మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్  -ఇమామ్ ఇబ్నె బాజ్

మక్కా చేరుకున్నపుడు యాత్రికుడు ఏమి చేయాలి?

మక్కా సరిహద్దులకు చేరుకున్న తరువాత, మక్కాలో ప్రవేశించక ముందు యాత్రికుడు స్నానం చేయటం మంచిది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయం. అల్ మస్జిద్ అల్ హరమ్ చేరుకున్న తరువాత, సున్నతు ప్రకారం, ముందుగా కుడికాలు లోపలకు పెట్టి క్రింది దుఆ చదువుతూ లోపలికి ప్రవేశించవలెను.

బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమ్, వ బివజ్ హిల్ కరీమ్, వ సుల్తానిహిల్ ఖదీమ్, మినష్ షైతానిర్రజీమ్, అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక

“అల్లాహ్ పేరుతో, రసూలుల్లాహ్ పై శాంతి మరియు దీవెనలు కురియుగాక, బహిష్కరింపబడిన షైతాను బారి నుండి; ఆయన యొక్క పవిత్ర ముఖము ద్వారా మరియు ఆయన యొక్క అత్యంత ప్రాచీన పరిపాలన మరియు అధికారం ద్వారా సర్వలోక శక్తిమంతుడైన ఆ అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఓ అల్లాహ్! నీ కారుణ్య ద్వారాలను నా కొరకు తెరుచు”

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు కూడా ఇదే దుఆ పఠించవలెను. నాకు తెలిసినంత వరకు, మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించేటపుడు పఠించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన ప్రత్యేక దుఆ ఏదీలేదు.

మస్జిద్ అల్ హరమ్ లో ప్రవేశించటం మరియు తవాఫ్ (కాబా గృహ ప్రదక్షిణ)

కాబా గృహాన్ని సమీపించిన తరువాత, ఒకవేళ అతను హజ్జె తమత్తు లేదా ఉమ్రహ్ కొరకు సంకల్పం చేసుకుని ఉన్నట్లయితే, తవాఫ్ ఆరంభించక ముందు లబ్బైక్ పలకటం ఆపివేయవలెను. హజ్రె అస్వద్ (నల్లరాయి) దిశ వైపు నిలబడి, తన కుడి చేతితో దానిని స్పర్శించవలెను, వీలయితే దానిని ముద్దు పెట్టుకోవలెను. అలా  చేయటంలో అతను ఇతరులను త్రోయటం గానీ, అసౌకర్యం కలిగించటం గానీ చేయరాదు. అతను దానిని స్పర్శించేటపుడు, ఇలా పలకవలెను – بسم الله، الله اكبر  – బిస్మిల్లాహ్, అల్లాహు అక్బర్ – అల్లాహ్ పేరుతో, అల్లాహ్ మహోన్నతుడు. ఒకవేళ దానిని ముద్దాడటం కష్టమైతే, తన చేతితో లేదా తన చేతికర్రతో దానిని స్పర్శించి, ఆ చేతిని లేదా చేతికర్రను ముద్దాడవలెను. ఒకవేళ అలా చేయడం కూడా కష్టమైతే, హజ్రె అస్వద్ వైపు చేయితో సైగ చేసి, الله اكبر  – అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు అని పలుకవలెను. అయితే దూరం నుండి హజ్రె అస్వద్ వైపు ఊపిన చేతిని లేదా చేతికర్రను లేదా ఇతర వస్తువును ముద్దాడరాదు. తవాఫ్ ఆరంభించినపుడు కాబాగృహం అతని ఎడమ వైపు ఉండవలెను. తవాఫ్ ఆరంభించేటపుడు ఇలా పలకటం మంచిది,

అల్లాహుమ్మ ఈమానంబిక,  వ తస్తదీకమ్ బి కితాబిక, వ వఫాఅమ్ బి అహ్దిక, వత్తిబాఅల్ లిసున్నతి నబియ్యిక ముహమ్మద్

“ఓ అల్లాహ్! నీపై విశ్వాసంతో, నీ గ్రంథంపై విశ్వాసంతో, నీకు చేసిన వాగ్దానాన్ని నేరవేరుస్తూ మరియు నీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానాన్ని అనుసరిస్తూ నేను దీనిని చేస్తున్నాను.”

పై పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వారసత్వంగా సంక్రమించింది. తవాఫ్ లో ఏడు ప్రదక్షిణలు ఉంటాయి. మొదటి మూడు ప్రదక్షిణలలో రమల్ చేయవలెను. మక్కాలో ప్రవేశించిన తరువాత చేసే మొదటి తవాఫ్ లో ఇలా రమల్ చేయవలెను – ఆ తవాఫ్ ఉమ్రహ్ కోసమైనా, హజ్జె తమత్తు ఉమ్రహ్ కోసమైనా లేదా హజ్జె ఖిరాన్ ఉమ్రహ్ కోసమైనా సరే. మిగిలిన నాలుగు ప్రదక్షిణలను మామూలుగా నడుస్తూ పూర్తి చేయ వలెను. ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్ నుండి ఆరంభమవుతుంది మరియు హజ్రె అస్వద్ వద్దనే పూర్తవుతుంది. రమల్ అంటే వడివడిగా నడవడం. మొత్తం తవాఫ్ లో ఇద్తిబా చేయవలెను. ఉమ్రహ్ లేదా హజ్ కోసం చేసే తవాఫ్ లను తప్పించి, ఇతర తవాఫ్ లలో ఇద్తిబా చేయరాదు. ఇద్తిబా అంటే పై వస్త్రాన్ని తమ కుడి భుజం అందరికీ కనబడేలా కుడిచేయి చంక క్రింది నుండి తీసుకువచ్చి, ఎడమభుజం పై వాటి రెండు చివరలు ఉంచటం.

ఒకవేళ ఎవరికైనా తాము ఎన్ని ప్రదక్షిణలు చేసామో గుర్తులేక, వాటి సంఖ్య గురించి అనుమానం వస్తే, తాము అనుమానిస్తున్న రెండింటిలో తక్కువ సంఖ్యను తీసుకోవలెను. ఉదాహరణకు, ఒకవేళ ఎవరికైనా తాము మూడు ప్రదక్షిణలు చేసామా లేక నాలుగు ప్రదక్షిణలు చేసామా అనేది గుర్తు లేకపోతే, తాము మూడు ప్రదక్షిణలే చేసామని లెక్కించుకోవాలి. సయీలో కూడా ఇదే విధంగా చేయాలి. తవాఫ్ పూర్తి చేసిన తరువాత, తమ కుడిభుజాన్ని పైవస్త్రంతో కప్పివేయాలి. అంటే తవాఫ్ తరువాత, మఖామె ఇబ్రాహీం వద్ద చేసే రెండు రకాతుల నమాజు కంటే ముందు, తమ రెండు భుజాలను పై వస్త్రంతో నిండుగా కప్పుకోవాలి.

స్త్రీలు ముసుగులో ఉండటం మరియు తమ అందచందాలను ప్రదర్శించే విధంగా అలంకరించుకోకుండా ఉండటం తప్పనిసరి.

తవాఫ్ చేసేటపుడు స్త్రీలు అత్తరు లేదా పెర్ఫ్యూమ్ పూసుకోవటం, తమ అందచందాలను ప్రదర్శించటం వంటి వాటికి దూరంగా ఉండటం అనివార్యం. ఇహ్రాం స్థితిలో ఉండి తవాఫ్ చేస్తున్నపుడు కూడా వారు పరాయి పురుషులకు తమ ముఖం కనబడకుండా మరియు తమ సౌందర్యం ప్రదర్శించకుండా జాగ్రత్త వహించవలెను. వారు పురుషులకు దగ్గరగా ఉన్నపుడు, స్త్రీపురుషులు ఒకేచోట కలిసిమెలిసి ఉండే చోట ఇలా జాగ్రత్ర పడటం మరీ ముఖ్యం. ఎందుకంటే స్త్రీల ఆకర్షణ పురుషులను ఉశికొలుపే ఒక ప్రధాన కారణం కావటం వలన స్త్రీలు ముఖంపై ముసుగు వేసుకోవటం ఆవశ్యకం. ఎందుకంటే స్త్రీల అందాన్ని ప్రధానంగా వారి ముఖం ప్రదర్శించటం వలన, పరాయి పురుషుల ముందు వారు తమ ముఖాన్ని ప్రదర్శించటం అనుమతించబడలేదు.

“… మరియు తమ భర్తల ముందు తప్ప తమ అందచందాలను వారు ప్రదర్శించరాదు” 24:31

ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే సమయంలో పురుషుల చూపు వారిపై ఉంటే, వారు తమ ముఖంపై ముసుగును తొలగించరాదు. ఒకవేళ హజ్రె అస్వద్ ను ముద్దాడే లేదా స్పర్శించే అవకాశం లేనంతగా అక్కడ జనం గుమిగూడి ఉండిన పరిస్థితిలో స్త్రీలు హజ్రె అస్వద్ ను ముద్దాడటానికి పురుషులతో పోటీపడకూడదు. స్త్రీలు తమ పురుషుల వెనుక నడుస్తూ, తవాఫ్ పూర్తి చేయవలెను. కాబా గృహానికి అతి దగ్గరలో నుండి తవాఫ్ చేసే వారిలో చొచ్చుకుని పోయి, రద్దీలో ఇబ్బంది పడే కంటే, కాబా గృహానికి కొంచెం దూరంలో నుండి ప్రశాంతంగా తవాఫ్ చేయటం మంచిది. పైగా దూరంలో నుండి తవాఫ్ చేయటంలో అడుగులు పెరగటం వలన ఎక్కువ పుణ్యాలు కూడా లభించే అవకాశం ఉంది. రమల్ మరియు ఇద్తిబాలను తవాఫ్ లో మాత్రమే పాటించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా చేరుకున్న తర్వాత చేసిన తన మొదటి తవాఫ్ లోనే రమల్ మరియు ఇద్తిబాలు చేసారు. అయితే స్త్రీలు రమల్ మరియు ఇద్తిబాలను చేయవలసిన అవసరం లేదు.

తవాఫ్ మరియు సయీల కొరకు ప్రత్యేకమైన దుఆలు ఏమీ లేవు:

మొదటిసారైనా, తర్వాతైనా చేసే తవాఫ్ మరియు సయీలలో ప్రత్యేకమైన దుఆలు పఠించాలనే నియమం ఏదీ లేదు. ప్రతి తవాఫ్ ప్రదక్షిణలో ఒక ప్రత్యేకమైన దుఆ పఠించే పద్ధతిని కనిపెట్టిన కొందరి అలవాటుకు షరిఅహ్ లో ఎలాంటి ఆధారమూ లేదు. మీకు జ్ఞాపకం ఉన్న దుఆలలో నుండి ఏది పఠించినా సరిపోతుంది. రుకునె యమానీ (యమనీ మూల) వద్దకు చేరుకున్న తరువాత “బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో), అల్లాహు అక్బర్(అల్లాహ్ మహోన్నతుడు)” అని పలికి, దానిని కుడి చేత్తో తాకవలెను. అయితే దానిని ముద్దాడకూడదు మరియు దానిని స్పర్శించిన కుడి చేతిని కూడా ముద్దాడకూడదు. ఒకవేళ రద్దీ వలన రుకునె యమానీని తాకటానికి అవకాశం లభించకపోతే, దాని వైపు చేయి ఊపుతూ సైగ చేయకుండా, అలానే తవాఫ్ కొనసాగించవలెను. అంతేగాక దానివైపు తిరిగి అల్లాహు అక్బర్ అని కూడా పలక కూడదు. అలా దూరం నుండి రుకునె యమానీ వైపు తిరిగి అల్లాహు అక్బర్ అని పలకటం నాకు తెలిసినంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో లేదు. రుకునె యమానీ మరియు హజ్రె అస్వద్ ల మధ్య నడిచేటప్పుడు ఈ క్రింది దుఆ పఠించటం వాంఛనీయం.

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వ ఖినా అదాబన్నార్ సూరహ్ అల్ బఖరహ్ 2:201

“ఓ మా ప్రభూ! ఈ ప్రాపంచిక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు పరలోక జీవితంలో మాకు మంచిని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి రక్షించు.”

హజ్రె అస్వద్ కు ఎదురుగా ఉన్నపుడు, దానిని తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ, “అల్లాహు అక్బర్ – అల్లాహ్ మహోన్నతుడు” అని పలుకవలెను. ఒకవేళ రద్దీ వలన అలా తాకడం లేదా ముద్దుపెట్టుకోవడం కష్టమైతే, హజ్రె అస్వద్ కు ఎదురుగా వచ్చినపుడల్లా, దాని వైపు సంజ్ఞ చేస్తూ, అల్లాహు అక్బర్ అని పలుకవలెను. మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావి వెనుక నుండి తవాఫ్ చేయటంలో ఎలాంటి దోషమూ లేదు ముఖ్యంగా బాగా రద్దీగా ఉన్నపుడు. తప్పనిసరిగా కాబాగృహానికీ మరియు మఖామె ఇబ్రాహీం లేదా జమ్ జమ్ బావిల మధ్య నుండే తవాఫ్ చేయాలనే నియమం ఏదీ లేదు. మస్జిదె హరమ్ మొత్తంలో ఎక్కడి నుండైనా తవాఫ్ చేయవచ్చు. రద్దీ బాగా ఎక్కువగా ఉన్నపుడు, కాబా గృహం చుట్టూ ఉన్న మస్జిదు భవనం కప్పు పై నుండి తవాఫ్ చేయటంలో కూడా ఎలాంటి దోషమూ లేదు. అయితే, అవకాశం ఉంటే కాబా గృహం దగ్గరలో నుండి తవాఫ్ చేయటం ఉత్తమం.

అలాగే, అవకాశం లభిస్తే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చేయటం ఉత్తమం. రద్దీగా ఉండటం వలన ఒకవేళ అలా చేయలేక పోతే, తవాఫ్ పూర్తి చేసిన తరువాత కాబా మస్జిదులో మీకు వీలయిన చోట రెండు రకాతుల నమాజు చేసుకోవలెను.

ఈ రెండు రకాతుల నమాజులో సూరతుల్ ఫాతిహా తరువాత మొదటి రకాతులో సూరతుల్ కాఫిరూన్ మరియు రెండో రకాతులో సూరతుల్ ఇఖ్లాస్ పఠించవలెను. ఇలా పఠించటం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులో ఉన్నది.

తవాఫ్ పూర్తి చేసి, (మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు పూర్తి చేసి, జమ్ జమ్ నీరు త్రాగి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును అనుసరిస్తూ, హజ్రె అస్వద్ వైపు తిరిగి, వీలయితే దానిని కుడిచేతితో తాకి, సఫా కొండ వైపు సాగిపోవలెను.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది.
హజ్, ఉమ్రహ్ & జియారహ్ – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ [పుస్తకం]

ఉమ్రా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/umrah/

%d bloggers like this: