మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .
మొక్కుబడుల ప్రకరణం [PDF]
మొక్కుబడుల ప్రకరణం
(మొక్కుబడి చేసుకునే విధానాలు)
1వ అధ్యాయం – మొక్కుబడి చెల్లించుకునే ఆజ్ఞ
الأمر بقضاء النذر
1061 – حديث ابْنِ عَبَّاسٍ، أَنَّ سَعْدَ بْنَ عُبَادَةَ رضي الله عنه، اسْتَفْتَى رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: إِنَّ أُمِّي مَاتَتْ وَعَلَيْهَا نَذْرٌ، فَقَالَ: اقْضِهِ عَنْهَا
__________
أخرجه البخاري في: 55 كتاب الوصايا: 19 باب ما يستحب لمن يتوفى فجأة أن يتصدقوا عنه، وقضاء النذور عن الميت
1061. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:- హజ్రత్ సాద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఒక సమస్యను గురించి ప్రస్తావిస్తూ “(దైవప్రవక్తా!) నా తల్లి చనిపోయింది. (జీవించి ఉన్నప్పుడు) ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. దాన్ని తీర్చే బాధ్యత ఆమెపై ఉండిపోయింది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “ఆమె తరఫున నీవా మొక్కుబడి తీర్చు” అని సెలవిచ్చారు.
[సహీహ్ బుఖారీ : 55వ ప్రకరణం, 19వ అధ్యాయం]
2వ అధ్యాయం – మొక్కుబడి చేసుకోరాదు. మొక్కుబడి జరగవలసిన దాన్ని నివారించజాలదు (النهي عن النذر وأنه لا يرد شيئًا)
1062 – حديث ابْنِ عُمَرَ، قَالَ: نَهى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنِ النَّذْرِ، قَالَ: إِنَّهُ لاَ يَرُدُّ شَيْئًا، وَإِنَّمَا يُسْتَخْرَجُ بِهِ مِنَ الْبَخِيل
__________
أخرجه البخاري في: 82 كتاب القدر: 6 باب إلقاء النذر العبد إلى القَدَر
1062. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- “మొక్కుబడులు చేసుకోవద్దని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్మల్ని వారించారు. మొక్కుబడి అనేది జరగవలసిన ఏ సంఘటననూ ఏ కాస్త కూడా నివారించజాలదని, కాకపోతే మొక్కుబడి మూలంగా పిసినారి సయితం డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుందని ఆయన అన్నారు” .*
[సహీహ్ బుఖారీ : 82వ ప్రకరణం, 6వ అధ్యాయం]
[*] ఈ హదీసు మొక్కుబడులను వ్యతిరేకిస్తున్నట్లు పైకి అనిపిస్తోంది. కాని ధర్మసమ్మతమైన వ్యవహారంలో దైవప్రసన్నత కోసం మొక్కుబడి చేసుకోవడంలో తప్పులేదని ధర్మవేత్తల ఏకాభిప్రాయం. మొక్కుబడి పాప వ్యవహారానికి సంబంధించినదయితే దాన్ని తీర్చకపోవడమే గాక, తీర్చనందున పరిహారం (కఫ్ఫారా) కూడా చెల్లించనవసరం లేదని వారి అభిప్రాయం. అయితే ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్), మరికొందరు ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, మొక్కుబడి తీర్చకూడదు కాని ప్రమాణ భంగం అయినందుకు కఫ్ఫారా (పరిహారం) మాత్రం విధిగా చెల్లించాలి.
ఈ హదీసు ద్వారా మరొక విషయం కూడా తెలుస్తోంది. ధర్మసమ్మతమైన మొక్కుబడి చేసుకొన్నప్పుడు దాన్ని తప్పకుండా తీర్చాలి. లాభనష్టాలు, కష్టసుఖాలతో సహా సమస్త కార్యాలు నిర్వహించేవాడు అల్లాహ్ మాత్రమేనని నమ్మాలి. కార్యసాధన కోసం మానవుడు చేసే వివిధ ప్రయత్నాలలో మొక్కుబడి కూడా ఒకటని గ్రహించాలి. కేవలం మొక్కుబడి చేసుకొని ప్రయత్నం చేయకపోవడం అవివేక మనిపించుకుంటుంది. అలాగే మొక్కుబడి మన విధి వ్రాతను మార్చి వేస్తుందని భావించడం కూడా అవివేకమే.
