భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]