సలాత్ అద్-దుహా (చాష్త్, ఇష్రాఖ్ నమాజ్) – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

సలాతుజ్జుహా (చాష్త్ నమాజు)
వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/SZeHU5ws1ic [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్ లేదా ఇష్రాఖ్ నమాజ్ అని కూడా పిలుస్తారు) యొక్క ప్రాముఖ్యత, దానిని ఆచరించే విధానం మరియు దాని గొప్ప ప్రతిఫలాల గురించి వివరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా, మానవ శరీరంలోని 360 కీళ్ల తరపున ప్రతిరోజూ ధర్మం (సదఖా) చేయవలసిన బాధ్యత ఉందని, అయితే కేవలం రెండు రకాతుల దుహా నమాజ్ ఆచరించడం ద్వారా ఆ బాధ్యత నెరవేరుతుందని స్పష్టం చేయబడింది. అంతేకాకుండా, ఫజ్ర్ నమాజ్‌ను జమాఅత్‌తో ఆచరించి, సూర్యోదయం వరకు అదే స్థలంలో కూర్చుని అల్లాహ్‌ను స్మరించి, ఆ తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేసినవారికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుందని కూడా వివరించబడింది.

అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం సలాతుద్ దుహా, చాష్త్ నమాజ్ గురించి తెలుసుకుందాం. చాష్త్ నమాజ్, ఇష్రాఖ్ నమాజ్, సలాతుద్ దుహా ఇవన్నీ ఒకే పేర్లు. అరబీలో సలాతుద్ దుహా అని, అలాగే ఇష్రాఖ్ నమాజ్ అని లేదా చాష్త్ నమాజ్ అని అంటారు.

ఈ నమాజ్ ఎప్పుడు చేస్తారు? సూర్యుడు ఉదయించి బాగా ప్రొద్దెక్కిన తర్వాత చేయబడే నమాజ్ ఇది సలాతుద్ దుహా.

ఇవి ఎన్ని రకాతులు చేయాలి? రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు, ఎనిమిది రకాతులు కూడా చేయవచ్చు. ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి. రెండు రకాతులు చేయవచ్చు, నాలుగు రకాతులు చేయవచ్చు ప్రతి రెండుకి సలాం చెప్పాలి, ఎనిమిది కూడా చేయవచ్చు ప్రతి రెండు రకాతులకి సలాం చెప్పాలి.

ఈ నమాజ్ గురించి, సలాతుద్ దుహా గురించి, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్ గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. అబూజర్ రదియల్లాహు అన్హు కథనం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

يُصْبِحُ عَلَى كُلِّ سُلاَمَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ
(యుస్బిహు అలా కుల్లి సులామా మిన్ అహదికుం సదఖహ్)
మీలో ప్రతి కీళ్ళు తరఫు నుంచి ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి.

కీళ్ళు అంటే మనిషి శరీరంలో కీళ్ళు ఉంటాయి కదా. ప్రతి కీళ్ళు తరపున సదఖా ఇవ్వాలి.

فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ
(ఫకుల్లు తస్బీహతిన్ సదఖహ్)
ప్రతి ‘సుబ్ హా నల్లాహ్’ అని చెప్పడం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్మీదతిన్ సదఖహ్)
‘అల్ హమ్దులిల్లాహ్’ అనటం కూడా సదఖాయే.

وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ
(వకుల్లు తహ్లీలతిన్ సదఖహ్)
‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అని స్మరించటం కూడా సదఖా అవుతుంది.

وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ
(వకుల్లు తక్బీరతిన్ సదఖహ్)
‘అల్లాహు అక్బర్’ అని చెప్పటం కూడా సదఖా అవుతుంది.

وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ
(వ అమ్రున్ బిల్ మ’రూఫి సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించటం, మంచి పని చేయండి అని చెప్పటం, ఇది కూడా సదఖా కిందికే వస్తుంది.

وَنَهْيٌ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(వ నహ్యున్ అనిల్ మున్కరి సదఖహ్)
చెడుని ఆపటం కూడా సదఖా కిందికే వస్తుంది.

وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنَ الضُّحَى
(వ యుజ్జిఉ మిన్ జాలిక రక’ఆతాని యర్క’ఉహుమా మినద్ దుహా)
వీటన్నిటికంటే సలాతుద్ దుహా రెండు రకాతులు చేయటం ఉత్తమం అన్నారు, మంచిది అన్నారు.

అంటే సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ ఎన్నిసార్లు చెప్తామో అన్నిసార్లు సదఖా ఇచ్చినట్టు సమానం అవుతుంది. వీటన్నిటికంటే చాష్త్ రెండు రకాతులు సరిపోతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది.

ఇంకో హదీస్ లో కొంచెం వివరంగా ఉంది. దాంట్లో అది ఏముందంటే, అబూ దావూద్ లో ఉంది హదీస్ అది. బురైదా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం,

ఈ హదీస్ లో చాష్త్ నమాజ్, సలాతుద్ దుహా, ఈ నమాజ్ యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం, ఘనత ఏమిటో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది.

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

فِي الإِنْسَانِ ثَلاَثُمِائَةٍ وَسِتُّونَ مَفْصِلاً
(ఫిల్ ఇన్సాని సలాసు మిఅతిన్ వ సిత్తూన మిఫ్సలన్)
మనిషి యొక్క శరీరంలో 360 కీళ్ళు ఉన్నాయి, జాయింట్లు.

ఇలా జాయింట్లు, కీళ్ళు, మనిషి యొక్క శరీరంలో 360 ఉన్నాయి.

فَعَلَيْهِ أَنْ يَتَصَدَّقَ عَنْ كُلِّ مَفْصِلٍ مِنْهُ بِصَدَقَةٍ
(ఫ’అలైహి అన్ యతసద్దఖ అన్ కుల్లి మిఫ్సలిన్ బి సదఖహ్)
కావున, ప్రతి జాయింట్ కి బదులుగా సదఖా చేయటం తప్పనిసరి ప్రతిరోజూ.

అంటే మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ప్రతిరోజూ ఒక సదఖా ఇవ్వాలి. అంటే ప్రతిరోజూ 360 జాయింట్లకి బదులుగా 360 సదఖాలు చేయాలి, ప్రతిరోజూ చేయాలి. ఇది తప్పనిసరి. ఇది విని సహాబాలు ఆశ్చర్యంతో,

قَالُوا وَمَنْ يَسْتَطِيعُ يَا رَسُولَ اللَّهِ
“ఖాలూ వ మన్ యస్తతీ యా రసూలల్లాహ్” అన్నారు.
“ఓ రసూలల్లాహ్, ఈ స్థోమత ఎవరికి ఉంటుంది? ఎవరు చేయగలరు?”

ధనవంతులు, కోటీశ్వరులు వారైతే చేయగలరేమో, కానీ సాధారణమైన మనుషులు, మాలాంటి వారు, పేదవాళ్ళు ప్రతిరోజూ 360 సదఖాలు… ఆ స్థోమత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చేయలేము కదా, అని అడిగితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

النُّخَاعَةُ فِي الْمَسْجِدِ تَدْفِنُهَا
(అన్నుఖాఅతు ఫిల్ మస్జిది తద్ఫినుహా)
మస్జిద్ లో ఏమైనా గలీజ్ ఉంటే, ఏమైనా హానికరమైన వస్తువు ఉంటే తొలగించండి.

అది సదఖాతో సమానం అవుతుంది.

وَالشَّىْءُ تُنَحِّيهِ عَنِ الطَّرِيقِ
(వష్ షైఉ తునహ్హీహి అనిత్ తరీఖ్)
దారిలో ఏమైనా హాని కలిపించే వస్తువు, ముళ్ళు ఉంది, గలీజ్ ఉంది, వాటిని తొలగించండి. అది కూడా సదఖా కిందికే వస్తుంది.

فَإِنْ لَمْ تَجِدْ فَرَكْعَتَا الضُّحَى تُجْزِئُكَ
(ఫఇల్లమ్ తజిద్ ఫ రక’అతద్ దుహా తుజ్జిఉక)
అలా కుదరకపోతే, సలాతుద్ దుహా (చాష్త్ నమాజ్) ఈ 360 జాయింట్లకి సదఖాకి సరిపోతుంది అన్నారు.

అంటే ఎవరైతే సలాతుద్ దుహా చదువుతాడో, ఆ వ్యక్తి 360 సార్లు సదఖా ఇస్తున్నాడు అని దానికి సరిపోతుంది. అంటే ఈ హదీస్ ద్వారా మనకు ఏం బోధ పడుతుంది? ప్రతి మనిషి యొక్క శరీరంలో 360 జాయింట్లు ఉన్నాయి. ప్రతి జాయింట్ కి బదులుగా ఒక సదఖా ప్రతిరోజూ తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ స్థోమత లేదు కాబట్టి అటువంటి వారు వేరే పుణ్యాల ద్వారా, సదఖా, దానధర్మాల ద్వారా, దారిలో నుంచి చెడుని దూరం చేయటం ద్వారా, అలాగే తస్బీహ్‌ల ద్వారా, జిక్ర్ ద్వారా (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్దులిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్) ద్వారా, అలాగే సలాతుద్ దుహా ద్వారా సరిపోతుంది అన్నారు.

అభిమాన సోదరులారా, సలాతుద్ దుహా గురించి ఒక్క హదీస్ చెప్పి నేను ముగిస్తాను. దాని ప్రాముఖ్యత ఏమిటి, ఘనత ఏమిటి అనేది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం ప్రకారం,

قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
(కాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ صَلَّى الْغَدَاةَ فِي جَمَاعَةٍ ثُمَّ قَعَدَ يَذْكُرُ اللَّهَ حَتَّى تَطْلُعَ الشَّمْسُ ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ كَانَتْ لَهُ كَأَجْرِ حَجَّةٍ وَعُمْرَةٍ تَامَّةٍ تَامَّةٍ تَامَّةٍ
(మన్ సల్లల్ ఫజర ఫీ జమాఅతిన్, సుమ్మ ఖ’అద యద్కురుల్లాహ హత్తా తత్లు’అష్ షమ్సు, సుమ్మ సల్లా రక’అతైని, కానత్ లహు క అజ్రి హజ్జతిన్ వ ఉమ్రతిన్ తామ్మతిన్, తామ్మతిన్, తామ్మతిన్)

“ఎవడైతే ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేశాడో, ఆ ఫర్ద్ నమాజ్ తర్వాత ఎక్కడికీ పోకుండా అక్కడే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తున్నాడో (జిక్ర్ చేసుకుంటున్నాడో), సూర్యుడు ఉదయించే వరకు, ఆ తర్వాత రెండు రకాతులు చేశాడో (అంటే సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్), ఆ వ్యక్తికి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.”

అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు నొక్కి చెప్పారు.

అల్లాహు అక్బర్! సలాతుద్ దుహా, ఇష్రాఖ్ నమాజ్, చాష్త్ నమాజ్ యొక్క ప్రతిఫలం, ఘనత ఏమిటి? ఫజ్ర్ నమాజ్ జమాఅత్‌తో చేసి, నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని, అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల దుహా నమాజ్ చేస్తే, ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం లభిస్తుందని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది.

అభిమాన సోదరులారా, ఈ సలాతుద్ దుహా గురించి రెండు విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయము, సలాతుద్ దుహా, ఇష్రాఖ్ లేదా చాష్త్ నమాజ్, ఇది మస్జిద్ లో, ఇంట్లో ఎక్కడైనా చేయవచ్చు. కండిషన్ ఏమీ లేదు. ఫజ్ర్ నమాజ్ చేసుకున్నాము, కాసేపు పడుకున్నాము, ఏదో పని చేసుకున్నాము, తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత చేసుకున్నాము. అలాగే ఫజ్ర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చేసాము, ఇంట్లో చేసుకున్నాము. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సదఖా అంత పుణ్యం వస్తుంది, ఎక్కువ పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తాడు. కాకపోతే, సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా అంత పుణ్యం రావాలంటే కండిషన్ ఏమిటి? ఫజ్ర్ నమాజ్ తర్వాత ఆ స్థలంలోనే కూర్చుని అల్లాహ్‌ను స్మరిస్తూ, జిక్ర్ చేసుకుంటూ, సూర్యుడు ఉదయించిన తర్వాత రెండు రకాతుల ఈ దుహా నమాజ్ చేసుకుంటే సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా పుణ్యం లభిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనమందరికీ నఫిల్ నమాజ్‌లు, సున్నత్ నమాజ్‌లు, ఈ దుహా, ఇష్రాఖ్ నమాజ్ పాటించే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకొని మనము జీవితం గడిపే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44390

ఇష్రాఖ్ / చాష్త్ నమాజు (దుహా /అవ్వాబీన్)