హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది [వీడియో & టెక్స్ట్]

హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

https://youtu.be/GWB2_SlYVsw [14 నిముషాలు]

ముస్లిం ఉమ్మత్ పై హిజ్రత్ (వలస) అనేది ప్రళయం వరకు విధిగా ఉంది. షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వెళ్లడమే హిజ్రత్. తౌహీద్ (ఏకదైవారాధన) పై స్థిరంగా ఉండటం, కేవలం అల్లాహ్ ను ఆరాధించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్నప్పుడు, మరియు దాని కారణంగా హింసించబడుతున్నప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఇది దేశం నుండి దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కూడా కావచ్చు. అయితే, స్వేచ్ఛగా ఇస్లాంను ఆచరించగలిగే మరియు ఇస్లాం గురించి ప్రచారం చేయగలిగే అవకాశం ఉన్న చోట హిజ్రత్ అవసరం లేదు. శక్తి ఉండి కూడా, ప్రపంచ ప్రయోజనాల కోసం హిజ్రత్ చేయని వారికి ఖుర్ఆన్ లో కఠినమైన హెచ్చరిక ఉంది. కానీ నిజంగా బలహీనులకు, మార్గం తెలియని వారికి మినహాయింపు ఉంది. హిజ్రత్ చేయని వాడు పాపాత్ముడు అవుతాడు కానీ అవిశ్వాసి కాడు. పశ్చాత్తాప ద్వారం మూసుకుపోయే వరకు (సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు) హిజ్రత్ కొనసాగుతుంది, కానీ వ్యక్తిగత పశ్చాత్తాపం మరణ ఘడియ రాకముందే చేయాలి.

అల్హమ్దులిల్లాహ్. ఉసూలె తలాతా (త్రిసూత్రాలు). పందొమ్మిదవ పాఠం హిజ్రత్ గురించి. హిజ్రత్ ఉమ్మతె ముస్లిమా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించే వారిపై విధిగా ఉంది.

الْهِجْرَةُ فَرِيضَةٌ عَلَى هَذِهِ الْأُمَّةِ
(అల్ హిజ్రతు ఫరీదతున్ అలా హాదిహిల్ ఉమ్మ)
హిజ్రత్ ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది.

الِانْتِقَالُ مِنْ بَلَدِ الشِّرْكِ إِلَى بَلَدِ الْإِسْلَامِ
(అల్ ఇంతికాలు మిన్ బలదిష్షిర్కి ఇలా బలదిల్ ఇస్లాం)
షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వలస వెళ్ళడం అని చెప్పారు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్.

అంటే ఎక్కడైతే బహుదైవారాధన జరుగుతుందో, ఆ ప్రదేశంలో మనం తౌహీద్ పై ఉండడం, కేవలం అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే చేయడం కష్టతరంగా, అసంభవంగా ఉందో మరియు అక్కడి ప్రజలు మనం అల్లాహ్ ఆరాధన చేస్తూ ఉంటే మనపై చిత్రహింసలు ఇంకా నానా రకాలుగా దౌర్జన్యాలు చేస్తున్నారో, అలాంటి ప్రదేశాన్ని వదిలి, ఎక్కడైతే మనం తౌహీద్ పై స్థిరంగా ఉండగలుగుతామో, సున్నత్ పై స్థిరంగా ఉండగలుగుతామో అక్కడికి వలస పోవటం.

بَاقِيَةٌ إِلَى قِيَامِ السَّاعَةِ
ప్రళయం సంభవించే వరకు హిజ్రత్ ఉంది.

ఇది ఎన్నటికీ అంతం కాని విషయం. దీని ద్వారా మనకు బోధపడిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క ఆరాధన, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం, ఇది మన జీవితంలో ఎంత ముఖ్యమైన మరియు తప్పనిసరి విషయం అంటే, దీని కొరకు ఒకవేళ మనం పుట్టిన, పెరిగిన మన స్వగ్రామాన్ని, మన స్వస్థలాన్ని వదిలి వెళ్ళవలసి అవసరం వచ్చినా, దానికి మనం రాజీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయ్యో, ఇన్ని రోజుల నుండి నేను సంపాదించుకున్న నా సంపాదన అని, ఇంత మా తాత ముత్తాతల నుండి నేను పొందినటువంటి భూములు, ఆస్తులు, పంటలు అని, ఇంకా వేరే ఏమైనా రియల్ ఎస్టేట్, ఇంకా ఏమైనా ఉంటే కేవలం ఈ ప్రాపంచిక సామగ్రి కొరకు మనం ఏదైనా కాంప్రమైజ్ చేసుకొని షిర్కులో మునిగిపోయి, తౌహీద్ను విడనాడి కేవలం ఈ ప్రపంచం కొరకు ఇలా మిగిలి ఉన్నామంటే, కేవలం ప్రపంచం కొరకు మనం మన దేశంలో, మన స్వస్థలంలో ఉండిపోయామంటే, మన ప్రాంతంలో ఉండిపోయామంటే, ప్రళయ దినాన నరకంలో వేసినప్పుడు ఇవన్నీ మనకు ఏమైనా పనికి వస్తాయా?

అయితే ఇక్కడ కొందరు త్వరగా ప్రశ్న లేపుతారు. అదేమిటంటే, ఆనాటి కాలంలో సహాబాలపై దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు హబషా వారు స్థలం ఇచ్చారు, నివాసం ఇచ్చారు, శాంతి కలుగజేశారు. అందుకొరకు అక్కడికి వలస వెళ్లారు. ఆ తర్వాత మదీనా వాసులు పూర్తి బాధ్యత తీసుకొని రమ్మని స్వయంగా వారు ఆహ్వానించారు. ప్రవక్త మరియు సహాబాలు తమ స్వస్థలమైనటువంటి, ఎంతో గౌరవప్రదమైనటువంటి మక్కా నగరాన్ని కూడా వదిలి వెళ్లారు. కానీ ఈ రోజుల్లో మనకు ఏ దేశం మనకు శరణు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది? ఏ దేశంలో మనకు శాంతి లభిస్తుంది? అయితే గుర్తుంచుకోవాలి, హిజ్రత్ అన్నది కేవలం ఒక దేశం నుండి ఒక దేశమే కాదు. హిజ్రత్ అన్నది ఒక ఇంటి నుండి మరో ఇంటికి, ఒక వాడ నుండి మరో వాడలోకి, ఒక గ్రామం నుండి మరో గ్రామంలోకి, ఒక మండలం నుండి మరో మండలంలోకి, ఒక డిస్ట్రిక్ట్ నుండి మరో డిస్ట్రిక్ట్, ఒక స్టేట్ నుండి మరో స్టేట్ ఇలా కూడా జరగవచ్చు. చెప్పే ఉద్దేశం ఏంటంటే ఎక్కడ మీరు స్వతంత్రంగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతున్నారో అక్కడ ఉండి మీరు మీ ఇస్లాంపై స్థిరంగా ఉండాలి. ఎక్కడ ఉండడంలో మీ ధర్మానికి నష్టం ఎక్కువగా ఉందో మరియు అక్కడ ఉండి మీరు ఎదుర్కొనలేకపోతున్నారో, వారికి జవాబు ఇవ్వలేకపోతున్నారో, అక్కడ ప్రచారం చేసే విషయంలో మీరు ఇంకా ముందుకు సాగలేకపోతున్నారో, అలాంటి ప్రదేశం నుండి.

కానీ అల్హమ్దులిల్లాహ్, ప్రభుత్వం ఎవరిదైనా గానీ, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ కేవలం అల్లాహ్ ను ఆరాధించడంలో మనకు ఏ ఇబ్బంది లేదు, ఐదు పూటల నమాజు సామూహికంగా చేయడంలో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటి ఇంకా ఇస్లాం యొక్క మూల విషయాలు ఆచరించడంలో మనకు ఎలాంటి సమస్య లేదు, అంతకంటే ఎక్కువ, ఎవరైనా ఎప్పుడైనా అజ్ఞానంతో, ఏదైనా తప్పుడు భావములో పడి మనకు, మనం ఆచరిస్తున్న ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా పలికినా, అక్కడ మనం లేదా మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు సమాధానం ఇచ్చి వారి నోరు మూపిస్తున్నారు, సమాధానం ఇచ్చి వారి అపోహలను దూరం చేస్తున్నారు, సరియైన సత్య ధర్మం వారికి తెలియజేసి వారిని గుడ్డి అనుకరణలో ఉండకుండా ఖుర్ఆన్ చదవండి, ప్రవక్త జీవితం చదవండి అని చెప్పగలుగుతున్నారో, అలాంటి చోట మనం ఇలాంటి ధైర్యంతో ఉండడం ఇదే చాలా గొప్ప విషయం.

కానీ, ఇలాంటి సౌకర్యాలు లేకుండా ఏ ప్రాంతంలో, ఏ ఊరిలో మరియు ఏ ఇంట్లోనైతే మీకు ఎదురు దెబ్బలు, ఎదురు మాటలు, మీరు ఆచరిస్తున్న ఇస్లాంకు వ్యతిరేకంగా వారి యొక్క మానసిక, వాచా, కర్మ, మనసా అన్ని రకాలుగా దౌర్జన్యానికి మీరు గురి అవుతున్నారు, అక్కడ సమాధానం ఇవ్వడానికి కూడా మీకు శక్తి లేదు. అలాంటప్పుడు హిజ్రత్ చేసే అటువంటి శక్తి ఉంటే, తప్పకుండా హిజ్రత్ చేయాలి. చేయకుంటేనే అల్లాహ్ త’ఆలా మనల్ని హెచ్చరిస్తున్నాడు. సూరతున్నిసా ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివి చూడండి. కానీ ఇదే ఆయత్ నెంబర్ 99 లో ఆ హిజ్రత్ చేసే అంతటి శక్తి కూడా ఎవరిలోనైనా లేదు, కాకపోతే వారు మనసా, నిండు మనసుతో ఇస్లాంపై స్థిరంగా ఉన్నారు, షిర్క్ కు పాల్పడకుండా వారు జాగ్రత్తగా ఉన్నారు. అలాంటప్పుడు అల్లాహ్ వారిని క్షమించుగాక, కరుణించుగాక అని కూడా శుభవార్త ఇవ్వడం జరిగింది.

ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఈ ఆయత్ ను ఏదైతే ప్రస్తావించారో, దాని అనువాదం ఒకసారి వినండి. అల్లాహ్ త’ఆలా చెబుతున్నాడు:

إِنَّ الَّذِينَ تَوَفَّاهُمُ المَلآئِكَةُ ظَالمي أَنْفُسِهِمْ قَالُواْ فِيمَ كُنتُمْ قَالُواْ كُنَّا مُسْتَضْعَفِينَ فِي الأَرْضِ قَالْوَاْ أَلَمْ تَكُنْ أَرْضُ اللهِ وَاسِعَةً فَتُهَاجِرُواْ فِيهَا فَأُوْلَـئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ وَسَاءتْ مَصِيرًا إِلاَّ المُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاء وَالْوِلْدَانِ لاَ يَسْتَطِيعُونَ حِيلَةً وَلاَ يَهْتَدُونَ سَبِيلاً * فَأُوْلَـئِكَ عَسَى اللهُ أَن يَعْفُوَ عَنْهُمْ وَكَانَ اللهُ عَفُوًّا غَفُورًا

ఎవరయితే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు, “మీరే స్థితిలో ఉండేవారు?” అని వారిని అడుగుతారు. దానికి వారు, “మేము మా ప్రదేశంలో బలహీనులముగా, (నిస్సహాయులంగా) ఉండేవారము” అని బదులిస్తారు. “ఏమిటీ? మీరు (ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి) వలసపోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేదా?” అని దైవ దూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం. అది అత్యంత చెడ్డ గమ్య స్థానం. అయితే నిజంగానే ఏ సాధన సంపత్తి లేని, దారి తెలియని నిస్సహాయులైన పురుషుల, స్త్రీల, పసివాళ్ళ (సంగతి వేరు). అల్లాహ్‌ వారిని మన్నించవచ్చు! అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (నిసా 4:97-99).

ఆ దైవదూతలు అంటారు: “అల్లాహ్ యొక్క భూమి చాలా విశాలంగా ఉండింది కదా, అక్కడికి మీరు వలస వెళ్లి అక్కడ స్వతంత్రంగా అల్లాహ్ ను ఆరాధించగలిగే వారు కదా?” ఇక్కడ గమనించండి, ఎవరైతే వలస వెళ్లే అటువంటి, హిజ్రత్ చేసే అటువంటి శక్తి ఉండి కూడా హిజ్రత్ చేయరో వారిని అల్లాహ్ ఏమంటున్నాడు? తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నవారు. వారి గురించి చెబుతున్నాడు:

فَأُولَٰئِكَ مَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَسَاءَتْ مَصِيرًا
అలాంటి వారి నివాసం నరకమే. మరియు అది చాలా చెడ్డ గమ్యస్థానం.

కానీ వెంటనే, ఎవరైతే వాస్తవంగా హిజ్రత్ చేసే అంతటి స్తోమత ఏ మాత్రం కలిగిలేరో వారి గురించి ఏమంటున్నాడు?

إِلَّا الْمُسْتَضْعَفِينَ مِنَ الرِّجَالِ وَالنِّسَاءِ وَالْوِلْدَانِ
మరియు చాలా బలహీనంగా ఉన్నటువంటి పురుషులు గానీ, స్త్రీలు గానీ, పిల్లలు గానీ,

لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا
ఎవరికైతే హిజ్రత్ చేయడానికి ఏ సాధనం, ఏ మార్గం దొరకడం లేదో,

عَسَى اللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ
అల్లాహ్ వారిని క్షమించవచ్చు.

సమీపంలోనే అల్లాహ్ త’ఆలా వారిని మన్నిచేస్తాడు, క్షమించేస్తాడు. ఎందుకంటే అల్లాహ్ ఎంతో గొప్ప మన్నింపు గుణం గలవాడు మరియు క్షమించేవాడు.

సోదర మహాశయులారా, సోదరీమణులారా! ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, శక్తి ఉండి హిజ్రత్ చేయకుంటేనే పాపాత్ముడు అవుతాడు, కానీ అవిశ్వాసుడు కాడు సుమా. ఈ విషయం గుర్తుంచుకోండి. ఎందుకంటే సూరత్ అన్కబూత్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبدُونِ
విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి“. (అన్కబూత్ 29:56).

ప్రతి జీవికి మృత్యువు రాక తప్పదు. మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చి షిర్కులో కూరుకుపోయి ఉంటే ఏమిటి లాభం? కొత్త ప్రదేశంలో హిజ్రత్ చేసి అల్లాహ్ యొక్క ఆరాధన స్థిరంగా చేస్తాము అన్నటువంటి విషయంలో మీరు భయపడి అయ్యో అక్కడ మాకు స్థలం దొరుకుద్దో లేదో, అక్కడ ఎలా మేము జీవించగలము, ఇలాంటి విషయాలతో భయపడితే ప్రాణం ఎక్కడైనా పోయేది ఉంది.

ఇమాం బగవీ రహిమహుల్లాహ్ చెబుతున్నారు, సూరె అన్కబూత్ లోని ఆ ఆయత్లో అల్లాహు త’ఆలా, ‘యా ఇబాది యల్లజీన ఆమనూ’, ఎవరైతే హిజ్రత్ చేయలేదో వారిని ఏమంటున్నాడు? ఓ విశ్వసించిన నా దాసులారా! అంటే ఏం తెలిసింది? ఎవరైనా శక్తి ఉండి హిజ్రత్ చేయకుంటే పాపాత్ముడు అవుతాడు కానీ విశ్వాసియే ఉంటాడు, అవిశ్వాసి కాడు, సత్య తిరస్కారి మరియు కాఫిర్ కాడు.

అయితే, ఈ హిజ్రత్ ప్రళయం వరకు ఉంది అని చెప్పడం జరిగింది కదా, దానికి దలీల్ ఒక హదీస్ నుండి తెలిపారు ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్. ఏంటి ఆ హదీస్? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

لَا تَنْقَطِعُ الْهِجْرَةُ حَتَّى تَنْقَطِعَ التَّوْبَةُ، وَلَا تَنْقَطِعُ التَّوْبَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا
(లా తన్కతి’ఉల్ హిజ్రతు హత్తా తన్కతి’అత్తౌబా, వలా తన్కతి’ఉత్తౌబతు హత్తా తత్లు’అష్షమ్సు మిన్ మగ్రిబిహా)
పడమర నుండి సూర్యోదయం అయ్యే వరకు తౌబా యొక్క ద్వారం తెరిచి ఉంటుంది. మరియు ఎప్పటి వరకు అయితే తౌబా ద్వారం తెరిచి ఉందో, అప్పటి వరకు హిజ్రత్ కొనసాగుతూనే ఉంటుంది, అది అంతం కాదు. (అబూ దావూద్ 2479. సహీ హదీస్).

ఈ హదీస్ ద్వారా మనం ఒక గొప్ప విషయం, ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే తౌబా ద్వారం ప్రళయం వరకు ఉంది అన్నటువంటి మాట విని తౌబా చేసే విషయంలో ఆలస్యం, అశ్రద్ధ చేయరాదు. ఎందుకంటే ఆ ప్రళయం వరకు ఉన్నటువంటి తౌబా సర్వ మానవాళి కొరకు అని చెప్పడం జరిగింది సామాన్యమైన తౌబా. కానీ ఎప్పుడైతే మన చావు వస్తుందో, మన ప్రళయం సంభవించినట్లే. ఆ రోజు వరకు మనం ఉండలేము. అయితే మన చావు రాకముందే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు:

إِنَّ اللَّهَ يَقْبَلُ تَوْبَةَ الْعَبْدِ مَا لَمْ يُغَرْغِرْ
నిశ్చయంగా అల్లాహ్ దాసుని గొంతులో ప్రాణం గర గర లాడనంత వరకు అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు.

మనిషి గర గరా యొక్క కైఫియత్, మనిషి మరణ అవస్థలోకి రానంత వరకు అల్లాహ్ అతని తౌబాను స్వీకరిస్తాడు. అయితే మనం ఎప్పుడు ఏ పొరపాటు జరిగినా, ఏ పాపం జరిగినా వెంటనే తౌబా చేయాలి. ఇదే మన కొరకు ఉత్తమమైన విషయం.

హిజ్రత్ గురించి విషయం తెలిసింది కదా! అది మన అందరిపై విధిగా ఉంది మరియు ప్రళయం వరకు ఉంటుంది. దానికి హదీస్ కూడా విన్నారు. ఇక ఎవరైతే తమ స్థానంలో, తమ ఇంట్లో, తమ ప్రాంతంలో అల్లాహ్ యొక్క ఆరాధన స్వచ్ఛందంగా చేయలేకపోతున్నాడో, అతను హిజ్రత్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అతనిలో ఏ మాత్రం శక్తి లేకుంటే, ఎలా చేయాలి మార్గం తెలియకుంటే, అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు కావచ్చు, అల్లాహ్ త’ఆలా అతన్ని క్షమించగలడు. కానీ ఏ కొంచెం శక్తి ఉండి కూడా మనిషి అల్లాహ్ యొక్క ఆరాధనకు ఎదురుగా ప్రపంచ వ్యామోహానికి, ప్రపంచ సంపదకు, పంట పొలాలకు ప్రాధాన్యత ఇచ్చేది ఉంటే, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అన్నటువంటి హెచ్చరిక ఇవ్వడం జరిగింది.

అల్లాహ్ మనందరికీ హిజ్రత్ యొక్క అవసరం వచ్చినప్పుడు చేయడానికి గట్టి మనసు, బలమైన విశ్వాసం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=40609

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
https://teluguislam.net/2023/04/19/u3mnj