యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/3aASE6ZWQGQ [40 నిముషాలు]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త యూసుఫ్(అలైహిస్సలాం)
(క్రీ.పూ. 1700 నుంచి క్రీ.పూ.1680 వరకు)

యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు.

సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు.

వారి మనస్సుల్లో చెడు ఆలోచనలు మొలకెత్తి పెను వృక్షాలు కాసాగాయి.యూసుఫ్ (అలైహిస్సలాం)ను చంపేయాలని వారు కుట్రపన్నారు. కాని వారిలో పెద్దవాడు, తెలివిగలవాడు అయిన యహూదా మాత్రం చంపడానికి అంగీకరించలేదు.“హత్య చేయడానికి విశ్వాసులకు అనుమతి లేదు. యూసుఫ్ ఎలాంటి నేరం చేయలేదు. అతను మనకు ఎలాంటి హాని కలిగించలేదు. మనం ఒక పని చేద్దాం.వర్తక బృందాలు వెళ్లే దారిలో ఏదైనా బావిలో అతడిని తోసేద్దాం. నీటి కోసం బావి-వద్దకు వచ్చే ప్రయాణీకులు అతడిని చూసి తమతో తీసుకుపోయి దూరప్రాంతాల్లో బానిసగా అమ్మేస్తారు. ఈ విధంగా మనం అతడిని వదిలించుకోవచ్చు”అని అతను సలహా ఇచ్చాడు.

ఒక రోజు గొర్రెలను కాయడానికి వెళుతూ యూసుఫ్ను కూడా తమతోపంపమని వారు తండ్రిని కోరారు. అతణ్ణి జాగ్రత్తగా చూసుకుంటామని తండ్రికి హామీ ఇచ్చారు. యూసుఫ్ (అలైహిస్సలాం) తాను కూడా వెళ్ళాలని చాలా సరదా పడ్డారు. బిన్యమిన్కు కూడా వెళ్ళాలని ఉంది. కాని తండ్రి పంపనందు వల్ల ఆయన చాలా నిరాశపడ్డాడు. యాకూబ్ (అలైహిస్సలాం) తన భయాన్ని వెలిబుచ్చుతూ, మీరు గొర్రెలపై దృష్టి పెట్టి ఉన్నప్పుడు ఏదైనా క్రూర జంతువు వచ్చి యూసుఫ్కు హాని తలపెట్టవచ్చన్నారు. కాని వారు ఆయనకు హామీ ఇస్తూ తాము చాలా మందిమి ఉన్నామని, ఎలాంటి క్రూరజంతువు వల్ల ప్రమాదం ఉండదని అన్నారు.చివరకు ఆయన యూసుఫ్ (అలైహిస్సలాం)ను వారితో పంపడానికి అంగీకరించారు.

ఇప్పుడు యూసుఫ్ను వదలించుకోవచ్చని వారు సంబరపడ్డారు. ఇకనుంచి తండ్రి ప్రేమ తమకే లభిస్తుందని భావించారు. ఇల్లు వదలి బయటకు రాగానే వారు తిన్నగా బావి వద్దకు వెళ్ళారు. నీళ్ళు తాగాలన్న సాకుతో అక్కడకు యూసుఫ్ను తీసుకుపోయారు. వారిలో ఒకడు యూసుఫ్ (అలైహిస్సలాం)ను గట్టిగా పట్టుకున్నాడు. ఉలిక్కిపడిన యూసుఫ్ (అలైహిస్సలాం) వదలించు కోవడానికి పెనుగులాడారు. మిగిలిన సోదరులు కూడా వచ్చి ఆయన్ను గట్టిగా పట్టుకున్నారు.అందులో ఒకడు యూసుఫ్ (అలైహిస్సలాం) చొక్కా విప్పి తీసుకున్నాడు. మిగిలిన వాళ్ళు ఆయన్ను ఎత్తి బావిలో పారేసారు. యూసుఫ్(అలైహిస్సలాం) ఎంతగా ప్రాధేయపడినా వారి రాతి మనసులు కరగలేదు. తర్వాత వారు ఒక గొర్రెను చంపి ఆ రక్తంలో యూసుఫ్(అలైహిస్సలాం) చొక్కాను తడిపారు. తాము చేసిన పని రహస్యంగా ఉంచాలని అందరూ ప్రమాణం చేసుకున్నారు.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రక్తంతో తడిసిన చొక్కాను తండ్రికి చూపించి మొసలి కన్నీరు కార్చడం ప్రారంభించారు. “నాన్నగారూ! మీరు భయపడినట్టే జరిగింది. మేము అటూఇటూ పరుగులు తీస్తూ, మా వస్తువుల వద్ద యూసుఫ్ను ఉంచాము. మేము లేనప్పుడు ఒక తోడేలు వచ్చి యూసుఫ్ను తినేసింది” అని కథ అల్లి చెప్పారు.

వారు అబద్ధమాడుతున్నారన్నది యాకూబ్(అలైహిస్సలాం)కు తెలుసు. తన కుమారుడు బ్రతికే ఉన్నాడన్నది కూడా ఆయన మనసుకు తెలుసు. రక్తంతో తడిసిన ఆ చొక్కాను ఆయన తన చేతుల్లోకి తీసుకున్నారు. దాన్ని పరచి, “విచిత్రమైన తోడేలు.. నా కుమారుడిని తినేసింది కాని చొక్కాను (అలైహిస్సలాం)్సలు చింపలేదు”అన్నారు. వారి ముఖాలు మాడి పోయాయి. వారిని యాకూబ్ (అలైహిస్సలాం) గుచ్చి గుచ్చిప్రశ్నించే సరికి వారు తాము నిజమే చెబుతున్నామని అల్లాహ్ పేరు మీద అబద్ధపు ప్రమాణాలు చేశారు.

ఆ తండ్రి హృదయం బ్రద్దలైంది. కన్నీళ్ళతో, నిరుపమాన సహనాన్ని ప్రదర్శిస్తూ ఆయన దేవునితో తన కుమారుని కోసం ప్రార్థించారు.

ఆ చీకటి బావిలో ఒక రాతిని పట్టుకుని యూసుఫ్ (అలైహిస్సలాం) దానిపై కూర్చున్నారు. ఆయన చుట్టూ కటిక చీకటి. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం తాండవిస్తోంది. ఆయన మనసులో భయం గొలిపే ఆలోచనలు రాసాగాయి.ఇప్పుడు ఏం కానుంది? ఆహారం ఎలా లభిస్తుంది? తన సోదరులే తనపై ఎందుకు కుట్ర చేశారు? తన పరిస్థితి గురించి తండ్రికి తెలుసా? తన తండ్రి చిరునవ్వు ఆయన కళ్ళ ముందు కదలాడింది. తన పట్ల తండ్రి చూపిన ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చాయి. యూసుఫ్ (అలైహిస్సలాం) దేవుణ్ణి ప్రార్థించడంలో మునిగిపోయారు. నెమ్మదిగా ఆయనలో భయం తగ్గుముఖం పట్టింది. సృష్టికర్త ఆ యువకుడిని పెద్ద ఆపదకు గురిచేసి పరీక్షిస్తున్నాడు. అతనిలో అనితర సాధ్యమైన స్థయిర్యాన్ని, సహనాన్ని పుట్టించడానికి ఈ పరీక్ష పెట్టాడు. యూసుఫ్ (అలైహిస్సలాం) దైవాభీష్టానికి తలొగ్గారు.

ఆ బావి వద్దకు వర్తకుల బృందం ఒకటి వచ్చింది. నీరు తోడుకోవడానికి వారిలోని ఒక వ్యక్తి బావిలోకి నీటిని తోడే చేద వేయగానే ఆ శబ్దానికి యూసుఫ్ (అలైహిస్సలాం) ఉలిక్కి పడ్డారు. ఆయన దానిని గట్టిగా పట్టుకున్నారు. ఆ మనిషి దానిని పైకి లాగడం ప్రారంభించి చాలా బరువుగా ఉండడంతో బావిలోకి తొంగి చూశాడు. లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక మనిషి తాడును గట్టిగా పట్టుకుని కనబడ్డాడు. అతను తాడు గట్టిగా పట్టుకుని మిగిలిన వారిని కేక వేసి పిలిచాడు. “కాస్త చెయ్యి వేయండి.. ఇక్కడ మనకు ఒక ఖజానా దొరికినట్లుంది”అంటూ పిలిచాడు.

అతని తోటివారు పరుగు పరుగున బావి వద్దకు వచ్చారు. బావి నుంచి యూసుఫ్ (అలైహిస్సలాం)ను బయటకు లాగడానికి సహాయం చేశారు. బయటకు లాగి చూస్తే, ఒక అందమైన, దృఢమైన యువకుడు కనబడ్డాడు. అతడిని బానిసగా అమ్మితే చాలా డబ్బు వస్తుందని భావించారు. ఆ వెంటనే ఆయన్ను ఇనుప సంకెళ్ళతో నిర్బంధించారు. ఆయన్ను అక్కడి నుంచి సుదూరాన ఉన్న ఈజిప్టుకు తీసుకుని వెళ్లారు.

ఈజిప్టు నగరంలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. చాలా అందమైన, దృఢమైన ఒక బానిస యువకుడు అమ్మకానికి ఉన్నాడన్న వార్త నగరమంతా పాకిపోయింది. బానిసల బజారులో వందలాది మంది గుమిగూడారు.కొందరు కేవలం చూడ్డానికి వచ్చారు, కొందరు వేలం పాడడానికి వచ్చారు. కులీనులు, సంపన్నులు అందరూ మెడలు నిక్కించి ఆయన్ను చూస్తున్నారు.చివరకు గవర్నరుగారు యూసుఫ్ (అలైహిస్సలాం)ను కొనుక్కున్నాడు. యూసుఫ్ (అలైహిస్సలాం)నుఆయన తన భవనానికి తీసుకు వెళ్ళాడు.

‘గవర్నరు అజీజ్ *కు పిల్లలు లేరు. అతను తన భార్యతో, “ఈ కుర్రాడినిజాగ్రత్తగా చూసుకో. ఈ కుర్రాడు ఒక రోజు మనకు చాలా పెద్ద అదృష్టాన్ని కలుగజేస్తాడని నా నమ్మకం. కనీసం మనం అతడిని మన పుత్రుడిగానయినా దత్తత తీసుకో వచ్చు” అని చెప్పాడు.
* ఇక్కడ ‘అజీజ్’ అనేది పేరు కాదు. ఈజిప్ట్ దేశ అధికారిక బిరుదు.

యూసుఫ్ (అలైహిస్సలాం)ను బంధించి ఉన్న సంకెళ్ళు విప్పమని అజీజ్ తన సేవకులను ఆదేశించడం చూసి యూసుఫ్ (అలైహిస్సలాం) ఆశ్చర్యపోయారు. యూసుఫ్ (అలైహిస్సలాం)తో మాట్లాడుతూ, తన నమ్మకాన్ని వమ్ము చేయవద్దని, మంచిగా మసలుకుంటే ఆయన్ను బాగానే చూడడం జరుగుతుందని అజీజ్ హామీ ఇచ్చాడు. యూసుఫ్ (అలైహిస్సలాం) చిరునవ్వుతో తనను కొనుక్కుని ఆదరించిన గవర్నరుకు కృతజ్ఞతలు చెప్పారు. తాను విశ్వాసపాత్రునిగా ఉంటానని చెప్పారు.

ఇక్కడ యూసుఫ్ (అలైహిస్సలాం)కు కాస్త ఆశ్రయం లభించింది. బాగా చూసుకునే అదరువు లభించింది. ఆయన అల్లాహు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితంలో ఎదురయ్యే సంఘటనల పట్ల ఆలోచించసాగారు. కొన్ని రోజుల క్రితం తాను ఒక చీకటి బావిలో, బ్రతికే ఆశ లేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత తనను కొందరు కాపాడారు, కాని ఇనుప సంకెళ్ళతో బంధించారు. ఇప్పుడు ఒక విలాసవంతమైన భవనంలో తాను స్వేచ్ఛగా తిరుగాడుతున్నారు. ఆహారానికి ఎలాంటి కొదువలేదు. కాని ఆయన తన తల్లిదండ్రుల కోసం, సోదరుడు బినామిన్ కోసం పరితపించ సాగారు. వారిని గుర్తు చేసుకుని రోజూ దుఃఖించేవారు.

గవర్నరు గారి భార్యకు వ్యక్తిగత సేవకునిగా ఆయన నియమించబడ్డారు. ఆయన చాలా విధేయంగా పని చేసేవారు. నమ్రత, సహనం, మృదువైఖరి కలబోసిన ఆయన, అందరి హృదయాలూ చూరగొన్నారు. గవర్నరు అజీజ్ కూడా ఆయన్ను చాలా అభిమానించసాగాడు.

కాలం గడచిన కొద్ది ఆయన ఒక తెలివైన, జ్ఞాన సంపన్నుడైన యువకునిగా ఎదిగారు. ఆయనలోని సుగుణాల కారణంగా అల్లాహ్ ఆయనకు వివేకాన్ని, విజ్ఞతను, వివేచనను ప్రసాదించాడు.

ఆయన చాలా అందమైనవారు. ఆయన సౌందర్యం పట్టణంలో చర్చనీయాంశమైంది. కవులు ఆయన్ను తాము చూసిన అత్యంత అందమైన వ్యక్తిగాకీర్తిస్తూ కవితలు అల్లసాగారు. దూరప్రాంతాల నుంచి ప్రజలు ఆయన్ను చూడడానికి రాసాగారు. అనేక మంది కన్యలు, కులీన కుటుంబాలకు చెందిన స్త్రీలు ఆయన్ను స్వంతం చేసుకోవాలని కలలు కనసాగారు. కాని ఆయన ఎన్నడూఎ లాంటి అనుచితమైన చేష్టలకు పాల్పడలేదు. ఎల్లప్పుడూ మర్యాదగా, నమ్రతగా వ్యవహరించేవారు.

త్వరలోనే ఆయనకు జీవితంలో మరో పరీక్ష ఎదురైంది. అందమైన యూసుఫ్ (అలైహిస్సలాం) సౌందర్యం గవర్నరు భార్య జులేఖాను నిలువనీయలేదు.ఆయన పట్ల వెర్రి వ్యామోహం వల్ల ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ఆయనపట్ల ప్రేమలో మునిగిపోయింది. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి అంత దగ్గరగా ఉన్నప్పటికీ కనీసం తాకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఆమెకు భరించరాని దయ్యింది. అయితే ఆమె బరితెగించిన స్త్రీ కాదు. ఆమెకు ఉన్న హోదా అంతస్తుల ద్వారా ఆమె తాను కోరిన పురుషుడిని పొందగలదు. ఆమె చాలా తెలివి కలిగిన అందమైన స్త్రీ. అందుకే గవర్నరు కావాలని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల సంతానం కలగక పోయినా ఆయన మరో పెళ్ళి చేసుకోలేదు.ఆమెను అంతగా ప్రేమించేవాడు.

యూసుఫ్ (అలైహిస్సలాం) పట్ల ఆకర్షణను తట్టుకోలేని జులేఖా ఒక రోజు అందంగా ముస్తాబు చేసుకుని యూసుఫ్ (అలైహిస్సలాం)ను తన శయనాగారానికి రమ్మని పిలిపించింది. ఆయన రాగానే లోపలి నుంచి తలుపులు మూసి, నేను నీ కోసమే ఉన్నానని తన కోరికను వెళ్ళ గక్కింది.

యూసుఫ్ (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. ఈ ప్రలోభం చాలా బలమైనది. దీన్ని తిరస్కరించడం సాధారణమైన విషయం కాదు. పూర్తి యవ్వనంలో ఉన్న యూసుఫ్ (అలైహిస్సలాం) మనసులో నైతికమైన ఆలోచనలే కదలాడాయి. నన్ను కన్న కొడుకులా చూస్తున్న గవర్నరు గారి గౌరవమర్యాదలను ఎలా భంగపరచగలను? అన్నారు. “అల్లాహ్ క్షమించుగాక! మీ భర్త నాకు యజమాని. ఆయన నన్ను చాలా బాగా చూస్తున్నారు. చెడుగా వ్యవహరించిన వారికి ఎలాంటి మంచీ జరగదు”అని జవాబిచ్చారు. స్త్రీల దుర్మార్గపు ఆలోచనల నుంచి తనను కాపాడమని ఆయన దేవుణ్ణి శరణు కోరారు.

యూసుఫ్ (అలైహిస్సలాం) తిరస్కారం ఆమె వాంఛను మరింత పెంచింది. ఆయన బయటకు వెళ్ళడానికి తలుపు తీస్తుండగా ఆమె వెనక నుంచి పరుగున వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుంది. గట్టిగా లాగడం వల్ల ఆయన చొక్కా చిరిగి పోయింది. చిరిగిన చొక్కా ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది. అప్పుడే యూసుఫ్ (అలైహిస్సలాం) తలుపు తెరిచారు. ఎదురుగా గవర్నరు అజీజ్ నిలబడి ఉన్నాడు. తెలివైన ఆ స్త్రీ వెంటనే తన స్వరాన్ని మార్చి తన చేతుల్లో చిరిగిపోయిన చొక్కా ముక్కను భర్తకుచూపిస్తూ, “నీ భార్య పట్ల చెడుగా వ్యవహరించిన వ్యక్తికి శిక్ష ఏమిటి?” అని ప్రశ్నించింది. యూసుఫ్ (అలైహిస్సలాం) తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ అందుకు రుజువుగా ఆ చొక్కా ముక్కను చూపించింది. తాను అమాయకురాలినని, యూసుఫ్ (అలైహిస్సలాం) తనను లొంగదీయడానికి ప్రవర్తించాడని ఆరోపించింది. యూసుఫ్( అలైహిస్సలాం) మొదట దిగ్భ్రాంతికి గురయ్యారు. తర్వాత జరిగినది అజీజ్కు వివరించే ప్రయత్నం చేశారు. అయితే మూసి ఉన్న తలుపుల వెనుక ఏం జరిగిందో యూసుఫ్(అలైహిస్సలాం)కు, జులేఖాకు తప్ప మరెవ్వరికీ తెలియదు.

అజీజ్ వెంటనే జులేఖా సోదరునితో మాట్లాడారు. జులేఖా సోదరుడు నిజాయితి, తెలివితేటలు కలిగిన వ్యక్తి. ఆయన జులేఖా కథనాన్ని, యూసుఫ్ (అలైహిస్సలాం) చెప్పిన మాటలను విన్నాడు. తన అభిప్రాయాన్ని చెబుతూ, “సేవకుని చొక్కా ముందు భాగం చిరిగి పోయి ఉంటే జులేఖా చెబుతున్నది నిజం. అతడు ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడని చెప్పాలి. అలా కాక అతని చొక్కా వెనుక భాగం చిరిగి ఉంటే జులేఖా అబద్ధమాడుతోంది” అన్నాడు. చిరిగిన చొక్కాను పరిశీలిస్తే ఆమె చెప్పేది అబద్దమని స్పష్టంగా తెలిసింది. నిరాశా నిస్పృహలకు గురైన ఆ భర్త ఆమెతో, “సిగ్గు.. సిగ్గు.. మీ స్త్రీల మాయోపాయాలు!”అన్నాడు.

న్యాయ ప్రియుడైన అజీజ్ వెంటనే తన భార్య ప్రవర్తనకు యూసుఫ్ (అలైహిస్సలాం)కు క్షమాపణలు చెప్పాడు. యూసుఫ్ (అలైహిస్సలాం) పై అసత్యపు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు వేడుకోవాలని తన భార్యకు కూడా ఆదేశించాడు.అయితే సేవకులతో నిండిన అలాంటి భవనంలో జరిగిన ఈ సంఘటన ఒక రహస్యంగా ఉండడం సాధ్యం కాదు. ఈ కథ ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. జులేఖా ప్రవర్తన సిగ్గుమాలినదిగా స్త్రీలు మాట్లాడుకోసాగారు. “ఒక గవర్నరుకు భార్యగా ఉండి ఒక బానిసతో ప్రేమ వ్యవహారాన్ని నడుపాలనుకోవడం సిగ్గుచేటు” అని వ్యాఖ్యానించ సాగారు.

ఈ వ్యాఖ్యలు జులేఖాను చాలా బాధించాయి. యూసుఫ్ (అలైహిస్సలాం) వంటి సాటిలేని అందం కలిగిన వ్యక్తిని చూసిన ఏ స్త్రీ అయినా తన లాగే వ్యవహరిస్తుందని ఆమె భావించింది. తన అభిప్రాయాన్ని నిరూపించడానికి, తాను ఎలాంటి ఆకర్షణకు గురయ్యిందో అలాంటి ఆకర్షణకే మిగిలిన స్త్రీలు అందరూ గురయ్యే పథకాన్ని వేసింది. వారందరిని ఒక పెద్ద విందుకు ఆహ్వానించింది.గవర్నరు గారి భార్య ఇచ్చిన విందుకు రాకుండా ఎలా ఉంటారు. అందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఆ బానిస కుర్రాడిని కూడా చూడాలని వచ్చారు. జులేఖాతో చనువు ఉన్న కొందరు స్త్రీలయితే యూసుఫ్(అలైహిస్సలాం) ను పరిచయం చేయటానికి అంగీకరిస్తేనే తాము విందుకు వస్తామని హాస్యమాడారు.

విందు ప్రారంభమయ్యింది. రకరకాల ఫలాలు వారి ముందు ఉన్నాయి.వాటిని కోయడానికి పదునైన కత్తిని ప్రతి ఒక్కరి ముందు ఉంచడం జరిగింది.ఆ ఫలాలను తినడానికి వారు కత్తితో వాటిని కోస్తున్నప్పుడు జులేఖా అక్కడికి యూసుఫ్ (అలైహిస్సలాం)ను పిలిచింది. ఆయన అక్కడికి హుందాగా వచ్చారు. జులేఖా ఆయన్ను పేరు పెట్టి పిలువగానే ఆ స్త్రీలు అందరూ తలెత్తి ఆయన్ను చూశారు.అలాంటి అందమైన యువకుడిని వారు ఎన్నడూ చూడలేదు. ఆయన అందం వారిని మంత్రముగ్ధుల్ని చేసింది. వారు తమ చూపును ఆయనపై నుంచి తప్పించలేక పోయారు. ఆయన్ను అలా చూస్తూ ఉండిపోయారు. చివరకు తమ చేతుల్లోఉన్న ఫలాన్ని కోసే బదులు వేళ్ళు కోసుకున్నారు. ఇది చూసిన జులేఖా ముఖంలో సంతృప్తి కదలాడింది. తన పథకం ఫలించిందని ఆమె భావించింది. అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, “ఈ యువకుడి విషయంలోనే మీరందరూ నాపై ఆరోపణలు, విమర్శలు చేశారు, ఇతడు నాకే స్వంతం, నా మాటకు ఒప్పుకోకపోతే ఇతడ్ని జైల్లో నేరస్తులతో పాటు మగ్గేలా చేస్తాను” అని అందరి ముందు ధైర్యంగా ప్రకటించింది. ఈ మాటలు విన్న యూసుఫ్ (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! చెడుకు పాల్పడేకన్నా జైలే నాకు మేలయినది” అని ప్రార్థించారు.

ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యూసుఫ్ (అలైహిస్సలాం)ను లోబరచుకోలేక పోయింది. ఆమె దెబ్బతిన్న తాచులా బుసలు కొట్టింది. తన గౌరవ మర్యాదలు నిలబడాలంటే యూసుఫ్ (అలైహిస్సలాం) జైలుకు పోవాలని తన భర్తకు నచ్చజెప్పింది.లేకపోతే తాను అతడి గౌరవమర్యాదలను కాపాడలేనని స్పష్టంగా చెప్పేసింది. యూసుఫ్ (అలైహిస్సలాం) నిర్దోషి అన్న విషయం అజీజ్కు బాగా తెలుసు. యూసుఫ్ (అలైహిస్సలాం) మంచి యువకుడని, విశ్వాసపాత్రుడైన సేవకుడని ఆయనకు బాగా తెలుసు.అందువల్లనే ఆయన యూసుఫ్ (అలైహిస్సలాం)ను అభిమానిస్తున్నాడు. ఒక అమాయకుడిని జైలులో పెట్టించడం ఆయనకు ఇష్టం లేదు. కాని ఆయనకు మరో దారికూడా కనబడలేదు. యూసుఫ్(అలైహిస్సలాం)ను జులేఖాకు దూరంగా ఉంచడం వల్లనే యూసుఫ్ (అలైహిస్సలాం) గౌరవమర్యాదలు కూడా భద్రంగా ఉంటాయని ఆయన భావించాడు. ఆ రాత్రి ఆయన బరువైన మనసుతో యూసుఫ్ (అలైహిస్సలాం)ను జైలుకు పంపాడు.

ఈ జైలు శిక్ష యూసుఫ్ (అలైహిస్సలాం)కు మూడవ పరీక్ష. ఈ సమయంలో అల్లాహ్ ఆయనకు ఒక అసాధారణమైన వరాన్ని ప్రసాదించాడు. కలల అర్థాన్ని గ్రహించే శక్తి ప్రసాదించాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ఏదో అపరాధం వల్ల అదే జైలుకు వచ్చారు. అందులో ఒకడు రాజుగారి వ్యక్తిగత సేవకుడు. రెండవ వాడు రాజుగారి వంటవాడు. యూసుఫ్ (అలైహిస్సలాం)ను చూసి వారు ఆయన నేరస్తుడు కాదని గ్రహించారు. ఆయన ముఖంలో ధర్మపరాయణతకు సంబంధించిన తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశించేది. వారిద్దరికి విచిత్రమైన కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని వారు ఆతృత కనబరిచారు. వారు యూసుఫ్ (అలైహిస్సలాం)ను తమ కలలకు అర్థం చెప్పవలసిందిగా కోరారు. రాజుగారి వ్యక్తిగత సేవకుడు తనకల గురించి చెబుతూ, “నా కలలో నేను ఒక ద్రాక్ష తోటలో ఉన్నాను. ద్రాక్షపళ్ళ రసాన్ని తీసి రాజుగారి కోసం పాత్రలో పోస్తున్నాను” అన్నాడు. రాజుగారి వంటవాడు తన కల గురించి చెబుతూ, “నేను కలలో ఒక రొట్టెలు ఉన్న బుట్టను నెత్తిన పెట్టుకుని వెడుతున్నాను. పక్షులు 9 రొట్టెలను తినేస్తున్నాయి” అన్నాడు. వారి కలలకు అర్థం చెబుతానని యూసుఫ్ (అలైహిస్సలాం) హామీ ఇచ్చారు. కలల అర్థాన్ని గ్రహించే శక్తి తనకు అల్లాహ్ ప్రసాదించాడని వారికి చెప్పారు. అల్లాహ్ ను తిరస్కరించేవారు, మరణానంతర జీవితాన్ని తిరస్కరించేవారి మార్గాన్ని తాను తిరస్కరిస్తున్నానని, తాను తన తాతముత్తాతలైన ప్రవక్తల ధర్మానికి కట్టుబడుతున్నానని, తాను అల్లాహ్ కు భాగస్వాములను చేర్చేవాడిని కాదని, అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదని స్వయంగా ఆయనే ఆదేశించాడని వివరించారు.

ఆ తర్వాత ఆయన ఆ ఇద్దరి కలల అర్థాన్ని గురించి వివరించారు.అందులో ఒకరి కల మంచిని సూచిస్తుందని, మరొకరికల చెడును సూచిస్తుందని అన్నారు. రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిర్దోషిగా విడుదల అవుతాడని, కాని రాజు గారి వంటవాడు దోషిగా నిరూపించబడి శిలువ వేయబడతాడని అన్నారు. పక్షులు అతని తలను పొడిచి తింటాయని చెప్పారు. రాజుగారి వ్యక్తిగత సేవకుడు నిజానికి అబద్ధపు ఆరోపణల వల్ల జైలు పాలయ్యాడు. కాని రాజుగారి వంటవాడు మాత్రం రాజుకు విషం ఇచ్చి చంపే కుట్రలో పాలుపంచుకున్న నేరస్తుడు.)

యూసుఫ్ (అలైహిస్సలాం) చెప్పిన విధంగానే రాజుగారి వంటవాడికి శిక్ష పడింది.రాజుగారి వ్యక్తిగత సేవకుడు విడుదలయ్యాడు. అతను మళ్ళీ రాజుగారి కొలువులో చేరిపోయాడు. యూసుఫ్ (అలైహిస్సలాం) తన కలకు అర్థాన్ని వివరించడం, ఆయన చెప్పినట్లే జరగడం, ఆయన ముఖంలోని తేజస్సు రాజుగారి వ్యక్తిగత సేవకుడిపై గొప్ప ప్రభావాన్ని వేశాయి. యూసుఫ్ (అలైహిస్సలాం)కు ఎలా తాను బదులు తీర్చుకునేదని ప్రశ్నించాడు. తనకు అన్యాయంగా విధించిన జైలు శిక్ష గురించి రాజు గారికి చెప్పమని యూసుఫ్ (అలైహిస్సలాం) అతడిని కోరారు. కాని జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు ఈ విషయాన్ని మరచిపోయాడు. అందువల్ల యూసుఫ్ (అలైహిస్సలాం) మరికొన్ని సంవత్సరాలు జైలులోనే ఉండవలసి వచ్చింది.

ఒక రోజు రాజు గారికి ఒక కల వచ్చింది. ఆ కల ఆయన్ను చాలా కలచివేసింది. రాజ్యంలోని పండితులు, మేధావులందరినీ ఆయన హాజరు పరచి తన కలకు అర్థాన్ని చెప్పమన్నాడు. రాజుగారు తన కలలో ఏడు పుష్టికరమైన ఆవులను చూశారు. వాటిని ఏడు బక్కచిక్కిన ఆవులు తినేస్తున్నాయి. ఏడు విరగపండిన మొక్కజొన్న పొత్తులను, మరో ఏడు ఎండిన పొత్తులను చూశారు. ఈ కలకు అర్ధం చెప్పవలసిందిగా రాజు కోరాడు. దర్బారులోని మేధావులు, పండితులు నిజాయితీగా తమ అశక్తతను ప్రకటించారు. ఈ కలకు అర్థం తాము చెప్పలేమన్నారు. ఈ కలలో మిశ్రమ సంకేతాలున్నాయని, ఇలాంటి కలల అర్థం చెప్పే శక్తి తమకు లేదని అన్నారు.

జైలు నుంచి విడుదలైన రాజుగారి వ్యక్తిగత సేవకుడు అప్పటికి రాజుగారి కొలువులో మళ్ళీ చేరి ఉన్నాడు. అప్పుడు అతడికి జైలులో తన కలకు అర్థం చెప్పిన యూసుఫ్ (అలైహిస్సలాం) గుర్తుకు వచ్చారు. అతను రాజు గారితో, “ప్రభూ! మీ కారాగారంలో ఒక పుణ్యాత్ముడు ఉన్నారు. ఆయన కలల అర్థాన్ని వివరించే విద్యలో ప్రావీణ్యం కలిగినవారు. నన్ను మీరు ఆయన వద్దకు పంపితే నేను వెళ్ళి కలకు అర్థాన్ని తెలుసుకుని వస్తాను” అన్నాడు. రాజుగారు అతడిని వెంటనే వెళ్ళాలని ఆజ్ఞాపించారు.

రాజుగారి కలకు అర్థాన్ని తన వద్దకు వచ్చిన సేవకుడికి యూసుఫ్ (అలైహిస్సలాం)ఇలా వివరించారు: రాజ్యంలో ఏడు సంవత్సరాలు పుష్కలంగా పంటలు పండుతాయి. సరియైన విధంగా సేద్యం చేస్తే మంచి దిగుబడి వస్తుంది. ప్రజల అవసరాలకు మించి పంటలు పండుతాయి. ఈ మిగులును నిలువ చేసుకోవాలి.ఆ పిదప ఏడు సంవత్సరాలు కరవు ఉంటుంది. నిలువ ఉంచుకున్న ధాన్యాన్ని ఈ కరవు కాలంలో ఉపయోగించు కోవాలి. అయితే కరువు సంవత్సరాల్లోనూ కొంత ధాన్యాన్ని మిగుల్చుకుని తర్వాతి సంవత్సరాలకు ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఇంకా ఆయన కలకు అర్థాన్ని వివరిస్తూ, “ఏడు సంవత్సరాల కరవు కాలం గతించిన తర్వాత ఒక సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. సరియైన విధంగా నీటిని ఉపయోగించుకుంటే ద్రాక్ష, ఆలివ్ పంటలు బాగా పండుతాయి. ఆ విధంగా ద్రాక్ష, ఆలివ్ నూనెలు ప్రజలకు పుష్కలంగా లభిస్తాయి” అని చెప్పారు.

ఈ శుభవార్తను తీసుకుని రాజుగారి వ్యక్తిగత సేవకుడు రాజుగారి వద్దకు వచ్చాడు. యూసుఫ్(అలైహిస్సలాం) తన కలకు చెప్పిన అర్థం రాజు గారికి ఆసక్తికరంగా కనబడింది. ఆయన వెంటనే యూసుఫ్ (అలైహిస్సలాం)ను పిలుచుకు రావలసిందిగా ఒక భటుని పంపించాడు. కాని ఆ భటుడు యూసుఫ్ (అలైహిస్సలాం) మాటలు విని ఆశ్చర్యపోయాడు. జైలు నుంచి విముక్తి లభిస్తుందంటే ఏ ఖైదీ అయినా సంతోషంతో కేరింతలు కొడతాడు. కాని యూసుఫ్ (అలైహిస్సలాం) మాత్రం ముందు తనపై మోపబడిన అబద్ధపు ఆరోపణలను ఉపసంహరించుకుంటేనే జైలు నుంచి బయటకు వస్తానని చెప్పారు. ఆయన భటునితో ఈ విషయం చెబుతూ, “రాజుగారి వద్దకు వెళ్ళి చెప్పు. ఆయన్ను అవసరమైతే గవర్నరు గారి భార్య ఇచ్చిన విందుకు హాజరైన మహిళలను విచారించమని చెప్పు. నాకు ఎందుకు జైలు శిక్ష విధించారో వారిని అడగమను” అని చెప్పి పంపించారు.

భటుని ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజుగారు వెంటనే విచారణజరిపించారు. అప్పటికి గవర్నరు గారి భార్య కూడా ముసలిదయ్యింది. యూసుఫ్ (అలైహిస్సలాం) కష్టాలకు తానే కారణమని ఒప్పుకుంది. తాను మానవమాత్రురాలినని, తనకూ బలహీనతలు ఉండడం సహజమని ఆమె చెప్పుకుంది. కాని ఇప్పుడు తాను అల్లాహ్ శరణు వేడుకుంటున్నానని, చెడు ఆలోచనలు మానుకున్నానని, తనను క్షమించాలని రాజు గారిని వేడుకుంది. ఆమె పట్ల జాలితో రాజు గారు ఆమెను క్షమించారు. యూసుఫ్ (అలైహిస్సలాం) నిర్దోషి అని రుజువయ్యింది. రాజుగారు ఈ విషయం యూసుఫ్ (అలైహిస్సలాం)కు తెలియజేసి, ఆయన్ను రాజభవనానికి ఆహ్వానించారు. యూసుఫ్ (అలైహిస్సలాం)ను చూడగానే ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి రాజుగారు ఆయనకు తన దర్బారులో ఉన్నత పదవిని కట్టబెట్టారు. రాజ్యంలోని ధాన్యాగారాల నియంత్రణ బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఆ విధంగా ఆయన రాజ్యంలోని పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకుని రానున్న కరవు కాలాల్లో ఇబ్బందులు ఎదురవ్వకుండా తగిన ఏర్పాట్లు చేస్తారని రాజుగారు ఆశించారు.

కాలచక్రం గిరగిర తిరిగింది. పుష్కలంగా పంటలు పండే మొదటి ఏడు సంవత్సరాల కాలం మొదలయింది. యూసుఫ్ (అలైహిస్సలాం) ఆ కాలంలో రాజ్యంలోని పంటల విషయంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాతి ఏడేళ్ళు రాజ్యంలో కరవు కాలం వచ్చిపడింది. ఆ ప్రాంతమంతటా కరవు అలముకుంది. యూసుఫ్(అలైహిస్సలాం) స్వదేశం కన్ఆన్లో కూడా కరవు అలముకుంది. తమ రాజ్యంలో పుష్కలంగా ధాన్యం నిలువ ఉంది కాబట్టి అవసరం ఉన్న రాజ్యాలకు తగిన ధరకు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అమ్మవచ్చని యూసుఫ్ (అలైహిస్సలాం) రాజుగారికి సలహా ఇచ్చారు. రాజుగారు ఈ సలహాను అంగీకరించారు.

యాకూబ్ (అలైహిస్సలాం) తన కుమారులను ఈజిప్టు పంపించారు. బినియామిన్ తప్ప ఆయన కుమారులు అందరూ ధాన్యం కొనుక్కుని వెళ్ళడానికి ఈజిప్టు వచ్చారు. ధాన్యం కోసం సుదూర ప్రాంతం నుంచి వచ్చిన అనేక మంది సోదరుల గురించి యూసుఫ్ (అలైహిస్సలాం) విన్నారు. వారు ఈజిప్టు భాష కూడా మాట్లాడలేక పోతున్నారని ఆయన వద్దకు సమాచారం వచ్చింది. తమకు కావలసిన ధాన్యం కొనుగోలు కోసం వారు ఆయన ముందు హాజరైనప్పుడు యూసుఫ్ (అలైహిస్సలాం)వెంటనే తన సోదరులను గుర్తించారు. కాని వారు ఆయన్ను గుర్తించలేక పోయారు. ఆసలు వారు ఆయన్ను ఎలా గుర్తిస్తారు? వారి దృష్టిలో యూసుఫ్ (అలైహిస్సలాం) ఇకలేరు. ఏళ్ళ క్రితం చీకటి బావిలో విసరివేయబడ్డారు.

యూసుఫ్ (అలైహిస్సలాం) వారిని సాదరంగా ఆహ్వానించారు. వారికి కావలసిన ధాన్యాన్ని ఇచ్చిన తర్వాత వారిని ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తాము గౌరవనీయుడైన ప్రవక్త సంతానమని, తాము పదకొండు మంది సోదరులమని వారు సమాధానమిచ్చారు. తమలో అందరికన్నా చిన్నవాడు ఇంటి వద్ద తమ ముసలి తండ్రికి సేవచేయడానికి ఉండిపోయాడని చెప్పారు. తండ్రి గుర్తుకు రాగానే యూసుఫ్ (అలైహిస్సలాం) కళ్ళు నీటితో నిండిపోయాయి. తన మనసు తండ్రి కోసం పరితపించింది. తన సోదరులతో ఆయన, “మిమ్మల్ని నమ్మవచ్చా?” అని ప్రశ్నించారు. వారు కాస్త అసహనంగా, “మేము అబద్ధాలు ఎందుకు చెబుతాము”అన్నారు.

“మీరు చెప్పేది నిజమైతే సాక్ష్యంగా మీ సోదరుడిని తీసుకురండి. నేను మీకు రెట్టింపు ధాన్యం ఇస్తాను” అన్నారు యూసుఫ్ (అలైహిస్సలాం). “మీ సోదరుడినితీసుకురానట్లయితే మీరు మళ్ళీ ఇక్కడికి రాకపోవడమే మంచిది” అని హెచ్చరించారు.

వాళ్ళు ఆనందంగా తమ సోదరుడిని తీసుకువస్తామని చెప్పారు. కాని అందుకు తమ తండ్రి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వారిని మళ్ళీ వచ్చేలా చేయడానికి యూసుఫ్ (అలైహిస్సలాం) తన సేవకునితో, వాళ్ళు ధాన్యానికి చెల్లించిన నాణాలున్న సంచిని కూడా ఒక బస్తాలో ఉంచేయమన్నారు. ఆ విధంగా వాళ్ళు ఆశతో మళ్ళీ వస్తారని ఆయన ఆశించారు.

ఇంటికి తిరిగి వెళ్ళిన ఆ సోదరులు తమ తండ్రి యాకూబ్ (అలైహిస్సలాం)తో ఈజిప్టులో జరిగింది యావత్తు వివరించారు. బిన్ యామిన్ ను తీసుకుని ఈజిప్టు వెళ్ళవలసి ఉందని ఆయనతో చెప్పారు. యాకూబ్ (అలైహిస్సలాం) దుఃఖంతో తాను వారి వెంట బిన్ యమీన్ ను పంపేది లేదని అన్నారు. మిమ్మల్ని నమ్మి యూసుఫ్ (అలైహిస్సలాం) ను మీ వెంట పంపితే మీరు ఏం చేశారని దుఃఖించారు.

