హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/pOXV3-6CJEg [20 నిముషాలు]
ఈ ప్రసంగంలో, వక్త హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు తాలా అన్హు) యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వివరిస్తారు. ప్రవక్త సహచరుల జీవితాలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. అబూబక్ర్ (రది అల్లాహు తాలా అన్హు) ఇస్లాం కోసం చేసిన సేవలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన స్థిరత్వం, విశ్వాసం మరియు ఆయన గొప్పతనాన్ని వివరించే వివిధ సంఘటనలు ఇందులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా, వలస ప్రయాణంలో గుహలో ప్రవక్తతో పాటు ఉండటం, తన సంపదనంతా ఇస్లాం కోసం ఖర్చు చేయడం, మరియు ప్రవక్త మరణం తర్వాత సమాజాన్ని ఏకతాటిపై నిలపడంలో ఆయన పోషించిన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఖలీఫాగా ఆయన సాధించిన విజయాలు, మతభ్రష్టులతో పోరాడటం మరియు ఖురాన్‌ను సంకలనం చేయించడం వంటి చారిత్రాత్మక విజయాలను కూడా వక్త వివరించారు.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
نَحْمَدُهُ وَنُصَلّي عَلى رَسُولِهِ الكريم، أما بعد!
నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్.
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా. షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ హఫిజహుల్లాహ్ జామిఅ అల్-గనాంలో ఇచ్చారు, అక్టోబర్ 31, 2025న.
ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందిన వారు. ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్.”
ఈ రోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు. గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు.
మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతలు మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్‌లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ , అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్-ఖురషీ. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, ఆయన పేరు అబ్దుల్లాహ్. తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్-ఖురషీ రదియల్లాహు తాలా అన్హు.
అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు, ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు, ఆయన సత్య ప్రవక్త అని ధ్రువీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ‘అస్-సిద్దీఖ్’ (సత్యవాది) అని వర్ణించారు (బిరుదునిచ్చారు).
సహీహ్ బుఖారీలో (3675) ఒక సంఘటన గమనించండి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఘనతను గ్రహించండి.
أنَّ رسولَ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ صعِدَ أُحدًا وأبو بَكْرٍ وعمرُ وعثمانُ فرجفَ بِهِم فقالَ رسولُ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ: اثبت أُحُدُ فإنَّما عليكَ نبيٌّ وصدِّيقٌ وشَهيدانِ
“ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హుమ్) లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఓ ఉహుద్! స్థిరంగా ఉండు. నీపై ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీద్‌లు (అమరవీరులు) ఉన్నారు.” (బుఖారీ 3675).
ఇస్లాంలో ఆయన సేవలు
ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు. సహాబాలలో అల్లాహ్ వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు (అంటే ప్రవక్త తర్వాత అని భావం). ఆయన ద్వారా హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ జుబైర్, హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సాద్ బిన్ అబీ వక్కాస్ (రదియల్లాహు తాలా అన్హుమ్) వంటి చాలా మంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషర-ఎ-ముబష్షరాలో పరిగణించబడతారు.
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజ్రత్ బిలాల్, హజ్రత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.
ప్రవక్తకు అత్యంత ప్రియమైనవారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హును ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజ్రత్ అమర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను అడిగారు, “ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆయిషా రదియల్లాహు తాలా అన్హా.” హజ్రత్ అమర్ అంటున్నారు, “నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆమె యొక్క తండ్రి” (అంటే హజ్రత్ ఆయిషా యొక్క తండ్రి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు). (సహీహ్ బుఖారీ, 4358).
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సంపదను తమ సొంత సంపద వలే ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పారు:
«إِنَّ أَمَنَّ النَّاسِ عَلَيَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ أَبُو بَكْرٍ، وَلَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيلًا مِنْ أُمَّتِي لاَتَّخَذْتُ أَبَا بَكْرٍ، وَلَكِنْ أُخُوَّةُ الإِسْلاَمِ وَمَوَدَّتُهُ، لاَ يَبْقَيَنَّ فِي المَسْجِدِ بَابٌ إِلَّا سُدَّ، إِلَّا بَابُ أَبِي بَكْرٍ»
“నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబక్ర్. నా ఉమ్మత్‌లో ఒక స్నేహితుడిని (ఖలీల్) చేసుకోవాలని వస్తే, నేను అబూబక్ర్‌ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజ్రత్ అబూబక్ర్ తలుపు తప్ప మస్జిదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి.” (సహీహ్ బుఖారీ 466, సహీహ్ ముస్లిం 2382).
ఈ హదీసు యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?
إِنَّ أَمَنَّ النَّاسِ عَلَىَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ
(ఇన్న అమన్నన్ నాసి అలయ్య ఫీ సుహబతిహీ వ మాలిహీ)
తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ, ‘అమన్’ – హజ్రత్ అబూబక్ర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకుని ఉంటే, (ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, ‘అల్లాహ్ నన్ను ఖలీల్‌గా చేసుకున్నాడు’) ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్‌గా చేసుకుంటే, అబూబక్ర్‌ని చేసుకునేవానిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబక్ర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబక్ర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్-ఎ-నబవీ ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో, మస్జిద్-ఎ-నబవీకి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇళ్లు కూడా ఉండినవి. అయితే, ఆ మస్జిద్ యొక్క మెయిన్, ముఖ ద్వారం, ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్‌లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు.
ఇంకా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు ఘనతలో, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన మాట వినండి. (సహీహ్ బుఖారీ 3685, సహీహ్ ముస్లిం 2389). అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజ్రత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో, అబూబక్ర్, ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమాను ఏదైతే దూషిస్తారో, వారు ఈ లోకంలో అతి చెడ్డవారు మరియు హజ్రత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.
హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు:
إِنِّي كُنْتُ كَثِيرًا أَسْمَعُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «ذَهَبْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَدَخَلْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَخَرَجْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ»
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా చెప్పడం నేను విన్నాను: ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ ప్రవేశించాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ బయలుదేరాము.'” (బుఖారీ 3685, ముస్లిం 2389).
(ఇక్కడ ‘కున్తు అస్మ’ఉ’ అనేది నిరంతరంగా వినేవాడిని అని సూచిస్తుంది). ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో “నేను, అబూబక్ర్, ఉమర్” అని మాటిమాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబక్ర్‌లను, ఉమర్ హజరత్‌లను చాలా ప్రేమించే, గౌరవించేవారు.
సత్కార్యాలలో అగ్రగామి
అల్లాహ్ దాసులారా, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సత్కార్యాలలో మరియు మంచి పనులలో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు.
ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ఇలా అన్నారు, “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ‘ఈ రోజు నేను అబూబక్ర్‌ను అధిగమిస్తాను.’ ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే… నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?’ నేను చెప్పాను, ‘అంతే మిగిల్చాను’ (అంటే సగం). అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హు తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు?’ ఆయన చెప్పారు, ‘వారికి అల్లాహ్‌ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిల్చి వచ్చాను.’ హజ్రత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, ‘«لَا أُسَابِقُكَ إِلَى شَيْءٍ أَبَدً» నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను.’” (అబూ దావూద్, 1678, షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:
إِلَّا تَنْصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا
“మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు.” (తౌబా 9:40).
ఈ ఆయతులో గమనించండి “సానియస్ నైన్” అన్న పదాన్ని, అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి! ఎవరు ఆయన? ఆయనే అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంత గొప్ప బిరుదు, ఘనత! ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి! ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించారు, భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు, తబూక్‌కు ఆయనతో పాటు ప్రయాణించారు, ఆయనతో పాటు హజ్ చేశారు, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశమేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్ చేయించారు. మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు.
అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు (సవ్వామ్), రాత్రుల్లో ఎక్కువ ఆరాధన, నమాజ్ చేసేవారు (ఖవ్వామ్), ప్రజలకు చాలా మేలు చేసేవారు (ముహ్సిన్), అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపపడేవారు, మృదు మనస్కుడు (అవ్వాహ్) [1]. ఆయన చాలా ఎక్కువగా ఏడ్చేవారు (బక్కా).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు జనాజాలో (అంత్యక్రియలకు) హాజరయ్యారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు పేదవాడికి తినిపించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
مَا اجْتَمَعْنَ فِي امْرِئٍ إِلاَّ دَخَلَ الْجَنَّةَ
(మజ్తమ’న ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్నహ్)
ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (సహీహ్ ముస్లిం 1028).
అల్లాహ్, అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు పట్ల సంతోషించు గాక. మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వు గాక. నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు.
أعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ: وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّى (18) وَمَا لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَى (19) إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَى (20) وَلَسَوْفَ يَرْضَى (21)
దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు, (ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు). మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. (లైల్ 92:17-21).
ఈ ఆయతులు అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లాహ్ అవతరింపజేశాడు.
రెండవ ఖుత్బా
الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمدٍ وعلى آله وصحبه أجمعين أما بعد
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
ఓ ముస్లిములారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రజలను ఓదార్చారు, ఆ తర్వాత నిలబడి అల్లాహ్‌ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, “ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్‌ను పూజిస్తున్నారో, నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించడు.” ఆపై హజ్రత్ అబూబక్ర్ ఈ ఆయత్ పఠించారు:
وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ أَفَإِنْ مَاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلَى أَعْقَابِكُمْ وَمَنْ يَنْقَلِبْ عَلَى عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللَّهَ شَيْئًا وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ
“ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు (ఇస్లాం నుంచి) వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి- పోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3:144).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హును వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది.
ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు, మతభ్రష్టులు (ముర్తద్దీన్‌ల)తో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ ప్రతులను జమా చేయించారు.
మరణం
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు హిజ్రీ 13వ సంవత్సరంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా, 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ రెండు సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించు గాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక.
చివరగా, ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శప్రాయులు.
كَانَ السَّلَفُ يُعَلِّمُونَ أَوْلَادَهُمْ حُبَّ أَبِي بَكْرٍ وَعُمَرَ كَمَا يُعَلِّمُونَ السُّورَةَ مِنَ الْقُرْآنِ
“సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్‌ల పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు.” (మువత్తా మాలిక్ 1/255. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్నహ్ వల్ జమాఅహ్ 2325. 7/1313).
అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
Footnotes:
[1] ‘అవ్వాహ్’ అన్న పదంలో ఈ క్రింది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి:
ఎక్కువగా ప్రార్థించేవాడు/ప్రార్థనల్లో మునిగిపోయేవాడు: అల్లాహ్‌ను చాలా ఎక్కువగా స్మరించేవాడు, వినయంతో, దీనంగా ఆయనను ప్రార్థించేవాడు.
ఆయన దయను కోరేవాడు: అల్లాహ్ దయ కోసం తీవ్రంగా కోరుకునేవాడు.
పశ్చాత్తాపపడేవాడు: తన పాపాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడి, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకునేవాడు.
దీనంగా, వినయంగా ఉండేవాడు: అల్లాహ్ పట్ల అమితమైన భయం, గౌరవం కలిగి, వినయంగా ప్రవర్తించేవాడు.
మంచివాడు/దయాగుణం కలవాడు: ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి, వారికి సహాయం చేసేవాడు.
నిట్టూర్చేవాడు: అల్లాహ్ పట్ల తన ప్రేమ, భయం లేదా ఇతరుల పట్ల తన కరుణ వల్ల దీర్ఘంగా నిట్టూర్చేవాడు.
[2] ఖురాన్ సంకలన చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నప్పుడు ఖురాన్ వివిధ పద్ధతులలో వ్రాయబడింది. ఖురాన్ వచనాలు (ఆయత్‌లు) మరియు సూరాలు రాసిన కొన్ని వస్తువులు:
తోలు పత్రాలు (چرم): జంతువుల తోలుపై రాసినవి.
ఎముకలు (كتف): ఒంటె వంటి జంతువుల భుజం ఎముకలు లేదా ఇతర ఎముకలు.
తాటి ఆకులు (سعف النخيل): తాటి చెట్టు ఆకులపై రాసినవి.
రాతి పలకలు (حجارة): సన్నని, చదునైన రాళ్లపై రాసినవి.
కలప పలకలు (ألواح خشبية): చెక్క పలకలపై రాసినవి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత, యమామా యుద్ధంలో చాలా మంది ఖురాన్ హాఫిజ్‌లు (ఖురాన్‌ను కంఠస్థం చేసినవారు) మరణించారు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) అబూబకర్ అస్-సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)కు ఖురాన్‌ను ఒకే గ్రంథంగా సంకలనం చేయాలని సూచించారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ను ఈ పనికి నియమించారు. జైద్, తన బృందంతో కలిసి, పైన పేర్కొన్న వివిధ వస్తువులపై వ్రాయబడిన ఖురాన్ వచనాలను సేకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, కనీసం ఇద్దరు సాక్షులతో ధృవీకరించిన తర్వాత, వాటిని ఒక క్రమంలో సంకలనం చేశారు. ఈ సంకలన పత్రాలను “సుహుఫ్” (పత్రాలు/పేజీలు) అని పిలిచేవారు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42537