఇల్లల్లాహ్ గురించి ఉపదేశించాలి. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు:  

మీరు మీ మృతులకు లా యిలాహ ఇల్లల్లాహ్ ఉపదేశించండి.[14]ముస్లిం తన సహీహ్ లో ఉల్లేఖించారు. ఈ హదీసులో మృతులంటే మృత్యువుకి దగ్గరైనవారు. మృత్యువు సూచనలు ఎవరిపైనైతే బహిర్గతం అవుతాయో వారు.

[2] మరణమును దృవీకరించినప్పుడు మృతుని కళ్ళను మూసివేయాలి. మరియు రెండు దవడలను కట్టివేయాలి

ఎందుకంటే దాని గురించి హదీసులో వచ్చి ఉన్నది.

[3] ముస్లిం మృతుని శరీరమునకు గుసుల్ చేయించటం అనివార్యము

కాని యుద్దంలో అమరగతి పొందినవారైతే అతనికి గుసుల్ చేయబడదు. జనాజా నమాజు చదవబడదు. కాని అతనిని అతని బట్టలలోనే సమాధి చేయబడును. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ లో అమరగతి పొందినవారికి గుసుల్ చేయించలేదు మరియు వారి జనాజా నమాజు చదివించలేదు.

[4] మృతునికి గుసుల్ చేసే పద్దతి

మృతుని మర్మావయవాలను కప్పివేయాలి. ఆ తరువాత అతనిని కొద్దిగా పైకి లేపి పొట్టను కొద్దిగా నొక్కాలి. ఆ తరువాత గుసుల్ చేయించే వ్యక్తి తన చేతిపై గుడ్డను లేదా అటువంటిదే ఏదైనా చుట్టుకుని అతని మర్మాంగము నుండి వెలువడిన మాలిన్యమును శుభ్రం చేయాలి. ఆ తరువాత నమాజు యొక్క వుజూను చేయించాలి. ఆ తరువాత తలను మరియు గెడ్డమును నీటితో మరియు రేగుపండ్ల ఆకులతో లేదా అటువంటి వాటితో కడగాలి. ఆ తరువాత కుడివైపు భాగమును తరువాత ఎడమవైపు భాగమును కడగాలి. ఆ తరువాత రెండవసారి, మూడవసారి ఇదేవిధంగా గుసుల్ చేయాలి. ప్రతీసారీ చేతిని పొట్ట పైభాగముపై పోనిచ్చి నొక్కాలి. ఒకవేళ ఏమైన బయటకు వస్తే దానిని కడగాలి. ఆ తరువాత మర్మాంగ ప్రదేశమును దూదితో లేదా అటువంటి దానితో మూసివేయాలి. ఒక వేళ ఆగకపోతే మెత్తని మట్టి లేదా ఆధునిక వైద్య సాధనాలు అయిన టేపు వంటి వాటిని అతికించాలి.

మరియు మరల వుజూ చేయించాలి. ఒక వేళ మూడు సార్లు గుసుల్ చేయటం వలన శుభ్రం కాకపోతే ఐదు లేదా ఏడు సార్లు చేయించాలి. ఆ తరువాత పూర్తి శరీరమును గుడ్డతో తుడవాలి. మరియు కీలు భాగములకు, వుజూ ప్రదేశములకు సుగంధమును పూయాలి. ఒకవేళ పూర్తి శరీరమునకు సుగంధం పూసినా మంచిది. మరియు అతని కఫన్ కి సాంబ్రాణి పొగ ఇవ్వాలి. ఒకవేళ మీసాలుగాని గోళ్ళు గాని పెద్దవిగా ఉంటే కత్తిరించాలి. ఒకవేళ అలాగే వదిలేసినా ఎటువంటి దోషం లేదు. కాని దువ్వెన చేయకూడదు. బొడ్డు క్రింది వెంట్రుకలను గొరకకూడదు. మరియు సున్తీ చేయకూడదు. ఎందుకంటే అలా చేయాలని ఎటువంటి ఆధారం లేదు. స్త్రీ అయితే ఆమె తల వెంట్రుకలను మూడు జడలుగా చేసి వెనుకకు వదిలివేయాలి.

[5] మృతునికి కఫన్ తొడిగించటం

పురుషుడిని తెల్లటి మూడు వస్త్రములలో కఫన్ ఇవ్వటం ఎంతో ఉత్తమం. అందులో చొక్కా మరియు తలపాగ ఉండకూడదు. ఏ విధంగానైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడినదో అలా. వాటిలో మృతుడిని పూర్తిగా చుట్టివేయాలి. ఒక వేళ చొక్కా, షరాయి మరియు దుప్పటిలో కఫన్ ఇచ్చినా ఏమి పరవాలేదు.

మరియు స్త్రీని ఐదు వస్త్రములు చొక్కా, వోణి, పైజామా మరియు రెండు దుప్పట్లలో కఫన్ ఇవ్వబడును. మరియు చిన్నపిల్లవాడైతే ఒకటి నుంచి మూడు వస్త్రములలో కఫన్ ఇవ్వబడును.మరియు చిన్నపాప అయితే ఒక చొక్కా రెండు దుప్పట్లలో కఫన్ ఇవ్వబడును.

అందరిని ఒక వస్త్రంలో కఫన్ ఇవ్వటం తప్పనిసరి. అది మృతుడిని పూర్తిగా కప్పేదై ఉండాలి. కాని మృతుడు ఇహ్రామ్ స్థితిలో ఉంటే అతడిని నీటితో, రేగు ఆకులతో గుసుల్ చేయించబడును. మరియు అతని క్రింది వస్త్రము మరియు పై వస్త్రములో లేదా వేరే దానిలో కఫన్ ఇవ్వబడును. మరియు అతని తల మరియు ముఖము కప్పబడదు. మరియు సుగంధము పూయబడదు. ఎందుకంటే ప్రళయదినమున అతడు తల్బియ చదువుతూ ఉండగా లేపబడుతాడు. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీ హదీసు వచ్చి ఉన్నది. ఒక వేళ ఇహ్రామ్ స్థితిలో స్త్రీ ఉంటే ఇతర స్త్రీలవలె ఆమెకు కఫన్ ఇవ్వబడును. కానీ ఆమెకు సుగంధము పూయబడదు మరియు ఆమె ముఖము ముసుగుతో కప్పబడదు మరియు చేతులు గ్లౌజులతో కప్పబడవు. కాని ఆమె ముఖమును మరియు చేతులను కఫన్ ఇచ్చిన వస్త్రముతోనే కప్పబడును. ఇంతకు ముందే స్త్రీకి కఫన్ ఎలా ఇవ్వబడునో ప్రస్తావించబడినది.

[6] మృతుడికి గుసుల్ చేయించటానికి మరియు అతని జనాజా నమాజ్ చదివించటానికి మరియు అతడిని పూడ్చటానికి ప్రజల్లో ఎక్కువ హక్కుదారుడు

మృతుడికి గుసుల్ చేయించటానికి మరియు అతని జనాజా నమాజ్ చదివించటానికి మరియు అతడిని పూడ్చటానికి ప్రజల్లో ఎక్కువ హక్కుదారుడు:  అతడు ఈ విషయంలో ఎవరు చేయాలని మరణశాసనం (వసియ్యత్) చేశాడో అతను. ఆ తరువాత తండ్రి. ఆ తరువాత తాత. ఆ తరువాత మృతుడి సమీప బంధువులు.

అలాగే స్త్రీకి గుసుల్ ఇవ్వటానికి ఎక్కువ హక్కుదారులు:  ఆమె మరణశాసనం చేసిన స్త్రీ. ఆ తరువాత ఆమె తల్లి. ఆ తరువాత నాయనమ్మ. ఆ తరువాత ఆమెకు సమీప బంధువులైన స్త్రీలు. భార్యభర్తల్లోంచి ఒకరు ఇంకొకరికి గుసుల్ ఇచ్చే హక్కు కలదు. ఎందుకంటే అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హును ఆయన సతీమణి గుసుల్ ఇచ్చింది. మరియు అలీ రజియల్లాహు అన్హు తన సతీమణి ఫాతిమా రజియల్లాహు అన్హాకు గుసుల్ ఇచ్చారు.

[7] జనాజా నమాజు పద్దతి

జనాజా నమాజులో నాలుగు తక్బీరులు పలకబడును. 

మొదటి తక్బీర్ తరువాత సూరే ఫాతిహాను చదవాలి. ఒకవేళ దానితో పాటు ఏదైన చిన్న సూరాను గాని ఒక ఆయతును లేదా రెండు ఆయతులను చదవటం మంచిది. ఎందుకంటే ఈ విషయంలో ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుమా యొక్క ప్రామాణికమైన హదీసు వచ్చినది.

ఆ తరువాత రెండవ తక్బీర్ ను పలికి తషహ్హుద్ లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించినట్లు ఆయనపై దరూద్ పఠించాలి.

ఆ తరువాత మూడవ తక్బీర్ పలికి ఈ దుఆ చదవాలి:  

అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వమయ్యితినా, వ షాహిదినా వగాయిబినా, వసగీరినా వకబీరినా, వజకరినా వ ఉన్సానా, అల్లాహుమ్మ మన్ అహ్, యయ్ తహు మిన్నా ఫఅహ్, యిహీ అలల్ ఇస్లామ్, వమన్ తవఫ్ఫయ్ తహు మిన్నా ఫతవఫ్ఫహు అలల్ ఈమాన్, అల్లాహుమ్మగ్ఫిర్లహూ, వర్హమ్హూ, వఆఫిహీ, వఅఫు అన్హు, వఅక్రిమ్ నుజూలహూ, వవస్సిఅ్ ముద్ఖలహు, వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బర్ది, వనఖ్ఖిహి మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహీ, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ అద్ఖిల్హుల్ జన్నత, వ అయిజ్, హు మిన్ అజాబిల్ ఖబ్రి, వ అజాబిన్నార్, వఫ్సహ్ లహూ ఫీ ఖబ్రిహీ, వ నవ్విర్ లహూ ఫీహి, అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు, వలా తుజిల్లనా బాదహూ.

ఆ తరువాత నాల్గవ తక్బీర్ పలికి కుడివైపుకు ఒక సలాం చేసి తిరగాలి.

ప్రతీ తక్బీర్ తరువాత చేతులు పైకి ఎత్తటం (రఫ్ఉల్ యదైన్ చేయటం) మంచిది. 

మరణించిన వారు ఒక స్త్రీ అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహా అని చదవాలి.

రెండు జనాజాలు అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహుమా అని చదవాలి.ఒకవేళ రెండుకన్న ఎక్కువ జనాజాలు అయితే అల్లాహుమ్మగ్ఫిర్ లహుమ్ అని చదవాలి.

ఇక మృతుడు చిన్న పిల్లవాడైతే మన్నింపు కొరకు దుఆకు బదులు గా ఈ దుఆ చదవాలి:

(అల్లాహుమ్మజ్అల్హు ఫర్తన్ వ జుఖ్రన్ లివాలిదైహి, వ షఫీ అమ్, ముజాబన్, అల్లాహుమ్మ సఖ్ఖిల్ బిహి మవాజీనహుమా, వఅఅ్ జిమ్ బిహి ఉజూరహుమా, వఅల్హిఖ్హు బిసాలిహి సలఫిల్ ముఅ్, మినీన, వజ్, అల్హు ఫీ కిఫాలతి ఇబ్రాహీమ అలైహిస్సలాతు వస్సలాం, వఖిహి బిరహ్మతిక అజాబల్ జహీమ్)

మరియు సున్నత్ ఏమిటంటే ఇమామ్ పురుషుని తల వద్ద నిలబడాలి, స్త్రీకి మధ్యలో నిలబడాలి. ఒకవేళ ఎక్కువ జనాజాలు ఉంటే పురుషుని జనాజా ఇమామ్ కు ఆనుకుని ఉండలి. స్త్రీ జనాజా ఖిబ్లావైపు ఉండాలి. ఒకవేళ వారితో పాటు పిల్లలు ఉంటే బాలుడిని స్త్రీ కన్న ముందు ఉంచాలి. ఆ తరువాత స్త్రీని ఆ తరువాత పాపను ఉంచాలి. బాబు తల పురుషుని తలకు సమానంగా ఉంచాలి. మరియు స్త్రీ మధ్య భాగమును పురుషుని తలకు సమానంగా ఉంచాలి. మరియు అలాగే పాప తలను స్త్రీ తలకు సమానంగా ఉంచాలి. మరియు ఆమె మధ్య భాగమును పురుషుని తలకు సమానంగా ఉంచాలి. నమాజ్ చదివేవారందరు ఇమామ్ వెనుక నిలబడాలి. ఒక వేళ ఒక్కడే నమాజీ ఉండి ఇమామ్ వెనుక నిలబడటానికి చోటు లేకపోతే అతడు ఇమామ్ కి కుడివైపున నిలబడాలి.

[8] మృతుడిని పూడ్చే విధానం

పురుషుని సమాధిని నడుము లోతు తీయటం ఆనవాయితి. మరియు అందులో ఖిబ్లా వైపు లహద్ ను తీయాలి. మృతుడిని కుడి వైపు నుండి లహద్ లో ఉంచాలి. ఆ తరువాత కఫన్ యొక్క ముడులను విప్పాలి. కఫన్ ను తీయకుండా అలాగే వదిలివేయాలి. మృతుడు పురుషుడైనగాని స్త్రీ అయినా గాని ముఖంపై నుండి వస్త్రమును తొలగించకూడదు. ఆ తరువాత అతనిపై మట్టి పడకుండా ఉండటానికి పై నుండి ఇటుకలను మట్టితో పేర్చాలి. ఒక వేళ ఇటుకలు లేకపోతే బల్లలను లేదా రాళ్ళను లేదా కట్టెలను మట్టి పడకుండా ఉండటానికి ఉంచాలి. ఆ తరువాత పై నుండి మట్టితో కప్పివేయాలి. మట్టిని వేసేటప్పుడు “బిస్మిల్లాహి వ అలా మిల్లతి రసూలిల్లాహి” చదవటం మంచిది. సమాధిని ఒక జానడు పైకి ఉండేటట్లు చేయాలి. ఒకవేళ కంకర రాళ్ళు అందుబాటులో ఉంటే పై నుంచి వేసి పై నుండి నీటితో తడపాలి.

మరియు జనాజాతో వెళ్ళినవారు సమాధి వద్ద నిలబడి మృతుని కొరకు దుఆ చేయటం సున్నత్. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మృతుడిని ఖననం చేసిన తరువాత సమాధి వద్ద నిలబడి ఇలా పలికేవారు:  మీరు మీ సోదరుని మన్నింపు కొరకు వేడుకోండి. మరియు అతని స్థిరత్వం కొరకు వేడుకోండి. ఎందుకంటే అతను ఇప్పుడు ప్రశ్నించబడుతాడు[15].

[9] ఎవరికైన జనాజా నమాజు దొరకకపోతే ఖననం తరువాత జనాజా నమాజు చదవటం ధర్మబద్ధము

ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేశారు. అది కూడా నెల లోపలే అయి ఉండాలి. ఒక వేళ నెల కన్న ఎక్కువ కాలం అయితే సమాధిపై జనాజా నమాజ్ చదవటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే ఖననం జరిగి ఒక నెల తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద జనాజా నమాజు చేసినట్లు ఎటువంటి ఆధారం లేదు.

[10] మృతుని ఇంటివారు ప్రజల కొరకు భోజన ఏర్పాటు చేయటం సమ్మతం కాదు.

ప్రవక్త అనుచరులు జరీర్ బిన్ అబ్దిల్లాహ్ అల్ బజలీ రజియల్లాహు అన్హు మాట – మేము ఖననం తరువాత మృతుడి ఇంటివారి వద్ద సమావేశమవటమును, భోజనం సిద్ధం చేయటమును నౌహాలో షుమారు చేసేవారము. దీనిని ఇమామ్ అహ్మద్ హసన్ సనద్ తో ఉల్లేఖించారు. ఇక మృతుడి ఇంటివారి కొరకు లేదా వారి అతిధుల కొరకు అన్నం వండటంలో ఎటువంటి దోషం లేదు. మృతుడి బంధువులు మరియు ఇరుగుపొరుగువారు మృతుడి ఇంటివారి కొరకు భోజనం ఏర్పాటు చేయటం ధర్మబద్ధం. ఎందుకంటే షామ్ నుండి జాఫర్ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు మరణ వార్త వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటి వారిని జాఫర్ ఇంటివారి కొరకు భోజనం సిద్ధం చేయమని ఆదేశించి ఇలా పలికారు:  నిశ్చయంగా వారి వద్దకు వారిని తీరిక లేకుండా చేసే విషయం వచ్చినది[16].

మృతుని ఇంటివారు తమ వద్దకు కానుకగా వచ్చిన భోజనమును తినటానికి తమ ఇరుగుపొరుగువారిని గాని ఇతరులను పిలుచుకోవటంలో ఎటువంటి పాపం లేదు. షరీఅ నుండి మనకు తెలిసిన దానిలో దాని కొరకు ఒక పరిమిత సమయం లేదు.

[11] స్త్రీ కొరకు మృతునిపై మూడు రోజుల కన్న ఎక్కువ దుఃఖించటం సమ్మతం కాదు కానీ తన భర్తపై లేదా ఆమె గర్భిణీ అయితే.

స్త్రీ కొరకు మృతునిపై మూడు రోజుల కన్న ఎక్కువ దుఃఖించటం సమ్మతం కాదు. కాని తన భర్తపై నాలుగు నెలల పది దినముల వరకు దుఃఖించటం తప్పనిసరి. ఒక వేళ ఆమె గర్భిణీ అయితే పిల్లవాడిని జన్మనిచ్చేంతవరకు దుఃఖించవచ్చు.ఎందుకంటే దీని గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసు నిరూపణ ఉన్నది.

ఇక పురుషుడికి తన బంధువుల లేదా ఇతరుల మరణంపై దుఃఖించటం సమ్మతం కాదు.

[12] సమయం ఉన్నప్పుడు సమాధుల సందర్శనం వారి కొరకు దుఆ చేయటానికి, వారి కొరకు కారుణ్యమును కోరటానికి మరియు మరణమును, దాని తరువాత దానిని గుర్తు చేసుకోవటానికి పురుషుల కొరకు ధర్మబద్దం చేయబడినది.

ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీరు సమాధులను సందర్శించండి అది మీకు పరలోకమును గుర్తుచేస్తుంది.[17] దీనిని ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ తన సహీహ్ లో ఉల్లేఖించారు.

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరులకు మీరు సమాధులను సందర్శించినప్పుడు ఈ దుఆను చదవండి అని బోధించేవారు:  

అస్సలాము అలైకుమ్ అహ్లద్దియార్ మినల్ ముమినీన వల్ ముస్లిమీన్ , వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్నస్ అలుల్లాహల్ లనా వలకుముల్ ఆఫీయ.

అల్లాహ్ మనకన్న ముందు వారిని వెనుకవారిని కరుణించుగాక.[18]ఇక స్త్రీల కొరకు సమాధుల సందర్శన లేదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులను సందర్శించే స్త్రీలను శపించారు. ఎందుకంటే వారి సందర్శనం వలన ఉపద్రవాలు తలెత్తే మరియు అసహనమును ప్రదర్శించే ప్రమాదము ఉన్నది. మరియు ఇలాగే శ్మసానం వరకు జనాజా వెనుక వెళ్ళటం వారి కొరకు సమ్మతం కాదు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాని నుండి వారించారు. ఇక మస్జిద్ లో లేదా నమాజు చేసే చోట జనాజా నమాజు చేయటం పురుషులకు మరియు స్త్రీలకు ధర్మబద్దం చేయబడినది.

సేకరించటం సులభమైన చివరి విషయం ఇది.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.


[1] సూరతుల్ ఇఖ్లాస్:  1-4

[2] సూరతుష్ షూరా: 11.

[3] సూరతుల్ అన్ఆమ్ 88వ ఆయతు.

[4] సూరతు తౌబా 17వ ఆయతు

[5] సూరతున్నిసా 48వ ఆయతు

[6] సూరతుల్ మాయిదా 72వ ఆయతు

[7] అహ్మద్ (5/428)

[8] అహ్మద్ (5/428)

[9] బుఖారీ: అల్ ఈమాన్ వన్నుజూర్ (6271), ముస్లిం: అల్ ఈమాన్ (1646), తిర్మిజీ: అన్నుజూర్ వల్ ఈమాన్ (1533), నసాయీ: ఈమాన్ వన్నుజూర్ (3764), అబూదావూద్: అల్ ఈమాన్ వన్నుజూర్ (3249).ఇబ్నె మాజ: అల్ కఫ్ఫారాత్ (2094), అహ్మద్ (1/47), మాలిక్: అన్నుజూర్ వల్ ఈమాన్ (1037), అద్దార్మీ: అన్నుజూర్ వల్ ఈమాన్ (2341).

[10] బుఖారీ: అల్ అదబ్ (5757), ముస్లిం: అల్ ఈమాన్ (1646), తిర్మిజీ: అన్నుజూర్ వల్ ఈమాన్ (1535), నసాయీ: ఈమాన్ వన్నుజూర్ (3766), అబూదావూద్: అల్ ఈమాన్ వన్నుజూర్ (3251).ఇబ్నె మాజ: అల్ కఫ్ఫారాత్ (2094), అహ్మద్(2/69), మాలిక్: అన్నుజూర్ వల్ ఈమాన్ (1037), అద్దార్మీ: అన్నుజూర్ వల్ ఈమాన్ (2341).

[11] అబూ దావూద్: అల్ అదబ్ (4980), అహ్మద్ (5/399).

[12] ఇబ్నె మాజ: అజ్జుహ్దు (4204), అహ్మద్ (3/30).

[13] సూరతున్నిసా-43 ఆయతు

[14] ముస్లిం: అల్ జనాయిజ్ (916), తిర్మిజీ: అల్ జనాయిజ్ (976), నసాయీ: అల్ జనాయిజ్ (1826), అబూ దావూద్: అల్ జనాయిజ్ (3117), ఇబ్నె మాజ: మా జాఅ ఫిల్ జనాయిజ్ (1445), అహ్మద్ (3/3).

[15] అబూదావూద్: అల్ జనాయిజ్ (3221).

[16] తిర్మిజీ: అల్ జనాయిజ్ (998), అబూదావూద్: అల్ జనాయిజ్ (3132), ఇబ్నె మాజ: మా జాఅ ఫిల్ జనాయిజ్ (1610).

[17] ముస్లిం: అల్ జనాయిజ్ (976), నసాయీ: అల్ జనాయిజ్ (2034), అబూ దావూద్: అల్ జనాయిజ్ (3234), ఇబ్నె మాజ: మా జాఅ ఫిల్ జనాయిజ్ (1569), అహ్మద్ (2/441).

[18] ముస్లిం: అల్ జనాయిజ్ (975), నసాయీ: అల్ జనాయిజ్ (2040), ఇబ్నె మాజ: మా జాఅ ఫిల్ జనాయిజ్ (1547), అహ్మద్ (5/353).