మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 5]
[మరణానంతర జీవితం – పార్ట్ 59] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=Dh-tkJ9A784
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త నరకాగ్ని (జహన్నం) యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరిస్తారు. తీర్పుదినాన నరకం కళ్ళు, చెవులు, నాలుక కలిగిన ఒక సజీవ ప్రాణిగా మారి, అహంకారులు, బహుదైవారాధకులు మరియు చిత్రకారుల వంటి పాపాత్ములను గుర్తిస్తుందని హదీసుల ఆధారంగా తెలియజేస్తారు. నరకవాసుల శరీరాలు శిక్షను తీవ్రతరం చేయడానికి ఎంతగానో పెంచబడతాయని, వారి భుజాల మధ్య దూరం, చర్మం మందం, దవడ పళ్ళ పరిమాణం ఊహించలేనంతగా ఉంటాయని వర్ణిస్తారు. వారి ముఖాలు నల్లబడి, అవమానంతో కప్పబడి ఉంటాయని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేస్తారు. చివరగా, నరకవాసులకు అందించే ఆతిథ్యం, వారి ఆహారం (జక్కూమ్ అనే చేదు వృక్షం) మరియు పానీయాల గురించి వివరిస్తూ, ఈ శిక్షల నుండి రక్షణ పొందడానికి విశ్వాసం మరియు సత్కార్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి వహద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బాద్.
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, నరకం, నరకవాసులు, నరక శిక్షల గురించి మనం వింటూ ఉన్నాము.
నరకం, దానికి రెండు కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా అది చూస్తుంది. నరకానికి రెండు చెవులు ఉంటాయి, వాటి ద్వారా అది వింటుంది. మరియు దానికి నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. అవిశ్వాసులు, పాపాత్ములు వచ్చి అందులో పడినప్పుడల్లా అది అరుస్తుంది, గర్జిస్తుంది, మహా పెద్ద అరుపులతో శబ్దాన్ని వెలికితీస్తుంది.
మహాశయులారా, ఆ నరకాగ్ని ఎంత భయంకరమైన శిక్ష అంటే దానిని ఇహలోకంలో ఉండి మనం ఊహించలేము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ లోని హదీస్:
يَخْرُجُ عُنُقٌ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ
(యఖ్రుజు ఉనుఖున్ మినన్నారి యౌమల్ ఖియామ)
ప్రళయదినాన నరకంలో నుండి ఒక మెడ బయటికి వస్తుంది.
لَهُ عَيْنَانِ يُبْصِرَانِ
(లహు ఐనాని యుబ్సిరాన్)
దానికి రెండు కళ్ళు ఉంటాయి వాటితో చూస్తుంది.
وَأُذُنَانِ يَسْمَعَانِ
(వ ఉదునాని యస్మఆన్)
రెండు చెవులు ఉంటాయి, వాటితో అది వింటుంది.
وَلِسَانٌ يَنْطِقُ
(వ లిసానున్ యన్తిఖ్)
మరియు నాలుక ఉంటుంది దానితో మాట్లాడుతుంది.
అది ఇలా అరుస్తూ ఉంటుంది:
إِنِّي وُكِّلْتُ بِثَلاَثَةٍ
(ఇన్నీ ఉక్కిల్తు బి సలాస)
“మూడు రకాల మనుషులను నాకు అప్పగించడం జరిగింది.”
వారు నాలో ఉంటారు. ఒకరు,
بِكُلِّ جَبَّارٍ عَنِيدٍ
(బికుల్లి జబ్బారిన్ అనీద్)
అహంకారి మరియు సత్య తిరస్కారి మరియు సత్యం పట్ల విరోధం ప్రకటించే వ్యక్తి.
రెండో రకమైన వారు,
وَبِكُلِّ مَنْ دَعَا مَعَ اللَّهِ إِلَهًا آخَرَ
(వ బికుల్లి మన్ దఆ మఅల్లాహి ఇలాహన్ ఆఖర్)
ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధించేవారో వారిని,
وَالْمُصَوِّرِينَ
(వల్ ముసవ్విరీన్)
మరియు చిత్రాలు చిత్రీకరించే వారిని.
ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ మనల్ని ఎంత భయపెట్టిస్తుందో గమనించగలము. నరకం అనేది ఏదో ఒక కేవలం అగ్ని మాత్రమే కాదు. అల్లాహు తాలా దానికి ఎన్నో రకాల శక్తి ప్రసాదిస్తాడు. దాని మూలంగా ప్రజలు ఆ రోజు ప్రళయదినాన దాని దగ్గరికి వచ్చిన తర్వాత, అందులో పడిన తర్వాత దాని యొక్క భయంకరత్వాన్ని గుర్తుపడతారు. కానీ ఆ రోజు దాన్ని గుర్తుపట్టడం వల్ల మనకు ప్రయోజనం ప్రయోజనం ఏమిటి? ఈ రోజు అల్లాహ్ తెలిపే ఈ విషయాల్ని, ఈ వివరాల్ని తెలుసుకొని మనం దానికి భయపడి ఉంటే దాని నుండి మనం రక్షింపబడగలతాము.
నరకం యొక్క వికృత గర్జన
ఇంకా మహాశయులారా, నరకం చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, గర్జిస్తుంది, ఇంకా అది దాని యొక్క వేడి వల్ల, అందులో వచ్చి పడే అవిశ్వాసులు మరియు పాపాత్ముల వల్ల ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైతే అందులో పడిపోతారో వారికి ఎంత కష్టం కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో అట్లే మనం ఊహించగలము.
సూరహ్ ఫుర్ఖాన్ ఆయత్ నెంబర్ 12లో అల్లాహు తాలా తెలిపాడు:
إِذَا رَأَتْهُمْ مِنْ مَكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
(ఇదా రఅత్ హుమ్ మిమ్ మకానిమ్ బయీదిన్ సమీఊ లహా తగయ్యుదౌ వ జఫీరా)
దూరం నుంచే అది (నరకాగ్ని) వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.(25:12)
ఎప్పుడైతే అవిశ్వాసులను, పాపాత్ములను దూరం నుండే అది చూస్తుందో, ఇదా రఅత్’హుమ్, వారిని దూరం నుండే చూస్తుందో అప్పుడు వారు ఆ నరకం యొక్క ధ్వనులను, గర్జనలను వింటూ ఉంటారు. గమనించారా? దూరం నుండే అవిశ్వాసులను, నరకంలో వచ్చి పడే వారిని చూసినప్పుడు అది గర్జిస్తూ ఉంటుంది. అంత దూరాన ఉండే ఈ నరకవాసులు దాని గర్జన, దాని భర్జన, దాని యొక్క ధ్వనులను వింటూ ఉంటారు.
ఇమామ్ దహాక్ రహిమహుల్లాహ్ తెలిపారు, ప్రళయ దినాన నరకం గర్జిస్తుంది, దాని గర్జన ఏ సమీపంలో ఉన్న దైవదూత గాని, ప్రవక్తగా పంపబడిన సందేశహరులు గాని దానిని విని సజ్దాలో పడిపోతారు. అప్పుడు, “ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు,” అని వారు అల్లాహ్ తో మొరపెట్టుకుంటూ ఉంటారు.
ఇదే విషయాన్ని మరో రకంగా అల్లాహు తాలా సూరహ్ ముల్క్ లో కూడా తెలిపాడు. ఆ సూరహ్ ముల్క్ ప్రతి రాత్రి పడుకునే ముందు పఠించాలని మనకు ఆదేశం ఇవ్వబడినది.
إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
(ఇదా ఉల్ఖూ ఫీహా సమీఊ లహా షహీఖవ్ వహియ తఫూర్)
వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. (67:7)
تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ
(తకాదు తమయ్యజు మినల్ గైద్)
ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. (67:8)
ఈ విధంగా నరకం అనేది అంత ఆగ్రహానికి గురి అవుతుంది.
నరకవాసుల శరీరాలు
ఇక మహాశయులారా, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆకారం మారిపోతుంది. ఇహలోకంలో శరీరం ఎంత పొడవుగా, ఎంత లావుగా ఉండెనో అలా ఉండదు, అంతకంటే ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఆ వివరాలు కూడా మనకు ఖురాన్ మరియు హదీస్ లో తెలుపబడినవి.
ప్రళయదినాన నరకంలో నరకవాసుల శరీరం ఇహలోకంలో ఉన్నట్లు ఉండదు. వారి యొక్క శరీరంలో చాలా మార్పు వచ్చేస్తుంది, వారి ఆకారం కూడా మారిపోతుంది. వారి యొక్క శరీరం ఎంత లావుగా చేయబడుతుందో, సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
مَا بَيْنَ مَنْكِبَىِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
(మా బైన మన్కిబైల్ కాఫిరి మసీరతు సలాసతి అయ్యామిల్ లిర్రాకిబిల్ ముస్రిఅ)
అవిశ్వాసుని ఈ రెండు భుజాల మధ్యలో, ఇటు నుండి ఇటు వరకు ఈ భుజాల మధ్యలో పొడవు ఎంత పెద్దగా ఉంటుందంటే ఎవరైనా గుర్రపు రౌతు గాని, ఇంకా వేరే ప్రయాణికుడైనా గాని అతి వేగంగా పరిగెత్తుతే మూడు రోజుల ప్రయాణం దీని మీద చేయవచ్చు. అంత లావుగా వారి శరీరాన్ని పెంచబడుతుంది.
మరియు జామే తిర్మిదీ లో అబూ హురైరా రది అల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
إِنَّ غِلَظَ جِلْدِ الْكَافِرِ اثْنَانِ وَأَرْبَعُونَ ذِرَاعًا
(ఇన్న గిలద జిల్దిల్ కాఫిరి ఇస్నాని వ అర్బఊన దిరాఆ)
అవిశ్వాసుల తోలు యొక్క మందము అనేది నలభై రెండు గజాలు ఉంటుంది. మరియు అతని యొక్క దవడ పన్ను ఉహద్ పర్వతం మాదిరిగా పెద్దగా ఉంటుంది, మరియు అతడు కూర్చుంటే అతని యొక్క వైశాల్యం అనేది మక్కా, మదీనా మధ్యలో ఎంత పొడవు ఉందో అంత వెడల్పుగా అతను కూర్చుంటాడు.
మహాశయులారా, ఒక్కసారి మీరు గమనించండి, ఇటు భుజం నుండి ఇటు భుజం వరకు అతివేగంగా పరిగెత్తే ప్రయాణికుడు మూడు రోజులు నడవవచ్చు. దవడ పన్ను ఉహద్ కొండంత ఉంటుంది, మరియు అతని యొక్క ఈ నడుము అనేది, నడుము కింది భాగం కూర్చున్నప్పుడు మక్కా, మదీనా అంటే సుమారు 430 కిలోమీటర్ల దూరం. అంత వెడల్పు ఉంటుంది.
ముస్తద్రక్ హాకిమ్ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు, నరకం యొక్క వైశాల్యం చాలా పెద్దది, చాలా విశాలమైనది నరకం. నరకం యొక్క వైశాల్యం ఎంతదో కేవలం ఒక అంచనా వేసుకోవడానికి, అందులో ఏ అవిశ్వాసులను, పాపాత్ములను వేయడం జరుగుతుందో, ఒక పాపాత్ముని ఈ చెవి మరియు ఈ భుజముల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత స్థలం ఉంటుందో తెలియబరుస్తూ ఇబ్ను అబ్బాస్ రది అల్లాహు తాలా అన్హు చెప్పారు:
سَبْعِينَ خَرِيفًا
(సబ్ఈన ఖరీఫా)
డెబ్బై సంవత్సరాలు నడిచిపోవచ్చు. మరియు అందులో చీము, నెత్తురు ఇలాంటి ఎన్ని ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయని.
ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ సహీహ్ ముస్లిం యొక్క వ్యాఖ్యానంలో పాపాత్ముల, అవిశ్వాసుల శరీరాన్ని ఇంత వైశాల్యంగా, ఇంత లావుగా ఎందుకు చేయడం జరుగుతుందో దాని యొక్క సబబు తెలుపుతూ ఇలా చెప్పారు: వారు ఇహలోకంలో ఎలాంటి ఘోరమైన పాపాలకు పాల్పడ్డారో, దాని యొక్క శిక్ష వారికి సరియైన విధంగా లభించాలంటే ఇహలోకంలో ఉన్న వారి యొక్క ఆ చిన్నపాటి శరీరం సరిపోదు. వారికి వారి పాపాలకు తగ్గట్టు బాధ కలగాలి, శిక్ష దొరకాలి, వారు ఆ శిక్ష యొక్క రుచి చూడాలి మరియు నరకం యొక్క జ్వాలలు, దాని యొక్క అగ్ని వారికి తగిలి వారు దానిని అర్థం చేసుకోవాలి, అందుకొరకు అల్లాహు తాలా ఇలాంటి లావుపాటి శరీరాలు వారికి ఆ రోజు ఇస్తాడు. ఇది వారి శరీరం యొక్క లావుతనం, వారి యొక్క పన్ను, వారి యొక్క భుజం, వారి యొక్క చెవి మరియు భుజాల మధ్యలోని స్థలం, వారు కూర్చుంటే ఎంత వెడల్పు ఉంటారో ఇవన్నీ వివరాలు ఏదైతే తెలుసుకున్నామో, ఇక రండి మహాశయులారా, వారి ముఖం అనేది ఎలా ఉంటుంది ఆ రోజు.
నరకవాసుల ముఖాలు
ఆ రోజు వారి యొక్క ముఖం ఎలా ఉంటుంది? అల్లాహు అక్బర్. ఖురాన్ లోని ఎన్నో ఆయతులలో దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ముఖం అనేది క్రిందికి వాలి ఉంటుంది. ముఖము నల్లగా అయిపోతుంది, చీకటి మాదిరిగా. అవమానం అనేది వారిని క్రమ్ముకుంటుంది. వారు తలెత్తి ఒకరిని చూడడానికి, మాట్లాడడానికి యమ సిగ్గుపడుతూ ఉంటారంటే దానికి అంతు లేదు.
సూరహ్ జుమర్ లో అల్లాహు తాలా తెలిపాడు:
وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ
(వ యౌమల్ ఖియామతి తరల్లదీన కదబూ అలల్లాహి ఉజూహుహుమ్ ముస్వద్ద)
ప్రళయదినాన నీవు చూస్తావు ఎవరైతే అల్లాహ్ పై అసత్యాన్ని మోపారో వారి యొక్క ముఖాలు నల్లబడి ఉంటాయి. (39:60)
సూరహ్ అబస, 30వ ఖాండంలో అల్లాహు తాలా తెలిపాడు:
وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
(వ ఉజూహున్ యౌమఇదిన్ అలైహా గబర)
ఆ రోజు కొన్ని ముఖాలపై దుమ్ము ధూళి పడి ఉంటుంది. (80:40)
تَرْهَقُهَا قَتَرَةٌ
(తర్హఖుహా ఖతర)
అవమానం అనేది వారిని కమ్ముకుని ఉంటుంది. (80:41)
أُولَئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
(ఉలాయిక హుముల్ కఫరతుల్ ఫజర)
వారే సత్యాన్ని తిరస్కరించిన వారు, పాపాల్లో కూరుకుపోయిన వారు. (80:42)
ఈ భావంలో ఆయత్ లు ఖురాన్ లో ఇంకా అనేక చోట్ల ఉన్నాయి.
خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ
(ఖాషిఅతన్ అబ్సారుహుమ్ తర్హఖుహుమ్ దిల్లా)
వారి యొక్క కళ్ళు కిందికి వాలి ఉంటాయి, వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది. (సూరతుల్ ఖలమ్: 68:43)
సూరతుష్ షూరా ఆయత్ నెంబర్ 45 లో అల్లాహు తాలా తెలిపాడు:
وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنْظُرُونَ مِنْ طَرْفٍ خَفِيٍّ
(వ తరాహుమ్ యుఅ’రదూన అలైహా ఖాషియీన మినద్’దుల్లి యందురూన మిన్ తర్ఫిన్ ఖఫియ్యిన్)
“నీవు ఆ రోజు చూస్తావు వారిని నరకాగ్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. అవమానాన్ని భరించలేక తల క్రిందులు చేసుకొని ఉంటారు. మరియు మెలికన్నుతో ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా మెలికన్నుతో వారు ఒక పక్కన ఈ విధంగా చూస్తూ ఉంటారు.” (42:45)
నరకంలోని ఆతిథ్యం
ఇక మహాశయులారా, ఎవరైనా అతిథులు వచ్చారంటే వారిని ఎలా సత్కరించడం జరుగుతుంది, ఎంత గౌరవంతో వారికి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కానీ నరకవాసులు నరకంలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆహ్వానం లభిస్తుంది మరియు ఎలా వారిని స్వీకరించడం, ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందో ఈ ఆయతులలో కొంచెం మీరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
(ఇన్నా అఅ’తద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా)
మేము నరకాన్ని సత్య తిరస్కారుల కొరకు అతిథి మర్యాదల స్థానంగా చేసి ఉంచాము.(18:102)
సూరహ్ తూర్ లో అల్లాహ్ తెలిపాడు:
يَوْمَ يُدَعُّونَ إِلَى نَارِ جَهَنَّمَ دَعًّا
(యౌమ యుదవ్వూన ఇలా నారి జహన్నమ దఅ’అ)
ఎప్పుడైతే వారిని నరకం వైపునకు త్రోక్కుతూ మరియు వారిని త్రోసిపుచ్చడం జరుగుతుందో, (52:13)
هَذِهِ النَّارُ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(హాదిహిన్నారుల్లతీ కున్తుమ్ బిహా తుకద్దిబూన్)
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే” (52:14)
ఇదే ఆ నరకం, ఇదే ఆ నరకాగ్ని, దేనినైతే మీరు ఇహలోకంలో తిరస్కరించేవారో ఆ నరకం వైపునకే మిమ్మల్ని త్రోసివేయడం జరుగుతుంది, ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతుంది.
అందుగురించి సోదరులారా, నరకాన్ని తిరస్కరించి మనం ఏమీ సంపాదించలేము. నరకాగ్నిని విశ్వసించాలి కూడా, దాని నుండి రక్షణ పొందడానికి ఏ విశ్వాసం, ఏ సత్కార్యాలు అవసరం ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కూడా.
ఇహలోకంలో కొందరు మరికొందరిని అనుసరించి సత్యాన్ని తిరస్కరిస్తారు. కానీ నరకంలో వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు నరకంలో ప్రవేశింపజేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఆహ్వానం వారికి ఇవ్వబడుతుందో ఈ ఆయతులను మీరు శ్రద్ధగా వినండి. సూరహ్ సాద్, ఆయత్ నెంబర్ 55 నుండి 60 వరకు:
هَذَا فَوْجٌ مُقْتَحِمٌ مَعَكُمْ لَا مَرْحَبًا بِهِمْ إِنَّهُمْ صَالُوا النَّارِ
(హాదా ఫౌజుమ్ ముఖ్తహిముమ్ మఅకుమ్ లా మర్హబమ్ బిహిమ్ ఇన్నహుమ్ సాలున్నార్)
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు. (38:59)
ఇదిగో మరొక జట్టు, నరకానికి ఆహుతి అయ్యే మరొక జట్టు వచ్చేసింది. ‘లా మర్హబమ్ బిహిమ్’ వారికి ఎలాంటి స్వాగతం లేదు, వారికి ఎలాంటి మర్యాదలు లేవు. ‘ఇన్నహుమ్ సాలున్నార్’ వారు తప్పకుండా నరకంలో ప్రవేశించవలసినదే.
నరకంలోని ఆహారం మరియు పానీయం
ఇక రండి మహాశయులారా, నరకంలో ఎవరికి ఎలాంటి తిండి లభిస్తుంది, త్రాగడానికి ఎలాంటి పానీయాలు లభిస్తాయో వాటి వివరణ కూడా అల్లాహ్ ఖురాన్ లో మనకు తెలియబరిచాడు.
ఇహలోకంలో ఎవరైనా అపరాధిని పట్టుకోవడం జరిగి అతన్ని ఒక జైలులో పంపిస్తారు అని తెలిస్తే, ఆ జైలులో తినడానికి తిండి సరిగా లభించదు, అక్కడ పడుకోవడానికి సరియైన పడకలు ఉండవు అని తెలిస్తే, మరియు అక్కడ చాలా ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది అని తెలిస్తే, ఆ అపరాధి ఏ కొంచెమైనా అవకాశం పొందినప్పుడు ఏం చేస్తాడు? దారిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అవకాశం ఉంటే ఎవరి సిఫారసులు అయినా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇహలోకంలో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కావచ్చు.
కానీ నరకంలో అలాంటిది ఏదైనా అవకాశం ఉందా? నరకంలో పడి ఉన్నారు అంటే అక్కడ చాలా ఇరుకైన స్థలంలో, బాధాకరమైన స్థలంలో, అక్కడ ఎలాంటి ఏ సిఫారసు పనిచేయదు, ఏ ప్రాణ స్నేహితుడు కూడా సహాయం చేయడు, ఏ జట్టు కూడా, ఏ గ్రూప్ కూడా, ఏ గ్యాంగ్ లీడర్ కూడా, ఏ పెద్ద నాయకులు కూడా ఎవరికీ ఏ ప్రయోజనం చేకూర్చరు. అందుగురించి అక్కడి ఆ కష్టాల నుండి, ఆపదల నుండి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా మనకు మనం సరిదిద్దుకోవాలి, విశ్వాస మార్గాన నడుస్తూ, సత్కార్యాలు చేస్తూ ఉండాలి.
రండి ఒకసారి మనం, నరకవాసులకు ఎలాంటి తిండి ఇవ్వడం జరుగుతుందో ఖురాన్ ఆయతుల ద్వారా తెలుసుకుందాము. అయితే మహాశయులారా, మీరు కనీసం ఒక రెండు మూడు రోజుల నుండి నరకవాసులకు ఇవ్వబడే శిక్షల గురించి వివరాలు ఏవైతే వింటున్నారో ఇక పుణ్యాత్ములకు, మహా భక్తులకు, సత్కార్యాలు చేసే వారికి, విశ్వాసంపై నడిచే వారికి ఎలాంటి ఏ స్వాగతం అనేది, ఎలాంటి ఏ మంచి స్థలం అనేది లేదా అని భావించకండి. క్రమంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది గనుక, ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గనుక ఇప్పుడు నరకానికి సంబంధించిన వివరాలు తెలుపుతున్నాము. బహుశా ఇది ఒక వారం వరకు నడవవచ్చు, ఆ తర్వాత స్వర్గ శుభవార్తలను గురించి కూడా మనం తెలుసుకొనన్నాము. స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు, స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు ఏమిటి. కానీ అతి ముఖ్యమైనది అక్కడ మనకు పనికి వచ్చేది విశ్వాసం మరియు సామాన్యంగా సర్వ సత్కార్యాలు చేస్తూ ఉండడం. అయితే రండి, నరకవాసులకు ఎలాంటి తిండి, ఎలాంటి ఆహారం లభిస్తుందో, ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో తెలుసుకుందాము.
సూరతుద్ దుఖాన్, ఆయత్ నెంబర్ 43 నుండి 46 వరకు:
إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
(ఇన్న షజరతజ్ జక్కూమ్)
నిశ్చయంగా జముడు యొక్క వృక్షం, (44:43)
طَعَامُ الْأَثِيمِ
(తఆముల్ అతీమ్)
పాపాత్ములకు అది ఆహారంగా ఉంటుంది. (44:44)
يَغْلِي فِي الْبُطُونِ
(యగ్లీ ఫిల్ బుతూన్)
పొయ్యి మీద కుండ పెడితే కాగి కాగి ఎలా ఉడుకుతుందో, ఆ జముడు వృక్షాన్ని మనిషి తిన్న వెంటనే కడుపులో ఆ విధంగా మంట లేపుతుంది, ఆ విధంగా అది ఉడుకుతుంది. (44:45)
كَغَلْيِ الْحَمِيمِ
(కగల్ యిల్ హమీమ్)
(సలసల కాగే నీరు మరుగుతున్నట్లు). (44:46)
ఈ జముడు వృక్షం అనేది నరకంలోని అతి కింది స్థలంలో నుండి అది పుట్టుకు వస్తుంది, అది చాలా దుర్వాసన గలది మరియు తినే వారి గురించి అతి చెడ్డ ఆహారం.
అల్లాహు తాలా ఒక సందర్భంలో స్వర్గవాసులకు ఇవ్వబడే వరాలను తెలుపుతూ:
أَذَلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
(అదాలిక ఖైరున్ నుజులన్ అమ్ షజరతుజ్ జక్కూమ్)
స్వర్గవాసులకు లభించే ఈ స్వర్గంలో ఆతిథ్యం ఇది చాలా మంచిగా ఉందా లేక జముడు వృక్షం ఎవరికైతే తినడానికి ఇవ్వబడుతుందో అది ఉత్తమంగా ఉందా? (37:62)
జక్కూమ్, ఈ జముడు వృక్షం అనేది దాని యొక్క ఒక చుక్క, ఒక బిందువు కూడా ఎంత చేదు మరియు ఎంత చెడుగా ఉంటుందో దానిని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
لَوْ أَنَّ قَطْرَةً مِنَ الزَّقُّومِ قُطِرَتْ فِي دَارِ الدُّنْيَا لأَفْسَدَتْ عَلَى أَهْلِ الدُّنْيَا مَعَايِشَهُمْ فَكَيْفَ بِمَنْ تَكُونُ طَعَامُهُ
జక్కూమ్ యొక్క ఒక బిందు, ఒక చుక్క కూడా ఇహలోకంలో ఉన్న వారిపై వేయడం జరిగితే వారి యొక్క జీవితాలు, వారి యొక్క సంసారాలు అనేటివన్నీ కూడా చెడిపోతాయి. ఇక అవి తినే వారి గురించి ఎలా ఉంటుందో, వారి యొక్క గతి ఎలా అవుతుందో.
(ముస్నద్ అహ్మద్, తిర్మిదీ మరియు నిసాయీ యొక్క ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు)
ఈ విధంగా మహాశయులారా, జముడు వృక్షం అలాంటి పాపాత్ములకు తినడానికి ఇవ్వబడుతుంది.
అల్లాహు తాలా నరకంలోని అన్ని రకాల శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. నరకంలోకి తీసుకువెళ్లే పాపాల నుండి మనల్ని అల్లాహు తాలా దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44355
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]