ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]
ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.
قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ
“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రసంగం యొక్క ముఖ్య విషయాలు
ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.
తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.
విగ్రహారాధన ప్రారంభం
అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.
అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.
ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.
చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.
మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.
రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.
అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.
చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.
ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు
అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.
నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:
يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ
(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)
ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.
ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.
నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:
فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ﴿١٠﴾ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ﴿١١﴾ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ﴿١٢﴾
(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)
మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.
మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.
జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి
అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:
إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ
(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:
مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ
(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:
وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً
(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”
ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:
يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ
(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:
إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ
(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:
أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ
(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.
మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.
అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:
وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ
(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:
وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ
(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.
నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا
(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.
అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:
وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا
(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)
చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:
إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.
అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:
قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ
(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.
మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:
لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ
(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.
దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం
అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?
أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ
(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?
رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ﴿١١٧﴾ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ﴿١١٨﴾
(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?
وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ
(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.
నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:
رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ﴿٢٦﴾ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ﴿٢٧﴾
(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.
అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:
إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ
(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.
అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:
رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ
(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.
మహా జలప్రళయం మరియు రక్షణ
ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).
మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.
ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,
بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ
(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.
ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ
(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.
ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.
బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:
يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ
(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:
سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ
(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.
తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:
يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ
(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.
إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ
(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.
నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.
నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:
رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ
(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:
وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ
(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.
తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.
وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ
(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.
అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.
నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం
ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.
ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.
అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.
ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.
అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
—
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
“తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).
చాలా తరాలుగా నూహ్ ప్రవక్త (అలైహిస్సలాం)కు చెందిన జాతి ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు. వాటిని ‘దేవుళ్ళు’గా పిలిచేవారు. ఈ దేవుళ్ళు తమకు మేలు చేస్తారని తలపోసే వారు. తమను కాపాడుతారని, తమ అవసరాలను తీరుస్తారని భావించేవారు. ఈ దేవుళ్ళకు వారు పేర్లు పెట్టుకున్నారు. ఈ దేవుళ్ళకు ఉన్నాయని భావిస్తున్న శక్తులకు అనుగుణంగా వద్ద,సువా, యగూస్, నస్రా వగైరా పేర్లనువారు పెట్టుకున్నారు. నిజానికి ఈ పేర్లు అంతకు ముందు కాలానికి చెందిన పుణ్యాత్ముల పేర్లు. ఈ పుణ్యాత్ముల మరణం తర్వాత వారి జ్ఞాపకార్థం ముందు వారి విగ్రహాలను తయారు చేసుకున్నారు. ఆ పిదప వారినే ఆరాధించడం ప్రారంభించారు. తరాలు గడిచిన తర్వాత ప్రజలకు అసలు ఈ విగ్రహాలను ఎందుకు తయారు చేశారన్నది తెలియకుండా పోయింది. ఏదో తమ పూర్వీకులు వీటిని పూజించారు కాబట్టి తాము కూడా తప్పకుండా వాటిని పూజించాలన్న ఒక మొండి వాదన మొదల విధంగా విగ్రహారాధనయింది.చోటుచేసుకుంది. వారికి విశ్వప్రభువైన అల్లాహ్ గురించిన జ్ఞానం లేనందు వల్ల, తమ చెడు ప్రవర్తనకు దేవుడు శిక్షిస్తాడన్న స్పృహ లేనందు వల్ల వారు క్రూరమైన వారిగా, నీతి నియమాలు లేని వారిగా తయారయ్యారు. *
బహు దైవారాధన (షిర్క్)ను ఇస్లాం ధర్మం తీవ్రంగా గర్హిస్తుంది. షిర్క్ అంటే నిజమైన దేవునికి సమానంగా మరొకరిని నిలబెట్టడం అని అర్థం. అంటే దేవుని స్థానంలో మరొకరిని, విగ్రహాల రూపంలో ఉన్న మానవాకారాలను లేదా మరో ఆకారాన్ని పూజించడం అన్నమాట. అంతేకాదు, అల్లాహ్ ను, అల్లాహ్ ప్రవక్త (స)ను కాక మరెవరినైనా లేక మరిదేనినైనా తమకు అత్యంత ఇష్టమైనదిగా భావించడం కూడా షిర్క్ క్రిందికే వస్తుంది.
ఈ ప్రజల పట్ల అల్లాహ్ దయ చూపాడు. తన ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం)ను వారికి మార్గదర్శిగా పంపించాడు. నూహ్ (అలైహిస్సలాం) మంచి వక్త. చాలా సహనం కలిగిన వారు. ఆయన గొప్పలు చెప్పుకునే వారు కాదు. చాలా మృదువుగా వ్యవహరించే వారు. అందరినీ ప్రేమించే వారు. ప్రజలకు మనిషి పుట్టుక పరమార్థాన్ని ఆయన బోధించారు. విశ్వంలోని వింతల గురించి చెప్పారు. పగలు వెనుక రాత్రి నిరంతరం భ్రమించడం ఎలా జరుగుతుందో వివరించారు. అల్లాహ్ మానవుల మేలు కోసం విరుద్దాంశాల మధ్య సమతుల్యాన్ని నెలకొల్పాడని తెలిపారు. రాత్రి మనిషికి కావలసిన చల్లదనాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. పగలు మనిషికి కావలసిన వేడిని, ఉపాధి కార్యక్రమాల సౌలభ్యాన్ని ఇస్తుంది. సూర్యుడు ఎదుగుదలకు, ప్రాణులు బ్రతికి ఉండడానికి తోడ్పడుతాడు. జీవుల కాలాన్ని, దిక్కులను, రుతువులను తెలుసుకోవడానికి చంద్రుడు, నక్షత్రాలు ఉపయోగపడతాయి. భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్ యే సకల చరాచర సృష్టికి ప్రభువు. మానవులు తనను తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదని ఆయన ఆదేశించాడు. అలా కాక మానవులు దైవేతరులను ఆరాధిస్తూ తమ దుష్టకార్యాలనుకొనసాగిస్తే తీవ్రమైన శిక్ష తప్పదని హెచ్చరించాడు. నూహ్ (అలైహిస్సలాం) ప్రజలకు ఈ ధార్మిక సత్యాలను బోధించారు. కాని అహంభావులైన ఆయన జాతి ప్రజలు ఆయన మాటలు వినలేదు. అజ్ఞానం వల్ల వారు అహంభావానికి, తిరస్కారానికిపాల్పడ్డారు. వారి మూర్ఖ వైఖరి వారిని అనేక చెడులకు పురికొల్పింది. ఫలితంగా క్రూరత్వం, నీతి రాహిత్యం వారి జీవన విధానంగా మారింది.
వాదోపవాదాలు
నూహ్ (అలైహిస్సలాం) బోధనల వల్ల కొందరు ఆయనకు అనుచరులయ్యారు.వారు నూహ్ (అలైహిస్సలాం) బోధనలను, దివ్యసందేశాన్ని విశ్వసించారు. కాని కొన్ని అల్లరిశక్తులు మాత్రం నూహ్ (అలైహిస్సలాం) పట్ల శత్రుత్వం వహించాయి. అటువంటి వారు అధిక సంఖ్యలో ప్రజలను ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. వారికి నచ్చచెప్పడానికి నూహ్ (అలైహిస్సలాం) శతవిధాల ప్రయత్నించారు. కాని వారు ఆయన్ని అపహాస్యంపాలు చేశారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “నిన్ను దేవుడు ఎన్నుకున్నాడని చెబుతున్నావు… అల్లాహ్ ఆదేశాలను తిరస్కరిస్తే అల్లాహ్ ఆగ్రహం వచ్చి పడుతుందని హెచ్చరిస్తున్నావు. నువ్వు చెప్పేది అబద్దం. నిజానికి దేవుని అనుగ్రహాలను అధికంగా పొందుతున్నది మేము. మాకు సంపద, సేవకులు, అధికారం అన్నీ లభించాయి. కాని నీ వద్ద ఏముంది? ఏమీ లేదు. ఏ విధంగానువ్వు మాకన్నా మెరుగ్గా ఉన్నావు?” అన్నారు.
నూహ్(అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “మంచి చేయాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. అల్లాహ్ రుజుమార్గాన్ని మీకు దూరం చేశాడని భావిస్తున్నాను. మీ హృదయాల కాఠిన్యమే మిమ్మల్ని ఈ స్థితికి చేర్చింది. చెడు చేయాలని నిర్ణయించుకున్న వారిని అల్లాహ్ వారి నిర్ణయానికి వదిలేస్తాడు” అని చెప్పారు.వారు ఆయనకు జవాబిస్తూ, “మేము నిన్ను అనుసరించాలని నువ్వు కోరుతుంటే,నీ వెంట ఉన్న అల్ప జనాన్ని పారద్రోలు. మేము ఉన్నత తరగతికి చెందిన వాళ్ళం”అన్నారు. నూహ్ (అలైహిస్సలాం) వారికి సమాధానమిస్తూ, “నేను ఉన్నత, నిమ్న తరగతి ప్రజలందరిని, సంపన్నులను, బీదవారిని, పాలకులను, పాలితులను అందరినీ ఒకేఒ క దైవధర్మం వైపు ఆహ్వానించడానికి వచ్చాను. నా అనుచరులు తమ విశ్వాసం విషయంలో దృఢంగా ఉన్నారన్నది నాకు తెలుసు. కాని మీరు తిరస్కారం తప్ప మరేదీ ఇంతవరకు చూపలేదు” అన్నారు.
వారు నూహ్(అలైహిస్సలాం)ను సవాలు చేస్తూ, “నువ్వు హెచ్చరిస్తున్న అల్లాహ్ఆ గ్రహం, శిక్ష ఎలా ఉంటాయో ఒకసారి తీసుకురా” అన్నారు. నూహ్ (అలైహిస్సలాం)జవాబిస్తూ, “శిక్షను తీసుకురావడానికి నేనెవర్ని? కేవలం అల్లాహ్ మాత్రమే శిక్షించగలడు. ఆయన తలచుకుంటే శిక్షిస్తాడు. ఆయన శిక్ష నుంచి మీరు తప్పించు కోలేరు. నేను మీలాంటి మానవ మాత్రుడిని. నాకు దేవుని నుంచి మార్గదర్శకత్వం లభించడం తప్పిస్తే మిగిలిన విషయాల్లో నేనూ మీ లాంటి వాడినే. మీరు అల్లాహ్ ఆదేశాలను అంగీకరిస్తే మీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. తిరస్కరిస్తే మీకు శిక్ష పడుతుంది” అన్నారు.
నూహ్ (అలైహిస్సలాం) ఉద్యమం
అల్లాహ్ తన ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం)కు గొప్ప సహనాన్ని ప్రసాదించాడు. ప్రజల తిరస్కారాన్ని, ఎగతాళిని భరించే సహనాన్ని ఇచ్చాడు. ఆయన వారి మధ్య చాలాకాలం పనిచేశారు. వారి అపహాస్యాన్ని, ఎగతాళిని భరిస్తూ అల్లాహ్ ధర్మాన్ని ప్రచారం చేశారు. ఏదో ఒక రోజున వారి హృదయాల్లో విశ్వాసం చోటు చేసుకుంటుందని ఆశించారు. ఏళ్ళు గడిచిపోయాయి. నూహ్ ప్రవక్త (అలైహిస్సలాం) తన జాతి వారిని 950 సంవత్సరాల పాటు అల్లాహ్ ధర్మం వైపు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాని వారిలో ఎలాంటి మార్పు రాలేదు. “ఇప్పటికి విశ్వసించిన వారు తప్ప మిగిలిన వారెవ్వరూ విశ్వసించేది లేదు. కాబట్టి వారు చేస్తున్న పనుల గురించి ఆందోళన చెందవద్ద”న్న సందేశం వచ్చింది ఆయనకు. ఇక వ్యవహారం అల్లాహ్ చేతుల్లో ఉందని, ఈ ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం లేదని నూహ్ (అలైహిస్సలాం) అర్థం చేసుకున్నారు. ఆయన అల్లాహ్తో మొర పెట్టుకుంటూ, “ప్రభూ! భూమిపై ఈ అవిశ్వాసులను ఎవరినీ మిగల్చవద్దు. వారిలో ఏ ఒక్కరిని వదలినా వాడు నీ దాసులను మళ్ళీ దారిత ప్పిస్తాడు. చెడుకు, కృతఘ్నతకు, అవిశ్వాస సంతానానికి కారకుడవుతాడు” అనిప్రార్థించారు.
నౌక
నూహ్ (అలైహిస్సలాం) ప్రార్థనను అల్లాహ్ స్వీకరించాడు. ఒక నౌకను నిర్మించాలని, తన ఆదేశం, ప్రేరణల ప్రకారం నౌక నిర్మాణం కొనసాగించాలని ఆదేశించాడు. చెడుకు పాల్పడ్డ వారి గురించి తనతో మాట్లాడరాదని కూడా హెచ్చరించాడు.వారందరిని ముంచి వేయడం జరుగుతుందని చెప్పాడు. నౌకా నిర్మాణం కోసం పట్టణానికి బయట సముద్రతీరానికి చాలాదూరాన ఉన్న ఒక ప్రదేశాన్ని నూహ్ (అలైహిస్సలాం) ఎంచుకున్నారు. కలపను సేకరించారు. పనిముట్లు సంపాదించారు. నౌక నిర్మాణానికి రాత్రింబవలు పనిచేయడం ప్రారంభించారు.
ప్రజలు ఆయన్ను ఎగతాళి చేయడం ఇంకా ఎక్కువయ్యింది. “నూహ్! మత బోధనలు మానేసి వడ్రంగం మొదలెట్టావా. అయినా సముద్రతీరానికి ఇంత దూరాన నౌక తయారు చేస్తున్నావేంటి? ఈ నౌకను సముద్రం వరకు నువ్వు లాక్కెళతావా లేక గాలి మోసుకు పోతుందా?” అంటూ అపహసించారు. నూహ్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ఎవరు నష్టానికి గురవుతారో మీరే చూస్తారు.పరాభవానికి, శాశ్వత దుఃఖానికి ఎవరు గురవుతారో కూడా మీకు త్వరలోనే బోధపడుతుంది” అన్నారు.
నూహ్(అలైహిస్సలాం) నౌక నిర్మాణాన్ని పూర్తి చేసి అల్లాహ్ ఆదేశం కోసం ఎదురుచూడసాగారు. అల్లాహ్ ఆయన్ను ఆదేశిస్తూ విశ్వాసులతో పాటు తక్షణం నౌకలోకిఎక్కమన్నాడు. తమతో పాటు ప్రతి జంతువును, ప్రతి పక్షిని, ప్రతి కీటకాన్ని,ఆడమగ జంటలను తీసుకుని నౌకలోకి చేరుకొమ్మన్నాడు.నూహ్ (అలైహిస్సలాం) జంతువులను, పక్షులను, కీటకాలను నౌక వద్దకు తీసుకువెళ్ళడం చూసిన ప్రజలు పెద్దగా నవ్వుకున్నారు. “నూహక్కు పిచ్చి పట్టింది. ఈజంతువులతో ఏం చేయాలనుకుంటున్నాడో?” అనసాగారు.
జల ప్రళయం
నూహ్ (అలైహిస్సలాం) తన పని పూర్తి చేసి, నౌకలోకి చేరుకున్న వెంటనే భారీ వర్షం ప్రారంభమయ్యింది. ప్రతి ప్రాంతంలోకి నీరు శరవేగంగా చొచ్చుకు రాసాగింది. అదో జలప్రళయం. నీరు ఎంత ఎత్తుకు వచ్చిందంటే నూహ్ (అలైహిస్సలాం) నౌక నీటిలో తేలియాడ సాగింది. నౌక నీటిలో తేలుతూ పోసాగింది. అవిశ్వాసులు వందలాదిగా నీట మునిగిపోయారు.
నూహ్ (అలైహిస్సలాం) కుమారుడు
ప్రజల్లో నూహ్ (అలైహిస్సలాం) తన కుమారుడు కనాన్ ను చూశారు. అతడు ఒక కొండపైకి పరుగెత్తుతున్నాడు. నూహ్ (అలైహిస్సలాం) తన మమకారాన్ని అణచుకోలే కపోయారు. ఆయన తన కుమారుడితో దేవుడిని విశ్వసించి, నౌకలోకి రమ్మని ఎలుగెత్తి పిలిచారు. కాని అతడు తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు. కొండపైకి పోయి సురక్షితంగా ఉంటానన్నాడు. కొండ వైపునకు పరుగెత్త సాగాడు. బాధాతప్త హృదయంతో నూహ్ (అలైహిస్సలాం) కుమారుడిని హెచ్చరిస్తూ, “అల్లాహ్ తీర్పు నుంచి నేడు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆయన దయతలచిన వారు తప్ప” అన్నారు.”
అంతలో ఒక మహా కెరటం నూహ్(అలైహిస్సలాం) కుమారుడిని ముంచేసింది.నూహ్ (అలైహిస్సలాం) మానవ సహజమైన బలహీనతతో అల్లాహ్ మొరపెట్టుకుంటూ,”ప్రభూ! నా కుమారుడు నా కుటుంబంలోని వాడే కదా” అన్నారు. అల్లాహ్ జవాబిస్తూ, “నూహ్! అతను నీ కుటుంబంలోని వాడు కాదు. అతడి ప్రవర్తనఅమర్యాదకర మైనది. అతడు సత్యాన్ని తిరస్కరించాడు. హృదయపూర్వకంగావిశ్వసించిన వారిని తప్ప మరెవ్వరినీ నీవు నీ వాడిగా భావించకు. అతడుస్వయంగా నీ కన్నకొడుకైనా నీవు సిఫారసు చేయడానికి తగిన వాడు కాదు. నీకునీతెలియని విషయాలకు సంబంధించి నా నుంచి ఏదీ అడగవద్దు. ఈ విషయమైనిన్ను హెచ్చరిస్తున్నాను” అన్నాడు.
మానవ బలహీనత
నూహ్ ప్రవక్త (అలైహిస్సలాం) తన తప్పిదాన్ని గుర్తించారు. కేవలం మానవ బలహీనత వల్ల ఈ తప్పిదం జరిగింది. తనను కాపాడిన అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పడం సముచితంగా ఉండేది. తన తప్పిదానికి పశ్చాత్తాపపడుతూ దేవుని శరణు కోరుకున్నారు.
ఆ నౌక చాలా రోజులు నీట తేలియాడింది. ప్రపంచంలో కనబడేదంతా నీట మునిగిన తర్వాత అల్లాహ్ ఆకాశాలను వర్షించడం ఆపి వేయాలని ఆదేశించాడు. నేలపై నీరు ఇంకిపోయే అనుమతి ఇచ్చాడు. నౌక ఒక కొండపై ఆగిపోయింది. అల్లాహ్, నూహ్ (అలైహిస్సలాం)ను ఆదేశిస్తూ, “శాంతి అనుగ్రహాలతో ఈ కొండ దిగండి. మీ నుంచి ఒక జాతి ఉద్భవిస్తుంది. ఇంకా అనేక జాతులు వస్తాయి.వాటికి మేము కొంతకాలం వ్యవధి ఇస్తాము. చివరకు ఒక బాధాకరమైన శిక్షవారిని కప్పి వేస్తుంది” అన్నాడు.
