మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.
అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.
అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం
వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.
మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.
حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)
ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.
అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,
فما ظنكم
(ఫమా జన్నుకుమ్)
చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.
ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.
ఆత్మహత్య (Suicide)
ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.
ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.
అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,
ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.
మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.
నమాజు స్వీకరించబడని పాపాలు
మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.
ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.
అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?
తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.
ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.
దానధర్మాలు చేసి బాధపెట్టడం
17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.
ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)
“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)
దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.
చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం, ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం, సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం
18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,
خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్‌లో ఉంది, హదీస్ నెంబర్ 106.
ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.
ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.
అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.
ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905
—
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]