తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.
సయీ (సఫా మరియు మర్వా కొండల మధ్య నడక) ప్రారంభించటానికి, సపా కొండపై ఎక్కి నిలబడ వలెను.
ఒకవేళ అవకాశం లభిస్తే, అక్కడ అల్లాహ్ ను ధ్యానించేటప్పుడు మరియు ఈ క్రింది దుఆ పఠించేటప్పుడు, సఫా కొండ పైకి ఎక్కవలెను, కాబా గృహం వైపు తిరిగి నిలబడవలెను.
లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు, అంజజ వఆదహు, వ నసర అబ్దుహు, వ హజమ అహ్ జాబ వహదహు
ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చినాడు, తన దాసునికి సహాయం చేసినాడు, కేవలం ఆయనే ఒంటరిగా అహ్ జాబ్ (అవిశ్వాస తెగల మొత్తం) సమూహాన్ని ఓడించినాడు.
ఇలా పఠించిన తరువాత, రెండు చేతులూ పైకెత్తి, వీలయినన్ని ఎక్కువ దుఆలు చేసుకోవలెను. ఒక్కో దుఆ మూడు సార్లు పఠించవచ్చు. సఫా కొండ పైనుండి క్రిందికి దిగిన తరువాత, మర్వా కొండ వైపు నడక సాగించవలెను. ఆకుపచ్చ రంగు లైటు నుండి మరో ఆకుపచ్చ రంగు లైటు వరకు పురుషులు వడివడిగా (పరుగు పరుగున) నడవ వలెను. అయితే స్త్రీలు అలా చేయవలసిన అవసరం లేదు, సయీ మొత్తాన్ని వారు మామూలు నడకతో పూర్తి చేయవలెను. మర్వా కొండ వద్దకు చేరుకున్న తరువాత, దాని పైకి ఎక్క వలెను, ఒకవేళ అవకాశం లభించక పోతే, కొండ ప్రక్కన నిలుచో వలెను. కొండ పైకి ఎక్కటం ఉత్తమం. సఫా వద్ద పఠించిన విధంగా ఇక్కడ కూడా పఠించవలెను. ఈ విధంగా ఒక సయీ నడక పూర్తవుతుంది.
మర్వా కొండ దిగిన తరువాత, సపా వైపు నడక సాగిస్తూ, వేగంగా నడవ వలసిన ఆకు పచ్చ లైట్లు వచ్చినపుడు వడి వడిగా నడిచి, సఫా కొండ వద్దకు చేరుకోవలెను. ఈ విధంగా రెండో సయీ నడక పూర్తవుతుంది. ఇలా ఏడు సార్లు సఫా మరియు మర్వాల మధ్య నడవ వలెను. సఫా నుండి మర్వా వద్దకు చేరుకోవటం ఒక సయీ నడకగా పరిగణింపబడుతుంది. అలాగే మర్వా నుండి సఫా వద్దకు మరల చేరుకోవటం రెండో సయీ నడకగా పరిగణింప బడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే విధంగా చేసినారు మరియు ఆయన ఇలా పలికినారు: “ హజ్ నియమాలను నా నుండి నేర్చుకోండి.”
సయీ నడకలో వీలయినంత వరకు అల్లాహ్ ను ధ్యానిస్తూ, దుఆలు చేసుకోవలెను. అన్ని రకాల అపరిశుద్ధతల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించవలెను. వుదూ లేక పోయినా సయీ నడక సాగించడానికి అనుమతి ఇవ్వబడింది. తవాఫ్ పూర్తి చేసిన తరువాత ఒకవేళ ఎవరైనా స్త్రీకి, నెలసరి బహిష్టు వచ్చినా, పురుటి రక్తస్రావం మొదలైనా, ఆమె ఆ స్థితిలోనే సయీ నడక కొనసాగించవచ్చును. ముందు తెలిపినట్లుగా, సయీ నడక కొరకు తప్పనిసరిగా వుదూలోనే ఉండవలసిన అవసరం లేదు. సయీ నడక పూర్తయిన తరువాత, పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించు కోవలెను లేదా చిన్నవిగా కత్తిరింపబడేలా క్షవరం చేయించుకోవలెను. పురుషులు తమ తల వెంట్రుకలు పూర్తిగా గొరిగించుకోవటం మంచిది.
తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:
మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]
ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/