అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర – ఖురాన్ కథామాలిక

అయ్యూబ్ (అలైహిస్సలాం) జీవితచరిత్ర
https://youtu.be/t27mDKl4w3E
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

 وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِن ضُرٍّ

మరి అయ్యూబు (స్థితిని గురించి కూడా ఓసారి మననం చేసుకోండి). అతను “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించే వాడవు” అని తన ప్రభువును మొరపెట్టుకున్నప్పుడు, మేము అతని ప్రార్థనను ఆలకించి, ఆమోదించాము. అతని బాధను దూరం చేశాము. (ఖుర్ ఆన్  21: 83, 84)

కొందరు  దైవదూతలు అల్లాహ్ సృష్టి లోని కొన్ని ప్రాణుల గురించి మాట్లాడు కోసాగారు. విధేయత చూపి అల్లాహ్ ప్రసన్నతను పొందిన వారి గురించి వారు చర్చించుకోసాగారు. అలాగే అహంభావంతో విర్రవీగి అల్లాహ్ ఆగ్రహాన్ని కొని తెచ్చుకున్న వారి గురించి సంభాషిస్తుండగా ఒక దైవదూత, “ప్రస్తుతం భూమిపై ఉన్న వారిలో అత్యుత్తముడు అయ్యూబ్. ఆయన ఉన్నత వ్యక్తిత్వం కలిగినవాడు. గొప్ప సహనశీలి. ఎల్లప్పుడూ అపార కరుణా మయుడైన విశ్వప్రభువును స్మరిస్తూ ఉంటాడు. అల్లాహ్ ను ఆరాధించే వారికి ఆయన గొప్ప ఆదర్శం. అందుకు ప్రతిఫలంగా అల్లాహ్ ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అపార సంపదలు ఇచ్చాడు. అయ్యూబ్ ఎన్నడూ అహంభావానికి పాల్పడలేదు. స్వార్థం ఆయనలో లేనేలేదు. ఆయన కుటుంబం, ఆయన సేవకులు, అవసరార్థులు, బీదలు అందరూ ఆయన సంపదలో భాగం పొందుతున్నారు. ఆయన బీదలకు అన్నం పెడతారు. వారికి దుస్తులు ఇస్తారు. బానిసలకు స్వేచ్ఛ ప్రసాదించడం కోసం వారిని కొంటారు. తన నుంచి దానధర్మాలు పొందేవారు తనకు ఉపకారం చేస్తున్నట్లుగా ఆయన వ్యవహరిస్తారు. ఆయన చాలా ఉదార స్వభావి, చాలా మంచి వాడు” అంటూ ప్రశంసించారు.