మొదటి ఖుత్బా
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [آل عمران 102]. يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا [النساء 102]. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا * يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا [الأحزاب 70، 71].
స్తోత్రములు మరియు దరూద్ తరువాత:
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.
అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి: అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం, ఆయన రుబూబియత్[2] పై విశ్వాసం, ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం. ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.
ఈ ఖుత్బాలో మనం అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం గురించి చర్చించుకుందాం.
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం అంటే ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే రబ్ అని, ఆయనకు సహవర్ధులు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరని విశ్వసించటం. రబ్ అంటే: ఆయనకు సృష్టించే శక్తి ఉంటుంది, ఆయనే ప్రతీ దానికి యజమాని, ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుతుంది అంటే ఆయన ఆజ్ఞతో విశ్వ వ్యవహారాలు నిర్వహించ బడతాయి. ఆయన తప్ప మరో సృష్టికర్త లేడు, ఆయన తప్ప మరో యజమాని లేడు, ఆయన తప్ప ఆజ్ఞాపించేవాడు మరొకడు లేడు. సృష్టించడంలో తానే అద్వితీయుడు అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ
(వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
ఇంకా ఇలా అన్నాడు:
بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(భూమ్యాకాశాలను ప్రప్రథమంగా సృష్టించినవాడు ఆయనే.) (బఖర:117)
ఇంకా ఇలా సెలవిచ్చాడు:
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్కే శోభిస్తాయి.) (ఫాతిర్:1)
ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా సృష్టించిన పూర్తి సృష్టిలో అన్నింటి కంటే గొప్పవి ఈ పది సృష్టితాలు: ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, మానవుడు, జంతువులు, వర్షము మరియు గాలులు. అల్లాహు తఆలా దివ్య ఖుర్ఆన్ లో అనేక చోట్ల తమ సృష్టి గురించి ప్రస్తావిస్తూ తమను తాము పొగుడుకున్నాడు, ప్రత్యేకంగా కొన్ని సూరాల ప్రారంభ ఆయతుల్లో. ఉదా: సూరతుల్ జాసియా లో ఇలా సెలవిచ్చాడు:
حم (1) تَنْزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ (2) إِنَّ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ لَآيَاتٍ لِلْمُؤْمِنِينَ (3) وَفِي خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِنْ دَابَّةٍ آيَاتٌ لِقَوْمٍ يُوقِنُونَ (4) وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنْزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِنْ رِزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِقَوْمٍ يَعْقِلُونَ (5)
(హామీమ్ * ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనా పరుడైన అల్లాహ్ తరఫున జరిగింది * నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి * రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.) (జాసియా:1-5).
యాజమాన్యంలో అల్లాహ్ ఏకైకుడని చెప్పడానికి గల ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ فِي الْمُلْكِ وَلَمْ يَكُنْ لَهُ وَلِيٌّ مِنَ الذُّلِّ وَكَبِّرْهُ تَكْبِيرًا (الإسراء 111)
(ఇంకా ఇలా చెప్పు: ”ప్రశంసలన్నీ అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.”) (ఇస్రా:111)
ఇంకా ఈ ఆయతు కూడా దీనికి ఆధారం:
ذَلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ وَالَّذِينَ تَدْعُونَ مِنْ دُونِهِ مَا يَمْلِكُونَ مِنْ قِطْمِيرٍ
(ఈ అల్లాహ్యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.) (ఫాతిర్:13)
ఆజ్ఞాపించటంలో (మరియు విశ్వ వ్యవహారంలో) అల్లాహ్ ఒక్కడేనని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము.
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ
(వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
మరో ఆధారం:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
(మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది). (నహ్ల్:40)
మరో ఆధారం:
وَإِلَيْهِ يُرْجَعُ الْأَمْرُ كُلُّهُ
(సమస్త వ్యవహారాలూ ఆయన వైపుకే మరలించబడతాయి.) (హూద్ :123)
ఓ ముస్లిములారా! ఆజ్ఞలు రెండు రకాలు: 1. షరీఅత్ పరమైన ఆజ్ఞ. 2. విశ్వపరమైన ఆజ్ఞ. షరీఅత్ ఆజ్ఞల సంబంధం ధర్మశాస్త్రం మరియు ప్రవక్త తత్వాలతో ఉంటుంది. అయితే ఆ అల్లాహ్ ఒక్కడే తన వివేకముతో అవసరాలానుసారం ధార్మిక నియమ నిబంధనాలపై ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఇస్తాడు, రద్దు చేయాల్సినవి రద్దు చేస్తాడు. ఆయనే మానవులకు వారి పరిస్థితులను సరిదిద్దే విధంగా తగిన షరీఅతును నియమించాడు మరియు ఆయన వద్ద స్వీకరించబడే ఆరాధనలను, ఆచరణలను చట్టబద్ధమైనవిగా చేసాడు. ఎందుకంటే ఆయనకు మానవుల పరిస్థితులు, వారి వ్యవహారాల గురించి తెలుసు మరియు ఆయన వారి పై కరుణించే కరుణామయుడు కూడాను.
అల్లాహ్ ఆజ్ఞ యొక్క రెండవ రకం విశ్వానికి సంబంధించినది. దీని సంబంధం విశ్వపరమైన వ్యవహారాలతో ఉంటుంది. కనుక మేఘాల కదలిక, వర్షాలు కురవడం, జీవన్మరణాలు, ఉపాధి మరియు సృష్టి, భూకంపాలు, ఆపదల తొలగింపు, విశ్వ సమాప్తం లాంటి అన్ని వ్యవహారాల ఆజ్ఞలు ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. అందుకనే ఈ వ్యవహారాలలో అల్లాహ్ ఏ ఆజ్ఞ ఇచ్చినా అది జరిగే తీరుతుంది. దాని పై ఎవరూ ఆధిపత్యం పొందలేరు, దానిని ఎవరు తప్పించలేరు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ
(మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.) (నహ్ల్:40)
ఇంకో చోట ఇలా సెలవిస్తున్నాడు:
وَمَا أَمْرُنَا إِلَّا وَاحِدَةٌ كَلَمْحٍ بِالْبَصَرِ
(మా ఆజ్ఞ ఒక్కటి చాలు, (అది అమల్లోకి రావటం అనేది) రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది.) (ఖమర్:50)
అంటే ఏదైనా మేము జరపాలని అనుకుంటే కేవలం ఒకే ఒక్క మాట అంటాము, అదే: ‘కున్’ (అయిపో), అప్పుడు అది రెప్పపాటు సమయంలో జరిగిపోతుంది. అది జరగడానికి రెప్ప పాటు కూడా అలస్యం జరగదు.
సారాంశం ఏమిటంటే ఆజ్ఞలు రెండురకాలు: 1. విశ్వపరమైన ఆజ్ఞలు 2. ధర్మపరమైన ఆజ్ఞలు. దాని ప్రకారంగానే ప్రళయదినాన లెక్క తీసుకోవటం జరుగుతుంది.
బారకల్లాహు లీ వలకుమ్ ఫిల్ ఖుర్ఆనిల్ అజీం, వనఫఅనీ వఇయ్యాకుం బిమా ఫీహి మినల్ ఆయాతి వజ్జిక్రిల్ హకీం, అఖూలు ఖౌలీ హాజా, వఅస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ ఫస్తగ్ఫిరూహ్, ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తర్వాత:
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండండి.
ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ను తిరస్కరించే వారు కూడా ఉన్నారా? అంటే లేరు, కానీ గర్వం ఎవరి తలకెక్కిందో వారు తిరస్కరిస్తారు కాని నిజమైన నమ్మకంతో కాదు. ఉదాహరణకు ఫిరాఔన్ తమ జాతి వారితో ఇలా అన్నాడు :
أَنَا رَبُّكُمُ الْأَعْلَى
(”నేనే మీ సర్వోన్నత ప్రభువును”) (నాజిఆత్: 24)
ఇంకా ఇలా అన్నాడు :
يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُمْ مِنْ إِلَهٍ غَيْرِي
(“ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు.) (అల్ ఖసస్:38)
కానీ వాడు తన విశ్వాసం వలన ఇలా అనలేదు గర్వం, దౌర్జన్యం చేసే తత్వం వలన ఇలా అన్నాడు. అల్లాహ్ ఆదేశం చదవండి:
وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا
(నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు.) (నమ్ల్:14)
అల్లాహ్ మీపై కరుణించుగాక! తెలుసుకోండి! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోని అవిశ్వాసులు అల్లాహ్ యొక్క రుబూబియత్ను నమ్మేవారు. అంటే అల్లాహ్ యే సృష్టికర్త, ఉపాధి ప్రధాత, ఈ విశ్వాన్ని నడిపేవాడని విశ్వసించేవారు. అయినప్పటికీ వారు తమ ఆరాధనలో అల్లాహ్ తో పాటు విగ్రహాలను భాగస్వాములుగా చేసేవారు, వారి కోసం రకరకాల ఆరాధనలు చేసేవారు. ఉదా: దుఆ చేయడం, జంతుబలి ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించటం మరియు సాష్టాంగ పడటం మొదలుగునవి. అందుకనే వారు తిరస్కారులు, అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ను విశ్వసించినా వారికి ఎటువంటి లాభము చేకూరలేదు. ఎందుకంటే వారు తౌహీదె రుబూబియత్ను నమ్మడం వల్ల ఏ బాధ్యతలు ఉంటాయో వాటిని నమ్మలేదు; అదే తౌహీదే ఉలూహియత్. సర్వ ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని విశ్వసించకుండా కేవలం రుబూబియత్ పై విశ్వాసం ఇస్లాంలో చేరడానికి సరిపోదు.
ప్రవక్త కాలంనాటి ముష్రికులు తౌహీదె రుబూబియత్ను మాత్రమే నమ్మేవారని అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలిపాడు:
قُلْ لِمَنِ الْأَرْضُ وَمَنْ فِيهَا إِنْ كُنْتُمْ تَعْلَمُونَ (84) سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَذَكَّرُونَ (85) قُلْ مَنْ رَبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ (86) سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَتَّقُونَ (87) قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ (88) سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّى تُسْحَرُونَ (89)
(“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. “సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు. “అల్లాహ్యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో – ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.) (మూమినూన్:84-89)
అల్లాహ్ మీపై కరుణించుగాక!, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు:
إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا (56)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అహ్ జాబ్:56).
అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ అలా అబ్దిక వరసూలిక ముహమ్మద్, వర్ జ అన్ అస్ హాబిహిల్ ఖులఫా, వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ వల్ ముస్లిమీన్, వఅజిల్లష్ షిర్క వల్ ముష్రికీన్, వదమ్మిర్ అఅదాఅక అఅదాఇద్దీన్, వన్సుర్ ఇబాదకల్ మువహ్హిదీన్.
ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُون وَسَلَامٌ عَلَى الْمُرْسَلِين وَالْحَمْدُ للهِ رَبِّ الْعَالَمِين
Footnotes:
[1] ‘సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు.
[2] రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం).
[3] ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్