ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ta7KklHK6V0 [19 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాం అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు శ్రేష్ఠత గురించి 10 ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఇస్లాం అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మరియు ఇష్టపడిన సహజ సిద్ధమైన ధర్మం. ఇది స్వచ్ఛమైన తౌహీద్ (ఏకదైవారాధన) ను బోధిస్తుంది మరియు జ్ఞానం, న్యాయం, సమానత్వం, సులభత్వం, మరియు ఓర్పు వంటి గుణాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ధర్మంలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేస్తుంది మరియు ఇది నైతిక విలువలతో కూడిన ఉత్తమమైన సమాజాన్ని (ఉమ్మతే వసత్) నిర్మిస్తుంది. ఈ అనుగ్రహాలన్నీ ఇస్లాంను ఇతర అనుగ్రహాల కంటే ఉన్నతమైనదిగా నిరూపిస్తాయని వక్త పేర్కొన్నారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతా నిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బ’అద్. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అన్న అంశంపై ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై ఎన్నో అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు. ఆ వరాలలో, ఆ అనుగ్రహాలలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది, దానికి మించినది లేనిది అది ఇస్లాం ధర్మం. దీని గురించి అనేక విషయాలు ఉన్నాయి, కాకపోతే ఈ రోజు మనం 10 విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కొరకు అనుగ్రహించిన ధర్మం, ఇష్టపడిన ధర్మం అన్నమాట. ఈ విషయం అల్లాహ్ సూర ఆలి ఇమ్రాన్ లో ఇలా తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
(ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం)
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. (3:19)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వమయ్ యబతగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలయ్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్)
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా ఆయత్ మూడులో ఇలా సెలవిచ్చాడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను(5:3)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత స్పష్టంగా ఇస్లాం మీ కొరకు ధర్మంగా ఎన్నుకున్నాను, మీ కొరకు దీనిని పరిపూర్ణం చేశాను, దీనిని ,అంటే ఇస్లాంని అల్లాహ్ ఏమన్నాడు? నా అనుగ్రహం అంటున్నాడు. ‘ని’మతీ’, నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. ఇది మొదటి విషయం. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కోసం అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం ఇస్లాం ధర్మం.

ఇక రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన ధర్మం. సహజ సిద్ధమైన, స్వాభావిక ధర్మం. ఇది ప్రత్యేకత ఇది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర రూమ్, ఆయత్ 30లో ఇలా సెలవిచ్చాడు:

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు. (30:30)

ఈ ఆయత్ లో ‘ఫితర‘ అని ఉంది. ఫితరతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా’. ‘ఫితరత్‘ అంటే సహజత్వం లేక నైజం అన్నమాట. వేరే మాటలలో చెప్పాలంటే, అల్లాహ్ మానవుణ్ణి సహజ ధర్మంపై, అంటే దేవుని ఏకత్వంపై, తౌహీద్ స్వభావంపై పుట్టించాడు. కాబట్టి మానవ నైజములోనే ఏకత్వం, తౌహీద్, ఏక దైవ ఆరాధన అంతర్లీనమై ఉంది అన్నమాట. అందుకే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. బుఖారీలో హదీస్ ఉంది:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ
(కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫితర, ఫ అబవాహు యుహవ్విదానిహి అవ్ యునస్సిరానిహి అవ్ యుమజ్జిసానిహి)
ప్రతి బిడ్డ సహజత్వం (ఇస్లాం) తోనే పుడతాడు. అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో చేసేస్తారు.

అంటే ప్రతి బిడ్డ సహజత్వంతోనే పుడతాడు, నైజంతోనే పుడతాడు, సహజత్వంతోనే పుడతాడు, అంటే మువహ్హిద్ గానే పుడతాడు, తౌహీద్ లోనే పుడతాడు. కాకపోతే పెరిగిన కొద్దీ ఆ బిడ్డ యొక్క అమ్మానాన్న అతనికి యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీగానో చేసేస్తారు అన్నమాట. అంటే రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం అన్నమాట.

ఇక మూడవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం. ఖురాన్ లోని సూర ఇఖ్లాస్:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ‎﴿١﴾‏ اللَّهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ‎﴿٤﴾
(ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో మూల సూత్రాలు, సృష్టికర్త అంటే ఎవరు, మూల సూత్రాలు తెలియజేశాడు. అల్లాహ్ ఒకే ఒక్కడు, ఎటువంటి అక్కరా, ఎటువంటి అవసరం లేనివాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. తినటం, త్రాగటం, నిద్రించటం, కునుకు, నిద్ర, అవసరం, సహాయం తీసుకోవటం, ఇలాంటి ప్రపంచములో ప్రతి జీవి, ప్రతి వ్యక్తికి ఇది అవసరం ఉంటుంది. ఎటువంటి అవసరం అక్కర లేకుండా ఏ జీవి ఉండలేదు, జీవించలేదు. కావున సకల లోకాలకు సృష్టికర్త అటువంటి వాడు కాదు. అవసరం లేని వాడు అల్లాహ్, అక్కర లేనివాడు అల్లాహ్. అలాగే ఆయనకి అమ్మానాన్న లేరు, సంతానమూ లేదు. ఆయనకి సమానము ఎవరూ లేరు. ఇంకా మనము ఖురాన్ పరిశీలిస్తే, అల్లాహ్ పుట్టినవాడు కాదు, అల్లాహ్ కి చావు, మరణం రాదు అన్నమాట. ఇది మూడవ విషయం.

ఇక నాలుగవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ‎﴿١﴾‏ خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ‎﴿٢﴾‏ اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ‎﴿٣﴾‏ الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ‎﴿٤﴾‏ عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ‎﴿٥﴾
(ఓ ప్రవక్తా!) సృష్టించిన నీ ప్రభువు పేరుతో చదువు. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞాన బోధ చేశాడు. ఆయన మనిషిని అతడు ఎరుగని, తెలియని దానిని నేర్పించాడు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మొట్టమొదటి సారి వచ్చిన దివ్యవాణి ఇది. అంటే మొదటి దైవవాణి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, విద్య గురించి వచ్చిందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముజాదలలో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ ఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్ లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. (58:11)

మీలో విశ్వసించిన వారిది మొదటి విషయం, రెండవది జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు. అంటే మూడవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞత గల ధర్మం ఇస్లాం ధర్మం. ఇది నాలుగో విషయం.

ఐదవ విషయం ఏమిటంటే, మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం. ఇస్లాం ధర్మం మానవుల మధ్య, జనుల మధ్య, దైవదాసుల మధ్య, సృష్టి మధ్య సమానత్వం కలిగిన ధర్మం, ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ
(వ ఇజా హకమ్తుమ్ బైనన్నాసి అన్ తహ్కుమూ బిల్ అద్ల్)
ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. (4:58)

إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ
(ఇన్నల్లాహ య’మురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి జిల్ ఖుర్బా)
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు.  (16:90)

అంటే ఐదవ విషయం ఏమిటి? మానవుల మధ్య, సృష్టి మధ్య, దైవదాసుల మధ్య పూర్తిగా న్యాయం చేసే ధర్మం ఇస్లాం ధర్మం.

అలాగే ఆరవ విషయం ఏమిటంటే, సులభమైన ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ అంటున్నాడు సూర హజ్ లో:

وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ
(వమా జ’అల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజ్)
ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు (22:78)

మానవ మాత్రులు భరించలేనంతటి కష్టతరమైన, క్లిష్టతరమైన బాధ్యతను అల్లాహ్ మనపై మోపలేదు అన్నమాట. అలాగే అల్లాహ్ సూర బఖరా యొక్క చివరలో ఇలా సెలవిచ్చాడు:

لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا
(లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్’అహా)
అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. (2:286)

అంటే ఇది ఆరవ విషయం, సులభమైన ధర్మం. మనిషి మోయలేని భారం అల్లాహ్ వేయలేదు అన్నమాట.

ఇక ఏడవ విషయం ఏమిటంటే, ఓర్పుని, సహనాన్ని బోధించే ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం ప్రపంచంలో సమస్యలు ఇస్తాడు, మనిషికి సమస్యలు వస్తాయి. రోగాలు వస్తాయి. ఆరోగ్యంతో పాటు అనారోగ్యము ఉంటుంది, లాభంతో పాటు నష్టమూ ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లాహ్ కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వడు. కొందరు ధనవంతులు, కొందరు పేదవారు. ఉన్నవారు, లేనివారు. కానీ ఇదంతా ఎందుకు? పరీక్ష కోసం. కావున సహనాన్ని, ఏ సమయంలో, కష్టంలో, దుఃఖంలో, నష్టంలో, బాధలో సమీప బంధువులు, దగ్గర ఉన్నవారు చనిపోయినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? వ్యాపారంలో నష్టం జరిగింది, ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది, ఇబ్బందుల్లో వచ్చేసాము. కానీ ఇస్లాం ధర్మం సహనం బోధిస్తుంది. ఏ విధంగా? దానికి వివరాలు ఉన్నాయి, నేను వివరం చెప్పటం లేదు. ఖురాన్లో వివరాలు ఉన్నాయి. అల్లాహ్ అంటున్నాడు:

إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు (8:46)

అల్లాహ్ యొక్క సహాయం కోరండి బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకాటాల్లో అల్లాహ్ సహాయం కోరండి. ఏ విధంగా కోరండి? సహనం ద్వారా, నమాజ్ ద్వారా. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అసర్ లో నాలుగు విషయాలు తెలియజేశాడు. ఈ నాలుగు గుణాలు, నాలుగు లక్షణాలు కలిగిన వారు ఇహపర లోకాలలో నష్టపోరు అని. వారిలో ఒకటి ఏమిటి? విశ్వాసం. రెండవది సత్కార్యం. మూడవది హఖ్, సత్యం. నాలుగవది సహనం. కావున ఇస్లాం ధర్మం సహనాన్ని బోధించే ధర్మం.

ఇక ఎనిమిదవ విషయం ఏమిటంటే, ధర్మం విషయంలో బలవంతం చేయదు ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది (2:256)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.(18:29)

అంటే సత్యం మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది, కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్ని సిద్ధం చేసి ఉంచాము. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సత్యం ఏది, అసత్యం ఏది స్పష్టంగా తెలియజేశాడు. బలవంతం చేయడు. ఎటువంటి బలవంతమూ లేదు. మీకు నచ్చితే, మీకు ఇష్టం ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే వదలండి. బలవంతం అనేది లేదు. కాకపోతే మంచి చేసే వారికి ప్రతిఫలం అలాగే ఉంటుంది, చెడు చేసే వారికి ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. అభిమాన సోదరులారా! అంటే ఎనిమిదవ విషయం ఏమిటి? ఇస్లాం ధర్మం ధర్మం విషయంలో బలవంతం చేయదు.

తొమ్మిదవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అంటే ఉమ్మతే ముహమ్మదియా, ఉమ్మతే వసత్. అంటే మెరుగైన, ఉత్తమమైన సమాజం అన్నమాట. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.)(2:143)

అభిమాన సోదరులారా! ఈ ఆయత్ లో ‘వసత్’ అనే పదం వచ్చింది. ‘వసత్’ అనే పదానికి అర్థం మధ్యస్థం, కానీ మెరుగైన, ఉత్తమమైన అని అర్థం కూడా వస్తుంది. ఈ భావములోనే ఇక్కడ ప్రయోగించబడింది. ఉత్తమమైనది, మెరుగైనది అన్నమాట ఇస్లాం ధర్మం.

అభిమాన సోదరులారా! ఇక పదవ విషయం ఏమిటంటే, నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం. ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఖురాన్ లో, ప్రవక్త గారి ప్రవచనాలలో అసంఖ్యాకమైన వచనాలు, వాక్యాలు ఉన్నాయి. నైతికత అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? నడక, నడవడిక, నీతి, నిజాయితీ, సత్యము, న్యాయము, ధర్మము. ఏ విధంగా అమ్మానాన్నతో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలి? జంతువులతో ఎలా ఉండాలి? దారి హక్కు ఏమిటి? శారీరక హక్కు ఏమిటి? జననం నుండి మరణం వరకు నియమాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనకు బోధించారు.

ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ‘అక్సరు మా యుద్ఖిలుల్ జన్నత, తఖ్వల్లాహి వ హుస్నుల్ ఖులుఖ్’. అంటే స్వర్గానికి పోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఎక్కువ మంది, అత్యధికంగా స్వర్గానికి ఏ కారణం వల్ల పోతున్నారు? దైవభీతి మరియు సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పించారు. ఆ దుఆ ఏమిటి? ‘

اللَّهُمَّ أَنْتَ حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖీ ఫహస్సిన్ ఖులుఖీ’.
ఓ అల్లాహ్! నీవు నా రూపురేఖలను అందంగా మలచినట్లే నా నడవడికను కూడా ఉత్తమంగా మలచు.

ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ
‘బు’ఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్’.
నేను నడవడికను, మంచి గుణాలను పూర్తి చేయటానికే నేను పంపబడ్డాను.

అంటే ఇది దీని గురించి చాలా వివరంగా ఖురాన్ లో మరియు హదీస్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా మాట్లాడాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ
‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ అవ్ లియస్ముత్’.
ఎవరికైతే అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనం వహించాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే, పదవ విషయం, ఇస్లాం ధర్మం నైతిక విలువలు గల ధర్మం. నేను ముఖ్యంగా 10 విషయాలు చెప్పాను. ఇస్లాం కి, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అని అంశం పైన నేను పది అనుగ్రహాలు చెప్పాను.

  1. ఇస్లాం తన దాసుల కోసం అల్లాహ్ అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం.
  2. ఇది సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం.
  3. స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం.
  4. జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల గల ధర్మం.
  5. మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం.
  6. సులభమైన ధర్మం.
  7. సహనాన్ని బోధించే ధర్మం.
  8. ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం చేయని ధర్మం.
  9. ఉమ్మతే వసత్ అంటే మెరుగైనది, ఉత్తమమైన సమాజం.
  10. నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42189