యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ [అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్] సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ [వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్] మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ [నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్] మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ [అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.
ప్రవక్తల వంశం
యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.
ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.
రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.
ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/mEfcvGUoA-Y [48 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్ ప్రజల చరిత్రను వివరించబడింది. యూషా బిన్ నూన్, ఇల్యాస్ మరియు యసా (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తల తరువాత, బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒక రాజును కోరగా, అల్లాహ్ తాలూత్‌ను నియమించాడు. జాలూత్ (గొలియత్)తో జరిగిన యుద్ధంలో, యువకుడైన దావూద్ (అలైహిస్సలాం) విజయం సాధించి, కాలక్రమేణా రాజుగా మరియు ప్రవక్తగా నియమితులయ్యారు. ఆయనకు “జబూర్” గ్రంథం ఇవ్వబడింది మరియు ఆయనకు పర్వతాలు, పక్షులతో పాటు అల్లాహ్‌ను కీర్తించే అద్భుతమైన స్వరం, ఇనుమును మెత్తగా చేసే శక్తి వంటి మహిమలు ప్రసాదించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్త మరియు రాజుగా న్యాయాన్ని ఎలా స్థాపించారో, ఒక సంఘటనలో తొందరపాటు తీర్పు ఇచ్చి ఎలా పశ్చాత్తాపపడ్డారో కూడా వివరించబడింది. ఆయన కుమారుడు సులేమాన్ (అలైహిస్సలాం) యొక్క జ్ఞానం, దావూద్ (అలైహిస్సలాం) యొక్క ఆరాధన, ఉపవాస పద్ధతి మరియు ఆయన మరణం గురించి కూడా చర్చించబడింది. ఈ ప్రసంగం నుండి న్యాయం, పశ్చాత్తాపం మరియు అల్లాహ్‌పై ఆధారపడటం వంటి గుణపాఠాలను నేర్చుకోవచ్చు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ఈనాటి ప్రసంగంలో మనము, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాము. ఇంతకు ముందు ప్రసంగాలలో, ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర వివరంగా తెలుసుకొని ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసే సమయానికి బనీ ఇస్రాయీల్ ప్రజలు 40 సంవత్సరాల కొరకు తీహ్ మైదానంలో మార్గభ్రష్టులై తిరుగుతూ ఉన్నారు. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి కోసము ఆకాశం నుండి మన్ సల్వా ఆహారము దింపుతున్నాడు, రాతి నుండి నీటి ఊటను ఉభకింపజేశాడు, మేఘాల నుండి నీడ ఏర్పాటు చేశాడు, ఆ విధంగా వారు ఆ మైదానంలో ఉంటున్నారు అనే విషయం వరకు మనకు తెలియజేయడం జరిగింది.
ఆ తర్వాత జరిగిన విషయాలు తెలుసుకుంటూ ఇన్ షా అల్లాహ్ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోకి మనము ప్రవేశిద్దాం. తీహ్ మైదానంలో ఉన్నప్పుడే మూసా అలైహిస్సలాం వారు మరణించారు. ఆ తీహ్ మైదానంలో ఉన్నప్పుడే హారూన్ అలైహిస్సలాం వారు కూడా మరణించారు. మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారిద్దరి మరణం తర్వాత బనీ ఇస్రాయీల్ వారికి యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు ప్రవక్తగా, బోధకునిగా దైవ వాక్యాలు బోధించుకుంటూ, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ, వారిని సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. 40 సంవత్సరాల గడువు పూర్తి అయ్యింది. తర్వాత ఆ మూర్ఖులు ఎవరైతే “యుద్ధంలో మేము ప్రవేశించలేము” అని వెనకడుగు వేశారో, “నీవు నీ ప్రభువు వెళ్లి యుద్ధం చేసుకోండి మేము ఇక్కడే కూర్చుని ఉంటాము” అని మూర్ఖత్వం ప్రదర్శించారో, వారందరూ కూడా మరణించారు. వారి బిడ్డలు ఇప్పుడు పెరిగి పెద్దవారై యువకులై ఉన్నారు. అంటే పూర్తిగా ఒక తరము గడిచిపోయింది. కొత్త తరము, ఉడుకు రక్తము ఎవరి శరీరాలలో ప్రవేశించి ఉందో, అలాంటి ఒక కొత్త తరము ఇప్పుడు ప్రపంచంలోకి ఉనికిలోకి వచ్చి ఉంది.
అలాంటి వారిని తీసుకుని యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు మళ్లీ అల్-ఖుద్స్, పాలస్తీనా వైపుకి ప్రయాణం ప్రారంభించారు. ఈసారి వారు దారి తప్పలేదు, ఎందుకంటే వారి మీద పెట్టబడిన ఆ 40 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయింది కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి మార్గం చూపించాడు. వారు ఏకంగా పాలస్తీనా దేశానికి అల్-ఖుద్స్ అనే నగరానికి వచ్చి చేరారు. ఇక, మాషా అల్లాహ్, యువకులు, ఉడుకు రక్తం, యుద్ధం కోసం సిద్ధమైపోండి అనగానే వారందరూ యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే అల్-ఖుద్స్ నగరంలో ఉన్న ప్రజలు లోపలే ఉండి చాలా రోజుల వరకు వారి సహనాన్ని పరీక్షించారు. అయినా గానీ వీరు వెనకాడగలేదు. చివరికి ఆ నగరము బనీ ఇస్రాయీల్ వారి చేతికి వచ్చేసింది. ఆ విధంగా బనీ ఇస్రాయీల్, ఇస్రాయీల్ సంతతి వారు అల్-ఖుద్స్ అనే నగరంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి మళ్లీ ఆ నగరము వారి సొంతమయ్యింది, వారి వశమయ్యింది.
యూషా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్
ఆ తర్వాత యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు అక్కడ ఉన్నన్ని రోజులు వారికి దైవ వాక్యాలు, బోధనలు బోధించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆయన మరణించారు. యూషా బిన్ నూన్ అలైహిస్సలాం మరణించిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ లోపు మళ్లీ బనీ ఇస్రాయీల్ ప్రజలలో అవకతవకలు వచ్చేసాయి, వారు మళ్లీ మార్గభ్రష్టత్వానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లబ్నాన్ దేశంలో, ఇదే బనీ ఇస్రాయీల్ కు చెందిన కొంతమంది మళ్లీ మూర్ఖత్వం ప్రదర్శిస్తూ అక్కడ బాల్ అనే ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. ఆ విధంగా మళ్లీ బహుదైవారాధన, షిర్క్, విగ్రహారాధన ప్రారంభం చేసేశారు.
అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇల్యాస్ అలైహిస్సలాం వారిని వారి వద్దకు ప్రవక్తగా పంపించాడు. ఇల్యాస్ అలైహిస్సలాం లబ్నాన్ దేశంలో బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ వారిని సంస్కరించారు, అల్లాహ్ వైపు, అల్లాహ్ ఏకత్వం వైపు, తౌహీద్ వైపు వారిని పిలుపునిచ్చారు. ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం అనే మరో ప్రవక్త బనీ ఇస్రాయీల్ వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. అయితే యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారి గురించి, ఇల్యాస్ అలైహిస్సలాం వారి గురించి, యసా అలైహిస్సలాం వారి గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు కాబట్టి, నేను వారి గురించి ప్రత్యేకంగా ప్రసంగము చేయట్లేదు. ముఖ్యంగా వారి పేరు, వారు ఎవరి వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు, ఏ సందర్భంలో పంపించబడ్డారు అనే విషయం వరకు మాత్రమే చెప్పేసి మాటలు ముందుకు సాగిస్తున్నాను. ఈ విషయాన్ని మన మిత్రులు గమనించాలి.
అయితే ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం వారికి బనీ ఇస్రాయీల్ ప్రజల పగ్గాలు ఇవ్వబడ్డాయి. యసా అలైహిస్సలాం వారు కూడా చాలా చక్కగా దైవ వాక్యాలు బనీ ఇస్రాయీల్ వారికి బోధించుకుంటూ ముందుకు సాగారు. యసా అలైహిస్సలాం వారు మరణించిన తర్వాత, అప్పుడు బనీ ఇస్రాయీల్ మీద అల్లాహ్ తరపు నుంచి పెద్ద పెద్ద పరీక్షలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే యసా అలైహిస్సలాం వారి మరణం తర్వాత మళ్ళీ మరో ప్రవక్త వచ్చే లోపు ఈ మధ్య ఏ గ్యాప్ అయితే ఉందో, ఈ గ్యాప్ లో మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అంతే కాదండి, వారు పరస్పరం విభేదించుకుని గొడవలకు దిగారు. ఆ విధంగా పాపాల్లో మునిగిపోయారు, విభేదించుకుని గొడవలు పెట్టుకున్నారు. అలా చేసిన కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బుఖ్తె నసర్ అనే ఒక దౌర్జన్య పరిపాలకుడిని వారి మీదికి పంపించగా, ఆ బుఖ్తె నసర్ వచ్చి ఖుదుస్ మీద దండయాత్ర చేసి బనీ ఇస్రాయీల్ వారిని చాలా కఠినంగా అక్కడి నుంచి కొట్టి, చంపి తరిమేశాడు. అల్లాహు అక్బర్.
చరిత్ర చదువుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయండి, అంత కఠినంగా, అంత విచక్షణ రహితంగా బుఖ్తె నసర్ మరియు అతని సైన్యమైన అమాలిఖా ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ మీద విరుచుకుపడ్డారు. నలుమూలల నుండి వారి మీద విరుచుకుపడి వారిని అల్-ఖుదుస్ నుండి తరిమి తరిమి, వారిని చంపారు. ఆ విధంగా వారిని అక్కడి నుంచి తరిమి తరిమి వెళ్ళగొట్టారు. ఆ విధంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు అల్-ఖుదుస్ ప్రదేశాన్ని మళ్ళీ కోల్పోయారు, ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాలకు పారిపోయారు.
అయితే ఎప్పుడైతే ఈ బుఖ్తె నసర్ అనే రాజు వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల మీద దండయాత్ర చేసాడో, అల్-ఖుదుస్ నగరాన్ని సర్వనాశనం చేసాడో, బనీ ఇస్రాయీల్ ప్రజల్ని చెల్లాచెదురుగా తరిమేశాడో, ఆ సందర్భంలోనే బనీ ఇస్రాయీల్ ప్రజల వద్ద పవిత్రమైన జ్ఞాపకాలు, గుర్తులు కొన్ని ఉండేవి. ఒక పెట్టె ఉండేది వారి వద్ద, దానిని తాబూత్ అని అరబీలో అంటూ ఉంటారు. అందులో పవిత్రమైన కొన్ని గుర్తులు ఉండేవి. ఏముండేవి అంటే మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలకాలు ఉండేవి, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, కింద పడేస్తే సర్పం లాగా మారుతుంది, తర్వాత ముట్టుకుంటే మళ్ళీ కర్ర లాగా మారిపోతుంది అని విన్నాము కదా, ఆ కర్ర ఉండేది. హారూన్ అలైహిస్సలాం వారికి కూడా కొన్ని గుర్తులు అందులో ఉండేవి. అలాంటి ప్రవక్తల పవిత్రమైన కొన్ని గుర్తులు అందులో ఉండేవి. ఆ తాబూత్ పెట్టెను కూడా ఈ బుఖ్తె నసర్, అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయారు.
అయితే అలా జరిగిన తర్వాత మళ్లీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షమ్వీల్ అలైహిస్సలాం అనే ఒక ప్రవక్తను పంపించాడు. షమ్వీల్ అలైహిస్సలాం అనే ప్రవక్త ప్రభవించబడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజలలో ఉన్న వారి మార్గభ్రష్టత్వాన్ని దూరం చేశారు, వారి లోపాలను వారు మళ్ళీ పరిష్కరించారు, సంస్కరించారు. ఆ తర్వాత బనీ ఇస్రాయీల్ ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ అయితే విడిపోయి దూరదూరంగా ఉంటున్నారో వారందరినీ మళ్ళీ ప్రోగవ్వాలని పిలుపునిచ్చారు. షమ్వీల్ అలైహిస్సలాం వారి పిలుపుని ఆమోదిస్తూ బనీ ఇస్రాయీల్ వారు మళ్ళీ వచ్చి ఒకచోట ప్రోగయ్యారు.
తాలూత్ ను రాజుగా నియమించడం
వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రోగైన తర్వాత, రాను రాను వారి సంఖ్య పెరుగుతూ పోయింది. లక్షల్లో మళ్ళీ వారి సంఖ్య అక్కడ ఏర్పడిపోయింది. అప్పుడు బనీ ఇస్రాయీల్ ప్రజలకు ఒక ఆలోచన తట్టింది. అదేమిటి? మనకు బోధించడానికి, దైవ వాక్యాలు వినిపించి నేర్పించడానికి ప్రవక్త అయితే ఉన్నారు. కానీ మనకు ఒక రాజు కూడా ఉంటే బాగుండేది. ఆ రాజు సారధ్యంలో మేము యుద్ధాలు చేయగలము, మా ప్రాపంచిక సమస్యలను అతను బాగా చక్కగా పరిష్కరించగలడు, అలాగే మేము కోల్పోయిన ఆ పవిత్రమైన గుర్తులు, తాబూత్ పెట్టె, మళ్ళీ మనము తిరిగి సొంతం చేసుకోగలము అనే ఉద్దేశంతో షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఓ దైవ ప్రవక్త వారు, మా కోసము ఒక రాజుని నియమించండి. మీరైతే దైవ వాక్యాలు బోధిస్తున్నారు కానీ, ఒక రాజుని నియమిస్తే ఆ రాజు సారధ్యంలో మేము ప్రాపంచిక సమస్యలు పరిష్కరించుకుంటాము, కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందుతాము, కోల్పోయిన తాబూత్ పెట్టెను కూడా మళ్ళీ తిరిగి వశపరుచుకుంటాము అని కోరినప్పుడు, షమ్వీల్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ప్రజలతో ఏమన్నారంటే, చూడండి మీరు పెద్ద కోరిక కోరుతున్నారు. రాజును నియమించటం, ఆ తర్వాత జిహాద్ చేయటం మీ మీద విధి చేయటం జరిగితే మళ్ళీ మీరు మాట తప్పరాదు. ఒకవేళ మీరు మాట తప్పితే మళ్ళీ మీ మీద కఠినమైన శిక్షలు పడతాయి, జాగ్రత్త, మాట మార్చరు కదా అని అడిగారు. బనీ ఇస్రాయీల్ ప్రజలు లేదండి, మీరు రాజుని నియమించండి. యుద్ధం మా మీద విధి చేయండి చాలు, చూడండి మేము యుద్ధాలు ఎలా చేస్తామో అని పగడ్బాలు పలికారు. షమ్వీల్ అలైహిస్సలాం అల్లాహ్ తో దుఆ చేశారు.
అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధాన్ని విధి చేసేసాడు, ఫర్జ్ చేసేసాడు. ఆ తర్వాత వారి కోసము తాలూత్ ను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాజుగా విధించాడు. అయితే ఈ తాలూత్ ఎవరు అంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులలో బిన్యామీన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు కదండీ, ఆ బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఈ తాలూత్.
షమ్వీల్ అలైహిస్సలాం ప్రజల ముందరకు వచ్చి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ మీద యుద్ధం విధి చేసేసాడు, ఇక మీరు యుద్ధము చేయవచ్చు, అలాగే తాలూత్ ని అల్లాహ్ మీ కొరకు రాజుగా నియమించాడు. మీరు తాలూత్ ని రాజుగా ఎన్నుకోండి అన్నారు. అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఇదేమిటండి, మీరు తాలూత్ ని మనకు రాజుగా నియమించారు? బిన్యామీన్ వంశానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ మనకు రాజుగా నియమింపబడలేదే? మన యహూదా సంతానికి చెందిన వ్యక్తులే ఎప్పుడూ ఇప్పటివరకు కూడా రాజులుగా నియమించబడుతూ వచ్చారు అని అడిగారు. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి మరొక కుమారుని పేరు యహూదా. ఆ యహూదా సంతానానికి చెందిన వ్యక్తులే ఇప్పటివరకు రాజులుగా నియమించబడుతూ వస్తూ ఉండేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యహూదా సంతానానికి చెందిన వ్యక్తి కాకుండా, బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో, బనీ ఇస్రాయీల్ వారికి ఆశ్చర్యం కలిగింది. వెళ్లి షమ్వీల్ అలైహిస్సలాం వారి ముందర వారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, లేదండీ ఇది నా నిర్ణయము, నా ఎన్నిక కాదండీ, ఇది అల్లాహ్ యొక్క ఎన్నిక. అల్లాహ్ ఆయనను రాజుగా ఎన్నుకోవాలని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఆయనను ఎన్నుకోమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు అని చెప్పారు.
అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు నమ్మలేదు. మేము ఎలా నమ్మాలండి? ఇప్పటివరకు వస్తున్న పరంపరను కాకుండా వేరే కొత్త విషయాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు. మేము ఎలా నమ్మాలి? ఏదైనా నిదర్శనము మాకు చూపించండి అని అడిగారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, ఇది దైవ నిర్ణయము అని మీకు తెలియజేయడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా మీరు కోల్పోయిన ఆ తాబూత్ పెట్టెను మళ్ళీ మీ వద్దకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు, చూడండి అన్నారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశంతో దైవదూతలు ఆ అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయిన ఆ తాబూత్ పెట్టెను తిరిగి తీసుకుని వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల చేతికి అప్పగించారు. ఇంతకుముందు చెప్పాను కదండీ, ఆ తాబూత్ పెట్టెలో తౌరాత్ ఫలకాలు, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, హారూన్ అలైహిస్సలాం వారి గుర్తులు ఇలా పవిత్రమైన విషయాలు అందులో భద్రపరచబడి ఉండేవి. ఆ తాబూత్ పెట్టె వారి వద్ద ఉంటే వారికి మనశ్శాంతి కూడా లభించేది. ఆ తాబూత్ పెట్టెను వెంటపెట్టుకుని వెళ్లి వారు యుద్ధాలు కూడా చేసేవారు.
ఇలా ఎప్పుడైతే ఆ తాబూత్ పెట్టె తిరిగి మళ్ళీ వారి వద్దకు వచ్చిందో, అప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఇది దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అని. తర్వాత సంతోషంగా వారు తాలూత్ ని తమ నాయకునిగా, తమ రాజుగా ఎన్నుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా కోసం యుద్ధం విధి చేయండి, మేము యుద్ధము చేస్తాము, యుద్ధాలలో పాల్గొంటాము అని కోరిన వారు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధము విధి చేసేసాడో, లక్షల్లో ఉన్న వారి సంఖ్యలో నుంచి కేవలం 80,000 వ్యక్తులు మాత్రమే యుద్ధానికి సిద్ధమయ్యారు. మిగతా వారందరూ కూడా మాట మార్చేశారు.
ఎలాంటి ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు క్రితమే పగడ్బాలు పలికారు, గొప్పలు పలికారు, మేము యుద్ధాలు చేస్తాము అని. యుద్ధం విధి చేసేసిన తర్వాత, మేము యుద్ధము చేయము అని చేతులు దులుపుకున్నారు. వెళ్ళిపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. కానీ, మాట మీద నిలబడిన వారు 80,000 మాత్రమే. అయితే ఆ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉంటున్నారు, చిత్తశుద్ధితో నిలబడుతున్నారు అనేది లెక్క తేలలేదు. అయినా గానీ, తాలూత్ రాజు ఆ 80,000 మందిని వెంటపెట్టుకుని యుద్ధము కోసము బయలుదేరారు.
అయితే మనిషి లోపల ఎక్కడో ఒకచోట ఒక ఆలోచన, కంగారు అనేది ఉంది. లక్షల్లో బనీ ఇస్రాయీల్ ప్రజలు యుద్ధము చేయము అని వెనకడుగు వేసేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు అనేది లెక్క తేలలేదు. అయితే ఆ 80,000 లో నుంచి ఎంతమంది చిత్తశుద్ధి కలిగిన వారు ఉన్నారు అనేది తేల్చడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. వారు యుద్ధము కోసము తాలూత్ రాజుతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ ఉంటే దారిలో ఒక నది వచ్చింది. ఆ నది పేరు నెహ్రె ఉర్దున్, జోర్డాన్ నది. ఆ నది దాటుతున్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెట్టాడు. ఆ నది నీరు ఎవరూ కడుపునిండా తాగరాదు. ఒక గుడికెడు నీళ్లు తాగాలనుకుంటే తాగవచ్చు గానీ, అసలు తాగకుండా ఉంటేనే మంచిది. కడుపు నిండా అయితే అస్సలు తాగనే రాదు అని అల్లాహ్ పరీక్ష పెట్టేశాడు.
చూడండి, ప్రయాణంలో ఉన్నారు, బాగా దప్పిక, ఆకలితో ఉన్నారు. అలాంటప్పుడు మంచి నీరు కనిపించాయి. ఆ మంచి నీరు తాగవద్దు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిబంధన పెట్టాడు, పరీక్షించడానికి. అయితే నది దిగి నది అవతల వైపు దాటేసరికి 80,000 లో నుంచి కేవలం 313 వ్యక్తులు మాత్రమే నీళ్లు తాగలేదు, మిగతా వారందరూ కూడా కడుపు నిండా నీళ్లు తాగేశారు. దీని ద్వారా అర్థమైన విషయం ఏమిటంటే, ఆ 80,000 లో నుంచి కూడా చిత్తశుద్ధి కలిగిన వారు కేవలం 313 మంది మాత్రమే. మిగతా వారందరూ కూడా మాట మీద, చిత్తశుద్ధితో ఉన్నవారు కాదు అని తేలిపోయింది.
నది దాటిన తర్వాత, ఎప్పుడైతే వారు నది అవతల వైపుకి చేరుకున్నారో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కాళ్లు చేతులు నిరసించిపోయాయి. వారు కూర్చుండిపోయారు. రాజుతో, మహారాజా, ఇప్పుడు మేము యుద్ధంలో పాల్గొనలేము, మా శరీరంలో శక్తి లేకుండా పోయింది అని చేతులెత్తేశారు.
జాలూత్ తో యుద్ధం
ఒక్కసారి ఆలోచించి చూడండి. 80,000 లో నుంచి కేవలం 313 మంది మాత్రమే నీళ్ళు తాగకుండా ఉన్నారు. ఆ 313 మందిని తీసుకుని వెళ్లి ఇప్పుడు పెద్ద సైన్యంతో యుద్ధం చేయాలంటే మామూలు విషయమా? ఆ 313 మంది ఎంత కంగారు పడిపోతారు అలాంటి సందర్భంలో? కానీ చిత్తశుద్ధి కలిగిన ఆ 313 మంది ఒకరినొకరు ఏమని మాట్లాడుకున్నారంటే, చూడండి మనము అల్లాహ్ మీద నమ్మకం కలిగి ఉన్నాము. మనకు పూర్వము కూడా తక్కువ సంఖ్యలో ఉన్న వారు అల్లాహ్ మీద నమ్మకంతో యుద్ధాలలో పాల్గొన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని ఆదుకుని విజయాల వరకు చేర్చాడు కాబట్టి, మనము కూడా అల్లాహ్ మీద భారం వేసి, అల్లాహ్ మీద నమ్మకంతో ముందుకు సాగుదాము, పదండి. వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మాకు అల్లాహ్ సహాయకుడిగా ఉన్నాడు, మేము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా విజయము సాధిస్తాము అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అక్కడి నుంచి ముందుకు సాగారు.
అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాల సంఖ్య 313 మంది. అదే విధంగా ఇక్కడ తాలూత్ రాజుతో పాటు చిత్తశుద్ధి కలిగి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వెళుతున్న వారి సంఖ్య కూడా 313. ఆ 313 మందిని తీసుకుని తాలూత్ రాజు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్ళిన తర్వాత శత్రు సైన్యం ఎదురుపడింది. ఎప్పుడైతే శత్రు సైన్యము ఎదురుపడిందో, అక్కడ చూస్తే శత్రు సైన్యంలో సైన్యము సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారి సైన్యాధిపతి, అతని అరబీ భాషలో జాలూత్ అంటారు, తెలుగులో గొలియత్ మరియు అలాగే ఆంగ్లంలో కూడా గొలియత్ అని అనువాదం చేసి ఉన్నారు. అరబీలో అయితే, ఉర్దూలో అయితే జాలూత్ అని అతని పేరు తెలపబడింది. అతను యుద్ధ వస్త్రాలు ధరించి, కత్తి పట్టుకుని, పెద్ద శరీర దేహము కలిగిన వాడు, ముందుకు వచ్చాడు. అతని దేహాన్ని, అతని ఎత్తును చూసి ఏ ఒక్కరూ కూడా అతని ముందుకు వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. అతను ముందుకు వచ్చి సవాలు విసిరాడు. మీ 313 మందిలో నుంచి నన్ను ఎదుర్కొనే మొనగాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే రండి ముందుకు చూద్దాము అని బిగ్గరగా సవాలు విసురుతూ ఉన్నాడు. ఎంతో గర్వాన్ని, ఎంతో అహంకారాన్ని ప్రదర్శిస్తూ, మీలో ఎవరైనా ఉన్నాడా, ఎవరికైనా దమ్ము ఉందా నన్ను ఎదుర్కోవడానికి అని సవాలు విసురుతూ ఉంటే, ఈ 313 మందిలో నుంచి 16 సంవత్సరాల ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. అతను ఎలాంటి యుద్ధ యుద్ధ వస్త్రాలు ధరించి లేడు. అతని చేతిలో చివరికి ఖడ్గము, కత్తి కూడా లేదు. చేతిలో ఒక తాడు ఉంది, మరొక చేతిలో కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి.
ఆ రాళ్లు, ఆ తాడు పట్టుకుని ముందుకు వస్తే, ఆ కుర్రాడిని చూసి ఆ జాలూత్ సేనాధిపతి పకపక నవ్వేసాడు. ఒరేయ్ బచ్చా, నీవు నన్ను ఎదుర్కొంటావా? నీ సైన్యంలో నీకంటే గొప్ప పెద్ద మొనగాడు ఎవడూ లేడా నన్ను ఎదుర్కోవడానికి? అని హేళన చేశాడు. అతను హేళన చేస్తూ ఉంటే, అతని వెనుక ఉన్న అతని సైన్యము నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ 16 ఏళ్ల కుర్రాడు తాడులో ఆ రాళ్లు పెట్టి గిరగిరా తిప్పి వేగంగా విసిరాడు. అవి ఎంత వేగంగా వచ్చి తగిలాయి అంటే చరిత్రకారులు తెలియజేశారు, మెరుపు వేగంతో ఆ రాళ్లు వచ్చి ఆ జాలూత్ నుదుటను బలంగా తాకాయి. ఒకదాని వెనుక ఒకటి వచ్చి తాకగానే ఆ గర్విస్తున్న ఆ జాలూత్ ఒక్కసారిగా వెనక్కి కూలి పడిపోయాడు. అలాగే ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ జాలూత్ సైన్యం మొత్తము భయపడిపోయింది, బిత్తరపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. చూస్తూ ఉండంగానే కంగారు పడిపోయిన, బిత్తరపోయిన, భయపడిపోయిన జాలూత్ సైన్యము పరాజయం పాలయ్యి పారిపోయారు. ఈ 313 మంది గెలుపు పొందారు, విజయము ఈ భక్తులకు, చిత్తశుద్ధి కలిగిన వారికి దక్కింది. అయితే ఆ 16 సంవత్సరాల కుర్రాడు ఎవరైతే జాలూత్ ని రాళ్లతో కొట్టి చంపేశాడో, అతను ఎవరంటే, ఆయనే దావూద్ అలైహిస్సలాం. అల్లాహు అక్బర్.
చూశారా? ఆయన పేరే దావూద్ అలైహిస్సలాం. దావూద్ అలైహిస్సలాం వారి చేతిలో ఆ జాలూత్ అనే సేనాధికారి మరణించాడు. విజయము ముస్లింలకు, చిత్తశుద్ధి కలిగిన ఈ భక్తులకు వరించింది అల్ హందులిల్లాహ్. అది చూసిన ఈ తాలూత్ రాజు, 313 మందిని వెనక పట్టుకుని వచ్చిన ఈ తాలూత్ రాజు, దావూద్ అలైహిస్సలాం వారిని మెచ్చుకుని ఆ తర్వాత తన కుమార్తెను దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చి వివాహం జరిపించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం రాజకుమార్తెతో వివాహం చేసుకున్నారు, రాజుకి అల్లుడైపోయారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన రాజ్యాన్ని కూడా దావూద్ అలైహిస్సలాం వారి చేతికి అప్పగించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ వారికి దావూద్ అలైహిస్సలాం వారు రాజయ్యారు.
దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్తగా మరియు రాజుగా
రాజైపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ప్రవక్త పదవి కూడా ఇచ్చేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ఆయనే ప్రవక్త, ఆయనే రాజు. అంటే ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు కూడా ఆయనే పరిష్కరిస్తారు. అలాగే ప్రజల ధార్మిక విషయాలు కూడా ఆయనే బోధిస్తారు, పరిష్కరిస్తారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ప్రవక్త కూడా, దావూద్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజలకి రాజు కూడా. అయితే దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఏంటి ఆ మహిమలు? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం పేరు జబూర్. ఖురాన్ లోని సూరా నిసా 165 వ వాక్యంలో ఆ జబూర్ గ్రంథం ప్రస్తావన వచ్చి ఉంది. ప్రపంచంలో నాలుగు గ్రంథాలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి: తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్. ఈ ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రంథాలలో జబూర్ గ్రంథము కూడా ఉంది. ఆ జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది అల్లాహ్ తరపున.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము ఇచ్చాడు, మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని మంచి స్వరంతో, కంఠంతో చదువుతూ ఉంటే, పర్వతాలు కూడా ఆయన చదువుతున్న ఆ జబూర్ గ్రంథ వాక్యాలు చాలా చిత్తశుద్ధితో వినేవి, అవి కూడా వెంట వెంటనే ఆ పలుకులు పలికే ప్రయత్నము చేసేవి. అంతే కాదండీ, పక్షులు సైతము దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ వాక్యాలు పఠిస్తూ ఉంటే మంచి స్వరంతో, వచ్చి చుట్టూ కూర్చుని మెడలు కిందికి వంచుకుని చాలా చక్కగా, శ్రద్ధగా వినేవి. అంత మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ వాక్యాలు పఠించేవారు.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చిన మరొక మహిమ ఏమిటంటే, లోహాన్ని ఆయన కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెత్తదిగా మార్చేశాడు. లోహము చాలా గట్టిది. దాన్ని మెత్తదిగా మార్చాలంటే అగ్నిలో చాలా సేపు బాగా ఎర్రగా కాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత అది మెత్తబడుతుంది. ఆ తర్వాత దాన్ని కావలసిన ఆకారంలో ప్రజలు మలుచుకుంటూ ఉంటారు. కానీ దావూద్ అలైహిస్సలాం లోహాన్ని ముట్టుకుంటే చాలు, అది మెత్తగా మారిపోతుంది. ఆ తర్వాత దావూద్ అలైహిస్సలాం ఆయనకు తోచినట్టుగా ఆ లోహాన్ని కావలసిన ఆకారంలో మలుచుకునేవారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లోహాన్ని మెత్తదిగా చేసేసాడు. దావూద్ అలైహిస్సలాం ఆ లోహంతో యుద్ధ వస్త్రాలు తయారు చేసేవారు, కత్తులు తయారు చేసేవారు, అలాగే కవచాలు, వేరే విషయాలు కూడా ఆయన తయారు చేసేవారు.
దావూద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రాజు అయ్యి ఉండి కూడా బైతుల్ మాల్ నుండి, రాజు ఖజానా నుండి సొమ్ము తీసుకునే వారు కాదు. లోహాన్ని కరిగించి, ఆ లోహం నుండి తయారు చేసిన కవచాలు, కత్తులు ఇంకా వేరే విషయాలను అమ్మి, వాటితో వచ్చే సొమ్ముతో ఆయన అవసరాలు తీర్చుకునేవారు. ఎంత చిత్తశుద్ధి కలిగినవారో చూడండి.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి యొక్క అలవాటు ఏమిటంటే, ఆయన ఉదయం పూట ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. గొడవ పడిన వాళ్లకు తీర్పులు ఇచ్చేవారు. రాత్రి పూట మాత్రము అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. రాత్రి పూట ఆయన వద్దకు రావడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసి, మళ్ళీ ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసేవారు. అంటే రోజు తర్వాత రోజు ఆయన ఉపవాసము ఉండటాన్ని ఇష్టపడేవారు, రోజు మార్చి రోజు ఆయన ఉపవాసం ఉండేవారు కాబట్టి, ఆ ఉపవాసానికే సౌమె దావూద్ అని పేరు పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఎవరైనా ఉపవాసాలు ఉండాలనుకుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే, వారు సౌమె దావూద్ పాటించవచ్చు. దావూద్ అలైహిస్సలాం ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు ఉపవాసముని మానేసేవారు. రోజు తర్వాత రోజు ఉపవాసం ఉండేవారు, అంతవరకు మాత్రమే ఉపవాసం ఉండటానికి అనుమతి ఉంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబూ మూసా అనే ఒక శిష్యుడు ఉండేవారు. ఆయనకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము, మంచి స్వరము ఇచ్చి ఉంటే, ఆయన ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఖురాన్ వాక్యాలు పఠిస్తూ ఉంటే, ఆ శబ్దాన్ని విని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్లి మెచ్చుకుంటూ, ఓ అబూ మూసా, నీకు అల్లాహ్ ఎంత మంచి కంఠము, స్వరము ఇచ్చాడంటే, దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన స్వరాలలో ఒక స్వరము నీకు ఇవ్వబడింది అనిపిస్తుంది నాకు అని చెప్పారు. ఆ విధంగా ఖురాన్ గ్రంథాన్ని, అలాగే ఆకాశ గ్రంథాన్ని మంచి స్వరంతో పఠించటము కూడా అల్లాహ్ తరపున దక్కిన గొప్ప అనుగ్రహం అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇద్దరు గొర్రెల కాపరుల తీర్పు
అయితే దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక సంఘటన ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారు రాత్రిపూట ఆరాధనలో నిమగ్నమైపోయేవారు, రాత్రిపూట ఆయన వద్దకు ఎవరికీ వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు అని మనం ఇంతకు ముందే విన్నాం. సమస్య ఏమీ అయినా, గొడవ ఏమీ అయినా, ఉదయం పూట మాత్రమే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి. అయితే ఆయన రాత్రి పూట ఏకాంతంలో అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి పరిష్కారం కోసం వచ్చారు. అయితే ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు, ఇప్పుడు కలవడానికి కుదరదు, ఉదయము కలవవచ్చు అని తెలుసుకుని వారు ఉదయం వరకు మేము ఓపిక పట్టేదానికి లేదు అని గోడ దూకి లోపలికి ప్రవేశించారు.
ఆరాధనలో ఉన్న దావూద్ అలైహిస్సలాం వారు కంగారుపడిపోయారు. ఇదేమిటి? ఎవరైనా దాడి చేయడానికి వచ్చాడేమో అని కంగారుపడిపోయారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ వెళ్లి దావూద్ అలైహిస్సలాం వారితో మేము గొడవ పడటానికి, దాడి చేయడానికి రాలేదండీ. మా ఇద్దరి మధ్య ఒక వ్యవహారంలో భేదాభిప్రాయము కలిగింది. కాబట్టి తీర్పు కోసము మీ వద్దకు వచ్చాము అని చెప్పారు. సమస్య ఏంటి అని దావూద్ అలైహిస్సలాం వారు అడిగితే, అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నా వద్ద ఒకే ఒక గొర్రె ఉంది. ఈ నా సోదరుని వద్ద 99 గొర్రెలు ఉన్నాయి. ఇతను 99 గొర్రెలు మేపుకోవడానికి వెళుతూ వెళుతూ, నా మీద సానుభూతి చూపి, అయ్యా నీ వద్ద ఒకే ఒక గొర్రె ఉంది, ఆ ఒక గొర్రెను మేపడానికి నీవు వెళ్లి కష్టపడటం ఎందుకు? ఆ ఒక గొర్రెను కూడా నా గొర్రెలతో పాటు పంపించేయి, నేనే ఆ 99 గొర్రెలతో పాటు నీ ఒక గొర్రెను కూడా మేపుకొని వస్తాను అని చెబితే, నా సోదరుడు నా మీద సానుభూతి చూపిస్తున్నాడులే అనుకుని నేను నా గొర్రెను అతని గొర్రెలతో పాటు మేపడానికి పంపించేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత నా గొర్రె అతని గొర్రెలతో పాటు వెళ్ళటము, మేసి తిరిగి రావటము, దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇతను నా సోదరుడు, ఆ గొర్రె నాదే అని ప్రకటిస్తున్నాడు. ఇలా చేయటము న్యాయమేనా మీరు చెప్పండి అని అడిగారు.
అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారు వెంటనే, అయ్యో 99 గొర్రెలు పెట్టుకుని ఇంకా నీ మనిషికి కోరిక తీరలేదా? ఆ ఒక్క గొర్రె కూడా నీవు తీసుకోవాలని చూస్తావా? ఎంత దురాశ నీకు? ఇలా అతను చేయటము దౌర్జన్యము, అలా చేయరాదు అని వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు మాట్లాడేశారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడేశారో, అప్పుడు ఆ 99 గొర్రెల వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారితో, అయ్యా మీరు కేవలం అతని మాట మాత్రమే విన్నారు, నా మాట విన్నారా? సమస్య ఏంటో నా నోట మీరు తెలుసుకున్నారా? నా నోట మీరు సమస్య అడిగి తెలుసుకోకుండానే ఒక వ్యక్తి మాట విని వేసి వెంటనే తీర్పు చెప్పేటం ఏమిటయ్యా ఇది? నా మాట కూడా మీరు వినాలి కదా. నా మాట, ఆయన మాట, ఇద్దరి మాటలు విని, సత్యం ఎవరి వైపు ఉంది అనేది మీరు అప్పుడు చూడాలి కదా. నా మాట వినకుండానే మీరు తీర్పు ఇచ్చిస్తున్నారు ఏమిటయ్యా ఇది? అని ఆయన అడిగేశాడు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారికి తప్పు తెలిసింది. వెంటనే దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మన్నింపు కోరుకున్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా సాద్ 21 నుండి 24 వాక్యాల వరకు ఉంది.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు అటు ఉదయం పూట ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ, రాత్రి పూట అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, ప్రజలకు జబూర్ గ్రంథంలోని దైవ వాక్యాలు బోధించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటే, దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు సులేమాన్. ఇన్ షా అల్లాహ్, సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ ప్రసంగంలో సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ఉండదు కానీ, దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రము తెలుపుతాను.
దావూద్ అలైహిస్సలాం వారి కుమారుడు సులేమాన్ అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. మరొకసారి ఇద్దరు వ్యక్తులు దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు తీర్పు కోసం వచ్చారు. సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి వద్ద చేను ఉంది, అందులో అతను పంట పండిస్తూ ఉంటే, పంట కొద్ది రోజుల్లో ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు కోతకు వస్తుంది అన్నప్పుడు, మరొక వ్యక్తి వద్ద ఉన్న పశువులు వచ్చి ఆ చేనులోకి దూరి పూర్తి పంటను నాశనం చేసేసాయి, మేసేసి. ఇప్పుడు ఆ చేను కలిగిన వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, కొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న నా పంట మొత్తము ఈ వ్యక్తి పశువులు వచ్చి నాశనం చేసేసాయి. ఈ వ్యక్తి ఇతని పశువుల్ని జాగ్రత్తగా కట్టుకుని బంధించుకొని ఉంచాల్సింది. నా చేనులోకి అతను ఎలాంటి భద్రత లేకుండా నిర్లక్ష్యంగా పశువుల్ని వదిలేసిన కారణంగా నా పంట మొత్తం నాశనమైపోయింది కాబట్టి నాకు నష్టపరిహారము ఇప్పించండి అని ఆ చేను కలిగిన వ్యక్తి అడగగా, దావూద్ అలైహిస్సలాం వారు తీర్పు ఇస్తూ, అతని వద్ద ఉన్న పశువులన్నీ నీవు తీసుకో అని చెప్పేశారు.
ఆ తీర్పు చెప్పగా ఆ పశువుల యజమాని అసహనం వ్యక్తపరుస్తూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఎదురుపడ్డారు. ఏంటయ్యా విషయం అని అడిగితే, చూడండి నా పశువులు వెళ్లి అతని చేనులో మేసాయి, అతని పంటకు నష్టం కలిగించాయి. అది నిజమే. అయితే నష్టపరిహారంగా నా పూర్తి పశువుల్ని అతనికి ఇచ్చేయమని మీ నాన్నగారు చెప్పేశారు. ఇదేంటయ్యా ఇది, ఏం న్యాయమయ్యా ఇది అని ఆయన అడుగుతూ ఉంటే, అసహనం వ్యక్తపరుస్తూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మళ్లీ వెంటపెట్టుకుని, పదండి నేను నాన్నతో మాట్లాడతాను అని మళ్లీ పిలుచుకుని వచ్చారు. నాన్నగారి వద్దకు వచ్చి, నాన్నగారు, మీరు తీర్పు ఇచ్చారు సరే, కానీ ఈ సమస్యకు మరొక తీర్పు కూడా ఉంటుంది. మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను, ఇన్ షా అల్లాహ్ ఆ తీర్పు మీకు నచ్చుతుంది అని చెప్పారు. దావూద్ అలైహిస్సలాం, సరే చెప్పు నాయనా చూద్దాము అని సులేమాన్ అలైహిస్సలాం వారికి అనుమతి ఇవ్వగా, సులేమాన్ అలైహిస్సలాం వారు అన్నారు, చూడండి చేతికి వచ్చిన పంట నాశనమైపోయింది. అతనికి తప్పనిసరిగా నష్టం వాటిల్లింది. అయితే ఈ పశువులు ఉన్న వ్యక్తికి ఇప్పుడు బాధ్యత ఏమిటంటే, అతను కొద్ది నెలల కోసము కష్టపడి ఆ చేనులో మళ్ళీ అదే పంట వేసి, పంట చేతికి వచ్చినంత వరకు దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుని, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట ఆ చేను యజమానికి మళ్ళీ అప్పగించాలి. అప్పటివరకు ఆ చేను యజమాని నీ పశువుల్ని తన వద్ద ఉంచుకుని వాటి పాలతో, ఇతర వేరే విషయాలతో లబ్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆ చేనులో పంట పండించి అతనికి ఆ పంట అప్పగిస్తావో, ఆ రోజు అతను నీ పశువులన్నీ కూడా నీకు అప్పగించేస్తాడు. అప్పటివరకు నీ పశువులు అతని వద్ద ఉంటాయి అని తీర్పు ఇవ్వగా, దావూద్ అలైహిస్సలాం వారు విని చాలా మెచ్చుకున్నారు. మాషా అల్లాహ్, ఈ తీర్పు చాలా బాగుంది. దీని ద్వారా ఇద్దరిలో ఏ ఒక్కరికి నష్టము ఉండదు, ఇద్దరూ లాభపడతారు, ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. చాలా మంచి తీర్పు అని దావూద్ అలైహిస్సలాం వారు మెచ్చుకున్నారు.
దావూద్ (అలైహిస్సలాం) మరణం
అయితే మిత్రులారా, ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారి వయస్సు 100 సంవత్సరాలకు చేరింది. ఇంతకుముందు మనము ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో దావూద్ అలైహిస్సలాం వారి ప్రస్తావన విని ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఏంటి ఆ విషయము?
ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినప్పుడు, ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని కూడా ఆదమ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. అప్పుడు ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని చూస్తూ చూస్తూ ఒక ఆత్మ వద్ద కాంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, ఎవరిది ఈ ఆత్మ, ఎవరు ఈయన అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇతను మీ కుమారుడు దావూద్, మీ తర్వాత చాలా సంవత్సరాలకు ప్రపంచంలో పుడతాడు అని అల్లాహ్ తెలియజేస్తే, అతని ఆయుష్షు ఎంత అని ఆదమ్ అలైహిస్సలాం వారు అడిగినప్పుడు, 60 సంవత్సరాలు అని అల్లాహ్ తెలియజేయగా, నా ఈ బిడ్డకు 60 సంవత్సరాలేనా ఆయుష్షు? నా ఆయుష్షులో నుంచి ఒక 40 సంవత్సరాలు అతని ఆయుష్షులోకి వేసేసి 100 సంవత్సరాలు చేయండి అని ఆదమ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ తో కోరగా, అల్లాహ్ ఆదేశంతో అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 100 సంవత్సరాలుగా మార్చబడింది అని ఆ రోజు మనము ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విని ఉన్నాము గుర్తుందా కదా అండి?
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 60 ప్లస్ 40 మొత్తం కలిపి 100 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 100 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు, దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటిని తలుపులు వేసేసి, బయట నుండి తాళం వేసేసి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపు తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. అనుకోకుండా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అది చూసి దావూద్ అలైహిస్సలాం కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. అయ్యో పరాయి వ్యక్తి తలుపులు, గదులు వేసి ఉన్నా గానీ, గదులు మూసేసి ఉన్నా, తలుపులు మూసేసి ఉన్నా, ఎలా వచ్చేసాడు గదిలోకి, లోపలికి? అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారు వచ్చి చూస్తే, మనమంతా అప్పుడు ఆయన దృష్టిలో కలంకితులమైపోతామేమో కదా, ఎలా వచ్చాడు ఈ వ్యక్తి? అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందులోనే దావూద్ అలైహిస్సలాం వారు తిరిగి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించి చూస్తే, కుటుంబ సభ్యులు ఉన్నారు, పక్కన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు.
దావూద్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చింది. పరాయి వ్యక్తి నేను లేనప్పుడు నా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అది నేను బయట నుండి తాళం వేసి వెళ్ళినప్పుడు? అని కోపంగా ఎవరయ్యా నువ్వు? అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏ తాళాలు, ఏ తలుపులు నన్ను ఆపలేవు, అంతెందుకు ఏ రక్షక భటులు కూడా నన్ను ఆపలేరు. నేను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వెళ్ళగలను అని చెబుతూ ఉంటే, వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు అర్థం చేసుకున్నారు. తలుపులు మూసివేసి ఉన్నా, నువ్వు లోపలికి రాగలిగినావు అంటే, నీవు మానవుడివి కావు, నీవు దైవదూతవు, అవునా? అన్నారు. అప్పుడు ఆయన, అవునండి, నేను దైవదూతనే, ఇప్పుడు మీ మరణ సమయము సమీపించింది, మీ ఆయుష్షు పూర్తి అయ్యింది, మీ ప్రాణము తీసుకుని వెళ్ళవలసి ఉంది అని చెప్పగా, దావూద్ అలైహిస్సలాం వారు మరణానికి సిద్ధమయ్యారు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి ప్రాణాలు ఆ దైవదూత తీసుకుని వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల వయస్సులో దావూద్ అలైహిస్సలాం వారి మరణము సంభవించింది. దావూద్ అలైహిస్సలాం వారి మరణానంతరం ప్రవక్త పదవి మరియు రాజ్యాధికారము ఆయన కుమారుడైన సులేమాన్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది.
సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ఇన్ షా అల్లాహ్ మనము వచ్చే ఆదివారము ఇన్ షా అల్లాహ్ వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడితో దావూద్ అలైహిస్సలాం వారి చరిత్ర తెలియజేసి నా మాటను నేను ముగిస్తూ ఉన్నాను.
అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర తెలుసుకుని, వాటి ద్వారా బోధపడే విషయాలు అర్థం చేసుకుని, మన విశ్వాసాన్ని పెంచుకుని, మన పాపాలను అలాగే మార్గభ్రష్టత్వాన్ని సంస్కరించుకుని అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రశ్న మరియు జవాబు
ప్రియ ప్రేక్షకులారా, విద్యార్థులారా, షేక్ గారు ప్రసంగించిన ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్న ఉంటే త్వరగా మీ ఎలక్ట్రానిక్ చేయిని ఎత్తండి, మీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వబడుతుంది.
దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఏమి గుణపాఠం నేర్చుకోవాలి అతని ద్వారాగా?
ఆ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీర్పు ఇచ్చే వారు ఒక వ్యక్తి మాటలే విని వేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు. ఇద్దరినీ, ప్రత్యర్థులు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి వీరి వాదనలు కూడా వినాలి, వారి వాదనలు కూడా వినాలి. ఇరువైపుల నుండి వాదనలు విని, ఆ తర్వాత ఎవరి పక్షంలో న్యాయం ఉంది అనేది గ్రహించి ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. కేవలం ఒక వర్గం మాటలే విని వేసి, ఆ వర్గం మాటల్నే సత్యమని నమ్మేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు అనేది ఒక విషయం.
అలాగే ప్రవక్త దైవ వాక్యాలు బోధించటంతో పాటు, ప్రాపంచిక ప్రజల ప్రాపంచిక సమస్యలు పరిష్కరించడానికి అతను ప్రజల రాజు కూడా అవ్వగలడు. ఒక ప్రవక్త ప్రవక్త పదవితో పాటు రాజుగా ఆ బాధ్యతలు కూడా నెరవేర్చగలడు. రాజులు ప్రవక్తలుగా, ప్రవక్తలు రాజులుగా ఉండటము నేరము కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రవక్తలు కేవలము ధార్మిక విషయాలు బోధించేంత వరకు మాత్రమే పరిమితమై ఉండాలి, వారికి రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. రాజులు పరిపాలన చేసుకుంటూ ఉండాలి, వారికి ధార్మిక విషయాలలో జోక్యము తగదు అని డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం మరియు సులేమాన్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి, ఒకే వ్యక్తి ప్రవక్తగా కూడా ధార్మిక విషయాలు బోధించగలడు, ఒకే వ్యక్తి రాజుగా కూడా ప్రజలకు నాయకత్వం వహించగలడు అనే విషయాలు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే ఆకాశ గ్రంథాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మంది ప్రవక్తలకు ఇచ్చి ఉన్నాడు. అందులో నాలుగు ఆకాశ గ్రంథాలు ప్రసిద్ధి చెందినవి. అందులో ఒక గ్రంథము జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. అయితే ఇప్పుడు అది అసలు రూపంలో ప్రపంచంలో లేదు. ఖురాన్ గ్రంథము అవతరించబడిన తర్వాత మిగతా గ్రంథాలు అన్నీ కూడా మన్సూఖ్ (రద్దు) అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో చలామణిలో మరియు చెల్లుబాటులో ఉన్న ఆకాశ గ్రంథము ఖురాన్ గ్రంథము అని కూడా మనము గ్రహించాలి.
అలాగే ప్రవక్త ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప దైవభక్తుడు అయినా మరణము తప్పదు, తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది. మనిషి ఎక్కడ ఉన్నా, దైవదూతలు అక్కడికి వెళ్లి అతని ప్రాణాలు తీయగలరు. అతను తలుపులు వేసుకుని గది లోపల ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మరణం సమీపించినప్పుడు దైవదూతలు వెళ్లి అతన్ని అక్కడి నుంచి ప్రాణాలు తీయగలరు. ఇలాంటి కొన్ని విషయాలు మనకు దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడతాయి.
గురువుగారు, ఇక్కడ ఆదమ్ అలైహిస్సలాం గారు తమ ఆయుష్షు నుంచి 40 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలాం గారికి ప్రసాదిస్తారు కదా, ప్రసాదించిన 40 సంవత్సరాలను కలుపుకుని పూర్తి ఎన్ని సంవత్సరాలు వారు, వారికి ఆయుష్షు కలిగింది దావూద్ అలైహిస్సలాం కి? రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరాలు వారు, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం గారికి గిఫ్ట్ గా ఇచ్చిన 40 సంవత్సరాలు ఈ రివాయత్ అంటే ఆధారం ఇది, ఇది ఇజ్రాయెలీ రివాయతా లేకపోతే హదీస్ పరంగానండి ఇది? దీని ఆధారం?
రెండు విషయాలు అడిగారండి మీరు. అవునండి. ఒకటి, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం వారికి 40 సంవత్సరాల ఆయుష్షు ఇచ్చిన తర్వాత, దావూద్ అలైహిస్సలాం వారి పూర్తి ఆయుష్షు ఎంత? అని అడిగారు. ఇది మొదటి ప్రశ్న కదండీ. దాని సమాధానం ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారి అసలు ఆయుష్షు 60 సంవత్సరాలు, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి పొందిన 40 సంవత్సరాలు. 60 మరియు 40, రెండు కలిపి మొత్తం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయన ఆయుష్షు అని మనకు ఇస్లామీయ గ్రంథాల ద్వారా, ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలపబడింది. వేరే గ్రంథాల వారు ఆయన ఆయుష్షు 77 సంవత్సరాలు అని కూడా చెబుతూ ఉంటారు. కాకపోతే అవన్నీ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ విషయాల మీద మనము నిజము అని చెప్పడానికి లేదు, అబద్ధము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అవి మన్సూఖ్ (రద్దు) అయిపోయిన గ్రంథాలు. మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ఉన్న విషయాలే ప్రామాణికమైనవి కాబట్టి నేను ఇవి మాత్రమే ప్రస్తావించాను, వాటి జోలికి నేను వెళ్ళలేదు. ఇది మొదటి విషయము. ఆయన ఆయుష్షు పూర్తి 100 సంవత్సరాలు అనేది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి 40 సంవత్సరాలు ఆయనకు ఇవ్వబడటము, ఇది ఇస్రాయీలీ ఉల్లేఖనమా లేదా ప్రవక్త వారి ఖురాన్ లేదా హదీస్ ఉల్లేఖనాలా అని విధంగా మీరు అడిగారు. దాని సమాధానం ఏమిటంటే, ఇవి ఇస్రాయీలీ ఉల్లేఖనాలు కావండి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచనాలలో నుంచి వచ్చిన ఒక విషయం అండి. ముస్నద్ అహ్మద్ అనే ఒక హదీస్ గ్రంథం ఉంది. అందులో దీని ప్రస్తావన వచ్చి ఉంది.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
తాలూత్ – మహారాజుగా మారిన పశువులకాపరి (1030-1010 క్రీ.పూ)
“అల్లాహ్ తాలూత్‌ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!” (2:247)
ఇ స్రాయీల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె (మూసా కాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె టాబర్నికల్) చాలా పవిత్రమైనదని, తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు. చివరకు యుద్ధాలలోను దానిని తీసుకుని వెళ్ళేవారు. దాని వల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్యసాహసాలు లభించేవి. దీని వల్ల వారి శత్రువులు కూడా భయ భీతులయ్యేవారు. దానికి అల్లాహ్ ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు.
క్రమేణా ఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. అల్లాహ్ వారిపై వారి శత్రువులను (పలస్తీనులను) పంపించాడు. ఇస్రాయీల్ ప్రజలను పలస్తీనులు ఓడించారు. వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు. వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు. ఇస్రాయీలీల అధికారం ,ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండాపోయారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు.
అప్పుడు ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం) వారి వద్దకు వచ్చారు. ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది. తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని, అందుకు ప్రవక్త సహకరించాలని వారు ఆయన్ను కోరారు. ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు. కాని ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం)కు వారి బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల ఆయన వారితో, “పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు” అన్నారు. కాని వారు ఆయనతో, తాము చాలా పరాభవాలు సహించామని, ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) – చేప కడుపులో సజీవంగా మిగిలిన మనిషి (800-750 క్రీ.పూ)
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో] వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్ https://youtu.be/fDVp3h9FRXI [31నిముషాలు]
ఈ ఉపన్యాసంలో, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వివరించబడింది. ఇందులో యూనుస్ (అలైహిస్సలాం) వారి తండ్రి పేరు, ఖురాన్లో ఆయనకు ఇవ్వబడిన బిరుదులు, మరియు ఆయన నీనెవా పట్టణ ప్రజల వైపుకు ప్రవక్తగా పంపించబడిన వివరాలు ఉన్నాయి. నీనెవా ప్రజలు ఆయన సందేశాన్ని తిరస్కరించినప్పుడు, ఆయన అల్లాహ్ అనుమతి లేకుండానే కోపంతో ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, నీనెవా ప్రజలు తమపైకి రాబోతున్న దైవ శిక్షను చూసి పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకోగా, అల్లాహ్ వారిని క్షమించారు. మరోవైపు, ఓడలో ప్రయాణిస్తున్న యూనుస్ (అలైహిస్సలాం) వారిని తుఫాను కారణంగా సముద్రంలోకి విసిరివేయగా, ఒక పెద్ద చేప ఆయనను మింగేసింది. చేప కడుపులోని చీకట్లలో ఆయన అల్లాహ్‌ను ప్రార్థించగా, అల్లాహ్ ఆయన ప్రార్థనను అంగీకరించి, ఆయనను రక్షించారు. ఈ సంఘటనల ద్వారా పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యత, దుఆ యొక్క శక్తి, మరియు దైవ సందేశాన్ని బోధించడంలో సహనం ఎంత అవసరమో వివరించబడింది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర
ఈనాటి ప్రసంగంలో మనం ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకుందాం.
యూనుస్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు మత్తా. కాబట్టి, ఆయనను యూనుస్ బిన్ మత్తా అని పిలుస్తూ ఉంటారు. అలాగే, ఆయనకు జున్నూన్ అనీ, అలాగే సాహిబుల్ హూత్ అనీ బిరుదులతో ఖురాన్‌లో ప్రస్తావించబడి ఉంది.
ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. ఈ నీనెవా పట్టణము ఎక్కడ ఉంది అంటే, ఇరాక్ దేశంలోని ఉత్తర దిశన దజలా అనే ఒక నది ఉంది. ఆ నదికి ఒక వైపు మూసిల్ అనే పట్టణం ఉంటే, ఆ మూసిల్ పట్టణానికి ఎదురుగా నదికి మరో వైపు ఈ నీనెవా పట్టణం ఉంది. మధ్యలో నది, ఒక వైపు నీనెవా పట్టణము, మరోవైపు మోసెల్ పట్టణము ఉన్నాయి. ఆ ప్రదేశంలో ఈ నీనెవా పట్టణం ఉంది.
ఆ రోజుల్లోనే నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉండేది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆ పట్టణ ప్రజల సంఖ్య గురించి కూడా ప్రస్తావించి ఉన్నాడు. మనం చూచినట్లయితే, ఖురాన్‌లోని 37వ అధ్యాయం, 147వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَأَرْسَلْنَاهُ إِلَىٰ مِائَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ “మరి మేమతన్ని ఒక లక్షమంది, అంతకన్నా ఎక్కువ మంది వైపుకే (ప్రవక్తగా) పంపాము..” (37:147)
అనగా, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజల వైపుకి ప్రవక్తగా పంపించబడే సమయానికి నీనెవా పట్టణ ప్రజల సంఖ్య లక్ష కంటే ఎక్కువగా ఉంది ఆ రోజుల్లోనే అని ఖురాన్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తెలియజేసి ఉన్నాడు.
అయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఆ నీనెవా పట్టణ ప్రజల వద్దకు వెళ్ళి దైవ వాక్యాలు వారికి బోధిస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని పట్టించుకోలేదు, విశ్వసించలేదు. యూనుస్ అలైహిస్సలాం వారు చాలా రోజుల వరకు, చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి దైవ వాక్యాలు వారికి బోధిస్తూ ఉన్నా, వారు మాత్రము ససేమిరా అంటూ ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి మాటల్ని అసలు విశ్వసించనే లేదు.
చివరికి, ఒక రకంగా యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది, మీ మీద అల్లాహ్ శిక్ష వచ్చి పడుతుంది, ఎన్ని విధాలుగా మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతూ ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు, విశ్వసించట్లేదు కాబట్టి మీ మీద శిక్ష వచ్చి పడుతుంది అల్లాహ్ తరఫున అని హెచ్చరించి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ పట్టణ ప్రజలని శిక్షించాలని నిర్ణయించాడు. ఆ విషయం యూనుస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేయగా, యూనుస్ అలైహిస్సలాం వారు చివరిసారిగా వెళ్లి పట్టణ ప్రజలకు, మీ మీద ఫలానా సమయంలో ఫలానా దినములో దైవ శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి, అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్లిపోయాడు.
ఒక రకంగా చెప్పాలంటే, యూనుస్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చి ఉంది, పట్టణ ప్రజలు ఆయన మాటను విశ్వసించలేదు అని. కాబట్టి, మీ మీద దైవ శిక్ష వచ్చి పడే రోజు సమీపంలో ఉంది అని చెప్పి హెచ్చరించేసి కోపంగా ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. ఆ విషయం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో తెలియజేసి ఉన్నాడు.
وَذَا النُّونِ إِذ ذَّهَبَ مُغَاضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ “చేపవాడు (యూనుస్ అలైహిస్సలాం) కోపగించుకుని వెళ్ళిపోయినప్పటి స్థితి(ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి.) మేము తనను పట్టుకోలేమని అతడు భావించాడు.” (21:87)
చేపవాడు అనగా యూనుస్ అలైహిస్సలాం కోపగించుకొని వెళ్ళిపోయినప్పటి స్థితిని జ్ఞప్తికి తెచ్చుకోండి. మేము తనను కష్ట దశలోకి నెట్టమని అతను భావించాడు. కోపగించుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరిపోయి ఏకంగా సముద్రపు ఒడ్డుకి చేరాడు. సముద్రపు ఒడ్డున అప్పటికే సామాను మొత్తం మోసుకొని బయలుదేరటానికి ఒక పడవ సిద్ధంగా ఉంటే, ఆ పడవ ఆయన ఎక్కేశాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని చెప్తున్నాడు అంటే, మా ఆజ్ఞ రాకముందే ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళాలని మా తరఫు నుంచి అనుమతి రాకముందే ఆయన, అల్లాహ్ నాకు కష్టంలోకి నెట్టడులే అని భావించి బయలుదేరిపోయాడు.
నీనెవా ప్రజల పశ్చాత్తాపం
బయలుదేరిన తర్వాత, ఇక్కడ పట్టణ ప్రజల విషయం ఏమి జరిగిందో తెలుసుకొని తర్వాత యూనుస్ అలైహిస్సలాం వారి గురించి తెలుసుకుందాం. ఇక్కడ, పట్టణ ప్రజలు కొద్ది రోజుల తర్వాత చూస్తే, ఒక నల్లటి మేఘము ఆ నీనెవా పట్టణం వైపుకి వస్తూ ఉంది. ఆ నల్లటి మేఘంలో నిప్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసి వారు అర్థం చేసుకున్నారు, యూనుస్ ఏ శిక్ష గురించి అయితే మమ్మల్ని హెచ్చరించాడో ఆ శిక్ష అదిగో అక్కడ వస్తూ ఉంది అని వారు అర్థం చేసుకొని, వెంటనే ఆ పట్టణ పెద్దల వద్దకు వెళ్లి, ఇదిగో దైవ శిక్ష వస్తూ ఉంది, ఇప్పుడు ఏమి చేయాలి అని వారు వెళ్లి అడిగితే, అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమన్నారంటే, మనకు పూర్వము ప్రవక్తల అనుచర సమాజాన్ని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలను వారు తిరస్కరించిన కారణంగా శిక్షించాడు. వాళ్లు దైవ శిక్షకు గురయ్యి మట్టి కలిసిపోయారు. అదే విధంగా అల్లాహ్ శిక్ష మన మీద కూడా రాబోతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే, అందరూ ఇళ్ల నుండి బయలుదేరండి, ఒక మైదానంలో ప్రోగవ్వండి అని ఆదేశించారు.
ఇళ్ల నుండి పిల్లా, పెద్ద, ఆడ, మగ అందరూ కూడా చిరిగిపోయిన, అతుకులు వేయబడిన బట్టలు ధరించి మైదానంలో వచ్చి ప్రోగయ్యారు. అప్పుడు ఆ పట్టణ పెద్దలు ఏమి చేశారంటే, మనుషులందరినీ విడివిడిగా నిలబెట్టేశారు. చివరికి తల్లి, బిడ్డలను కూడా విడివిడిగా నిలబెట్టేసి, ప్రతి ఒక్కడూ అతను నిలబడిన స్థానంలోనే అల్లాహ్‌కు చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ, క్షమాపణ వేడుకుంటూ ఈ శిక్ష మా మీద నుంచి తొలగించమని కోరుకుందాము, ప్రార్థిద్దాము అని చెప్పారు. అలాగే జరిగింది. ప్రజలందరూ కూడా మైదానంలో నిలబడ్డారు, నిలబడి అల్లాహ్‌తో ఏడుస్తూ ప్రార్థనలు చేశారు. మూడు రోజుల వరకు ఆ మేఘాలు ఆ పట్టణం మీద సంచరించాయి అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. ప్రజలు కూడా మూడు రోజుల వరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఏడుస్తూ క్షమాభిక్ష వేడుకున్నారు అని కూడా తెలపబడింది.
వారందరూ చిత్తశుద్ధితో, పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని విశ్వాసము ఎప్పుడైతే పొందటానికి సిద్ధపడ్డారో, అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి, వారి మీద సంచరిస్తూ ఉన్న ఆ శిక్షను తొలగించేశాడు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ దయవల్ల ఆ శిక్ష తొలిగిపోయింది. శిక్ష తొలిగిపోయిన తర్వాత, అక్కడ యూనుస్ అలైహిస్సలాం వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యూనుస్ (అలైహిస్సలాం) వారి పరీక్ష మరియు ప్రార్థన
యూనుస్ అలైహిస్సలాం వారు ఎప్పుడైతే పడవ ఎక్కేశారో, కోపగించుకొని వెళ్లి, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే ఎప్పుడైతే ఆయన పడవ ఎక్కేసి బయలుదేరిపోయారో, పడవ సముద్రం మధ్యలో వెళుతూ ఉన్నప్పుడు, తూఫాన్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ పంపించేశాడు. తూఫాన్ కారణంగా పెద్ద అలలు వస్తూ ఉంటే, పడవ నీట మునిగే ప్రమాదము పొంచి వచ్చింది. అప్పుడు ఆ పడవలో ఉన్న వారు పడవ మునిగిపోరాదని పడవలో ఉన్న భారము తగ్గించేయండి అంటూ అందులో ఉన్న సామాగ్రి తీసి నీటిలో పడవేశారు. అయినా గానీ బరువు తగ్గలేదు. ఇంకా బరువు తగ్గించాలి. కాబట్టి మనుషుల్లో నుంచే కొంతమందిని ఇప్పుడు పడవలో నుంచి బయటికి తోసి వేయాల్సి వచ్చింది. అయితే ఎవరిని తోసి వేయాలి? దాని కోసము వారు ప్రణాళిక ఏమని రచించారంటే, చీటీలు వేద్దాం. ఎవరి పేరు వస్తుందో వారిని నీటిలో పడవేద్దామని చీటీలు వేసి చీటీ ఎత్తితే, యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వచ్చింది.
యూనుస్ అలైహిస్సలాం వారి పేరు వస్తే, వారు యూనుస్ అలైహిస్సలాం వారు బోధకులు కాబట్టి గౌరవిస్తూ, ఈయనను వద్దు అని రెండవ సారి మళ్లీ చీటీ ఎత్తారు. మళ్లీ ఆయన పేరే వచ్చింది. మూడవసారి చీటీ ఎత్తారు. మూడవసారి కూడా ఆయన పేరే వచ్చింది. ఆ విధంగా మూడు సార్లు చీటీ ఎత్తినప్పుడు ఆయన పేరే వస్తే, అప్పుడు విషయం అర్థమైపోయింది. యూనుస్ అలైహిస్సలాం వారినే ఇక్కడి నుంచి ఇంకా నీటిలో పడవేయాలని. ఆ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారిని నీటిలో పడవేయగా, అల్లాహ్ ఆజ్ఞతో ఒక పెద్ద చేప వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారిని మ్రింగేసింది. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పడవ ఎక్కిన విషయము తెలియజేశాడు, ఆ తర్వాత పడవలో చీటీలు వేయబడిన విషయము కూడా తెలియజేశాడు.
మనం చూచినట్లయితే ఖురాన్‌లోని 37వ అధ్యాయం 140వ వాక్యంలో ఈ విధంగా తెలపబడి ఉంది,
యూనుస్ అలైహిస్సలాం తన జనుల నుండి పలాయనం చిత్తగించి, నిండు నౌక వద్దకు చేరుకున్నాడు. నౌక వద్దకు చేరుకొని, నౌకలో బయలుదేరితే తూఫాను వచ్చింది, అప్పుడు చీటీలు వేయబడ్డాయి. చూడండి 37వ అధ్యాయం 141వ వాక్యంలో తెలపబడింది,
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ “చీటీలు వేయటం జరిగింది. చివరకు అతనే ఓడిపోయాడు..” (37:141)
చీటీలు వేయటం జరిగింది, చివరకు అతనే ఓడిపోయాడు. అనగా యూనుస్ అలైహిస్సలాం వారే ఓడిపోయారు. ఆయనకే నీటిలో పడవేయటం జరిగింది. ఒక పెద్ద చేప వచ్చి ఆయనను మింగింది. 37వ అధ్యాయం 142వ వాక్యంలో చూడండి,
فَالْتَقَمَهُ الْحُوتُ وَهُوَ مُلِيمٌ “తరువాత అతన్ని చేప మ్రింగేసింది. అప్పుడు అతను తన్ను తానే నిందించుకోసాగాడు.“ (37:142)
తర్వాత చేప అతన్ని మ్రింగేసింది, అప్పుడు అతను తన్ను తాను నిందించుకోసాగాడు. యూనుస్ అలైహిస్సలాం వారిని ఏ చేప అయితే వచ్చి మింగిందో, ఆ చేపకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. నీవు యూనుస్ అలైహిస్సలాం వారి శరీరానికి ఎలాంటి గాయము కాకుండా చూసుకోవాలి. అలాగే ఆయన శరీరంలోని ఒక్క ఎముక కూడా విరగరాదు అని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి, చేప యూనుస్ అలైహిస్సలాం వారిని నమలలేదు, ఎలాంటి గాయము కలగకుండా మింగింది, ఆయన చేప కడుపులోకి వెళ్లిపోయాడు.
వెళ్లిన తర్వాత, చేప యూనుస్ అలైహిస్సలాం వారితో సముద్ర లోతుల్లోకి వెళ్ళింది. అప్పుడు యూనుస్ అలైహిస్సలాం వారు, అల్లాహ్ ఆజ్ఞ రాకముందే నేను తొందరపడి వచ్చేసానే, తప్పు చేశాను కదా అని అప్పుడు గ్రహించి, చేప గర్భం నుండి, అంటే చేప కడుపు నుండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాను తలుచుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ఏమని ప్రార్థించాడో, ఆ పలుకులు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లో ప్రస్తావించి ఉన్నాడు. 21వ అధ్యాయం 87వ వాక్యంలో అక్కడ మనం చూచినట్లయితే,
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ إِنِّي كُنتُ مِنَ الظَّالِمِينَ “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాణ్ణి” అని మొరపెట్టుకున్నాడు.“ (21:87)
అనగా, అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు. నిజానికి నేనే దోషులలో చేరిన వాడ్ని” అని మొరపెట్టుకున్నాడు. చీకట్లలో నుంచి ఆయన ప్రార్థన చేశాడు అంటే, ఏ చీకటి? ధార్మిక పండితులు మూడు విషయాలు తెలియజేశారు. ఒకటి, ఆయన ప్రార్థన చేసే సమయానికి రాత్రి అయ్యి ఉండింది, రాత్రి చీకటి. రెండవది, చేప ఆయనను తీసుకొని సముద్ర లోతుల్లోకి వెళ్ళింది కాబట్టి, సముద్ర లోతుల్లో అక్కడ చీకటి ఉంది. రెండు. మూడో విషయం ఏమిటంటే, చేప గర్భంలో, చేప కడుపులో ఆయన ఉన్నాడు కదా, అక్కడ కూడా చీకటి ఉంది. ఈ విధంగా, మూడు చీకట్లలో నుంచి ఆయన అల్లాహ్‌కు ప్రార్థన చేశారు.
అలాంటి చోటు నుంచి కూడా ఆయన అల్లాహ్‌ను తలుచుకుంటూ ఉంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వినే శక్తి కలిగిన వాడు, ఆయన ప్రార్థనను విన్నాడు. విని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించి, ఆయన ప్రార్థనను ఆమోదించి, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని, కష్టాన్ని తొలగించాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 37వ అధ్యాయం, 143, 144 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నాడు.
فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنجِي الْمُؤْمِنِينَ “అందువల్ల మేము అతని మొరను ఆలకించాము. దుఃఖం నుంచి అతనికి విముక్తిని కల్పించాము. విశ్వాసులను మేము ఇలాగే కాపాడుతాము.” (21:88)
అల్లాహు అక్బర్! ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత నిరాశ చెంది ఉంటే, నాకు చేప మింగేసింది, ఇక నాకు బయట పడే మార్గమే లేదులే అని నిరాశ చెంది ఉంటే, అల్లాహ్‌కు తలుచుకోకుండా ఉండి ఉంటే, ఆయన ప్రళయం వరకు అక్కడే ఉండిపోయేవాడు. కానీ, అక్కడి వెళ్లి కూడా ఆయన అల్లాహ్ మీద నమ్మకం ఉంచి, అల్లాహ్ వింటాడు అని భావించి, వాస్తవానికి అల్లాహ్ వింటున్నాడు కాబట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విని, ఆయన మీద ఉన్న ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఎలా తొలగించాడు అంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము, అల్లాహ్ ఆజ్ఞతో చేప సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆయనను కక్కేయగా, ఆయన మళ్లీ కడుపులో నుంచి సముద్ర ఒడ్డుకి వచ్చి పడ్డారు.
అయితే చేప కడుపులో ఆయన ఎన్ని రోజులు గడిపారు అంటే, ధార్మిక పండితులు మూడు రకాల విషయాలు తెలియజేసి ఉన్నారు. ఒక విషయం ఏమిటంటే, ఆయన మూడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, ఏడు రోజులు గడిపారు అని కొందరు తెలియజేసి ఉన్నారు. లేదు, 40 రోజులు గడిపారు అని మరికొందరు తెలియజేసి ఉన్నారు. అయితే మూడు రోజులు గడిపారన్న విషయము ఎక్కువగా ప్రచారంలో ఉంది. అసలు విషయము అల్లాహ్‌కు తెలుసు. ఏది ఏమైనప్పటికిని, యూనుస్ అలైహిస్సలాం వారు వచ్చి మళ్ళీ సముద్ర ఒడ్డున పడ్డారు. ఆయన సముద్ర ఒడ్డుకి చేరుకునే సమయానికి, ఆయన అనారోగ్యానికి, అస్వస్థతకు గురై ఉన్నారు. మూడు రోజులు చేప కడుపులో ఉన్నారు కదా, కాబట్టి ఆయన అస్వస్థతకు గురై ఉన్నారు. ఖురాన్‌లో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. 37వ అధ్యాయం 145వ వాక్యాన్ని మనం చూచినట్లయితే,
ఆయన ఆరోగ్యము సరిగా లేదు, అస్వస్థతకు గురై ఉన్నారు. ఆయన లేచి నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, అంతగా ఆయన అస్వస్థతకు, అనారోగ్యానికి, బలహీనతకు గురై ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయ తలచి అడవుల్లో నివసిస్తున్న జింకను లేదా ఒక గొర్రెను ఆదేశించగా, ఆ గొర్రె వచ్చి యూనుస్ అలైహిస్సలాం వారు ఉన్న చోట నిలబడితే, ఆ గొర్రె పాలు లేదా జింక పాలు ఆయన తాగేవారు. అలాగే, ఎక్కడైతే యూనుస్ అలైహిస్సలాం వారు పడి ఉన్నారో, ఆ ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీగ లాంటి ఒక మొక్కను అక్కడ మొలకెత్తించాడు. ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు స్వస్థత లభించింది, అలాగే ఆ తీగ ఆకుల వల్ల ఆయనకు నీడ కూడా లభించింది అని తెలపబడి ఉంది. మనం చూచినట్లయితే 37వ అధ్యాయం 146వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు,
ఆ తీగ చెట్టు ఏమి చెట్టు అంటే, కొంతమంది ధార్మిక పండితులు సొరకాయ తీగ అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్‌కే తెలుసు. మొత్తానికి ఒక తీగ చెట్టును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మొలకెత్తించాడు. ఆ ఆకులతో మరియు ఆ చెట్టు నీడతో ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత ప్రసాదించాడు.
ఆ తర్వాత, ఆయన ఎప్పుడైతే ఆరోగ్యవంతుడయ్యాడో, స్వస్థత పొందిన తర్వాత, ఆయన మళ్ళీ అక్కడి నుంచి నీనెవా పట్టణానికి వెళ్ళాడు. అప్పటికే ఆ సంఘటన మొత్తం జరిగి ఉంది. దైవ శిక్ష మేఘాల రూపంలో రావటం, ప్రజలందరూ మైదానంలో ప్రోగయ్యి అల్లాహ్‌ను తలుచుకొని ఏడ్చి, పశ్చాత్తాపము చెంది, క్షమాపణ కోరుకోవటం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించి శిక్షను తొలగించటం, ఇదంతా అప్పటికే సంభవించి ఉంది. వారి మీద ఉన్న శిక్ష తొలగించబడింది అన్న విషయము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్‌లోని 10వ అధ్యాయం, 98వ వాక్యంలో ప్రస్తావించి ఉన్నాడు.
لَمَّا آمَنُوا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْيِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَمَتَّعْنَاهُمْ إِلَىٰ حِينٍ “… వారు (యూనుస్ జాతి ప్రజలు) విశ్వసించగానే ప్రపంచ జీవితంలో అవమానకరమైన శిక్షను వారి నుంచి తొలగించాము. ఒక నిర్ణీత సమయం వరకూ జీవనలాభం పొందే అవకాశం వారికి కల్పించాము.” (10:98)
ఆ విధంగా, యూనుస్ అలైహిస్సలాం వారు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రజలందరూ కూడా విశ్వాసం పొందారు. యూనుస్ అలైహిస్సలాం ఆ పట్టణ ప్రజలకు దైవ నిబంధనలు నేర్పుకుంటూ అక్కడ జీవితం గడిపారు. ఈ విధంగా యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర క్లుప్తంగా మీ ముందర వివరించబడింది.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి జీవితంలో – యూనుస్ (అలైహిస్సలాం) వారి ప్రస్తావన
ఇక రండి, యూనుస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక వ్యక్తికి సన్మార్గం దక్కింది. అది ఎలాగా? అది కూడా విందాం ఇన్షాఅల్లాహ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో దైవ వాక్యాలు ప్రజలకు బోధిస్తున్న సమయంలో, మక్కా వెలుపల వెళ్లి దైవ వాక్యాలు బోధిద్దామని తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. ఇది చాలా ప్రచారంలో ఉన్న సంఘటన. అందరికీ తెలిసి ఉంటుంది ధార్మిక పండితుల నోట విని ఉంటారు. అయితే ఈ ప్రస్తావనలో మన అంశానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ పట్టణానికి వెళ్లారు. అక్కడ ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. ప్రజలు వినకుండా, తిరస్కరించి, చివరికి కుర్రాళ్ళు మరియు పెద్దలు అందరూ కలిసి ఆయనకు రాళ్లతో కొట్టటము, ఆయన స్పృహ కోల్పోయి పడిపోవటము, ఆ తర్వాత బానిస ఆయనను తీసుకెళ్లి ఒక తోటలో రక్తము, గాయాలు శుభ్రపరిచిన తర్వాత, ఆయనకు స్పృహ రావటము, ఆ తర్వాత దైవదూత జిబ్రీల్ వచ్చి, మీరు అనుమతి ఇస్తే ఈ పట్టణ ప్రజలని రెండు పర్వతాల మధ్య నుజ్జు నుజ్జు చేసేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వద్దు అని నిరాకరించడము, ఇదంతా జరిగిన చోటనే మరొక ముఖ్యమైన సంఘటన జరిగి ఉంది.
అదేమిటంటే, ఏ తోటలోకి అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్లి ఆ బానిస గాయాలు శుభ్రం చేస్తున్నాడో, రక్తం శుభ్రం చేస్తున్నాడో, ఆ తోట వచ్చి రబియా అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు, ఉత్బా మరియు షైబా అని, ఆ ఇద్దరు కుమారులది అది. ఆ సమయానికి వారిద్దరూ కూడా అక్కడ ఉన్నారు తోటలో. ప్రవక్త వారి పరిస్థితి చూసి, వారు జాలిపడి, వారి వద్ద ఒక బానిస ఉండేవాడు, అతని పేరు అద్దాస్. అతని పిలిపించి కొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చి తీసుకెళ్లి ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెబితే, అప్పుడు అద్దాస్ అనే బానిస ద్రాక్ష పండ్లు తీసుకెళ్లి ప్రవక్త వారికి ఇచ్చాడు.
అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ‘బిస్మిల్లాహ్‘ అని ఆ ద్రాక్ష పండ్లు తినటం ప్రారంభించారు. అది విని అద్దాస్‌కు ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశంలో ‘బిస్మిల్లాహ్’ అనే పలుకులు పలికే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ పలుకులు పలుకుతున్నారు అంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉందే అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త వారు ఆ వ్యక్తితో ఏమని అడిగారంటే, “అయ్యుల్ బిలాది అంత యా అద్దాస్, వ మా దీనుకా?” (ఓ అద్దాస్, నీవు ఏ పట్టణ వాసివి మరియు నీవు ఏ మతస్థుడివి?) అని అడిగితే, అతను అన్నాడు, “నేను ఒక క్రైస్తవుడిని, నేను నీనెవా పట్టణానికి చెందిన వ్యక్తిని” అని చెప్పాడు. చూశారా, నీనెవా పట్టణ ప్రస్తావన వచ్చేసింది ఇక్కడ.
ఇప్పుడు, నీనెవా పట్టణ ప్రస్తావన ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్నారో, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓహో, నీవు నా సోదరుడైన యూనుస్ బిన్ మత్తా అనే ప్రవక్త పట్టణానికి చెందిన వ్యక్తివా?” అని అడిగారు.
ఆ మాట వినగానే అద్దాస్‌కు ఆశ్చర్యానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే మక్కాలో ఉంటున్న ఒక వ్యక్తి ఆ రోజుల్లో ఈ దూరదర్శనాలు, ఈ టెలివిజన్లు, వేరే వేరే చోట్ల నుంచి ఏ ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలుసుకునే విషయాలు లేవు. ప్రవక్త వారు కూడా దూరపు ప్రయాణాలు ఆ రోజుల్లో చేసి లేరు. కాబట్టి, ఆయన ఆశ్చర్యపడుతూ, “యూనుస్ బిన్ మత్తా గురించి, నీనెవా పట్టణం గురించి మీకు ఎలా తెలుసండి?” అని అడిగితే, అప్పుడు ప్రవక్త వారు అన్నారు,
“జాక అఖీ, కాన నబియ్యన్ వ అన నబి.” (అతను నా సోదరుడు. అతను ఒక ప్రవక్త మరియు నేను కూడా ఒక ప్రవక్తనే.)
యూనుస్ బిన్ మత్తా ఒక ప్రవక్త అయ్యా, నేను కూడా ఒక ప్రవక్తనే. కాబట్టి, ఒక ప్రవక్తగా ఆ ప్రవక్త గురించి నాకు తెలుసు అని చెప్పారు. ఆ మాట వినగానే క్రైస్తవుడైన ఆ అద్దాస్ ప్రవక్త వారి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు, నుదుటను ముద్దు పెట్టుకుంటున్నాడు. దూరం నుంచి ఇద్దరు యజమానులు చూసి, “అదో, ఈ ముహమ్మద్ వారి మాటల్లో ఇతను కూడా పడిపోయాడు. ఆ ముహమ్మద్ వారి మాటల ప్రభావం ఇతని మీద కూడా పడిపోయింది” అని చెప్పి వారు మాట్లాడుకుంటున్నారు. తర్వాత, అద్దాస్ యజమానుల వద్దకు వెళితే, అప్పుడు వారిద్దరూ, “ఏమయ్యా, ద్రాక్ష పండ్లు ఇచ్చేసి వచ్చేయ్ అని మేము చెబితే, నీవేమో వెళ్లి అతని చేతులు ముద్దు పెట్టుకుంటున్నావు, నుదుట ముద్దు పెట్టుకుంటున్నావు. ఏంటిది?” అని అడిగితే, అప్పుడు ఆ అద్దాస్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అతను అన్నాడు, “లఖద్ అఖ్బరనీ బి అమ్రిన్ మా యఅలముహూ ఇల్లా నబీ.” (ఈయన నాకు ఒక విషయం గురించి తెలియజేశారు. ఆ విషయము ఒక ప్రవక్తకు తప్ప ఇతరులకు అది తెలియదు) అని చెప్పారు.
చూశారా, ఆయన ప్రవక్త అన్న విషయము బానిస అయిన క్రైస్తవుడు అద్దాస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, కొద్ది రోజుల తర్వాత ఆ అద్దాస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో హాజరయ్యి అతను ఇస్లాం స్వీకరించాడు అని కూడా తెలుపబడింది.
అయితే మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూనుస్ బిన్ మత్తా ప్రవక్త వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే చాలా సంవత్సరాల క్రితము వచ్చి వెళ్ళిన వారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కూడా ఆ నీనెవా పట్టణానికి ప్రయాణం చేసి వెళ్లి చూసి రాలేదు. ఒక ప్రవక్తగా ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన చరిత్ర ప్రస్తావించారు కాబట్టి, ఆయన తెలుసుకొని, గుర్తుపట్టి ఆ క్రైస్తవ బానిసకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు, వెంటనే ఆ బానిస ఆ విషయాన్ని గ్రహించి ప్రవక్త వారి శిష్యుడిగా మారాడు. కాబట్టి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన దైవ ప్రవక్త అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యం.
యూనుస్ (అలైహిస్సలాం) వారి జీవితం నుండి పాఠాలు
ఇక రండి, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనము తెలుసుకోవలసిన ఒకటి, రెండు, మూడు విషయాలు చెప్పి నేను ఇన్షాఅల్లాహ్ నా మాటను ముగిస్తాను.
ఒక విషయం ఏమిటంటే, పశ్చాత్తాపము చెందటం వలన మనిషి పాపాలు తొలిగిపోవటంతో పాటు, అతని మీద ఉన్న శిక్షలు, దుఃఖాలు కూడా తొలిగిపోతాయి అని మనకు తెలపబడింది. నీనెవా పట్టణ ప్రజల మీద దైవ శిక్ష వచ్చి పడుతూ ఉంటే, వారు పశ్చాత్తాపం పొందారు. వారు పశ్చాత్తాపం పొందిన కారణంగా, వారి పాపము మన్నించబడింది, వారిపై వస్తున్న, వారిపై పడబోతున్న శిక్ష కూడా తొలగించబడింది. కాబట్టి, పశ్చాత్తాపము చెందాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనుచర సమాజానికి “పశ్చాత్తాపం పొందుతూ ఉండండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు” అని తెలియజేసి ఉన్నారు.
అలాగే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, విశ్వాసి అల్లాహ్‌తో దుఆ చేసుకుంటూ ఉండాలి. అతను మేఘాలలో ప్రయాణిస్తూ ఉన్నా, నీటి మీద ప్రయాణిస్తూ ఉన్నా, లేదా భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నా, నీటి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, గాలిలో ప్రయాణిస్తూ ఉన్నా, భూమి లోపల ప్రయాణిస్తూ ఉన్నా, ఆయన ఎక్కడ ఉన్నా సరే, ఈ సర్వం అల్లాహ్ ది. ఈ సర్వానికి మొత్తానికి రాజు, రారాజు, అధిపతి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆయన ఆజ్ఞ ప్రతిచోట చెల్లుతుంది. కాబట్టి, విశ్వాసి ఎక్కడ ఉన్నా, అల్లాహ్‌ను తలుచుకుంటూ, అల్లాహ్‌ను వేడుకుంటూ, అల్లాహ్‌కు దుఆ చేసుకుంటూ ఉండాలి. చూడండి యూనుస్ అలైహిస్సలాం వారు నీటి లోపల, చేప కడుపులో ఉండి ఆయన దుఆ చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన దుఆను విన్నాడు, ఆమోదించాడు, సమస్యను పరిష్కరించి ఆయనకు గట్టెక్కించాడు. కదా? కాబట్టి, ఎక్కడ ఉన్నా నిరాశ చెందకూడదు. ప్రతిచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వింటున్నాడు, చూస్తున్నాడు. ఆయన జ్ఞానము ప్రతిచోట ఉంది అని మనము గమనించాలి.
అలాగే, యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక బోధకుడు దైవ వాక్యాలు బోధిస్తున్నప్పుడు విసుగు చెందరాదు. యూనుస్ అలైహిస్సలాం వారు నీనెవా పట్టణ ప్రజలు యూనుస్ అలైహిస్సలాం వారి మాటను పెడచెవిన పెట్టేస్తున్నారు కాబట్టి, ఆయన మాటను వారు పట్టించుకోవట్లేదు కాబట్టి, యూనుస్ అలైహిస్సలాం వారు విసుగు చెంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దైవ ఆజ్ఞ రాకముందే, అనుమతి రాకముందే ఆయన వెళ్లిపోయారు. ఒక రకంగా విసుగు చెందారు, కోపగించుకున్నారు. కాబట్టి, ఈ లక్షణము ఒక బోధకునికి సరికాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ అదే మాట తెలియజేసి ఉన్నాడు. చూడండి,
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَلَا تَكُن كَصَاحِبِ الْحُوتِ “కనుక నీ ప్రభువు తీర్పు వచ్చే వరకు ఓపిక పట్టు. చేపవాని మాదిరిగా అయిపోకు.” (68:48)
చేపవాడు అంటే యూనుస్ అలైహిస్సలాం వారే. యూనుస్ అలైహిస్సలాం వారు ఎలాగైతే విసుగు చెంది, కోపగించుకొని వెళ్ళిపోయారో, అలా చేయకు అని చెప్పారు. కాబట్టి, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు బోధించే వ్యక్తిలో విసుగు చెందడం అనే లక్షణము ఉండకూడదు.
ఇవి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్నందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠాలు అన్నీ నేర్చుకొని, తెలుసుకొని, మమ్మల్ని మనము సంస్కరించుకొని అల్లాహ్ మార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
యూనుస్ ను చేపమ్రింగేసింది. అప్పుడు అతను తన్న తానే నిందించుకోసాగాడు. ఒకవేళ అతను (అల్లాహ్) పవిత్రతను కొనియాడటంలో నిమగ్నుడై ఉండకపోతే… పునరుత్థానదినం వరకు చేప కడుపు లోనే ఉండిపోయేవాడు (37: 142-144)
నైనవాహ్ పట్టణ ప్రజలు విగ్రహారాధకులు. వారి జీవన విధానం సిగ్గు లజ్జ లేకుండా ఉండేవి. వారి వద్దకు ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం)ను అల్లాహ్ పంపించాడు. వారిని సంస్కరించ డానికి, అల్లాహ్ ను ఆరాధించేలా వారిని తీర్చిదిద్దడానికి ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) వచ్చారు. తమ ఆరాధనా విధానంలో యూనుస్ జోక్యం వారికి నచ్చలేదు. “మా తాతముత్తాతలు ఈ దేవుళ్ళనే ఆరాధించారు. మేము వీటిని చాలా కాలంగా ఆరాధిస్తున్నాము. మాకు ఎలాంటి హాని కలుగలేదు” అని వారు ఆయన మాటలను తిరస్కరించారు.
విగ్రహారాధన ఎంత అవివేకమైనదో, అల్లాహ్ ఆరాధనలోని ఔచిత్య మెంత గొప్పదో ఆయన వారికి నచ్చజెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. కాని వారు ఆయన మాటలు వినలేదు. తమ విధానాలు మార్చుకోనట్లయితే అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుందని ఆయన వారిని హెచ్చరించారు. అయినా వారు లక్ష్యపెట్టలేదు. తాము ఏ శిక్షకూ భయపడమని అన్నారు. ఆ శిక్ష ఏంటో రానీ చూద్దాం అన్నారు. నిరాశకు గురయిన యూనుస్ (అలైహిస్సలాం) వారితో, “అలా అయితే నేను మిమ్మల్ని మీ దురదృష్టానికి వదలి వేస్తున్నాను” అన్నారు. ఆ తర్వాత ఆయన అల్లాహ్ శిక్ష ఇక ఆ పట్టణాన్ని చుట్టుకుంటుందని భయపడి ఆ పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు.
ఆయన పట్టణం వదలి వెళ్ళిన వెంటనే అక్కడి ఆకాశం ఎర్రగా మంటలా మారిపోయింది. ఈ దృశ్యం చూసి ప్రజలు భయపడ్డారు. ఆద్, సమూద్, నూహ్ జాతి ప్రజల వినాశం గుర్తుకు తెచ్చుకున్నారు. తమకు కూడా అలాంటి గతి పట్టనుందా! అన్న ఆలోచన వారిలో నెమ్మదిగా ధార్మిక విశ్వాసాన్ని సృజించింది. వారంతా ఒక కొండపై గుమిగూడారు. అల్లాహ్ కారుణ్యం కోసం, ఆయన క్షమా భిక్ష కోసం ప్రార్థించడం ప్రారంభించారు. వారి మొరలతో కొండలు ప్రతిధ్వనించాయి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం వాతావరణమంతా అలముకుంది. అల్లాహ్ వారిపై తన ఆగ్రహాన్ని తొలగించి వారిని మరలా అనుగ్రహించాడు. భయంకరమైన తుఫాను శిక్ష తప్పుకోగానే వారు యూనుస్ ప్రవక్తను మళ్ళీ రావలసిందిగా కోరారు. ఆయన వచ్చి తమకు సరియైన మార్గం చూపించాలని కోరారు.
పడవ ప్రయాణం
ఈలోగా యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) ఒక పడవలో ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు కొంతమంది ప్రయాణీకులు ఉన్నారు. సముద్రంలో ప్రయాణమైన తర్వాత తీవ్రమైన తుఫాను గాలికి పడవ చిగురుటాకులా వణకి పోసాగింది. పర్వతాల వంటి అలల తాకిడికి పడవ తలక్రిందులైపోతోంది. పడవలో చాలా సామాను ఉంది. ప్రయాణీకులు తమ సామాన్లను పడవ నుంచి బయటకు విసరివేసారు. అయినా పడవలో బరువు చాలా ఎక్కువ ఉంది. ఇంకా బరువు తగ్గించకపోతే పడవకు ప్రమాదం. కాబట్టి కనీసం ఒక వ్యక్తిని సముద్రం లోకి విసిరేస్తే బరువు తగ్గుతుందని మిగిలిన వాళ్ళు బ్రతుకుతారని అనుకున్నారు. అందరూ చీటీలు వేశారు. ఈ లాటరీలో యూనుస్ ప్రవక్త పేరు వచ్చింది.
యూనుస్ ప్రవక్త గురించి వారికి తెలుసు. చాలా మంచివారు, గౌరవ నీయుడు. అటువంటి మనిషిని సముద్రంలో వదిలేయడానికి వాళ్ళు ఇష్టపడ లేదు. అందువల్ల వాళ్ళు మళ్ళీ లాటరీ వేశారు. రెండవసారి కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. చివరిసారిగా చూద్దామని మూడవసారి వేశారు. అప్పుడు కూడా యూనుస్ ప్రవక్త పేరే వచ్చింది. ఇందులో అల్లాహ్ అభీష్టం ఉందని యూనుస్ ప్రవక్త గుర్తించారు. ఆయన అల్లాహ్ అనుమతి లేనిదే తన పనిని మధ్యలో వదలివేశారు. ఒక ప్రవక్తగా ఆయన తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారు.
ప్రయాణీకులు తనను సముద్రంలో వదిలేయక ముందే ఆయన లేచి అల్లాహ్ పేరు స్మరిస్తూ సముద్రంలోకి దూకారు. భారీ అలల్లో ఆయన కలసిపోయారు.
చేప కడుపులో
యూనుస్ (అలైహిస్సలాం) కళ్ళు తెరిచేసరికి తాను తడితడిగా మెత్తగా ఉన్న ఒక నేలపై ఉన్నట్లు భావించారు. తన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా మూసివేయబడిన ఒక గుహలా ఉంది. అంతా చాలా చీకటిగా ఉంది. కాని చాలా మృదువుగా, మెత్తగా ఉంది. ఆయనకు కుదుపులు తగులుతున్నాయి. అలల్లో పడవకు తగిలే కుదుపుల వంటివి. తాను ఒక పెద్ద చేప కడుపులో ఉన్నట్లు ఆయన గుర్తించారు. తుఫాను సముద్రంలో ఆయన్ను కాపాడడానికి గాను అల్లాహ్ ఆయన్ను ఒక చేప మింగేసేలా చేశాడు. ఆయన వెంటనే అల్లాహ్ ను తలచుకుని తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. “అల్లాహ్ తప్ప వేరే దేవుడు ఎవరూ లేరు. ఔన్నత్యం ఆయనదే. నిస్సందేహంగా నేను తప్పు చేశాను” అన్నారు. అనంత కరుణామయుడు, అపారంగా క్షమించేవాడయిన అల్లాహ్ ఈ ప్రార్ధనను ఆలకిం చాడు. ఆ వెంటనే తాను బలవంతంగా బయటకు తోయబడిన అనుభూతి యూనుస్ (అలైహిస్సలాం)కు కలిగింది. ధడాలున ఆయన మెత్తని నేలపై వచ్చిపడ్డారు. ఆయన్ను బయటకు కక్కేసేలా అల్లాహ్ ఆ చేపకు ఆజ్ఞాపించాడు. యూనుస్ (అలైహిస్సలాం) వెంటనే అల్లాహ్ కు కృతజ్ఞతలు చెల్లించారు.
ఆయన ఒక నిర్జన ప్రదేశంలో ఉన్నారు. బలహీనంగా, ఒంటరిగా మిగిలి పోయారు. ఆయన పెద్ద పెద్ద ఆకులున్న ఒక పొదలో పడి ఉన్నారు. ఎండ వేడిమి నుంచి ఆ ఆకులు రక్షణ కల్పిస్తున్నాయి. అక్కడ చాలా సొరకాయలు ఉన్నాయి. వాటితో ఆయన తన ఆకలిని తీర్చుకున్నారు. నెమ్మదిగా ఆయన శక్తిని పుంజు కున్నారు. తన స్వస్థలం నైనవాహ్ కు ప్రయాణమయ్యారు. అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందించారు. ప్రజలంతా ఆయన్ను చాలా ఆదరంగా స్వాగతించారు. తామంతా నిజమైన దేవుణ్ణి విశ్వసించడం ప్రారంభించామని ఆయనకు తెలిపారు. వారంతా కలసి అల్లాహ్ కు కృతజ్ఞతా సూచకంగా ప్రార్ధనలు చేశారు. (చదవండి దివ్య ఖుర్ ఆన్ 6:86-57, 21:87-88 37:139-158)
గ్రహించవలసిన పాఠాలు
యూనుస్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు అప్పగించబడిన పనిని మధ్యలో విడిచి పెట్టి పట్టణాన్ని వదలి వెళ్ళిపోయారు. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కొరకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్లక్ష్యానికి శిక్షను అనుభవించారు. తమపై శిక్ష విరుచుకుపడే సూచనలు కనబడగానే దుర్మార్గులు తమ తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష అర్ధిస్తూ కారుణ్యం కోసం ప్రార్ధంచారు. అల్లాహ్ తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని వారిని సురక్షితంగా విడిచిపెట్టాడు.
యూనుస్ ప్రవక్త (అలైహిస్సలాం) విషయంలోనూ ఇదే జరిగింది. అల్లాహ్ ఆయన్ను ఒక విచిత్రమైన, భయంకరమైన సంఘటనకు గురిచేశాడు. ఆయన తన తప్పును గుర్తించి అల్లాహ్ ను క్షమాభిక్ష కోరారు. అల్లాహ్ కరుణ చూపి ఆయన్ను కాపాడాడు.
ప్రవక్త యూనుస్ (అలైహిస్సలాం) చేసిన సరళమైన, చిన్న ప్రార్ధన చాలా ప్రాముఖ్యం కలిగినది
హజ్రత్ సాద్ బిన్ అబీ వక్కాస్ ఉటంకం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “కష్టాల్లో ఉన్న ముస్లిం యూనుస్ ప్రవక్త చేసిన ప్రార్ధనతో అల్లాహ్ కు మొరపెట్టుకుంటే అల్లాహ్ ప్రతిస్పందిస్తాడు. ఇది అల్లాహ్ చేసిన వాగ్దానంగా భావించబడుతుంది” – లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక , ఇన్ని కుంతు మినజ్ఞాలిమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net