అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు [వీడియో & టెక్స్ట్]

ధర్మపరమైన నిషేధాలు – 39
అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్నవారితో నీవు కూర్చోకు
https://youtu.be/HzdBTTa3fGc [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ఈ భాగంలో, అల్లాహ్ యొక్క ఆయతులను (వచనాలను) ఎగతాళి చేసే వ్యక్తులతో కూర్చోవడం చేయడం నిషేధించబడిన విషయం గురించి చర్చించబడింది. ఎవరైనా అలాంటి వారిని ఆపగల శక్తి, జ్ఞానం, మరియు సదుద్దేశంతో వారి మధ్య కూర్చుంటే తప్ప, కేవలం వారి ఎగతాళిని వింటూ వారితో ఉండటం కూడా పాపంలో భాగస్వామ్యం అవ్వడమేనని వక్త స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సూరతున్నసా (4వ అధ్యాయం)లోని 140వ ఆయతును పఠించి, దాని భావాన్ని వివరించారు. ఆ ఆయతు ప్రకారం, అల్లాహ్ ఆయతులను తిరస్కరించడం లేదా పరిహసించడం విన్నప్పుడు, ఆ సంభాషణను విడిచిపెట్టాలి, లేకపోతే వారు కూడా ఆ పాపులతో సమానం అవుతారు. వక్త ఈనాటి ముస్లింల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, సినిమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇలాంటి పాపభూయిష్టమైన విషయాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ, కనీసం ఖండించకుండా మౌనంగా ఉండటం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించారు. చెడును చేతితో, లేదా మాటతో ఆపాలని, కనీసం మనసులోనైనా దానిని ద్వేషించాలని చెప్పే హదీసును ఉటంకిస్తూ, విశ్వాసంలోని బలహీన స్థాయిని కూడా కోల్పోకూడదని ఉద్బోధించారు.

39వ విషయం: అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్న వారితో నీవు కూర్చోకు.

శ్రద్ధ వహించండి, కన్ఫ్యూజ్ కాకండి. 38వ విషయం ఏమి విన్నారు? అల్లాహ్, అతని ఆయతులు, ఆయన ప్రవక్త పట్ల ఎగతాళి చేయకూడదు. కానీ ఇక్కడ 39వ విషయం, ఎవరైతే ఇలా ఎగతాళి చేస్తూ ఉన్నారో, అలాంటి వారికి తోడుగా ఉండకు. ఆ ఎగతాళి చేస్తున్న సందర్భములో వారితో కలిసి కూర్చోకు. ఆ సందర్భములో వారితో కలిసి ఉండకు. ఒకవేళ, నీవు వారిని ఆపగలుగుతున్నావు, అతను మాట పూర్తి చేసే వరకు మధ్యలో ఆపేది ఉంటే మన మాటను శ్రద్ధ వహించడు అందుకొరకే, కొంచెం మాట పూర్తి చేసిన వెంటనే, అతన్ని బోధ చేస్తాను, అతనికి నేను నసీహత్ చేస్తాను, అతను చేసిన ఈ పాపం ఎగతాళి నుండి నేను అతన్ని ఆపుతాను, ఇలాంటి సదుద్దేశం ఉండి, ఆపే అంతటి శక్తి ఉండి, ఆపే అంతటి జ్ఞానం ఉండి, అక్కడ కూర్చుంటే పాపం లేదు. కానీ అలా కాకుండా, ఆపడం అయితే లేదు, కానీ వారితో కలిసి కూర్చోవడం, ఇది కూడా పాపంలో వస్తుంది, ఇది కూడా ఒక నిషేధం, మనం దీనిని వదులుకోవాలి.

ముందు దీనికి సంబంధించి సూరతున్నసా, సూర నెంబర్ నాలుగు, ఆయత్ నెంబర్ 140 వినండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన మరి చిన్నపాటి వివరణ కూడా మనం తెలుసుకుందాం.

[وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آَيَاتِ اللهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّى يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ إِنَّ اللهَ جَامِعُ المُنَافِقِينَ وَالكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا] {النساء:140}

అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి  ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).

అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఎంతటి హెచ్చరిక ఇందులో ఉంది ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆయతులు చదవడం లేదు. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు, అల్లాహ్ ఈ దివ్య గ్రంథము ఖురాన్ లో మీకు ఇంతకు ముందే ఆదేశం ఇచ్చి ఉన్నాడు దీనికి సంబంధించి. ఏంటి? అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా, తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే, అలా చేసే వారితో మీరు, వారు తమ ఆ సంభాషణ వదిలే వరకు వారితో కూర్చోకండి. ఫలా తఖ్’ఉదూ, గమనించండి, ఫలా తఖ్’ఉదూ, మీరు వారితో కూర్చోకండి. హత్తా యఖూదూ ఫీ హదీసిన్ గైరిహ్. వారు వేరే మాట ఎప్పటివరకైతే మాట్లాడారో మీరు వారితో, ఖురాన్ కు ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ పట్ల ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి జరిగినప్పుడు, వారితో పాటే అక్కడ కూర్చోవడం, ఇది మీకు తగని విషయం. అంతే కాదు, ఇక్కడ గమనించండి, ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. మీరు గనక నా ఈ ఆదేశాన్ని వినలేదంటే, మీరు కూడా వారిలో కలిసిపోయినవారే. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. అతన్ని ఆపడం లేదు. నీకు చెప్పే అధికారం లేదు, అయ్యో నేను ఎగతాళి చేస్తలేనండి అని. నీవు కూడా ఇతనితో సమానం అని నేను అనడం లేదు, అల్లాహ్ అంటున్నాడు. ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. నిశ్చయంగా మీరు కూడా వారితో సమానం.

అంతేనా? అల్లాహ్ ఇంకా హెచ్చరించాడు, గమనించండి. ఇన్నల్లాహ జామిఉల్ మునాఫిఖీన వల్ కాఫిరీన ఫీ జహన్నమ జమీఆ. అల్లాహ్ త’ఆలా వంచకులను మరియు అవిశ్వాసులను, కపట విశ్వాసులను, అవిశ్వాసులను కలిపి నరకంలో ఉంచుతాడు అని. వాస్తవానికి మనలో విశ్వాసం ఉంటే, వాస్తవానికి విశ్వాసం పట్ల కపటత్వం, వంచకపుతనం మనలో లేకుంటే, మనం ఆపాలి వారిని, లేదా అక్కడి నుండి వెళ్ళిపోవాలి.

సహీహ్ ముస్లిం యొక్క హదీస్ కూడా ఇక్కడ మీకు గుర్తొస్తుంది కదా? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్. మీలో ఎవరైతే ఒక చెడు పనిని చూస్తారో, ఫల్ యుగయ్యిర్హు బియదిహ్. తన శక్తి ఉండేది ఉంటే తన చెయ్యితో అతన్ని ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబిలిసానిహ్. చెయ్యితో ఆపే శక్తి లేకుంటే, నోటితో ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబికల్బిహ్. ఆ శక్తి లేకుంటే హృదయంలో దాన్ని చెడుగా భావించి అక్కడి నుండి దూరం ఉండాలి. వ దాలిక అద్’అఫుల్ ఈమాన్. ఇదే విశ్వాసం యొక్క చివరి మెట్టు. ఇది బలహీన స్థితి విశ్వాసం యొక్క. ఈ పని కూడా కనీసం చేయలేదు అంటే ఇక విశ్వాసం లేనట్టే భావం.

సోదర మహాశయులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ తో భయపడుతున్నామా నిజంగా? ఈ విషయంలో మనం నిజంగా అల్లాహ్ తో భయపడుతున్నామా? ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నాము. ఈ రోజుల్లో మన సమాజంలో, మన వాట్సాప్ గ్రూపులలో, మన సోషల్ మీడియాలో, ఎన్ని చెడులైతే చూస్తూ ఉన్నామో, ఆ చెడును ఖండించే అటువంటి శక్తి, ఆ చెడును ఖండించే అంతటి జ్ఞానం లేకపోతే, దానిని చూసుకుంటూ ఉండడం… అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్ అస్తగ్ ఫిరుల్లాహ్.

ముస్లిం యువకులు, ముస్లిం యువతులు, ఏ ఫిలింలు చూస్తూ ఉంటారో, ఏ పాటలు వింటూ ఉంటారో, ఏ సీరియల్ లు చూస్తూ ఉంటారో, ఏ కార్టూన్లు చూస్తూ ఉంటారో, ఏ గేమ్ లు ఆడుతూ ఉంటారో, ఏ వాట్సాప్ గ్రూపులలో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలోని అప్లికేషన్లలో ఫాలో అవుతున్నారో, షేర్ చేస్తున్నారో, వీరందరూ కూడా గమనించాలి, అల్లాహ్ కు ఇష్టమైన వాటిలో వారు పాల్గొన్నారంటే, అల్ హందులిల్లాహ్. అల్లాహ్ కు ఇష్టం లేని వాటిలో పాల్గొన్నారంటే, అక్కడ ఖురాన్ పట్ల, హదీసుల పట్ల, ప్రవక్త పట్ల మరియు అల్లాహ్ యొక్క ఆయతుల పట్ల ఎగతాళి, పరిహాసం జరుగుతూ ఉన్నది. వారితో పాటు నవ్వులో నవ్వు మీరు కలిసి ఉన్నారు, లేదా కనీసం వారిని ఖండించకుండా మౌనం వహించి ఉన్నారు, వారి యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి యొక్క ఫాలోవర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి సంఖ్య పెద్దగా కనబడే విధంగా ఉన్నారు. ఆలోచించండి, ఈ పాపంలో మనం కలిసిపోతలేమా? ఖురాన్, హదీసులను మనం ఈనాటి కాలంలో ఎక్కువ ప్రచారం చేయాలి, మంచిని మనం ఎక్కువగా ప్రజల వరకు చేరవేయాలి. అలా కాకుండా ఏ చెడులోనైతే మనం పాల్గొంటామో, దాని వల్ల మనం ఎంత పాపానికి గురి అవుతామో ఎప్పుడైనా గమనించారా? అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ధర్మపరమైన నిషేధాలు – 38 : ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[5:38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 38

38- పరిహాసమాడకు. ఖుర్ఆన్, ప్రవక్త, ధర్మం మరియు ధర్మ-విషయాలతో పరిహాసమాడకు, ఎగతాళి చేయకు, హీనపరచకు [1]. అది (వేరే దురుద్దేశం లేకుండా) కేవలం నవ్వు పుట్టించుటకైనా సరే. ధర్మవిద్యతో లేదా ధార్మిక విద్యార్థులతో పరిహాసమాడుట [2]. మంచిని ఆదేశించి, చెడును నివారించే వారితో పరిహాసమాడుట. గడ్డం, మిస్వాక్ మరియు తదితర ధర్మవిషయాలతో పరిహాసమాడుట అల్లాహ్ తో కుఫ్ర్ చేసినట్లగును.

అల్లాహ్ ఆదేశం:

[وَلَئِنْ سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ قُلْ أَبِاللهِ وَآَيَاتِهِ وَرَسُولِهِ كُنْتُمْ تَسْتَهْزِئُونَ ، لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُمْ بَعْدَ إِيمَانِكُمْ]. {التوبة 65، 66}.

మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని ఒకవేళ వారిని అడిగితే, మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము అని తక్షణం బదులు చెబుతారు. వారితో ఇలా అనుః మీ వేళాకోళం, అల్లాహ్ తోనా ఆయన ఆయతులతోనా, ఆయన ప్రవక్తతోనా? ఇక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వా-సానికి పాల్పడ్డారు[. (తౌబా 9: 65,66).


[1] పరిహాసమాడుతూ తిరస్కరించుట, విడనాడి తిరస్కరించుటకంటే మరీ చెడ్డది. ఉదాః నమాజు వదిలే వ్యక్తి, లేదా విగ్రహానికి సాష్టాంగ- పడే వ్యక్తి కేవలం తిరస్కారానికి గురవుతాడు. కాని పరిహసించే వ్యక్తి తిరస్కారంతో పాటు పరిహాసానికి గురవుతాడు.

[2] ధర్మవేత్తలతో, ధర్మంపై నడిచేవారితో మరియు ధర్మం వైపునకు పిలిచేవారితో పరిహాసమాడేవారు రెండు రకాల భ్రష్టత్వానికి గురి అవుతారు.

1- అతని ఉద్దేశ్యంలో నేరుగా ధర్మాన్ని, రుజువైన ప్రవక్త సంప్రదాయాల్ని; ఉదాః గడ్డం ఉంచడం, లుంగీ, లాగు చీలమండలానికి పైకి ధరించడం లాంటివి ఉంటే ఇది కుఫ్ర్ (సత్యతిరస్కారం) అవుతుంది. అంతే గాకుండా ఒక ముస్లిం సోదరుడ్ని హీనపరచడం అన్నది అతను (హీనపరిచేవాడు) చెడు అన్నదానికి నిదర్శనం.

2-  అతడు వారి ధార్మిక జీవన శైలిని గాకుండా వారిని, వారి కొన్ని చేష్టల్ని ఉద్దేశించి పరిహసిస్తే పాపాత్ముడవుతాడు కాని కాఫిర్ కాడు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

తాను విశ్వసించే మత ధర్మాన్ని పరిహసించిన మనిషి ధర్మభ్రష్ఠుడైపోతాడు. ఆ ధర్మం నుండి పూర్తిగా బహిష్కృతుడవుతాడు. విశ్వప్రభువు ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

వారితో అను: “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా? మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (అత్‌ తౌబా – 65, 66)

అల్లాహ్‌తో, ఆయన ప్రవక్తతో, ఆయన సూక్తులతో పరిహాసమాడటం అవిశ్వాసానికి (కుఫ్ర్కు) తార్కాణమని ఈ ఆయతుల ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి ఎవరు ఈ విషయాలలో ఏ ఒక్కదానినయినా పరిహసిస్తాడో అతను అన్నింటినీ పరిహసించిన వాడిగానే పరిగణించబడతాడు. అలనాడు (మదీనాలో) కపటుల విషయంలో జరిగింది కూడా ఇదే. వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను, ప్రవక్త సహచరులను ఎగతాళి చేశారు. అందుచేత పై ఆయతులు అవతరించాయి.

ధార్మిక చిహ్నాలలో ఏ ఒక్కదానినయినా పరిహసించేవాడు ధార్మిక చిహ్నాలన్నింటినీ తప్పనిసరిగా కించపరుస్తాడు. అలాగే అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) చిన్నచూపు చూసేవాడు, నిజ దైవాన్ని వదలి మృతులను వేడుకోవటాన్ని గౌరవ దృష్టితో చూస్తారు. వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలిచినపుడు, షిర్క్‌ నుండి వారించినపుడు ఎగతాళి చేస్తారు. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا

వారు నిన్ను చూచినప్పుడల్లా, నీతో వేళాకోళానికి దిగుతారు. “అల్లాహ్ ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా?! మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవుళ్ల నుండి తప్పించేవాడే” అని ఎద్దేవా చేస్తారు. (అల్‌ ఫుర్ఖాన్‌ : 41, 42)

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారిని షిర్క్‌ నుండి వారించినపుడు, వారు ఆయన్ని పరిహసించారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. దైవప్రవక్తలు తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించినప్పుడల్లా ముష్రిక్కులు వారిలో తప్పులెన్నే ప్రయత్నం చేశారు. ప్రవక్తలను అవివేకుల క్రింద జమకట్టారు. వారిని మార్గవిహీనులన్నారు. పిచ్చోళ్ళన్నారు. ఎందుకంటే వారి హృదయాలలో షిర్క్‌ (బహుదైవారాధన) పట్ల భక్తి భావం ఉండేది. అలాగే ముష్రిక్కులను పోలిన పనులు చేసే వారిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఏక దైవారాధన వైపు పిలిచే వారిని చూసినపుడు వారు ఓర్చుకోలేరు. వారి గురించి చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో కూడా షిర్క్‌ పట్ల (ప్రేమ గూడు కట్టుకుంది. ఈ నేపథ్యంలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ

“అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు.” (అల్‌ బఖర : 165)

కాబట్టి అల్లాహ్‌ పట్ల భక్తి కలగవలసిన విధంగా సృష్టిలో వేరే ఇతరుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు ఖచ్చితంగా ముష్రిక్కే. ఇంకా – కేవలం అల్లాహ్‌ కొరకు ప్రేమించటంలో – అల్లాహ్‌ ప్రేమతో పాటు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటంలో గల వ్యత్యాసాన్ని చూడటం అవసరం. (అల్లాహ్‌ కొరకు ప్రేమించటం వాంఛనీయం. అల్లాహ్‌ పట్ల గల ప్రేమ మాదిరిగా ఇతరులను ప్రేమించటం అవాంఛనీయం). సమాధులను విగ్రహంగా మార్చుకున్న వారిని చూడండి – వారు దేవుని ఏకత్వాన్ని (తౌహీద్‌ని) పరిహసిస్తారు. దైవారాధనను గేలి చేస్తారు. అల్లాహ్‌ను వదలి తాము సిఫారసుదారులుగా ఆశ్రయించిన వారి పట్ల మాత్రం భక్తీ ప్రపత్తులు కలిగి ఉంటారు. వారిలోని ఒక వ్యక్తి అల్లాహ్‌ పేరు మీద అబద్ధ ప్రమాణం చేస్తాడు గాని తాను నమ్మినడుచుకునే ముర్షిద్‌ పేరు మీద మాత్రం అబద్ధ ప్రమాణం చేయడానికి ఎంతకీ సాహసించడు. ప్రజాబాహుళ్యంలో మీరు అనేకమందిని చూస్తుంటారు. వారి దృష్టిలో తమ ముర్షిద్‌కు విన్నపాలు చేసుకోవటం – అతని సమాధి వద్ద చేసినా, సమాధికి దూర స్థలంలో చేసినా – మస్జిద్ లో తెల్లవారుజామున అల్లాహ్‌కు విజ్ఞప్తి చేసుకోవటం కన్నా ఎక్కువ లాభదాయకమయింది అని భావిస్తారు. తమ ముర్షిద్‌ బాటను వదలి ఏకదైవారాధనా మార్గాన్ని అవలంబించిన వారిని వారు వేళాకోళం చేస్తారు. అలాంటి వారిలో చాలామంది మస్జిదులకు రారు గాని దర్గాలకు మాత్రం వెళతారు. దర్గాలను దేదీప్యమానంగా ముస్తాబుచేస్తారు. ఇదంతా ఏమిటి? అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన సూక్తులను పరిహసించి షిర్క్ కు స్వాగతం పలకటం కాదా!? (మజ్మూఅ అల్‌ ఫతావా : 15/48, 49)

నేటి సమాధి పూజారుల్లో ఈ ధోరణి అత్యధికంగా ఉంది.

ఎగతాళి రెండు రకాలుగా ఉంటుంది

1. బాహాటంగా ఎగతాళి చేయటం : అంటే ఇంతకు ముందు ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో చెప్పబడినట్లుగా అడ్డూ ఆపూ లేకుండా సత్యాన్ని సత్య ప్రేమికుల్ని ఎగతాళి చేయటం. ఉదాహరణకు : మీ మతధర్మం ఐదవ మతం అని కొందరంటే, మీది బూటకపు మతం అని మరికొందరంటారు. అలాగే మంచిని పెంపొందించే వారిని, చెడుల నుండి ఆపేవారిని చూసి, “అబ్బో! బయలుదేరారు పేద్ద ధర్మోద్దారకులు” అంటూ వెటకారంగా ప్రేలుతారు. అంతకన్నా దారుణమైన వాక్యాలు – వ్రాయటానికి కూడా వీలులేని మాటలు చెప్పటం జరుగుతుంది.

(2) ద్వంద్వార్థాలతో ఎగతాళి చేయటం : ఈ ఎగతాళి కూడా తీరంలేని సముద్రం వంటిది. కన్నుగీటి సైగలు చేయటం, నాలుక వెళ్ళబెట్టడం, మూతి ముడుపులతో వెకిలి సైగలు చేయటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు, హదీసులు పఠిస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు చేతులతో సైగలు చేయటం మొదలగునవి. (మజ్మూఅతు త్తౌహీద్‌ – నజ్‌దియ : పేజీ : 409)

మరి కొంతమంది చెప్పే కొన్ని మాటలు కూడా ఈ ‘పరిహాస పరిధిలోకే వస్తాయి. ఉదాహరణకు : “ఇస్లాం 21వ శతాబ్దికి సరిపోదు. ఇది మధ్య యుగాలకు తగినది.” “ఇస్లాం ఛాందసుల మతం”, “శిక్షల విషయంలో ఇస్లాం మరీ అమానుషంగా వ్యవహరిస్తుంది”, “విడాకులను, బహుభార్యత్వాన్ని అనుమతించి ఇస్లాం మహిళా హక్కులను హరించింది”, “ఇస్లాం శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వటం కన్నా స్వయం కల్పిత చట్టాల కనుగుణంగా తీర్పు ఇవ్వటం మిన్న” లాంటి మాటలను కొందరు పలుకుతుంటారు. అలాగే ఏకేశ్వరోపాసనా సందేశం ఇచ్చేవారిని గురించి మాట్లాడుతూ, “వారు తీవ్రవాదులు. వారు ముస్లింలోని సంఘీభావాన్ని చిందరవందర చేస్తున్నారు” అంటారు. లేదంటే “వారు వహాబీలు” అంటారు. ఈ విధంగా వారు తమ మాటల తూటాలతో ఏక దైవారాధకులను, సత్యధర్మ ప్రేమికులను అనుదినం ఆటపట్టిస్తూ ఉంటారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నతులలో ఏదైనా ఒక సున్నత్‌ను ఖచ్చితంగా అనుసరించే వారిని పట్టుకుని ఎగతాళి చేయటం కూడా ఈ కోవకు చెందినదే.

ఉదాహరణకు – “గడ్డం పెంచినంత మాత్రాన ధర్మావలంబనలో పెరుగుదల రాదు” అని అనటం. అలాంటివే మరెన్నో తుచ్చమయిన పలుకులతో మనసులను గాయపరచటం.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది