నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు | హదీసు కిరణాలు [ఆడియో]

ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు
https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

9. హజ్రత్‌ అబూబక్రహ్‌ నుఫైబిన్‌ హారిస్‌ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :

“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – హదీసు కిరణాలు [ఆడియో]

అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్
https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రియాదుస్ సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – హదీసు 11

[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్‌ అబుల్‌ అబ్బాస్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ బిన్‌ అబ్దుల్‌ ముత్తలిబ్‌ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :

“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్‌ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్‌ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్‌ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) – (హదీసు కిరణాలు) [ఆడియో సీరీస్]
https://teluguislam.net/2019/10/19/ikhlas/

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [వీడియో పాఠాలు]

బిస్మిల్లాహ్

పూర్తి పుస్తకం ఇక్కడ చదవవచ్చు
హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)

యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0e89U9Un_2Pz0UCxHKXiS7

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

అధ్యాయాలు

ఆడియో క్లిప్స్

సత్యం – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
నాల్గవ అధ్యాయం : సత్యం
హదీసులు # 54 – 59

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (హదీసు #54, 55) (34:10 నిముషాలు)

భాగం 02 (హదీసు #56-59) (35:23 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సత్యం [PDF]

సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు
హదీసులు # 25 – 52

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సహనం, ఓర్పు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3RjoZaSlju7cCMlRuCMNco

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (ఖుర్’ఆన్ అయతులు)  (29 నిముషాలు)

భాగం 02 (హదీసు #25) (34 నిముషాలు)

భాగం 03 (హదీసు #26,27) (29 నిముషాలు)

భాగం 04 (హదీసు #28,29) (25 నిముషాలు)

భాగం 05 (హదీసు #30) (25 నిముషాలు)

భాగం 06 (హదీసు #31 – 35) (29 నిముషాలు)

భాగం 07 (హదీసు #36 – 40) (25 నిముషాలు)

భాగం 08 (హదీసు #41) (36 నిముషాలు)

భాగం 09 (హదీసు #42,43) (27 నిముషాలు)

భాగం 10 (హదీసు #44) (27 నిముషాలు)

భాగం 11 (హదీసు #45-49) (23 నిముషాలు)

భాగం 12 (హదీసు #50-53) (36:22 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సహనం , ఓర్పు [PDF]