ఇహ్రాం స్థితిలో అనుమతింపబడిన మరియు నిషేధింపబడిన విషయాలు  – ఇమామ్ ఇబ్నె బాజ్

ఇహ్రాం సంకల్పం చేసుకున్న తరువాత స్త్రీపురుషులు వెంట్రుకలు లేదా గోళ్ళు గొరగటం లేదా కత్తిరించటం, అత్తరు పూసుకోవటం మొదలైనవి చేయరాదు. ఇహ్రాం స్థితిలో ప్రవేశించిన తరువాత అలాంటి పనులకు అనుమతి లేదు. ముఖ్యంగా మగవారికి షర్టు, ప్యాంటు, కుర్తా, పైజామా, మేజోళ్ళు మొదలైన కుట్టబడిన దుస్తులు ధరించే అనుమతి లేదు. ఒకవేళ తన నడుము చుట్టూ కట్టుకోవటానికి ఏదైనా దుప్పటి లాంటి వస్త్రం లభించనపుడు, అతను సుర్వాల్ (పైజామా వంటిది) వంటిది తొడుక్కోవచ్చు. అలాగే, రబ్బరు చెప్పులు లేదా మామూలు చెప్పులు లేకపోతే, అతడు కత్తిరించని చర్మపు మేజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. బుఖారీ మరియు ముస్లింలలో నమోదు చేయబడిన అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఈ ఉల్లేఖనలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“ఎవరి వద్దనైతే స్లిప్పర్లు లేదా చెప్పులు లేవో, అలాంటివారు చర్మపు మోజోళ్ళు (కుఫ్) తొడుక్కోవచ్చు. మరియు ఎవరి వద్దనైతే ఇజార్ (నడుము చుట్టూ కట్టుకునే దుప్పటి వంటి వస్త్రం) లేదో, అలాంటి వారు పైజామా (సుర్వాల్) తొడుక్కోవచ్చు. ”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం, ఒకవేళ అవసరమైతే ‘కత్తిరించబడిన చర్మపు మేజోళ్ళ’ తొడుక్కోవచ్చు అనే విషయంలో ‘కత్తిరించబడటమనేది’ రద్దు చేయబడినది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో అడగబడిన ‘ఇహ్రాంలోని వ్యక్తి ఎలాంటి దుస్తులు ధరించవచ్చనే’ ప్రశ్నకు బదులుగా ఇబ్నె అబ్బాస్ ఉల్లేఖనలో తెలిపినట్లుగా జవాబిచ్చినారు. అయితే ఒకవేళ చెప్పులు లేకపోతే, చర్మపు చెప్పులు (కుఫ్ లు)  తొడుక్కోవచ్చని ఆయన అరఫాత్ ఉపన్యాసంలో పలికినారు. అంతేగాని ఆ చర్మపు చెప్పులు కత్తిరించబడాలని అనలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పై పలుకులు పలికినపుడు చుట్టు ఉన్నవారిలో కొందరు మదీనా పై పలుకులు పలికినపుడు ఆయన సమీపంలో లేరు. ఆవశ్యక విషయాన్ని ఆలస్యం చేయడం తగదనే విషయం మనకు తెలుసు. కాబట్టి, చర్మపు చెప్పులు కత్తిరించబడాలనే విషయం రద్దు చేయబడినదనే విషయం ఋజువైనది. ఒకవేళ అది అవసరమైన విషయమై ఉంటే, ఆయన దానినితప్పకుండా పలికి ఉండేవారు.

చెప్పుల వలే కాలి చీలమండలం కంటే క్రింద ఉండే చర్మపు మేజోళ్ళు (కుఫ్ లు) తొడుక్కోవటానికి ఇహ్రాంలోని వారికి అనుమతి ఉంది. నడుము చుట్టూ కట్టుకునే ఇజార్ వస్త్రానికి ముడి వేసి, దారంతో (త్రాడుతో) కట్టడానికి అనుమతి ఉంది. ఎందుకంటే అలా చేయకూడదని ఎక్కడా చెప్పబడలేదు. అలాగే ఇహ్రాంలోని వ్యక్తి  స్నానం చేయవచ్చు, తన తల కడుక్కోవచ్చు, మృదువుగా తల గోక్కోవచ్చు. అలా గోక్కోవటం వలన ఒకవేళ వెంట్రుకలేవైనా రాలితే, అందులో ఎలాంటి దోషం లేదు.

ఇహ్రాంలోని స్త్రీల కొరకు ముసుగు వంటి వేరే వస్త్రంతో ముఖం కప్పుకోవటం, చేతులకు చేతిమేజోళ్ళు తొడుక్కోవటం నిషేధించబడింది. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“ఇహ్రాంలోని స్త్రీ ముఖంపై ముసుగు వేసుకోకూడదు, చేతులకు చేతి మేజోళ్ళు (ఖుఫ్ఫాజ్) తొడుక్కోకూడదు”  బుఖారీ

ఖుఫ్ఫాజ్ అంటే ఉన్ని లేదా కాటన్ నేయబడిన చేతి మేజోళ్ళు. అయితే స్త్రీల కొరకు ఇహ్రాం స్థితిలో కూడా షర్టులు, ప్యాంట్లు,షల్వార్ ఖమీజులు మేజోళ్ళు మొదలైన ఇతర కుట్టబడిన దుస్తులు తొడుక్కునే అనుమతి ఉంది. అలాగే, పరాయి మగవాళ్ళు ఎదురైనపుడు, ఆమె తన ముఖాన్ని చేతిరుమాలుతో కప్పుకోవచ్చు. తలపై కప్పుకునే తలగుడ్డలో (head scarf) ముఖం దాచుకుంటే తప్పులేదు. ఆయెషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు చేసిన హజ్ లో, పురుష యాత్రికుల సమూహం తమను దాటుతూ, ఎదురు బదురు అయినపుడు, స్త్రీలు తమ తలగుడ్డను క్రిందికి జార్చి, ముఖం కనబడకుండా జాగ్రత్త పడేవారు. ఆ పురుషులు తమను దాటిన తరువాత, వారు తమ ముఖాలపై జార్చుకున్న తలగుడ్డను తొలగించుకునేవారు. (అబూ దావూద్, ఇబ్నె మాజా, అద్దర్ ఖుత్ని)

అలాగే, పరాయి మగవారు తమ పరిసరాలలో ఉన్నపుడు, దేనితోనైనా తన చేతులను కప్పుకోవటానికి వారికి అనుమతి ఉంది. అలాంటి పరిస్థితులలో తమ ముఖాలను మరియు చేతులను కప్పుకోవటం వారి బాధ్యత. అల్లాహ్ యొక్క ఆదేశానుసారం, ఈ శరీర భాగాలు కప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

“మరియు తమ అలంకారాలను తమ భర్తలకు తప్ప ఇతరులకు చూపరాదు” 24:31

చేతులు మరియు ముఖం – రెండూను మగువల ఆకర్షణలను ప్రతిబింబిస్తాయి. మరియు ముఖాలు చేతుల కంటే మరింత ఆకర్షణీయమైనవి. ఈ విషయం ఖుర్ఆన్ వచనంలో స్పష్టంగా తెలుపబడింది:

“మీరు ఏదైనా అడగవలసి వచ్చినపుడు తెర వెనుక నుంచి అడగండి. మీ అంతర్యాల, వారి హృదయాల పరిశుద్ధత కోసం ఇదే మంచిది.” ఖుర్ఆన్ వచన భావానువాదం 33:53

అనేక మంది స్త్రీలు (హజ్ /ఉమ్రహ్ లలో) తలపై కప్పుకునే తలగుడ్డలకు జత చేసే అదనపు వస్త్రానికి ఎలాంటి ఆధారమూ లేదు. తలగుడ్డ ముఖానికి తగలకుండా వారలా చేస్తుంటారు. ఒకవేళ అదే అలా చేయటం అవసరమైతే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి ఆ విధంగా చేయమని బోధించి ఉండేవారు. అంతేగాని ఆయన ఈ విషయం గురించి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేవారు కాదు. పురుషులు మరియు స్త్రీలు తమ ఇహ్రాం దుస్తులను కడుక్కోవచ్చు మరియు ఇహ్రాం జతను మార్చుకోవచ్చు – ఇది అనుమతించబడింది. కాషాయరంగు అద్దకం వేయబడిన దుస్తులు మాత్రం వాడకూడదు. ఎందుకంటే అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ఆధారంగా, దీనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారనే విషయం స్పష్టమవుతున్నది.

అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ఇహ్రాం స్థితిలో ఉన్నవారు అనవరమైన వ్యర్థ సంభాషణలలో పాల్గొనరాదు, పాపాకార్యాలు చేయరాదు, పోరాడరాదు / ఘర్షణ పడరాదు.

“హజ్జ్ నెలలు అందరికీ తెలిసినవే. వాటిలో ఎవరైతే హజ్జ్ చేయుటకు తలపెడతారో, వారు హజ్జ్ సమయంలో (భార్యలతో) లైంగిక కలాపాలకు, పాపపు పనులకు, జగడాలకు దూరంగా ఉండండి. మీరు ఏ సత్కార్యం చేసినా, అది అల్లాహ్ కు తెలియును. ప్రయాణసామాగ్రిని వెంట తీసుకుని వెళ్ళండి. నిశ్చయంగా, అత్యుత్తమ సామగ్రి దైవభీతి మాత్రమే. మరియు ఓ వివేకవంతులారా! కేవలం నాకు మాత్రమే భయపడండి”. 2:197

ఇదే విషయం ఒక హదీథులో కూడా చెప్పబడింది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఎవరైతే హజ్ చేస్తారో, మరియు అశ్లీల, అసభ్య కార్యాలకు (రఫత్) మరియు దౌర్జన్యానికి (ఫుసుఖ్) పాల్బడరో, అలాంటి వారు అప్పుడే పుట్టిన శిశువు వలే (పాపరహితంగా) మరలి వస్తారు”

రఫత్ అంటే లైంగిక కార్యకలాపాలు, శృంగార వ్యవహారాలు మరియు వ్యర్థ సంభాషణలు, పనికిమాలిన వ్యర్థాచరణలు. ఫుసుఖ్ అంటే మామూలుగా పాపకార్యాలని అర్థం. జిదాల్ అంటే అర్థం పర్థం లేని విషయంపై పోట్లాడటం. అయితే, సముచితమైన పద్ధతిలో సత్యాన్ని సమర్ధించే మరియు అసత్యాన్ని ఖండించే సంభాషణలు అనుమతించబడటమే గాక ప్రోత్సహించబడినాయి కూడా. దీని గురించి అల్లాహ్ యొక్క ఆదేశం ఇలా ఉన్నది:

“నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. ” 16:125

టోపీ, తలపాగా వంటి తలకు అంటుకుని ఉండే వేటితోనైనా తమ తలను లేదా ముఖాన్ని కప్పుకోవటం పురుషుల కొరకు నిషేధించబడింది. ఒంటె తన్నటం వలన ఒక సహచరుడు అరఫాత్ దినమున చనిపోయినాడు. అతని అంత్యక్రియలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“అతని శరీరాన్ని నీటితో మరియు సిద్ర్ తో కడగండి. అతని రెండు ఇహ్రాం వస్త్రాలను కఫన్ వాడి వాటిలో అతనిని చుట్టండి. మరియు అతని తలను మరియు ముఖాన్ని కప్పవద్దు – ఎందుకంటే అంతిమదినాన అతను లబ్బైక్ పలుకుతూ లేస్తాడు.” [ముత్తఫిఖ్ అలైహ్]

అయితే, ఎవరైనా కారు పైకప్పు క్రింద గానీ, గొడుగు క్రింద గానీ తలదాచుకుంటే ఏమీ దోషం లేదు. అలాగే గుడారం లోపల లేదా చెట్టు క్రింద తలదాచుకున్నా ఏ తప్పూ లేదు. జమరతుల్ అఖ్బా పై రాళ్ళు విసురుతున్నపుడు, ఆయన సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒక వస్త్రంతో నీడ కల్పించారు. మరో హదీథులో అరఫహ్ దినమున నమిరహ్ వద్ద ఆయన కొరకు ఒక గుడారం వేయబడిందని, ఆయన దానిలో సూర్యాస్తమయం వరకు ఉన్నారని పేర్కొనబడింది.

ఇహ్రాం స్థితిలో ఉన్న స్త్రీ, పురుషుల కొరకు – భూమిపై జంతువులను వేటాడటం, వేటలో పాల్గొనటం లేదా సహాయపడటం, వేటాడుతూ జంతువుల వెనుకబడటం, పెళ్ళాడటం, దాంపత్య సుఖం అనుభవించటం, పెళ్ళి రాయబారం పంపడం, ఎవరైనా స్త్రీని కామంతో స్పర్శించడం మొదలైనవన్నీ నిషేధించబడినాయి. ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన క్రింది హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని ఇలా స్పష్టం చేసారు,

“ఒక ముహ్రిం స్వయంగా తను పెళ్ళాడరాదు, తన తరఫు పెళ్ళి జరిపించుకోవటమూ చేయరాదు, పెళ్ళి రాయబారమూ పంపరాదు.” [ముస్లిం హదీథు గ్రంథం]

అజ్ఞానం వలన (నిషేధాజ్ఞలు తెలియకపోవటం వలన) ఎవరైనా ఇహ్రాం స్థితిలో తలపై ఏదైనా వస్త్రం వేసుకోవటం, టోపీ పెట్టుకోవటం, తలపాగా పెట్టుకోవటం, అత్తరు పూసుకోవటం వంటివి చేస్తే, అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ (దమ్) లేదు. తనకు వాటి గురించిన నిషేధాజ్ఞలు తెలియగానే లేదా ఎవరైనా అతని తప్పును అతనికి తెలియజేయగానే, అతను తన తప్పును సరిదిద్దుకోవలెను – అంటే తలపై నుండి టోపి వంటి వాటిని, తలగుడ్డను తొలగించవలెను. అలాగే ప్రామాణిక ఉల్లేఖనల ఆధారంగా, మతిమరుపు వలన లేదా అనాలోచితంగా లేదా తెలియక ఎవరైనా వెంట్రుకలు లేదా గోళ్ళు గొరిగించుకున్నా, కత్తిరించుకున్నా అతనిపై ఎలాంటి ప్రాయశ్చిత పరిహారమూ లేదు.

ఏ ముస్లిమైనా – ఇహ్రాం స్థితిలో ఉన్నా లేదా ఇహ్రాం స్థితిలో లేకపోయినా; స్త్రీ అయినా, పురుషుడైనా; జంతువులను వేటాడటం, సంజ్ఞలతో లేదా ఆయుధాలతో లేదా జంతువులను ఒక చోటకు తోలటం మొదలైన వేట పనులలో సహాయపడటం వంటివి కాబాగృహ పవిత్ర హద్దులలో నిషేధించబడింది. ఆ ప్రాంతంలోని చెట్లను నరకటం, పచ్చికను కోయడం మొదలైనవి కూడా నిషేధించబడినాయి. అంతేగాక ఆ పరిధి లోపల పడి ఉన్న ఇతరుల ఏ వస్తువునైనా ఎత్తుకోవటం కూడా నిషేధించబడింది – దాని గురించి చాటింపు వేయటానికైతే తప్ప. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు,

“అల్లాహ్ ఆదేశాలనుసారం అంతిమ దినం వరకు ఈ నగరం (మక్కా) పావనమైనది. దీని చెట్లు నరకరాదు. దీని జంతువులను వేటాడరాదు. దీని పచ్చికను కోయరాదు. క్రింద పడి ఉన్న వస్తువులను ఎత్తుకోరాదు – వాటి గురించి అందరికీ తెలిసేలా ప్రకటించే ఉద్దేశ్యంతో ఎత్తుకునే వారు తప్ప.”

ఇక్కడ పచ్చిక అంటే తాజా మొక్కలు, వృక్షసంపద. మీనా మరియు ముజ్దలిఫాలు కూడా కాబా గృహ పవిత్ర సరిహద్దుల లోపలే వస్తాయి. అయితే అరఫాత్ ఈ పవిత్ర కాబా గృహ సరిహద్దులోనికి రాదు.

[1]. హజ్ యాత్రికుడు నిర్దేశించబడిన దుస్తులు ధరించి, హజ్ లేదా ఉమ్రహ్ సంకల్పం చేసుకుని ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించే స్థలం.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

%d bloggers like this: