ధర్మాన్ని పరిహసించటం, ధార్మిక చిహ్నాలను కించపరచటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

తాను విశ్వసించే మత ధర్మాన్ని పరిహసించిన మనిషి ధర్మభ్రష్ఠుడైపోతాడు. ఆ ధర్మం నుండి పూర్తిగా బహిష్కృతుడవుతాడు. విశ్వప్రభువు ఇలా సెలవిచ్చాడు :

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

వారితో అను: “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తతో పరిహాసమాడుతున్నారా? మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (అత్‌ తౌబా – 65, 66)

అల్లాహ్‌తో, ఆయన ప్రవక్తతో, ఆయన సూక్తులతో పరిహాసమాడటం అవిశ్వాసానికి (కుఫ్ర్కు) తార్కాణమని ఈ ఆయతుల ద్వారా రూఢీ అవుతోంది. కాబట్టి ఎవరు ఈ విషయాలలో ఏ ఒక్కదానినయినా పరిహసిస్తాడో అతను అన్నింటినీ పరిహసించిన వాడిగానే పరిగణించబడతాడు. అలనాడు (మదీనాలో) కపటుల విషయంలో జరిగింది కూడా ఇదే. వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను, ప్రవక్త సహచరులను ఎగతాళి చేశారు. అందుచేత పై ఆయతులు అవతరించాయి.

ధార్మిక చిహ్నాలలో ఏ ఒక్కదానినయినా పరిహసించేవాడు ధార్మిక చిహ్నాలన్నింటినీ తప్పనిసరిగా కించపరుస్తాడు. అలాగే అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) చిన్నచూపు చూసేవాడు, నిజ దైవాన్ని వదలి మృతులను వేడుకోవటాన్ని గౌరవ దృష్టితో చూస్తారు. వారిని ఏకేశ్వరోపాసన వైపు పిలిచినపుడు, షిర్క్‌ నుండి వారించినపుడు ఎగతాళి చేస్తారు. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

وَإِذَا رَأَوْكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي بَعَثَ اللَّهُ رَسُولًا إِن كَادَ لَيُضِلُّنَا عَنْ آلِهَتِنَا لَوْلَا أَن صَبَرْنَا عَلَيْهَا

వారు నిన్ను చూచినప్పుడల్లా, నీతో వేళాకోళానికి దిగుతారు. “అల్లాహ్ ప్రవక్తగా చేసి పంపినది ఈయన గారినేనా?! మేము మా దేవుళ్లపై గట్టిగా నిలబడి ఉండకపోతే, ఇతను మమ్మల్ని మా దేవుళ్ల నుండి తప్పించేవాడే” అని ఎద్దేవా చేస్తారు. (అల్‌ ఫుర్ఖాన్‌ : 41, 42)

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారిని షిర్క్‌ నుండి వారించినపుడు, వారు ఆయన్ని పరిహసించారు. ఇది తరతరాలుగా జరుగుతూ వస్తున్నదే. దైవప్రవక్తలు తమ జాతి ప్రజలను ఏకేశ్వరోపాసన వైపు ఆహ్వానించినప్పుడల్లా ముష్రిక్కులు వారిలో తప్పులెన్నే ప్రయత్నం చేశారు. ప్రవక్తలను అవివేకుల క్రింద జమకట్టారు. వారిని మార్గవిహీనులన్నారు. పిచ్చోళ్ళన్నారు. ఎందుకంటే వారి హృదయాలలో షిర్క్‌ (బహుదైవారాధన) పట్ల భక్తి భావం ఉండేది. అలాగే ముష్రిక్కులను పోలిన పనులు చేసే వారిలో కూడా ఇదే ఆలోచన ఉంటుంది. ఏక దైవారాధన వైపు పిలిచే వారిని చూసినపుడు వారు ఓర్చుకోలేరు. వారి గురించి చులకనగా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలలో కూడా షిర్క్‌ పట్ల (ప్రేమ గూడు కట్టుకుంది. ఈ నేపథ్యంలో అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ

“అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరున్నారు.” (అల్‌ బఖర : 165)

కాబట్టి అల్లాహ్‌ పట్ల భక్తి కలగవలసిన విధంగా సృష్టిలో వేరే ఇతరుల పట్ల భక్తి కలిగి ఉండేవాడు ఖచ్చితంగా ముష్రిక్కే. ఇంకా – కేవలం అల్లాహ్‌ కొరకు ప్రేమించటంలో – అల్లాహ్‌ ప్రేమతో పాటు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటంలో గల వ్యత్యాసాన్ని చూడటం అవసరం. (అల్లాహ్‌ కొరకు ప్రేమించటం వాంఛనీయం. అల్లాహ్‌ పట్ల గల ప్రేమ మాదిరిగా ఇతరులను ప్రేమించటం అవాంఛనీయం). సమాధులను విగ్రహంగా మార్చుకున్న వారిని చూడండి – వారు దేవుని ఏకత్వాన్ని (తౌహీద్‌ని) పరిహసిస్తారు. దైవారాధనను గేలి చేస్తారు. అల్లాహ్‌ను వదలి తాము సిఫారసుదారులుగా ఆశ్రయించిన వారి పట్ల మాత్రం భక్తీ ప్రపత్తులు కలిగి ఉంటారు. వారిలోని ఒక వ్యక్తి అల్లాహ్‌ పేరు మీద అబద్ధ ప్రమాణం చేస్తాడు గాని తాను నమ్మినడుచుకునే ముర్షిద్‌ పేరు మీద మాత్రం అబద్ధ ప్రమాణం చేయడానికి ఎంతకీ సాహసించడు. ప్రజాబాహుళ్యంలో మీరు అనేకమందిని చూస్తుంటారు. వారి దృష్టిలో తమ ముర్షిద్‌కు విన్నపాలు చేసుకోవటం – అతని సమాధి వద్ద చేసినా, సమాధికి దూర స్థలంలో చేసినా – మస్జిద్ లో తెల్లవారుజామున అల్లాహ్‌కు విజ్ఞప్తి చేసుకోవటం కన్నా ఎక్కువ లాభదాయకమయింది అని భావిస్తారు. తమ ముర్షిద్‌ బాటను వదలి ఏకదైవారాధనా మార్గాన్ని అవలంబించిన వారిని వారు వేళాకోళం చేస్తారు. అలాంటి వారిలో చాలామంది మస్జిదులకు రారు గాని దర్గాలకు మాత్రం వెళతారు. దర్గాలను దేదీప్యమానంగా ముస్తాబుచేస్తారు. ఇదంతా ఏమిటి? అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను, ఆయన సూక్తులను పరిహసించి షిర్క్ కు స్వాగతం పలకటం కాదా!? (మజ్మూఅ అల్‌ ఫతావా : 15/48, 49)

నేటి సమాధి పూజారుల్లో ఈ ధోరణి అత్యధికంగా ఉంది.

ఎగతాళి రెండు రకాలుగా ఉంటుంది

1. బాహాటంగా ఎగతాళి చేయటం : అంటే ఇంతకు ముందు ఖుర్‌ఆన్‌ సూక్తుల్లో చెప్పబడినట్లుగా అడ్డూ ఆపూ లేకుండా సత్యాన్ని సత్య ప్రేమికుల్ని ఎగతాళి చేయటం. ఉదాహరణకు : మీ మతధర్మం ఐదవ మతం అని కొందరంటే, మీది బూటకపు మతం అని మరికొందరంటారు. అలాగే మంచిని పెంపొందించే వారిని, చెడుల నుండి ఆపేవారిని చూసి, “అబ్బో! బయలుదేరారు పేద్ద ధర్మోద్దారకులు” అంటూ వెటకారంగా ప్రేలుతారు. అంతకన్నా దారుణమైన వాక్యాలు – వ్రాయటానికి కూడా వీలులేని మాటలు చెప్పటం జరుగుతుంది.

(2) ద్వంద్వార్థాలతో ఎగతాళి చేయటం : ఈ ఎగతాళి కూడా తీరంలేని సముద్రం వంటిది. కన్నుగీటి సైగలు చేయటం, నాలుక వెళ్ళబెట్టడం, మూతి ముడుపులతో వెకిలి సైగలు చేయటం, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తున్నప్పుడు, హదీసులు పఠిస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు చేతులతో సైగలు చేయటం మొదలగునవి. (మజ్మూఅతు త్తౌహీద్‌ – నజ్‌దియ : పేజీ : 409)

మరి కొంతమంది చెప్పే కొన్ని మాటలు కూడా ఈ ‘పరిహాస పరిధిలోకే వస్తాయి. ఉదాహరణకు : “ఇస్లాం 21వ శతాబ్దికి సరిపోదు. ఇది మధ్య యుగాలకు తగినది.” “ఇస్లాం ఛాందసుల మతం”, “శిక్షల విషయంలో ఇస్లాం మరీ అమానుషంగా వ్యవహరిస్తుంది”, “విడాకులను, బహుభార్యత్వాన్ని అనుమతించి ఇస్లాం మహిళా హక్కులను హరించింది”, “ఇస్లాం శాసనాల ప్రకారం తీర్పు ఇవ్వటం కన్నా స్వయం కల్పిత చట్టాల కనుగుణంగా తీర్పు ఇవ్వటం మిన్న” లాంటి మాటలను కొందరు పలుకుతుంటారు. అలాగే ఏకేశ్వరోపాసనా సందేశం ఇచ్చేవారిని గురించి మాట్లాడుతూ, “వారు తీవ్రవాదులు. వారు ముస్లింలోని సంఘీభావాన్ని చిందరవందర చేస్తున్నారు” అంటారు. లేదంటే “వారు వహాబీలు” అంటారు. ఈ విధంగా వారు తమ మాటల తూటాలతో ఏక దైవారాధకులను, సత్యధర్మ ప్రేమికులను అనుదినం ఆటపట్టిస్తూ ఉంటారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి సున్నతులలో ఏదైనా ఒక సున్నత్‌ను ఖచ్చితంగా అనుసరించే వారిని పట్టుకుని ఎగతాళి చేయటం కూడా ఈ కోవకు చెందినదే.

ఉదాహరణకు – “గడ్డం పెంచినంత మాత్రాన ధర్మావలంబనలో పెరుగుదల రాదు” అని అనటం. అలాంటివే మరెన్నో తుచ్చమయిన పలుకులతో మనసులను గాయపరచటం.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది

%d bloggers like this: