అల్లాహ్ యేతరులపై ప్రమాణం (ఒట్టు) చేయడం ధర్మ సమ్మతమేనా? [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా?
https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్

అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.

మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.

ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ
(ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్)
నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)

ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.

ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.

అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ
(లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం)
మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.

మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
(మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా)
ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.

ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.

అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.

అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ
(ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న)
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)

అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీనా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ
(మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక)
ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.

అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

అత్యంత పెద్ద నేరం, పాపం? – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

అత్యంత పెద్ద నేరం, పాపం?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0m0vDeE36Cw [21 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్త వివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.

అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.

నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.

అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.

మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం (31:13)

అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.

అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.

అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.

అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.

ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు. (5:72)

అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.

కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)

ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.

అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.

ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.

షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.

బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.

అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.

ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.

ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.

అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.

అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.

ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.

అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.

కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.

అఖూలు ఖౌలి హాజా అస్తగ్ ఫిరుల్లాహ్ లీ వలకుం వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17133

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7