ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి
ఖుత్బా అంశము: అంతిమ దినం పై విశ్వాసం యొక్క ఆవశ్యకతలు – 1
إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُ
మొదటి ఖుత్బా :-
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ
(“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఆ రోజుకు అంతిమదినం అని పేరు రావడానికి గల కారణం ఏమిటంటే అదే చివరి రోజు. ఆ తర్వాత మరో రోజు ఉండదు. ఆ రోజున స్వర్గవాసులు స్వర్గంలోకి మరియు నరక వాసులు నరకంలోకి వెళ్తారు. ఆ రోజుని ప్రళయ దినం అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజున సమస్త మానవాళి అల్లాహ్ ముందు హాజరవడం జరుగుతుంది.
يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
(ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు.) (83:6)
ఓ విశ్వాసులారా! అంతిమ దినాన్ని విశ్వసించడంలో ఆరు విషయాలు ఉన్నాయి. శంఖం పూరించడం, సృష్టి పునరుత్థాన, ప్రళయ దిన సూచనలు బహిర్గతమవడం , ప్రజలు హష్ర్ మైదానం లో సమావేశమవడం, లెక్కా పత్రం , శిక్షా ప్రతిఫలం, స్వర్గం నరకం.
[1] ఓ అల్లాహ్ దాసులారా! శంఖం పూరించడం ప్రళయం యొక్క పెద్ద సూచనల్లో ఒక సూచన.
మరియు మొదటి సూచన దీని ద్వారానే ప్రళయం మొదలైంది అన్నటువంటి సంగతి తెలుస్తుంది. శంఖం అనగా అది ఒక కొమ్ము లాంటిది ఇస్రాఫీల్ దూత అందులో రెండుసార్లు పూరిస్తాడు. మొదటిసారి పూరించినప్పుడు సమస్త జీవులన్నీ మూర్చిల్లిపోయి మృత్యువాత పడతాయి. ఆధారం అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
وَمَا يَنظُرُ هَٰؤُلَاءِ إِلَّا صَيْحَةً وَاحِدَةً مَّا لَهَا مِن فَوَاقٍ
(వారు ఒకే ఒక్క కేక కోసం నిరీక్షిస్తున్నారు. అందులో ఎలాంటి తెరిపి కూడా ఉండదు.) (38:15)
అనగా ఆ తర్వాత వారికి సృహ రాదు మరియు వాళ్లు తిరిగి భూమండలం పైకి కూడా రాలేరు మరియు రెండోసారి శంఖం పూరించడం జరుగుతుంది. దాని వలన చనిపోయినటు వంటి వారు సమాధుల నుండి తిరిగి లేస్తారు దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నారు.
فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
అదొక (భయంకరమైన) గద్దింపు (అని మరువకండి) (79:13)
ఖురాన్ లో శంఖం పూరించడాన్ని గురించి సూరె ముద్దస్సిర్ లో ఈ విధంగా తెలియజేయబడింది.
فَإِذَا نُقِرَ فِي النَّاقُورِ
(మరెప్పుడైతే శంఖం పూరించబడుతుందో…) (74:8)
[2] ప్రళయ దినం యొక్క పెద్ద సూచనలపై విశ్వాసముంచడం
ఉదాహరణకు భూ ప్రకంపనలు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
(భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు,) (99:1)
మరోచోట ఇలా అంటున్నాడు.
إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا
(భూమి తీవ్రకంపనంతో కంపించి నప్పుడు;) (56:4)
మరో సూచన ఏమిటంటే ఆకాశం బద్దలై పోతుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు
فَإِذَا انشَقَّتِ السَّمَاءُ فَكَانَتْ وَرْدَةً كَالدِّهَانِ
మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి, ఎర్రని చర్మంలా తయారవుతుందో (ఆ స్థితిని ఓ సారి నెమరు వేసుకోండి!) (55:37)
అనగా ఎర్రటి చర్మం మాదిరిగా అయిపోతుంది ఎందుకంటే. ఇందులో (وردة)అర్థం ఎరుపు రంగు అని (كالدِّهان) అంటె అర్థం తోలు అని.
మరో వాక్యంలో తెలియచేయబడుతుంది ఆ రోజున ఆకాశం నల్లగా నూనె గసిలా మారిపోతుంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ
ఆ రోజు ఆకాశం నూనె గసిలా అయిపోతుంది. (70:8)
ఆ రోజున పర్వతాలు ఏకిన దూదిపింజరాల్లా మారిపోతాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు
وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ
పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజల్లా (లేక ఉన్నిలా) అయిపోతాయి. (101:5)
మరియు ఆ రోజున పర్వతాలు దుమ్ము ధూళిలా ఇసుక తిప్పల మాదిరిగా మారిపోతాయి. అల్లాహ్ఈ విధంగా అంటున్నాడు
وَكَانَتِ الْجِبَالُ كَثِيبًا مَّهِيلًا
పర్వతాలు ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయో (ఆ రోజు ఈ శిక్ష పడుతుంది.) (73:14)
ఆ రోజున పర్వతాలను నడిపించడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు
وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
పర్వతాలు నడిపింపబడి, ఎండమావుల్లా మారిపోతాయి. (78:20)
మరోచోట ఇలా తెలియజేయబడింది.
وَتَرَى الْجِبَالَ تَحْسَبُهَا جَامِدَةً وَهِيَ تَمُرُّ مَرَّ السَّحَابِ
నీవు పర్వతాలను చూచి, అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు. కాని అవి కూడా మేఘ మాలికల్లా తేలిపోతుంటాయి. (27:88)
ప్రళయ సూచనల్లో మరొకటి ఏమిటంటే సూర్యుడిని చుట్టి వేయడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు
إِذَا الشَّمْسُ كُوِّرَتْ
(సూర్యుడు చుట్టివేయబడినప్పుడు,) (81:1)
చుట్టి వేయడం అనగా సూర్యుడిని తల పాగాలా చుట్టి విసిరి వేయడం జరుగుతుంది. మరియు సూర్యుడు కాంతి హీనుడు అయిపోతాడు.
మరో సూచన ఏమనగా నక్షత్రాలు కాంతి హీనమై రాలిపోవడం జరుగుతుంది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
وَإِذَا النُّجُومُ انكَدَرَتْ
(నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు,) (81:2)
ప్రళయ సూచనలలో మరో సూచన ఏమిటంటే సముద్రంలో నుండి అగ్ని జ్వలించడం జరుగుతుంది. అల్లాహ్ ఏ విధంగా అంటున్నాడు.
وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ
(సముద్రాలు రాజేయబడినప్పుడు,) (81:6)
నిశ్చయంగా అల్లాహ్ ఎంతో పరిశుద్ధవంతుడు, శుభకరుడు. ఆయన తన ‘అయిపో’ అనేటువంటి ఆజ్ఞతో ఈ సమస్త సృష్టిని అతలాకుతలం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహా గొప్ప సృష్టికర్త. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَن نَّقُولَ لَهُ كُن فَيَكُونُ
(మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.) (16:40)
[3] సృష్టి పునరుత్థానపై విశ్వాసముంచడం అనగా రెండోసారి ఎప్పుడైతే శంఖం పూరించడం జరుగుతుందో చనిపోయిన వారందరూ తిరిగి లేపబడతారు.
ఇది సత్యం. ఖురాన్ మరియు హదీసులలో దీని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి అల్లాహ్ తఆలా ఈ విధంగా అంటున్నాడు.
ثُمَّ إِنَّكُمْ بَعْدَ ذَلِكَ لَمَيِّتُون ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُون
(మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.) (23:15-16)
అప్పుడు ప్రజలందరూ అల్లాహ్ ముందు సమావేశం అవుతారు. వట్టికాళ్లతో. నగ్న శరీరంతో ఉంటారు. వారికి సున్తీ కూడా అయి ఉండదు. వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రపంచంలో ఏ లోపాలు అయితే వారిలో ఉండేవో వాటి నుంచి కూడా వారు పరిశుభ్రంగా ఉంటారు ఉదాహరణకు ప్రపంచంలో కుంటివానిగా ,గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ తీర్పు దినం రోజున సక్రమంగా ఉంటారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ
ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.(21:104)
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
[4] హష్ర్ మైదానంలో సమావేశపరచడం
మీరు తెలుసుకోండి అల్లాహ్ మీపై కరుణించు గాక! అంతిమ దినానికి సంబంధించి నటువంటి విషయాలను మరో విషయం ఏమిటంటే సమస్త మానవాళిని ఆ రోజున హష్ర్ మైదానంలో సమావేశపరచడం జరుగుతుంది అని విశ్వసించడం
హష్ర్ అనగా మనుషులందరినీ సమాధుల నుంచి లేపి మైదానంలో సమావేశపరచడం. దీని ఆధారం అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
قُلْ هُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ
వారికి చెప్పు : “మిమ్మల్ని నేలలో విస్తరింపజేసినవాడు ఆయనే. (కడకు) ఆయన వైపే మీరంతా సమీకరించబడతారు.” (67:24)
ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన ఇలా తెలియజేశారు: మా మధ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుత్బా సందర్భంలో నిల్చొని ఇలా తెలియజేశారు – “మీరు అల్లాహ్ ని కలుసుకునేటువంటి ఆ రోజున ఓట్టి కాళ్లతో నగ్న శరీరంతో మరియు సున్తీ కానటువంటి స్థితిలో ఉంటారు”.(బుఖారి, ముస్లిం)
తీర్పు రోజున, ప్రజలు (చదునైన) తెల్లటి గోధుమ రంగు (చదునైన) భూమిపై సమీకరించ బడతారు, దీనిలో ఏ మానవునికి మార్గం ఉండదు (1), ఒక పిలుపు యొక్క స్వరం అందరి చెవులకు చేరుకుంటుంది ( 2) ఒక చూపు అన్నింటినీ చూడగలదు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం బుఖారి లో తెలియ చేయడం జరిగింది: “ఆ రోజు మానవులు, జిన్నాతులు , దేవదూతలు మరియు పశువులు ఒకచోట చేరి ఉంటాయి”
మానవులు మరియు జిన్నాతులను సేకరించడం అనే విషయం మునుపటి వాక్యం యొక్క సాధారణ సాక్షం, మరియు పశువుల సేకరణ యొక్క ఆధారం ఏమనగా అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.
وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా – అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే. (6:38)
మరోచోట ఇలా తెలియజేస్తున్నాడు.
وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ
(అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు,) (81:5)
దైవదూతల సమీకరణ యొక్క ఆధారం, అల్లాహ్ ఇలా అంటున్నాడు.
وَجَاءَ رَبُّكَ وَالْمَلَكُ صَفًّا صَفًّا
నీ ప్రభువు (స్వయంగా) వరుసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతెంచినపుడు… (89:22)
దైవదూతలు ఆ రోజున అల్లాహ్ ముందు బారులు తీరి నిల్చొని ఉంటారు. కానీ వారి లెక్క తీసుకోబడదు ఎందుకంటే వారి సృష్టిలోనే అల్లాహ్ సుబ్ హానహూ తఆలా ఆజ్ఞ పాలన చేసేటువంటి గుణాన్ని పెట్టాడు. వారు ఎప్పటికీ అల్లాహ్ కు అవిధేయత చూపరు. అల్లాహ్ వారి గురించి ఇలా అంటున్నాడు.
لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు. (66:6)
ఓ అల్లాహ్ దాసులారా! అంతిమదినంపై విశ్వాసం ఉంచడంలో భాగంగా నాలుగు విషయాల గురించి మీ ముందు ఉంచడం జరిగింది వీటిపై విశ్వాసం ఉంచడం తప్పనిసరి మిగతా 5, 6 విషయాల గురించి రాబోయే ప్రసంగం లో తెలుసుకుందాం.
మరియు తెలుసుకోండి మరో ఉన్నతమైన ఆచరణకై మీకు తెలియచేస్తున్నాము. జుమా రోజు అతి ఉన్నతమయిన ఆచరణ దరూద్ పఠించడం. ఓ అల్లాహ్! మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నీ శాంతి శుభాలు కురిపించు, ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వనాశనం చేయి, మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
ఓ అల్లాహ్!మా దేశాలలో భద్రతను ప్రసాదించు మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు ,సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి.
ఓ అల్లాహ్!మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు, ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించుఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు , నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు . ఆమీన్
ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయ పడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము. మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి నీ శరణు కోరుకుంటున్నాము.
ఓ అల్లాహ్! నేను నీ శరణులోకి వస్తున్నాను, ఏ అనుగ్రహాలు నాపై ఉన్నాయో నీ ఆ అనుగ్రహాలు నా నుండి దూరం కాకుండా ఉండటానికి, నీవు నన్ను ఏ సుఖంలో సౌఖ్యంలో ఉంచావో అది కూడా మారిపోకూడదు అని, నీ వైపు నుండి నేను ఏ అకస్మాత్తు ప్రమాదంలో పడకుండా ఉండటానికి, మరియు నీ అన్ని రకాల కోపానికి, ఆగ్రహానికి గురికాకుండా ఉండటానికి .
ఓ అల్లాహ్! మమ్ములను క్షమించు మరియు మా కంటే ముందు గతించిన మా విశ్వాస సోదరుల పాపాలను కూడా క్షమించు మరియు విశ్వాసుల గురించి మా హృదయాలలో కుళ్లు, కుతంత్రాలు మరియు ద్వేషాన్ని నింపకు నిశ్చయంగా నీవు కరుణించే వాడవు మరియు క్షమించే వాడవు.
عباد الله، إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى، وينهى عن الفحشاء والمنكر والبغي، يعظكم لعلكم تذكرون، فاذكروا الله العظيم يذكركم، واشكروه على نعمه يزدكم، ولَذِكر الله أكبر، والله يعلم ما تصنعون.
—
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి