జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:
زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ
జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత
స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి.
[ముస్లిం హదీథు]
సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,
أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ
అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్ మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.
మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:
أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ
అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్
సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.
ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.
మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.
అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:
زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً
జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్
సమాధులను సందర్శించండి, కానీ చెడు పలుకులు పలుకవద్దు.
ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.
ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.
—
ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]