అంశము: జుమా రోజు ప్రత్యేకతలు మరియు గొప్పతనం
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండండి మరియు తెలుసుకోండి అల్లాహ్ ఈ సృష్టి ప్రదాత ఆయన ఎవరికి కోరుతాడో ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు వారు మనుషులైనా లేక ప్రదేశమైన లేక ఏదైనా సందర్భం అయినా లేక ఏదైనా ఆరాధన అయిన అది ఆయన వివేకంపై ఆధారపడి ఉంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నారు:
وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
(నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.) ( అల్ ఖసస్ 28:68)
అల్లాహ్ ప్రజలలో నుండి ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మరియు ఆ ప్రవక్తలలో ఐదుగురు ఉన్నతమైనటువంటి వారు ఇబ్రహీం, నూహ్, మూసా, ఈసా, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). మరియు ఈ ఐదుగురిలో కూడా ఇద్దరినీ తన స్నేహితులుగా చేసుకున్నాడు. వారు ఇబ్రహీం మరియు ముహమ్మద్. మరియు ఆ ఇద్దరిలో నుండి కూడా అల్లాహ్ మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఎన్నుకున్నాడు కనుక ఈయన ప్రవక్తల అందరిలో గొప్పవాడు.
అదేవిధంగా ప్రదేశాలలో ఘనత కలిగినటువంటిది మక్కా. అల్లాహ్ సమస్త భూమండలం నుండి మక్కాను పవిత్ర స్థలంగా ఎన్నుకున్నాడు. దాని తర్వాత మదీనా. ఈ రెండు మసీదులలో చదువుబడే నమాజుకు ఎన్నో రేట్ల పుణ్యఫలం లభిస్తుంది.
అదేవిధంగా సమయాలలో అల్లాహ్ జుమా రోజుని ఎన్నుకున్నాడు. ఈ జుమా రోజులన్నింటికీ సర్దార్. అల్లాహ్ ఈ జుమాకు ఎన్నో ప్రాధాన్యతలను ప్రసాదించాడు. కొన్ని కారణాల రీత్యా ఇతర దినాల కంటే జుమాకు ఎక్కువ ప్రాధాన్యత వొసగబడింది, వాటిలో కొన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది.
1. ఆ రోజున పెద్ద పెద్ద సంఘటనలు సంభవించాయి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “మీ రోజులలో అతి ఉన్నతమైనటువంటి రోజు జుమా రోజు, ఆరోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున ఆయన మరణించారు మరియు అదే రోజున శంఖం పూరించడం జరుగుతుంది. మరియు అదే రోజున మైకం సంభవిస్తుంది”.(అబూ దావూద్)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారు ఇలా ప్రవచించారు: “సూర్యుడు ఉదయించే దినాల్లో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు, ఆ రోజున ఆదం అలైహి స్సలాం పుట్టించబడ్డారు మరియు అదే రోజున స్వర్గంలోనికి ప్రవేశించబడ్డారు మరియు అదే రోజున అక్కడి నుండి తొలగించబడ్డారు మరియు ప్రళయం కూడా జుమా రోజునే సంభవిస్తుంది”.(ముస్లిం)
2. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఇది ప్రజలందరిని సమావేశపరిచే రోజు. అల్లాహ్ తఆల ప్రతి ఉమ్మత్ కొరకు వారంలో ఒక రోజుని ఆరాధన కొరకు నియమించాడు. ప్రజలు ఆరోజున ఆరాధన కొరకు తమను సిద్ధం చేసుకునేవారు. మరియు సృష్టి ప్రారంభం మరియు ముగింపు శిక్ష లేక ప్రతిఫలం గురించి తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇలా అతిపెద్ద సమావేశం అల్లాహ్ ముందు హాజరు అవుతుంది, కాబట్టి వారి యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను పూర్తి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు శుక్రవారం.
కావున అల్లాహ్ ఈ ఉమ్మత్ యొక్క గొప్పదనం దృష్ట్యా ఆరాధన మరియు విధేయత కొరకు మరియు మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం కొరకు ఈ ప్రపంచక జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకొనుట కొరకు మరియు ఈ ఆకాశం మరియు భూమి ఒక రోజు అంతమైపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించడం కొరకు మరియు ప్రతి వస్తువు తిరిగి ఆ సృష్టికర్త వైపు మరలి వెళ్ళవలసింది అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు అల్లాహ్ జుమా రోజును చట్టబద్ధం చేశాడు.
మరియు అదే విధంగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు కూడా ఈ జుమా రోజున ఫజర్ నమాజులో (అలీఫ్ లామ్ మీమ్ సజ్దహ్) మరియు (సూరయే ఇన్సాన్) పారాయణం చేసేవారు ఎందుకంటే ఈ రెండు సూరాలలో సృష్టి ప్రారంభం మరియు అంతం గురించి, ప్రళయ దినం రోజున సమావేశం అవడం గురించి, సమాధుల నుండి లేవడం గురించి, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించబడింది.
3. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే; ఈ జుమా వారంలో ఒకసారి వచ్చేటువంటి పండుగ. హదీసులో ఈ విధంగా ఉంది. ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు: “నిశ్చయంగా ఇది ఒక పండుగ. అల్లాహ్ విశ్వాసుల కొరకు శుక్రవారం పండుగ దినంగా చేశాడు. కావున ఎవరైతే ఈ జుమాకు రావాలనుకుంటారో వారు తప్పక గుసుల్ చేసి మరియు సుగంధ పరిమళాలను పూసుకొని రావాలి. మరియు ఇలా అన్నారు మీరు మిస్వాక్ ను తప్పని సరి చేసుకోండి”. (ఇబ్నె మాజా)
4. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ అందరికంటే ఉత్తమ సమాజానికి ఈ జుమా యొక్క ఘనతను ప్రసాదించాడు. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ఉమ్మత్. వేరే ఇతర ఉమ్మతులకు దీనిని ప్రసాదించలేదు. అబూ హురైరా మరియు హుజైఫా వారి ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియచేశారు: “మనకంటే ముందు గతించిన వారిని అల్లాహ్ ఈ శుక్రవారం నాడు నుంచి తప్పించాడు, యూదుల కొరకు శనివారాన్ని మరియు క్రైస్తవుల కొరకు ఆదివారాన్ని ఇచ్చాడు మరియు అల్లాహ్ మన కొరకు ఈ ఘనత కలిగిన శుక్రవారాన్ని ప్రసాదించాడు”. (ముస్లిం)
5. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం అన్ని నమాజుల కంటే ఉత్తమమైనది. ఇబ్నే ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త గారు ఇలా ప్రవచించారు: “అల్లాహ్ వద్ద నమాజులన్నింటిలో కెల్లా ఘనత కలిగినటువంటిది జుమా రోజున ఫజర్ నమాజ్ జమాతుతో ఆచరించడం”. (సహీహుల్ జామె)
6. జుమా యొక్క మరో ప్రత్యేకత; జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులు (సూర సజ్దా) మరియు రెండవ రకాతులు (సూర ఇన్సాన్) పారాయణం చేయడం. అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులో “అలీఫ్ లామ్ మీమ్ తన్జీల్” మరియు రెండవ రకాతులు సుర ఇన్సాన్ పారాయణం చేసేవారు (బుఖారి, ముస్లిం)
షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఈ విధంగా తెలియజేశారు; ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు జుమా యొక్క ఫజర్ నమాజులో ఈ రెండు సూరాల పారాయణం ఎందుకు చేసేవారు అంటే ఆ రోజున ఏదైతే జరిగిందో మరియు జరగబోతుందో దాని సమాచారం అందులో ఉంది వాటిలో ఆదం అలైహిస్సలాం పుట్టుక పుట్టుక గురించి అంతిమ దినం గురించి మరణాంతర దినం గురించి ఇవన్నీ శుక్రవారం రోజునే సంభవించాయి మరియు సంభవిస్తాయి. కాబట్టి ఈ రెండు సూరాల ద్వారా ఉమ్మత్ వీటిని గుర్తు చేయడం జరుగుతుంది.
7. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున ప్రత్యేకంగా సూరె కహఫ్ పారాయణం జరుగుతుంది. అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియచేసారు: “ఏ వ్యక్తి అయితే జుమా రోజున సుర కహఫ్ పారాయణం చేస్తాడు అతని కొరకు రెండు జుమాల మధ్య (నూర్) ప్రసాదించబడుతుంది” (హాకిం)
8. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; జుమా రోజున ఒక ప్రత్యేకమైన ఘడియ ఉంది, అందులో ఎవరైనా అల్లాహ్ తో దువా వేడుకుంటే అల్లాహ్ దాన్ని తప్పక స్వీకరిస్తాడు. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: “ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ను ఏదయినా అడిగితే అల్లాహ్హ్ తప్పకుండా ఇస్తాడు.” ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేత్తో సంజ్ఞ చేసి చూపించారు”.(బుఖారి ముస్లిం)
9. జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే; ఎవరైనా జుమా రోజున రాత్రి లేక పగలు మరణిస్తారో అల్లాహ్ తఆల వారిని సమాధి విపత్తు నుండి రక్షిస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ముస్లింలలో నుండి ఎవరైనా జుమా రోజు రాత్రి లేక పగలు మరణిస్తే అల్లాహ్ వారిని సమాధి విపత్తు నుంచి రక్షిస్తాడు”. (తిర్మిజి)
10. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అందులో జుమా నమాజు జరుగుతుంది. అది అత్యంత ఘనత కలిగినటువంటి నమాజు అల్లాహ్ తఆల ఖురాన్ లో ప్రత్యేకంగా ఈ నమాజ్ కు పిలవడం గురించి ప్రస్తావన చేశాడు అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.) (అల్ జుమా:9)
11. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున చేయబడేటువంటి దానధర్మాల యొక్క పుణ్యఫలం రెట్టింపు చేయబడుతుంది అబ్దుల్ రజాక్ తమ పుస్తకం ముసన్నఫ్ లో కఆబ్ (రదియల్లాహు అన్హు) గారి ద్వారా ఉల్లేఖించారు ఆయన ఇలా అంటున్నారు, జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఉత్తమం
ఇబ్నె ఖయ్యిం (రహిమహుల్లాహ్) తెలియపరుస్తున్నారు; “జుమా రోజున చేసేటువంటి దానధర్మాలు వేరే ఇతర దినాలలో చేసేటువంటి దానధర్మాల కంటే ఎంతో ఉన్నతమైనవి, ఎందుకంటే వారంలోని దినాలన్నింటిలో కెల్లా జుమా రోజు దానం చేయడం యొక్క ఉపమానం వేరే ఇతర నెలల్లో దానధర్మాలు చేయడం కన్నా రంజాన్ మాసంలో దానధర్మాలు చేయడం లాంటిది“
నేను షేఖుల్ ఇస్లాం ఇమామ్ ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ను గమనించాను, ఆయన జుమా రోజున నమాజ్ కొరకు ఇంటి వద్ద నుండి బయలుదేరేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి రొట్టెలను తీసుకొని వెళ్లేవారు మరియు దారి మధ్యలో వాటిని గుప్త దానం చేసేవారు.
12. జుమా రోజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే; ఆ రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిపై అతి ఎక్కువగా దరూద్ పంపడం అభిలాషనీయం. ఎందుకంటే ఆ రోజున పంపబడేటువంటి దరూద్ యొక్క ఘనత మరే ఇతర ఆచరణకు లేదు. అది ఎందుకంటే ఈ ఉమ్మత్ సమాజానికి ఇహపరలోకాలలో ఏవైతే మేళ్ళు మరియు లాభాలు చేకూరాయో, అవి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారానే లభించాయి, కనుక ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన హక్కును నెరవేర్చాలి మరియు జుమా యొక్క రాత్రిలో మరియు పగటిపూట అతిగా దరూద్ పటిస్తూ ఉండాలి, మరియు అందులో ఉన్నటువంటి అర్ధాన్ని భావాన్ని తెలుసుకోవాలి.
ఇవి జుమా కు సంభందించినటువంటి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే జుమా కు అల్లాహ్ వద్ద మరియు విశ్వాసుల వద్ద గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుంది.
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరినీ క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీ పై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి మరియు దైవదూతలకు కూడా ఇదే ఆజ్ఞాపించాడు అల్లాహ్ ఇలా అన్నాడు:
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.) (అల్ అహ్ జాబ్ 33:56)
ఓ అల్లాహ్ నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు,తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు మరియు ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమానబరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.
سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

You must be logged in to post a comment.