ఇస్రాయీల్ జాతివారు ‘సబ్త్’ (సబ్బత్) నియమాన్ని అతిక్రమించడం – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ

“(ఇస్రాయీల్ జాతివారు) శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేని కావు, వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.” (7:163)

ఇస్రాయీల్ ప్రజలు వారంలో ఒక రోజు తమ పనులన్నింటినీ మానుకోవాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) బోధించారు. అలా పనులన్నింటినీ మానుకునే రోజును ‘సబ్బత్’ అంటారు. సబ్బత్ రోజున అన్ని పనులు మానుకుని కేవలం అల్లాహ్ ను ఆరాధించవలసి ఉంది. అల్లాహ్ తమపై కురిపించిన అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించవలసి ఉంది. ఈ విధంగా చేయడం వల్ల వారి హృదయాలు పరిశుద్ధమవుతాయని ఆయన బోధించారు. యూదులు శనివారాన్ని తమ సబ్బత్ రోజుగా ఎన్నుకున్నారు. ఈ సంప్రదాయాన్ని అనేక తరాలు ఆచరించాయి.

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) కాలంలో ఎలాత్ ప్రాంతంలో కొందరు ఇస్రాయీల్ ప్రజలు నివసించేవారు. ఎలాత్ ఎర్ర సముద్ర తీరాన ఉన్న ఒక పట్టణం. వారంతా చేపలు పట్టే జాలర్లు. సబ్బత్ రోజున సముద్రంలో చేపలు రెండు శిలల మధ్య గుమిగూడి గుంపులు గుంపులుగా కనబడడాన్ని వాళ్ళు చూశారు.

సబ్బత్ రోజున జాలర్ల వలలు తమను ఏమీ చేయవన్న విషయం వాటికి తెలిసినట్లు, ఆ రోజునే అవి తీరానికి వచ్చి ఊరించేవి. వాటిని చూసి కొందరు జాలర్లు నిగ్రహాన్ని కోల్పోయారు. అత్యా శతో చివరకు వాళ్ళు సబ్బత్ నియమాన్ని అతిక్రమించాలని నిర్ణయించుకున్నారు.

ఒక సబ్బత్ రోజు ఉదయం ఈ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్ళారు. కాని దైవభయం కలిగిన ప్రజలు ఈ విషయం గురించి తెలిసి దైవాదేశాలను అతిక్రమించవద్దని వారికి హితోపదేశం చేశారు. కాని దురాశకు గురయిన జాలర్లు వినలేదు. అందువల్ల పట్టణం నడిబొడ్డున ఒక గోడ నిర్మించి సబ్బత్ పాటించే ప్రజలు, సబ్బత్ ను అతిక్రమించిన ప్రజలుగా పట్టణాన్ని విభజించడం జరిగింది. అల్లాహ్ శిక్ష తమపై ఎక్కడ పడుతుందో అని మంచివాళ్ళు భయపడ్డారు.

దుర్మార్గులు ప్రతి సబ్బత్ రోజున నిర్భయంగా, నిస్సంకోచంగా చేపల వేట కొనసాగించేవారు. చివరకు వాళ్ళు తమ ఇళ్ళకు దగ్గరగా కందకాలు తవ్వి సముద్రం నీటినుంచి చేపలు తమ ఇళ్ళ దగ్గరి వరకు వచ్చేలా చేసేవారు. ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) స్వయంగా వారిని హెచ్చరించడానికి వెళ్ళారు. అల్లాహ్ ఆదేశాలను అతిక్రమిస్తే అల్లాహ్ శిక్ష వారిని పట్టుకుంటుందని నచ్చజెప్పారు. కాని వారు వినలేదు. వారి వైఖరిని చూసి కొందరు వారిని వారి ఖర్మకు వదలివేయడమే మంచిదని చెప్పారు.

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) ఈ విషయమై అల్లాహ్ సహాయం కోసం ప్రార్థించారు. చివరకు ఒక పెద్ద భూకంపం నగరాన్ని కుదిపేసింది. సబ్బత్ నియమ ఉల్లంఘన పాపాన్ని సహించిన విశ్వాసులు కూడా ఆ భూకంపం ప్రభావానికి గురయ్యారు. దుర్మార్గులు పాల్పడే చెడ్డ పనులను వ్యతిరేకించి అభ్యంతరపెట్టిన వారిని మాత్రం అల్లాహ్ రక్షించాడు. సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించి దుర్మార్గానికి పాల్పడిన వారిని అల్లాహ్ భూకంపం ద్వారా అంతమొందించాడు. భూకంపంలో నాశనమయ్యే ముందు సబ్బత్ నియమాన్ని ఉల్లంఘించిన వారు కోతులుగా మారి పోయారు. కొందరు వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ప్రకారం, వారు కోతుల మాదిరిగా ప్రవర్తించారు.

[1] నేటికి కూడా యూదులు శనివారం రోజును సబ్బత్ గా పాటిస్తారు. ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) కూడా సబ్బత్ పాటించేవారు. తర్వాత క్రయిస్తవులు ఆదివారంగా మార్చుకున్నారు. ప్రాచీన రోమన్లు ఆరాధించిన సూర్యదేవునికి చెందిన రోజైన ఆదివారాన్ని క్రయిస్తవులు తమ కోసం ఎన్నుకున్నారు

[2] దేవుడు పూర్తి ప్రపంచాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడని ఏడవ రోజున విశ్రమించాడని క్రయిస్తవులు విశ్వసిస్తారు (జెనిసిస్ 2-2). కాని దేవుడు కూడా మానవుల మాదిరిగా అలసిపోతాడని, విశ్రాంతి అవసరమని ముస్లిములు ఎన్నటికీ భావించరు.

[3] శుక్రవారం ముస్లిములకు సంబంధించి సబ్బత్ ఎంతమాత్రం కాదు. శుక్రవారం మధ్యాహ్న ప్రార్ధనల సమయంలో పనులన్నీ మానుకుని తప్పనిసరిగా సామూహిక ప్రార్థనలకు హాజరు కావలసి ఉందన్న మాట నిజమే, కాని ఆ ప్రార్ధనలు మహాఅయితే అరగంట కన్నా అధిక సమయం ఉండవు. ఆ పిదప వారు తమ ఉపాధి కార్యక్రమాల్లో నిమగ్నం కావచ్చు (చదవండి దివ్యఖుర్ఆన్ 62:9-10).

7:163 وَاسْأَلْهُمْ عَنِ الْقَرْيَةِ الَّتِي كَانَتْ حَاضِرَةَ الْبَحْرِ إِذْ يَعْدُونَ فِي السَّبْتِ إِذْ تَأْتِيهِمْ حِيتَانُهُمْ يَوْمَ سَبْتِهِمْ شُرَّعًا وَيَوْمَ لَا يَسْبِتُونَ ۙ لَا تَأْتِيهِمْ ۚ كَذَٰلِكَ نَبْلُوهُم بِمَا كَانُوا يَفْسُقُونَ

(ఓ ప్రవక్తా!) సముద్ర తీరాన నివసించిన బస్తీ[1] ప్రజల స్థితిగతులను గురించి వారిని[2] (యూదులను) అడుగు. వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు. మరి ఆ శనివారం నాడే చేపలు పైపైకి తేలియాడుతూ వారి ముందుకు వచ్చేవి. శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు. వారి అవిధేయత మూలంగా[3] మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము.

7:164 وَإِذْ قَالَتْ أُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُونَ قَوْمًا ۙ اللَّهُ مُهْلِكُهُمْ أَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا ۖ قَالُوا مَعْذِرَةً إِلَىٰ رَبِّكُمْ وَلَعَلَّهُمْ يَتَّقُونَ

ఇంకా వారిలో ఒక వర్గం (మంచిని ప్రబోధించే వారినుద్దేశించి), “అల్లాహ్‌ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయేవారికి[4] ఎందుకు (అనవసరంగా) ఉపదేశిస్తారు?” అని చెప్పగా, “మీ ప్రభువు సమక్షంలో సంజాయిషీ ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి (ఈ పని చేస్తున్నాము). అలాగే బహుశా ఈ జనులు (దైవాగ్రహానికి) భయపడినా భయపడవచ్చు” అని వారు సమాధానమిచ్చారు.

7:165 فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ أَنجَيْنَا الَّذِينَ يَنْهَوْنَ عَنِ السُّوءِ وَأَخَذْنَا الَّذِينَ ظَلَمُوا بِعَذَابٍ بَئِيسٍ بِمَا كَانُوا يَفْسُقُونَ

మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు[5], ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి, దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము[6].

7:166 فَلَمَّا عَتَوْا عَن مَّا نُهُوا عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ

అనగా వారు, తమకు వారించబడిన విషయంపై బరి తెగించి పోయినప్పుడు, “ఇక మీరు నీచులైన కోతులుగా మారిపొండి”[7] అని అన్నాము.

[1] ఇంతకీ ఆ బస్తీ ఏది? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అది ‘అయ్ లా’ అని కొందరూ, తబ్ రియా అని కొందరు, ‘ఏలియా’ అని మరికొందరు, సిరియా తీర ప్రాంతంలోని పురము అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ‘అయ్ లా’ అని చాలామంది భావించారు. ఇది మద్ యన్ ప్రాంతానికి తూరు పర్వతానికి మధ్యన ఖుల్జుమ్ సముద్రతీరాన ఉంది.

[2] “వారిని అడుగు” అంటే, ఎవరు వారు? వారు యూదులని తెలుస్తోంది. ఈ విధంగా అడగటం ద్వారా యూదులకు చెప్పదలచినదేమిటంటే, ఆ విషయం మీకు మాత్రమే తెలుసని అనుకుంటున్నారేమో! అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆ వృత్తాంతం క్షుణ్ణంగా తెలుసు. ఆయన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనడానికి ఇదొక తార్కాణం. ఒకవేళ ఆయనపై దైవసందేశం (వహీయే) గనక అవతరించి ఉండకపోతే ఆయనకు ఈ యదార్థ గాథలు తెలిసేవి కావు.

[3] పూర్వకాలంలో యూదులపై సంభవించిన సంఘటన ఇది. శనివారం నాడు చేపలు పట్టరాదని అల్లాహ్ వారికి ఆంక్ష విధించాడు. కాని వారి పరీక్ష నిమిత్తం ఆ రోజే చేపలు నీళ్ళపైన తేలియాడుతూ వాళ్లను ఊరించేవి. శనివారం తప్ప ఇతర దినాలలో చేపలు ఇలా పైకి వచ్చేవి కావు. అప్పుడు యూదులు తమ అతి తెలివిని ప్రదర్శించారు. వారు సముద్రపు ఒడ్డున గోతులు త్రవ్వేవారు. గోతుల్లో పడిన చేపలను మరునాడు పట్టుకునేవారు. ఈ విధంగా వారు దొడ్డిదోవలో దైవాజ్ఞను ఉల్లంఘించారు. అరబీలో ‘హీతానున్’ అని వచ్చింది. ఇది ‘హూతున్’కు బహువచనం. అంటే చేపలు అని అర్థం. అలాగే ‘షుర్రఅన్’ అనే మరో పదం వచ్చింది. ఇది ‘షారివున్’కు బహువచనం. షారివున్ అంటే నీటిపైకి తేలియాడుతూ వచ్చేదని భావం.

[4] ఈ వర్గం వారు మంచివారే. వారెన్నడూ ఈ ఉల్లంఘనకు పాల్పడలేదు. పైగా శనివారం నాడు గోతులు త్రవ్వేవారికి అలాంటి ద్రోహానికి పాల్పడవద్దని నచ్చజెప్పేవారు కూడా. కాని ఎంతకీ వారు వినకపోవటంతో నిరాశచెందారు. కాని మరికొంతమంది మాత్రం నియమాన్ని ఉల్లంఘించేవారిని పదే పదే హెచ్చరిస్తూ ఉండేవారు. అప్పుడు మొదటివర్గం వారు వీరిని ఉద్దేశించి “మీరెందుకు అనవసరంగా ఇంత శ్రమపడతారు? మీరెంతగా ప్రయత్నించినా ఈ దుర్మార్గులు మాట వినరు” అని అంటుండేవారు. లేక దుర్మార్గులే మంచివారితో ఆ మాట అని ఉండవచ్చు. “మీ దృష్టిలో మేము దైవాగ్రహానికి, దైవశిక్షకు గురయ్యేవారమే అయినప్పుడు, అది మా అదృష్టంలో రాసిపెట్టబడి ఉన్నప్పుడు ఇక మీరెందుకు అనవసరంగా మాకు హితబోధ చేస్తారు?” అని వారు తమను నచ్చజెప్పే సజ్జనులతో అంటుండేవారు. దానికి సజ్జనులు ఇలా జవాబు చెప్పేవారు : “దైవ సమక్షంలో దోషులుగా నిలబడే దుస్థితి రాకుండా ఉండాలని మేమీ పని చేస్తున్నాము. సమాజంలో చెడులు పెచ్చరిల్లినప్పుడు, ఎల్లెడలా పాపకార్యాలు జరుగుతున్నప్పుడు వేడుక చూస్తూ ఉండిపోవటం, వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటం కూడా అపరాధమే. ఈ నేరానికి పాల్పడినందుకు అల్లాహ్ శిక్షించవచ్చు. ఒకవేళ మా ఉపదేశం వల్ల వారు మనసు మార్చుకుని మంచివైపుకు వచ్చినా రావచ్చు.”

మొదటి వ్యాఖ్యానం ప్రకారం ఆ కాలంలో మూడు వర్గాలుండేవి: 1. దైవాజ్ఞల్ని ఉల్లంఘించి చేపలు పట్టే వర్గం. 2. తను స్వయంగా దైవాజ్ఞల్ని ఉల్లంఘించకుండా, ఉల్లంఘిస్తున్నవారిని ఆపకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన వర్గం. 3. తను స్వయంగా దైవాజ్ఞల్ని ఉల్లంఘించకుండా ఉండటమే కాకుండా ఉల్లంఘిస్తున్న వారిని అడ్డుకున్న వర్గం. రెండవ వ్యాఖ్యానం ప్రకారమయితే రెండు వర్గాలవుతాయి. 1. దైవాజ్ఞల్ని ఉల్లంఘించే వర్గం. 2. వారిని అడ్డుకున్న వర్గం.

[5] అంటే – ఎంతగా నచ్చజెప్పినా వారు వినలేదు. తమ దుర్మార్గంపై పాతుకుపోయారు.

[6] అంటే శిక్షించబడిన వారు, దైవాజ్ఞలను ఉల్లంఘించి తమ ఆత్మలకు అన్యాయం చేసుకుని, తమను తాము నరకాగ్నికి ఆహుతి చేసుకున్న దుర్మార్గులు. అంతేకాదు, దైవాదేశాలను పెడచెవినపెట్టి భూమిలో విర్రవీగటాన్ని అలవాటుగా చేసుకున్న అవిధేయులు కూడాను.

[7] ఇప్పుడు ఇంతకీ అల్లాహ్ కాపాడినది కేవలం అవిధేయతను అడ్డుకున్న వర్గాన్నేనా? కడదాకా మంచిని ప్రబోధిస్తూ ఉండిన ఈ వర్గాన్ని తప్ప మిగిలిన రెండు వర్గాలను కూడా అల్లాహ్ శిక్షించాడా? లేక పబ్లిగ్గా దైవాజ్ఞలను ధిక్కరిస్తూ, నిరంతరం పాపాలు చేస్తూపోయిన పాపాత్ముల వర్గాన్ని శిక్షించి మిగిలిన రెండు వర్గాలను అల్లాహ్ రక్షించాడా?? – ఈ విషయంలో ఖుర్ఆన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇమామ్ ఇబ్నె కసీర్ మాత్రం రెండో అభిప్రాయం వైపుకే మొగ్గారు. ‘అతౌ’ అంటే అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడుతూ వారు హద్దులు మీరిపోయారని భావం.

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran