సూరత్ అల్-కహఫ్‌లో ప్రస్తావించబడిన “రెండు తోటల యజమాని” కథ : అహంకారానికి అంతం – హబీబుర్ రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

రెండు తోటల యజమాని కధ: అహంకారానికి అంతం
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Z07VIyo51W0 [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సూరత్ అల్-కహఫ్‌లో ప్రస్తావించబడిన “రెండు తోటల యజమాని” కథ ద్వారా అహంకారం (కిబ్ర్) యొక్క వినాశకరమైన పర్యవసానాలను వివరించబడింది. సంపద మరియు సంతానం అనేవి అల్లాహ్ నుండి వచ్చిన పరీక్షలని, వాటి పట్ల గర్వపడకుండా, ‘మాషా అల్లాహ్’ అంటూ వినమ్రతతో కృతజ్ఞత చూపాలని ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు. సత్యాన్ని తిరస్కరించడం మరియు ఇతరులను తక్కువగా చూడటమే అహంకారం అని, దీనికి ఉదాహరణగా ఇబ్లీస్ మరియు ఖారూన్‌ల కథలు చెప్పబడ్డాయి. అహంకారం మనిషిని స్వర్గానికి దూరం చేస్తుందని హదీసుల ద్వారా హెచ్చరించబడింది. దీనికి విరుద్ధంగా, వినమ్రత అల్లాహ్ దృష్టిలో ఒక వ్యక్తి స్థాయిని పెంచుతుంది. చివరగా, అల్లాహ్‌ను స్మరించడం, పేదలతో గడపడం, మరియు వినమ్రతను అలవర్చుకోవడం ద్వారా అహంకారం నుండి రక్షణ పొందవచ్చని సూచించబడింది.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్‌కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, రెండు తోటల యజమాని: అహంకారానికి అంతం.

ఈ రెండు తోటల యజమాని అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఈ రెండు తోటల అతని గురించి సూరత్ కహఫ్‌లో ఆయత్ 32 నుంచి 44 వరకు ఆ ప్రస్తావన ఉంటుంది.

وَاضْرِبْ لَهُمْ مَثَلًا رَجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَابٍ وَحَفَفْنَاهُمَا بِنَخْلٍ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا

(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము. (18:32)

ఈ విధంగా ఈ ప్రస్తావన ఆయత్ 44 వరకు ఉంటుంది.

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి ఈ ఉదాహరణ వినిపించు అని అంటున్నాడు. అంటే ఏంటి ఈ ఉదాహరణ? దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తికి రెండు అందమైన తోటలు ఉన్నాయి. ద్రాక్ష తోటలు, ఖర్జూరపు వృక్షాలు. మధ్యలో పంట పొలాలు, నీరు ప్రవహించే నదులు. అతనికి అపారమైన సంపద, కుటుంబ బలం ఉంది.

ఈ కారణంగా ఈ వ్యక్తి తన స్నేహితునితో గర్వంగా ఇలా అన్నాడు, “నా సంపద నీకంటే ఎక్కువ. నా కుటుంబ బలం నీకంటే ఎక్కువ. ఈ తోట ఎప్పటికీ నశించదు, ఖియామత్ రోజు కూడా రాదు.” ఒకపక్కన ఈ తోట మూలంగా గర్వపడుతున్నాడు. ఎప్పటికీ ఇలాగే ఈ తోటలు, ఈ ధనం ఇలాగే ఉండిపోతుంది అనే ఒక పక్కన గర్వపడతా ఉంటే, అదే గర్వంతో “ఖియామత్ కూడా రాదు. వచ్చినా కూడా నేను ఇక్కడి కంటే మంచి ఫలమే పొందుతాను” అని గర్వంలో ఉప్పొంగిపోతున్నాడు.

ఇది స్పష్టమైన అహంకారం, కిబ్ర్, మరియు అల్లాహ్‌పై అవిశ్వాసం. ఈ ధనవంతుడు ఇలా చెప్పాడు తన స్నేహితునితో, ఆ స్నేహితుడు పేదవాడు. ఈ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణ, ఒక వ్యక్తి ఈ అహంకారి, గర్విష్ఠి, ఇంకో వ్యక్తి పేదవాడు కానీ విశ్వాసి, అల్లాహ్‌పై నమ్మకం గలవాడు.

ఈ గర్విష్ఠి చెప్పిన మాటలు విని తన స్నేహితుడు ఇలా అన్నాడు. వినమ్రంగా హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? “నీకు ఈ తోట ఇచ్చింది ఎవరు? అల్లాహ్ మాత్రమే కదా? మరి

مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
(మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)
‘అల్లాహ్‌ తలచినదే అవుతుంది. అల్లాహ్‌ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’(18:39)

అని చెప్పాలి కదా? అల్లాహ్ చిత్తమే, శక్తి అంతా ఆయనదే, అల్లాహ్ తలిస్తేనే జరిగింది, అల్లాహ్ ఇవ్వకపోతే ఎవ్వరూ ఇవ్వలేరు అని ఎందుకు చెప్పలేదు? నేను పేదవాడిని కావచ్చు, కానీ అల్లాహ్ నిన్ను శిక్షించవచ్చు, నీ గర్వానికి, నీ అహంకారానికి, నీ తిరస్కారానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శిక్షించవచ్చు” అని ఆ పేద స్నేహితుడు వినమ్రంగా అతనికి తెలియపరిచాడు.

కానీ ఏమైంది? అహంకారానికి అంతమైంది. కొద్ది కాలంలోనే ఒక విపత్తు వచ్చింది, ఆ తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి, చెట్లు పడిపోయాయి, పంటలు కాలిపోయాయి. అప్పుడు ఆ రెండు తోటల యజమాని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటలను నాశనం చేశాడో, చెట్లను ఇది చేసేసాడో, పంటలు కాల్చేశాడో, ఆ తర్వాత కుమిలిపోతూ, చేతులు మలుచుకుంటూ, పశ్చాత్తాపంతో ఇలా అన్నాడు:

يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا
(యా లయ్తనీ లమ్ ఉష్రిక్ బిరబ్బీ అహదా)
“అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” (18:42)

ఇది కథ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ కహఫ్‌లో ప్రస్తావించిన కథ ఇది. ఇద్దరు రెండు తోటల యజమాని, అహంకారంతో విర్రవీగిపోయాడు, నాకు ఎప్పుడూ పేదరికం రాదు, ఇలాగే ధనవంతుడినిగానే నేను ఉంటాను, నా ధనం నాతోనే ఉంటుంది, నా పంటలు, నా పొలము ఇవన్నీ నాతోపాటే ఉంటాయి, ఇంకో పక్క ఖియామత్ అనేది ఏమీ లేదు అని చెప్పిన అహంకారి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొద్ది కాలం తర్వాత, నసీహత్ చేసేప్పుడు కూడా అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను నసీహత్ కూడా చేశాడు, మంచి మాటలు చెప్పాడు. అయినా కూడా అతని అహంకారానికి ఎటువంటి ఇది రాలేదు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని తోటలను పూర్తిగా నాశనం చేశాడు. అప్పుడు ఆయన నేను షిర్క్ చేయకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది అని బాధపడుతూ కుమిలిపోయాడు. కానీ ఆలస్యమైపోయింది.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَا يَدْخُلُ الْجَنَّةَ مَنْ كَانَ فِي قَلْبِهِ مِثْقَالُ ذَرَّةٍ مِنْ كِبْرٍ
(లా యద్ఖులుల్ జన్నత మన్ కాన ఫీ ఖల్బిహీ మిస్కాల జర్రతిన్ మిన్ కిబ్ర్)
హృదయంలో గింజంత (చిన్న గింజ) అహంకారం ఉన్నవాడు జన్నత్‌లో, స్వర్గములో ప్రవేశించడు.

