మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మానవుల కర్మల నమోదు – [మరణానంతర జీవితం – పార్ట్ 48]
https://www.youtube.com/watch?v=MoutOVAU1zA [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినం
మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.
ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.
కర్మలను నమోదు చేసే దైవదూతలు
అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.
إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
(ఇది యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వనిష్షిమాలి క’యీద్)
ఒకడు కుడివైపున, మరొకడు ఎడమవైపున కూర్చొని వ్రాసేవారు వ్రాస్తున్నప్పటి స్థితిని (జ్ఞాపకం చేసుకో). (50:17)
కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:
وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ
(వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్)
నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)
మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.
మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.
మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:
لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا
‘అల్లాహ్ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)
ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.
మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
(అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్)
ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)
ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.
ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.
మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:
وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ
(వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్)
వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)
వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.
అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.
إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ
(ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్)
వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)
అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.
ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.
మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:
ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.
అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.
ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.
ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నాలుగు రకాల వారు. ఒకరు, అల్లాహు త’ఆలా అతనికి విద్య ప్రసాదించాడు మరియు ధనము ప్రసాదించాడు. అతడు ఆ విద్యతో ఆ ధనాన్ని అల్లాహ్ కు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతూ, సంబంధాలను పెంచుకుంటూ, అవసరం ఉన్నవారికి సహాయపడుతూ, తర్వాత అన్ని రకాల అల్లాహ్ కు ఇష్టమైన మంచి మార్గాల్లో ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ విధంగా అతనికి పుణ్యం రాయబడుతుంది, అతనికి పుణ్యం లభిస్తుంది.
రెండో వ్యక్తి, అతనికి విద్య అయితే ఉంది కానీ అతని వద్ద ధనము లేదు. ఆ వ్యక్తి ఈ మొదటి వ్యక్తిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనము ఉంటే, నేను అతని కంటే ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవాడిని” అని సంకల్పించుకుంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పుణ్యంలో వీరిద్దరూ సమానులవుతారు.
మూడో వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, అతని వద్ద కేవలం ధనం ఉన్నది. అతడు తన ధనంపై గర్వపడి, విశ్వాస మార్గాన్ని వదిలేసి, అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే, ఇష్టం లేని మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడు. అందువల్ల అతనికి పాపం కలుగుతుంది.
ఇక నాలుగో మనిషి, నాలుగో రకం వ్యక్తి, అతని వద్ద విద్య లేదు, ధనము లేదు. కానీ అతనేమంటాడు, మూడో రకమైన వారిని చూసి, “నా వద్ద ఒకవేళ ధనం ఉంటే నేను వారికంటే ఎక్కువ పాపంలో, వారికంటే ఎక్కువగా ఆనందంలో, వారికంటే ఎక్కువగా నేను ఈ ధనం ఖర్చు పెడుతూ ఉంటాను.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఇద్దరూ కూడా పాపంలో సమానము అని.
ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
బోధపడిన విషయాలు
మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:
(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.
(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.
(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.
ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.
అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.
అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.
ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.
అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41712
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]