[30 నిముషాలు] విశ్వాస పాఠాలు – 5 – ఇస్లాం ఘనత -1 (హదీస్ #8) : ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
8- ఇబ్ను షిమాస అల్ మహ్రీ ఉల్లేఖించారు: మేము అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు మరణ సమీపాన అతని వద్ద కూర్చొని ఉండగా, అతను చాలా సేపు ఏడ్చి తన ముఖాన్ని గోడ వైపు త్రిప్పుకున్నాడు. అప్పుడే అతని కుమారుడు నాన్నా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఫలానా, ఫలానా శుభవార్తలు ఇవ్వలేదా? అని తృప్తినిచ్చారు. ఇది విని అతను తన ముఖాన్ని (మావైపు) త్రిప్పి ఇలా చెప్పారుః “లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్” సాక్ష్యాన్ని అన్నిటి కంటే అతిఉత్తమముగా భావించేవారము. విషయమేమిటంటే, నా జీవితంలో మూడు దశలు గడిచాయి. ప్రవక్తకంటే ఎక్కువ ద్వేషం మరెవ్వరితో లేని రోజులు గడిచాయి. అప్పట్లో నాకు మరీ ఇష్టమైన కార్యం ఏదైనా ఉంటే ఆయన్ను వశపరుచుకొని హతమార్చాలన్నదే. కాని ఒకవేళ నేను ఆ స్థితిలో చనిపోయి ఉంటే నరకవాసుల్లో చేరేవాడ్ని. కాని అల్లాహ్ కు దయ కలిగింది. అల్లాహ్ ఇస్లాం కొరకు నా హృదయాన్ని తెరిచాడు. నేను ప్రవక్త వద్దకు వచ్చి, ప్రవక్తా! మీ కుడి చేతిని చాపండి. నేను ఇస్లాం స్వీకరిస్తూ శపథం చేస్తాను అని అన్నాను. ప్రవక్త తమ చెయ్యి చాపారు. కాని నేను వెంటనే నా చేతిని వెనక్కి తీసుకున్నాను. “నీకేమయింది, అమ్ర్!” అని ప్రవక్త ఆశ్చర్యంతో అడిగారు. నేను ఒక షరతు పెట్టదలుచుకున్నాను అని చెప్పాను. “నీ షరతు ఏమిటి?” అని ప్రవక్త అడిగారు. నా పాపాలన్నీ మన్నింపబడాలని నేను చెప్పాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తృప్తి పరిచారుః “ఏమీటి, నీకు తెలియదా? ఇస్లాం (స్వీకరణ) గత పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. హిజ్రత్ (ధర్మ రక్షణకై వలసపోవుట) పూర్వ పాపాలన్నిటిని తుడిచి పెడుతుంది. మరియు హజ్ కూడా పూర్వ తప్పిదాలను తుడిచి పెడుతుంది”. (ఆ పిదప నేను ఇస్లాం స్వీకరించాను).
ఆ నాటి నుండి నాకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ప్రియమైనవారు, మరియు నా దృష్టిలో ఆయనకంటే గొప్పవారు మరెవ్వరూ లేరు. వారి ఔన్నత్యపు గాంభీర్యం వల్ల నేను వారిని నా కళ్ళారా చూడగలిగేవాణ్ణి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రూపు రేఖల్ని వర్ణించమని ఎవరైనా నన్ను అడిగితే నేను వర్ణించలేను. ఎందుకనగ నేను ఎన్నడూ వారిని నా కళ్ళారా చూడనేలేదు. ఇదే స్థితిలో గనక నేను చనిపోతే నిశ్చయంగా స్వర్గవాసుల్లో ఒకడిని అని ఆశించేవాడిని.
ఆ తర్వాత నాపై (ప్రభుత్వపరంగా) ఎన్నో బాధ్యతలు మోపబడ్డాయి. వాటి గురించి (నేను ప్రశ్నింపబడినప్పుడు) నా పరిస్థితి ఏమవుతుందో తెలియదు?
నేను చనిపోయిన తర్వాత నా జనాజ వెంట రోదించే, కేకలు పెట్టే స్త్రీలుగాని, అగ్నిగాని రాకూడదు. నన్ను ఖననం చేస్తున్నప్పుడు నా సమాధిపై కొద్ది కొద్దిగా మట్టి పోయండి. ఒంటెను కోసి దాని మాంసం పంచిపెట్టినంత సేపు మీరు నా సమాధి వద్దనే నిలిచి ఉండండి. నేను ధైర్యం, తృప్తి పొందుతాను. నా ప్రభువు పంపే దూతలకు నేనేమి సమాధానం చెబుతానో చూస్తాను. (ముస్లిం 121).
ఈ హదీసులోః
ఇస్లాం స్వీకరణ గత పాపాల విమోచనానికి మంచి సబబు. ఎవరు ఇస్లాంపై స్థిరంగా ఉంటాడో అతను పూర్వ పాపాల గురించి పట్టుబడడు. అలాగే హిజ్రత్ మరియు హజ్ కూడా పూర్వ పాపాల మన్నింపులకు కారణమవుతాయి.
గమనికః ఇస్లాం స్వీకరణ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల ప్రక్షాళన జరుగు తుంది. కాని హిజ్రత్, మరియు హజ్ వల్ల చిన్నవి, పెద్దవి అన్ని పాపాల మన్నింపు విషయంలో భేదాభిప్రాయం ఉంది. ఎందుకనగా పెద్ద పాపాల మన్నింపుకై స్వచ్ఛమైన తౌబా తప్పనిసరి. సత్కార్యాలు కూడా పాపాల మన్నింపుకై కారణమవుతాయి. ఎంత పెద్ద సత్కార్యముండునో అంతే పాపాలు మన్నించబడుతాయి. (ఖనన సంస్కారాలు పూర్తైన తర్వాత సమాధి వద్ద కొంత సేపు ఉండి దైవదూతలు వచ్చి అడిగే ప్రశ్నలకు అతను సరియైన సమాధానం చెప్పగలగాలని అల్లాహ్ తో అతని కొరకు దుఆ చేయాలని ఇతర హదీసుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు. ఉః అబూదావూద్, కితాబుల్ జనాయిజ్, బాబుల్ ఇస్తిగ్ఫారి ఇందల్ ఖబ్రి లిల్ మయ్యిత్… -అనువాదకుడు-).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
2- హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ప్రకారం: అబ్దుల్ ఖైస్ మనుషులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరెవరు, ఏ తెగకు చెందినవారు?” అని అడిగారు. దానికి వారు ‘మేము రబీఅ తెగకు చెందిన వాళ్ళము’ అని అన్నారు. “ఓహో! మీరా, స్వాగతం! గౌరవనీయులారా!” ఏలాంటి సిగ్గు, అవమానంలేకుండారావచ్చు!” అని ప్రవక్త అన్నారు. వారన్నారుః “ప్రవక్తా! మాకూ, మీకూ మధ్య సత్యతిరస్కారి అయిన ఈ ముజర్ తెగ అడ్డు గోడగా ఉంది. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప ఇతర సమయాల్లో మీ సన్నిధికి రాలేము. ఇప్పుడు మాకేమైనా స్వర్గ ప్రవేశానికి ఉపయోగపడే విషయాలు, స్పష్టమైన గీటురాయి ఆదేశాలు ఇవ్వండి. వీటిని మేము మాతో పాటు మీ దగ్గరికి రానటువంటి వారికి కూడా వినిపస్తాము. అంతే కాదు, పానీయాలను గురించి కూడా వారు ప్రవక్తని అడిగారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నాలుగు విషయాలను ఆచరించాలని, నాలుగు విషయాలను మానుకోవాలని ఆదేశించారు. ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలని చెబుతూ “ఏకైక అల్లాహ్ ను విశ్వసించాలంటే ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. దానికి వారు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మాత్రమే బాగా తెలుసు. (మాకు తెలియదు) అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంఇలా విశదపరిచారుః “ఏకైక అల్లాహ్ ను విశ్వసించటమంటే అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనచేత నియమించబడిన ప్రవక్త అని సాక్ష్యమివ్వాలి. నమాజు వ్యవస్థను నెలకొల్పాలి, జకాత్ (పేదల ఆర్థిక హక్కు) చెల్లించాలి, రమజాను ఉపవాసాలు పాటించాలి, యుద్ధ ప్రాప్తిలో ఐదవ వంతు సొమ్ము, ప్రభుత్వ ధనగారానికి ఇవ్వాలి”. ఆ తర్వార, హన్తమ్, దుబ్బా, నఖీర్, ముజఫ్ఫత్([1]). అనే నాలుగు రకాల పాత్రలలో నీళ్ళు ఉంచడాన్ని, త్రాగడాన్ని వారించారు. హదీసు ఉల్లేఖకులు ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఒక్కోసారి ముజఫ్ఫత్ అనడానికి బదులు ముఖయ్యర్ అని పలికేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు బోధిస్తూ “ఈ ఆదేశాలను బాగా గుర్తుంచుకోండి. మీతో పాటు ఇక్కడికి రాని మీ ప్రాంతం వాళ్ళకు కూడా తెలియజేయండి” అని అన్నారు. (బుఖారి 53, ముస్లిం 17).
ఈ హదీసులో:
ఆచరణలు విశ్వాసములో ఓ భాగము. గురువు, మొదట సంక్షిప్తంగా చెప్పిన మాటను తర్వాత వివరించి చెప్పుట అభిలషణీయం. అందువల్ల అతని మాట అర్థమవుతుంది. గురువు హితబోధ చేస్తున్నప్పుడు ‘మూలజ్ఞానం మరియు అతిముఖ్యమైన విషయాలు ముందుగా చెప్పాలని మరియు అర్థమగుటకు సంగ్రహముగా చెప్పాలని కూడా ఈ హదీసు సూచిస్తుంది. చూడడానికి ఇందులో ఐదు ఆదేశాలు కనబడుతున్నాయి. అయితే యుద్ధప్రాప్తిలోని ఐదో వంతు విషయం జకాత్ పరిధిలోనే వస్తుంది. ఎందుకనగా అది ధనం, సొమ్ముకు సంబంధించినదే కదా. ఇలా ఆదేశాలు నాలుగే అవుతాయి.
కొందరు హదీసువేత్తల అభిప్రాయ ప్రకారం పైన చెప్పబడిన నాలుగు నివారణలు రద్దయినాయి. అంటే ఇతర సహీ హదీసుల ఆధారంగా ఆ పాత్రలు ధర్మసమ్మతమైన పానీయాలు త్రాగడానికి ఉపయోగించవచ్చు.
(మదిలో, ఆచరణ రూపంలో) విద్యను భద్రపరచి, ఇతరులకు అందజేయడం గురించి ఈ హదీసులో ప్రోత్సహించబడింది. విద్యభ్యాసం క్రమపద్ధతిలో ఉండడం మంచిదని చెప్పబడింది.
ఇందులో హజ్ ప్రస్తావన రాలేదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆదేశాలు ఇచ్చేటప్పడు హజ్ యాత్ర విధిగా నిర్ణయించబడలేదు అని కొందరు పండితులు చెప్పారు.
వచ్చేవారితో వారి పేరు, వంశం గురించి అడగడం జరిగింది. ఇది సున్నత్ (ప్రవక్తవారి సత్సంప్రదాయం). వచ్చే అతిథుల మనుసు చూరగొని, ఒంటరితన భావాన్ని దూరం చేయుటకు మంచి పద్ధతిలో స్వాగతం పలకాలని ఈ హదీసులో ఉంది.
ఈ హదీసులో ఇస్లాం యొక్క అర్కాన్ (మౌలిక విషయా)లను ఈమాన్ యొక్క వ్యాఖ్యానంలో తెలుపడం జరిగింది. దీనితో తెలిసిందేమిటంటే ఇస్లాం మరియు ఈమాన్ ప్రస్తావన విడివిడిగా వచ్చినప్పుడు ప్రతి దాంట్లో ఇస్లాం మరియు ఈమాన్ రెండింటికి సంబంధించిన అర్కానులు వస్తాయి. మరెప్పుడైతే రెండింటి ప్రస్తావన ఒకచోట వస్తుందో దేని భావం దానికే ఉంటుంది
([1]) హన్తమ్:- పచ్చ లేక ఎర్ర రంగు మట్టి కడవను అంటారు. దీనికి మూతి పై భాగాన కాకుండా పార్శ్వ భాగాన ఉంటుంది. మట్టిలో రక్తం, వెండ్రుకలు కలిపి ఈ కడవను తయారు చేస్తారు. లేదా లక్క, గాజు కలిపిన ఎరుపు రంగు పూయబడిన కడవను కూడా అంటారు. దుబ్బాః- పాత్రగా ఉపయోగించే బోలు సోరకాయను దుబ్బా అంటారు. నఖీర్:- ఖర్జూరపు చెట్టు వేరులో గుంట చేసి దాన్ని మధుపాత్రగా ఉపయోగిస్తారు. ముజఫ్ఫత్:- ఉమ్మి నీటితో లేపనం చేసిన మట్టి పాత్రను అంటారు. ముఖయ్యర్:- చర్మాన్ని ఎండబెట్టి, కాల్చి ఒక విధమైన లేపనం తయారు చేస్తారు. దాంతో లేపనం చేయబడిన పాత్రను అంటారు. ఈ లేపనాన్ని ఓడలక్కూడా ఉపయోగిస్తారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
{ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించినదానిని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించినవారు కూడా దానిని హృదయ పూర్వకంగా విశ్వసించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారుః “మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము. ప్రభువా! క్షమాభిక్ష పెట్టుమని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవద్దకే మరలి వస్తాము}. (సూరె బఖర 2:285).
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్బు ఉల్లేఖించారుః “ఆచరణలు కేవలం మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. మనిషి దేని సంకల్పం చేసుకుంటాడో, అతనికి అదే ప్రాప్తమవుతుంది. (ఉదాహరణకుః) ఎవరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు వలసపోతాడో అతని వలస మాత్రమే నిజమయినది. ఎవరు ప్రపంచం కొరకు లేదా ఏదైనా స్త్రీని వివాహమాడటానికి వలసపోతాడో, అతని వలస ప్రపంచం కొరకు లేదా స్త్రీ కొరకు అనే పరిగణించబడుతుంది”. (బుఖారి 1, ముస్లిం 1907). విశ్వాస పాఠాలు
ఈ హదీసులో:
ఈ హదీసు ప్రతి ఆచరణకు పునాది లాంటిది. కర్మల అంగీకారం, తిరస్కారం మరియు అవి మంచివా లేదా చెడ్డవా అన్న విషయం మనోసంకల్పంపై ఆధారం పడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. ఒకప్పుడు ఆచరణ బాహ్యంగా (చూడటానికి) చాలా మంచిగా ఉండవచ్చు. కాని సత్సంకల్పం లేని కారణంగా అది చేసిన వానికి ఏ లాభమూ దొరక్కపోవచ్చు. దీనికి సంబంధించిన నిదర్శనాలు ఖుర్ఆనులో మరీ స్పష్టంగా ఉన్నాయిః
{జాగ్రత్తా! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}. (సూరె జుమర్ 39:3). {పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించు- కోవాలి}. (సూరె బయ్యినహ్ 98: 5). {మీరు షిర్క్ చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి}. (సూరె జుమర్ 39: 65).
ఈ హదీసులో తెలిసిన మరో విషయం ఏమనగాః మనస్సు కార్యమే (సంకల్పశుద్ధియే) అన్నిటికి మూలం. మనిషి తాను చేసే ప్రతీ కార్యం తన ప్రభువు కొరకే ప్రత్యేకించి చేయుటకు, దాన్ని షిర్క్ దరిదాపులకు, ఇతర ఉద్దేశాలకు దూరంగా ఉంచుటకు ప్రయత్నం చేయాలి. ఆ కార్యం ద్వారా అల్లాహ్ సంతృప్తి, ఆయన దర్శనం పొందే ఉద్దేశ్యం మాత్రమే ఉంచాలి.
సర్వకార్యాలు, వాటి ఉద్దేశ్యాల్ని బట్టి ఉంటాయి తప్ప బాహ్య రూపంతో కాదు. ఎవరూ మరొకరి బాహ్య రూపం, బాహ్యాచరణలతో మోసపోకూడదు. అతని సంకల్పంలో కీడు చోటు చేసుకోవచ్చు. అయినా ప్రజల పట్ల సదుద్దేశం కలిగి ఉండటమే అసలైన విషయం.
ఆరాధనలు చేసేవారి పుణ్యాల్లో వ్యత్యాసం వారి మనస్సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని కూడా తెలుస్తుంది.
ప్రమాణం, మ్రొక్కుబడి, విడాకులు, అలాగే షరతులు, వాగ్థానం, ఒప్పందాల్లాంటి విషయాల్లో సంకల్పం (నియ్యత్) తప్పనిసరిగా ఉండాలి. మరచిపోయేవాడు, బలవంతం చేయబడినవాడు, అజ్ఞాని, పిచ్చివాడు మరియు చిన్న పిల్లలు చేసే పనులు (ఉద్దేశపూర్వకంగా ఉండవు గనక) వారిపై ఇస్లామీయ ఆదేశాలు విధిగా లేవు. ఎవరు ఏ సంకల్పం చేస్తారో అతనికి అదే ప్రాప్తమవుతుంది. వేరేది కూడా లభించవచ్చునా లేదా? అన్న విషయం సందిగ్ధంలో ఉంది. మనుషుల సంకల్పాలను అల్లాహ్ తప్ప మరెవరూ ఎరుగరు.
ప్రదర్శనాబుద్ధి, పేరుప్రఖ్యాతులు పొందే సంకల్పం ప్రశంసనీయమైనది కాదు అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అది అల్లాహ్ యేతరులతో ఏదైనా పొందే ఉద్దేశ్యం క్రింద లెక్కించబడుతుంది. సత్సంకల్పం లేనిదే ఏ కార్యాలూ, సత్కార్యాలుగా పరిగణింపబడవు. ఎవరైతే ప్రాపంచిక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి పరలోక లాభాన్ని విస్మరిస్తారో అతను పరలోక లాభాన్ని కోల్పోతాడు. మరెవరైతే పరలోక లాభానికి ప్రాముఖ్యతనిచ్చి, దానితో పాటు ప్రాపంచిక ప్రయోజనం కూడా పొందాలనుకుంటాడో అతనికి ప్రాపంచిక లాభం లభిస్తుంది మరియు పరలోకంలో కూడా సత్ఫలితం ప్రాప్తిస్తుంది. ఎవరైతే తాను చేసే ఆచరణ ద్వారా ప్రజల ప్రసన్నత పొందాలని ఉద్దేశిస్తాడో అతడు షిర్క్ చేసినవాడవుతాడు.
అల్లాహ్ చాలా సూక్ష్మజ్ఞాని అని మరియు అతి రహస్య విషయాలు కూడా ఎరుగువాడని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా దుష్టులను వారి దుష్సంకల్పం వల్ల హీనపరచకుండా వారి విషయం దాచి ఉంచి అల్లాహ్ తన దాసులపై చేసిన మేలు కూడా ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.
సాఫల్యానికి సబబు ఆచరణలు ఎక్కువ ఉండటం కాదు. అవి మంచివి అయి ఉండటం. ఇఖ్లాస్ (అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయనకే ప్రత్యేకించి) మరియు ప్రవక్త పద్ధతి ప్రకారం చేయబడినప్పుడే ఏదైనా కార్యం సత్కార్యం అవుతుంది. చిన్న కార్యమైనా సరే ఇఖ్లాస్ తో కూడుకుంటే అదే చాలా గొప్పది. దీనికొక హదీసు కూడా సాక్ష్యముంది. మనిషి ఏదైనా కార్యం మొదలుపెట్టే ముందు తన నియ్యత్ (సంకల్పాన్ని) నిర్థారణ చేసుకోవాలి. ఫర్జ్ అయినా, నఫిల్ అయినా, ఏ కార్యమైనా నియ్యత్ లేనిది అంగీకరింపబడదు. నియ్యత్ కొరకు నోటితో పదాలు ఉచ్చరించుట అనవసరం, దేని విషయంలో స్పష్టమైన నిదర్శనం ఉందో అది తప్ప. (ఉదాః హజ్).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మన్’హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత: అఖీదా (విశ్వాసం) మరియు ఆచరణలో https://www.youtube.com/watch?v=LN3WpB8zhnQ[55 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
సలఫ్ అంటే ఎవరు? మన్’హజె సలఫ్ అంటేమిటి ?
సలఫ్ అనే పదం ‘సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘పూర్వ కాలపు పుణ్యాత్ములు, సజ్జనులు’. ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త (ﷺ) ఈ మూడు తరాలను ఉత్తమ ముస్లిం తరాలుగా అభివర్ణించారు.
మొదటిది: ప్రవక్త (ﷺ) మరియు ఆయన సహబా (సహచరులు). రెండవది: తాబిఈన్ (సహచరుల అనుచరులు). మూడవది: తబఎ తాబిఈన్ (సహచరుల అనుచరుల అనుచరులు)
[బుఖారీ 2652, ముస్లిం 2533]
అయితే సలఫ్ ఎలా ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకున్నారో, ఆచరించారో అలాగే అర్థం చేసుకునే, ఆచరించే ప్రయత్నం చేసేవారినే ‘సలఫీ’ లేదా ‘అహ్లె హదీస్’ అని అంటారు. మరియు ‘నిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅ’ వీరే.
—
ఈ ప్రసంగంలో, వక్త మన్ హజె సలఫ్ (పూర్వీకుల మార్గం) యొక్క ప్రాముఖ్యతను విశ్వాసం మరియు ఆచరణలో వివరించారు. జ్ఞానాన్ని అన్వేషించేవారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలను వివరిస్తూ, వారి కోసం అల్లాహ్ శాంతిని, కరుణను పంపుతాడని మరియు సృష్టి మొత్తం వారికోసం దుఆ చేస్తుందని తెలిపారు. ఉపమానం ద్వారా, ఖురాన్ మరియు హదీసులను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, ప్రవక్త సహచరులైన సహాబాల అవగాహనను అనుసరించడం తప్పనిసరని నొక్కి చెప్పారు. ఖవారీజ్ వంటి చారిత్రక సమూహాల ఉదాహరణలను ఇస్తూ, సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం ఎలా మార్గభ్రష్టత్వానికి దారితీస్తుందో వివరించారు. దొంగ చేతిని నరకడం వంటి ఖురాన్ ఆదేశాలను సరిగ్గా ఆచరించడానికి సహాబాల అవగాహన ఎంత అవసరమో ఉదాహరణలతో స్పష్టం చేశారు. మన విశ్వాసం, ఆచరణ, దావత్ మరియు ప్రవర్తన అన్నీ మన్ హజె సలఫ్‌కు అనుగుణంగా ఉండాలని, లేకపోతే అవి అల్లాహ్ వద్ద స్వీకరించబడవని హెచ్చరించారు. చివరగా, సహాబాలను గౌరవించడం మరియు వారి మార్గాన్ని అనుసరించడం ప్రతి ముస్లిం విధి అని హజ్రత్ అబూబకర్ మరియు రబియా (రదియల్లాహు అన్హుమ్) మధ్య జరిగిన సంఘటన ద్వారా తెలియజేశారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
కాని ఎవరయినా సన్మార్గం ప్రస్ఫుటమైన మీదట కూడా ప్రవక్త కు వ్యతిరేకంగా పోతే, విశ్వాసులందరి మార్గాన్ని వీడి, ఇతర మార్గాన్ని అనుసరిస్తే, మేమతన్ని అతను మరలదలచుకున్న వైపుకే మరల్చుతాము. కడకు అతన్ని నరకంలో పడవేస్తాము. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. (4:115)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టి యొక్క సృష్టికర్త, పోషణకర్త మరియు మనందరి ఆరాధనలకు ఏకైక నిజమైన అర్హుడు అల్లాహ్ కే ప్రశంసలు, పొగడ్తలు. లెక్కలేనన్ని దరూద్ సలాం, శాంతి, కరుణలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తమ తమ జాతుల వరకు సరియైన రీతిలో అందజేశారో.
అల్హందులిల్లాహ్, ఈ రోజు మర్కజ్ ఇబాదుర్రహ్మాన్ వైపు నుండి ఈ ప్రత్యేక క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో అందులో నాకు ఇవ్వబడినటువంటి అంశం మన్ హజె సలఫ్ యొక్క ప్రాధాన్యత, విశ్వాసం మరియు ఆచరణలో.
ఇలాంటి ఇంత మంచి అవకాశం నాకు లభించినందుకు ముందు అల్లాహ్ కు లెక్కలేనన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మర్కజ్ ఇబాదుర్రహ్మాన్ యొక్క బాధ్యులు ప్రత్యేకంగా షేఖ్ అబూబకర్ ఉమ్రీ హఫిదహుల్లాహ్ మరియు ఈ అంశాన్ని వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నటువంటి తుల్లాబె ఇల్మ్, ధర్మ విద్యార్థులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి ఒక శుభవార్తను ముందు తెలియజేయాలనుకుంటున్నాను.
జ్ఞానాన్ని అన్వేషించేవారికి శుభవార్త
అదేమిటి శుభవార్త? ఎవరైతే ధర్మ జ్ఞానం నేర్చుకొనుటకు ఒక సమావేశంలో హాజరవుతారో. సమావేశం అంటే అది మస్జిద్ కావచ్చు, ఏదైనా మద్రసా కావచ్చు, ఏదైనా మనం ఒకచోట గుమిగూడడం కావచ్చు మరియు ఇలాంటి టెక్నాలజీ కాలంలో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇలాంటి సామాజిక మాధ్యమం, సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా మనం ఇప్పుడు ఒకచోట, ఒక ఉద్దేశంతో జమా అయ్యాము. ఇది కూడా అందులో వచ్చేస్తుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు ఎన్నో ఉన్నాయి వాటి యొక్క సారాంశం ఏంటి?
ఎవరైతే ధర్మజ్ఞానం నేర్చుకోవడానికి ఒకచోట హాజరవుతారో, అల్లాహు త’ఆలా వారిని తన దగ్గర ఉన్నటువంటి దైవదూతల ముందు ప్రశంసించి వారిని స్తుతిస్తాడు. వారి యొక్క ఈ అమోఘమైన విద్య నేర్చుకోవడానికి హాజరు కావడాన్ని ఎంతో గొప్పగా చెబుతాడు. అంతేకాదు, ఆ దైవదూతలందరినీ కూడా అల్లాహు త’ఆలా సాక్ష్యంగా ఉంచి వారి యొక్క పాపాలను మన్నించేటువంటి శుభవార్త ఇస్తాడు. అంతేకాదు, ధర్మవిద్య నేర్చుకోవడానికి ఎవరైతే ఒకచోట హాజరవుతారో అల్లాహ్ వైపు నుండి ప్రశాంతత అనేది వారిపై అవతరిస్తూ ఉంటుంది. మరియు అల్లాహ్ యొక్క కారుణ్యం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అంతేకాదు, సోదర మహాశయులారా సోదరీమణులారా, ఎవరైతే ధర్మజ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరుతారో వారి గురించి ఈ సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి దుఆ చేస్తూ ఉంటారు.
ఎంత గొప్ప అదృష్టం గమనించండి. అందుకొరకు ఇప్పటివరకు మీరు ఏ క్లాసులు అయితే వింటూ ఉన్నారో, ప్రత్యేకంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం ఎలా విశ్వసించాలి అని షేఖ్ అబూబకర్ హఫిదహుల్లాహ్ గారు ఏదైతే వివరిస్తూ వచ్చారో ఇంకా ముందుకు ఏ క్లాసులు అయితే జరుగుతాయో అందులో మనకు కావలసినటువంటి ముఖ్య కొన్ని విషయాలు ఏంటో తెలుసా?
ఒక విద్యార్థి యొక్క బాధ్యతలు
మనం ఈ విద్య నేర్చుకునే ఈ క్లాసులలో ఏదైతే హాజరయ్యామో, ప్రతీ రోజూ, ప్రతీ సందర్భంలో, చివరికి మనం క్లాసులో ఆన్‌లైన్ లేకపోయినప్పటికీ ఆ పీడీఎఫ్ తిరగేస్తూ, ఆ పాఠాలను మనం కొంచెం గుర్తు చేస్తూ, అల్లాహ్ దీనికి మనకు మంచి ప్రతిఫలం ప్రసాదించాలని అల్లాహ్ తో పుణ్యాన్ని ఆశిస్తూ ఉండాలి. ఇంకా సోదర మహాశయులారా, నేర్చుకున్న విద్య ప్రకారంగా ఆచరించడానికి మనలో ముందు నుండే ఒక కాంక్ష, ఒక జజ్బా అనేది ఉండాలి. మరియు ఈ ధర్మవిద్య ప్రకారంగా మనం ఇతరులకు కూడా ఆహ్వానిస్తాము అని ఆ సంకల్పం కూడా ఇప్పటి నుండే చేసుకొని ఉండాలి. ఇవి మన బాధ్యతలు.
మన్ హజె సలఫ్ – ఒక ఉపమానం
ఈ రోజు నా యొక్క అంశం, సలఫె సాలెహీన్ మన్ హజె సలఫ్ దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత విశ్వాసం మరియు ఆచరణలో.
సోదర మహాశయులారా, నా అంశానికి వివరణ నేను మీకు ఇచ్చే ముందు ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న సామెత తెలియజేస్తాను. మీరందరూ ఏదో ఈ ఒక్క ఉపన్యాసం, ప్రసంగం వినడానికి హాజరు కాలేదు. మీరు స్టూడెంట్స్. డైలీ క్లాస్ వైజ్ లో, సబ్జెక్ట్ వైజ్ లో చదువుతున్నారు.
ఇక్కడ మనం ఒక విషయం గమనించవచ్చు. సామాన్యంగా మనం క్లాసులో వెళ్ళినప్పుడు, క్లాసులో చూస్తాము, ఎప్పుడైతే మనకు గురువుగారు ఒక పాఠం బోధిస్తారో, ఆ సందర్భంలో మన క్లాస్మేట్ ఎవరైతే ఉంటారో, తోటి మనతో చదివేవారు, వారిలో కొందరు చాలా మంచి బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, గురువు చెప్పే మాటల్ని, పాఠాల్ని చాలా తొందరగా, మంచి విధంగా అర్థం చేసుకునే వారు ఉంటారు. అవునా కాదా? ఉంటారు.
