
ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
[21:08 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
నమాజు నిధులు (Treasures of Salah) – పూర్వపు పాఠాలు మరియు పుస్తకం ఇక్కడ వినండి/చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/
9 – సజ్దాలు
సజ్దా నమాజులోని అతి గొప్ప భాగం, అందులో అల్లాహ్ కొరకు నమ్రత, సమర్పణ సంపూర్ణ రీతిలో పాటించబడుతుంది. అందుకే అనేక పుణ్యాలు, ఉత్తమ ఫలితాలు సజ్దా విషయంలో చెప్పబడ్డాయి. ఈ గొప్ప పుణ్యాన్ని గమనించండి.
(9.1) సాఫల్యం (నరకం నుండి రక్షణ, స్వర్గ ప్రవేశ సఫలత)
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا وَاعْبُدُوا رَبَّكُمْ وَافْعَلُوا الْخَيْرَ لَعَلَّكُمْ تُفْلِحُونَ – 22:77
అల్లాహ్ ఆదేశం: {విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి, దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చును}. (హజ్ 22: 77).
{లఅల్లకుం తుఫ్లిహూన్} వ్యాఖ్వానంలో అబూ బక్ర్ అల్ జజాయిరీ ఇలా చెప్పారు: ‘అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే గొప్ప సాఫల్యం‘. (ఐసరుత్తఫాసీర్ లికలామిల్ అలియ్యిల్ కదీర్).
(9.2) ప్రళయదినాన అల్లాహ్ దయానుగ్రహాలు, ఆయన సంతోషం మరియు కాంతి లభిస్తాయి
مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ
{ముహమ్మద్ ﷺ అల్లాహ్ ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు, వారు రుకూ సజ్దాలలో, అల్లాహ్ అనుగ్రహాన్నీ ఆయన ప్రసన్నతనూ అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించ బడతారు}. (ఫత్ హ్ 48: 29).
{సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి} యొక్క వ్యాఖ్యానం లో సఅదీ (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారు: ‘అధికంగా మరియు మంచిరీతిలో చేసిన దాస్యం (ఇబాదత్) ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సయితం కాంతివంతమైంది. (తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్)
(9.3) స్థానం రెట్టింపు, పాపం మన్నింపు
فَقَالَ النَّبِي صلى الله عليه وسلم: (عَلَيْكَ بِكَثْرَةِ السُّجُودِ لِله فَإِنَّكَ لَا تَسْجُدُ لِله سَجْدَةً إِلَّا رَفَعَكَ اللهُ بِهَا دَرَجَةً وَحَطَّ عَنْكَ بِهَا خَطِيئَةً).
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారుః “నీవు ఎక్కువగా సజ్దాలు చేయి, నీవు సజ్దా చేసినపుడల్లా నీ ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీ కొరకు ఒక స్థానం పెంచుతాడు, పాపం మన్నిస్తాడు”. (ముస్లిం 488).
(9.4) ప్రవక్త సామీప్యం
రబీఅ బిన్ కఅబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నేను వుజూ నీళ్ళు, మరేదైనా అవసరమున్నవి అందించుటకు ప్రవక్త ﷺ వద్దనే రాత్రి గడపేవాణ్ణి. అయితే ఒకసారి ప్రవక్త ﷺ “అడుగు (నీకిష్టమున్నది అడుగు)” అని అన్నారు. ‘నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను’ అని అన్నాను, ఇంకేదైనా? అని ప్రవక్త అడిగాడు, ‘కేవలం అది మాత్రమే’ అని నేనన్నాను. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారుః “నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజ్దాలు (నమాజులు) చేసి నాకు సహాయపడు”. (ముస్లిం 489).
(9.5) దుఆ స్వీకారానికి తగిన సమయం
ప్రవక్త ﷺ ప్రబోధించారని అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “దాసుడు తన ప్రభువుకు అతి చేరువుగా ఉండేది సజ్దా స్థితిలో, గనక అందులో ఎక్కువగా దుఆ చేయండి”. (ముస్లిం 482).
