
పరలోక చింతన (Fikr-e-Akhirat)
https://www.youtube.com/watch?v=H8KcdaHAgEE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు)
ఈ ప్రసంగంలో, వక్త పరలోక చింతన (ఆఖిరత్ కా ఫిక్ర్) యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సూరా అల్-హషర్ మరియు సూరా అల్-హజ్ నుండి ఖురాన్ వచనాలను ఉటంకిస్తూ, విశ్వాసులు రేపటి కోసం (పరలోకం కోసం) ఏమి సిద్ధం చేసుకున్నారో ఆలోచించాలని మరియు అల్లాహ్‌కు భయపడాలని (తఖ్వా) గుర్తుచేస్తారు. తఖ్వా యొక్క నిజమైన అర్ధాన్ని వివరించడానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) మధ్య జరిగిన సంభాషణను ఉదాహరణగా చూపిస్తారు. పాపాలు మరియు ప్రాపంచిక ప్రలోభాలు నిండిన జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడమే తఖ్వా అని వివరిస్తారు. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు ఇస్తూ, వారు ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వివరిస్తారు. ఆధునిక ముస్లింలు ‘వహన్’ (ప్రపంచ ప్రేమ మరియు మరణ భయం) అనే వ్యాధితో బాధపడుతున్నారని, ఇది వారి బలహీనతకు కారణమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకిస్తారు. ఇహలోక జీవితం తాత్కాలికమని, పరలోక జీవితమే శాశ్వతమైనదని మరియు శ్రేష్ఠమైనదని ఖురాన్ మరియు కవిత్వం ద్వారా ప్రసంగాన్ని ముగిస్తారు.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).
అల్హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బஃదా అమ్మా బஃద్. ఫ అఊదు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమదిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహి బిస్మిల్లాహిర్రహ్మా నిర్రహీం.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
(యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)
వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫీ మౌదయిన్ ఆఖర్
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా నీవు సర్వజ్ఞుడవు, వివేచనాపరుడవు.” (2:32)
రబ్బిష్రహ్లీ సద్రీ వ యస్సిర్లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్ దతమ్మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ, అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా.
తొలగింపబడిన షైతానుకు ఎక్కిన రక్షింప ఉందుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శుభ నామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకే అంకితము. ఎవరైతే సమస్త సృష్టిని సృష్టించి, తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచి మరియు వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్య మూర్తి, హృదయాల విజేత, జనాబే ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో, వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్.
పరలోక చింతన మరియు తఖ్వా
సోదరీ సోదర మహాశయులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథములో 59వ సూరా, సూరా అల్-హషర్, వాక్య నెంబర్ 18లో అల్లాహ్ త’ఆలా ఇలా అంటున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
“విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. ప్రతి వ్యక్తీ రేపటి (తీర్పుదినం) కొరకు తానేం పంపుకున్నాడో చూసుకోవాలి. ఎల్ల వేళలా అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా మీరు ఏమేం చేస్తున్నారో అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు.” (59:18)
ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ రెండుసార్లు ‘యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్’ – ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని చెబుతూ, తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ వత్తఖుల్లాహ్ మరియు ప్రతీ వ్యక్తి రేపటి కోసం తాను ఏమి తయారు చేసుకున్నాడో దాని గురించి చూసుకోవాలని చెప్పి, దాని తర్వాత మరొక్కసారి అల్లాహ్ తబారక వ త’ఆలా ఒకే వాక్యంలో రెండుసార్లు ‘ఇత్తఖుల్లాహ్’ అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి, రెండుసార్లు తఖ్వా గురించి ప్రస్తావించడం జరిగింది.
అమీరుల్ మోమినీన్ హజ్రతే ఉమర్ ఫారూఖ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు, “తఖ్వా అంటే ఏమిటి?”. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారిని ప్రశ్నిస్తున్నారు, “ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, అమా సలక్త తరీఖన్ దా షౌకిన్?” ఓ ఉమర్ రది అల్లాహు అన్హు, మీరు మీ జీవితంలో ముళ్ల కంచెలతో నిండి ఉన్నటువంటి ఎక్కడైనా ఒక ఇరుకైనటువంటి మార్గము గుండా మీరు పయనించారా?” అని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారిని అడిగారు. అప్పుడు హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు అన్నారు, “ఖాల బలా”, నేను అటువంటి మార్గంపై నడిచాను. హజ్రతే ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు గారు ప్రశ్నిస్తున్నారు, ఒకవేళ నువ్వు అటువంటి మార్గంపై నడిచినట్లయితే, “ఫమా అమిల్త?” నువ్వు అటువంటి మార్గంపై నడిచినప్పుడు నువ్వు ఏం చేశావు అని చెప్పేసి అంటే, హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “షమ్మర్తు వజ్తహత్తు”, నేను చాలా కష్టపడ్డాను, చాలా జాగ్రత్తగా నా యొక్క వస్త్రాలు, నా యొక్క బట్టలు వాటికి అంటకుండా, ముళ్ల కంచెలకు తగలకుండా నేను చాలా జాగ్రత్తగా దానిలో నుంచి బయటకు వచ్చేసానని హజ్రతే ఉమర్ రది అల్లాహు అన్హు గారు జవాబు పలుకుతున్నారు. ఉబై బిన్ కాబ్ రది అల్లాహు అన్హు వారు అంటున్నారు, “ఫదాలికత్ తఖ్వా”, ఇదే తఖ్వా అంటే.
కాబట్టి సోదర మహాశయులారా, ఇక్కడ ముళ్ల కంచెలు అంటే మన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నటువంటి మహాపాపాలు మరి అదే విధంగా అశ్లీలమైనటువంటి కార్యాలు, మరి ఈ ఇరుకైనటువంటి సందు ఏమిటంటే మన జీవితం సోదరులారా, మరి మన జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి పనులు మరి అదే విధంగా మహాపాప కార్యాల నుండి మనల్ని మనము అదే విధంగా మన యొక్క విశ్వాసాన్ని రక్షించుకుంటూ బయటకు వెళ్లిపోవటమే తఖ్వా.
అల్లాహ్ తబారక వ త’ఆలా సూరా అల్-హషర్ 59వ సూరాలో 18వ వాక్యంలో ఒకే వాక్యంలో రెండుసార్లు ప్రస్తావిస్తున్నాడు: య్యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ – ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు భయపడండి దేని గురించి? వల్ తన్జుర్ నఫ్సుమ్మా ఖద్దమత్ లిగదిన్ – అంటే రేపటి కోసం అంటే మీరు పరలోకం కోసం ఏమి తయారు చేసుకున్నారో ఆ విషయంలో మీరు భయపడండి. మరి దాని తర్వాత అల్లాహ్ తబారక వ త’ఆలా మళ్ళీ అంటున్నాడు: వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ ఖబీరుమ్ బిమా త’మలూన్ – ఈ ఇహలోకంలో మీరు ఏం చేస్తున్నారో అల్లాహ్ తబారక వ త’ఆలా దాని గురించి సమస్తము ఎరిగి ఉన్నాడు, కాబట్టి ఆ విషయంలో కూడా మీరు అల్లాహ్ తబారక వ త’ఆలాకు భయపడండి అని ఇటు ఇహలోకము, అటు పరలోకము, ఈ రెండు విషయాల్లో కూడా ఒకే వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా రెండుసార్లు తఖ్వా కలిగి ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పడం జరిగింది.
సూరా అంబియా, 21వ సూరా, ఒకటో వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా మరోచోట ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ
ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయినప్పటికీ వారు పరధ్యానంలో పడి, విముఖత చూపుతున్నారు. (21:1)
మానవుల యొక్క లెక్కల గడియ సమీపించింది. అయినా వారు పరధ్యానంలో పడి ఉన్నారు అని అల్లాహ్ తబారక వ త’ఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ రెండు వాక్యాల్లో కూడా మనకు పరలోక చింతనను కలుగజేస్తూ, పరలోకం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతగా ఉందో తెలియజేస్తున్నాడు. సోదర మహాశయులారా, ఖురాన్ గ్రంథంలో అతి ముఖ్యంగా ప్రస్తావించబడినటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి, ఈమాన్ బిల్లాహ్ (అల్లాహ్ తబారక వ త’ఆలా పై విశ్వాసము). రెండు, ఈమాన్ బిర్రుసుల్ (ప్రవక్తలపై విశ్వాసము). మరి మూడవది, ఈమాన్ బిల్ ఆఖిరా (అంటే పరలోకంపై విశ్వాసము). ఈరోజు ఏవైతే మీ వాక్యాలు మీ ముందు ప్రస్తావించబడ్డాయో, ఇందులో అల్లాహ్ తబారక వ త’ఆలా పరలోకం గురించి ప్రస్తావిస్తూ, పరలోక చింతన ఏ విధంగా కలిగి ఉండాలో అల్లాహ్ తబారక వ త’ఆలా తెలియజేస్తున్నాడు.
ప్రళయ దినం యొక్క భయంకర దృశ్యం
సూరా అల్-హజ్, 22వ సూరా, మొదటి వాక్యంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ ﴿١﴾ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ ﴿٢﴾
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు. పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:1-2)
అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ వాక్యంలో ఇలా ప్రస్తావిస్తున్నాడు: “యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్” – ఓ మానవులారా, మీ ప్రభువు పట్ల మీరు భయపడండి. “ఇన్న జల్జలతస్సాఅతి షైయున్ అజీమ్” – ఎందుకంటే ప్రళయం రోజు వచ్చేటటువంటి జల్జలా (భూకంపము) అది ఎంతో భయంకరమైనటువంటిది. ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు: “యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్” – ఆ రోజు ఆవరించినప్పుడు పాలిచ్చేటటువంటి ప్రతి స్త్రీ తన చంటిబిడ్డను మరచిపోవటాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. “వతరన్నాస సుకారా వమాహుమ్ బిసుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్” – మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ శిక్షను చూసి, ఆ ప్రళయాన్ని చూసి వారి మతిస్థిమితం పోతుంది అని దైవం ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు.
కాబట్టి సోదర మహాశయులారా, మనిషి జీవితంలో ఇహపరలోకాలలో సాఫల్యం చెందడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశము పరలోక చింత. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేదంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనకాలే నమాజులు చదివేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉపవాసాలు ఉండేటటువంటి వారు, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆజ్ఞాపించగానే జకాత్‌ను చెల్లించేటటువంటి వారు. మరి అదే విధంగా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క మార్గంలో పోరాడడానికి కూడా వారు వెనకాడినటువంటి వారు కాదు.
అయినప్పటికీ కూడా సహాబాలలో పరలోక చింత ఎంతగా ఉండేది అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు: “ఖాల యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇஃదిల్లీ అస్అలుక అన్ కలిమతిన్ ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ.” ఫఖాల నబియ్యుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం “సల్నీ అమ్మా షిஃతా.” హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు అంటున్నారు, ఈ హదీసును ముస్నదే అహ్మద్‌లో ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారు 22,122వ నెంబర్ హదీసులో తీసుకొచ్చారు. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నిస్తున్నారు: “ఓ ప్రవక్తా, నా లోపల ఒక రకమైనటువంటి చింత ఉంది. అది నన్ను లోలోపల నుంచి ఎంతగా తినేస్తుందంటే, ఖద్ అమ్రదత్నీ వ అస్ఖమత్నీ వ అహ్జనత్నీ – నన్ను బాధకు గురిచేస్తుంది, నా లోలోపలే అది తినేస్తుంది.” ఎలాగైతే సోదరులారా, ఒక వ్యక్తి యవ్వనుడైనప్పటికీ కూడా అతని లోపల బాధ గనుక, దుఃఖము గనుక లోలోపల అతన్ని తినివేస్తూ ఉన్నప్పుడు, అతడు ఎంత యవ్వనుడున్నా కూడా ఆ యవ్వనము ఉన్నప్పటికీ కూడా అతని ముఖంపై ముసలి యొక్క కవళికలు కనిపించడం ప్రారంభమవుతాయి. హజ్రతే ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారిని చూసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ ముఆద్, అదేమిటో అడుగు. ఇస్సల్నీ అమ్మా షిஃతా – ఏమిటో అడుగు” అంటే, ముఆద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు సోదర మహాశయులారా అడుగుతున్నారు. ఏమన్నారంటే: “యా నబియ్యల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హద్దిస్నీ బి అమలిన్ యుద్ఖిల్నియల్ జన్నహ్” – ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, స్వర్గములో ఎలా ప్రవేశించాలో ఏదైనా అమలు ఉంటే అది చెప్పండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాద్ బిన్ జబల్ రది అల్లాహు అన్హు గారు ప్రస్తావిస్తున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీగా ధృవీకరించారు.
అయితే సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, సహాబా అనుచరులు, వారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెనక నమాజులు చదువుతూ కూడా, వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ కూడా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎంతో మంది సహాబాలు అడుగుతున్నారు, “దుల్లనీ అలా అమలిన్ ఇదా అమిల్తుహు దఖల్తుల్ జన్నహ్” – ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఆచరణ ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని చేసి నేను స్వర్గంలో ప్రవేశించడానికి. ఏ విధంగా సహాబాలలో పరలోకం అనేటటువంటి చింత ఎంత అధికంగా ఉండేదో మనం ఇక్కడ గమనించగలం.
అంతేకాదు సోదరులారా, హజ్రతే అబూదర్ రిఫారీ రది అల్లాహు అన్హు వారైతే ఆయన అంటున్నారు, నన్ను గనక ఒక వృక్షంగాను అల్లాహ్ తబారక వ త’ఆలా చేసి ఉంటే ఎంత బాగుణ్ణు, ఎవరైనా దాన్ని నరికి వెళ్ళిపోయేటటువంటి వారు, నాకు పరలోకంలో అల్లాహ్ తబారక వ త’ఆలా లేపి నువ్వు ఈ పని ఎందుకు చేశావు అనేటటువంటి అడిగేటటువంటి ప్రసక్తి ఉండేది కాదేమో అని ఈ విధంగా సహాబాలు దుఃఖించేటటువంటి వారు.
ముస్నద్ ఏ అహ్మద్ లో 13,150వ హదీసులో హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారి యొక్క ఉల్లేఖనంలో ఈ హదీస్ వస్తుంది. ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, “సమిஃతున్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు ఫీ బஃది సలాతిహి, అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా.” హజ్రతే ఆయిషా రది అల్లాహు అన్హా వారు అంటున్నారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన చదివేటటువంటి నమాజుల్లో కొన్నింటిలో ఈ విధంగా ప్రార్థించేటటువంటి వారు: “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్యసీరా” – ఓ అల్లాహ్, నా యొక్క లెక్కలను తేలికపాటి లెక్కలుగా నువ్వు తీసుకో. అమ్మా ఆయిషా రది అల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తేలికపాటి లెక్కలంటే ఏమిటి?” అని ఆయిషా రది అల్లాహు అన్హా వారు హజ్రతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు చెబుతూ అంటున్నారు, “ఖాల అయ్ యన్జుర ఫీ కితాబిహి ఫయతజావదు అన్హు.” దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఆయిషా, నువ్వు భలే ప్రశ్నలు వేస్తావే! వాస్తవానికి తేలికపాటి లెక్కలంటే ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలా తన దాసుల యొక్క కర్మపత్రాలను చూసిన తర్వాత వారిని అట్టే విడిచిపెట్టటము లేక వారిని అలాగే క్షమించివేయటము ఇదే తేలికపాటి లెక్కలు. ఎందుకంటే ఆయిషా, ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం ప్రారంభిస్తే, ఆయన ప్రశ్నించేటటువంటి జవాబులు చెప్పేటటువంటి ధైర్యము గానీ లేక జవాబు చెప్పేటటువంటి స్తోమత ఎవరికీ ఉంటుంది? ఒకవేళ అల్లాహ్ తబారక వ త’ఆలా గనక ప్రశ్నించటం మొదలుపెడితే, వివరంగా అడగటం మొదలుపెడితే ఆ వ్యక్తి నాశనమైపోతాడు” అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో ప్రస్తావిస్తున్నారు.
ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎంతగా పరలోకం గురించి చింతన చెందేటటువంటి వారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే సోదర మహాశయులారా, ఒకసారి మన జీవితాల్ని మనం చూసుకున్నట్లయితే, మన జీవితాల్లో మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటి? వాస్తవానికి మనం పరలోక జీవితం గురించి ఆలోచించి మన యొక్క జీవితాన్ని గడుపుతున్నామా? ఇహలోక జీవితంలో పడిపోయి పరలోక జీవితాన్ని మరచి నడుస్తున్నామా? అల్లాహ్ తబారక వ త’ఆలా అందుకనే ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు, “ఇఖ్ తరబలిన్నాసి హిసాబుహుమ్ వహుమ్ ఫీ గఫ్లతిమ్ ముஃరిదూన్” – ప్రజల యొక్క లెక్కల గడియ సమీపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం పరధ్యానంలో పడి ఉన్నారని దైవం అంటున్నాడు.
‘వహన్’ అనే వ్యాధి
అందుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. అబూ దావూద్ లో 4297వ నెంబర్ లో హదీస్ ఈ విధంగా ప్రస్తావించబడింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు: “యూషికుల్ ఉమము అన్ తదాఅ అలైకుమ్ కమా తదాఅల్ అకలతు ఇలా ఖస్అతిహా.” ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్? ఖాల “బల్ అన్తుమ్ యౌమయిదిన్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్. వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్, వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్.” ఫఖాల ఖాయిలున్ “యా రసూలల్లాహ్, వమల్ వహన్?” ఖాల “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్.”
ప్రళయానికి సమీప కాలంలో ముస్లిం సమాజంపై ఇస్లాం వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆ విధంగా విరుచుకొని పడతాయి, ఏ విధంగానైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి జంతువు విరుచుకొని పడుతుందో. అప్పుడు ఒక అతను అడుగుతున్నాడు, “ఫఖాల ఖాయిలున్ వమిన్ ఖిల్లాతిన్నహ్ను యౌమయిదిన్” – ఆ సమయంలో మా యొక్క సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందా? అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లేదు, “బల్ అన్తుమ్ కసీరున్ వలాకిన్నకుమ్ గుసాఅన్ క గుసాయిస్సైల్.” మీరు ఆ సమయంలో అత్యధికంగా ఉంటారు, కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోయి ఉంటారు. ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి నురగ ఉంటుందో. వాస్తవానికి ఇక్కడ ఆలోచించినట్లయితే సోదర మహాశయులారా, ఎవరైనా దాహము, దప్పికతో ఉంటే ఒక గ్లాసు నీళ్లు అతనికి దప్పిక తగ్గడానికి, దాహం తీరడానికి మనం ఇచ్చినట్లయితే అతడు ఆ గ్లాసు నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకోగలడు గానీ అదే గనక మనం అదే గ్లాసులో మనం ఒక గ్లాసు నురగ అతనికి ఇచ్చినట్లయితే ఆ నురగతో అతనికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కలగదు. ఎందుకంటే నీటికి విలువ ఉంది గానీ నురగకు ఆ విలువ ఉండదు. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నీటికి విరుద్ధంగా నురగ మాదిరిగా మీరు మారిపోతారు. మరి అటువంటి సమయంలో ఏమి జరుగుతుంది? “వలయన్ది అన్నల్లాహు మిన్ సుదూరి అదువ్వికుముల్ మహాబత మిన్కుమ్” – మీ యొక్క శత్రువుల యొక్క హృదయాల్లో మీ పట్ల ఉన్నటువంటి భయాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా తొలగిస్తాడు. మరి అదే విధంగా, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – మీ యొక్క హృదయాలలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఆ సమయంలో ఒక రోగాన్ని జనింపజేస్తాడు. ఏమిటండీ ఆ రోగము అంటే, బీపీనా? కాదు సోదరులారా. షుగరా? కాదు సోదరులారా. మరి ఇటువంటి వ్యాధులేమీ కానప్పుడు అది ఏ వ్యాధి అండీ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వింతైనటువంటి పదాన్ని వినియోగించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “వలయఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్” – అదేమిటంటే మీ హృదయాల్లో జనించేటటువంటి వ్యాధి, ఆ వ్యాధి పేరే వహన్. మరి ఈ వ్యాధి వహన్ అన్నటువంటిది అరబ్బులో కూడా సహాబాలు కొత్తగా విన్నారు. సహాబాలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడుగుతున్నారు, “వమల్ వహను యా రసూలల్లాహ్?” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వహన్ అంటే ఏమిటి అని అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “హుబ్బుద్దునియా వకరాహియతుల్ మౌత్” – పరలోక చింత వదిలేసి ఇహలోక వ్యామోహంలో పడిపోవటము ఈ వ్యాధికి ఉన్నటువంటి మొదటి లక్షణము. మరి రెండవ లక్షణం ఏమిటండీ అంటే మరణము అంటే భయము.
అయితే సోదర మహాశయులారా, ఈరోజు మన సమాజంలో మనం చూసుకున్నట్లయితే, మరి మన సమాజం దేని వైపునైతే పరుగెడుతుందో, ఆ పరుగును మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు మన సమాజము ఇహలోకం అన్నటువంటి వ్యామోహంలో కొట్టిమిట్టాడుతుంది. పరలోక ధ్యానాన్ని మరిచిపోయి ఉన్నాము. అల్లాహ్ త’ఆలా సూరతుల్ ఆలాలో ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا ﴿١٦﴾ وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ ﴿١٧﴾
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు.వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది. (87:16-17)
అయినప్పటికీ ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి, సుహుఫి ఇబ్రాహీమ వ మూసా – ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం గారి యొక్క సహీఫాలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, మూసా అలైహిస్సలాతు వస్సలాం గారికి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది, అయినప్పటికీ కూడా మీ పరిస్థితి ఎలా ఉంది అంటే “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా” – మీరు అయినప్పటికీ ఇహలోక జీవితానికే ప్రాధాన్యతనిస్తున్నారే గానీ, పరలోక జీవితం ఎటువంటిది? అల్లాహ్ త’ఆలా అంటున్నాడు, “బల్ తుஃసిరూనల్ హయాతద్దునియా వల్ ఆఖిరతు ఖైరువ్ వ అబ్ఖా.” వాస్తవానికి ఇహలోక జీవితం కన్నా పరలోక జీవితం ఎంతో మేలైనటువంటిది. ఎందుకంటే అది కలకాలం ఉండిపోయేటటువంటిది. ఇహలోక జీవితం అంతమైపోయేటటువంటిది.
అందుకనే సోదర మహాశయులారా, ఒక కవి తెలుగులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
ఇల్లు వాకిలి నాటి ఇల్లాలు నాదనుచు ఎల భ్రమచితివోయి మనసా! కాలూని వలలోన కానేక చిక్కేవు కడచేరుటే త్రోవ మనసా! తనయులు చుట్టాలు తనవారని నమ్మి తలపోయకే వెర్రి మనసా! నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీవెంట రాదేది మనసా!
ఇల్లు, వాకిలి, నీవు కట్టుకున్నటువంటి ఇల్లాలు ఇవన్నీ నీవే అని అనుకుంటున్నావు. కాలూని వలలోన కానేక చిక్కేవు, కడచేరుటే త్రోవ మనసా. బంధుత్వం అన్నటువంటి వలలో చిక్కుకొని పోయావు, మరి ఈ బంధుత్వాన్ని బ్యాలెన్స్ గా చేసుకొని ఇహపరలోకాలలో సాఫల్యం చెందటం అంటే మామూలు విషయం కాదు. నీ తనువు వెళ్ళేడి సమయంబు లోపల నీ వెంట రాదేది మనసా. కానీ నీ తనయులు, చుట్టాలు నీ వారని నమ్ముతున్నావేమో, నువ్వు చచ్చిపోయేటప్పుడు నీతో పాటు వచ్చేది కేవలం నువ్వు చేసుకున్నటువంటి నీ పాపపుణ్యాలు తప్ప మరొకటి ఏమీ రాదు అన్నటువంటి విషయాన్ని ఒక కవి కూడా తెలుగులో ఈ విధంగా చక్కగా తన తెలుగు కవితంలో తెలియజేస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ త’ఆలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు, వాస్తవానికి పరలోక జీవితమే అసలైనటువంటి జీవితము. ఇహలోక జీవితము కేవలం ఒక ఆటవినోదం తప్ప మరేమీ కాదు. ఒక మోసపూరితమైనటువంటి జీవితం తప్ప మరేమీ కాదు అని దైవం ఎన్నో చోట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది.
అల్లాహ్ తబారక వ త’ఆలాతో దువా ఏమనగా, అల్లాహ్ తబారక వ త’ఆలా మనందరికీ కూడా పరలోక చింతనను కలిగి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎప్పటివరకైతే మనం ఇహలోకంలో బ్రతికి ఉంటామో అప్పటివరకు కూడా అల్లాహ్ తబారక వ త’ఆలాను ఆరాధిస్తూ బ్రతికి ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరియు ఎప్పుడైతే మనం మరణిస్తామో అల్లాహ్ తబారక వ త’ఆలా వైపునకు విశ్వాస స్థితిలోనే అల్లాహ్ వైపునకు మరలేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنتَ التَّوَّابُ الرَّحِيمُ
(రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్సమీయుల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్తవ్వాబుర్రహీమ్)
سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
You must be logged in to post a comment.