త్రాసును బరువు చేసే సత్కార్యాలు – 01| సంకల్పశుద్ధి [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 23 నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

[12:25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ముస్లిం తన పుణ్యాల అకౌంట్ పెరుగుతూ ఉండాలని చాలా కాంక్షిస్తాడు, అందుకు మరియు ప్రళయదినాన తన పుణ్యాల త్రాసు బరువుగా ఉండుటకు తన ఇహలోక జీవితంలో సాధ్యమైనంత వరకు అధికంగా పుణ్యాలు సమకూరుస్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు తక్కువ పాపాలు చేస్తూ ఉంటాడు. ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో వారే గొప్ప అదృష్టం పొందుతారు, ఆ తర్వాత ఎప్పుడూ అతనికి దురదృష్టం అనేది ఉండదు, తద్వారా మనసు మెచ్చిన విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నతమైన స్వర్గవనంలో ఉంటాడు. అల్లాహ్ ఇలా తెలిపాడుః

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ * فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ * وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ * فَأُمُّهُ هَاوِيَةٌ * وَمَا أَدْرَاكَ مَا هِيَهْ * نَارٌ حَامِيَةٌ

ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో అతను మనసు మెచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది, అదేమిటో (హావియా అంటేమిటో) నీకేం తెలుసు? అది దహించివేసే అగ్ని. (ఖారిఅహ్ 101:6-11).

అనేక మంది ఇహలోకంలో ధనవంతులు కావాలనుకుంటారు, అందుకోసం తమ సిరిసంపదల పెంపుదల మరియు త్వరగా ఐశ్వర్యవంతులు అయ్యే సూచనలు సూచించే పుస్తకాలు ఎన్నుకొని శ్రద్ధగా చదువుతూ ఉండడం చూస్తుంటాము. అలాంటప్పుడు మనం కూడా ఎన్నటికీ అంతం కాని, దోచుకోబడని ధనం గురించి తెలుసుకోవడం చాలా మంచిది, ధనం సమకూర్చ- డానికి కాంక్షించే విధంగా సత్కార్యాలు సమకూర్చడానికి కాంక్షించాలి. ఇహలోక సంపద అంతం అవుతుంది, సదా ఉండదు, పరలోక సంపద శాశ్వాతమైనది, అంతం కానిది. ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మనం ధనికులవడం ఏ మాత్రం పాపం కాదు. అల్లాహ్ గొప్ప నిరపేక్షాపరుడు, ధనవంతుడు, ఉదారుడు.

నీవు త్వరగా పరలోక దనవంతుడివి కాదలచుకుంటే త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వెంట పడాలి. అల్లాహ్ దయతో ఈ పుస్తకం నీ త్రాసును బరువుగా చేసే సత్కార్యాల వైపునకు నీకు దారి చూపుతుంది.

అందుకు ప్రతి ముస్లిం, విద్యనభ్యసించడం మరియు అభ్యసించిన విద్యను ఆచరణలోకి తీసుకురావడంలో అలసటకు, అశ్రద్ధకు గురికాకూడదు. ఎంతో మంది నీ ముందు ఉన్న ఈ పుస్తకంలోని ఘనతల పట్ల అజ్ఞానంలో ఉన్నారు, వాటిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు, వాటి గురించి ప్రశ్నించే, వెతికే ప్రయత్నమూ చేయరు. అందుకు అల్లాహ్ యొక్క గొప్ప వరం; అల్లాహ్ మనకు ధర్మం, సత్యం నేర్పాడు, దాని వైపునకు మార్గం చూపాడు, ఇక ఆ ధర్మం, సత్యం పట్ల మనకు సంపూర్ణ ప్రేమ కలగాలని, అది మన హృదయాలకు శోభాయమానంగా అవ్వాలని వాటిని ఎల్లవేళల్లో ఆచరణలో ఉంచుటకు అల్లాహ్ తో దుఆ చేయాలి, ఇది మనకు ఆ రోజు తప్పకుండా లాభాన్నిస్తుంది ఏ రోజయితే దుర్మార్గుడు, విద్య నేర్చుకోనివాడు, మరియు ఆచరించనివాడు తన చేతులను కొరుకుతూ ఇలా అంటాడు: అయ్యో! నేనీ పరలోక జీవితం కోసం ముందుగానే సత్కార్యాలు చేసుకొని ఉంటే ఎంత బావుండేది? ఇది గంభీరమైన (Serious) విషయం, పరిహాసం (Joke) కాదు, శాశ్వతంగా స్వర్గంలో లేదా శాశ్వతంగా నరకంలో ఉండవలసి ఉంటుంది. అల్లాహ్ ఆ నరకం నుండి మనందరినీ రక్షించుగాక!

1వ కార్యం: మాటల్లో, చేతల్లో సంకల్పశుద్ధి

ప్రతి కార్యానికి పునాది సంకల్పశుద్ధి. ఏ కార్యం  ఎంత సంకల్ఫశుద్ధితో కూడుకొని ఉంటుందో త్రాసులో అంతే బరువుగా ఉంటుంది, అది కొంచమైనా సరే. ఒకవేళ చూపుగోలు, పేరు, ప్రఖ్యాతులతో సమ్మిళితమై ఉంటే త్రాసు తేలికగా ఉంటుంది, అది ఎంత ఎక్కువగా అయినప్పటికీ సూక్ష్మకణాలుగా, దుమ్ము, ధూళివలే అయిపోతుంది (అంటే రవ్వంత పుణ్యం లభించదు). అల్లాహ్ సుబ్ హానహు వతఆలా వద్ద కర్మల ఘనత, వాటిని చేసేవారి మనస్సులో ఉండే సంకల్పశుద్ధిని మరియు వారిలో ఉండే అల్లాహ్ పట్ల ప్రేమను బట్టి పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది.

عَنْ أَبِي أُمَامَةَ الْبَاهِلِيِّ t، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ ﷺ، فَقَالَ: أَرَأَيْتَ رَجُلًا غَزَا يَلْتَمِسُ الْأَجْرَ وَالذِّكْرَ، مَالَهُ؟ فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ فَأَعَادَهَا ثَلَاثَ مَرَّاتٍ، يَقُولُ لَهُ رَسُولُ اللَّهِ ﷺ: لَا شَيْءَ لَهُ ثُمَّ قَالَ: إِنَّ اللهَ لَا يَقْبَلُ مِنَ الْعَمَلِ إِلَّا مَا كَانَ لَهُ خَالِصًا، وَابْتُغِيَ بِهِ وَجْهُهُ

అబూ ఉమామహ్ బాహిలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఓ మనిషి వచ్చి, ‘ఒక వ్యక్తి పుణ్యఫలం మరియు పేరుప్రఖ్యాతులనుద్దేశించి పోరాడుతుంటే అతనికి ప్రాప్తమయ్యేదేమిటి?’ అని అడిగాడు. “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిచ్చారు. ఆ మనిషి తిరిగి మూడు సార్లు అదే ప్రశ్న అడిగాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనికి ఏ పుణ్యమూ దక్కదు” అని మూడు సార్లు జవాబిచ్చారు, మళ్ళీ ఆ తర్వాత ఇలా చెప్పారుః “అల్లాహ్ సంకల్పశుద్ధితో, ఆయన అభీష్టాన్ని కోరుతూ చేసిన సత్కార్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు”. (నిసాయి 3140, తబ్రానీ కబీర్ 7628, సహీహుల్ జామి 1856).

అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘ఒక చిన్న కార్యాన్ని సంకల్పం గొప్పదిగా, పెద్దదిగా చేయవచ్చు, ఒక పెద్ద కార్యాన్ని సంకల్పం చిన్నదిగా చేయవచ్చు’. (జామిఉల్ ఉలూమి వల్ హికం, రచయితః ఇబ్ను రజబ్ అల్ హంబలీ 1/71).

మైమూన్ బిన్ మహ్రాన్ రహిమహుల్లాహ్ చెప్పారుః ‘మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ, ఆ తక్కువవాటిని సంకల్పశుద్ధితో ఆచరించండి’. (హిల్ యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియా, రచయితః అబూ నుఐమ్ 4/92).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

الصَّلَاةُ فِي جَمَاعَةٍ تَعْدِلُ خَمْسًا وَعِشْرِينَ صَلَاةً فَإِذَا صَلَّاهَا فِي فَلَاةٍ فَأَتَمَّ رُكُوعَهَا وَسُجُودَهَا بَلَغَتْ خَمْسِينَ صَلَاةً

“సామూహికంగా చేసే నమాజు (ఒంటరిగా చేసే) పాతిక నమాజులకు సమానంగా ఉంటుంది. ఒకవేళ అతను అదే నమాజు ఏదైనా ఎడారి ప్రాంతంలో చేస్తూ, రుకూ, సజ్దాలు సంపూర్ణంగా చేస్తే యాబై నమాజులకు సమానంగా చేరుతుంది”. (అబూదావూద్ 560, ఇబ్ను హిబ్బాన్ 1749, హాకిం 753, సహీహుల్ జామిః అల్బానీ 3871).

అతను (ఎడారిలో) ఒంటరిగా ఎందుకు నమాజు చేశాడు? నమాజు గురించి అతనికి గుర్తు చేయడానికి ఏ ముఅజ్జిన్ యొక్క అజాన్ మరియు తోటి స్నేహితుడు అంటూ లేడు? రుకూ, సజ్దాలు సంపూర్ణంగా, ఎంతో హుందాతనంతో, తృప్తిగా నమాజు చేశాడు? ఎందుకనగా అతడు సంకల్ఫశుద్ధితో, అల్లాహ్ కొరకు మాత్రమే చేశాడు, అల్లాహ్ అతడ్ని కనిపెట్టి ఉన్నాడన్న భావన కలిగి ఉన్నాడు అందుకే అతనికి అధిక రెట్లు ప్రతిఫలం లభించింది.

అందుకే సలమా బిన్ దీనార్ రహిమహుల్లాహ్ చెప్పారు: “నీవు నీ పాపాలను ఎంత గుప్తంగా చేస్తావో అంతకంటే ఎక్కువ గుప్తంగా పుణ్యకార్యాలు చేయు.” (హిల్యతుల్ ఔలియా వ తబ్ ఖతుల్ అస్ఫియాః అబూ నుఐమ్ 3/240).

అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః

بَيْنَمَا كَلْبٌ يُطِيفُ بِرَكِيَّةٍ، كَادَ يَقْتُلُهُ العَطَشُ، إِذْ رَأَتْهُ بَغِيٌّ مِنْ بَغَايَا بَنِي إِسْرَائِيلَ، فَنَزَعَتْ مُوقَهَا فَسَقَتْهُ فَغُفِرَ لَهَا بِهِ

“మరణావస్థకు చేరబోతున్న ఓ కుక్క ఒక బావి చుట్టూ తిరగసాగింది, ఇస్రాఈల్ సంతతికి చెందిన వ్యభిచారిణిల్లో ఒకామె ఆ కుక్కను చూసింది, వెంటనే తన కాలిజోడులో నీళ్ళు నింపి ఆ కుక్కకు త్రాగించింది. అందుకై ఆమెను మన్నించడం జరిగింది”. (బుఖారి పదాలు 3467, ముస్లిం 2245).

ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: “స్వచ్ఛమైన విశ్వాసంతో ఆమె కుక్కకు త్రాగించింది. అందుకని క్షమించబడింది. అలా అని కుక్కకు నీళ్ళు త్రాగించే ప్రతి వ్యక్తి మన్నింపు జరగదు“. (మిన్ హాజ్…3/ 183, మదారిజ్…1/ 332).

పూర్తి భాగాలు క్రింద వినండి 

%d bloggers like this: