హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)
అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”
బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.
దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.
1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.
2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.
3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).
విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.
4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.
5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”
అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.
కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.
6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.
అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.
అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.
ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.
ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ, అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్

You must be logged in to post a comment.