జుమా నమాజును వదలడం పాపమా? [ఆడియో, టెక్స్ట్]

[5 నిముషాలు]
https://youtu.be/J8IAEgfxvtk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

జూమా నమాజ్ వదిలివేయడం ఘోరమైన పాపాలలో ఒకటి మరియు కబీరా గునా (పెద్ద పాపం). దీనికి సాధారణ పుణ్యాలు ప్రాయశ్చిత్తం కావు, ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమాను విడిచిపెట్టిన వారి ఇళ్లను తగలబెట్టాలని తీవ్రంగా ఆకాంక్షించారు, ఇది ఈ పాపం యొక్క తీవ్రతను సూచిస్తుంది. సరైన కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా వరుసగా మూడు జూమా నమాజ్‌లను వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని మరియు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారని కూడా ఆయన హెచ్చరించారు.అందువల్ల, ప్రతి ముస్లిం జూమా నమాజ్‌ను తప్పనిసరిగా పాటించాలి మరియు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

జూమా నమాజ్‌ను వదలడం పాపమా?

సోదర మహాశయులారా, ఈ రోజుల్లో మనిషి ప్రాపంచిక జీవితంలో లీనమైపోయి మరియు పరలోకాన్ని మరిచిపోయి, ఐదు పూటల నమాజ్‌లను విలువ లేకుండా, ఎలాంటి భయం లేకుండా వదిలేస్తున్నాడంటే, జూమా నమాజ్‌లను కూడా ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు.

అయితే, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం, రెండు హదీసులను మీకు వినిపిస్తాను. దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్క రోజు కూడా జూమా వదలకుండా ఉండడానికి జాగ్రత్త పడండి.

ఒక విషయం ఏంటి? సోదర మహాశయులారా, జూమా నమాజ్‌ను వదలడం చిన్న పాపం కాదు. సరైన కారణం లేకుండా జూమా నమాజ్‌ను వదలడం ఘోరమైన పాపాల్లో ఒకటి, ‘కబీరా గునా’ అని ఏదైతే అంటారో. మరియు సామాన్యంగా ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా మనకు ఏం తెలుస్తుంది?

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ
(ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్‌హౌన అన్‌హు నుకఫ్ఫిర్ అన్‌కుం సయ్యిఆతికుమ్)
మీకు నిషేధించబడిన ఘోరమైన పాపాలను మీరు వదిలివేస్తే, మేము మీ చెడులను మీ నుండి తొలగిస్తాము.

ఇంకా వేరే ఇలాంటి ఆయతులు ఈ భావంలో హదీసులు ఉన్నాయి. అంటే ఈ కబీరా గునా, ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు. దాని గురించి ప్రత్యేకమైన తౌబా (పశ్చిత్తాపం) అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా? అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు. అందు గురించి భయపడండి.

అంతేకాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జూమా నమాజ్‌కు ఎంత గొప్ప విలువ ఇచ్చారో గమనించండి. సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్, హదీస్ నెంబర్ 652.

హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

قَالَ لِقَوْمٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ: لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ رَجُلاً يُصَلِّي بِالنَّاسِ، ثُمَّ أُحَرِّقَ عَلَى رِجَالٍ يَتَخَلَّفُونَ عَنِ الْجُمُعَةِ بُيُوتَهُمْ.
(ఖాల లిఖౌమిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి: లఖద్ హమమ్తు అన్ ఆముర రజులన్ యుసల్లీ బిన్నాసి, సుమ్మ ఉహర్రిక అలా రిజాలిన్ యతఖల్లఫూన అనిల్-జుముఅతి బుయూతహుమ్)

జూమా నమాజ్ నుండి వెనుక ఉండిపోయే ప్రజల గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజలకు నమాజ్ చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి, ఆ తర్వాత జూమాకు రాకుండా తమ ఇళ్లలో ఉండిపోయిన వారి ఇళ్లను తగలబెట్టాలని నేను నిశ్చయించుకున్నాను.”

వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది. కానీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా చేయలేదు. సోదర మహాశయులారా, ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని, వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే, ఈ పాపం చిన్న పాపమా సోదరులారా?

మరొక హదీసును విన్నారంటే, ఇంకా భయకంపితలు అయిపోవాలి. జుమా ఇక ఎన్నడూ వదలకుండా ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి. ఈ హదీస్ కూడా సహీ ముస్లింలో ఉంది, హదీస్ నెంబర్ 865.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు. ఏం చెప్పారు ప్రవక్త?

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ.
(లయన్‌తహియన్న అఖ్వామున్ అన్ వద్ఇహిముల్-జుముఆతి, అవ్ లయఖ్తిమన్నల్లాహు అలా ఖులూబిహిమ్, సుమ్మ లయకూనున్న మినల్-గాఫిలీన్)

“ప్రజలు జూమా నమాజ్‌లను వదిలివేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేస్తాడు, అప్పుడు వారు ఏమరుపాటులో పడినవారిలో కలిసిపోతారు.”

ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏమరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు. అల్లాహ్ ఇలాంటి వారి నుండి మనల్ని కాపాడుగాక. ఖురాన్‌లో ‘గఫ్లా’ (ఏమరుపాటు), ‘గాఫిలీన్’ (ఏమరుపాటులో పడినవారు) అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి, దాని అనువాదం, దాని వెనకా ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి.

జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి. ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో: ఒకటి, అల్లాహ్ ముద్ర వేసేస్తాడు. రెండవది, ఏమరుపాటిలో గురి అయిన వారిలో మనం కలిసిపోతామంటే, భయంకరమైన శిక్ష కాదా?

అల్లాహు తఆలా మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక. ఇకనైనా భయపడండి. ఇన్ని రోజుల జీవితం ఇహలోకంలో. అల్లాహ్ యొక్క ఆదేశాల ప్రకారం జీవితం గడిపి, మనం భక్తుల్లో, నరకం నుండి ముక్తి పొందే వారిలో, సత్పురుషుల్లో చేరే ప్రయత్నం చేద్దాము.

అల్లాహ్ మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక. వ ఆఖిరు దావాన అనిల్-హందులిల్లాహ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/