మరో ఉల్లేఖనంలో ఆయన ﷺ ఇలా చెప్పారు: “సజ్దాలో దుఆ ఎక్కువగా చేయండి, అది స్వీకారయోగ్యమవుతుందన్న నమ్మకం ఈ స్థితిలో ఎక్కువగా ఉంటుంది”. (ముస్లిం 479).
(9.6) పాపాల ప్రక్షాళన
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “మనిషి నమాజు చేయుటకు లేచినప్పుడు అతని పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి, అతను రుకూ, సజ్దాలు చేసినపుడల్లా అవి రాలిపోతాయి”. (బైహఖీ 3/10, సహీహుల్ జామిఅ 1671).
(9.7) సజ్దా అంగమును నరకాగ్ని కాల్చదు
ప్రవక్త ﷺ సెలవిచ్చారు: “(మానవ శరీరములో) సజ్దా భాగాన్ని అల్లాహ్ నరకంపై నిషేధించాడు, అంటే అది దాన్ని కాల్చదు”. (బుఖారీ 806, ముస్లిం 182).
విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో, మరియు వారి పాపాలను అధిగమించే, తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్దా అంగములు చాలా గౌరవనీయమైనవి గనక అగ్ని వాటిని తినదు, వాటిపై ఏలాంటి ప్రభావం పడదు. (అష్షర్హుల్ ముమ్తిఅ. 3వ సంపుటం: షేఖ్ ఇబ్ను ఉసైమీన్)
10 – మొదటి తషహ్హుద్
భూమ్యాకాశాల్లో ఉన్న అల్లాహ్ దాసులకు సమానంగా పుణ్యం
మొదటి తషహ్హుద్ లో ‘అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లా హిస్సాలిహీన్’ అన్న దుఆ చదువుతున్నప్పుడు గొప్ప ఘనత మనకు తెలుస్తుంది. నాతో పాటు మీరూ గమనించండి:
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: నా చేయి ప్రవక్త ﷺ చేతిలో ఉండగా ఖుర్ఆను సూరాలు నేర్పినట్లు ఆయన నాకు తషహ్హుద్ దుఆ నేర్పారు. ‘అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యి బాతు అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్‘ ఈ పదాలు మీరన్నప్పుడు భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురుషునికి ఈ దుఆ లభిస్తుంది.‘వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’. (బుఖారీ 831).
నీవు సలాం చేస్తున్నావంటే; భూమ్యాకాశాల్లో బ్రతికి ఉన్న, చని పోయిన పుణ్యపురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరిపై నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు.
11 – చివరి తషహ్హుద్: (ప్రవక్త పై దరూద్)
ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లంపై దరూద్ చదవడంలో చాలా పుణ్యాలు, రెట్టింపు ప్రతిఫలాలున్నాయి.
(11.1) అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا – 33:56
{అల్లాహ్ ఆయన దూతలు ప్రవక్తకై ‘దరూద్‘ను పంపుతారు, విశ్వాసులారా! మీరు కూడా ఆయనకై దరూద్, సలామ్ లు పంపండి}. (అహ్ జాబ్ 33: 56).
(11.2) పది రెట్ల పుణ్యం
عَنْ أَبِي هُرَيْرَةَ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ صَلَّى عَلَيَّ وَاحِدَةً صَلَّى اللهُ عَلَيْهِ عَشْرًا).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరు నాపై ఒక సారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది సార్లు కరుణిస్తాడు”. (ముస్లిం 408).
(11.3) పది పుణ్యాలు లిఖించబడతాయి, పది పాపాలు తొలగించ బడతాయి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశ ప్రకారం: “నాపై ఒక్కసారి దరూద్ పంపిన వానికి అల్లాహ్ పది పుణ్యాలు వ్రాస్తాడు”. (తిర్మిజి 485), మరో ఉల్లేఖనంలోని పదాలు ఇలా ఉన్నాయి: “అతని పది పాపాలు తొలగిస్తాడు”. మరో హదీసు పదాలు ఇవి: “అతని పది పాపాలు తుడిచివేస్తాడు”. (ముస్నద్ అహ్మద్ 3/102, 4/29). [పది స్థానాలు రెట్టింపు చేయబడతాయని’ ముస్నద్ అహ్మద్ 4/29లో ఉంది.]
You must be logged in to post a comment.