క్విజ్: 77: ప్రశ్న 02: గోరీల (సమాధుల) వద్ద అల్లాహ్ యేతరుల కోసం మొక్కుబడులు, జిబహ్ చెయ్యడం పెద్ద షిర్క్ [ఆడియో]

బిస్మిల్లాహ్

[6:19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తెలుగులో ఇస్లామిక్ క్విజ్ 77వ భాగం 2వ ప్రశ్న సిలబస్:

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:

మొక్కుబడులు:

అల్లాహ్ ను కాకుండా ఇతరుల పేరున మొక్కుకొనుట షిర్క్ అవుతుంది.

البخاري 6696:- عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ : ” مَنْ نَذَرَ أَنْ يُطِيعَ اللَّهَ فَلْيُطِعْهُ، وَمَنْ نَذَرَ أَنْ يَعْصِيَهُ فَلَا يَعْصِهِ “.
ఎవరు అల్లాహ్ యొక్క విధేయత లో ఏదైనా మొక్కుబడి చేసుకుంటారో వారు దానిని పూర్తి చేయాలి మరి ఎవరైతే అల్లాహ్ అవిధేయత లో మొక్కుబడి చేస్తారో వారు దానిని పూర్తి చేయకూడదు

ఈ రోజుల్లో ప్రజలు సమాధిలో ఉన్నవారి పేరున దీపాలు, కొవ్వత్తులు, కోళ్ళు, ఆస్తులు మొదలగునవి ఇస్తానని మొక్కుకుంటారు. అయితే ఇది ఘోరమైన షిర్క్ అన్న విషయం మరచిపోతారు.

జిబహ్ చేయుట:

అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయుట (జంతువును బలి ఇచ్చుట) షిర్క్. అల్లాహ్ ఆదేశం చదవండి:

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
నీ ప్రభువు కొరకే నమజు చేయు మరియు ఖుర్బానీ ఇవ్వు (కౌసర్ 108: 2).

అంటే అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ పేరుతో మాత్రమే జిబహ్ చేయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:

لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله
“అల్లాహ్ కు కాక ఇతరుల కోసం జిబహ్ చేయువానిపై అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 1978).

జిబహ్ లో రెండు నిషేధాలు ఏకమవుతాయి. (1) అల్లాహ్ కు తప్ప ఇతరుల కోసం జిబహ్. (2) అల్లాహ్ పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జిబహ్. ఈ రెండు కారణాల వల్ల ఆ జంతువు మాంసం తినడం యోగ్యం కాదు.

ఈ రోజుల్లో జిన్నుల పేరు మీద జిబహ్ చేసే షిర్క్ ప్రబలి ఉంది. అదేమనగా; ఇల్లు కొనుగోళు చేసినా, నిర్మించినా అందులో ఎక్కడైనా లేదా ప్రత్యేకించి దాని గడప మీద, అలాగే బావి త్రవ్వినా, అక్కడే ఓ జంతువు జిబహ్ చేస్తారు. అది షైతాన్ (భూతాల)కు భయపడి, వాని నష్టం నుండి దూరముండుటకు వాని పేరు మీద జిబహ్ చేస్తారు. (వాస్తవేమిటంటే అల్లాహ్ ను కాక ఇతరులతో భయపడరాదు. ఇలాంటి జిబహ్ చేయరాదు). (తైసీరుల్ అజీజుల్ హమీద్ 158. దారుల్ ఇఫ్తా ముద్రణ).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (6:17 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(2) గోరీలవద్ద మరియు నూతన భవనం , బోరుబావి , లేదా చెరువు నిర్మించినప్పుడు కీడు పోయేందుకు (అల్లాహ్ యేతరుల కోసం, అల్లాహ్ యేతరుల పేరు మీద) జిబహ్ చెయ్యడం సమ్మతమేనా?

A] చెయ్య కూడదు
B] చెయ్యవచ్చు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఇంకా క్రింది పోస్టులు చదవండి:

అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఏకత్వపు బాటకు సత్యమైన మాట

10వ అధ్యాయం
అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం)
[Slaughtering for other than Allah]

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ

ఇలా అను: “నా నమాజ్, నా ఖుర్బాని (జంతుబలి), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు.” (అన్ ఆమ్ 6: 162,163).

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ

“నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు.” (కౌసర్ 108: 2).

అలీ (రజియల్లాహు అన్హు)  కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నాలుగు మాటలు నేర్పారు:

  • (1) అల్లాహ్ తప్ప ఇతరులకు జిబహ్ చేసిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (2) తన తల్లిదండ్రుల్ని శపించిన, దూషించిన వానిని అల్లాహ్ శపించాడు.
  • (3) “ముహాదిన్ ” (బిద్ అతి, దురాచారం చేయు వాని)ని అల్లాహ్ శపించాడు.
  • (4) భూమిలో తమ స్థలాల (ఆస్తుల) గుర్తుల్ని మార్చిన వానిని అల్లాహ్ శపించాడు.

(ముస్లిం).

తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:

ఈగ కారణంగా ఒక వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు. మరొక వ్యక్తి నరకంలో చేరాడు“.

అది ఎలా? అని సహచరులు అడుగగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు:

ఇద్దరు మనుషులు ఒక గ్రామం నుండి వెళ్తుండగా, అక్కడ ఆ గ్రామవాసుల ఒక విగ్రహం ఉండింది. అక్కడి నుండి దాటిన ప్రతి ఒక్కడు ఆ విగ్రహానికి ఏ కొంచమైనా బలి ఇవ్వనిదే దాటలేడు. (ఆ విగ్రహారాధకులు) ఒకనితో అన్నారు: ఏదైనా బలి ఇవ్వు. “నా వద్ద ఏమి లేదు” అని అతడన్నాడు. “దాటలేవు. కనీసం ఒక ఈగనైనా బలి ఇవ్వు”. అతడు ఒక ఈగను ఆ విగ్రహం పేరు మీద బలిచ్చాడు. వారు అతన్ని దాటనిచ్చారు. కాని అతడు నరకంలో చేరాడు. “నీవు కూడా ఏదైనా బలి ఇవ్వు” అని మరో వ్వక్తితో అన్నారు. “నేను అల్లాహ్ తప్ప ఇతరులకు ఏ కొంచెమూ బలి ఇవ్వను” అని అతడన్నాడు. వారు అతన్ని నరికేశారు. అతడు స్వర్గంలో ప్రవేశించాడు.” (అహ్మద్).

ముఖ్యాంశాలు:

  1. మొదటి ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  2. రెండవ ఆయతు యొక్క వ్యాఖ్యానం.
  3. శాపం ఆరంభం అల్లాయేతరులకు జిబహ్ చేసినవారితో అయింది.
  4. తల్లిదండ్రుల్ని దూషించిన, శపించినవానినీ శపించడమైనది. నీవు, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని దూషించావంటే అది నీవు స్వయంగా నీ తల్లిదండ్రుల్ని దూషించినట్లే.
  5. “ముహాదిన్”ని శపించడమైనది. ఏ పాపంపై శిక్ష ఇహంలోనే అల్లాహ్ విధించాడో, ఒక వ్యక్తి ఆ పాపం చేసి ఆ శిక్ష నుండి తప్పించుకోడానికి ఇతరుల శరణు కోరుతాడు. అతన్ని కూడా “ముహాదిన్ ” అనబడుతుంది.
  6. భూమి గుర్తులను మార్చిన వానిని కూడా శపించబడినది. నీ భూమి, నీ పక్కవాని భూమి మధ్యలో ఉండే గుర్తుల్ని వెనుక, ముందు చేసి మార్చేయడం అని భావం.
  7. ఒక వ్యక్తిని ప్రత్యేకించి శపించడంలో, పాపాన్ని ప్రస్తావించి అది చేసిన వారిని శపించడంలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి.
  8. ఈగ కారణంగా ఒకతను నరకంలో మరొకతను స్వర్గంలో చేరిన హదీసు చాలా ముఖ్యమైనది.
  9. అతడు తన ప్రాణం కాపాడుకునే ఉద్దేశంతో ఒక ఈగను బలి ఇచ్చాడు. కాని నరకంలో చేరాడు.
  10. విశ్వాసుల వద్ద షిర్క్ ఎంత ఘోర పాపమో గమనించవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోవడం సహించాడు. కాని షిర్క్ చేయడానికి ఒప్పుకోలేదు.
  11. నరకంలో చేరినవాడు విశ్వాసుడే. అతను మొదటి నుండే అవిశ్వాసి అయితే ఈగ కారణంగా నరకంలో చేరాడు అని అనబడదు.
  12. ఈ హదీసు మరో హదీసును బలపరుస్తుంది. అది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ప్రవచనం: “స్వర్గం మీ చెప్పు యొక్క పట్టీ  (గూడ) కంటే చేరువుగా ఉంది, నరకం కూడా అలాగే“. (బుఖారి).
  13. ముస్లింలు, ముస్లిమేతరులు అందరి వద్ద మనఃపూర్వకంగా ఉన్న ఆచరణ చాలా ప్రాముఖ్యత గలది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) :