అంటే స్వర్గ ప్రవేశానికి అర్హులు ఎవరు? ఆవగింజంతైనా కూడా కిబ్ర్, గర్వం అనేది ఉండనివాడు. కొంచెమైనా కిబ్ర్, గర్వం, అహంకారం ఉంటే అటువంటి వ్యక్తి స్వర్గానికి అర్హుడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, చిన్నచూపు చూడటం.

అల్లాహ్ సంపదను అనుగ్రహంగా ఇస్తాడు, కానీ అది పరీక్ష కూడా అవుతుంది.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరత్ అన్ఫాల్‌లో:

وَاعْلَمُوا أَنَّمَا أَمْوَالُكُمْ وَأَوْلَادُكُمْ فِتْنَةٌ
(వ’లమూ అన్నమా అమ్వాలుకుమ్ వ అవ్లాదుకుమ్ ఫిత్నహ్)
మీ సిరిసంపదలు, మీ సంతానం మీ పాలిట ఒక పరీక్ష అన్న సంగతిని తెలుసుకోండి. (8:28)

సంపద ఉండటం తప్పు కాదు, సంపద మీద గర్వం చేసి అల్లాహ్‌ను మరిచిపోవడం తప్పు. ఇది గమనించాల్సిన విషయం.

మూడో విషయం ఏమిటి? అల్లాహ్ తక్కువ ప్రసాదించినా, ఎక్కువ ప్రసాదించినా, మరీ ఎక్కువ ప్రసాదించినా ‘మాషా అల్లాహ్’ అనే చెప్పే సంస్కారం కావాలి.

మాషా అల్లాహ్ అంటే కేవలం నాలుకతో కాదు, దాని అర్థాన్ని తెలుసుకుంటూ, దాని భావాన్ని తెలుసుకుంటూ, దానిని నిజాయితీగా నమ్ముతూ ఉండే ఆ సంస్కారం కలిగి ఉండాలి. మనకు ఏదైనా మంచి ఉన్నప్పుడు, మంచి జరిగినప్పుడు, ఇల్లు, వ్యాపారం, పిల్లలు, ఆరోగ్యం, అంతస్తు, హోదాలు, పదవులు, సంతోషాలు, సుఖాలు ఏవైనా సరే, అవి జరిగినప్పుడు ‘మాషా అల్లాహ్, ఇది అల్లాహ్ తరఫు నుంచే’. మనలో వినమ్రత పెంచుతుంది. ఇలా జరిగితే అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది ఇటువంటి భావన. అంటే ఈ సంపాదన అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ జ్ఞానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, సంతానం అల్లాహ్ నాకు ప్రసాదించాడు, ఈ హోదా అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఈ పదవి అల్లాహ్ నాకు ఇచ్చాడు, ఇంత బంగారం, ఇంత ధనం, ఇంత పదవులు ఇవన్నీ అల్లాహ్ నాకు ఇచ్చాడు. కొంచెం కూడా గర్వం రాకూడదు. ఇటువంటి భావన ఉంటే, ఇది మనలో వినమ్రత పెంచుతుంది, అల్లాహ్ దయను గుర్తు చేస్తుంది.

నాలుగో విషయం ఏమిటి ఈ కథలో? ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఈ దునియా తాత్కాలికం.

ఈ కథ మనకు చెబుతోంది, దునియా జీవితం, ప్రాపంచిక జీవితం ఒక తోట లాంటిది. ఈ రోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీని గురించి ఖురాన్‌లో తెలియజేశాడు, ప్రపంచపు జీవితం వర్షం లాంటిది. كَمَثَلِ غَيْثٍ (క-మసలి గైసిన్) సూరత్ హదీద్‌లో ఉంది. ఇది వర్షం లాంటిది, పంటలు పుష్కలంగా పెరుగుతాయి, తర్వాత ఎండిపోతాయి. కొన్ని రోజుల జీవితం కోసం గర్వపడకూడదు, అల్లాహ్‌ని మరిచిపోకూడదు, అహంకారంలో విర్రవీగకూడదు.

కావున, అభిమాన సోదరులారా, అహంకారం మహా పాపం, కిబ్ర్ చాలా చెడు, అల్లాహ్‌కు అసలు ఇష్టం ఉండదు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ تَوَاضَعَ لِلَّهِ رَفَعَهُ اللَّهُ
(మన్ తవాద’అ లిల్లాహి రఫ’అహుల్లాహ్)
ఎవరైతే వినమ్రతతో ఉంటారో అల్లాహ్ వారిని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు.

అలాగే, అసలైన ధనవంతుడు డబ్బు ఉన్నవాడు కాదు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَيْسَ الْغِنَى عَنْ كَثْرَةِ الْعَرَضِ، وَلَكِنَّ الْغِنَى غِنَى النَّفْسِ
(లైసల్ గినా అన్ కసరతిల్ ‘అరది, వలాకిన్నల్ గినా గినన్-నఫ్స్)
సంపద ఎక్కువ ఉండటం ధనికత కాదు, కానీ నిజమైన ధనికత హృదయ సంతృప్తి.

కావున ప్రియ సోదర సోదరీమణులారా, రెండు తోటల యజమాని కథ మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. అల్లాహ్‌ను మరచిన సంపద నిలవదు. వినమ్రతే నిజమైన మహిమ. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం, ఆఖిరత్, పరలోకం అది శాశ్వతం. మనకు ఉన్న ప్రతి అనుగ్రహానికి ‘అల్హమ్దులిల్లాహ్‘ అని చెప్పాలి, అది చిన్నదైనా పెద్దదైనా. మన హృదయంలో అహంకారం తొలగించాలి, అల్లాహ్ ముందు వినమ్రంగా జీవించాలి, ఇలా ఉండాలి ఒక విశ్వాసి.

అభిమాన సోదరులారా, సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా చూడటం, ఇది ఎప్పుడు అవుతుంది? ఇదే కదా కిబ్ర్ అనేది, గర్వం అనేది, అహంకారం అనేది ఇదే కదా? నాకు ఉంది, అతనికి లేదు, నేను గొప్పవాడు, వాడు చిన్నవాడు, లేనివాడు, పేదవాడు అనేది ఈ ఒక రకమైన భావన కలిగి ఉండటమే అహంకారం, కిబ్ర్ అంటారు.

దీనికి ఉదాహరణ చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్లీసును ఆదం అలైహిస్సలాం ముందు సజ్దా చేయమని ఆజ్ఞాపించినప్పుడు ఇబ్లీస్ తిరస్కరించాడు. కారణం ఏమిటి? అహంకారం.

أَنَا خَيْرٌ مِنْهُ
(అన ఖైరున్ మిన్హు)
నేను అతనికంటే శ్రేష్ఠుణ్ణి (7:12)

అన్నాడు. కానీ ఏం జరిగింది? ఇబ్లీస్ పతనానికి కారణం అహంకారం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు అహంకారులు ఇష్టం ఉండరు.

إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ
(ఇన్నహూ లా యుహిబ్బుల్ ముస్తక్బిరీన్)
నిశ్చయంగా ఆయన అహంకారులను ఇష్టపడడు. (16:23)

అల్లాహ్ ముందు వినమ్రత ఈమాన్ యొక్క లక్షణం.

అలాగే ఖారూన్ ఉదాహరణ ఉంది ఖురాన్‌లో. అతను ఏమన్నాడు ఖారూన్? “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” అన్నాడు. నా దగ్గర ఉండేది ఈ హోదా, ఈ ఆస్తిపాస్తులు, ఈ ఆనందాలు, ఈ భోగభాగ్యాలు, ఈ ధనం, ఈ ధనికత ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ‘అలా ఇల్మిన్ ఇందీ’, నా జ్ఞానం వల్ల నాకు లభించింది అని అన్నాడు. ఎందుకు అన్నాడు? గర్వం, అహంకారం. నాకు ఎవ్వరూ ఇవ్వలేదు, నా జ్ఞానం ఇది, నా శక్తి ఇది, నా ప్లాన్ ఇది, నేను చేశాను, నేను సంపాదించాను, నాదే మాత్రమే అని అహంకారంతో అతను విర్రవీగాడు. ఫలితం ఏమైంది? అతను తన సంపదలో నేలలో ముంచబడ్డాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి కూడా నాశనం చేసేశాడు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అహం ఉన్నవాడు, గర్వం గలవాడు, కిబ్ర్ ఉన్నవాడు స్వర్గంలో ప్రవేశించలేడు. హృదయంలో రాయిగింజంత అహంకారం ఉన్నవాడు జన్నత్‌లో ప్రవేశించడు. (బుఖారీ మరియు ముస్లింలో హదీస్ ఉంది ఇది). ఒక సహాబీ ఈ హదీస్ విని ప్రవక్త గారిని అడిగారు, “ఓ దైవ ప్రవక్త, మనకు మంచి దుస్తులు, మంచి చెప్పులు ఇష్టం ఉండటం కూడా అహంకారమా?”. మంచి తొడగాలి అని మంచి దుస్తులు వేసుకున్నాము, మంచి చెప్పులు వేసుకున్నాము, ఇది కూడా అహంకారం కిందికి వస్తుందా? అని అడిగారు. దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “అల్లాహ్ అందమైనవాడు, అందాన్ని ఇష్టపడతాడు”. అన్నారు. అంటే ఇది అహంకారం కాదు. అంటే మంచి దుస్తులు వేసుకోవడం ఇది అహంకారం కాదు, దాని మూలంగా ఇతరులను చిన్నచూపు చూడటం అది అహంకారం కిందికి వస్తుంది. అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించి, తిరస్కరించడం ప్రజలను, ఇతరులను తక్కువగా చూడటం.

రెండవది వినమ్రత, దీనికి విరుద్ధం. ఎవరైతే అల్లాహ్ కోసం వినమ్రత ప్రసాదిస్తాడో, ‘మన్ తవాద అలిల్లాహ్’ – ఎవరైతే అల్లాహ్ కోసం వినమ్రత ప్రసాదిస్తాడో, ‘రఫాహుల్లాహ్’ – అల్లాహ్ వారిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు.

మూడవది, ఖియామత్ రోజున పరిస్థితి ఏంటి? అహంకారులు ఖియామత్ రోజు చిన్న చీమల వలె లేవనెత్తబడతారు. అంటే అక్కడ వారికి ఆ గౌరవం, ఎటువంటి గౌరవం ఉండదు కదా.

ఇస్లాంలో అహంకారం, కిబ్ర్ అంటే సత్యాన్ని తిరస్కరించడం, ఇతరులను తక్కువగా తృణీకరించడం. ఇది అత్యంత నిషిద్ధమైన పాపం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం హృదయంలో అణుమాత్రం గర్వం ఉన్నా స్వర్గ ప్రవేశం లభించదు. ఎందుకంటే గొప్పతనం అనేది అది అల్లాహ్‌కు మాత్రమే సొంతం.

“అహంకారంతో ప్రజల నుండి ముఖం తిప్పుకోకు. భూమిపై గర్వంతో నడవకు. అహంకారానికి, గొప్పలు చెప్పుకునేవాడిని అల్లాహ్ ప్రేమించడు” అని అల్లాహ్ సూరత్ లుఖ్మాన్‌లో తెలియజేశాడు.

అలాగే సూరత్ అన్-నిసాలో ఉంది, అహంకారంతో భూమిపై గర్వంగా నడిచేవారికి కఠినమైన శిక్ష ఉంటుందని ఖురాన్ హెచ్చరించింది (సూరత్ అన్-నిసా, ఆయత్ 173లో). అలాగే సూరత్ ఆరాఫ్‌లో ఉంటుంది, అహంకారులకు స్వర్గ ద్వారాలు తెరవబడవు (సూరత్ ఆరాఫ్, ఆయత్ 40).

అలాగే సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, హృదయంలో అణుమాత్రం అహంకారం ఉన్నవాడు స్వర్గములో ప్రవేశించడు.

కావున, అహంకారం యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి.

  • స్వర్గం నుండి దూరం: గర్వం ఉన్నవారు స్వర్గం పొందలేరు, అంటే స్వర్గం నుంచి దూరం.
  • నరక శిక్ష: అహంకారుల నివాసం నరకం.
  • దైవ ప్రేమకు దూరం: అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.

అహంకారం ఎందుకు ప్రమాదం అంటే, అది ఈమాన్‌ను బలహీనపరుస్తుంది, కంజోర్ చేస్తుంది. దుఆ అంగీకారం తగ్గుతుంది, దుఆ స్వీకరించబడటం తగ్గిపోతుంది. మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అల్లాహ్ కోపానికి కారణం అవుతుంది.

ఇక్కడ మనము ఒక విషయం గమనించాలి, అది ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక వ్యక్తికి ఈ ప్రాపంచిక జీవితంలో అన్నీ ఇచ్చాడు. ప్రతీదీ ప్రసాదించాడు. అందం, ఐశ్వర్యం, హోదా, పదవులు, డబ్బులు, ధనం, రాజకీయం, రాజ్యం, ప్రతీదీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి జ్ఞానం, బలం, శక్తి అన్నీ అల్లాహ్ ఇచ్చాడు, ఈమాన్ తప్ప. ఒక వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వస్తువు దక్కింది, ప్రతి సంతోషం దక్కింది ప్రాపంచిక పరంగా, ప్రతి విషయం దక్కింది, అల్లాహ్ అన్నీ ఇచ్చేశాడు. అతనికి కష్టమే తెలీదు, బాధే తెలీదు, అంత బాగుంది. ఈమాన్ అల్లాహ్ అతనికి ఇవ్వలేదు.

ఇంకో వైపు అల్లాహ్ ఒక వ్యక్తికి ఏదీ ఇవ్వలేదు. డబ్బు లేదు, అందం లేదు, ధనం లేదు, హోదా లేదు, పదవి లేదు, ఇంకా సమస్యలు, అనారోగ్యం, బలహీనత, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు చాలా ఉన్నాయి. కానీ అల్లాహ్ అతనికి ఈమాన్ ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు.

మరి ఈ ఇద్దరి వ్యక్తులలో గొప్పవాడు ఎవరు? ధనికుడు ఎవరు? సాఫల్యం పొందేవాడు ఎవడు? రెండవ వ్యక్తే. ఈ ప్రాపంచిక జీవితంలో డబ్బు లేకపోయినా, సుఖం లేకపోయినా, తాత్కాలిక సుఖం లేకపోయినా, అందం ఐశ్వర్యం లేకపోయినా, ధనం, బలం ఇది లేకపోయినా కానీ అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితంలో విశ్వాసాన్ని ఇచ్చాడు, ఈమాన్‌ను ఇచ్చాడు, హిదాయత్ ప్రసాదించాడు. ఇదే అసలైన సంపద, ఇదే అసలైన బలం, ఇదే అసలైన వస్తువు. ఎందుకు? ఇదే మనకు పనికి వచ్చేది మరణానంతర జీవితంలో, పరలోకములో, శాశ్వతమైన జీవితంలో. ఎందుకు? ఇక్కడ ఉన్నా లేకపోయినా మరణం తప్పదు. మరణం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఒక రోజు రావచ్చు, ఒక రోజులో రావచ్చు, నెలలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. కొందరు పూర్తి జీవితం 20-30 సంవత్సరాలు స్వయంగా అనుభవించకుండా బాగా కష్టపడి, త్యాగాలు చేసి, రాత్రి పగలు అనకుండా త్యాగాలు చేసి సంపాదించి కూడా పెట్టారు భార్యాపిల్లల కోసం, హఠాత్తుగా మరణించారు. సంపాదించింది ఎవరు? అనుభవిస్తుంది ఎవరు? ఇది జీవితం. ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇక్కడ అసలు ఏది కావాలి? అసలు ఈమాన్ కావాలి. దాని మూలంగా మరణానంతర జీవితం, పరలోకంలో శాశ్వతంగా సుఖంగా ఉంటాము.

అందుకోసం, రెండూ ఇస్తే అల్హమ్దులిల్లాహ్, ‘దాలిక ఫద్లుల్లాహి యు’తీహి మయ్యషా’ – అల్లాహ్ కొందరికి ఈమాన్‌తో పాటు ప్రపంచాన్ని, ప్రపంచంతో పాటు దీన్‌ను కూడా అల్లాహ్ ఇస్తాడు. అది ‘దాలిక ఫద్లుల్లాహ్’, అల్హమ్దులిల్లాహ్. కానీ అల్లాహ్ పరీక్ష నిమిత్తము, ఇంకో కారణము, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రాపంచిక జీవితంలో, ఇది పరీక్షతో కూడిన జీవితం కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందం విషయంలో, బలం విషయంలో, ధనం విషయంలో, ఆర్థిక విషయంలో, కుటుంబ విషయంలో, సమాజ విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ విషయంలో అనేక సందర్భాలలో, అనేక విషయాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెడుతూ ఉంటాడు. అది మనము సహనంతో, ఓర్పుతో మనము దానిని పరీక్షగా తీసుకుని విధేయతగా మనము జీవించే ప్రయత్నం చేయాలి.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం మనకు డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, పదవిని ఇచ్చాడు, అల్హమ్దులిల్లాహ్ బాగా ప్రసాదించాడు. గర్వపడకూడదు, కొంచెం కూడా మన మనసులో గర్వం రాకూడదు. అల్లాహ్ ప్రసాదించిన వాటిని మన మనసులో ఉండే భావన ఏమిటి? ఇది అల్లాహ్ ఇచ్చాడు, పరీక్ష కోసం ఇచ్చాడు. అందుకు దానధర్మాలు చేయాలి, ఫర్జ్ జకాత్ కాక ఇంకా నఫిల్ సదకాత్‌ను కూడా చేస్తూ ఉండాలి.

అభిమాన సోదరులారా, అహంకారం నుండి రక్షణ మార్గాలు:

  • అల్హమ్దులిల్లాహ్, మాషా అల్లాహ్ ఎక్కువగా చెప్పడం.
  • “మాషా అల్లాహ్ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అనే అలవాటు చేసుకోవడం.
  • సజ్దా ఎక్కువగా చేయటం.
  • పేదవాళ్ళతో కూర్చోవడం.
  • మనకు ఉన్నది అన్నీ అల్లాహ్ దయ అని గుర్తుపెట్టుకోవడం.

ఇవి మనము ఈ లక్షణాలు, గుణాలు కలిగి ఉండాలి. అభిమాన సోదరులారా, అహంకారం మనిషిని ఇబ్లీస్ స్థాయికి తీసుకువెళ్తుంది, వినమ్రత మనిషిని అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. మన హృదయంలో కిబ్ర్ లేకుండా తఖ్వా, వినమ్రతతో జీవిద్దాం.

అల్లాహ్ మన హృదయాలను శుద్ధి చేసి అహంకారం నుండి రక్షించుగాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=45092