ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ.
ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ మాసాన్ని జిల్ హిజ్జ (Dhul-Hijjah) అంటారు.
ఈ మాసంలో అల్లాహ్ ప్రసన్నత కొరకు నిర్ణీత వయస్సుగల ప్రత్యేక జంతువులను జిబహ్ చేయడాన్ని ఉర్దూలో ఖుర్బానీ (బలిదానం) అంటారు. అయితే హజ్జె ఖిరాన్ మరియు హజ్జె తమత్తు చేసేవారు ఇచ్చే బలిదానాన్ని అరబీలో (هَدْي) “హద్య్” అని, హజ్ చేయనివారు తమ ఇండ్లల్లో 10వ జిల్ హిజ్జ నుండి 13 వరకు ఇచ్చే బలిదానాన్ని “ఉజ్ద్ హియ” (أُضْحِيَة) (Ud’hiyah) అని అంటారు.
ఖుర్బానీ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నత్ (సాంప్రదాయం) అన్న విషయం మీరు సూర సాఫ్ఫాత్ (37:102-108) లో చూడవచ్చు. పూర్వ మతాల్లో కూడా ఈ సంప్రదాయం ఉండినది. చూడండి సూర హజ్ (22:34). మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చాక ప్రయాణంలో ఉన్నా, నగరంలో ఉన్నా ప్రతి ఏడాది ఖుర్బానీ ఇచ్చేవారు. ప్రవక్త తమ జీవితంలోని చివరి హజ్ లో విధిగా ఉన్న ఒక జంతు బలిదానమే కాకుండా సుమారు వంద వరకు బలిదానాలు ఇచ్చారు. ఇది దీని ఘనత మరియు ఎంతో గొప్ప పుణ్యకార్యం అనడానికి గొప్ప నిదర్నన.
ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం
వాస్తవానికి ఇది హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తమ కంటికి చలువ, గారాలపట్టిని బలి చేయుటకు సిద్ధమైనందుకు లభించిన ఫలితం, ఇందులో మనకున్న గుణపాఠం ఏమిటంటే అల్లాహ్ మనకు అతి ప్రియమైన దానిని త్యాగం చేయాలని కోరినా మనం ముమ్మాటికి వెనకాడము. ఇన్షాఅల్లాహ్!
ఖుర్బానీ ప్రాముఖ్యత
- శక్తి ఉండి కూడా ఖుర్బానీ చేయనివారు మా ఈద్గాహ్ కు రాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. (ఇబ్ను మాజ 3123)
- ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని కూడా ప్రవక్త ఆదేశించి ఉన్నారు. (అబూదావూద్ 2788).
- ఒకసారి ప్రవక్త పండుగ ప్రసంగం ఇస్తూ చెప్పారు: ఎవరైతే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ చేశారో అది చెల్లదు గనక దాని స్థానంలో వారు మరో ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి 7400).
- కొన్ని సందర్భాల్లో ప్రవక్త (బీద సహచరులలో) ఖుర్బానీ జంతువులు పంపిణీ చేశారు (వారు వాటి ఖుర్బానీ చేయాలని). (బుఖారి 2300, ముస్లిం 1965).
- ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ఖుర్బానీ వదల లేదు. (తిర్మిజి 1501, నిసాయి 4392, ఇబ్నుమాజ 3131).
ఖుర్బానీ చేయకుండా దానికి కలిగే పైకం దానం చేయడం ఎట్టి పరిస్థితిల్లో కూడా యోగ్యం కాదు. ప్రవక్త శుభ కాలంలో గడ్డు స్థితి ఉన్న రోజుల్లో కూడా ప్రవక్త ఖుర్బానీ చేయడం నుండి ఆప లేదు, పైగా ఇలా చెప్పారుః ఖుర్బానీ చేసేవారు మూడు రోజుల కంటే ఎక్కువ తమ ఇండ్లల్లో మాంసాన్ని మిగిలి ఉంచకూడదు, అంతా దానం చేసెయ్యాలి. కలిమి రోజులు దూరమయ్యాక ఇక మీరు మాంసాన్ని మూడు రోజులకంటే ఎక్కువ స్టాక్ చేసి, స్టోర్ చేసి ఉంచవచ్చు అని అనుమతించారు. (బుఖారి 5569, ముస్లిం 1974). ప్రవక్త గారి శుభఆదర్శం మనకు సరిపోదా?
ఖుర్బానీ ఘనత
ఖుర్బానీ చేయడంలో ఇన్ని పుణ్యాలు, అన్ని పుణ్యాలు అని ప్రత్యేకంగా ఏ ఒక్క సహీ హదీసు లేకపోయిన ఖుర్బానీకి ఏ ఘనత లేదు అని అనరాదు. అల్లాహ్ దీని ఘనతలో సూర హజ్ (22)లోని ఆయత్ 36లో “లకుమ్ ఫీహా ఖైర్” అన్నాడు, అంటే ఖుర్బానీలో మీకు అనేకాకనేక మేళ్ళున్నాయి. ఇంకా సహీ హదీసులో ఉంది: ఏ ఆచరణలు, కర్మలు ఘనత గలవైనవి అని ప్రవక్తను అడిగినప్పుడు, ఘనమైన శబ్దంతో తల్బియా చదవడం మరియు జంతువుల ఖుర్బానీ అని చెప్పారు. (ఇబ్ను మాజ 2924). ఇది ఘనత గల విషయమే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేశారు.
ఖుర్బానీ ఎవరి కొరకు?
ఖుర్బాన్ అన్న పదానికి భావం: అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు అల్లాహ్ కోరినదానిని సమర్పించడం. అందుకే ఏ జంతువునైనా ప్రవక్తల, వలీల, బాబాల ప్రసన్నతకు, వారి సాన్నిధ్యం పొందుటకు జిబహ్ చేస్తే అది షిర్క్ అవుతుంది. అందుకే అల్లాహ్ ఖుర్ఆన్ లో చెప్పాడు:
నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (కౌసర్ 108:2).
ఇంతకంటే మరీ స్పష్టంగా సూర అన్ఆమ్ (6:162,163)లో అల్లాహ్ ఇలా తెలిపాడు:
నిస్సందేహంగా నా నమాజు, నా ఖుర్బానీ (నా సకల ఆరాధనలు), నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో (ముస్లిములలో) నేను మొదటి వాణ్ణి.
కొన్ని ముఖ్య విషయాలు
1- ఖుర్బానీ చేయాలని ఉద్దేశించిన వ్యక్తి జిల్ హిజ్జ నెల వంక చూసినప్పటి నుండి ఖుర్బానీ చేయువరకు తన శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళు వగైరా తీయకూడదు. (ముస్లిం 1977). ఎవరయితే ఆ తర్వాత ఏ రోజు ఖుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుండే వెంట్రుకలు… తీయకుండా ఉండాలి.
2- ఒక్క మేక లేదా గొఱ్ఱె ఒక ఇంటివారి వైపు నుండి సరిపోతుంది. ఆ ఇంటిలో ఎంత మంది ఉన్నా సరే. (ఇబ్నుమాజ 3122, తిర్మిజి 1505). ఆవులో ఏడుగురు, ఒంటెలో పది మంది పొత్తు కలవవచ్చు. (తిర్మిజి 1501). డబ్బు ధనం ఉన్న వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ని జంతువుల ఖుర్బానీ ఇవ్వదలచినా అన్నీ ఖుర్బానీ ఇవ్వచ్చు, ఇది మాహా పుణ్యప్రధమైన విషయమే. (ప్రవక్త 100 వరకు ఖుర్బానీ చేసిన విషయం తెలిసిందే).
3- ఖుర్బానీ జంతువు ఎంత మంచిది, బలసినది, ధరగలది ఉంటుందో అంతే ఘనత గల విషయం కాని ప్రాపంచికంగా అహంకారానికి గురి కాకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం బలిసిన, కొమ్ములు గల రెండు గొఱ్ఱెలను జిబహ్ చేసేవారు. సహాబాలు ఖుర్బానీ జంతువులకు మంచిగా ఆహారమిస్తూ బలసినవిగా చేసేవారు. (బుఖారి 5552 తర్వాత).
4- కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే ఖుర్బానీ ఇవ్వాలి. చూపుగోళు, ప్రదర్శనాబుద్ధి ఏ మాత్రం ఉండకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు: వాటి మాసంగానీ, రక్తంగానీ అల్లాహ్ కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (హజ్ 22:37).
ఖుర్బానీ నిబంధనలు
1- ఖుర్బానీలో ఇవ్వబడే జంతువు బహీమతుల్ అన్ఆమ్ (ఒంటె, ఆవు, మేక, పొట్టేలు) లోనిదై ఉండాలి. (సూర హజ్ 22:28,34).
2- ధర్మం తెలిపిన ఈడు దాటినదై ఉండాలి. (ముస్లిం 1963). మేక, గొఱ్ఱె 1 సంవత్సరం, ఆవు 2, ఒంటె 5 సంవత్సరాలు దాటాలి. ఒక వేళ సంవత్సరం పూర్తి నిండిన మేక లభ్యం కావటం కష్టతరంగా ఉన్నప్పుడు ఆరు నెలలు నిండిన గొఱ్ఱె ఖుర్బానీ ఇవ్వచ్చు. అయితే అది ఆరోగ్యవంతంగా, బలసి ఉండాలి.
3- ఖుర్బానీ జంతువు లోపాలు లేకుండా ఉండాలి. మీరు అల్లాహ్ మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టండని అల్లాహ్ ఆదేశించాడు. (బఖర 2:267). ఖుర్బానీ జంతువులను స్పష్టమైన అంగవైకల్యం గాని, ఏదైనా లోపంగాని లేకుండా బాగా చూసుకోవాలని ప్రవక్త కూడా ఆదేశించారు. (అబూదావూద్ 2804, తిర్మిజి 1498).
ఆ లోపాలు ఇవి
- ఒకటే కన్ను ఉన్నట్లు స్పష్టమగుట.
- రోగం ఉన్నట్లు స్పష్టంగా కనబడుట.
- స్పష్టమైన కుంటిది.
- ఎముకల్లో సత్తువ లేని ముసలిది. (నిసాయి 4369, ఇబ్ను మాజ3144).
ఈ నాలుగే గాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలుగల జంతువుల ఖుర్బానీ కూడా యోగ్యం కావు. ఉదాహరణకుః మొత్తానికే కళ్ళు లేనిది, ఒక్కటో రెండో కాళ్ళు లేనిది వగైరా. ఇక ఈ లోపాలు లేకుంటే మంచిదిః విరిగిన కొమ్ము, కొంచెం తెగి ఉన్న చెవి లేదా తోక.
ఏదైనా లోపం ఉండీ లేనట్లుగా స్వల్పస్థాయిలో ఉంటే అది లోపం అనబడదు.
4- ధార్మిక సమయంలోనే జిబహ్ చేయాలి. అంటే ఈదుల్ అజ్హా నమాజ్ మరియు ఖుత్బ అయిన తర్వాత నుండి 13వ జిల్ హిజ్జ సూర్యాస్తమయానికి ముందు. పండుగ నమాజుకు ముందు జిబహ్ చేసిన వారిది ఖుర్బానీగా పరిగణించబడదు. (బుఖారి 968, ముస్లిం 1961).
జిబహ్ షరతులు
1- ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జిబహ్ చేయునప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. (అంటే: అల్లాహ్ పేరుతో జిబహ్ చేయుచున్నాను, అల్లాహ్ యే గొప్పవాడు). అల్లాహుమ్మ హాజా మిన్క వలక, అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నీ అనాలి. (అంటే: ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్! నా వైపు నుండి దీనిని స్వీకరించు). (బుఖారి 5565, ముస్లిం 1967, దార్మీ 1989). జిబహ్ చేయువారు ఇతరులైతే మిన్నీ అనే చోట మిన్ హు అనాలి.
2- రక్తం బాగా పారాలి. అంటే రక్తం చింది వేగంగా వెళ్ళునటువంటి పదను ఆయుధంతో జిబహ్ చేయాలి. అయితే ఎముక, దంతము (పన్ను), గోరు ఉపయోగించకూడదు. (బుఖారి 2488, ముస్లిం 1968). [కత్తిని జంతువు కళ్ళ ముందు పదను పట్టకూడదు. ఒక జంతువు ముందు మరో జంతువును జిబహ్ చేయకూడదు].
3- నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి; కనీసం రక్తం వేగంగా వెళ్ళు రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి. (జిబహ్ చేయు ముందే జంతువును ఖిబ్లా దిశలో చేసుకోవాలి. జంతువును ఎడమ వైపు పడవేసి, కుడి భుజానికి దగ్గర తన కాలు పెట్టి జిబహ్ చేయాలి).
4- జిబహ్ చేయు వ్యక్తి బుద్ధిమంతుడు అయి ఉండాలి. అంటే పిచ్చివాడు లేదా ఏమీ తెలియని బాలుడు కాకూడదు.
శ్రద్ధ వహించండి
1- ఖుర్బానీ చేసే శక్తి ఏమాత్రం లేనివారు కూడా ఖుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఒక సహాబీ వద్ద పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు, అదే వారి జీవనాధారం, అప్పుడు ప్రవక్త అతనికి చెప్పారు: నీవు పండుగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి క్రింది వెంట్రుకలు, గోళ్ళు తీసుకో, ఇదే నీ కొరకు ఖుర్బానీ చేసిన పుణ్యంతో సమానం. (నిసాయి 4365, అబూదావూద్ 2789. కొందరు పండితులు ఈ హదీసును జఈఫ్ అన్నారు, కాని హాకిం, అహ్మద్ షాకిర్, ముస్నద్ అహ్మద్ ముహక్కికీన్ మరియు నిసాయి యొక్క షారిహ్ సహీ అన్నారు).
2- స్త్రీలు కూడా ఖుర్బానీ జంతువు జిబహ్ చేయవచ్చును. (ఇబ్ను మాజ 3182, బుఖారి).
3- ఖుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువు జిబహ్ చేసిన వ్యక్తికి మజూరీగా ఇవ్వకూడదు. కాని బహుమానంగా ఇస్తే పరవాలేదు. (బుఖారి 1716, ముస్లిం 1317). తోలు స్వంత ఉపయోగానికి ఉంచుకున్నా అభ్యంతరం లేదు.
తప్పులు సరిదిద్దుకుందాం
1- కొందరు స్వయం తమ ఖుర్బానీ చేయరు, మృతుల వైపు నుండి చేస్తారు, ఇది తప్పు మరియు ప్రవక్త సంప్రదాయానికి విరుద్ధం. మృతుల వైపున ఖుర్బానీ చేయడం అన్నదే భేదాభిప్రాయం గల సమస్య, ఇక స్వయం తన వైపు నుండి వదలి మృతుల వైపు నుండి ఖుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడూ అనుమతి ఇవ్వలేదు.
మృతుల వైపున ఖుర్బానీ యొక్క మూడు రకాలున్నాయిః
- ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటివారిలో బ్రతికి ఉన్న మరియు చనిపోయిన వారంది వైపున అని సంకల్పించుకోవడం యోగ్యం. (ఇబ్ను మాజ 3122).
- చనిపోయిన వ్యక్తి వసియ్యత్ చేసి పోతే అతని వైపున ఖుర్బానీ చేయడం.
- అతని వసియ్యత్ లేకుండా అతని వైపున చేయడాన్ని కొందరు పండితులు సదక (దానధర్మాల) లో లెక్కించి యోగ్యం అని చెప్పారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలోనే ఆయన భార్య హజ్రత్ ఖదీజ రజియల్లాహు అన్హా మరియు సంతానంలో ముగ్గురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు చనిపోయారు, అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ వారి తరఫున ఖుర్బానీ చేయలేదు. (అందుకు సదకగా పరిగణించి చేయడం కూడా సహీ అనిపించదు).
2- జంతువును జిబహ్ చేస్తున్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జిబహ్ చేయడం తప్పు. అలాగే ఒక సంవత్సరం తండ్రి పేరున, మరో సంవత్సరం తల్లి పేరున, ఆ తర్వత ఏడాది ప్రథమ కొడుకు పేరున ఇలా చేయడం కూడా తప్పు. ఇంటి బాధ్యులెవరో వారి పేరున ఖుర్బానీ జరుగుతుంది, పుణ్యం ఇంటివారందరికీ లభిస్తుంది.
సంకలనం & అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
You must be logged in to post a comment.