1063 – حديث أَبِي هُرَيْرَةَ، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: لاَ يَأْتِي ابْنَ آدَمَ النَّذْرُ بِشَيْءٍ لَمْ يَكُنْ قُدِّرَ لَهُ، وَلكِنْ يُلْقِيهِ النَّذْرُ إِلَى الْقَدَرِ قَدْ قُدِّرَ لَهُ، فَيَسْتَخْرِجُ اللهُ بِهِ مِنَ الْبَخِيلِ، فَيُؤْتِي عَلَيْهِ مَا لَمْ يَكُنْ يُؤْتِي عَلَيْهِ مِنْ قَبْلُ
__________
أخرجه البخاري في: 83 كتاب الأيمان والنذور: 26 باب الوفاء بالنذر، وقوله (يوفون بالنذر)
1063. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- “మొక్కుబడి మనిషికి అతని అదృష్టంలో లేని ఏ ప్రయోజనమూ చేకూర్చదు. కాకపోతే మొక్కుబడి అతడ్ని అతని అదృష్టంలో రాసి ఉన్న దాని వైపుకు తీసికెళ్ళి కలుపుతుంది. మొక్కుబడి ద్వారా అల్లాహ్ పిసినారి చేత కూడా డబ్బు ఖర్చు చేయిస్తాడు. ఆ పిసినారి మొక్కుబడికి పూర్వం ఇవ్వనిది మొక్కుబడి కారణంగా ఇచ్చివేస్తాడు.”
[సహీహ్ బుఖారీ : 83వ ప్రకరణం, 26వ అధ్యాయం]
4వ అధ్యాయం – కాలినడకన కాబా గృహానికి వెళ్తానని మొక్కుబడి చేసుకోవడం
من نذر أن يمشي إلى الكعبة
1064 – حديث أَنَسٍ رضي الله عنه، أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ رَأَى شَيْخًا يُهَادَى بَيْنَ ابْنَيْهِ، قَالَ: مَا بَالُ هذَا قَالُوا: نَذَرَ أَنْ يَمْشِيَ؛ قَالَ: إِنَّ اللهَ عَنْ تَعْذِيبِ هذَا نَفْسَهُ لَغَنِيٌّ وَأَمَرَهُ أَنْ يَرْكَبَ
__________
أخرجه البخاري في: 28 كتاب جزاء الصيد: 27 باب من نذر المشي إلى الكعبة
1064. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ సారి ఒక వృద్ధుడ్ని చూశారు. అతను తన కొడుకు లిద్దరి మధ్య వారిచ్చిన ఊతంతో నడుస్తున్నాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి జనాన్ని ఉద్దేశించి “ఏమయింది ఇతనికి? ఎందుకిలా నడుస్తున్నాడు?” అని అడిగారు. “అతను కాలి నడకన కాబా గృహానికి వెళ్తానని మొక్కుబడి చేసుకున్నాడు” అన్నారు ప్రజలు. “ఈ మనిషి తనకు తాను విధించుకున్న ఈ శిక్షను అల్లాహ్ లెక్కలోనికి తీసుకోడు. వాహనమెక్కి వెళ్ళమని చెప్పండతనికి” [*] అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).
[సహీహ్ బుఖారీ : 28వ ప్రకరణం, 27వ అధ్యాయం]
[*] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తిని అతని మొక్కుబడిని తీర్చుకోవాలని ఆదేశించలేదు. పైగా ఆ మొక్కుబడికి వ్యతిరేకంగా నడచుకోవాలని అన్నారు. దానిక్కారణం, హజ్ యాత్ర కోసం వాహనం ద్వారా ప్రయాణమవడం కాలినడకన ప్రయాణం కన్నా శ్రేష్ఠమైనదై ఉండవచ్చు. శ్రేష్ఠమైనదానికి ప్రాధాన్యత నివ్వాలి గనక, ఆ మొక్కుబడిని తీర్చనవసరం లేదని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించి ఉంటారు. లేదా ఆ వ్యక్తికి మొక్కుబడి తీర్చే (శారీరక) శక్తి లేనందున ఆ విధంగా ఉపదేశించి ఉంటారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). అల్లాహ్ ఏ మనిషి పైనా అతను మోయలేని భారాన్ని వేయడు. అందువల్ల అతడ్ని వాహనమెక్కి ప్రయాణం సాగించమని ఆదేశించి ఉంటారు.
1065 – حديث عُقْبَةَ بْنِ عَامِرٍ، قَالَ: نَذَرَتْ أُخْتِي أَنْ تَمْشِيَ إِلَى بَيْتِ اللهِ، وَأَمَرَتْنِي أَنْ أَسْتَفْتِيَ لَهَا النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَاسْتَفْتَيْتُهُ فَقَالَ عَلَيْهِ السَّلاَمُ: لِتَمْشِ وَلْتَرْكَبْ
__________
أخرجه البخاري في: 28 كتاب جزاء الصيد: 37 باب من نذر المشي إلى الكعبة
1065. హజ్రత్ అఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) కథనం:- ఓ సారి నా సోదరి కాలినడకన కాబా గృహానికి వెళ్తానని మొక్కుబడి చేసుకొని, దాని గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారించి రమ్మని నన్ను పురమాయించింది. నేను వెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు ఈ విషయం ప్రస్తావించాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) విని “కాలినడకతో పాటు ఆమె వాహనం కూడా ఎక్కి ప్రయాణం చేయాలి” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 28వ ప్రకరణం, 27వ అధ్యాయం]
—
మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .