అపశకునం – షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ | ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

28వ అధ్యాయం : అపశకునం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.

అల్లాహ్ ఆదేశం:

أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు“. (ఆరాఫ్ 7: 131).

అల్లాహ్ పంపిన ప్రవక్తలు ఇలా అన్నారు:

قَالُوا طَائِرُكُم مَّعَكُمْ

మీ దుశ్శకునం స్వయంగా మీ‌ వెంటనే ఉంది“. (యాసీన్‌ 36:19).

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం : ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

అస్పృశ్యత (అంటు వ్యాధి) సరైనది కాదు. అపశకునం పాటించకూడదు. గుడ్లగూబ (అరుపు, లేక ఒకరి ఇంటిపై వాలితే ఆ ఇంటివారికీ నష్టం కలుగుతుందని భావించుట) సరికాదు. ఉదర వ్యాధితో [1] అపశకునం పాటించుట కూడా సరైనది కాదు”. (బుఖారి, ముస్లిం). ముస్లిం హదీసు గ్రంథంలో “తారాబలం, దయ్యాల నమ్మకం కూడా సరైనది కాదు”. అని ఉంది.

[1] కొందరి నమ్మకం ప్రకారం రోగి కడుపులోకి ఒక జంతువు దూరి ఆకలిగా ఉన్నప్పుడు తీవ్రమైన దుఃఖం కలిగిస్తుంది. దీనివల్ల ఒక్కోసారి రోగి మృత్యువాతన కూడా పడతాడు. ఈ నమ్మకాన్ని అరబిలో “సఫర్‌” అంటారు.

అనసు (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:

అస్పృశ్యతా పాటింపు లేదు. దుశ్శకునం పాటించడం ధర్మ సమ్మతంకాదు. అయితే శుభశకునం (ఫాల్‌) పాటించడమంటే నాకిష్టమే” [2]. అప్పుడు అనుచరులు “మంచి శకునం అంటే ఏమిటి?” అని అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “(మంచి శకునం అంటే) మంచి మాట (సద్వచనం)” అని సమాధానమిచ్చారు.

[2] అకస్మాత్తుగా ఏదైనా మంచి మాట విని లేదా సందర్భోచితమైన మాట విని దాన్నుండి సకారాత్మక ఫలితం తీయడమే మంచి శకునం (ఫాల్‌). ఇది ధర్మసమ్మతమే.

ఉఖ్బా బిన్‌ ఆమిర్‌ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర దుశ్శకునం పాటించే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆయన: “ఫాల్‌” మంచిది. అది ముస్లింను తన పనుల నుండి ఆపదు. మీలో ఎవరైనా తనకు ఇష్టం లేనిది చూస్తే ఇలా అనాలి:

اللَّهُمَّ لا يَأتى بالحَسَناتِ إلاَّ أنتَ ، وَلا يَدْفَعُ السَّيِّئاتِ إلاَّ أنْتَ ، وَلا حوْلَ وَلا قُوَّةَ إلاَّ بك 

అల్లాహుమ్మ లా యాతి బిల్‌ హసనతి ఇల్లా అంత. వలా యద్‌-ఫఉస్సయ్యిఆతి ఇల్లా అంత. వలాహౌల వలాఖువ్వత ఇల్లా బిక

అర్ధం: ఓ అల్లాహ్! మంచిని ప్రసాదించేవాడివి నీవే. చెడును దూరము చేయువాడివి నీవే. మంచి చేయుటకు, చెడు నుండి దూరముంచుటకు నీకు తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు). అని చెప్పారు. (అబూ దావూద్‌).

ఇబ్ను మస్ ఊద్‌, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు ఉల్లేఖించారు:.

దుశ్శకునం పాటించుట షిర్క్‌. దుశ్శకునం పాటించుట షిర్క్. మనలో ప్రతీ ఒకడు దానికి గురవుతాడు. కాని అల్లాహ్ పై ఉన్న నమ్మకం ద్వారా అల్లాహ్ దాన్ని దూరము చేస్తాడు”.

(అబూ దావూద్‌. తిర్మిజి. చెప్పారు: చివరి పదాలు ఇబ్ను మస్ ఊద్‌ (రదియల్లాహు అన్హు) చెప్పినవి.

ఇబ్ను ఉమర్‌ (రదియల్లాహు అన్హుమా) కథనం:

దుశ్శకునం తన పనికి అడ్డు పడిందని ఎవడు నమ్ముతాడో అతడు షిర్క్ చేసినట్టు”.

దాని పరిహారం ఏమిటని అడిగినప్పుడు:

« اللَّهُمَّ لَا خَيْرَ إِلَّا خَيْرُكَ وَلَا طَيْرَ إِلَّا طَيْرُكَ، وَ، وَلَا إِلهَ غَيْرُكَ » 

అల్లాహుమ్మ లా ఖైర ఇల్లా ఖైరుక. వలా తైర ఇల్లా తైరుక. వలాఇలాహ గైరుక” అనండి అని తెలిపారు.

(అర్ధం: నీ మంచి తప్ప మంచి ఎక్కడా లేదు. నీ శకునం తప్ప శకునం ఎక్కడా లేదు. నీ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు). (అహ్మద్‌).

నిన్ను పని చేయనిచ్ఛేది లేక పనికి అడ్డుపడేది దుశ్శకునం” అని ఫజ్‌ల్‌బిన్‌ అబ్బాసు (రదియల్లాహు అన్హు) అన్నారు.

ముఖ్యాంశాలు:

  1. ఖుర్‌ ఆన్‌లోని పై రెండు ఆయతుల భావం తెలిసింది. “అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది. మీ దుశ్శకునం స్వయంగామీ వెంటనే ఉంది”.
  2. అస్పృశ్యత పాటించడము సరికాదు.
  3. దుశ్శకునం పాటించడం సరికాదు.
  4. గుడ్లగూబ నష్టం కలిగిస్తుందని భావించుట సరికాదు.
  5. సఫర్‌ కూడా సరైనది కాదు.
  6. ఫాల్‌ అలాంటిది కాదు. అది మంచిది.
  7. ఫాల్‌ అంటే ఏమిటో కూడా తెలిసింది.
  8. అది ఇష్టం లేనప్పటికి, ఒక్కోసారి మనుస్సులో అలాంటి భావం కలిగితే నష్టం లేదు. ఎందుకనగా అల్లాహ్ తనపై నమ్మకం ఉన్నవారి నుండి దాన్ని దూరము చేస్తాడు.
  9. అలా మనుస్సులో కలిగినప్పుడు ఏమనాలో తెలిసింది.
  10. దుశ్శకునం షిర్క్‌.
  11. దుశ్శకునం అంటేమిటో కూడా తెలిసింది.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

పక్షులతో, పేర్లతో, పదాలతో, స్థలము వగైరాలతో అపశకునం పాటించుటను అరబిలో “తియర” అంటారు. అల్లాహ్ అపశకునమును నివారించి, దాన్ని పాటించేవారిని కఠినంగా హెచ్చరించాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఫాల్‌ అంటే ఇష్టపడేవారు. అపశకునమంటే అసహ్యించుకునేవారు.

అపశకునం మరియు ఫాల్‌లో వ్యత్యాసం ఏమనగా: ఫాల్‌ మానవుని విశ్వాసము, బుద్ధి, జ్ఞానములో లోపం కలుగచేయదు. అల్లాయేతరులపై మనస్సు లగ్నం విశ్వాసం, అల్లాహ్ పై నమ్మకముపై దెబ్బకొట్టింది. ఇలా (గీత గీయబడిన) రెండిట్లో లోపం కలుగ జేసింది అనడంలో ఏలాంటి సందేహం లేదు. ఆ తరువాత ఈ కారణంగా అతని మనస్సు బలహీనత, పిరికితనం, సృష్టిరాసులతో భయం ఎలా చోటు చేసుకుంటుందో అడుగకు. నిరాధారమైన వాటిని ఆధారంగా నమ్మి, అల్లాహ్ వైపు లగ్నం కాకుండా దూరమవుతాడు. ఇదంతయు ఏకత్వ విశ్వాస బలహీనత, అపనమ్మకము, షిర్క్‌ వాటి మార్గాల అనుసరణ, బుద్దిని చెడగొట్టే దురాచారాల వలన కలుగుతుంది.

రెండవది: అతడు ఆ ప్రభావాన్ని స్వీకరించడు. కాని అది తన ప్రభావాన్ని చూపి బాధ, చింతకు గురిచేస్తుంది. ఇది చూడడానికి మొదటిదానికంటే చిన్నది అయినా, అది చెడు, మానవునికి నష్టం. అతని మనస్సు బలహీనతకు కారణం మరియు అల్లాహ్ పై ఉండే నమ్మకంలో కూడా బలహీనత వస్తుంది. ఒకప్పుడు ఏదైనా ఇష్టములేని సంఘటన జరిగితే అది ఈ కారణంగానే అని భావిస్తాడు. అపశకునం పై అతని నమ్మకం మరీ రెట్టింపవుతుంది. ఒకప్పుడు పైన వివరించిన భాగంలో చేరే భయం కూడా ఉంటుంది.

అపశకునమును ఇస్లాం అసహ్యించుకునేదీ, దాన్ని పాటించేవారిని హెచ్చరించేదీ, అది ఏకత్వ విశ్వాసం మరియు అల్లాహ్ పై నమ్మకమును ఎలా వ్యతిరేకమో పై వివరణ ద్వారా మీకు తెలియవచ్చు.

ఇలాంటిది ఎవరికైనా సంభవించి, స్వభావికమైన ప్రభావాలు అతనిపై తమ ప్రభావాన్ని చూపుతే తను వాటిని దూరము చేయుటకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. అల్లాహ్ తో సహాయము కోరాలి. ఆ చెడు అతని నుండి దూరము కావాలంటే, ఏ విధంగా కూడా దాని వైపునకు మ్రొగ్గు చూప కూడదు.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

%d bloggers like this: