విధివ్రాత (తఖ్దీర్) పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ  [వీడియో & టెక్స్ట్]

విధివ్రాత పట్ల విశ్వాసం
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=uiNNKuljqEU [13 నిముషాలు]

ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలో ఆరవది మరియు అత్యంత ముఖ్యమైనదైన విధివ్రాత (ఖద్ర్) పట్ల విశ్వాసం గురించి వివరించబడింది. విధివ్రాతను అర్థం చేసుకోవడానికి నాలుగు ముఖ్యమైన విషయాలు చర్చించబడ్డాయి: అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది, ప్రతిదీ ‘లౌహె మెహఫూజ్’లో వ్రాయబడి ఉంది, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది, మరియు ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు అని నమ్మడం. మానవునికి మంచి చెడులను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడిందని, దాని ఆధారంగానే తీర్పు ఉంటుందని కూడా స్పష్టం చేయబడింది. చివరగా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు—అసూయ నుండి రక్షణ, ధైర్యం కలగడం, మరియు మనశ్శాంతి, సంతృప్తి లభించడం—వివరించబడ్డాయి.

అల్ హమ్దు లిల్లాహి వహదా, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు. అందులోని ఆరవ ముఖ్యాంశం. ఈమాన్ బిల్ ఖద్ర్, విధి వ్రాత పట్ల విశ్వాసం. దీని గురించి ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

ఒకసారి ఆ హదీసును మరొకసారి మనం విందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి?” అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరిస్తూ,

أَنْ تُؤْمِنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ وَتُؤْمِنَ بِالْقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ
[అన్ తు’మిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వ తు’మిన బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]

అని సమాధానం ఇచ్చారు. దీని అర్థం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్, విశ్వాసం అంటే ఆరు విషయాల గురించి ప్రస్తావిస్తూ ఏమంటున్నారు? అల్లాహ్‌ను విశ్వసించటం, దైవదూతలను విశ్వసించటం, దైవ గ్రంథాలను విశ్వసించటం, దైవ ప్రవక్తలను విశ్వసించటం, పరలోక దినాన్ని విశ్వసించటం, మంచి చెడు విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. ఈ ఆరు విషయాలను నమ్మటం, విశ్వసించటాన్ని ఈమాన్ అంటారు, విశ్వాసం అంటారు అని ప్రవక్త వారు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆరవ విషయం గురించి ఆలోచించారా, గమనించారా? ఆరవ విషయం ఏమిటి?

اَلْإِيمَانُ بِالْقَدَرِ خَيْرِهِ وَ شَرِّهِ
[అల్ ఈమాను బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి]

మంచి చెడు విధి వ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం. విశ్వాస ముఖ్యాంశాలలో ఈ ఆరవ ముఖ్యాంశం, విధివ్రాత పట్ల విశ్వాసం, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం.

మిత్రులారా, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండటం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవటానికి, ఒక క్లారిటీకి, ఒక అవగాహనకు రావటానికి నాలుగు విషయాలు తెలుసుకొని నమ్మితే ఆ వ్యక్తి విధివ్రాత పట్ల ఒక అవగాహనకు వస్తాడు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ నాలుగు విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్‌కు ప్రతి విషయము వివరంగా తెలిసి ఉంది అని నమ్మాలి ప్రతి వ్యక్తి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు పూర్వం జరిగినది తెలుసు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ప్రస్తుతం జరుగుచున్నది కూడా తెలుసు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసు. దీనికి ఆధారం మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథము, తొమ్మిదవ అధ్యాయము, 115వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
[ఇన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్]

అంటే, నిశ్చయంగా అల్లాహ్‌కు ప్రతీదీ తెలుసు. జరిగిపోయినది తెలుసు, జరుగుచున్నది తెలుసు, జరగబోయేది కూడా అల్లాహ్‌కు తెలుసు. ఆయన మొత్తం జ్ఞానం కలిగి ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు అని మనము ఈ విషయాన్ని నమ్మాలి. ఇది మొదటి విషయం అండి.

ఇక రెండో విషయం ఏమిటి? సృష్టికి సంబంధించిన ప్రతి దాని అదృష్టాన్ని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. ఎక్కడ వ్రాసి పెట్టాడు? లౌహె మెహఫూజ్ అనే ఒక పవిత్రమైన, పటిష్టమైన గ్రంథము ఉంది. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దివ్య దృష్టితో భవిష్యత్తులో ఏమి జరగబోవుచున్నది అనేది మొత్తము చూసేసి, వ్రాయించేసి ఉన్నాడు. దానిని లౌహె మెహఫూజ్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వ్రాసి ఉంచాడు అన్న విషయాన్ని మనము నమ్మాలి. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథము 36వ అధ్యాయము, 12వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
[వ కుల్ల షైఇన్ అహ్సైనాహు ఫీ ఇమామిమ్ ముబీన్]

అంటే, ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. అదే లౌహె మెహఫూజ్, అది స్పష్టమైన గ్రంథము. ఆ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జరగబోయేది అంతా ముందే చూసి వ్రాయించి భద్రంగా ఉంచి ఉన్నాడు. ఈ విషయం కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఇక మూడో విషయం ఏమిటి అంటే, అల్లాహ్ తలచినది మాత్రమే సంభవిస్తుంది. ఈ సృష్టి మొత్తంలో ఎక్కడైనా సరే, అల్లాహ్ ఎలా తలుస్తాడో అలాగే జరుగుతుంది. ఎక్కడ వర్షాలు కురవాలి, ఎక్కడ ఎండ పడాలి, ఎక్కడ చలి వీయాలి, ఎక్కడ గాలులు వీయాలి, ఎక్కడ పంటలు పండాలి, ఇదంతా అల్లాహ్ తలచినట్లే జరుగుతుందండి, మీరు మేము అనుకున్నట్లు జరగదు. ఎక్కడైనా సరే ఏదైనా సంభవించాలి అంటే అది అల్లాహ్ తలచినట్టుగానే సంభవిస్తుంది, జరుగుతుంది. మరి దీనికి ఆధారం ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథం 81వ అధ్యాయం, 29వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
[వమా తషాఊన ఇల్లా అయ్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్]

అంటే, సర్వలోక ప్రభువైన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు. మీరు కోరుకున్నట్లు ఎక్కడా ఏమీ జరగదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచినట్లే జరుగుతుంది అన్న విషయము ఈ వాక్యంలో అల్లాహ్ తెలియపరిచి ఉన్నాడు. అది కూడా మనము తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఇక నాలుగో విషయం, అదేమిటంటే, విశ్వంలో ఉన్న వాటన్నింటినీ సృష్టించినవాడు, సృష్టికర్త ఒక్కడే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అని తెలుసుకొని మనము గట్టిగా నమ్మాలి. ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో, అవన్నీ సృష్టించబడి ఉన్నవి. ఒక అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే సృష్టికర్త. సృష్టికర్త ఆయన అల్లాహ్. ఆయన తప్ప ఈ సృష్టిలో ఉన్నది మొత్తము కూడా సృష్టించబడినది. సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే అన్న విషయము ప్రతి వ్యక్తి నమ్మాలి. మరి దానికి ఆధారం ఏమిటి అని మనం చూచినట్లయితే, ఖురాన్ గ్రంథం, 25వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

وَخَلَقَ كُلَّ شَيْءٍ فَقَدَّرَهُ تَقْدِيرًا
[వ ఖలక కుల్ల షైఇన్ ఫకద్దరహు తఖ్దీరా]

అంటే, ఆయన ప్రతి వస్తువును సృష్టించి, దానికి తగ్గట్టుగా దాని లెక్కను నిర్ధారించాడు. అంటే ఈ సృష్టిలో ఉన్న మొత్తాన్ని సృష్టించినవాడు, దాని లెక్కను నిర్ధారించినవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే. ఆ విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి తెలుసుకొని గట్టిగా నమ్మాలి.

ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మనిషి బాగా అర్థం చేసుకొని నమ్ముతాడో అప్పుడు విధివ్రాత పట్ల అతనికి ఒక అవగాహన వచ్చేస్తుంది.

అలాగే విధివ్రాతల పట్ల మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారము ఇచ్చి ఉన్నాడు. అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి మంచి చెడుల మధ్య వ్యత్యాసము గ్రహించే అధికారం ఇచ్చాడు. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది గ్రహించే శక్తి మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చి ఉన్నాడు. అలాగే, మంచి చెడు అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత, మంచిని ఎన్నుకోవాలా చెడుని ఎన్నుకోవాలా ఎన్నుకునే అధికారము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి ఇచ్చి ఉన్నాడు. మానవుడు తలిస్తే, మంచి చెడు అనేది తెలుసుకున్న తర్వాత, అతను మంచిని కూడా ఎన్నుకొని మంచివాడు కావచ్చు. అలాగే చెడ్డను, చెడును ఎంచుకొని అతను చెడ్డవాడుగా కూడా అయిపోవచ్చు. ఆ ఎన్నుకునే అధికారము మానవునికి ఇవ్వబడి ఉంది.

చూడండి, ఖురాన్ గ్రంథంలో, 76వ అధ్యాయం, మూడవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు:

إِنَّا هَدَيْنَاهُ السَّبِيلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا
[ఇన్నా హదైనాహుస్ సబీలా ఇమ్మా షాకిరౌ వ ఇమ్మా కఫూరా]

అంటే, మేమతడికి మార్గం కూడా చూపాము, ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతఘ్నతకు పాల్పడినా వాడి ఇష్టం, మేము వాడి స్వేచ్ఛను హరించలేదు అని తెలుపబడి ఉంది. అల్లాహు అక్బర్! అంటే, మంచి చెడు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవునికి చూపించేశాడు. ఇక ఎన్నుకునే అధికారం అతనికి ఉంది కాబట్టి, అతను మంచిని ఎన్నుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెల్లుస్తూ మంచివాడిగా ఉండిపోతాడో, లేదా చెడును ఎన్నుకొని అల్లాహ్‌కు కృతఘ్నుడైపోయి మార్గభ్రష్టుడైపోతాడో, అతని స్వేచ్ఛలోకి, అతనికి మనము వదిలేశామని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి ఎన్నుకునే అధికారం ఇచ్చి ఉన్నాడు, మంచిని ఎన్నుకునే బాధ్యత మనది, చెడు నుంచి దూరంగా ఉండే బాధ్యత మనది.

ఇక చివర్లో, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఫలితం ఏమి దక్కుతుంది మానవునికి అనేది తెలుసుకొని ఇన్షా అల్లాహ్ మాటను ముగిద్దాం. విధివ్రాతను నమ్మితే మనిషికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అందులోని మూడు ముఖ్యమైన ప్రయోజనాలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను, చూడండి.

మొదటి ప్రయోజనం ఏమిటంటే, మనిషి అసూయ నుండి రక్షించబడతాడు. ఎవరికైనా దైవానుగ్రహాలు దక్కాయి అంటే, వారికి అల్లాహ్ ఇచ్చాడులే అని మానవుడు సంతృప్తి పడతాడు. అసూయ పడితే అల్లాహ్ నిర్ణయానికి ఎదురెళ్లడం అవుతుంది అని అతను భయపడతాడు. మానవులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొందరికి బాగా ఇస్తాడు కదా, మరి కొందరికి ఇవ్వకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడతాడు కదా. విధివ్రాతను నమ్మిన వ్యక్తి, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలచి వారికి ఇవ్వాలనుకున్నారు ఇచ్చాడు, అది అల్లాహ్ చిత్తం ప్రకారం జరిగిందిలే అని, అనుగ్రహాలు దక్కిన వారిని చూసి ఇతను అసూయ పడడు. అల్లాహ్ వారికి ఇచ్చాడులే అని, వారి మీద అసూయ పడడు. ఒకవేళ నేను వారి మీద అసూయ పడితే, వారికి ఇవ్వబడిన అనుగ్రహాలు చూసి నేను లోలోపల కుళ్ళిపోతే, దైవ నిర్ణయానికి నేను ఎదురెళ్లిన వాడిని అవుతానేమోనని అతను భయపడతాడు, అసూయ పడడు. ఇది మొదటి ప్రయోజనం.

రెండో ప్రయోజనం ఏమిటి? మనిషికి ధైర్యం వస్తుంది. విధివ్రాతను నమ్మితే, విధివ్రాతను విశ్వసిస్తే మనిషికి ధైర్యం వస్తుంది. అది ఎట్లాగంటే, ఏదైనా అల్లాహ్ తలిస్తేనే జరుగుతుంది, లేదంటే జరగదు అని అతను బాగా నమ్ముతాడు కాబట్టి, ఏదైనా విషయం కొనాలి అన్నా, ఏదైనా పని ప్రారంభించాలి అన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా అతను అటూ ఇటూ చేసి లేదా ఏమేమో ప్రపంచంలో జరుగుతున్న వార్తలు చూసి భయపడడు. అల్లాహ్ ఎలా తలిస్తే అలా జరుగుతుందిలే అని నమ్మకంతో, ధైర్యంతో ముందడుగు వేస్తాడు. కాబట్టి, విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండితే మనిషికి ధైర్యము వస్తుంది, ఆ ధైర్యంతో అతను ముందడుగు వేస్తాడు. ఇది రెండవ ప్రయోజనం.

ఇక మూడవ ప్రయోజనం మనం చూచినట్లయితే, మనిషికి మనశ్శాంతి, సంతృప్తి చెందే గుణం వస్తుంది. మన కోసం అల్లాహ్ నిర్ణయించినది మనకు దొరికింది, ఏదైనా మనకు దొరకలేదు అంటే అది అల్లాహ్ నిర్ణయం ప్రకారమే జరిగింది. కాబట్టి, నేను ఎందుకు తొందరపడాలి, లేదంటే నాకు దక్కలేదు అని నేను ఎందుకు బెంగపడాలి? ఆ విధంగా అతను తెలుసుకొని, నాకు దక్కిన కాడికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయం ప్రకారమే దక్కిందిలే అని అతను సంతృప్తి పడతాడు, దిగులు పడకుండా అతను మనశ్శాంతిగా జీవిస్తాడు మిత్రులారా.

ఇవి విధివ్రాత పట్ల విశ్వాసం కలిగి ఉండే వారికి లభించే ప్రయోజనాలలో మూడు ముఖ్యమైన ప్రయోజనాలు. విధివ్రాత పట్ల ఈ కొన్ని విషయాలు మనము తెలుసుకొని నమ్ముదాం.

నేను అల్లాహ్‌తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్నందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవితాంతము జీవించే భాగ్యము ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40192

తఖ్దీర్ (విధి వ్రాత) ( మెయిన్ పేజీ ):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

అల్లాహ్ మార్గంలో వదలివేయబడిన ఆవుదూడ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఒక పుణ్యాత్ముడు నివసించేవాడు. అతను చాలా బీదవాడు. అయినప్పటికీ తన సంపాదన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. నీతిగా, నిజాయితీగా సంపాదించే వాడు. అతను చేసిన ప్రతి పనీ అల్లాహ్ ప్రసన్నత పొందడానికే చేశాడు. ఎన్నడూ స్వార్థంకోసం, తన అభీష్టాల ప్రకారం నడుచుకోలేదు.

ఆ వ్యక్తి చనిపోతున్నప్పుడు అతని చివరి పలుకులు, “అల్లాహ్! నా భార్యను, పసివాడైన నా కుమారుడిని, నా ఆస్తి అయిన ఆవుదూడను నీ సంరక్షణలో వదులుతున్నాను”. ఈ మాటలు పలికిన ఆ వ్యక్తి విచిత్రంగా తన భార్యతో, “ఆవుదూడను తీసుకువెళ్ళి అడవిలో వదిలేసి రమ్మన్నాడు.” అతను అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఇస్రాయీల్ ప్రజల నడవడి గురించి తెలిసిన ఆ వ్యక్తి వారిని నమ్మదలచుకోలేదు. వారు స్వార్థం, అత్యాశ నిండిన జనం అన్న విషయం అతనికి బాగా తెలుసు.

కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు. అప్పుడు అతని తల్లి కుమారుడితో, “మీ నాన్నగారు ఒక ఆవు దూడను అడవిలో వదలివేయమని చెప్పారు. అల్లాహ్ పై భారమేసి వదిలేశాను. ఈ పాటికి ఆ దూడ పుష్టిగా ఎదిగి ఉంటుంది” అని చెప్పింది. ఆ కుమారుడు కాస్త ఆశ్చర్యంగా ఆ ఆవుదూడ ఎక్కడ ఉందని తల్లిని ప్రశ్నించాడు. తల్లి అతడితో, “మీ నాన్న గారి అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించు. అల్లాహ్ ను విశ్వసిస్తున్నానని చెప్పు. అల్లాహ్ పై  భారం వేసి ఆ ఆవుదూడను వెదుకు” అని చెప్పింది. ఆ కుమారుడు ఒక తాడును తీసుకుని అడవికి బయలుదేరాడు. అడవికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడి, “అల్లాహ్! ఇబ్రాహీమ్, యాఖుబ్ ల ప్రభువా! నా తండ్రి అప్పగించిన దానిని నాకు తిరిగి అప్పగించు” అని ప్రార్థించాడు. అతను తన చేతిని ఎత్తిన వెంటనే అతనికి ఒక ఆవు తన వైపు వస్తున్నట్లు కనబడింది. ఆ ఆవు అతని వద్దకు వచ్చి మచ్చికైన ఆవు మాదిరిగా నిలబడింది. ఆ ఆవు మెడకు ఒక తాడు కట్టి అతను తనతో ఇంటికి తీసుకువచ్చాడు. ఆ ఆవు కూడా ఆ కుర్రాడిని తప్ప మరెవ్వరినీ తన వద్దకు రానిచ్చేది కాదు.

ఆ కుర్రవాడు కూడా తన తండ్రి మాదిరి పుణ్యాత్ముడు. సన్మార్గాన్ని అవలంబించేవాడు. కట్టెలు కొట్టడం ద్వారా జీవనోపాధి పొందేవాడు. తాను సంపాదించిన దానిని మూడు సమానభాగాలు చేసేవాడు. ఒక భాగాన్ని తన తల్లికి ఇచ్చేవాడు. ఒక భాగాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకునేవాడు. ఒక భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. రాత్రి సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకునేవాడు. రాత్రి ప్రథమ భాగంలో తన తల్లికి సహాయపడే వాడు. తర్వాతి భాగం ఆరాధనలో గడిపేవాడు. ఆ తర్వాతి సమయం నిద్రకు కేటాయించేవాడు.

ఈ కాలంలో ఒక సంపన్నుడు మరణించాడు. అతనికి ఒకే ఒక్క కుమారుడు. తండ్రి యావదాస్తి ఆ కుమారునికి లభించింది. కాని అతని బంధువులకు కొందరికి కన్నుకుట్టింది. రహస్యంగా ఆ యువకుడిని హత్య చేశారు. ఆ విధంగా ఆ యావదాస్తిని తాము కాజేయాలనుకున్నారు. మరణించిన ఆ యువకుని బంధువుల్లో ఈ హత్యతో ప్రమేయం లేనివారు ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చారు. హంతకుణ్ణి కనుగొనడానికి సహాయపడమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి సలహా ఇస్తూ, ఒక ఆవును కోసి దాని నాలుకను ఆ యువకుడి శరీరంపై ఉంచాలని చెప్పారు. ఆ నాలుక హంతకుని గురించి తెలుపుతుందని అన్నారు. మూసా (అలైహిస్సలాం) పరిహాసమాడుతున్నారని వాళ్ళు ఆయన్ను నిందించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “అల్లాహ్ శరణు! నేను అవివేకంగా వ్యవహరించను” అన్నారు. ఎలాంటి ఆవును కోయాలని వాళ్ళు ఆయన్ను ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, మరీ లేగదూడ కారాదు. అలా అని పూర్తిగా ఎదిగిన ఆవు కూడా కారాదు అన్నారు. మధ్యస్థంగా ఉన్న దానిని కోయాలని చెప్పారు. కాని వాళ్ళు ఆయన సలహాను పాటించే బదులు, ఆ ఆవు ఎలా ఉండాలని మరిన్ని వివరాలు అడగడం ప్రారంభించారు. “ఆ ఆవు రంగు ఎలా ఉండాలి?” అని అడిగారు. “పసుపు రంగు కలిగినదై ఉండాలి” అన్నారు మూసా (అలైహిస్సలాం). అయినా వారికి తృప్తి కలుగలేదు. మరిన్ని వివరాలు చెప్పమని అడిగారు. “ఆ ఆవు దుక్కి దున్నినది కారాదు. కాడి లాగినది కారాదు. నీళ్ళు తోడడానికి ఉపయోగించినది కారాదు. ఎలాంటి మచ్చలు ఉండరాదు” అన్నారు మూసా (అలైహిస్సలాం).

అలాంటి ఆవు కోసం వాళ్ళు వెదుకుతూ బయలుదేరారు. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు ఒకే ఒక్కటి దొరికింది. ఆ ఆవు అనాధ యువకుడి వద్ద ఉన్న ఆవు. వాళ్ళు అతని వద్దకు వెళ్ళి ఆ ఆవును ఎంతకు అమ్ముతావని ప్రశ్నించారు. ఆ యువకుడు తన తల్లితో అడిగి చెబుతానని అన్నాడు. వారంతా కలసి అతని ఇంటికి వచ్చి అతని తల్లితో మాట్లాడారు. ఆ ఆవుకు బదులుగా మూడు బంగారు నాణేలు ఇస్తామన్నారు. కాని ఆమె ఆ ప్రతిపాదనకు తిరస్కరించింది. వాళ్ళు ఆ ఆవు ధర పెంచుతూ పోయారు. కాని ఆమె అంగీకరించలేదు. చివరకు వాళ్ళు ఆమెను ఒప్పించమని యువకుడిని కోరారు. కాని అతడు అందుకు ఒప్పుకోలేదు. “నా తల్లి ఒప్పుకోకపోతే ఆవును అమ్మేది లేదు.. మీరు ఆవు ఎత్తు బంగారం ఇచ్చినా అమ్మను” అన్నాడు. ఈ మాటలు విన్న అతడి తల్లి చిరునవ్వుతో, “అంత సొమ్ము ఇవ్వండి.. ఆవు ఎత్తు బంగారం ఇచ్చి అవును తీసుకువెళ్ళండి” అంది. చివరకు వాళ్ళు ఆ గుర్తులన్నీ ఉన్న ఆవు అదొక్కటే కాబట్టి ఆవు ఎత్తు బంగారం ఇచ్చి కొనుక్కున్నారు. (2: 67-74)

అల్లాహ్, ఆ యువకుడి తండ్రి తనకు అప్పగించిన దానిని తల్లి పట్ల సేవా భావం, దానగుణం కలిగి ఉన్న ఆ యువకునికి అనుగ్రహించాడు. అల్లాహ్ ను విశ్వసించాలని కుమారుడికి బోధించిన ఆ తల్లినీ అనుగ్రహించాడు. ఈ పూర్తి వృత్తాంతం – దైవవిశ్వాసం విషయంలో ఇస్రాయీల్ ప్రజలకు, మూసా ప్రవక్తకు ఒక పాఠంగా నిలిచింది.

మరో ముఖ్యమైన పాఠం ఏమంటే, మూసా (అలైహిస్సలాం) వారికి ఒక అవును కోయాలని చెప్పారు. ప్రత్యేకమైన ఆవు అని చెప్పలేదు. కాని వాళ్ళు ఇంకా వివరాలు కావాలని ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనవసరమైన ప్రశ్నలు వేశారు. వాళ్ళు ఈ రంధ్రాన్వేషణ చేయకుండా చెప్పిన విధంగా ఒక ఆవును కోసి ఉన్నట్లయితే వారికి ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కాని అనవసరమైన ప్రశ్నల వర్షం వల్ల వారికి ఆ ఆవు చాలా ఖరీదైన ఆవుగా మారింది.

(నీతి: గుచ్చిగుచ్చి అడగడం అన్నది చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది)

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్

https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/