[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించే వాడు. అతను చేసిన ప్రతి పనీ అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు. ఎన్నడూ స్వార్థంకోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.
ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, “అల్లాహ్! నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను”. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో, “ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు.” అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయీల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.
కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, “మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదలివేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది” అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, “మీ నాన్న గారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాహ్ పై భారం వేసి ఆ ఆవుదూడను వెదుకు” అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, “అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖుబ్ ల ప్రభువా! నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు” అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రానిచ్చేది కాదు.
ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు. సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని మూడు సమానభాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు. ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు. ఒక భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడే వాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు.
వారసుని హత్య
ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కాని అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి సలహా ఇస్తూ, ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా (అలైహిస్సలాం) పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “అల్లాహ్ శరణు! నేను అవివేకంగా వ్యవహరించను” అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు. అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కాని వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు, ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. “ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?” అని అడిగారు. “పసుపు రంగు కలిగినదై ఉండాలి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు. “ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు. కాడి లాగినది కారాదు. నీళ్ళు తోడడానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు” అన్నారు మూసా (అలైహిస్సలాం).
అలాంటి ఆవు కోసం వాళ్ళు వెదుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాధ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తామన్నారు. కాని ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. కాని ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. “నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు.. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను” అన్నాడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, “అంత సొమ్ము ఇవ్వండి.. ఆవు ఎత్తు బంగారం ఇచ్చి అవును తీసుకువెళ్ళండి” అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. (2: 67-74)
గ్రహించవలసిన పాఠాలు
అల్లాహ్, ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని తల్లి పట్ల సేవా భావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునికి అనుగ్రహించాడు. అల్లాహ్ ను విశ్వసించాలని కుమారుడికి బోధించిన ఆ తల్లినీ అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం – దైవవిశ్వాసం విషయంలో ఇస్రాయీల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది.
మరో ముఖ్యమైన పాఠం ఏమంటే, మూసా (అలైహిస్సలాం) వారికి ఒక అవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు. కాని వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కాని అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆ ఆవు చాలా ఖరీదైన ఆవుగా మారింది.
(నీతి: గుచ్చిగుచ్చి అడగడం అన్నది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది)
—
ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/