జిబహ్ కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. పూర్తి చిత్తశుద్ధితో చేయాలి. నమాజు గురించి చెప్పబడినట్లే దీని గురించి ఖుర్ఆన్ లో స్పష్టంగా చెప్పబడింది. ఎన్నో చోట్ల దాని ప్రస్తావన నమాజుతో కలసి వచ్చింది. ఇక ఇది అల్లాహ్ యేతరుల కొరకు చేయుట షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్).

షిర్క్ అక్బర్ దేనినంటారో గుర్తుంచుకోండి: “ఆరాధనలోని ఏ ఒక భాగాన్ని అయినా అల్లాయేతరుల కొరకు చేయుట“. అయితే ఏ విశ్వాసం, మాట, కార్యాలు చేయాలని ఇస్లాం ధర్మం చెప్పిందో అది అల్లాహ్ కు చేస్తే అది తౌహీద్, ఇబాదత్, ఇఖ్లాసు. ఇతరల కొరకు చేస్తే షిర్క్, కుఫ్ర్ . ఈ షిర్క్ అక్బర్ యొక్క నియమాన్ని మీ మదిలో నాటుకొండి.

అదే విధంగా షిర్క్ అస్గర్ (చిన్న షిర్క్) అంటేమిటో తెలుసుకోండి. “షిర్క్ అక్బర్ వరకు చేర్పించే ప్రతీ సంకల్పం, మాట, పని. అది స్వయం ఇబాదత్ కాకూడదు“. షిర్క్ అక్బర్, షిర్క్ అస్గర్ యొక్క ఈ రెండు నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుంటే, దీనికి ముందు, తరువాత అధ్యాయాలన్నింటిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా సందేహమనిపించే విషయాల్లో ఇది మీకు స్పష్టమైన గీటురాయిగా ఉంటుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్బానీ దుఆ (Qurbani Dua) (دعاء ذبح الأضحية)

ఖుర్బానీ దుఆ (Qurbani Dua) (دعاء ذبح الأضحية)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జిబహ్ చేయునప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి.
(అంటే: అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు). 

అల్లాహుమ్మ హాజా మిన్క వలక, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ అనాలి.
(అంటే: ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు).

(బుఖారి 5565, ముస్లిం 1967, దార్మీ 1989).

జిబహ్ చేయువారు ఇతరులైతే మిన్నీ అనే చోట మిన్ హు అనాలి.

ఇంకొక దుఆ:

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
ఇన్నీ వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ధ హనీఫన్ వమా అన మినల్ ముష్రికీన్.
నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.
(సూరా అల్ అన్-ఆమ్ 6:79)

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ
ఇన్న సలాతీ వ నుసుకీ వమహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీకలహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్.
“నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.”
(సూరా అల్ అన్-ఆమ్ 6:162-163)

అల్లాహుమ్మ మిన్క వలక, బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు. ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు

[అబూ దావుద్ హదీసు నెం: 2795, షేక్ అల్బానీ గారు హసన్  అని డిక్లేర్ చేసారు]

ఈ దుఆ తెలుగు అర్ధం కోసం వీడియో చూడండి

ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం, ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.