నూహ్ (అలైహిస్సలాం), ఆయన వెంట ఉన్న విశ్వాసులు, జంతువులు, పక్షులు, కీటకాలు అందరూ నేలపై స్థిరపడ్డారు. అల్లాహ్ అనుగ్రహంతో వారు సమృద్ధి,సంతోషాలు సాధించారు.
(చదవండి దివ్య ఖుర్ఆన్: 2:33, 4:163, 6:83, 7:59-64, 10:71-73, 11:25-49, 21:76-77,25:37, 26:105-122, 29:14-15, 37:75-82, 71:1-28, 54:9-16, 23:23-31, 40:5-6)
గ్రహించవలసిన పాఠాలు
ఆ కాలంలో ప్రజలు రెండు తరగతులుగా విభజించ బడ్డారు. సంపన్నులు, బీదవారు. బీదవారు ఎల్లప్పుడు దైవప్రవక్తల బోధనలను విశ్వసించారు. ఎందుకంటే సంపన్నులు, బీదవారు అందరూ సమానులనీ, సమన్యాయం, దయాగుణం పెంపొందించు కోవాలని ప్రవక్తలు బోధించేవారు. దాడులు, దోపిళ్ళకు గురికాకుండా అందరికీ భద్రత ఉండాలని బోధించేవారు. సంపన్నులు నూహ్ (అలైహిస్సలాం)ను దూషించారు.బెదిరించారు. ఎందుకంటే వారికి వారి హోదా ఔన్నత్యాలు కోల్పోతాయన్న భయం పట్టుకుంది.
అల్లాహ్ సమానత్వం విలసిల్లే సమాజాన్ని అభిలషిస్తాడు. మంచివారు, జ్ఞాన సంపన్నులు నాయకత్వం వహించాలని కోరుతాడు.
నూహ్ (అలైహిస్సలాం) దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తూ అల్లాహ్ సందేశాన్ని ప్రచారం చేయడానికి చాలా కృషి చేశారు.
సంతానం పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని ఇస్లాం నొక్కి చెప్పింది. కాని అల్లాహ్ పట్ల అవిధేయత చూపిన వారి పట్ల కాదు, అలాంటి వారు కన్న బిడ్డలైనా సరే; నూహ్ (అలైహిస్సలాం) తన కుమారుడిని రక్షించాలని వేడుకున్నప్పుడు అల్లాహ్ ఆయన్ను మందలించాడు.అల్లాహ్ ప్రజలను వారి ఆచరణల పరంగా నిర్ణయిస్తాడు. చివరకు ప్రవక్త కన్నకొడుకు, కట్టుకున్న భార్య అయినా సరే ఇదే నియమం వర్తిస్తుంది. సాఫల్యం అన్నది రక్త సంబంధం వల్ల లభించదు. కేవలం ఆచరణల వల్ల లభిస్తుంది.
అల్లాహ్ తన ఆదేశాలను పాటించిన వారి పట్ల కారుణ్యం చూపుతాడు.తన క్షమాభిక్ష అర్ధించిన వారి పట్ల దయ చూపుతాడు. కాని ఆయన్ను తిరస్కరించిన వారు శాశ్వతంగా అభిశాపానికి గురవుతారు.
—
నూహ్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు
నూహ్ (అలైహిస్సలాం) జీవిత పాఠాలు
https://youtu.be/mJI2HkiqaAs [45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగంలో, నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు వివరించబడ్డాయి. ఖురాన్లో ఆయనకు ఇవ్వబడిన ఉన్నత స్థానం, ఆయన ఉలుల్ అజ్మ్ (దృఢ సంకల్పం గల) ప్రవక్తలలో ఒకరిగా ఉండటం, మరియు మానవ చరిత్రలో విగ్రహారాధన ప్రారంభమైనప్పుడు ఏకదైవారాధన వైపు పిలుపునిచ్చిన మొదటి ప్రవక్తగా ఆయన పాత్రను నొక్కి చెప్పబడింది. ఆయన ప్రచార (దావత్) పద్ధతులు, అంటే సహనం, ధైర్యం, మరియు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేయడం వంటివి నేటి ముస్లింలకు ఆదర్శంగా చూపబడ్డాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదురైనా విశ్వాసంపై స్థిరంగా ఉండటం, స్నేహం యొక్క ప్రభావం, మరియు పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యత వంటి విషయాలు కూడా చర్చించబడ్డాయి. అభిమానంలో హద్దు మీరడం విగ్రహారాధనకు ఎలా దారితీస్తుందో హెచ్చరిస్తూ, విశ్వాసం బంధుత్వం కంటే శ్రేష్ఠమైనదని స్పష్టం చేయబడింది.
ఇంతకుముందు గడిచిన ఎపిసోడ్లో మనం నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను పూర్తిగా విని ఉన్నాం. ఆ చరిత్ర ద్వారా మనము ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నూహ్ అలైహిస్సలాం వారి విశిష్టత
ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి విశిష్టతను మనము తెలుసుకుందాం. నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్లో తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. ఏవండీ? ఖురాన్లో తొమ్మిది సూరాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి ఉన్నాడు. ఆ సూరాల పేర్లు సూరా ఆరాఫ్, సూరా యూనుస్, సూరా హూద్, సూరా అంబియా, సూరా మోమినూన్, సూరా షుఅరా, సూరా అంకబూత్, సూరా సాఫ్ఫాత్, సూరా ఖమర్. ఈ విధంగా తొమ్మిది సూరాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి ఉన్నాడు.
మరియు మరొక ముఖ్య విషయం ఏమిటంటే, తొమ్మిది సూరాలలో ఆయన ప్రస్తావన చేయడంతో పాటు, ఖురాన్లోని 71వ సూరా, ఒక పూర్తి అధ్యాయం, పూర్తి సూరా ఆయన పేరు మీదనే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు. ఆ సూరా పేరు సూరతు నూహ్.
తొమ్మిది చోట్ల ప్రస్తావన చేస్తూ, ప్రత్యేకంగా ఆయన పేరు మీదనే ఒక సూరా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్లో ఉంచాడంటే, ఆయన యొక్క మహత్యము, ఆయన యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి. అలాగే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ (ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్) అని కొంతమంది ప్రవక్తలను ప్రత్యేకంగా బిరుదు ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనంలో వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రపంచం ప్రారంభమైనప్పటి నుండి, ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి నుండి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు, ఈ భూమండలం మీద వేరే వేరే సందర్భాలలో, వేరే వేరే యుగాలలో లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పంపిస్తే, ఆ లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో కేవలం ఐదు మంది ప్రవక్తలకి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ (ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్) అనే బిరుదుని ప్రసాదించాడు. అంటే సహనమూర్తులైన ప్రవక్తలు అని. ఆ ఐదు మంది ఎవరంటే ఒకటి నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇలా ఐదు మంది ప్రవక్తలు ‘ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్’ అని కీర్తిని పొంది ఉన్నారు. అయితే ఈ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి, నూహ్ అలైహిస్సలాం వారి ప్రత్యేకత మనం ఇక్కడ గమనించాలి.
అలాగే, ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలయ్యాక, ఒక వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు ఏక దైవ ఆరాధన, అల్లాహ్ ఆరాధన మాత్రమే చేసేవారు. ఆ తరువాత షైతాను వలలో చిక్కి విగ్రహారాధన ప్రారంభించాక, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ భూమండలం మీద మానవులను ఏక దైవ ఆరాధన వైపు పిలవటానికి పంపించిన మొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. నూహ్ అలైహిస్సలాం వారి కంటే ముందు ఆదం అలైహిస్సలాం ప్రవక్త, నూహ్ అలైహిస్సలాం కంటే ముందు షీస్ అలైహిస్సలాం ప్రవక్త, నూహ్ అలైహిస్సలాం కంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం ప్రవక్త. అయితే వారి ప్రజలు అల్లాహ్ నే ఆరాధించేవారు, అయితే వారిలో కొన్ని లోపాలు, కొన్ని దోషాలు ఉంటే, ఆ దురలవాట్లను తొలగించడానికి ఆ ప్రవక్తలు వచ్చారే తప్ప, విగ్రహారాధన నుండి అల్లాహ్ ఆరాధన వైపు పిలవడానికి వచ్చిన మొదటి బోధకుడు, మొదటి ప్రవక్త ఆ గౌరవం నూహ్ అలైహిస్సలాం వారికే దక్కింది. ఎందుకంటే ఈ భూమండలం మీద మొదటిసారి విగ్రహారాధన ప్రారంభించింది వెయ్యి సంవత్సరాల తర్వాత, మానవుల చరిత్ర వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలు ఈ విగ్రహారాధన ప్రారంభించారు కాబట్టి, ప్రజలను ఏక దైవ ఆరాధన వైపు, తౌహీద్ వైపు పిలవడానికి వచ్చిన ప్రథమ ప్రవక్త, ప్రథమ బోధకుడు నూహ్ అలైహిస్సలాం.
అలాగే, ప్రవక్తలని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పంపిస్తే వారు రెండు రకాల ప్రవక్తలు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ఒకరు ఎలాంటి ప్రవక్తలంటే, గతించిన ప్రవక్తల శాసనాన్ని పునరుద్ధరించడానికి పంపించబడిన ప్రవక్తలు. వారిని అంబియా అంటారు, నబీ అంటారు. మరి కొంతమంది ప్రవక్తలు ఎలాంటి వారంటే, గతించిన ప్రవక్తల శాసనంలోని నియమాలతో పాటు మరికొన్ని కొత్త నియమాలను, కొత్త శాసనంతో పాటు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారిని ప్రజల వద్దకు పంపిస్తాడు. అలాంటి వారిని రసూల్ అంటారు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ఆ విధంగా ఈ భూమండలం మీద మొదటిసారి ఒక కొత్త శాసనంతో పంపించబడిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం వారు. ఈ ఘనత కూడా ఆయనకే దక్కింది.
ఒక హదీసులో కూడా ఈ ప్రస్తావన వచ్చి ఉంది. ఒక పెద్ద హదీసు, పరలోకం గురించి మీరు పదేపదే ధార్మిక పండితుల నోట ఆ హదీసు విని ఉంటారు. ఎప్పుడైతే ప్రళయం సంభవించి, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక ప్రదేశంలో మళ్లీ నిలబెడతాడో, వారందరూ మళ్లీ బ్రతికి, సజీవంగా నిలబడితే, ఆ రోజు సూర్యుడు మానవులకి చాలా సమీపంలో ఉంటాడు. ఎండ తీవ్రతకు, ఆకలి దప్పికకు ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చాలా ఆగ్రహంతో ఉంటాడు. అప్పుడు ఆ వేడి, ఆ ఆకలి బాధలను తట్టుకోలేక ప్రజలు ఎవరితోనైనా అల్లాహ్ వద్ద సిఫారసు చేయిద్దాము అని నిర్ణయించుకొని, పరిగెత్తుకుంటూ ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, “ఏమండీ మీరు మానవుల పితామహులు, మొదటి ప్రవక్త. మిమ్మల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన స్వహస్తాలతో సృష్టించి, తన ఆత్మను మీలో ఊదాడు కాబట్టి మీరు అల్లాహ్ తో ఈ రోజు సిఫారసు చేయండి” అంటే, ఆదం అలైహిస్సలాం అంటారు, “ఈ రోజు అల్లాహ్ చాలా ఆగ్రహంతో ఉన్నాడు. నేను నా గురించే భయపడుతున్నాను. అల్లాహ్ వద్ద వెళ్లి సిఫారసు చేసే ధైర్యము నాకు లేదు. మీరు నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లిపోండి” అంటే అప్పుడు ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వస్తారు. నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, వచ్చిన మానవులు నూహ్ అలైహిస్సలాం వారితో ఏమంటారంటే,
أَنْتَ أَوَّلُ الرُّسُلِ إِلَى أَهْلِ الْأَرْضِ، وَقَدْ سَمَّاكَ اللَّهُ عَبْدًا شَكُورًا
(అంత అవ్వలుర్ రుసులి ఇలా అహ్లిల్ అర్ద్, వఖద్ సమ్మాకల్లాహు అబ్దన్ షకూరా)
“ఏమండీ నూహ్ అలైహిస్సలాం వారు, మీరు ఈ భూమండలంలో మానవుల వద్దకు పంపించబడిన మొదటి రసూల్. మిమ్మల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ‘అబ్దన్ షకూరా’ అల్లాహ్ కు కృతజ్ఞతలు గడుపుతూ, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జీవించిన నా భక్తుడు అని కొనియాడాడు కదా. మీరు అల్లాహ్ తో సిఫారసు చేయండి” అంటారు.
నూహ్ అలైహిస్సలాం వారు అంటారు, “లేదండీ, ఈ రోజు అల్లాహ్ చాలా ఆగ్రహంతో ఉన్నాడు. నేను నా గురించే భయపడుతున్నాను. నేను వెళ్లి అల్లాహ్ వద్ద సిఫారసు చేసే ధైర్యము చేయలేకపోతున్నాను. మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లిపోండి” అంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు ప్రజలు వెళితే, ఆయన కూడా నాతో కాదు, మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళండి అంటారు. మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళితే, మూసా అలైహిస్సలాం కూడా నాతో కాదు, ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళండి అని చెప్తారు. ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళితే ఆయన కూడా నాతో కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్ళండి అంటే అప్పుడు ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళితే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి అల్లాహ్ ను బాగా స్తుతిస్తారు, పొగుడుతారు, అల్లాహ్ నామాన్ని ఉచ్ఛరిస్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆగ్రహము చల్లబడుతుంది. అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, “ఓ ముహమ్మద్, తల పైకెత్తండి, మీరు ఏమడుగుతారో అడగండి. ఈ రోజు మీ కోరిక తీర్చబడుతుంది. మీరు సిఫారసు చేస్తారా, చేయండి. ఈ రోజు మీ సిఫారసు అంగీకరించబడుతుంది” అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రకటిస్తే, “ఓ అల్లాహ్, లెక్కింపు ప్రారంభించండి. మానవులు అల్లాడిపోతున్నారు” అంటే అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో త్రాసు పళ్ళాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు జరుగుతుంది. ఇది ఒక పెద్ద హదీసు.
అయితే ఈ హదీసులోని నా అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకతలను తెలుపుతూ ఏమంటున్నారూ? “అంత అవ్వలర్ రుసులి ఇలా అహ్లిల్ అర్ద్”. భూమండలం మీద నివసిస్తున్న మానవుల వైపుకు పంపించబడిన మొదటి రసూల్ మీరు అంటున్నారు. అంటే భూమండలం మీద నివసిస్తున్న మానవుల వైపుకు పంపించబడిన మొదటి రసూల్, ఆ కీర్తి నూహ్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇది నూహ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకతల్లో మరొక ప్రత్యేకత.
అలాగే నూహ్ అలైహిస్సలాం వారి చరిత్రలో మనం విని ఉన్నాం, నూహ్ అలైహిస్సలాం వారి సమాజం మీద తూఫాను శిక్ష వచ్చి పడిన తర్వాత, తిరస్కారులందరూ మరణించిన తర్వాత, విశ్వాసులు ఓడలో ప్రయాణిస్తున్న వారు మాత్రమే రక్షించబడ్డారు. వారందరూ భూమండలం మీదకి వచ్చిన తర్వాత, వారిలో ఏ ఒక్కరి సంతానము కూడా భూమండలం మీద వ్యాపించలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి కుమారులలోని ముగ్గురు కుమారులు, సామ్, హామ్, యాఫిస్ ఈ ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ప్రపంచంలో వ్యాపించింది అన్న విషయాన్ని మనము విని ఉన్నాము కదండీ. కాబట్టి, నూహ్ అలైహిస్సలాం వారిని ధార్మిక పండితులు ఆదమే సాని, అబుల్ బషర్ సాని, మానవుల రెండవ పితామహుడు అని బిరుదుని ఇచ్చారు. నూహ్ అలైహిస్సలాం వారి విశిష్టతలో ఇది ఒక విశిష్టత. ఆయన రెండవ మానవుల పితామహుడు. ఈ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి విశిష్టతలు మీ ముందర ఉంచటం జరిగింది.
నూహ్ అలైహిస్సలాం వారి జీవితం నుండి పాఠాలు
ఇక రండి, నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే,
మొదటి పాఠం ఏమిటంటే, అల్లాహ్ వైపుకు పిలిచే విధానం ఎలా ఉండాలి. ప్రజలను అల్లాహ్ వైపుకు ఆహ్వానిస్తాము, అల్లాహ్ వైపు పిలుపునిస్తాము, మన భాషలో చెప్పాలంటే దావత్ పని చేస్తాము కదా, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధిస్తాము కదా, ఈ పని ఎలా సాగించాలనేది నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనకు గొప్ప ఉదాహరణ కనిపిస్తుంది.
నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వెళ్లి విగ్రహారాధనను త్యజించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని ఆహ్వానిస్తే, జాతి ప్రజలు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? కొందరు అన్నారు నీకు పిచ్చి పట్టింది. మరికొందరు అన్నారు నువ్వు మార్గభ్రష్టతానికి గురైపోయావు. మరికొందరు అన్నారు నీవు అల్పుల సహవాసివి. ఈ విధంగా నూహ్ అలైహిస్సలాం వారికి రకరకాలుగా విమర్శించారు, రెచ్చగొట్టారు. చివరికి ఏమన్నారంటే, నీవు ఇలాంటి మాటలు మానేయకపోతే రాళ్లతో కొట్టి చంపేస్తాము అని కూడా హెచ్చరించారు. ఇన్ని రకాలుగా నూహ్ అలైహిస్సలాం వారిని విమర్శించినా, రెచ్చగొట్టినా, ఆయన మాత్రం రెచ్చిపోలేదు. ఆయన మాత్రం ఆగ్రహించలేదు. అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి ఎంతో ఓపికతో, సహనంతో అల్లాహ్ వాక్యాలు వారికి వినిపించారు. వారేమో పిచ్చివాడు అంటున్నారు. వారేమో నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు. కానీ నూహ్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు?
يَا قَوْمِ لَيْسَ بِي ضَلَالَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
(యా కౌమి లైస బీ దలాలతున్ వలాకిన్నీ రసూలుమ్ మిర్రబ్బిల్ ఆలమీన్)
“ఓ నా జాతి వారలారా! నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.” (7:61).
అని ప్రేమపూర్వకంగానే మాట్లాడుతున్నారు కానీ ఆయన ఎప్పటికీ ఆగ్రహించుకోలేదు, కోప్పడలేదు. ఇందులో ఒక దాయికి ఉదాహరణ ఏమిటంటే, ఎదుటి వ్యక్తులు ఏ విధంగా స్పందించినా, దాయి మాత్రం కోప్పడకూడదు, ఆవేశపడకూడదు. ఓపిక, సహనంతో దైవ వాక్యాలు ప్రజలకు వినిపించాలి. ఇది ఒక గుణపాఠం.
అలాగే, దైవ వాక్యాలు వినిపించే వారికి ధైర్యము కూడా కావాలి. నూహ్ అలైహిస్సలాం వారు 950 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. మిగతా వారందరూ తిరస్కరించారు. ఆ తిరస్కరించిన వారు రాళ్లతో కొట్టి చంపుతాము అని బెదిరిస్తున్నారు. అలాంటప్పుడు 80 మందినై తనతో పాటు పెట్టుకొని ఉన్న నూహ్ అలైహిస్సలాం కంగారు పడిపోలేదు. ఇంత మంది కలిసి మా మీద దండయాత్ర చేస్తారేమో, మా మీద దండయాత్ర చేసి మమ్మల్ని సర్వనాశనం చేసేస్తారేమో అని ఆయన భయపడలేదు, కంగారుపడలేదు. ఆయన మాత్రం వారు ఏ విధంగా స్పందించినా, ఏ విధంగా వారు బెదిరించినా, ఆయన మాత్రము అల్లాహ్ వాక్యాలు వినిపించుకుంటూనే ధైర్యంగా ముందుకు సాగిపోయారు కానీ వెనకడుగు వేయలేదు. అలాగే, ఒక దాయి దైవ మార్గంలో నడుచుకుంటున్నప్పుడు, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపిస్తున్నప్పుడు ప్రజలు రకరకాలుగా స్పందిస్తారు. అలాంటప్పుడు ధైర్యంతో అల్లాహ్ మీద నమ్మకంతో, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకంతో దైవ వాక్యాలు వినిపించుకుంటూ ముందుకు సాగాలి.
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవలసిన మరొక పాఠం ఏమిటంటే, ఈ పుణ్యకార్యం చేసేటప్పుడు, దైవ వాక్యాలు ప్రజలకు వినిపించేటప్పుడు కుటుంబ సభ్యుల నుంచే తిరస్కారము రావచ్చు. మన కుటుంబ సభ్యులే మన మాట వినకుండా తిరస్కరించవచ్చు. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల్ని కోల్పోవ రావచ్చు.
నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి, నూహ్ అలైహిస్సలాం వారి మాటను అంగీకరించలేదు, తిరస్కరించింది ఆమె. నూహ్ అలైహిస్సలాం వెళ్లి ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించి అక్కడి నుంచి సాగిపోతే, ఈమె వెనక నుంచి వెళ్లి, “ఏమండీ, నా భర్తకు మతి భ్రమించింది, ఆయన మాటలు మీరు పట్టించుకోకండి” అని చెప్పేది. చూశారా? నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి నూహ్ అలైహిస్సలాం వారిని తిరస్కరించింది.
అలాగే నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక కుమారుడు నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు, అతను కూడా తిరస్కరించాడు. తిరస్కారులతో సహవాసం చేశాడు, తిరస్కారులలాగే అతను కూడా మారిపోయి తిరస్కరించాడు. చివరికి ఏమైందండి? తూఫాను రూపంలో దైవ శిక్ష వచ్చి పడింది. దైవ శిక్ష వచ్చి పడినప్పుడు నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు ఆ దైవ శిక్షకు గురయ్యాడో, నూహ్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే అతను ప్రాణాలు కోల్పోయాడు. కన్న బిడ్డ కళ్ల ముందరే ప్రాణం వదులుతూ ఉంటే, అది చూసి నూహ్ అలైహిస్సలాం వారు చలించిపోయారు. అయినా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, “తిరస్కారులు మీ కుటుంబ సభ్యులు కాలేరు” అని చెప్పగానే, ఆ మాటను ఆయన అంగీకరించి, అల్లాహ్ కు క్షమాపణ వేడుకొని, ఓపిక సహనం పాటించాడు.
కాబట్టి, దైవ వాక్యాలు వినిపించే కార్యక్రమం చేపట్టినప్పుడు కుటుంబ సభ్యులే కొంతమంది తిరస్కరించవచ్చు. బంధువులే కొంతమంది తిరస్కరించవచ్చు. అలాంటప్పుడు ఓపిక, సహనం అనేది కావాలి. బాధలను దిగమింగాలి. ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకంతో సాఫల్యం వైపుకు ముందుకు సాగిపోవాలి.
అలాగే మిత్రులారా, దైవ వాక్యాలు వినిపించే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏమిటంటే, ప్రజలకు అల్లాహ్ అనుగ్రహాల గురించి తెలియజేయాలి. నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలకు ఆకాశము, అలాగే భూమి, సూర్య చంద్రుల గురించి కూడా వివరిస్తూ, “మీ కోసం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వర్షాలు కురిపిస్తాడు, మీ కోసం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నీటి కాలువలను ప్రవహింపజేస్తాడు, పంటలు పండిస్తాడు, మీకు సంతానము ప్రసాదిస్తాడు, మీరు చేసిన పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు” అని అల్లాహ్ అనుగ్రహాలను ప్రజలకు వివరించారు. ఆ విధంగా ఒక బోధకుడు, ఒక దాయి ప్రజల ముందర అల్లాహ్ వాక్యాలు వినిపిస్తూ, అల్లాహ్ అనుగ్రహాల గురించి కూడా ప్రజలకు వివరించి తెలియజేయాలి అన్న విషయము నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనకు తెలుస్తుంది. బోధనా విధానము, దైవ వాక్యాలు ప్రకటించే విధానము నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనము తెలుసుకోగలుగుతాము.
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయాలలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ వద్ద విశ్వాసమే ఆమోదించబడుతుంది, బంధుత్వాలకు అల్లాహ్ వద్ద ఎలాంటి విలువ ఉండదు ఒకవేళ వారు అవిశ్వాసి అయి ఉంటే. విశ్వాసం ఉంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసానికి విలువ ఇస్తాడు, బంధుత్వానికి కూడా విలువ ఇస్తాడు. విశ్వాసము లేని యెడల, తిరస్కారము ఉన్నచో, అక్కడ ఎవరితో ఎంతటి సమీప బంధుత్వము ఉన్నా అల్లాహ్ వద్ద ఆమోదించబడదు. ఏ విధంగానూ అది ఉపయోగపడదు అన్న విషయం స్పష్టం అవుతుంది.
నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు, ఎంత సమీప బంధువు, రక్త సంబంధీకుడు, అయినప్పటికినీ విశ్వాసము లేకపోయేసరికి, అవిశ్వాసం ఉన్న వలన, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా “అతను నీ కుటుంబ సభ్యుడే” కాదు అని తెలియజేశేశాడు. ఒక ప్రవక్తకు, ఒక గొప్ప ప్రవక్తకు, ఒక మహా ప్రవక్తకు ఆయన కుమారుడు అయి ఉండి కూడా, ఆ సంబంధం అతనికి ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేకపోయింది కారణం అవిశ్వాసం. అందుకోసమే విశ్వాసం అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వహీ ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు:
وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
(వ అన్ జిర్ అషీరతకల్ అఖ్రబీన్)
మరియు (ఓ ప్రవక్తా!) నీ సమీప బంధువులను హెచ్చరించు. (26:214).
అని చెప్పగానే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్న సఫా పర్వతం మీద ఎక్కారు. ఆ సఫా పర్వతం మీద ఎక్కి తమ బంధువుల వారందరినీ పేరు పేరునా పిలిచారు. హదీసు గ్రంథాల్లో ఆ ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “యా బనీ ముర్రా బిన్ కాబ్, యా బనీ అబ్దె షమ్స్, యా బనీ అబ్దె మునాఫ్, యా మాషరా బనీ అబ్దుల్ ముత్తలిబ్, యా ఫాతిమా బిన్తె ముహమ్మద్.” వీరందరూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమీప బంధువులు. వారందరినీ వంశ వంశాలుగా పేరు పెట్టి మరి పిలిచారు. పిలిచి ఏమన్నారంటే,
“అన్ఖిజూ అన్ఫుసకుమ్ మినన్నార్.
మీ ప్రాణాలనే మిమ్మల్ని మీరు నరక అగ్ని నుండి రక్షించుకోండి.
ఫఇన్నీ లా అమ్లికు లకుమ్ నఫ్అవ్ వలా దర్రా.
నేను మీకు అక్కడ, పరలోకంలో లాభము గానీ చేకూర్చలేను, నష్టము గానీ చేకూర్చలేను.
వలా ఉగ్నీ అన్కుమ్ మినల్లాహి షైఆ.
అల్లాహ్ కు బదులుగా నేను మీకు అక్కడ ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేను.
గైర అన్నలకుమ్ రహమన్ సఅబుల్లుహా బిబిలాలిహా.
ప్రపంచంలో నాకూ మీకూ మధ్య ఒక బంధుత్వం ఉంది, దాన్ని మాత్రము నేను నెరవేరుస్తాను. ఆ బంధుత్వాన్ని మాత్రం నేను దృఢపరుచుకుంటాను. ఇక్కడ నేను మీకు ఏ విధంగానైనా సహాయపడగలనంటే సహాయపడగలుగుతానేమో గానీ, రేపు పరలోకంలో మాత్రము అల్లాహ్ కు బదులుగా నేను మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేను. కాబట్టి మిమ్మల్ని మీరు నరక అగ్ని నుండి రక్షించుకోండి.”
మార్గం ఏమిటంటే, అల్లాహ్ పంపించిన ధర్మాన్ని అంగీకరించి, అల్లాహ్ ను విశ్వసించి, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ నియమాలను పాటించుకుంటూ జీవించుకోవటం. ఆ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుటుంబ సభ్యుల్ని తెలియజేశారు.
కాబట్టి, దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, అక్కడ విశ్వాసం ఉంటేనే విలువ ఉంటుంది. విశ్వాసం లేని యెడల, తిరస్కారం ఉన్నచో అక్కడ ఎవరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు, వారు ఎవరి బంధువులైనా, ఎలాంటి బంధుత్వం కలిగి ఉన్నా ప్రయోజనం ఉండదన్న విషయం తెలుస్తుంది.
దీనికి మరొక ఉదాహరణ చెప్పి ఇన్షా అల్లాహ్ మాటను ముందుకు సాగిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి అబూ తాలిబ్ వారు. ఆయన మరణ సమయం సమీపించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్లి, “యా అమ్మా, قُلْ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ (ఖుల్ లా ఇలాహ ఇల్లల్లాహ్) ఉష్హిదు లక బిహా యౌమల్ ఖియామా.” ఓ చిన్నానా, మీరు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని పలకండి. మీరు ఈ సాక్ష్య వచనాన్ని మీరు పలకండి. ఆ సాక్ష్య వచనము ద్వారా నేను పరలోకంలో అల్లాహ్ వద్ద మీ గురించి సాక్ష్యం పలుకుతాను అంటే, ఆయన మాత్రము ఆ రోజు బంధువుల మాట విని ఆ సాక్ష్య వచనము పలకలేదు. అలాగే ఆయన ప్రాణం వదిలేశాడు. ఆయన మరణానంతరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రులలో మరొక పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, ఆయన వచ్చి, “ఏమండీ, మీ పినతండ్రి అబూ తాలిబ్ మీకు జీవితంలో చాలా రకాలుగా సహాయపడ్డారు కదా. ఆయన ఎక్కడున్నారు?” అంటే, పరలోకంలో ఆయన ఎక్కడున్నారు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “హువ ఫీ దహ్దాహిమ్ మినన్నార్.” ఆయన నరకంలోని పై భాగంలో ఉన్నారు అని చెప్పారు. నరకంలో కింది భాగంలో ఎక్కువ శిక్ష ఇవ్వబడుతుంది, పై భాగంలో అందరికంటే తక్కువ శిక్ష ఇవ్వబడుతుంది. అందరికంటే తక్కువ శిక్ష ఇవ్వబడే పై భాగంలో ఆయన ఉన్నారు అని చెప్పారు.
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అహ్వను అహ్లిన్నారి అదాబన్ అబూ తాలిబ్ వహువ మున్తఇలున్ బినాలైని యగ్లీ మిన్హుమా దిమాగుహు” అని చెప్పారు. అంటే, పరలోకంలో అందరికంటే చిన్న శిక్ష అబూ తాలిబ్ కి ఇవ్వబడుతుంది. ఆయనకు నరకపు రెండు పాదరక్షలు తొడిగించబడతాయి. ఆ పాదరక్షలు తొడిగిన కారణంగా, ఆయన మెదడు కరిగిపోయి రాలిపోతుంది అని చెప్పారు. అల్లాహు అక్బర్! అంటే, దీని ద్వారా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మిత్రులారా, బంధుత్వాలు అక్కడ ఉపయోగపడవు. విశ్వాసం మాత్రమే అక్కడ ఉపయోగపడుతుంది. విశ్వాసం ఉంటే బహుశా బంధుత్వాలు కూడా ఉపయోగపడవచ్చు. తిరస్కారం ఉంటే, విశ్వాసం లేకపోతే ఎలాంటి బంధుత్వము అక్కడ ఉపయోగపడదన్న విషయం నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు అర్థమవుతుంది.
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ప్రపంచంలో విశ్వాసులకు పరీక్షిస్తాడు, రక్షిస్తాడు కూడా. రెండు విషయాలు కూడా ఉన్నాయి. పరీక్షిస్తాడు, రక్షిస్తాడు. రెండూ ఉన్నాయి.
నూహ్ అలైహిస్సలాం వారితో 80 మంది విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. ఆ 80 మందికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ప్రపంచంలో పరీక్ష పెట్టాడు. ఆ జాతి ప్రజలు ఆ 80 మందిని మీరు అల్పులు అన్నారు, మార్గభ్రష్టతానికి గురైన వారు అన్నారు, రకరకాలుగా వారిని హేళన చేశారు, ఇబ్బందులకి గురిచేశారు. అయినా కానీ వారు మాత్రం స్థిరంగా దైవ మార్గంలో నడుచుకున్నారు. మార్గభ్రష్టతానికి వారు గురి కాలేదు. “మా సమాజ ప్రజలు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మా బంధువులు మాకు దూరమైపోతున్నారు, మేము చులకనగా చూడబడుతున్నాము,” ఇలాంటి ఆలోచనలు వారు పట్టించుకోకుండా, “మాకు అల్లాహ్ కావాలి, మాకు అల్లాహ్ మార్గం కావాలి, మాకు అల్లాహ్ ప్రవక్త కావాలి, మాకు అల్లాహ్ ధర్మం కావాలి” అని వారు అల్లాహ్ మార్గంలో నడుచుకున్న కారణంగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ పరీక్షలు పెట్టిన తర్వాత రక్షించాడు కూడా. పడవలో ఎక్కించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వారందరినీ రక్షించాడా లేదా? వారందరూ రక్షించబడ్డారా లేదా నూహ్ అలైహిస్సలాం వారితో పాటు? కాబట్టి, పరీక్షించబడటము, రక్షించబడటము రెండూ కూడా జరిగాయి నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో. ఆ విధంగా మనకు తెలిసే విషయం ఏమిటంటే, అల్లాహ్ విశ్వాసులకు ఈ ప్రపంచంలో పరీక్షిస్తాడు, వారు స్థిరంగా నడుచుకుంటే, నిలకడను ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రక్షిస్తాడు కూడా. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్లో తెలియజేశాడు,
وَكَانَ حَقًّا عَلَيْنَا نَصْرُ الْمُؤْمِنِينَ
(వకాన హక్కన్ అలైనా నస్రుల్ మూమినీన్)
విశ్వాసులకు సహాయపడటం మా బాధ్యత. (30:47) అని చెప్పాడు.
అల్లాహు అక్బర్! ఇంకేం కావాలండి? విశ్వసించి ఆయన మార్గంలో నడుచుకుంటే అల్లాహ్ అంటున్నాడు, “విశ్వాసులను సహాయపడటం, వారిని ఆదుకోవటం మా బాధ్యత” అంటున్నాడు. అల్లాహ్ ఆయన బాధ్యతలో ఆయన సంపూర్ణుడు, ఆయన బాధ్యత ఆయన ఎల్లవేళలా నెరవేరుస్తాడు. కాకపోతే మన బాధ్యతల్ని మనం తెలుసుకొని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
అలాగే, మరొక విషయం నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో మనం తెలుసుకోవలసి ఉంది అది ఏమిటంటే, సత్యాన్ని, ప్రవక్తల మాటని ప్రారంభంలో అంగీకరించింది, విశ్వసించింది ఎవరంటే ఆ సమాజంలోని బలహీనులు, నిరుపేదలు మాత్రమే.
నూహ్ అలైహిస్సలాం వారి జీవితంలో కూడా అలాగే జరిగింది. నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించిన వారు, నూహ్ అలైహిస్సలాం వారి మాటను అంగీకరించిన వారు ఆ సమాజంలోని నిరుపేదలు, బలహీనులు. అందుకోసమే ఆ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, “నీ వద్ద ఉన్న వారందరూ నిరుపేదలు, బలహీనులు. వీరిని నీ వద్ద నుండి నువ్వు గెంటేస్తే అప్పుడు మేము మీ మాట వింటాము” అంటే, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “అల్లాహ్ వద్ద బలహీనులు, బలులు అనే తేడా ఉండదు. విశ్వాసం ఎవరిది ఎంత మంచిదైతే వారు అల్లాహ్ వద్ద అంత గౌరవం పొందుతారు. కాబట్టి నేను వీరిని చులకనగా చూసి నా వద్ద నుండి గెంటివేయడం అనేది చేయను” అని తేల్చి చెప్పేశాడు కదా. ఆ విధంగా ప్రవక్తల మాటల్ని బలహీనులే తొందరగా అంగీకరించారు అని మనకు తెలుస్తుంది.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో కూడా చూడండి. ఒకసారి ఆనాటి రోము చక్రవర్తి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చివరి రోజుల్లో రాజులకు ఉత్తరాలు రాశారు. ఒక ఉత్తరము రోము చక్రవర్తికి కూడా రాసి పంపించారు. ఆ ఉత్తరము చేరినప్పుడు ఆ రోము చక్రవర్తి, “ఈ ఉత్తరం వచ్చిన చోటు నుండి ఎవరైనా వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చి ఉన్నారేమో చూడండి” అంటే, అల్హమ్దులిల్లాహ్ అనుకోకుండా ఆ సందర్భంలో అబూ సుఫియాన్ తో పాటు కొంతమంది మక్కా నుండి అటువైపు వ్యాపారం కోసం వెళ్ళి ఉన్నారు. అప్పుడు రాజు ఆదేశంతో అబూ సుఫియాన్ మరియు ఆయనతో పాటు వెళ్ళిన వారందరూ రాజు ముందర హాజరుపరచబడ్డారు. అప్పుడు రాజు అబూ సుఫియాన్ తో కొన్ని ప్రశ్నలు అడిగాడు. అబూ సుఫియాన్ ని ముందర నిలబెట్టి, మిగతా వారిని వెనక నిలబెట్టి, “ఏమండీ నేను ఇతనితో కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అతను అబద్ధం చెబితే మీరు నాకు వెనక నుండి సైగ చేయండి” అని చెప్పి ఆ తర్వాత ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న అడగటం ప్రారంభించాడు. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏమిటంటే, “ఫఅష్రాఫున్నాసి యత్తబిఊనహు అమ్ దుఅఫావుహుమ్?” నాకు ఈ ఉత్తరం ముహమ్మద్ వద్ద నుంచి వచ్చి ఉంది. ఈ ముహమ్మద్ ని అనుసరిస్తున్న వారిలో మీ సమాజంలోని బలహీనులు ఆయనను విశ్వసిస్తున్నారా, లేదా మీ సమాజంలోని ఉత్తములు, బలవంతులు ఆయనను విశ్వసిస్తున్నారా? అంటే, అప్పుడు అబూ సుఫియాన్ అన్నాడు, “ఏమండీ, ముహమ్మద్ మాటను ఎంతమంది అయితే అంగీకరించి ఆయన్ని విశ్వసిస్తున్నారో, వారందరూ మా సమాజంలోని బలహీనులు, నిరుపేదలు” అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ చక్రవర్తి ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఆయన అన్నాడు, “వహుమ్ అత్తిబ్బావుర్ రుసుల్.” ప్రవక్తలందరినీ ప్రారంభంలో విశ్వసించింది బలహీనులే మరియు నిరుపేదలే అని చెప్పాడు. కాబట్టి, నిరుపేదలు, బలహీనులు ప్రవక్తల మాటలు తొందరగా అంగీకరించారన్న విషయము ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి చరిత్రలో కూడా మనకు తెలుస్తుంది.
అభిమానంలో హద్దు మీరడం
అలాగే, ముఖ్యమైన విషయం నూహ్ అలైహిస్సలాం వారి చరిత్రలో మనం తెలుసుకోవలసింది అది ఏమిటంటే, అభిమానం హద్దు మీరరాదు. అభిమానం హద్దు మీరిన కారణంగానే ఈ భూమండలం మీద విగ్రహారాధన ప్రారంభమయ్యింది.
ఆ రోజుల్లో వద్ద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరందరూ దైవభక్తులు. ఈ ఐదుగురు కూడా దైవభక్తులు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా వారు తెలియజేసి ఉన్నారు. ఈ ఐదు మంది అభిమానంలో ఆ జాతి ప్రజలు హద్దు మీరారు. దాన్ని అవకాశంగా తీసుకొని షైతాను ప్రతిమలను తయారు చేసి, “మీరు అభిమానిస్తున్నారు కదా, ఈ వారి ప్రతిమలు తీసుకుని వెళ్ళండి” అని చెప్తే, వారి మీద ఉన్న అభిమానంతో, ఆ అభిమానం హద్దు మీరిన కారణంగా, వారు తీసుకువెళ్లి ఆ ప్రతిమలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రతిమలే పూజించబడ్డాయి.
నేడు కూడా, నేడు కూడా మనం చూస్తున్నాం, చాలామంది కొంతమందిని అభిమానించి, ఆ అభిమానంలో హద్దు మీరిపోయి ఆలయాలు కట్టేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు, రకరకాల కార్యాలు చేబడుతున్నారు. దేవుడు అని పూజిస్తున్నారు. కారణం ఏంటి? వారు మానవులే అయినప్పటికినీ వారిని పూజిస్తున్నారు, దేవుళ్ళు అని వారిని ఆరాధిస్తున్నారు అంటే కారణం ఏమిటి? అభిమానంలో హద్దు మీరిపోతున్నారు. అభిమానంలో హద్దు మీరిపోవడం వల్లనే ఈ భూమండలం మీద విగ్రహారాధన ప్రారంభమయ్యింది.
అందుకోసమే, చూడండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించే ముందు అనుచర సమాజానికి ఒక హెచ్చరిక చేశారు. అది ఏమిటంటే, “లా తత్రూనీ కమా అత్రతిన్నసారా అల్ మసీహబ్న మర్యం. ఫఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.” ఏమండీ, ఎలాగైతే క్రైస్తవులు మరియం కుమారుడైన ఈసా, యేసు, ఈసా అలైహిస్సలాం వారి విషయంలో హద్దు మీరిపోయారో, లేని స్థానాన్ని ఆయనకు కట్టుబెట్టారో, ఆ విధంగా మీరు నా విషయంలో మితిమీరకండి. నాకు లేని స్థాయిని, స్థానాన్ని కల్పించకండి. నేను దైవ దాసుడ్ని కాబట్టి నాకు అల్లాహ్ దాసుడు మరియు అల్లాహ్ ప్రవక్త అని చెప్పండి అంతేగాని అంతకు మించి నాకు లేని స్థానాన్ని నాకు కట్టుబెట్టకండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
చూశారా? కాబట్టి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, అది మన విశ్వాసం యొక్క భాగం. కానీ ఆ అభిమానంలో హద్దు మీరరాదన్న విషయము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసి ఉన్నారు. అభిమానంలో హద్దు మీరిపోవటాన్ని గులూ అంటారు. దాని నుంచి వారించబడింది, దాని నుంచి మనమందరం దూరంగా ఉండాలన్న విషయము నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము తెలుసుకోవలసి ఉంది.
ప్రతిమల నిషేధం
అలాగే, పటాలు, ప్రతిమలు సృష్టించడం నిషేధం. ప్రతిమలు సృష్టించబడ్డాయి కాబట్టి, తర్వాత అవి పూజించబడ్డాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతిమలు సృష్టించిన వారు, ఎవరైతే ప్రతిమలను తయారు చేస్తారో అలాంటి వారు రేపు పరలోకంలో చాలా కఠినంగా శిక్షించబడతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “ఇన్న అషద్దన్నాసి అదాబన్ యౌమల్ ఖియామతి అల్ ముసవ్విరూన్.” పరలోకంలో ఎక్కువగా శిక్షించబడే వారు, కఠినంగా శిక్షించబడే వారులు ఈ ప్రతిమలు తయారు చేసేవారు అని చెప్పారు.
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “కుల్లు ముసవ్విరిన్ ఫిన్నార్. యజ్అల్లు లహు బికొల్లి సూరతిన్ సవ్వరహా నఫ్సన్, ఫతుఅజ్జిబుహు ఫీ జహన్నమ్.” అనగా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయితే ప్రతిమలను తయారు చేస్తాడో, ఎన్ని ప్రతిమలు అయితే అతను తయారు చేస్తాడో, ఆ ప్రతిమలన్నింటినీ రేపు నరకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా శిక్షించే వ్యక్తులు లాగా తయారు చేసి ఉంచుతాడు. ఆ ప్రతిమలన్నీ రేపు ఈ భూమండలం మీద ఎవరైతే ప్రతిమలు తయారు చేశాడో, అక్కడ నరకంలో అవే ప్రతిమలు శిక్షించే వ్యక్తులు లాగా వచ్చి ఆ వ్యక్తిని శిక్షిస్తారు అని తెలియజేశారు.
కాబట్టి మిత్రులారా, ప్రతిమలు తయారు చేయడము నిషేధము. ప్రతిమలు తయారు చేయబడ్డాకే అవి పూజించబడ్డాయి. పుట్టించిన సృష్టికర్తను వదిలేసి, ఏక దైవారాధన వదిలేసి, బహు దైవారాధన చేయబడటానికి ముఖ్యమైన కారణం అభిమానంలో హద్దు మీరిపోవడం.
సహవాస ప్రభావం మనిషి మీద పడుతుంది
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సహవాస ప్రభావం మనిషి మీద పడుతుంది, స్నేహం ప్రభావం మనిషి మీద పడుతుంది.
నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక కుమారుడు తిరస్కారులతో సహవాసం చేశాడు. తిరస్కారులతో సహవాసం చేసిన కారణంగా, తిరస్కారుల మాటల్లో పడిపోయి సొంత తండ్రి అయిన నూహ్ అలైహిస్సలాం, సొంత తండ్రి ప్రవక్త అయిన నూహ్ అలైహిస్సలాం వారిని అతను తిరస్కరించేశాడు. కారణం? స్నేహం ప్రభావం. అందుకోసమే ఎప్పుడైతే తూఫాను వచ్చిందో, నీటి మట్టం పెరిగిందో, పడవ నీటిపై తేలిందో, అప్పుడు నూహ్ అలైహిస్సలాం బయటికి చూసి కుమారుడ్ని చూసి, “యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్. నా బిడ్డా!, వచ్చి మాతో పాటు విశ్వాసులతో కలిసిపోయి ఈ ఓడ ఎక్కేయి నాయనా. అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా” అని చెప్పారు. చూశారా? అవిశ్వాసులతో, దైవ తిరస్కారులతో నువ్వు స్నేహం చేయకు, వారితో పాటు నువ్వు ఉండకు. వచ్చి విశ్వాసులతో కలిసిపో నాయనా అని పిలిస్తే, అతను అవిశ్వాసులతో స్నేహం చేశాడు కాబట్టి, ఆ స్నేహ ప్రభావం అతని మీద పడింది కాబట్టి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అతను విశ్వాసుల దగ్గరికి వెళ్లాల్సింది పోయి, “నేను పర్వతం ఎక్కి నా ప్రాణాలు కాపాడుకుంటానండి” అనే చెప్పాడు కానీ, తండ్రి మాట, ప్రవక్త మాట విందామనుకోలేదు. కాబట్టి, స్నేహం ప్రభావం మనిషి వ్యక్తిత్వం మీద పడుతుందన్న విషయము నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో చెప్పబడింది.
అదే విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదాహరించి మరి మనకు తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తితో స్నేహం చేయడం, దాని ఉపమానం ఎలాంటిది అంటే, కస్తూరి అమ్మే వానిది మరియు భట్టి కాల్చే వానిది అని చెప్పారు. అంటే, ఎవరైతే మంచి వ్యక్తులతో సహవాసం చేస్తారో వారి ఉపమానం స్తూరి అమ్మే వానితో స్నేహం చేయటంతో సమానం. కస్తూరి అమ్మే వానితో స్నేహం చేస్తే, అతని వద్దకు వెళ్లి కూర్చుంటే అతను ఆ సువాసనను మనకు కూడా పూస్తాడు. లేదా కనీసం అక్కడ కూర్చున్నంత సేపు ఆ సువాసనను మనము పీల్చుతాము. అది మన ఆరోగ్యానికి మంచిది. ఆ విధంగా మంచి వ్యక్తులతో స్నేహము చేస్తే, సహవాసం చేస్తే అది మనకు ఏదో ఒక రకంగా ఉపయోగకరంగానే ఉంటుంది అన్న విషయం తెలియజేశారు.
అలాగే, చెడ్డవారితో స్నేహం చేయడం, వారి ఉపమానం బట్టీ కాల్చే వానితో స్నేహం చేయటం లాంటిది అని చెప్పారు. అంటే బట్టీ కాల్చే వానితో స్నేహం చేసి అతని వద్దకు వెళ్లి కూర్చుంటే అతను లోహాన్ని కాలుస్తూ ఉంటాడు. అప్పుడు నిప్పు రవ్వలు లేస్తాయి, అవి వచ్చి బట్టల మీద పడతాయి, బట్టలకు రంధ్రాలు పడిపోతాయి. ఆ విధంగా మనకు నష్టం కలుగుతుంది. లేదా కనీసం అక్కడ కూర్చున్న కారణంగా ఆ అగ్నిలో నుంచి వచ్చే పొగ అది మనం పీల్చుతాం. తద్వారా ఆ ప్రభావము మన హెల్త్ మీద పడుతుంది, మన ఆరోగ్యం మీద పడుతుంది. అంటే, ఒక చెడ్డ వ్యక్తితో మనము స్నేహం చేస్తే ఏదో ఒక రకంగా దాని నష్టము మనకు పడుతుందన్న విషయము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మరీ మనకు తెలియజేశారు.
అలాగే, మరొకచోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియజేశారు: “అర్రజులు అలా దీని ఖలీలిహి, ఫల్యన్జుర్ అహదుకుమ్ మయ్యుఖాలిల్.” అనగా, ప్రతి వ్యక్తి తన స్నేహితుని ధర్మం మీదే ఉంటాడు, అంటే అతని అడుగుజాడల్లోనే అతను నడుచుకుంటాడు కాబట్టి, స్నేహం చేసే ముందు మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒకసారి చూసుకోండి అన్నారు. అతను మంచోడా చెడ్డోడా అనేది ముందు చూసుకోండి. మంచి వ్యక్తి అయితేనే స్నేహం చేయండి. చెడ్డ వ్యక్తి అయితే అతనితో దూరంగా ఉండండి అన్న విషయము ఇక్కడ ప్రవక్త వారు మనకు తెలియజేశారు.
అలాగే, ఎవరైతే చెడ్డవారితో స్నేహం చేస్తారో, వారి మాటల్లో పడిపోయి ఆ తర్వాత వారు కూడా చెడిపోయి చెడ్డవారుగా మారిపోతారో, అలాంటి వారు రేపు పరలోకంలో పశ్చాత్తాప పడతారు. రేపు వారు ఏమంటారంటే:
يَا وَيْلَتَىٰ لَيْتَنِي لَمْ أَتَّخِذْ فُلَانًا خَلِيلًا. لَّقَدْ أَضَلَّنِي عَنِ الذِّكْرِ بَعْدَ إِذْ جَاءَنِي
(యా వైలతా లైతనీ లమ్ అత్తఖిజ్ ఫులానన్ ఖలీలా. లఖద్ అదల్లనీ అనిజ్జిక్రి బ’అద ఇజ్ జాఅనీ)
“అయ్యో, నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తిని నా స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది! హితోపదేశం నా వద్దకు వచ్చిన మీదట కూడా అతను నన్ను దాని నుండి పెడత్రోవ పట్టించాడు” (25:28-29).
అనగా, నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకనా ఉంటే ఎంత బాగుండేది. నా వద్దకు దైవ వాక్యాలు వచ్చిన తర్వాత, దైవ ఉపదేశాలు నా వద్దకు వచ్చిన తర్వాత అతను నన్ను అపమార్గానికి గురిచేశాడు. అంటే మన మాటల్లో చెప్పాలంటే, ఒక స్నేహితుడ్ని తలుచుకొని “నేను ఆ స్నేహితునితో స్నేహం చేసిన వల్లనే నేను మార్గభ్రష్టతానికి గురైపోయాను. అతనిని చూసి నేను చెడితిని” అని ఆ రోజు కొంతమంది స్నేహితులు వాపోతారు, పశ్చాత్తాప పడతారు. అక్కడ వెళ్లి పశ్చాత్తాప పడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రపంచంలోనే మంచి వ్యక్తులతో స్నేహం చేసుకోవాలి, చెడ్డ వారి స్నేహానికి దూరంగా ఉండాలన్న విషయము నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుస్తుంది.
ప్రతిమలలో, విగ్రహాలలో, పటాలలో ఎలాంటి శక్తులు లేవు
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విగ్రహాలు ఎన్నటికీ దేవుళ్ళు కాలేవు. విగ్రహాలు, శిల్పాలు, ప్రతిమలు, పటాలు, వీళ్ళు దేవుళ్ళు కారు. దేవుడు ఒక్కడే. ఆయనే పరలోకమందు ఉన్న ప్రపంచం మొత్తానికి పరిపాలిస్తున్న సృష్టికర్త అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అన్ని రకాల శక్తులు ఆయన వద్దే ఉన్నాయి. ప్రతిమలలో, విగ్రహాలలో, పటాలలో ఎలాంటి శక్తులు లేవు. లాభం కలిగించే శక్తి గానీ, నష్టం కలిగించే శక్తి గానీ ఈ పటాలలో గానీ, ప్రతిమలలో గానీ లేవు. సర్వశక్తులు గలవాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభువు అన్న విషయం మనకు తెలియజేయబడింది.
పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది
అలాగే, నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక్క విషయం చెప్పేసి ఇన్షా అల్లాహ్ నా మాటను ముగిస్తాను అది ఏమిటంటే అండి. చివరి విషయం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లల శిక్షణలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. చూడండి, నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు అపమార్గానికి గురయ్యాడు, తిరస్కారులలో చేరిపోయాడు. దానికి ఒక కారణము చెడు సహవాసము ఉంది, అలాగే మరొక కారణం ఏమిటంటే తల్లి శిక్షణ.
నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి తిరస్కారి. నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. ఒక తిరస్కారి. ఒక తిరస్కారి కడుపున పుట్టి, తిరస్కారి తల్లి మాటలు విని ఆయన చెడిపోయాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. మిత్రులారా, కొంతమంది మానసిక వైద్య నిపుణులు తెలియజేసిన విషయం ఏమిటంటే, తల్లి మాటల, తల్లి ప్రవర్తనల ప్రభావము బిడ్డల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డలు తండ్రి కంటే కూడా తల్లికి దగ్గర అవుతారు. తల్లి చెప్పిన మాటను తొందరగా బిడ్డలు తీసుకుంటారు అని మానసిక వైద్య నిపుణులే తెలియజేసి ఉన్నారు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మార్గభ్రష్టతానికి గురి అయిన కారణాలలో ఒక కారణం ఏమిటంటే, తల్లి తిరస్కారి.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు వివాహం చేసుకునేటప్పుడు మహిళ అందాన్ని, మహిళ ధనాన్ని, మహిళ వంశాన్ని, గౌరవ ప్రతిష్టలని చూడటం కంటే, ఆమె భక్తి గుణాన్ని చూడండి. గుణవంతురాలైన మహిళతో మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే మీ సంతానము మంచి సంతానము, క్రమశిక్షణ కలిగిన సంతానము కావాలంటే, మీ భార్య గుణవంతురాలై ఉండాలి, విశ్వాసురాలై ఉండాలి, భక్తురాలై ఉండాలి. అప్పుడే ఆ భక్తురాలి యొక్క మాటల, ప్రవర్తనల ప్రభావము మీ సంతానం మీద పడి వారు కూడా మంచి భక్తులుగా, క్రమశిక్షణ కలిగిన వారుగా మారుతారు. కాబట్టి, మంచి సంతానము, మంచి బిడ్డలు, క్రమశిక్షణ కలిగిన బిడ్డలు కావాలని కోరుకునే వారు వివాహ విషయంలోనే జాగ్రత్త పడితే మంచిది అన్న విషయం బోధించబడింది మిత్రులారా.
ఇక్కడితో నా మాటను ముగిస్తూ, నేను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవిత చరిత్రను విని, తెలుసుకొని, అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకొని, మన భక్తిని పెంచుకొని, అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనకి కూడా భక్తి ప్రసాదించుగాక, మన సంతానానికి కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భక్తి ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ రుజు మార్గం మీద నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30908