సలాతుల్ రగాయిబ్ (రగాయిబ్ నమాజ్ ) – రజబ్ మాసంలో ఒక బిద్అత్

రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.

‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.

ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :

1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)

ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)

అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:

ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)

2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)

3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)

4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)

5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.

6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)

వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)

నుండి : జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

రజబ్ మాసపు క్రొత్త పోకడ (బిద్అత్)లు – జాదుల్ ఖతీబ్ [ఖుత్బా]

[డౌన్ లోడ్ PDF]

1) రజబ్ మాసం నిషేధిత మాసాల్లో ఒకటి
2) రజబ్ మాసంలోని కొన్ని బిద్అత్ (కొత్తపోకడ)లు
3) సలాతుల్ రగాయిబ్

4) రజబ్ మాసంలో ప్రత్యేక ఉపవాసాలు
5) రజబ్ మాసపు 27వ రాత్రి ఆరాధన లేదా మరుసటి దినపు ఉపవాసం
6) రజబ్ మాసంలో ఉమ్రా చేయడం ఉత్తమమా?
7) రజబ్ కే కుండే (రజబ్ మాసపు నైవేద్య వంటకాలు)

ఇస్లామీయ సోదరులారా! నిషేధిత నాలుగు మాసాల్లో రజబ్ మాసం కూడా ఒకటి.

అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ ۚ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)

అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.

ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?

దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)

ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.

ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.

దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.

ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)

అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.