సర్వసామాన్యంగా ఎవరైతే వెనక వచ్చేవారు ఉంటారో వారు ఏం చేస్తారు? గురువు గారి పాఠం అర్థం చేసుకోవడానికి ఆ క్లాసులో ఉన్నటువంటి ఉత్తీర్ణులైన, ప్రధమంగా, మొదటి నుండి ఉన్నటువంటి పాఠాన్ని మంచి విధంగా అర్థం చేసుకున్నటువంటి ఆ మన తోటి విద్యార్థులను సంప్రదిస్తాము. వాటి ద్వారా మరింత మంచిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. గురువు చెప్పిన పాఠాన్ని మనం వెనక ఉన్నందుకు, దూరంగా ఉన్నందుకు, అయ్యో గురువు చెప్పిన పాఠం ఈ పుస్తకం నుండే కదా సరిపోయిందిలే అని ఊరుకోము మనం. ఆ పాఠం ఎలా నచ్చ చెప్పారు? ఆ ముందుగా ఉన్నటువంటి ఆ ఎక్కువ బుద్ధివంతులు, జ్ఞానవంతులు ఎలా అర్థం చేసుకున్నారు? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇది బుద్ధిమంతుడు, జ్ఞానమంతుడు చేసేటువంటి పని, ఈ రోజుల్లో మనం సర్వసామాన్యంగా చేస్తూ ఉన్నాము. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే ఇది మనకు ఒక స్వాభావిక, ప్రకృతిపరమైన విషయం. స్వభావానికి విరుద్ధమైన విషయం కాదు.
ఈ ఉదాహరణ ద్వారా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మన యొక్క విశ్వాసాలలో, మన యొక్క జీవితంలో, మన యొక్క ఆచరణలలో, మనకు సంబంధించిన ప్రతీ విషయంలో ఖురాన్, హదీసులను అర్థం చేసుకోవడానికి మన్ హజె సలఫ్ లోని మొదటి శ్రేణి సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం, చాలా అవసరమైన విషయం. మరియు ఇది లేనిది మనం ఖురాన్, హదీసును అర్థం చేసుకోలేము అన్నటువంటి విషయం ఏదైతే ఉందో, వాస్తవానికి ఖురాన్, హదీసుల ఆదేశం కూడా ఇది మన స్వభావంలో, ప్రకృతిలో ఉన్న విషయం. ఇది గ్రహించండి ముందు మీరు.
దలీల్లు ఎన్నో ఖురాన్, హదీసులో ఉన్నాయి, తర్వాత తెలియజేస్తాను నేను. కానీ అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానాలతో మనం ముందు గ్రహించవలసిన విషయం ఏంటి? ఖురాన్, హదీసులను సహాబాలు అర్థం చేసుకున్న విధంగా మన్ హజె సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోవడం ఇది ఒక అమ్ రె ఫిత్రీ, తప్పనిసరి విషయం, స్వాభావిక విషయం. దీనికి విరుద్ధం చేయడం వాస్తవానికి అసలైన మూర్ఖత్వం, అసలైన బుద్ధిహీనత, అసలైన జ్ఞానానికి వ్యతిరేకమైన విషయం.
సహాబాల అవగాహన యొక్క ఆవశ్యకత
ఈనాడు అరబీ భాష ఎంత అభివృద్ధి చెందినా, దాని యొక్క సాహిత్యం ఎంత గొప్పగా ముందుకు ఏగినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఖురాన్ అవతరించినప్పుడు అరబీ భాషలో వారు ఏ ప్రావీణ్యత కలిగి ఉన్నారో వాటికి మనం మించి పోలేము. ఆనాటి కాలంలో ఆ అరబీ తెలిసిన అరబీ సాహిత్యపరులు కూడా కేవలం భాష ఆధారంగానే ఖురాన్, హదీసును అర్థం చేసుకునే వాళ్ళము అన్నటువంటి తప్పుడు ఆలోచనలో పడలేదు. ఖురాన్ అల్లాహ్ వైపు నుండి అవతరించింది. దాని యొక్క వివరణ హదీస్ రూపంలో అల్లాహు త’ఆలా యే అవతరింపజేశాడు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ను తమ ఆచరణ ద్వారా, తమ మాటల ద్వారా, తక్రీర్, తమ ముందు జరిగిన ఏదైనా సంఘటన విషయం దానిని రూఢీపరుస్తూ లేదా దానిని రద్దు పరుస్తూ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఇదంతా కూడా వివరణ.
మన్ హజె సలఫ్ యొక్క నిర్వచనం మరియు ప్రాముఖ్యత
అందుకొరకే మన్ హజె సలఫ్ అని ఏదైతే మనం మాటిమాటికి అంటూ ఉంటామో, మన్ హజె సలఫ్ అని అంటే ఏంటి? దీనికి సంక్షిప్త భావం ఖురాన్, హదీసును సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో, అర్థం చేసుకొని ఏ విధంగా ఆచరించారో, అది ఒక విధానం. మనం ఖురాన్, హదీసును అర్థం చేసుకోవడానికి ఆ సహాబాల విధానాన్ని అనుసరించడం తప్పనిసరి.
సలఫ్ అంటే గతించిపోయిన వారు, పూర్వీకులు. ఈ పూర్వీకులలో మొట్టమొదటి స్థానంలో, మొట్టమొదటి శ్రేణిలో, అంతస్తులో సహాబాలు ఉన్నారు. ఎందుకు? వారే డైరెక్ట్ ఖురాన్ అవతరణను తమ కళ్ళ ద్వారా చూసిన వారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ధర్మాన్ని నేర్చుకొని, అర్థం చేసుకొని, ఆచరించి ఇతరులకు చేరవేసిన వారు.
సహాబాలు అర్థం చేసుకున్నట్లు, సలఫె సాలెహీన్ అర్థం చేసుకున్నట్లు, ఆచరించినట్లు మనం ఇస్లాంను, ధర్మాన్ని, ఖురాన్, హదీసును అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం? ఎందుకంటే అలా కాకుంటే మన యొక్క విశ్వాసాలు సరియైనవి కావు, అల్లాహ్ అంగీకరించడు, స్వీకరించడు. ఒకవేళ మన్ హజె సలఫ్ ప్రాముఖ్యతను మనం గ్రహించకుంటే మన ఆచరణ సరియైనది కాదు, అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఒకవేళ మనం మన్ హజె సలఫ్ ను అర్థం చేసుకోకుంటే, దాని ప్రాముఖ్యతను గ్రహించకుంటే, మనం ఇహలోకంలో చేసే ఏ పని కూడా అది అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాదు.
అందుకొరకు మన్ హజె సలఫ్ అని మాట వచ్చినప్పుడు మూడు విషయాలు తప్పనిసరివి అని మదిలో నాటుకోండి, ఎల్లవేళల్లో ఈ మూడు విషయాలను ఫ్రెష్ గా ఉంచుకోండి. ఒకటి మన్ హజె సలఫ్ ను మనం తెలుసుకోవడం, రెండవది మన్ హజె సలఫ్ ను అర్థం చేసుకొని ఆచరించడం, మూడవది సచ్చే పర్యంతరం చివరి శ్వాస వరకు దానిపై స్థిరంగా ఉండడం. ఇల్మ్, ఫహమ్, సబాత్. అర్థం చేసుకోవడం, జ్ఞానం నేర్చుకోవడం మన్ హజె సలఫ్ గురించి, దానిని అర్థం చేసుకొని ఆచరించడం మరియు దానిపై స్థిరంగా ఉండడం. ఈ మూడు విషయాలు తప్పనిసరి.
ఒకవేళ మనం విశ్వాసం అని, అల్లాహ్ ను విశ్వసించే విషయంలో గానీ ఇంకా వేరే విషయాల్లో గానీ నాకు అర్థమైనట్లు ఖురాన్, హదీస్ ద్వారా నేను విశ్వసిస్తాను. నాకు నా భాషలో ఖురాన్, హదీస్ ఉంది కదా సరిపోతుంది అని విర్రవీగుతూ మన్ హజె సలఫ్ ను తిరస్కరిస్తే అది అసలైన హిదాయత్, సన్మార్గం కాదు అని అల్లాహ్ స్వయంగా ఖురాన్ లో తెలియపరిచాడు. “ఫ ఇన్ ఆమనూ బి మిస్లి మా ఆమన్ తుమ్ బిహి ఫఖదిహ్ తదవ్ వ ఇన్ తవల్లవ్ ఫ ఇన్నమాహుమ్ ఫీ షిఖాఖ్”. సహాబాల విశ్వాసం ఎలా ఉందో, ప్రపంచ మనుషులందరి విశ్వాసాలు ఆ విధంగా కానంత వరకు వారు సన్మార్గగాములు కాలేరు, సన్మార్గంపై ఉండలేరు. “వ ఇన్ తవల్లవ్” వారు గనక ఒకవేళ వెన్ను తిరిగి పోతే పోనివ్వండి. వాస్తవానికి చీలికలు వహించి, సన్మార్గం నుండి పెడమార్గంలో పడినవారు వారే అవుతారు.
అందుకొరకు సహాబాల ప్రకారంగా విశ్వాసం మనకు తప్పనిసరి విషయం. అలాగే ఆచరణ. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఖురాన్ లో అల్లాహు త’ఆలా ఎన్నో సందర్భాలలో “ఇన్నల్లదీన ఆమనూ వ అమిలుస్ సాలిహాత్“, “యా అయ్యుహల్లదీన ఆమనూ అతీవుల్లాహ వ అతీవుర్ రసూల్“. ఈమాన్ తో పాటు, విశ్వాసంతో పాటు ఆచరణ, సదాచరణ మరియు అల్లాహ్ యొక్క విధేయతతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధేయత మాటిమాటికి అల్లాహు త’ఆలా ప్రస్తావించాడు.
అయితే విశ్వాసం సహాబాల మాదిరిగా ఉండడం ఈ సూర బకరా ఆయతు ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో, మన జీవితంలోని ప్రతి ఆచరణ సహాబాల ప్రకారంగా, వారు అర్థం చేసుకొని ఆచరించిన విధంగా ఉండడం తప్పనిసరి అని కూడా అల్లాహు త’ఆలా సూరతున్నిసాలో చాలా స్పష్టంగా తెలియపరిచాడు. “వ మన్ యుషాకికిర్ రసూల మిమ్ బాఅది మా తబయ్యన లహుల్ హుదా”. హిదాయత్, సన్మార్గం స్పష్టమైన తర్వాత కూడా ఎవరైతే దానికి విముఖత చూపుతారో, వ్యతిరేకించి వెనుతిరిగిపోతారో, “వ యత్తబిఅ గైర సబీలిల్ మూమినీన్“. ఇక్కడ గమనించండి. అల్లాహు త’ఆలా హిదాయత్ తర్వాత అతడు ఏదైతే వెనుదిరిగాడో, చీలికల్లో పడిపోయాడో, వ్యతిరేకత వహించాడో, “నువల్లిహి మా తవల్లా” అని కూడా చెప్పవచ్చు. అతన్ని మేము నరకంలో పంపించేస్తాము అని. కానీ దానికంటే ముందు ఏం చెప్పాడు? “వ యత్తబిఅ గైర సబీలిల్ మూమినీన్”. విశ్వాసుల మార్గాన్ని వదిలి వేరే మార్గాన్ని అనుసరిస్తున్నాడో, అతన్ని మేము అతడు ఏ పెడమార్గం వైపునకు వెళ్ళాడో అటు ఆ వైపునకే మరలింపజేస్తాము, చివరికి ఆ విధంగా అతన్ని నరకంలో పడవేస్తాము అది చాలా చెడ్డ స్థానం అని అంటున్నాడు.
ఇక్కడ విశ్వాసుల మార్గాన్ని అని అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడు, “సబీలిల్ మూమినీన్”, ఆ సబీలిల్ మూమినీన్ ఏంటి? సహాబాయె ఇక్రామ్. ఎందుకంటే విశ్వాసులలో మొట్టమొదటి విశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన వారు సహాబాలు.
అందుకొరకు సోదరులారా, నేను ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. వాటి ద్వారా మాట మరింత స్పష్టమవుతుంది. కానీ ఖురాన్లో అల్లాహు త’ఆలా ఈ విషయాలను ఎంత నొక్కి చెబుతున్నాడో, దీని ద్వారా మనం మన్ హజె సలఫ్ యొక్క, సహాబాలు అర్థం చేసుకున్న విధంగా ఆ ప్రకారంగా మన విశ్వాసాలు, మన ఆచరణలు ఉండడం ఎంత ముఖ్యమో, అవసరమో అది మీరు గమనించండి.
ఖవారీజ్ల మార్గభ్రష్టత్వం
దీనికి సంబంధించి ముస్తద్రక్ హాకింలో హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి యొక్క సంఘటన మరియు హదీస్ కూడా విందాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత నాలుగో ఖలీఫా హజ్రత్ అలీ రదియల్లాహు త’ఆలా అన్హు కాలంలో కొందరు సహాబాల మన్హజ్ ను వ్యతిరేకించి సహాబాలు ఎలా ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకున్నారో ఆ మార్గాన్ని, విధానాన్ని వ్యతిరేకించినందుకు ఎంత పెడమార్గంలో పడిపోయారంటే స్వయంగా హజ్రత్ అలీ వారినే కాఫిర్ అని అనేసారు. ఇంకా ఎందరో సహాబాలను కాఫిర్ అని అన్నారు. ఎవరు వారు? ఖవారీజ్. అయితే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ ఖవారీజ్ లతో మునాజరా (డిబేట్) చేయడానికి వెళ్లారు.
ఆ సందర్భంలో ఆయన అన్నటువంటి పలుకులు ఇప్పటికీ చాలా భద్రంగా ఉన్నాయి. అక్కడ మీరు గమనించండి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఏమంటున్నారు?
“నేను మీ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులు అయినటువంటి ముహాజిరీన్ మరియు అన్సార్ వారి వద్ద నుండి వస్తున్నాను. వారి యొక్క మాటను నేను మీకు చేరిపించడానికి, తెలపడానికి వస్తున్నాను. వారు ఎలాంటి వారంటే వారు ఏమి మాట్లాడినాగానీ ఆ ఖురాన్, హదీసుల ఆధారంగా మాట్లాడుతారు. ఎందుకంటే ఖురాన్ వారి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించింది. మరియు వారు మీ కంటే ఎక్కువగా మంచి రీతిగా అల్లాహ్ యొక్క వహీని తెలుసుకున్న వారు“
ఇక్కడ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఆ ఖారిజీ వాళ్లతోని ఏదైతే మునాజరా, డిబేట్ చేశారో, దానికి ముందు ఈ మాట ఏదైతే ప్రస్తావించారో, మీరు విన్నారు కదా. ఇక చివరి పలుకులు, సహాబాలు మీకంటే ఎక్కువగా వహీ గురించి, అ’అలము, ఎక్కువగా తెలిసిన వారు, వహీ గురించి మంచి రీతిలో తెలిసిన వారు అని ఏదైతే అన్నారో అలా ఎందుకన్నారో తెలుసా? ఆ విషయం తెలిస్తే ఈ రోజుల్లో మన మధ్యలో కొంతమంది పుట్టుకొచ్చారు. “తెలుగులో ఖురాన్ సంపూర్ణంగా ఉంది. ఎందరో దీనికి అనువాదాలు చేశారు. ఇక మనకు ఖురాన్ సరిపోతుంది, హదీస్ అవసరం లేదు” అని కొందరు అంటున్నారు. మరికొందరు అంటున్నారు, “ఖురాన్ కు అనుకూలంగా ఉన్నటువంటి హదీసులను మాత్రమే తీసుకోవాలి” అని. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవారు వాస్తవానికి అటు హదీస్ ను తిరస్కరించారు, హదీస్ ను తిరస్కరిస్తే ఇక ఖురాన్ పై కూడా వారి విశ్వాసం లేనట్లే.
కొత్తగా కొందరు సోదరులు తెలిపిన విషయం ఏంటంటే, దీని కారణంగా ఇప్పుడు ఏమంటున్నారు? ఖురాన్లో ఎక్కడా కూడా పురుషులపై పట్టు వస్త్రాలు నిషిద్ధమని చెప్పబడలేదు. బంగారం పురుషుల కొరకు నిషిద్ధమని చెప్పబడలేదు. ఖురాన్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు, అందుకొరకు వారు బంగారం వేసుకోవచ్చు, పట్టు వస్త్రాలు ధరించవచ్చు. మరొకతను ఖురాన్ యొక్క ఆధారం మీద మొన్న మిడతల దండు ఏదైతే వచ్చిందో దానిని ప్రస్తావిస్తూ ఒక వీడియో చేసి ఏమంటున్నాడు? మిడతలు తినాలి అని ఖురాన్లో ఎక్కడా కూడా లేదు, అందుకొరకు అవి తినకూడదు.
ఇలాంటి మూర్ఖత్వపు మాటలు, ఇలాంటి అజ్ఞాన మాటలు యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మాట్లాడేవారు వాస్తవానికి ఖురాన్, హదీస్ ను మన్ హజె సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోలేదు. ఎలాగైతే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు ఆ ఖారిజీ వాళ్ళతో చెప్పారో, సహాబాలు మీకంటే ఎక్కువగా వహీని, ఖురాన్ ను అర్థం చేసుకున్న వారు, ప్రవక్త మాటల్ని అర్థం చేసుకున్న వారు.
అలా ఎందుకు చెప్పారో తెలుసా? విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ ఖారిజీ వాళ్ళు తమ యొక్క పప్పు ఉడకలేదు, ముస్లింల మధ్యలో, సహాబాల మధ్యలో ఏదైతే వారు ఒక సంక్షోభం, అలజడి, పెద్ద వివాదం ఇంకా పెరుగుతూ పోవాలి అని కోరుతూ ఉన్నారో, అది సమసిపోయింది, అల్హందులిల్లాహ్. అప్పుడు సహాబాలు అన్నారు, ఈ చిన్నపాటి గొడవ ఏదైతే జరిగిందో, ఆ గొడవను మనం సమాప్తం చేయడానికి ఖురాన్ ప్రకారంగా మన మధ్య తీర్పు కొరకు మనం ముందుకు వద్దాము. అయితే ఖురాన్ ప్రకారంగా మనం తీర్పుకు ముందుకు వద్దాము అని అన్న తర్వాత అక్కడ కత్తులన్నీ కూడా కిందకి దిగిపోయాయి. ఖురాన్ మాటను విన్న వెంటనే అందరూ ఆ గొడవను, కొట్లాటను, ఆ యుద్ధాన్ని సమాప్తం చేసి సైలెంట్ గా ఉండిపోయారు.
ఇక ఖురాన్ ప్రకారంగా తీర్పు కొరకు ఒక ఇద్దరు ఇరువైపుల నుండి ముందుకు వచ్చారు. ఆ సందర్భంలో ఈ ఖారిజీ వాళ్ళు నవూదు బిల్లాహ్ చూడడానికి ఖురాన్ వారు చదువుతున్నారు, ఏమన్నారు? మీరన్నారు ఖురాన్ ప్రకారంగా తీర్పు చేద్దాము అని, ఈ ఇద్దరు మనుషులు ఎందుకు ముందుకు వచ్చారు తీర్పు చేయడానికి? “వ మన్ లమ్ యహ్ కుమ్ బిమా అన్ జలల్లాహు ఫ ఉలాయిక హుముల్ కాఫిరూన్”. ఎవరైతే ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయరో, అల్లాహ్ అవతరించిన దాని ప్రకారంగా తీర్పు చేయరో, వారు కాఫిర్లు. మేము ఈ మనుషుల మాటలను, ఈ మనుషుల తీర్పులను మేము నమ్మము, తిరస్కరించము అని ఏం చేశారు? ఖురాన్ ఆయత్ చదివేశారు. కానీ చూడడానికి ఖురాన్ ఆయత్ ఏదైతే చదివారో, దాని యొక్క భావం అదేనా? కాదు. ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయడం అని అంటే ఖురాన్ ను మధ్యలో తీసుకొస్తే ఖురాన్ స్వయంగా మాట్లాడదు. ఖురాన్ ప్రకారంగా తీర్పు చేయడం అంటే ఉదాహరణకు మనమిద్దరం ఏదైనా విషయంలో విభేదించుకున్నాము. నా మాట, మీ మాట ఒక జ్ఞానవంతుని ముందు పెట్టేది ఉంటే అతడు మన ఇద్దరి మాట విన్న తర్వాత ఖురాన్, హదీసులో ఏముందో దాని ప్రకారంగా తీర్పు చేసి న్యాయం ఎటువైపున ఉందో అది పరిష్కరిస్తాడు. ఖురాన్ నుండి ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు సాక్ష్యం కూడా ఇచ్చారు. “యహ్ కుము బిహి దవా అద్లిమ్ మిన్ కుమ్” సూరతుల్ మాయిదాలో.
ఈ విధంగా వారు చూడడానికి ఖురాన్ ఆయత్ చదివేశారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకోవాలంటే తప్పకుండా మనం సహాబాలు ఎలా అర్థం చేసుకున్నారో, మన్ హజె సలఫ్ ఏమిటో అందులో తెలుసుకోవడం తప్పనిసరి.
ఒక ఉదాహరణ ఇచ్చి, ఎందుకంటే ఉదాహరణల ద్వారా విషయం మనకు చాలా స్పష్టమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సూరతుల్ అన్’ఆంలో ఆయత్ అవతరించింది. ఏమని?
الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ “అల్లదీన ఆమనూ వ లమ్ యల్ బిసూ ఈమానహుమ్ బి జుల్మిన్ ఉలాయిక లహుముల్ అమ్ ను వ హుమ్ ముహ్ తదూన్”. ఎవరైతే విశ్వసించారో మరియు తమ విశ్వాసాన్ని జుల్మ్ తో కలుషితం చేయలేదో, అలాంటి వారి కొరకే శాంతి ఉంది, వారే సన్మార్గంపై ఉన్నవారు.
సహాబాలు భయపడిపోయారు. ప్రవక్త వద్దకు వచ్చారు. ప్రవక్తా, అల్లాహు త’ఆలా ఈ ఆయత్ లో విశ్వాసాన్ని జుల్మ్ తో కలుషితం చేయని వారి కొరకే ప్రశాంతత మరియు శాంతి మరియు హిదాయత్ అని అంటున్నాడు. అయితే మాలో ప్రతి ఒక్కడు ఏదో ఒక చిన్నపాటి జుల్మ్ అతనితో జరుగుతూనే ఉంటుంది. ఏదైనా అన్యాయం, దౌర్జన్యం, చిన్నపాటి ఎవరి యొక్క హక్కులో ఏదైనా కొరత అనేది జరుగుతూనే ఉంటుంది కదా. మరి మా యొక్క విశ్వాసం వృధాగానా, మేము అల్లాహ్ యొక్క హిదాయత్ పై లేనట్లేనా, అని బాధపడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చ చెప్పారు. సూరతు లుఖ్మాన్ లోని ఆయత్ ను గుర్తు చేసి ఇక్కడ విశ్వాసంతో పాటు, విశ్వాసంలో జుల్మ్ ను కలుషితం చేయడం అంటే అది షిర్క్ అని చాలా స్పష్టంగా తెలియపరిచారు.
ఇక్కడ కొందరు మూర్ఖులు ఏమంటారో తెలుసా? ఆ విషయం ఖురాన్ లోనే ఉంది అని. కానీ ఖురాన్ లో ఉంది అని ఎలా తెలిసింది? హదీస్ ద్వారా తెలిసింది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రశ్నించారు, అప్పుడు మనకు ఆ విషయం చాలా స్పష్టంగా బోధపడినది.
ఈ రోజుల్లో కొందరు ఖురాన్ ను సహాబాల ప్రకారంగా అర్థం చేసుకునే వారు, హదీస్ యొక్క అవసరం లేదు అని అనేవారు ఖురాన్ లోని ఈ ఆయత్ యొక్క ఆచరణ రూపం ఏం దాలుస్తారో గమనించండి. అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశించాడు.
وَالسَّارِقُ وَالسَّارِقَةُ فَاقْطَعُوا أَيْدِيَهُمَا “వస్సారికు వస్సారిఖతు ఫఖ్త’అ ఐదియహుమా”. దొంగతనం చేసేవాడు పురుషుడైనా, స్త్రీ అయినా వారి యొక్క చేతులను మీరు నరికేసేయండి.
ఇక ఇక్కడ గమనించండి. అల్లాహు త’ఆలా ఖురాన్లో ఏ ఆదేశం ఇచ్చాడు? దొంగతనం చేసే వారు పురుషులైనా, స్త్రీ అయినా వారి చేతులు నరికేయాలి. ఇక్కడ కనీసం రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, ఎంత దొంగతనం చేస్తే చెయ్యి నరకాలి అన్న విషయం, ఆ దొంగతనం యొక్క పరిమాణం ఏంటి? చెయ్యి మణికట్టు వరకా, మోచేతుల వరకా, లేదా ఈ భుజం వరకా?
ఎందుకంటే చెయ్యి అన్న పదం ఏదైతే ఖురాన్లో వచ్చిందో, కొన్ని సందర్భాలలో ఇక్కడి వరకు అని వచ్చింది, మణికట్టు వరకు, ఇంత భాగాన్ని మాత్రమే చెయ్యి అంటారు. మరికొన్ని సందర్భాలలో, ఉదాహరణకు నేను మీకు దాని యొక్క రిఫరెన్స్ ఇవ్వాలంటే కూడా మణికట్టు వరకు ప్రస్తావన తయమ్ముం విషయంలో వచ్చి ఉంది. మోచేతుల వరకు అనేది ఉంటే, ఉదూ యొక్క విషయంలో వచ్చి ఉంది. మరియు సర్వసామాన్యంగా యద్ (చెయ్యి) అని అన్నప్పుడు, మణికట్టు నుండి మొదలుకొని ఈ భుజం వరకు కూడా అవుతుంది. ఎక్కడి వరకు చెయ్యి కట్ చేయాలి? ఎలా తెలుస్తుంది? హదీసుల ద్వారా తెలుస్తుంది. సహాబాలు ఎలా అర్థం చేసుకొని ఆచరించారు అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది.
అందుకే సోదరులారా, సహాబాల ప్రకారంగా, వారు అర్థం చేసుకున్న ప్రకారంగా ఖురాన్, హదీస్ ను అర్థం చేసుకోవడం చాలా అవసరం, చాలా అవసరం, అది లేనిది సన్మార్గంపై ఉండలేము. ఎప్పుడైతే మనిషి తన యొక్క విశ్వాసంలో, నా ఇష్ట ప్రకారంగా నేను విశ్వాసాన్ని అవలంబిస్తాను. ఖురాన్, హదీస్ నేను అర్థం చేసుకొని నా ఇష్ట ప్రకారంగా అవలంబిస్తాను అంటే కూడా అతని విశ్వాసం సరికాదు, ఎప్పటివరకైతే సహాబాల యొక్క మన్హజ్, సలఫె సాలెహీన్ యొక్క మన్హజ్ విశ్వాసంలో ఏముందో దాన్ని తెలుసుకొని పాటించడో.
ఆచరణ మరియు విశ్వాసం యొక్క పరస్పర సంబంధం
కొన్ని సందర్భాలలో మీకు విచిత్రం అనిపిస్తుంది కదా. కానీ వింటే విచిత్రం కావచ్చు. నిజమైన జ్ఞానం ఉండేది ఉంటే, ఖురాన్, హదీస్ యొక్క జ్ఞానం సహాబాల ప్రకారంగా ఉండేది ఉంటే, మన్ హజె సలఫ్ ప్రకారంగా ఉండేది ఉంటే విచిత్రం కాదు. మనం విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం అని అంటాము కదా. సర్వసామాన్యంగా విశ్వాసం మరియు ఆచరణ అని అంటాము కదా. వాస్తవానికి విశ్వాసంలో ఆచరణలన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే ఆచరణ అని అన్నప్పుడు విశ్వాసం అందులో వచ్చేస్తుంది.
ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు, ఎలా తెలుస్తుంది? సహాబాల మన్హజ్ ను అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఖురాన్, హదీసును సహాబాల మన్హజ్ ప్రకారంగా, సలఫ్ మన్హజ్ ప్రకారంగా అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది.
ఇంకా ఆచరణ ఇది ఎంతో ముఖ్యం. కానీ ఇందులో వ్యత్యాసాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, వాటికంటే కొంచెం తక్కువ స్థానంలో ఉన్నాయి. అలాగే విశ్వాసంలో కూడా ఉన్నత శ్రేణికి చెందిన విశ్వాసం మరియు దానికంటే కొంచెం తక్కువ, దానికంటే మరీ కొంచెం తక్కువ, ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? ఖురాన్ హదీథ్ ను సహాబాల ప్రకారంగా, మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోవడం ద్వారా.
అందుకొరకే సోదర మహాశయులారా, మన్హజ్-ఎ-సలఫ్ మన జీవితంలోని ప్రతీ కోణంలో మనకు చాలా అవసరం. మన యొక్క ప్రవర్తనలో కూడా, మన యొక్క లావాదేవీల్లో, మన యొక్క వ్యాపారంలో, మన వైవాహిక జీవితంలో, మన యొక్క ఆచరణ, విశ్వాసం ప్రతీ దానిలో. ఇలా మన్హజ్-ఎ-సలఫ్ ను అనుసరించిన వారి గురించే అల్లాహు త’ఆలా సూరతుత్తౌబా, సూరా నెంబర్ తొమ్మిది, ఆయత్ నెంబర్ వందలో ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నాడో గమనించండి.
وَالسَّابِقُونَ الْأَوَّلُونَ مِنَ الْمُهَاجِرِينَ وَالْأَنصَارِ وَالَّذِينَ اتَّبَعُوهُم بِإِحْسَانٍ رَّضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తరువాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. (9:100)
ఎవరైతే విశ్వాసంలో ముందంజం వేసి, చాలా ముందు ముందుగా ఉన్నారో, ముహాజిరులలోని వారు మరియు అన్సార్లలోని వారు, వారికి శుభవార్తలు అయితే ఉన్నాయో ఉన్నాయి, అనుమానమే లేదు. కానీ వీరి యొక్క మన్హజ్ ను అవలంబించే వారి గురించి అల్లాహు త’ఆలా శుభవార్త ఇస్తున్నాడు. ఇప్పుడు గమనించండి. వల్లదీనత్తబవూహుమ్ బిఇహ్సాన్. తర్వాత ఆయత్ లో ఏ శుభవార్తలు అయితే ఉన్నాయో, అవి కేవలం ముహాజిరీన్ మరియు అన్సార్లకు మాత్రమే కాదు, వల్లదీనత్తబవూహుమ్ బిఇహ్సాన్. ఉత్తమమైన రీతిలో, సంపూర్ణ సంకల్ప శుద్ధితో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సరైన ఇత్తిబాలో (అనుసరణలో) ఎవరైతే ఇత్తబవూహుమ్, ముహాజిరీన్ మరియు అన్సార్ల యొక్క మన్హజ్ ను అనుసరించారో, వారికి కూడా ఏంటి ఆ అనుగ్రహాలు, ఏంటి ఆ శుభవార్తలు? రదియల్లాహు అన్హుమ్ వరదూ అన్హ్. అల్లాహు త’ఆలా పట్ల వారు సంతోషపడ్డారు, అల్లాహ్ వారి పట్ల సంతోషపడి ఉన్నాడు.
సోదర మహాశయులారా, ఖురాన్ లో ఎన్నో ఆయత్ లు ఉన్నాయి. సూరతున్నమల్ లో,
وَسَلَامٌ عَلَىٰ عِبَادِهِ الَّذِينَ اصْطَفَىٰ మరియు ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కలుగుగాక.
ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో, తఫ్సీర్ ఇబ్ను కథీర్ లో వచ్చింది. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు. ఇస్తఫా, ఇబాదిహిల్లదీ నస్తఫా, అల్లాహు త’ఆలా తన దాసులలో ఎన్నుకున్న వారు ఎవరు? సర్వసామాన్యంగా మనం అంటాము అందులో అనుమానమే లేదు, ప్రవక్తలు అని. వాస్తవం. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహు త’ఆలా ఎవరిని ఎన్నుకున్నాడు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, సహాబాలను.
ఈ యొక్క వ్యాఖ్యానం కేవలం ఇబ్ను అబ్బాస్ దే కాదు, మీరు ఒకవేళ ఇబ్ను మస్ఊద్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క మాటలు వీటి గురించి విన్నారు అంటే, ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. అబర్రుహుమ్ ఖులూబా, సహాబాలు అల్లాహు త’ఆలా వారిని ప్రత్యేకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యరికాన్ని, షాగిర్దీ, ఫర్ ఏ గుడ్ స్టూడెంట్స్ ఏదైతే ఎన్నుకున్నాడో, సహాబాలను ఎన్నుకున్నాడు. ఎందుకు? వారిలో అలాంటి గొప్ప గుణాలు, మంచి విషయాలు అల్లాహు త’ఆలా చూసి ఉన్నాడు.
ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒక సందర్భంలో సహాబాల గురించి తెలియజేస్తూ, మీరు ఒకవేళ ఎవరినైనా అనుసరించాలనుకుంటే, మీ కంటే ముందు గతించిపోయిన ఇలాంటి గొప్పవారి గురించి, అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, ఈ విధంగా కొన్ని సందర్భాలలో పేర్లతో చెప్పి ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో పేర్లు కాకుండా.
అబూబకర్ (రదియల్లాహు అన్హు) మరియు రబీఆ (రదియల్లాహు అన్హు)ల సంఘటన
సోదర మహాశయులారా, మన జీవితంలో మనం సహాబాల యొక్క మన్హజ్, సలఫ్-ఎ-సాలిహీన్ యొక్క మన్హజ్ అవలంబించడం చాలా అవసరం.
దీనికి ఒక చిన్న సంఘటన మీరు గమనించండి. ముస్నద్ అహ్మద్ లో ఈ హదీథ్ వచ్చి ఉంది. ఒకసారి రబీఆ. రబీఆ రదియల్లాహు త’ఆలా అన్హు నవ యువకుడు, అతనిలో మరియు హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వీరిద్దరిలో కొన్ని మాటలు జరుగుతూ ఉంటాయి. మదీనాలో జరిగిన సంఘటన ఇది. అబూబకర్ అప్పటికే 55 వయసు దాటేశారు, రబీఆ ఇంకా నవ యువకుడు. ఇద్దరిలో మాట జరుగుతూ జరుగుతూ, అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ద్వారా ఏదో ఒక మాట వెళ్ళింది.
గమనించండి, ఇంకా అక్కడే ఉన్నారు, ఆ సమావేశాన్ని, ఆ సభను, ఆ స్థలం నుండి ఇంకా దూరం వెళ్ళలేదు, అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హుకు వెంటనే తెలిసింది నేను రబీఆకు ఇలాంటి మాట అనేశాను అని. అల్లాహ్ ఈ మాటను ఇష్టపడడు అని. వెంటనే అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, రబీఆ, నీవు కూడా వెంటనే ఇలాంటి మాట అని నాతో ప్రతీకారం తీర్చుకో, ప్రళయ దినం నాడు మనం, నేను దీని గురించి అల్లాహ్ వద్ద ప్రశ్నించబడకుండా ఉండడానికి.
రబీఆ ఏమన్నాడు? గఫరల్లాహు లక యా అబా బకర్. అబూబకర్, అల్లాహ్ నిన్ను క్షమించుగాక.
అబూబకర్ అంటున్నారు, సరే కానీ నేను ఏ మాట అయితే నిన్ను అన్నానో, నువ్వు అదే మాట అను, నువ్వు ప్రతీకారం తీసుకున్నట్లు అయిపోతుంది. కానీ రబీఆ అనలేదు. అననందుకు అబూబకర్ కు మరింత కొంచెం కోపం వచ్చింది. కానీ ఏం చేశారు? నేను నీ గురించి ప్రవక్త వద్దకు వెళ్లి షికాయత్ చేస్తాను అని వెళ్లారు. ప్రవక్త వద్దకు బయలుదేరారు.
ఇక్కడ ఏం జరిగింది గమనించండి. రబీఆ అస్లమ్ వంశానికి చెందినవారు, రబీఆ యొక్క జాతి వాళ్ళు, తెగ వాళ్ళు, వారు దగ్గరికి వచ్చి, ఈ పెద్ద మనిషికి ఏమైపోయింది? అతడే తప్పు చేసి, మళ్లీ తిరిగి అతడే షికాయత్ చేయడానికి ప్రవక్త వద్దకు వెళ్తున్నాడా? రబీఆ ఏమన్నాడో గమనించండి. “మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపోండి, నేను కూడా ప్రవక్త వద్దకు వెళ్తున్నాను. అక్కడ ఏదైనా మా ఇద్దరి గురించి మేలే జరుగుతుంది. కానీ మీరు గనక నాకు తోడుగా ఉన్నారు, అబూబకర్ కు వ్యతిరేకంగా ఉన్నారు అని అబూబకర్ కు తెలిసి, అబూబకర్ నారాజ్ అయ్యాడంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిసి, ప్రవక్త నా పట్ల అసంతృప్తి చెందారంటే, అల్లాహు త’ఆలా అసంతృప్తి చెందాడంటే రబీఆ నాశనమైపోతాడు”. వెంటనే రబీఆ కూడా ప్రవక్త వద్దకు చేరుకున్నాడు.
అప్పటికే అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు పూర్తి సంఘటన తెలియజేశారు ప్రవక్త వారికి. రబీఆ చేరుకున్న తర్వాత ప్రవక్త అడుగుతున్నారు, రబీఆ, నీవు ఏమి సమాధానం ఇచ్చావు? రబీఆ చెప్పారు, ప్రవక్తా నేను అన్నాను, గఫరల్లాహు లక యా అబూబకర్. ఓ అబూబకర్, అల్లాహు త’ఆలా నిన్ను క్షమించుగాక. అల్లాహు త’ఆలా నిన్ను మన్నించుగాక. అప్పుడు ప్రవక్త రబీఆను చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకొని చెప్పారు, నీవు చాలా మంచి పని చేసావు. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి అవుగాక. మన పెద్దవారిని గౌరవించే యొక్క అసలైన పద్ధతి ఇది.
ఈ సంఘటన ద్వారా మనకు ఏం తెలుస్తుంది? మన్హజ్-ఎ-సలఫ్ గురించే ప్రసంగం చేస్తూ చేస్తూ ఇది ఎందుకు చెప్పారు? సోదర మహాశయులారా, మన్హజ్-ఎ-సలఫ్ అంటే ఏమిటో తెలుసుకొని వారు, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఎంత ఉందో గమనించని వారు ఇలాంటి ఎన్నో తప్పులకు, లోటుపాట్లకు గురై, ఈ రోజుల్లో కొందరు తమకు తాము ముస్లింలు, తమకు తాము మంచి ప్రసంగాలు చేసేవారు అని, యూట్యూబ్, ఫేస్బుక్ లలో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నవారు, కొన్ని సందర్భాలలో కొందరి సహాబాలనే కించపరుస్తున్నారు. కొన్ని విషయాలలో సహాబాలను కించపరుస్తున్నారు.
సహాబాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు?
إِذَا ذُكِرَ أَصْحَابِي فَأَمْسِكُوا ఇదా దుకిర అస్హాబీ ఫఅమ్సికూ. [నా సహచరుల గురించి ప్రస్తావించబడినప్పుడు, మీరు మౌనంగా ఉండండి.]
నా సహాబాల విషయంలో జోక్యం చేసుకొని, కించపరిచేటువంటి మాటలు జరిగే చోట నుండి మీరు తొలిగిపోండి, దూరమైపోండి. అక్కడ ఆ మాటలను ఖండిస్తే చాలా మంచిది. లేదా అంటే మీరు అక్కడ నుండి దూరమైపోండి.
సహాబాల ద్వారా ఈ ఖురాన్ మనకు చేరింది. సహాబాల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథ్ లు మనకు చేరాయి. సహాబాలను గౌరవించడం, వారు అర్థం చేసుకున్నట్లు ఖురాన్ హదీథ్ లను అర్థం చేసుకొని మనం జీవించడం మన జీవితంలోని ప్రతీ కోణంలో. అందుకొరకే సుమారు 10 నిమిషాల ముందు నేను చెప్పాను, కొన్ని విషయాలు విన్నప్పుడు మనకు చాలా విచిత్రం అనిపిస్తుంది అని. ఒక రెండు ఉదాహరణలు ఇచ్చాను కూడా. ఉదాహరణ గమనించండి.
సహాబాల గురించి మన విశ్వాసం ఎలా ఉండాలి అన్నది కూడా సహాబాల కాలం నుండి ఇప్పటి వరకు ధర్మవేత్తలందరూ కూడా బాబుల్ అఖాయిద్ లో పేర్కొన్నారు. అఖీద-ఎ-వాసితీయలో అక్కడ కూడా మీరు గమనించవచ్చు. అఖీద-ఎ-తహావియాలో ఇమామ్ తహావీ రహమహుల్లాహ్ అలైహ్, దాని యొక్క వ్యాఖ్యానంలో ఇమామ్ ఇబ్ను అబిల్ ఇజ్ అల్ హనఫీ రహమహుల్లాహ్ అలైహ్, ఎంత వివరంగా దీని గురించి చెప్పి ఉన్నారో. మరి ఈ రోజుల్లో కొందరెవరైతే మన్హజ్-ఎ-సలఫ్ గురించే తప్పుడు మాటలు మాట్లాడుతూ, దీనిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారో, వాస్తవానికి ఖురాన్ హదీథ్ ను వారు అర్థం చేసుకోవడం లేదు. పెడమార్గంలో వారు పడిపోతున్నారు అన్నటువంటి విషయం వారు గ్రహించడం లేదు.
మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత, దీని ద్వారా మన యొక్క విశ్వాసం, దీని ద్వారా మన యొక్క ఆచరణ, దీని ద్వారా మన యొక్క ప్రవర్తన, దీని ద్వారా మన యొక్క లావాదేవీలు, దీని ద్వారా మన యొక్క వైవాహిక జీవితం, దీని ద్వారా మన యొక్క వ్యాపారాలు, మన జీవితానికి సంబంధించిన ప్రతీ రంగంలో మేలు, మంచి విషయాలు అనేటివి ఉంటాయి, వాస్తవానికి మన్హజ్-ఎ-సలఫ్ ను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం నడిచామంటే.
మాటిమాటికి మన్హజ్-ఎ-సలఫ్ అంటున్నారు కానీ అది అసలు ఏంటి అని కొందరు అడుగుతున్నారు కావచ్చు. ఈ రోజు నా ప్రసంగం అది కాదు. మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రాధాన్యత, నేను ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నాను. విషయం యొక్క ప్రాముఖ్యత అర్థమైంది అంటే, ఇక తర్వాత రోజుల్లో, తర్వాత క్లాసుల్లో మన్హజ్-ఎ-సలఫ్ యొక్క అఖీదా ఏమిటి, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క, ఇప్పుడు అఖీద-ఎ-వాసితీయ యొక్క పేరు ఏదైతే మీరు విన్నారో నా ప్రసంగం కంటే కొంచెం ముందు, అఖీద-ఎ-వాసితీయలో మీరు చదవండి, మేము ఇంతకు ముందు చదివి ఉన్నాము అల్హందులిల్లాహ్ షేఖ్ ముహమ్మద్ అల్ హమద్ హఫిదహుల్లాహ్ మాకు చదివించారు. అందులో విశ్వాసాలు, ఆచరణలు, పెళ్లిళ్ల విషయాలు, ప్రవర్తనలు అన్నీ ఎలా ఉంటాయి సలఫ్ వద్ద, మనం ఎలా అవలంబించాలి.
ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి చాలా రకాల పాపాలు, చాలా రకాల తప్పిదాలలో, మన సమాజంలో కొందరు ఉన్నారు, సమాజాన్ని వారు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే చాలా మంచిది. అధ్యయనం చేసి ఏం చేస్తున్నారు? వారిలో ప్రబలి ఉన్నటువంటి చెడులను ఖండించడానికి ఉద్యమం లేపుతున్నారు. అల్హందులిల్లాహ్, చాలా మంచి విషయం. ఈ ఉద్యమాలు లేపి స్కూళ్లలో, కాలేజీలలో, సమావేశాలలో, గల్లీ గల్లీలలో తిరిగి ఆ చెడును ఖండించడానికి చాలా కృషి పడుతున్నారు, చేస్తున్నారు. కానీ స్వయంగా వారు ఏ చెడు రూపుమాపడానికి నడుం బిగించారో, ఉద్యమం లేపారో, వారు మన్హజ్-ఎ-సలఫ్ ను అర్థం చేసుకోవడం లేదు గనక, మన్హజ్-ఎ-సలఫ్ గురించి చదివి లేరు గనక, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా చదివి లేరు గనక, ఒకవైపున చూస్తే వారు చాలా మంచి పనులు చేస్తున్నారు అన్నటువంటి కొన్ని ప్రశంసలు వారికి లభిస్తున్నాయి. కానీ మరోవైపున, వారు చేస్తున్నది పరలోకంలో హాజరైనప్పుడు వారికి ఏ పుణ్యం దక్కకుండా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకుంది ఇది? మన్హజ్-ఎ-సలఫ్ ను, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకోకుండా కేవలం సమాజంలో జరుగుతున్న వాటిని అధ్యయనం చేసి, దానికి వ్యతిరేకంగా నడుం కట్టినందుకు.
అందుకొరకే సోదర మహాశయులారా, మన విశ్వాసాలు, మన యొక్క ఆచరణలు, ఆచరణలో దావత్ పనులు, దావత్ లో మంచిని ఆదేశించడం, చెడును ఖండించడం, అన్ని విషయాలలో కూడా మన్హజ్-ఎ-సలఫ్ ను అవలంబించడం తప్పనిసరి.
ఈ రోజుల్లో కొందరేమంటారు? అరే మన పూర్వికులు చెప్పకుంటే, ఖురాన్ లో నాకు కనబడుతుంది కదా, నేను చెప్పకూడదా? అల్లాహు అక్బర్.
كُلُّ خَيْرٍ فِي اتِّبَاعِ مَنْ سَلَفَ، وَكُلُّ شَرٍّ فِي ابْتِدَاعِ مَنْ خَلَفَ కుల్లు ఖైరిన్ ఫీ ఇత్తిబాయి మన్ సలఫ్, వకుల్లు షర్రిన్ ఫీ ఇబ్తిదాయి మన్ ఖలఫ్. [ప్రతి మేలు పూర్వీకులను అనుసరించడంలో ఉంది, ప్రతి చెడు తరువాతి వారి బిద్ అత్ లలో ఉంది.]
అల్లాహు త’ఆలా ఈ ఖురాన్ మనకు అవతరింపజేశాడో, చూడడానికి కాలం పెరుగుతున్నా కొద్దీ సమస్యలు కొన్ని కొత్త కొత్తవిగా ఉన్నాయి అని ఏర్పడతాయి. కానీ గమనించండి, వాటి పరిష్కారానికి మూలాలు డైరెక్ట్ లేకున్నా గానీ, మూలాలు ఖురాన్ హదీథ్ లో తప్పకుండా ఉంటాయి. ఈ విషయం ఎలా తెలుస్తుంది? మన్హజ్-ఎ-సలఫ్ ను అవలంబించడం ద్వారా తెలుస్తుంది.
ఈ రోజుల్లో కొందరు ఇలాంటి పుకార్లు లేపుతున్నారు. “అరే ఈ సమస్య సహాబాల కాలంలో లేదండి, తాబయీన్ల కాలంలో లేదండి, మీకు అక్కడ ఎలాంటి హదీథ్ దొరకదు”. ఇది తప్పు విషయం అని గ్రహించండి. ఏ సమస్య ప్రళయం వరకు తలెత్తినా గానీ దాని కి డైరెక్ట్ గా నీకు, నాకు, మనలాంటి చిన్న విద్యార్థులకు, మనలాంటి అల్ప జ్ఞానులకు దాని గురించి డైరెక్ట్ ఖురాన్ హదీథ్ లో ఏది దొరకకున్నా, అది మన అల్ప, మన యొక్క కొరత జ్ఞానంలో. కానీ వాస్తవానికి తప్పకుండా అక్కడ ఏదైనా రూఢీ ఉంటుంది, అది ఎక్కువ జ్ఞానవంతుల వద్దకు వెళ్లి, మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
అందుకొరకే సోదర మహాశయులారా, ఈ రోజుల్లో ఎన్నో రకాల ఉద్యమాలు ఏవైతే లేస్తున్నాయో, చివరికి ముస్లిమేతరులలో ఇస్లాం యొక్క దావత్ ఇవ్వడానికి ఇక్కడ కూడా చాలా ఘోరమైన ఒక పొరపాటు ఏం జరుగుతుంది? కొందరు చూడడానికి ఉద్దేశం ఇస్లాం యొక్క ప్రచారం. చాలా మంచిది అల్హందులిల్లాహ్. కానీ ప్రచారానికి కొన్ని మార్గాలను, కొన్ని పద్ధతులను ఏవైతే అవలంబిస్తున్నారో, మన్హజ్-ఎ-సలఫ్ కు వ్యతిరేకం ఉండి, వారు ఆ వ్యతిరేకమైన పద్ధతులను ఏవైతే అవలంబిస్తున్నారో, వాటి గురించి ఎంత ప్రచారం చేస్తున్నారంటే, ఈ దావత్ యొక్క పద్ధతులు ఏవైతే ఒక వసీలా, ఒక మాధ్యమం, ఒక సాధనంగా ఉన్నాయో, అసలు ఉద్దేశానికి, ఆ అసలు ఉద్దేశాన్ని వారు మరిచిపోయి, ఇందులో కొట్టుమిట్టాడుతున్నారు మరియు తనలాంటి పని చేసేవారితోని విభేదంలో చాలా లోతుగా వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి ఇది కూడా మన్హజ్-ఎ-సలఫ్ కి వ్యతిరేకమైన విషయం.
అందుకొరకు ఇలాంటి సందర్భాలలో మనం మన్హజ్-ఎ-సలఫ్ ను, మన్హజ్-ఎ-సలఫ్ యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దానిని అవలంబించడం చాలా చాలా అవసరం.
అల్లాహు త’ఆలా మనందరికీ మన్హజ్-ఎ-సలఫ్ ను మరింత లోతుగా అధ్యయనం చేసి, ఖురాన్ హదీథ్ ను మన్హజ్-ఎ-సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకొని ఆచరించి, దాని వైపునకు ఇతరులను ఆహ్వానించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్ వఅహ్సనల్ జజా. వబారకల్లాహు ఫీకుమ్. వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.