ఆ తర్వాత వాళ్ళు తమ ధాన్యం బస్తాలు తెరిస్తే వాటిలో ఒక దానిలో తాము చెల్లించిన సొమ్ము ఎలాంటిదలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వారు వెంటనే తమ తండ్రి వద్దకు వచ్చి, “చూడండి! అక్కడి అధికారి మేము ఇచ్చిన డబ్బు కూడా వాపసు ఇచ్చేశాడు. అతను బిన్యమిను ఎలాంటి హాని కలిగించడనడానికి ఇదే సాక్ష్యం. బిన్యామిన్ను తీసుకువెళ్ళడం వల్ల లాభమే ఉంటుంది” అని వాదించారు. కాని యాకూబ్ (అలైహిస్సలాం) వారితో పాటు బిన్యామిన్ను పంపడానికి ఇష్టపడలేదు.

కొంతకాలం గడచిన తర్వాత వారి వద్ద ఉన్న ధాన్యం అయిపోయింది.మళ్ళీ ఈజిప్టు వెళ్ళి ధాన్యం తీసుకు రావలసిందిగా యాకూబ్ (అలైహిస్సలాం) వారికి చెప్పారు. కాని యూసుఫ్ (అలైహిస్సలాం) చేసిన హెచ్చరిక వారికి గుర్తుకు వచ్చింది.బిన్యమిన్ లేకుండా తాము ఈజిప్టు వెళ్ళలేరు. తప్పనిసరయి యాకూబ్ (అలైహిస్సలాం)వారితో పాటు బినియామిన్ను పంపించారు. అయితే వారితో పాటు బిన్యమిన్ను పంపే ముందు వారితో ఒక ప్రమాణం చేయించారు. “అతడిని ఎలా తీసుకు వెడుతున్నారో అదే స్థితిలో సురక్షితంగా తిరిగి తీసుకువస్తామని నాకు అల్లాహ్ పేరు మీద మీరు ప్రమాణం చేయండి లేకపోతే నేను అతన్ని మీ వెంట పంపను” అని అన్నారాయన. తండ్రి కోరిన విధంగా వారు ప్రమాణం చేశారు. యాకూబ్ (అలైహిస్సలాం) వారిని ఆశీర్వదించి వారిని కాపాడాలని అల్లాహు ప్రార్థించారు. వారు ఈజిప్టుకు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు. బిన్ యామిన్ భద్రతవిషయమై పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.

యూసుఫ్ (అలైహిస్సలాం) వారిని సాదరంగా ఆహ్వానించారు. తన స్వంత సోదరుడు బిన్యమిన్ ను గుండెలకు హత్తు కోవాలన్న కోరికను ఆయన అతికష్టమ్మీదఅణచుకున్నారు. వారందరికీ ఆయన ఒక విందు ఇచ్చారు. భోజనాల వద్ద వారు జంటలు జంటలుగా కూర్చున్నారు. యూసుఫ్ (అలైహిస్సలాం) తాను అమితంగా ప్రేమించే సోదరుడు బినామిన్ ప్రక్కన కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయించారు. బిన్యామిన్ ఈ ఏర్పాటు చూసి దుఃఖిస్తూ తన సోదరుడు యూసుఫ్ (అలైహిస్సలాం)ఉన్నట్లయితే తన ప్రక్కన కూర్చుని ఉండేవాడని చెప్పారు.

ఆ రాత్రి యూసుఫ్ (అలైహిస్సలాం) బిన్యమిన్ ను ఒంటరిగా కలుసుకుని తనను సోదరునిగా పరిగణిస్తావా అన్నారు. బినియామిన్ జవాబిస్తూ, “మీరు చాలా మంచి అధికారి. కాని నా సోదరుడు యూసుఫ్ (అలైహిస్సలాం) స్థానం మీరు పూరించలేరు”అన్నారు. యూసుఫ్ (అలైహిస్సలాం) కన్నీళ్ళతో తానే ఆ సోదరుడినని వివరించారు. అనేక సంవత్సరాల యెడబాటు, తర్వాత విధి తమను మళ్ళీ కలిపిందని, ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని రహస్యంగా తామిద్దరి మధ్యనే ఉండనీయాలని చెప్పారు. సోదరులిరువురు సంతోష సంబరాలతో ఒకర్నొకరు కౌగలించుకున్నారు.

మరుసటి రోజు వారికి ఇవ్వవలసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఒంటెల పైకి ఎక్కిస్తున్నప్పుడు, రాజుగారి బంగారు పాత్రను బినోయామిన్ సంచిలోకి ఒక వ్యక్తి జారవిడిచాడు. వారి ఒంటెలు పట్టణం దాటక ముందే వారిని ఒక అధికారి వెంబడిస్తూ వచ్చి, ఒంటెలు ఆపండని ఆజ్ఞాపించాడు. రాజుగారి బంగారు పాత్ర పోయిందని, వర్తక బృందాలన్నింటినీ తనిఖీ చేయవలసి ఉందని వారన్నారు. ఆ బంగారు పాత్రను వెదకి ఇచ్చిన వారికి రాజుగారు ఒక ఒంటె మోయగలిగిన ధాన్యం బహుమానంగా ఇస్తారని కూడా వారు చెప్పారు. సోదరులు అల్లాహ్ మీద ప్రమాణం చేస్తూ తాము ఇక్కడికి ఎలాంటి నేరం చేయడానికి రాలేదని అన్నారు.తాము దొంగలం కాదని వాదించారు. కాని ఆ అధికారి వారిని నిలదీస్తూ మీరు అబద్ధం చెబుతున్నట్లయితే మీకు ఎలాంటి శిక్ష విధించాలని ప్రశ్నించాడు. ఎవరి సంచిలో ఆ పాత్ర లభిస్తుందో ఆ వ్యక్తిని నిర్బంధించి విచారించాలని వారు జవాబిచ్చారు.

మొత్తం అందరినీ తనిఖీ చేయడం జరిగింది. బిన్యిమిన్ సంచిలో ఆ పాత్ర దొరకడం చూసి వారు నిర్ఘాంతపోయారు. వారందరిని నిర్బంధించి యూసుఫ్(అలైహిస్సలాం) ముందు హాజరుపరచటం జరిగింది. సోదరులు బినోయామిన్ నిజాయితీని, మంచితనాన్ని, సద్వర్తనాన్ని వివరించే బదులు, బిన్యామిన్ దొంగతనం చేయడం కొత్త కాదన్నట్లు మాట్లాడారు. అతడి పెద్దన్న (అంటే యూసుఫ్ – అలైహిస్సలాం) కూడా అలాంటి వాడే అన్నారు. తమ ఈర్ష్యాసూయలను ప్రకటించే మరో అవకాశం వారికి లభించినందుకు వారు సంబర పడ్డారు. దొంగను జైల్లో పెట్టాలని యూసుఫ్ (అలైహిస్సలాం) అన్నారు. తనను కూడా దొంగను చేసి వారు తన ముందే మాట్లాడడాన్ని ఆయన సహనంతో విన్నారు. మీరు చెప్పేది నిజమో కాదో అల్లాహ్ కు బాగా తెలుసు అనుకున్నారు.

అయితే బిన్ యామిన్ లేకుండా ఇంటికి వెళ్ళి తమ తండ్రికి ముఖం చూపించ లేమన్నది వారికి బాగా తెలుసు. తమ తండ్రి ఎనభై సంవత్సరాల వృద్ధుడని, ఈ వార్త ఆయన్ను చాలా కలచి వేస్తుందని యూసుఫ్ (అలైహిస్సలాం)కు నచ్చజెప్పాలనుకున్నారు. బిన్ యామిన్ బదులుగా తమలో ఎవరినన్నా నిర్బంధించి, బిన్యామిన్ను వదలి పెట్టాలని కోరారు. కాని యూసుఫ్ (అలైహిస్సలాం) వారి విజ్ఞప్తిని మన్నించలేదు.

వారిలో పెద్ద సోదరుడు యహూదా చాలా ఆందోళన చెందాడు. తాము బిన్యామిన్ను క్షేమంగా తీసుకువస్తామని తండ్రికి ప్రమాణం చేసి వచ్చారు.అందువల్ల తాను ఇక్కడే ఉండిపోతానని, తండ్రి అనుమతిస్తేనే, లేదా అల్లాహ్ఆ దేశిస్తేనే తిరిగి ఇంటికి వస్తానని అన్నాడు. వారు అతని కోసం కావలసిన ఆహారపదార్థాలు విడిచి పెట్టి వెళ్ళిపోయారు. యహూదా అక్కడే బిన్యమిన్కు ఎలాంటి విచారణ జరుగుతుందో అని ఎదురుచూస్తూ ఉండిపోయాడు.

ఈలోగా యూసుఫ్ (అలైహిస్సలాం) తన భవనంలో బిన్యిమిన్ ను అతిథిగా ఉంచుకున్నారు. అతని సంచిలో రాజుగారి పాత్రను ఉంచేలా పథకం వేసింది తానేనని వివరించారు. ఆ విధంగా బినామిన్ ను తన వద్ద ఉంచుకునేలా చేశానని, ఆ విధంగా ఆయన్ను కాపాడు కోవాలనుకున్నానని చెప్పారు. యహూదా కూడా బిన్ యామిన్ కోసం అక్కడే ఉండిపోయాడని తెలిసి ఆయన సంతోషించారు. యహూదా స్వతహాగా మంచివాడే. యహూదా మంచిచెడ్డలు గమనించడానికి యూసుఫ్ (అలైహిస్సలాం) రహస్యంగా ఏర్పాట్లు చేశారు. మిగిలిన సోదరులను వెనక్కి పంపడంలోనూ ఆయన వివేచన దాగి ఉంది. వారు తమ సోదరుల కోసం తిరిగి వస్తారో లేదో చూడాలని ఆయన భావించారు.

తిరిగి వచ్చిన కుమారులతో పాటు బినామిన్ లేకపోవడాన్ని యాకూబ్ (అలైహిస్సలాం) గుర్తించారు. కుమారులు ఈజిప్ట్ జరిగింది వివరించిన తర్వాత ఆయన నిరాశతో కూలబడ్డారు. బిన్యామిన్ అలాంటి నేరం ఎన్నడూ చేయడన్నది ఆయనకు బాగా తెలుసు. వారి నుంచి ముఖం తిప్పుకుంటూ ఆయన, “మీరు కథ అల్లి చెబుతున్నారు. నేను సహనం వహిస్తాను. బహుశా అల్లాహ్ వారందరినీ నా వద్దకు తీసుకువస్తాడు. ఆయనే అత్యంత వివేకం కలిగినవాడు, జ్ఞానసంపన్నుడు” అన్నారు.

బిన్యమిన్ విషయమై ఆయన చాలా బాధకు గురయ్యారు. దైవప్రార్థన మాత్రమే ఆయనకు సాంత్వననిచ్చేది. ఆ విధంగా ఆయన ధార్మిక విశ్వాసాన్ని బలో పేతం చేసుకునేవారు, సహనం వహించేవారు. ఇంతకాలం ఆయన తనకు అత్యంత ఇష్టుడైన కుమారుడు యూసుఫ్ (అలైహిస్సలాం) కోసం దుఃఖిస్తూ వచ్చారు.ఇప్పుడు ఆయన తనకు ఇష్టులైన మరో ఇద్దరు కుమారులను కోల్పోయారు.నిరంతరం రోదిస్తూ ఉండటం మూలంగా యాకూబ్ (అలైహిస్సలాం) కంటిచూపు కూడా పోయింది. మిగిలిన కుమారులు ఆయనతో, “నాన్నా! మీరు ఉత్తములైన ప్రవక్త.అల్లాహ్ పంపిన గొప్ప సందేశ హరులు. మీ వద్దకు దైవసందేశం అవతరిస్తోంది. ప్రజలు మీ నుంచి మార్గదర్శకత్వాన్ని పొందుతున్నారు. ధార్మిక విశ్వాసాన్ని పొందుతున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని మీరు కృశింపచేస్తున్నారు” అనడిగారు. యాకూబ్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ఇలాంటి మాటల వల్ల నా దుఃఖం తగ్గేది కాదు. నా కుమారులు తిరిగి వస్తేనే నా దుఃఖం ఉపశమిస్తుంది. కుమారులారా! వెళ్ళండి, వెళ్ళి యూసుఫ్ (అలైహిస్సలాం) ను, అతని సోదరుడిని వెదకి తీసుకురండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు. అవిశ్వాసులు మాత్రమే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అన్నారు.

యూసుఫ్ (అలైహిస్సలాం)ను ఎక్కడ వెదకాలో వారికి అర్థం కాలేదు. ఆయన బ్రతికి ఉన్నారో చనిపోయారో కూడా వారికి తెలియదు. ఆయన్ను చీకటి బావిలో వారు క్రూరంగా నెట్టేశారు. తాము చేసిన దానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. అయితే బిన్యమిన్, యహూదాలు ఎక్కడ ఉన్నారో వారికి తెలుసు. అందువల్ల మళ్ళీ ఈజిప్టుకు వెళ్లి అక్కడి అధికారులకు నచ్చజెప్పి బిన్ యామిన్ విడుదలకు ప్రయత్నించాలని భావించారు.

ఈజిప్టు వచ్చిన తర్వాత వారు యహూదాను కలిశారు. ఆ పిదప యూసుఫ్ (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, “మేము మళ్ళీ మీ వద్దకు రాక తప్పలేదు. మా సోదరుడిని విడుదల చేయవలసిందిగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా తండ్రిగారి దుఃఖాన్ని ఈ విధంగా మేము తగ్గించగలము. దయ చూపండి. దయచూపే వారిని అల్లాహ్ కనికరిస్తాడు” అన్నారు.

తానెవరో చెప్పవలసిన సమయం ఆసన్నమయ్యిందని యూసుఫ్ (అలైహిస్సలాం)గ్రహించారు. “మిమ్మల్ని షైతాన్ తప్పుదారి పట్టించిన రోజు మీకు గుర్తున్నదా..చాలా కాలం క్రితం మీరు నన్ను చీకటి బావిలో నెట్టేసిన రోజు మరచిపోయారా?అప్పుడు నేనెంత బ్రతిమాలినా మీ మనసు కరగలేదు కదా!” అన్నారు. వారంతా ఆశ్చర్యంతో ఆయన వైపు చూస్తుండిపోయారు. వారిలో ఒకడు అసంకల్పితంగా ,“నువ్వు యూసుఫ్ వా?” అని పలికాడు. “అవును నేను యూసుఫ్ నే. అల్లాహ్ నా పై అనుగ్రహించాడు. అల్లాహ్ నిస్సందేహంగా అపార కృపాశీలుడు” అన్నారాయన.

సోదరులు భయంతో వణకి పోసాగారు. యూసుఫ్ (అలైహిస్సలాం) వారి భయాన్ని పోగొడుతూ, “ఇప్పుడు భయపడవలసిన పనిలేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక.. ఆయన పరమ దయామయుడు” అన్నారు. వారిని యూసుఫ్ (అలైహిస్సలాం)ఆలింగనం చేసుకున్నారు. వారంతా ఆనంద భాష్పాలు రాల్చారు. ఆ రాజ్యంలో యూసుఫ్ (అలైహిస్సలాం) ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. తన స్థానంలో మరొకరిని నియమించకుండా అక్కడి నుంచి తప్పుకోవడం ఆయనకు సాధ్యంకాదు. కాబట్టి ఆయన తన సోదరులను తక్షణం ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులనువెంటబెట్టుకుని ఇక్కడికే వచ్చేయండి అన్నారు. వారిని కలువాలన్న ఆతృత ఆయన్ను నిలువనీయలేదు. సోదరులకు తన చొక్కా ఒకటి ఇచ్చి ఆ చొక్కాను తండ్రి కళ్ళపై వేయమని చెప్పారు. ఆ విధంగా ఆయనకు కంటిచూపు మరలా వస్తుందని చెప్పారు.

యాకూబ్ (అలైహిస్సలాం) ఇక్కడ రాత్రింబవలు దైవప్రార్థనల్లో గడుపుతున్నారు.విచిత్రంగా ఒక ప్రశాంతత తనను ఆవహించుకున్న భావన ఆయనకు కలిగింది.ఆయన ఆశ్చర్యపోయారు. “నిశ్చయంగా నాకు యూసుఫ్ (అలైహిస్సలాం) సువాసన అనుభూతికి వస్తుంది. మీరు నన్ను మతిచెడిన ముసలి వాడనుకున్నా సరే”అన్నారు. ప్రజలు ఆయన ఏదేదో ఊహించుకుంటున్నారని భావించారు. ఈలోగా ఈజిప్టు నుంచి సోదరులు రానే వచ్చారు. తమతో పాటు వారు యూసుఫ్ (అలైహిస్సలాం) చొక్కాను కూడా తీసుకువచ్చారు. వారు సంతోషంగా తమ తండ్రికి జరిగిన వృత్తాంతం వివరించారు. యూసుఫ్ (అలైహిస్సలాం) చొక్కాను ఆయన కళ్ళపై వేశారు. ఆ వెంటనే ఆయనకు కంటిచూపు వచ్చింది.

వారు తమ తండ్రితో తాము చేసిన తప్పుకు క్షమాపణ కోరుకున్నారు. యాకూబ్ (అలైహిస్సలాం)వారితో, “నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. మీకు అల్లాహ్ శిక్ష విధించకుండా నేను కాపాడలేను. నేను కేవలం మీ క్షమాపణ కోసం అల్లాహ్ ను ప్రార్థించగలను. ఆయన చాలా క్షమించేవాడు. పరమ దయామయుడు” అన్నారు. ఆ పిదప వారందరూ ఈజిప్టుకు వెళ్ళిపోయారు.

వారందరినీ యూసుఫ్ (అలైహిస్సలాం) అత్యంత సాదరంగా ఆహ్వానించారు. అల్లాహ్ అనుగ్రహాలకుగాను అమితంగా కృతజ్ఞతలు తెలిపారు. తన తల్లిదండ్రులను ఆలింగనం చేసుకుని, “నాన్నా! నేను కన్న కలకు అర్థం ఇదే. నా ప్రభువు నా కలను నిజం చేశాడు. ఆయన నన్ను కరుణించాడు. జైలు నుంచి బయటకు తీశాడు.నాకు, నా సోదరులకు మధ్య షైతాన్ విద్వేషాన్ని రగిల్చిన తర్వాత ఇంత కాలానికి సుదూర ఎడారి నుంచి మిమ్మల్ని నా వద్దకు చేర్చాడు. నా ప్రభువు తాను తలచిన వారిపై దయచూపుతాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, మహా జ్ఞాన సంపన్నుడు”అన్నారు.

యూసుఫ్ (అలైహిస్సలాం) తన తల్లిదండ్రులను రాజుగారి వద్దకు తీసుకు వెళ్ళారు. వారందరూ ఈజిప్టులో స్థిరపడడానికి అనుమతి కోరారు. రాజ్యంలో యూసుఫ్ (అలైహిస్సలాం) ఒక ముఖ్యమైన అధికారి. రాజు చాలా సంతోషంగా యూసుఫ్ (అలైహిస్సలాం) కుటుంబం రాజ్యంలో ఉండడానికి అనుమతించాడు. యూసుఫ్ (అలైహిస్సలాం) కృతజ్ఞతతో అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు.

(చదవండి దివ్యఖుర్ఆన్ 12:3,104; 23:34,75)

తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రేమిస్తారు. కాని కొందరి పట్ల ఎక్కువ ఇష్టం చూపుతారు. అందుక్కారణం ఆ పిల్లల మంచి గుణగణాలు. అయితే ఈ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. సంతానంలో కొందరి పట్ల ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తే మిగిలిన వారిలో అసహనం, అసూయలు జనించడానికి అవకాశం ఉంది.

అసూయ వల్ల బాధలకు గురయిన వానికి దేవుని రక్షణ లభిస్తుంది. యూసుఫ్ (అలైహిస్సలాం) సోదరులు ఆయన్ను బానిసగా అమ్ముడు పోయేలా చేయడానికి పన్నిన కుట్ర నిజానికి ఆయన్ను జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చింది.

తాను చాలా ప్రేమించే తన కుమారుడు యూసుఫ్ (అలైహిస్సలాం) మరణించాడని విన్నప్పుడు యాకూబ్ (అలైహిస్సలాం) చాలా బాధపడ్డారు. కాని ఆయన నిరాశ చెందలేదు. సహనాన్ని, దేవుని కారుణ్యాన్ని ఆయన కోరుకున్నారు. అల్లాహ్ పై భారం వేసి తాను అధికంగా ప్రేమించే మరో కుమారుడు బినామిన్ను నమ్మకస్తులు కాని కుమారులు చేతుల్లో పెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈసారి కూడా ఆయన నమ్మకం వమ్మయినట్లు కనబడింది. అయితే సృష్టికర్త పట్ల ఆయన విశ్వాసం చెక్కుచెదరలేదు. ఫలితంగా ఆయనకు దేవుని గొప్ప అనుగ్రహాలు లభించాయి.

దేవుని ఏకత్వాన్ని ప్రజలకు తెలియ జేయడమే ప్రవక్తల ముఖ్య ఉద్దేశ్యం. అన్ని పరిస్థితుల్లోను, చివరకు జైలు గోడల మధ్య కూడా యూసుఫ్ (అలైహిస్సలాం) ఖైదీలకు దేవుని ఏకత్వాన్ని బోధించారు. ముస్లిములందరూ ఈ వైఖరిని కలిగి ఉండాలని అల్లాహ్ కోరుతున్నాడు.

స్త్రీపురుష కలివిడి సంప్రదాయం వల్ల ప్రమాదాలు వాటిల్లుతాయి. యూసుఫ్ (అలైహిస్సలాం) తన యజమానురాలి వెంట ఎల్లప్పుడూ ఉండేవారు.అందువల్ల ఆమె మనసులో వాంఛ తలెత్తింది. ఆమె ఆయన్ను లోబరచు కోవాలనుకున్నప్పుడు – ఆయన దేవునికి భయపడేవారు కాబట్టి, బలమైన నైతికస్థాయి కలిగిన వారు కాబట్టి ఆమె కోరికను తిరస్కరించారు. జైలు గురించి బెదిరించినప్పుడు కూడా ఆయన,“మీరు చేయమనే దానికన్నా జైలే నాకు మంచిది” అన్నారు.

ప్రజలు చాలా త్వరగా మరచిపోతారు. తమకు చేసిన మంచిని కూడా మరచిపోతారు. రాజుగారి సేవకుడు చేసింది అదే.

యూసుఫ్ (అలైహిస్సలాం) తాను చేయని నేరానికి గాను చాలా సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తన నిర్దోషిత్వం రుజువు కాకుండా విడుదల కావడానికి ఆయన తిరస్కరించారు.

అజీజ్ భార్య, తర్వాత తన తప్పు తెలుసుకుంది. దేవుణ్ణి క్షమాపణ వేడుకుంది. యూసుఫ్ (అలైహిస్సలాం), బిన్యమిన్లకు వ్యతిరేకంగా సోదరులు పన్నిన కుట్రలకు గాను వారిని యూసుఫ్ (అలైహిస్సలాం) మరణశిక్షకు గురిచేసినా, జైల్లో వేయించినా, వారిని మరో విధంగా హింసించినా సముచితమే అయ్యేది. అలా చేసే శక్తి కూడా ఆయనకు ఉండింది. కాని ఆయన వారందరినీ క్షమించారు.

దివ్యఖుర్ఆన్లో అజీజ్ భార్య పేరు ప్రస్తావనకు రాలేదు. కాని ఆమె పేరు జులేఖాగా ఇతర ఉల్లేఖనాల్లో ప్రస్తావనకు వచ్చింది.

బైబిలు ప్రకారం, జోసెఫ్ (అంటే యూసుఫ్) ప్రవక్త ఈజిప్టు దేశానికి ఫారోల కాలంలో వచ్చారు. కాని ఇది వాస్తవం కాదు, పశుపాలక రాజులుగా పేరొందిన హిక్సోస్ రాజుల కాలంలో ఆయన ఈజిప్టుకు వచ్చారు.

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [యూట్యూబ్ లింక్]

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8