ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి
ఖుత్బా అంశము: అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు – 2
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ
(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనం ఆ హష్ర్ మైదానంలో సమస్త మానవాళి సమావేశమైనప్పటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాము.
ఓ అల్లాహ్ దాసులారా! హష్ర్ మైదానంలో నాలుగు విషయాలు జరుగుతాయి.
[1] జనులు భయకంపితులై ఉంటారు
సూరె హజ్ లో అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ ۚ إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
(ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం. ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది.) (సూరా అల్ హజ్ 22:1-2)
ఆ భయంకర పరిస్థితుల ప్రభావం వలన జనుల ఆలోచనలు గందరగోళం అయిపోతాయి. దాని వలన వారు భూమండలంపై ఎంత కాలం ఉన్నారో తెలుసుకోవడం కష్టం అవుతుంది కొందరు అంటారు.
يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا
(మనం (ప్రపంచంలో) పది రోజులకన్నా ఎక్కువ ఉండి ఉండం” అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.) (20:103)
మరికొందరు అంటారు.
قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ
(“ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము. కావాలంటే లెక్కించేవారిని అడగండి” అని వారంటారు.) (23:113)
మరొక చోట అల్లాహ్ వీరి గురించి ఇలా తెలియజేస్తున్నాడు.
وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يُقْسِمُ الْمُجْرِمُونَ مَا لَبِثُوا غَيْرَ سَاعَةٍ ۚ كَذَٰلِكَ كَانُوا يُؤْفَكُونَ
(ప్రళయ ఘడియ సంభవించిననాడు అపరాధులు, తాము (ప్రపంచంలో) ఒక్క గడియకాలం కన్నా ఎక్కువగా ఉండలేదని ప్రమాణాలు చేస్తారు) (30:55)
ఆరోజు యొక్క తీవ్రత ఎంత అధికంగా ఉంటుందంటే జనులు ఒకరినొకరు విస్మరిస్తారు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ وَأُمِّهِ وَأَبِيهِ وَصَاحِبَتِهِ وَبَنِيهِ لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
(ఆ రోజు మనిషి తన (స్వంత) సోదరుని నుండి పారిపోతాడు. తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి (పారిపోతాడు). ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది.) (80:34-37)
ఓ అల్లాహ్ దాసులారా! ప్రళయ దినం రోజున జనులలో అతి ఎక్కువగా భయపడేవారు పాపాత్ములు. ఉదాహరణకు కాఫిర్, బిద్ అతి, అవిధేయుడైన విశ్వాసి. అల్లాహ్ వారిని ఊద్దేశించి ఇలా అంటున్నాడు.
وَكَانَ يَوْمًا عَلَى الْكَافِرِينَ عَسِيرًا
(ఆ రోజు అవిశ్వాసుల పాలిట గడ్డురోజై ఉంటుంది.) (25:26)
కానీ విశ్వాసులు అందరూ ఆరోజున ఎటువంటి చింతన లేకుండా ఉంటారు. ఎందుకంటే వారు అల్లాహ్ కు విధేయత చూపుతూ ఆయన నిషేధించినటువంటి వాటి నుంచివారు దూరంగా ఉన్నారు. కనుక ఎవరైతే ఈ ప్రపంచంలో అల్లాహ్ కు భయపడతాడో ఆ అంతిమ దినం రోజున అల్లాహ్ అతన్ని భయం నుంచి కాపాడుతాడు. మరియు ఎవరైతే ఈ ప్రపంచంలో అల్లాహ్ భయం లేకుండా తన ఇష్టారాజ్యంగా జీవితాన్ని గడుపుతాడో అల్లాహ్ అతన్ని ప్రళయ దినం రోజున భయకంపితుడిగా చేస్తాడు. ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వైపు నుంచి న్యాయం కనుక ఆయన తన దాసులలో ఎప్పటికీ రెండు క్షేమాలను రెండు భయాలను ఒకే సారి పెట్టడు. కనుక ఎవరైతే ఈ ప్రపంచంలో అల్లాహ్ యొక్క భయంతో జీవితాన్ని గడుపుతారో అల్లాహ్ వారిని ప్రళయ దినం రోజున భయం లేనటువంటి స్థితిలో ఉంచుతాడు. అల్లాహ్ విశ్వాసుల గురించి ఈ విధంగా అంటున్నాడు.
لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَٰذَا يَوْمُكُمُ الَّذِي كُنتُمْ تُوعَدُونَ
ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు. దైవదూతలు వారిని తీసుకోవటానికి వచ్చి, “మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు ఇదే” అని అంటారు. (21:103)
మరొక చోట ఇలా అంటున్నాడు.
وَهُم مِّن فَزَعٍ يَوْمَئِذٍ آمِنُونَ
(వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు.) (27:89)
మరో చోట ఇలా సెలవిచ్చాడు.
أَفَمَن يُلْقَىٰ فِي النَّارِ خَيْرٌ أَم مَّن يَأْتِي آمِنًا يَوْمَ الْقِيَامَةِ
((చెప్పండి!) అగ్నిలో పడవేయబడేవాడు మేలా? లేక ప్రళయ దినాన సురక్షితంగా (ప్రశాంత స్థితిలో) వచ్చేవాడు మేలా?)
[2] సూర్యుడు అతి దగ్గరగా ఉంటాడు
అంతిమ దినం రోజున హష్ర్ మైదానంలో జరిగేటువంటి విషయాలలో ఒకటి సూర్యుడు అతి దగ్గరగా ఉంటాడు. ఒక మీలు దూరంలో ఉంటాడు. మీలు అనగా అర్థం మనం సుర్మా రాసుకునేటువంటి ఆ పరికరాన్ని కూడా మీలు అని అంటారు. రెండో విషయం ఏమిటంటే ఒక మైలు దూరం అని. ఈ రెండిట్లో ఏదైనా సరే సూర్యుడు అంతిమ దినాన అతి దగ్గరగా ఉంటాడు అన్నటువంటి విషయం రుజువు అవుతుంది.(ముస్లిం)
మరి సూర్యుడు అంత దగ్గరగా ఉన్నప్పుడు దాని నుంచి రక్షణ పొందే వారు ఎవరైనా ఉన్నారా అన్నటువంటి సందేహం కలుగవచ్చు. అవును అల్లాహ్ కొందరిని ఆ వేడి నుంచి రక్షిస్తాడు. వారిలో నుండి ఏడు రకాల వ్యక్తులకు తన సింహాసనం నీడలో చోటు కల్పిస్తాడు. ఆ రోజున ఆ నీడ తప్ప మరో నీడ లభించదు. ఆ రోజున అల్లాహ్ ఆ నీడను కలుగజేస్తాడు. దాని ద్వారా చాలామంది ఆ సూర్య తాపం నుంచి రక్షించబడతారు. అల్లాహ్ తఆలా మనందరినీ కూడా ఆ అదృష్టవంతులలో చేర్చుగాక!.
మొదటి వ్యక్తి న్యాయపాలకుడు,
రెండవ వ్యక్తి తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపినటువంటివాడు,
మూడవది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కొరకు కలుసుకున్నారు మరియు అల్లాహ్ ప్రసన్నత కొరకు విడిపోయారు, నాలుగవది తన మనసుని మస్జిద్ కు లగ్నం చేసిన వ్యక్తి మస్జిద్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ మస్జిద్ కు వెళ్లే వరకు అతని మనసు మస్జిద్ కు ముడిపడి ఉంటుంది,
ఐదు ఏకాంతంలో అల్లాహ్ ను గుర్తు చేసుకుని కన్నీరు కార్చిన వ్యక్తి ,
ఆరు ఒక అందమైన స్త్రీ తనని పాపం వైపు ఆహ్వానించినప్పుడు నేను అల్లాహ్ తో భయపడుతున్నాను అని స్త్రీ నుంచి దూరమయ్యే వ్యక్తి,
ఏడు దైవ మార్గంలో రహస్యంగా ఖర్చు పెట్టే వ్యక్తి అనగా తను చేసేటువంటి దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా రహస్య దానం చేస్తాడు.(బుఖారి ముస్లిం)
[3] ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం గారి హౌజ్ (కొలను)
హష్ర్ మైదానంలో జరిగేటువంటి విషయాలలో మరొకటి ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం గారి హౌజ్ (కొలను) దగ్గరికి వస్తారు. ధర్మంపై స్థిరంగా ఉన్న విశ్వాసులందరూ దాని నుండి తమ దాహాన్ని తీర్చుకుంటారు. మరియు ఆ హౌజ్ నుండి రెండు రకాల వ్యక్తులని తరిమి కొట్టడం జరుగుతుంది ఒకరు ఇస్లాం స్వీకరించిన తర్వాత ముర్తద్ అనగా మార్గభష్టత్వానికి గురైనటువంటివారు. మరియు రెండో రకం వారు దురాచారాలకు కొత్తపోకడలకు (బిద్ అత్ లకు) గురైనటువంటివారు. ఏ విధంగానైతే దారి తప్పిన ఒంటెను తరిమి కొట్టడం జరుగుతుందో ఆ విధంగా వీరిద్దరిని ఆ హౌజ్ నుంచి తరిమి వేయడం జరుగుతుంది. (ముస్లిం)
ఆ హౌజ్ లో స్వర్గ జలాశయమైనటువంటి కౌసర్ యొక్క రెండు పాయలు పడుతూ ఉంటాయి అందులో ఒకటి బంగారంది. రెండోది వెండిది. వాటి వెడల్పు పొడవు లాగే ఉంటుంది. సన్ఆ మరియు మదీనా యొక్క ప్రయాణ మధ్య దూరం అంత ఉంటుంది. కౌసర్ యొక్క అర్థం మంచి మరియు శ్రేయస్సు. దాని పొడవు ఒక నెల ప్రయాణ దూరము ఉంటుంది. పాల కంటే తెల్లగా సువాసన, కస్తూరి కంటే ఉన్నతంగా మరియు రుచి తేనె కంటే మధురంగా ఉంటుంది. ఎవరైతే ఒకసారి దాన్ని తాగుతారో ఇక ఎన్నటికీ అతనికి దప్పిక కలుగదు.(బుఖారి)
ఓ అల్లాహ్ దాసులారా! ప్రవక్త గారి ఆ హౌజ్ ఇప్పటికీ ఉంది. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు. అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను ఇప్పటికీ నేను నా హౌజ్ ని చూస్తున్నాను. (బుఖారి ముస్లిం)
హౌజ్ గురించి మరొక ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది. ప్రతి ప్రవక్త కొరకు ఒక హౌజ్ ప్రసాదించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేస్తున్నారు: ప్రళయ దినం రోజున ప్రతి ప్రవక్త కొరకు ఒక హౌజ్ ఇవ్వబడుతుంది ఆ సందర్భంలో వారు ఒకరిపై ఒకరు గర్వపడతారు ఎందుకంటే వారి హౌజ్ వద్ద దప్పిక తీర్చుకునే వాళ్ళు అధికంగా ఉంటారు. మరియు నాకు నమ్మకం ఉంది ఆ రోజున అల్లాహ్ దయతో అందరికంటే ఎక్కువగా జనులు నా హౌజ్ దగ్గరే వుంటారు.(తిర్మీజీ)
ఇది అల్లాహ్ తన వివేకంతో తన కారుణ్యంతో తన దాసుల కొరకు ప్రసాదించినటువంటి వరము. ఎందుకంటే గతించినటువంటి జాతులలోని విశ్వాసులు ప్రవక్తలకు చూపినటువంటి విధేయత మేరకు వారి హౌజ్ వద్ద దాహం తీర్చుకోనే ఏర్పాటు అల్లాహ్ చేశాడు. ఇది వారికి చేయబడినటువంటి వాగ్దాన ప్రతిఫలం వారికి పూర్తిగా ప్రసాదించడానికి గాను.
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక,మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత:
[4] సిఫారసు
మీరు తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అంతిమ దినాన హష్ర్ మైదానంలో జరిగే విషయాలలో ఒకటి సిఫారసు. ప్రళయ దినం రోజున అందరూ వారు విశ్వాసులైనా లేక అవిశ్వాసులైనా చాలా సమయం వరకు ఆ మైదానంలో నిల్చోని ఉంటారు చివరికి వారు అలిసిపోయి ప్రవక్తల వద్దకు వస్తారు. మరియు తమ ప్రభువు దగ్గర వారి గురించి సిఫారసు చేయమని ప్రవక్తలతో కోరుతారు. కానీ ఐదుగురు ప్రవక్తలు వారికి క్షమాపణ చెబుతారు. అందులో ఆదం, నూహు, ఇబ్రహీం, మూసా మరియు ఈసా ప్రవక్తలు ఉంటారు. చివరిగా ఈసా అలైహిస్సలాం ఇలా అంటారు మీరందరూ కలిసి ముహమ్మద్ వద్దకు వెళ్ళండి. వారందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రావడం జరుగుతుంది. ఆయన ఇలా అంటారు: నేను సిఫారసు కోసమే ఉన్నాను. అప్పుడు ప్రవక్త (ఆర్ష్) సింహాసనం క్రింద సాష్టాంగ పడతారు. అల్లాహ్ కోరుకునే వరకు ఆయన సజ్దాలోనే ఉంటారు. సజ్దాలో అల్లాహ్ యొక్క ఉన్నతమైన స్తోత్రాలు పొగడ్తలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి స్తోత్రాలు గతించిన ఏ ప్రవక్తకు కూడా ఇవ్వబడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అనడం జరుగుతుంది – ఓ మహమ్మద్! నీతల పైకి లేపు. ఏం కోరుకోవాలనుకుంటున్నావు కోరుకో. నువ్వు అడిగింది నీకు ప్రసాదించడం జరుగుతుంది. నువ్వు చేసినటువంటి సిఫారసు స్వీకరించబడుతుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మైదానంలో ఉన్నటువంటి సమస్త జనుల కర్మల లెక్క గురించి సిఫారసు చేస్తారు. అప్పుడు అల్లాహ్ తఆలా సిఫారసు స్వీకరించి లెక్క తీసుకోవడం ప్రారంభిస్తారు. మరియు సమస్త మానవాళి ఆదం అలైహి స్సలాం వారి దగ్గర నుంచి ప్రళయం వరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి అతను విశ్వాసి అయినా లేక విశ్వాసి అయినా వారి లెక్క తీసుకోవడం జరుగుతుంది.
అల్లాహ్ తఆలా దీని యొక్క ప్రస్తావన గురించి దివ్య ఖురాన్ లో “ముఖామే మహమూద్” పేరిట ఇలా తెలియజేశాడు.
عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُودًا
(త్వరలోనే నీ ప్రభువు నిన్ను ”మఖామె మహ్‌మూద్”కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు.) (17:79)
ఆ ప్రదేశం ఎంత ఉన్నతమైనది అంటే ప్రళయ దినం రోజున సమస్త జనుల ముందు గతించిన వారు, తర్వాత వచ్చిన వారందరూ కూడా ఆయనను ప్రశంసిస్తారు మరియు ఆ స్థానాన్ని చూసి అసూయ చెందుతారు, ఎందుకంటే మానవాళి లెక్క ప్రారంభించడానికి ప్రవక్త గారి సిఫారసు కారణమవుతుంది, అది సమస్త మానవుల కొరకు మరియు జిన్నాతుల కొరకు కూడ అవుతుంది.
మరియు తెలుసుకోండి మరో ఉన్నతమైన ఆచరణకై మీకు తెలియచేస్తున్నాము. జుమా రోజు అతి ఉన్నతమయిన ఆచరణ దరూద్ పఠించడం. ఓ అల్లాహ్! మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నీ శాంతి శుభాలు కురిపించు. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వనాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రతను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి
ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు , నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .
ఓ అల్లాహ్! మమ్ములను క్షమించు మరియు మా కంటే ముందు గతించిన మా విశ్వాస సోదరుల పాపాలను కూడా క్షమించు. మరియు విశ్వాసుల గురించి మా హృదయాలలో కుళ్లు, కుతంత్రాలు మరియు ద్వేషాన్ని నింపకు. నిశ్చయంగా నీవు కరుణించే వాడవు మరియు క్షమించే వాడవు.
عباد الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى، وينهى عن الفحشاء والمنكر والبغي، يعظكم لعلكم تذكرون، فاذكروا الله العظيم يذكركم، واشكروه على نعمه يزدكم، ولَذِكر الله أكبر، والله يعلم ما تصنعون.
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి