ప్రవక్త మూసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – ఖురాన్ కథామాలిక

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) – విమోచనకర్త
(కాలం : క్రీ.పూ. 1400-1250, లుక్మాన్ (అలైహిస్సలాం) కాలం వరకు)

(దివ్యఖుర్ఆన్లో ఉన్న ప్రవక్తల కథలలో ఇది అతిపెద్ద కథ. అనేక విభాగాలుగా ప్రస్తావనకు వచ్చింది.)

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – యూట్యూబ్ ప్లే లిస్ట్ (4 వీడియోలు)
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0EZFhe8vMUqsqZOUxW93R3

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈజిప్టును పరిపాలించిన ఫిరౌన్ పరమ నియంత. యాకూబ్ (అలైహిస్సలాం) సంతానంపై (అంటే బనీ ఇస్రాయీల్ పై) ఫిరౌన్ అతి దారుణంగా అణచివేతలు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారిని పరాభవించడానికి, వారిని అన్ని విధాలుగా త్రొక్కి వేయడానికి అతడు అన్ని మార్గాలన్నింటినీ ఉపయోగించాడు. వారిని బానిసలుగా చేసుకున్నాడు. నామ మాత్రంగా జీతభత్యాలు ఇస్తూ, కొన్ని సందర్భాల్లో అస్సలు ఏమీ ఇవ్వకుండా వారితో బండచాకిరి చేయించుకునే వాడు. ఫిరౌన్ ఒంటరిగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడడం సాధ్యం కాదు, అతడితోపాటు అతని అనుచరులు అనేక మంది ఈ దౌర్జన్యాలలో పాలు పంచుకునేవారు. వీరంతా కలసి అణగారిన బనీ ఇస్రాయీల్ ప్రజల పై దౌర్జన్యాల పరంపర కొనసాగించే వారు.

ఫిరౌన్ దర్బారులోని ఒక పూజారి చెప్పిన మాటల వల్ల ఫిరౌన్ పసిపిల్లల హత్యాకాండకు పాల్పడ్డాడు. బనీ ఇస్రాయీల్లో జన్మించే ఒక యువకుని వల్ల ఫిరౌను పతనం వాటిల్లుతుందని ఆ పూజారి చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఫిరౌన్ మండిపడి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లో ఎవరికైనా మగపిల్లవాడు జన్మిస్తే వెంటనే హతమార్చాలని ఆదేశించాడు. అంతేకాదు బనీ ఇస్రాయీల్ మహిళలను పురుషులకు దూరం చేయాలని తన సైనికులకు చెప్పాడు. రాజుగారి ఆదేశంతో సైనికులు విచ్చలవిడిగా దుర్మార్గాలకు పాల్పడ్డారు. పసిపాపల సుకుమారమైన శరీరాల్లోకి కరవాలాలను దిగేశారు. గర్భిణులపై నిఘా వేసి ఉంచడం జరిగేది. వారికి ప్రసవం అయిన వెంటనే పుట్టింది మగపిల్లవాడైతే వెంటనే హతమార్చేవారు.

ఈ కాలంలో ఒక ఇస్రాయీల్ కుటుంబంలో ఒక పిల్లవాడు జన్మించాడు. అతడి పేరు మూసా. తల్లి యుకాబిద్. ఆమె రహస్యంగా పిల్లవాని ఆలనాపాలనా చూసింది. ఏదో ఒక విధంగా మూడు నెలల పాటు పిల్లవానికి పాలుపట్ట గలిగింది. ఆ తర్వాత తనకు దైవికంగా తోచిన భావాన్ని ఆచరణలో పెడుతూ ఆమె పసివాడిని ఒక బుట్టలో ఉంచి ఆ బుట్టను నదిలో విడిచిపెట్టింది. నైలు నదిలో ఆ విధంగా తన కుమారుణ్ణి విడిచిపెట్టిన ఆ తల్లి తన కుమార్తెతో ఆ బుట్ట ఏ దిశగా పోతుందో వెంట వెళ్లి చూడమని చెప్పింది. ఆమె కుమార్తె నది తీరం వెంబడి బుట్ట ఎటు కొట్టుకు పోతున్నదో చూస్తూ వెళ్ళసాగింది. ఆ నీటి ప్రవాహం రాజభవనం ఆవరణలోని తోటలో నుంచి ప్రవహిస్తూ వెళ్ళింది. ఆమె ఆశ్చర్యంతో తన కళ్ళముందు కనబడిన దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. ఆ ప్రవాహంలోని బుట్ట రాజభవనం వద్ద తీరానికి చేరింది. రాజసేవకులు ఆ బుట్టను, అందులో ఉన్న శిశువును చూసి, శిశువును తీసుకుని ‘ఫిరౌన్ దంపతుల వద్దకు వెళ్ళారు. ఫిరౌన్ భార్య, అక్కడి మహారాణి ఆ శిశువును చూసి ముగ్ధురాలయ్యింది. అల్లాహ్ ఆమె హృదయంలో ఆ శిశువు పట్ల ప్రేమ పుట్టుకువచ్చేలా చేశాడు. ఆమె తన భర్తతో, “ఈ పసివాడిని మనం పెంచుకుందాం, మన కుమారునిలా పెంచుకుందాం” అని చెప్పింది. * ఫిరౌన్కు కూడా ఆ పసివానిపై అభిమానం కలిగింది. పిల్లవాడిని పెంచుకునే అనుమతి మహారాణికి ఇచ్చాడు.

* ఫిరౌన్ భార్య దైవభక్తి కలిగిన విశ్వాసి. ఆమె ఎల్లప్పుడు దేవునితో తన సాఫల్యం కోసం, దుర్మార్గుడైన తన భర్త నుంచి, అతని దుర్మార్గాల నుంచి, అతనితో ఉన్న దుష్టుల నుంచి విముక్తి కోసం అల్లాహ్ ను ప్రార్థించేది. (దివ్యఖుర్ఆన్ 66:11). దివ్యఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలు ఆమెను ‘ఆసియా’గా పేర్కొన్నారు. ఆమె ‘మూసా’ను పెంచుకున్నది. బైబిలు పేర్కొన్న మాదిరిగా ఆమె ఫారో (ఫిరౌన్) కుమార్తె కాదు.

మూసా సోదరి రాజభవన ఆవరణం వదలి బయటకు వెళ్ళేముందే ఫిరౌన్ మహామంత్రి హామాన్ ఆమెను గమనించాడు. ఆమెను బంధించి ఫిరౌన్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆమె చాలా భయపడింది. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా వ్యవహరించింది. రాజభవనంలో ఏం చేస్తున్నావని గుచ్చి గుచ్చి ప్రశ్నించినా ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు.

ఈలోగా పసివాడైన మూసాకు పాలు త్రాగించడానికి ఆయాలను పిలవవలసిందిగా మహారాణి ఆజ్ఞాపించింది. చాలా మంది ఆయాలు వచ్చారు. కాని మూసా ఎవరి వద్ద కూడా పాలు తాగడం లేదు. మహారాణి నిరాశగా ఇంకా ఎవరైనా ఆయాలు ఉంటే పిలుచుకు రమ్మని సేవకులను పంపింది. మూసా అక్క కూడా ఆందోళనగా చూడసాగింది. పసివాడైన మూసా పాలు తాగి చాలా సేపయ్యింది. మహారాణి కూడా చాలా ఆందోళనగా ఆయాల కోసం సేవకులను పంపుతుండడాన్ని చూసిన ఆమె ధైర్యం చిక్కబట్టుకుని మహారాణితో నెమ్మదిగా, ఈ శిశువుకు పాలు తాగించగల మహిళ తనకు తెలుసని చెప్పింది. నీటిలో తేలి యాడే బుట్టను అనుసరించి ఎందుకు వచ్చావని వాళ్ళు నిలదీశారు. ఆ బుట్టలో ఏముందో చూడాలన్న కుతూహలంతో వచ్చానని చెప్పిందామె. ఆమె చెప్పిన సమాధానం నమ్మశక్యంగానే వారికి కనబడింది. అయితే వెంటనే వెళ్ళి ఈ -శిశువుకు పాలు పట్టగలిగిన ఆ మహిళ ఎవరో తీసుకురా… వెళ్ళు అని పంపించారు. ఇంటి వద్ద ఆమె తల్లి కూడా తీవ్రమైన దుఃఖంతో ఎదురు చూస్తోంది. పసివానికి ఏమయ్యిందో అన్న ఆందోళనతో ఎదురుచూస్తోంది. ఇంటికి తిరిగి వచ్చిన కూతురు తల్లికి తాను చూసిన విషయాలతో పాటు రాజభవనం నుంచి వచ్చిన ఆదేశాన్ని .. శుభవార్తను తల్లికి తెలిపింది. పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు, పిల్లవానికి పాలుపట్టడానికి రాజభవనానికి రమ్మని తల్లికి ఆదేశం వచ్చింది. ఆమె తక్షణం పరుగు పరుగున రాజభవనానికి చేరుకున్నది.

ఎవరి పాలూ తాగని శిశువు ఈ మహిళ పాలుపట్టగానే తాగడం చూసి ఫిరౌన్ ఆశ్చర్యంగా ఎవరు నువ్వు? అని అడిగాడు. ఈ శిశువు ఎవరి పాలూ తాగలేదు, కాని నువ్వు పాలుపట్టగానే తాగుతున్నాడు! అంటూ నిలదీశాడు. ఆమె నిజం చెప్పినట్లయితే ఫిరౌన్కు ఆ పిల్లవాడు ఇస్రాయీల్ జాతి వాడని తెలిసేది, వెంటనే హతమార్చి ఉండేవాడు. కాని అల్లాహ్ ఆమెకు సమాధానం ఇచ్చే స్థయిర్యాన్ని ప్రసాదించాడు. ఆమె ఫిరౌన్కు జవాబిస్తూ, “దేవుని దయవల్ల నా పాలు చాలా తీయగా ఉంటాయి. అందువల్ల ఏ శిశువైనా నా పాలు తాగుతాడు” అంది. ఈ జవాబు ఫిరౌన్కు సంతృప్తిని ఇచ్చింది. ఆ రోజు నుంచి ఆమెను మూసాకు పాలు పట్టే ఆయాగా రాజభవనంలో నియమించడం జరిగింది. ఆమె తన పిల్లవాడిని అక్కడ చాలా కాలం కనిపెట్టుకు ఉన్నది. పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత, పాలు తాగడం మానేసిన తర్వాత, అప్పుడప్పుడు వచ్చి పిల్ల వాడిని చూసి వెళ్ళే అనుమతి ఆమెకు లభించింది. రాజభవనంలో మూసా ఒక రాకుమారుని మాదిరిగా పెరిగారు.

అల్లాహ్ మూసా(అలైహిస్సలాం)కు మంచి ఆరోగ్యం, శారీరక బలం, వివేకం, విజ్ఞానాలు ప్రసాదించాడు. బలహీనులు, అణగారిన వారు రక్షణ కోసం, న్యాయం కోసం ఆయన వద్దకు వచ్చేవారు. ఒకరోజు, రాజధాని నగరంలో ఇద్దరు పోట్లాడు కోవడాన్ని ఆయన చూశారు. ఒక ఈజిప్టు వ్యక్తి ఒక బనీ ఇస్రాయీల్ వ్యక్తిని కొడుతున్నాడు. మూసా (అలైహిస్సలాం)ను చూసిన ఇస్రాయీల్ వ్యక్తి సహాయం కోసం వేడుకున్నాడు. మూసా (అలైహిస్సలాం) ఈ తగాదాలో జోక్యం చేసుకున్నారు. మాటా మాటా పెరిగింది. పట్టరాని ఆగ్రహంతో మూసా (అలైహిస్సలాం) ఆ ఈజిప్టు వ్యక్తిని బలంగా కొట్టారు. ఆ దెబ్బకు వాడు అక్కడికక్కడే మరణించాడు. తన వల్ల ఒక హత్య జరిగిందని, ఒక మనిషి తన వల్ల మరణించాడని గ్రహించిన మూసా (అలైహిస్సలాం) చాలా బాధపడ్డారు. ఆయన అల్లాహ్ క్షమాభిక్ష వేడుకున్నారు. చంపాలన్న ఉద్దేశ్యం తనకు లేదని, యాదృచ్ఛికంగా హత్య జరిగిందని అల్లాహ్ కు మొరపెట్టుకున్నారు. అల్లాహ్ ను ఆయన్ను క్షమించాడు. మూసా(అలైహిస్సలాం)కు మనసులో ఒక విధమైన సంతృప్తి వంటి భావం కలిగింది. ఆ పిదప మూసా (అలైహిస్సలాం) ఇతరుల పట్ల అత్యంత సహనాన్ని చూపడం ప్రారంభించారు.

మరుసటి రోజు అదే బనీ ఇస్రాయీల్ వ్యక్తి మరో వ్యక్తితో పోట్లాడుతూ కనబడ్డాడు. మూసా (అలైహిస్సలాం) అతని వద్దకు వెళ్ళి, “నువ్వు చాలా గొడవలమారిలా ఉన్నావే. ప్రతిరోజు ఎవరో ఒకరితో పోట్లాడుతుంటావా?” అన్నారు. మూసా(అలైహిస్సలాం) తనను కూడా కొడతారేమో అని బనీ ఇస్రాయీల్ వ్యక్తి భయపడ్డాడు. భయంతో గట్టిగా అరుస్తూ, ”మూసా! నిన్న వాడిని చంపినట్లు నేడు నన్ను కూడా చంపేస్తావా?” అన్నాడు. వాడితో పోట్లాడుతున్న ఈజిప్టు వ్యక్తి ఈ మాట విన్నాడు. వెంటనే మూసా (అలైహిస్సలాం) గురించి రాజ్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మూసా (అలైహిస్సలాం) దగ్గరికి ఒక వ్యక్తి పరుగున వచ్చి, “మూసా! అధికారులు నీపై ఫిర్యాదును స్వీకరించారు. నీ కోసం వెళుతున్నారు. నీపై విచారణ జరగొచ్చు, వాళ్ళు నిన్ను చంపవచ్చు, నువ్వు పారిపో” అని సలహా ఇచ్చాడు. ఒక ఈజిప్టువాడిని చంపితే మరణశిక్ష పడుతుందని, చట్టం ఆ విధంగా ఉందని మూసా (అలైహిస్సలాం)కు తెలుసు.

రాత్రి చీకటిలో మూసా (అలైహిస్సలాం) నగరాన్ని విడిచి వెళ్ళిపోయారు. ”అల్లాహ్ ! నన్ను ఈ దుర్మార్గుల నుంచి కాపాడు” అని ఆయన అల్లాహ్ ను ప్రార్థిస్తూ నగరం దాటారు. మద్యన్ దిశగా పయనించారు. సిరియా, ఈజిప్టులకు మధ్యన ఉన్న జనావాస ప్రాంతం అది. వేడి గాడ్పుల ఆ ఎడారి దారిలో ఆయన ఒంటరిగా, కేవలం అల్లాహ్ తోడుగా ప్రయాణించారు. ఆయన (అలైహిస్సలాం) వెంట ఉన్న సామగ్రి దైవభీతి మాత్రమే. దారిలో ఆకలి తీర్చుకోవడానికి గడ్డిపరక కూడా లభించలేదు. వేడి ఇసుక ఆయన కాళ్ళను కాల్చసాగింది. కాని ఫిరౌన్ సైన్యం తనను వెంటాడుతుందన్న ఆందోళన వల్ల ఆయన ప్రయాణం ఆపలేదు. ఆ విధంగా ఆయన (అలైహిస్సలాం) ఎనిమిది రాత్రులు ప్రయాణించారు. పగటి పూట ఎక్కడయినా దాక్కుని గడిపేవారు. ఆ విధంగా ప్రధాన ఎడారి భాగాన్ని దాటిన తర్వాత ఆయన (అలైహిస్సలాం) ఒక బావి వద్దకు చేరుకున్నారు. అది మద్యన్ శివార్లలో ఉన్న బావి. అక్కడ గొర్రెల కాపరులు తమ గొర్రెలకు నీళ్ళు పడుతున్నారు.

ఆయన అక్కడ కూర్చున్నారు. నీళ్ళు తాగడానికి తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అక్కడ ఇద్దరు యువతులు తమ గొర్రెలకు నీళ్ళు తాపడానికి వచ్చి, సంకోచిస్తూ నిలబడడాన్ని ఆయన గమనించారు. ఆయనలో ఆసక్తి కలిగింది. వారి వద్దకు వెళ్ళి వారి సమస్య ఏమిటో అడిగారు. వారు జవాబిస్తూ… అక్కడ ఉన్న గొర్రెల కాపరులు మొరటువాళ్ళని, తాము ఆడవాళ్ళయినందువల్ల తమ గొర్రెలకు నీళ్ళు పట్టడానికి అవకాశం దొరకడం లేదని, తమ తండ్రి చాలా ముసలీ వారని, అందువల్ల గొర్రెలకు తామే నీళ్ళు పట్టి తీసుకువెళ్ళవలసి ఉందని తెలిపారు. మూసా (అలైహిస్సలాం) వారి గొర్రెలను తీసుకుని నీళ్ళు పట్టడానికి బావి వద్దకు వచ్చారు. పొడవుగా, బలిష్టంగా ఉన్న మూసాను చూసి ఆ గొర్రెల కాపరులు దారి విడిచారు. ఆయన (అలైహిస్సలాం) గొర్రెలకు నీళ్ళు పట్టి, నీటి సంచులు నింపి, తాను కూడా కడుపారా నీళ్ళు తాగారు. ఆ పిదప బావి దగ్గర నీడలో సేదదీర్చుకుంటూ కూర్చున్నారు. దేవుని సహాయం కోసం, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించసాగారు. ఆ యువతులు అక్కడి నుంచి వెళ్ళే ముందు ఆయన వద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ యువతులు ప్రతిరోజు కన్నా కాస్త ముందుగానే ఇంటికి చేరుకున్నారు. త్వరగా ఇంటికి చేరుకున్న వారిని చూసి వారి తండ్రి ఆశ్చర్యపోయారు. వారు తండ్రికి, జరిగిన వృత్తాంతం వివరించి మూసా (అలైహిస్సలాం) వల్ల తాము త్వరగా ఇంటికి రావడం సాధ్యమైందని చెప్పారు. ఆ అపరిచితుడిని (మూసాను) ఇంటికి పిలుచుకు రావలసిందిగా తండ్రి ఇద్దరిలో ఒక అమ్మాయిని పంపించాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మూసా (అలైహిస్సలాం) వద్దకు వెళ్ళి తన తండ్రి పంపిన సందేశాన్ని వినిపించింది. “మీరు చేసిన సహాయానికి మా నాన్నగారు చాలా కృతజ్ఞతలు తెలిపారు. మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలుపడానికి ఆయన మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు” అని చెప్పింది. మూసా (అలైహిస్సలాం) ఈ ఆహ్వానాన్ని మన్నించారు. ఆ అమ్మాయి వెంట వారి ఇంటికి వెళ్ళారు. వారు సౌకర్యవంతంగా, సంతోషంగా జీవిస్తున్న కుటుంబంగా ఆయన గుర్తించారు. ఆ వృద్ధునికి తన్ను తాను పరిచయం చేసుకున్నారు. తనపై వచ్చిన ఆపద గురించి చెప్పారు. ఈజిప్టు వదలి ఎందుకు రావలసి వచ్చిందో కూడా తెలియజేశారు. వృద్ధుడు ఆయనకు ఊరట నిస్తూ, భయపడవద్దని, దుర్మార్గుల నుంచి తప్పించుకుని వచ్చేసినట్టేనని అన్నాడు.

మూసా (అలైహిస్సలాం) సచ్ఛీలాన్ని, ఆయన సద్వర్తనలను ఆ వృద్ధుడు, అతని కుమార్తెలు గమనించారు. మూసా (అలైహిస్సలాం)ను తన ఇంటనే ఉండవలసిందిగా ఆ వృద్ధుడు ఆహ్వానించాడు. మూసా (అలైహిస్సలాం) అంగీకరించారు. ఆ కుటుంబ సభ్యులు దేవునికి భయపడే సద్వర్తనులు. మూసా (అలైహిస్సలాం)ను పనిలో పెట్టుకుంటే బాగుంటుందని వృద్ధుని కుమార్తెలలో ఒక అమ్మాయి సూచించింది. మూసా (అలైహిస్సలాం) బలిష్టంగా ఉన్న యువకుడు, నమ్మకస్తుడు. కాబట్టి పనిలో పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చింది. ఆయన వంటి యువకుడి అవసరం వారికి ఉంది. ముఖ్యంగా బావి వద్ద, మొరటు జనం గుమిగూడే ప్రాంతాల్లో అలాంటి యువకుని అవసరం ఎంతయినా ఉంది. అయితే మూసా (అలైహిస్సలాం) నమ్మకస్తుడని స్వల్పకాలంలో చెప్పడం ఎలా సాధ్యమని తండ్రి ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి జవాబిస్తూ, “నేను తనను ఇంటికి రమ్మని ఆహ్వానించినపుడు, అతను నన్ను తన వెనక నడువమన్నాడు, ఆ విధంగా నేను ముందు నడువడం, నాపై తన దృష్టి పడడం జరక్కుండా (ఏ విధమైన వికారాలకు అవకాశం లేకుండా) జాగ్రత్త పడ్డాడు” అని చెప్పింది. ఈ మాటలు విని వృద్ధునికి నమ్మకం కలిగింది. వృద్ధుడు మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, ”నా యిద్దరు కుమార్తెలలో ఒకమ్మాయిని నీకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాను, కాని ఒక షరతు, నువ్వు ఎనిమిది సంవత్సరాలు నా వద్ద పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి” అన్నాడు. (ఆ కాలంలో యువకులు కష్టపడి పని చేసి పెళ్ళికి అర్హులుగా నిరూపించుకో వలసి ఉండేది). ఈ ప్రతిపాదన మూసా(అలైహిస్సలాం)కు కూడా నచ్చింది. కొత్త దేశంలో అపరిచితునిగా వచ్చిన తనకు ఆశ్రయం, ఉపాధి ఎలాగూ అవసరమే. మూసా (అలైహిస్సలాం) అ ఇద్దరు అమ్మాయిలలో ఒకమ్మాయిని వివాహం చేసుకుని వృద్ధుని పశువుల సంరక్షణ చూడసాగారు. ఆ విధంగా తన ఒప్పందంకన్నా రెండేళ్ళు ఎక్కువగా పదేళ్ళపాటు అక్కడ పనిచేశారు.

మూసా(అలైహిస్సలాం) ఎలాంటి సమస్య లేని జీవితం గడుపుతున్నప్పటికీ ప్రశాంతంగా ఉండలేకపోయారు. ఆయనకు ఎల్లప్పుడు తాను వదలివచ్చిన ప్రజల సమస్యలు, కష్టాలే గుర్తుకు వచ్చేవి. శిక్ష గురించిన భయం వెంటాడుతున్నప్పటికీ ఆయన (అలైహిస్సలాం) తన కుటుంబాన్ని తీసుకుని ఈజిప్టుకు బయలుదేరారు. తన్ను అల్లాహ్ కాపాడుతాడనే నమ్మకంతో ఆయన ప్రయాణమయ్యారు. ఆయనకు వ్యక్తిగత స్వార్థాలు ఏవీ లేవు, ఆయన (అలైహిస్సలాం) కోరేది బానిసత్వంలో మగ్గుతున్న తన ప్రజలను రక్షించడం.

వారు ఎడారిలో చాలా దూరం ప్రయాణించి సినాయ్ పర్వతం వద్దకు చేరు కున్నారు. తాము దారి తప్పినట్లు మూసా (అలైహిస్సలాం)కు అక్కడికి వచ్చిన తర్వాత అర్థ మయ్యింది. ఆయన అల్లాహ్ ను మార్గదర్శనం కోసం ప్రార్థించారు. ఆయన (అలైహిస్సలాం)కు దైవికంగా మార్గం కనిపించింది. ఆయన (అలైహిస్సలాం) ఒక రాత్రి తూర్ పర్వతం వద్దకు చేరుకున్నారు. మూసా (అలైహిస్సలాం)కు అక్కడ దూరంగా మంట కనిపించింది. ఆయన తన ఇంటివారితో, “ఇక్కడే ఉండండి, దూరంగా మంట కనిపిస్తోంది. అక్కడి నుంచి మండే కట్టె ఏదైనా తీసుకువస్తాను. ఇక్కడ చలిలో కాస్త మనకు వేడి దొరుకుతుంది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే దారి కూడా తెలుస్తుంది” అన్నారు. ఆయన ఆ మంట దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయనకు గంభీరమైన స్వరం వినిపించింది. ఆ స్వరం ఆయన్ను పిలిచింది.

”ఓ మూసా! నేను అల్లాహ్ ను, విశ్వానికి ప్రభువును.”

ఈ స్వరాన్ని విని మూసా (అలైహిస్సలాం) దిగ్భ్రాంతి చెందారు. నలుదిసెలా చూశారు. “నీ కుడి చేతిలో ఏముంది మూసా?!” అని మరలా ఆయనకు ఆ విచిత్రమైన స్వరం వినిపించింది. మూసా (అలైహిస్సలాం) వణుకుతున్న గొంతుతో, ”ఇది నా చేతికర్ర. నేను దీనికి ఆనుకుని నిలబడతాను, దీనితో గొర్రెలకు చెట్ల ఆకులు రాల్చుతాను.. ఇంకా ఇలాగే ఇంకొన్ని విధాలుగా పనికివస్తుంది” అన్నారు. (మూసా దృష్టిని మరల్చడానికి, ఆయనలో ఆందోళనను తగ్గించి జరుగబోయే మహత్యాలకు తగిన విధంగా సిద్ధం చేయడానికి ఈ ప్రశ్న అడుగడం జరిగింది. ఒక ప్రవక్తగా మూసా (అలైహిస్సలాం) ఉద్యమానికి ప్రారంభం ఇది.)

ఆ స్వరం మూసా (అలైహిస్సలాం)ను ఆదేశిస్తూ, “చేతికర్ర క్రిందికి విసిరేయ్” అంది. మూసా (అలైహిస్సలాం) ఆ విధంగా చేయగానే అది వంకర్లు తిరుగుతూ ప్రాకే పాముగా మారిపోయింది. మూసా (అలైహిస్సలాం) భయంతో పారిపోబోయారు. కాని ఆ స్వరం ఆయన్ను నిలువరించింది. ”భయపడకు… దానిని పట్టుకో.. దాన్ని ఎప్పటి మాదిరిగా మేము మార్చేస్తాము” అని వినిపించింది. ఆ పాము మళ్ళీ చేతికర్రగా మారిపోయింది. మూసా (అలైహిస్సలాం)లో ఆందోళన తగ్గుముఖం పట్టింది. సత్యాన్ని కనుగొన్న ఎరుక ఆయనలో ప్రశాంతతను కలుగజేసింది. ఆ పిదప అల్లాహ్ ఆయన్ను (అలైహిస్సలాం) ఆదేశిస్తూ చేతిని చంకలో పెట్టుకుని గట్టిగా నొక్కమని ఆదేశించాడు. అలా చేసి చేతిని బయటకు లాగగానే ఆ చేయి మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశించింది. అల్లాహ్ ఆ తర్వాత ఆయన్ను ఆదేశిస్తూ, “ఇప్పుడు నీకు దేవుని రెండు చిహ్నాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిరౌన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు వెళ్ళు. వాళ్ళు పరమ దుర్మార్గులు. అన్ని హద్దులను అతిక్రమించారు వాళ్ళు” అన్నాడు. కాని మూసా (అలైహిస్సలాం)కు ఫిరౌను తనను నిర్బంధిస్తాడన్న భయం ఉంది. ఆయన (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! నేను వారి వ్యక్తిని ఒకడిని హత్య చేశాను. వాళ్ళు నన్ను హతమార్చవచ్చని భయపడుతున్నాను” అన్నారు. ఎలాంటి ప్రమాదం జరగదని అల్లాహ్ ఆయనకు హామీ ఇచ్చాడు. ఆయన భయాన్ని దూరం చేశాడు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ అల్లాహ్ తో, ”ప్రభూ! ప్రవక్త బాధ్యతలు నిర్వర్తించడానికిగాను నా మనసును విశాలంగా చేయి.. నా మార్గంలో కష్టాలను తొలగించి నా కర్తవ్యాన్ని సునాయాసంగా మార్చు… నా నాలుక ముడులను వదులు చేయి, తద్వారా నా మాటలు వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పగలను. నా మాటలు వారి మనసులో నాటుకునేలా చెప్పగలను. నా పనిలో నాకు సహాయకునిగా ఒకరిని ప్రసాదించు.. నా జాతికి చెందిన వాడిని, నా సోదరుడు హారూన్ ను నాకు సహాయకునిగా ప్రసాదించు” అని వేడుకున్నారు. అల్లాహ్ ఆయన విజ్ఞప్తిని మన్నించాడు. అప్పటికి ఈజిప్టులో ఉన్న హారూన్ కు దైవికంగా సమాచారం అందడంతో ఆయన సినాయ్ వద్దకు వచ్చి మూసా (అలైహిస్సలాం) ను కలసుకున్నారు. అల్లాహ్ వారిద్దరినీ ఉద్దేశించి, “మూసా! నీవు, నీ సోదరుడు ముందుకు సాగండి. నా సూచనలు తీసుకుని వెళ్ళండి. ఫిరౌన్ కు, అతడి ప్రజలకు నా సందేశాన్ని నెమ్మదిగా వినిపించండి. అల్లాహ్ సందేశహరులుగా వచ్చామని, బనీ ఇస్రాయీల్ ప్రజలను బానిసత్వం నుంచి, అణచివేతల నుంచి విడుదల చేయమన్న అల్లాహ్ సందేశం తీసుకువచ్చామని చెప్పండి” అన్నాడు.

మూసా (అలైహిస్సలాం), హారూన్లు కలసి ఈజిప్టుకు వచ్చారు. వారిద్దరు ఫిరౌన్ వద్దకు వెళ్ళి అల్లాహ్ సందేశాన్ని అందజేశారు. ”నిజంగా మేము అల్లాహ్ తరఫున నీ వద్దకు వచ్చిన సందేశహరులం. ఆయన వద్ద నుంచి సూచనలను తీసుకుని నీ వద్దకు వచ్చాము. ఇస్రాయీల్ ప్రజలను క్రూరంగా వేధించడం మానేయ్. మా ప్రజలను విడిచిపెట్టు… వారిని మేము అల్లాహ్ వాగ్దానం చేసిన ప్రాంతానికి తీసుకుని పోతాము” అన్నారు. ఫిరౌన్ కోపంతో మండిపడ్డాడు. “మూసా! నిన్ను బాల్యం నుంచి మేము పెంచి పెద్దచేయలేదా? నీ జీవితంలో చాలా సంవత్సరాలు నీవు మా వద్ద గడపలేదా? నీవు నా జాతి ప్రజలలో ఒకరిని చంపావు. ఇప్పుడు నీ జాతి ప్రజలను తీసుకుపోవడానికి వచ్చావు. నీవు కృతఘ్నుడివి” అన్నాడు. మూసా (అలైహిస్సలాం) ఈ మాటలకు జవాబిస్తూ, ”నేను ఆ పని పొరబాటున చేశాను. నేను నీకు భయపడి పారిపోయాను. అల్లాహ్ నన్ను క్షమించాడు. అల్లాహ్ నన్ను కాపాడాడు. నాకు వివేకాన్ని ప్రసాదించాడు. నీ వద్దకు నన్ను సందేశహరునిగా పంపాడు. నీ భూభాగంలో నా ప్రజలను నీవు బానిసలుగా చేశావు. నిస్సందేహంగా అల్లాహ్ నిన్ను శిక్షిస్తాడు. కాబట్టి, నీవు చేసిన అపరాధాలకుగాను అల్లాహ్ తో క్షమాపణ వేడుకో, నా ప్రజలను నాతో పంపించు. వారికి అల్లాహ్ ఒక కొత్త భూభాగాన్ని ఇచ్చే వాగ్దానం చేశాడు” అన్నారు. ఫిరౌన్ మరింత కోపంగా, “మీ యిద్దరికి ప్రభువని చెబుతున్న ఈ అల్లాహ్ ఎవరు? నేను తప్ప మీకు మరో దేవుడు లేడు” అన్నాడు గర్వంగా. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, ”అల్లాహ్ మాకు, నీకు ప్రభువు. తూర్పు పడమరులకు, వాటి మధ్య ఉన్న సమస్తానికి ఆయనే ప్రభువు” అన్నారు.

మూసా (అలైహిస్సలాం)ను బెదిరిస్తూ ఫిరౌన్, “నేను తప్ప మరో దేవుడున్నాడని చెబితే నిన్ను జైల్లో పారేస్తాను” అన్నాడు. కాని మూసా (అలైహిస్సలాం) లక్ష్యపెట్టలేదు. “నీ సందేహాలను తొలగించే మహత్యాన్ని నేను నీకు చూపించిన తర్వాత కూడా నీవు ఈ విధంగా బెదిరింపులకు దిగుతావా?” అన్నారు. ఫిరౌన్ జవాబిస్తూ, ”మూసా! నువ్వు అబద్ధాలరాయుడివి. నువ్వు చెప్పేది నిజమైతే, నీ ప్రభువు నుంచి నువ్వేదయినా సూచన తీసుకుని వస్తే దాన్ని చూపించు” అన్నాడు.

ఆ కాలంలో ఈజిప్టులో చాలా మంది మంత్రగాళ్ళు ఉండేవారు. ఒక గొప్ప కళ స్థాయికి మంత్రతంత్రాలను అభివృద్ధి చేసి అనేక గమ్మత్తులు ప్రదర్శించేవారు. మూసా (అలైహిస్సలాం) తన మొదటి సూచనను ప్రదర్శించారు. ఆయన తన చేతికర్రను విసరగానే అది అల్లాహ్ ఆజ్ఞతో ఒక పాముగా మారిపోయింది. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయాడు, అయినా తన అహాన్ని వదలలేదు. మూసా (అలైహిస్సలాం) ప్రదర్శించ గలిగినది ఒకే ఒక్క మాయాజాలం అనుకున్నాడు. “నువ్వు నాకింకేం చూపించాలను కుంటున్నావ్” అన్నాడు. మూసా (అలైహిస్సలాం) తన చేతిని చంకలో ఉంచి తీయ గానే అది మిరుమిట్లుగొలుపుతూ ప్రకాశించింది. రాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన అధికారానికి ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని భయపడ్డాడు. తన సర్దారులు, సలహాదారులతో సంప్రదించాడు. ”వీళ్ళిద్దరు పెద్ద మంత్రగాళ్ళు. మన ఘనమైన సంప్రదాయాలను నాశనం చేసి, తమ మంత్ర తంత్రాలతో ఈ దేశం నుంచి వెళ్ళగొట్టగలరు. ఇప్పుడు ఏం చేయాలో సలహా ఇవ్వండి” అని అడిగాడు. వాళ్ళు ఫిరౌన్కు సలహా ఇస్తూ, మూసా (అలైహిస్సలాం)ను, ఆయన సోదరుడిని ఇద్దరినీ జైల్లో ఉంచాలని, ఈలోగా దేశంలో ఉన్న పెద్ద పెద్ద మంత్రగాళ్ళందరిని పిలుస్తామని, వాళ్ళు వచ్చి తను మంత్రాలను ప్రదర్శించి కర్రలను పాములుగా మార్చడం చేస్తారని, ఆ విధంగా ప్రజలపై మూసా (అలైహిస్సలాం) ప్రభావాన్ని తగ్గించగలమని చెప్పారు. ఫిరౌన్ వారి మాటల ప్రకారం మూసా, హారూన్లను జైల్లో వేయించాడు. దేశ వ్యాప్తంగా చాటింపులు వేయించి పెద్ద పెద్ద మంత్రగాళ్ళను పిలిపించాడు. గెలుపొందిన మంత్రగాడికి ఘనమైన కానుకలతో పాటు రాజదర్బారులో స్థానం కూడా ఇస్తామని చెప్పాడు.

ఈజిప్టు సామ్రాజ్యంలోని ప్రజలందరూ పాల్గొనే ఒక పండుగ సందర్భంగా ఫిరౌన్ తన మంత్రగాళ్ళకు, మూసా (అలైహిస్సలాం)కు మధ్య పోటీ ఏర్పాటు చేశాడు. ప్రజలు ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఫిరౌన్ తరఫున దేశంలోని పెద్ద పెద్ద మంత్రగాళ్ళ గుంపుకు, దైవప్రవక్తగా చెప్పుకుంటున్న ఒకే ఒక్క వ్యక్తికి మధ్య జరుగుతున్న పోటీ గురించి ప్రజల్లో అప్పటికే ప్రచారం జరిగింది. ఒకప్పుడు నైలు నదిలో కొట్టుకువచ్చిన శిశువు ఫిరౌన్ ప్రాసాదంలో ప్రవేశించి, రాజకుమారుని మాదిరిగా పెరగడం గురించి కూడా వాళ్ళు విని ఉన్నారు. కాని ఆ రాజకుమారుడు ఒక ఈజిప్టు వ్యక్తిని ఒకే ముష్ఠిఘాతానికి హతమార్చి దేశం వదలి పారిపోయాడని కూడా వాళ్ళు విని ఉన్నారు. ఈ పోటీ చూడడానికి అందరూ చాలా ఆత్రంగా వచ్చారు. పోటీ మొదలు కాకముందు మూసా (అలైహిస్సలాం)లేచి నిలబడ్డారు. గుమిగూడిన ప్రజల్లో గుసగుసలు మొదల య్యాయి. మూసా (అలైహిస్సలాం) అక్కడికి వచ్చిన మంత్రగాళ్ళను ఉద్దేశించి, “అల్లాహ్ సూచనలను మాయాజాలంగా వర్ణించి అల్లాహ్ గురించి మీరు అసత్యాలు పలికితే, అల్లాహ్ ను విశ్వసించకపోతే మీకు వినాశం తప్పదు. సత్యానికి – అసత్యానికి మధ్య గల భేదాన్ని తెలుసుకోండి. లేకపోతే మీరు నాశనమవుతారు. అల్లాహ్ మిమ్మల్ని శిక్షిస్తాడు” అని బోధించారు.

మూసా (అలైహిస్సలాం) నిజాయితీగా మాట్లాడిన మాటలు మంత్రగాళ్ళలో పునరాలోచనను రేకెత్తించాయి. కాని ఫిరౌన్ ఇస్తానన్న సంపద, పేరు ప్రతిష్ఠల ప్రలోభం వారిని ముంచెత్తింది. తమ మాయాజాలంతో ప్రజలను ఆకట్టుకోవాలను కున్నారు. ఆ విధంగా మూసా (అలైహిస్సలాం)ను ఒక మోసగానిగా నిరూపించాలను కున్నారు.

మూసా (అలైహిస్సలాం) వారిని ఉద్దేశించి, “మీరే ముందు ప్రారంభించండ”న్నారు. వారు తమ మంత్రదండాలను నేలపై విసిరారు. మరుక్షణం ఆ కర్రలు, తాళ్ళు పాములుగా మారి బుసలు కొట్టడం ప్రారంభించాయి. ప్రజలు నిర్ఘాంతపోయి చూడసాగారు. ఫిరౌన్, అతడి అనుచరులు సంతోషంగా చప్పట్లు కొట్టారు. మూసా (అలైహిస్సలాం) భయపడ్డారు. కాని ఆ తర్వాత భయపడకుండా కర్రను విసరమని అల్లాహ్ ఆయనకు ధైర్యాన్నిచ్చాడు. మూసా (అలైహిస్సలాం) తన చేతికర్రను విసిరారు. అది ఒక పెద్ద కొండచిలువగా మారింది. ప్రజలు భయంతో లేచి నిలబడ్డారు. ఏం జరుగుతుందో అని మెడలు నిక్కించి చూడసాగారు. ఫిరౌన్, అతడి అనుచరులు నిశ్శబ్దంగా చూడసాగారు. ఆ పాములన్నింటిని కొండచిలువ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నింటిని మింగేసింది. మూసా (అలైహిస్సలాం) క్రిందకి వంగి దాన్ని పట్టుకున్నారు. ఆ వెంటనే అది చేతికర్రగా మారి పోయింది. ప్రజలు ఒక మహా కెరటంగా లేచి కేరింతలు కొట్టారు. ఇలాంటి వింతను వారు గతంలో ఎన్నడూ చూడలేదు. మూసా (అలైహిస్సలాం) ప్రదర్శించిన ఈ మహత్యాన్ని చూడగానే మంత్రగాళ్ళు తక్షణం అల్లాహ్ సన్నిధిలో సాష్టాంగపడ్డారు. ”మేము మూసా, హారూన్ల దేవుడిని విశ్వసిస్తున్నాము” అన్నారు. ఈ పరిణామం చూసి ఫిరౌన్ ఉగ్రుడై పోయాడు. మూసా (అలైహిస్సలాం)ను దెబ్బతీయడానికి మరో కుట్ర ఆలోచించాడు. మంత్రగాళ్ళకు, మూసా (అలైహిస్సలాం)కు మధ్య మరో పోటి రహస్య స్థలంలో జరుపుతామని ప్రకటించాడు. తన పథకానికి ఒప్పుకోవాలని మంత్రగాళ్ళపై ఒత్తిడి తెచ్చాడు. కాని సత్యాన్ని గుర్తించిన మంత్రగాళ్ళు అంగీకరించలేదు. వారిని హత మార్చుతానని ఫిరౌన్ బెదిరించినా వాళ్ళు మాత్రం అల్లాహ్ పట్ల తిరస్కారానికి పాల్పడేది లేదని నిక్కచ్చిగా చెప్పారు.

ఫిరౌన్ తన క్రూరత్వాన్ని నిర్లజ్జగా ప్రదర్శించాడు. మంత్రగాళ్ళ కాళ్ళు చేతులు నరికిస్తానని బెదిరించాడు. ఖర్జూర చెట్లకు శిలువ వేయిస్తానని అన్నాడు. ఫిరౌన్ దుర్మార్గాలకు అతడి అనుచరులు వంతపాడసాగారు. తమ అధికారాన్ని, తమ దేవుళ్ళను సవాలు చేసి దేశంలో ఎలాంటి అలజడి లేపకుండా మూసా (అలైహిస్సలాం)ను, ఆయన అనుచరుల్ని అడ్డుకోవాలని ఫిరౌఔన్ మీద ఒత్తిడి తెచ్చారు. ఫిరౌన్ ఆగ్రహంతో, “మనం అధికారంలో ఉన్నాం.. మనం వారి మగసంతానాన్ని హతమార్చుదాం.. ఆడవారిని విడిచిపెడదాం” అన్నాడు. తన ఆగ్రహాన్ని బనీ ఇస్రాయీల్ ప్రజలపై ప్రదర్శిస్తూ వారిని ఊచకోతలకు గురి చేసి బీభత్సాన్ని సృష్టించాడు.

ఫిరౌన్ దౌర్జన్యాలు భరించలేని ఇస్రాయీల్ ప్రజలు మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, ”మూసా (అలైహిస్సలాం)! నీవు రాక ముందు కూడా మేము దౌర్జన్యాలను భరించాం. కాని ఇప్పుడు మాపై దౌర్జన్యాలు అనేక రెట్లు పెరిగిపోయాయి” అన్నారు. మూసా (అలైహిస్సలాం) వారిని ఓదార్చుతూ, “అల్లాహ్ సహాయం కోసం ప్రార్థించండి.. సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్ కు చెందినది. ఆయన తాను కోరిన వారికి ఇక్కడ వారసత్వాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ పట్ల తమ విధులను నిర్వర్తించిన వారికి మంచి జరుగుతుంది” అన్నారు. ఈలోగా ఫిరౌన్ కుట్రలు చేస్తూ మూసా (అలైహిస్సలాం)ను హతమార్చడానికి పథకం వేశాడు. ఈ విషయం మూసా (అలైహిస్సలాం)కు తెలిసింది. ఆయన వెంటనే ఫిరౌన్ కు ఒక సందేశం పంపించారు. “తీర్పుదినాన్ని విశ్వసించని ప్రతి దుర్మార్గుని నుంచి నేను నా ప్రభువు శరణు కోరుకుంటున్నాను” అని ఆ సందేశంలో తెలిపారు.

ఫిరౌన్, అతని అనుచరులు, సలహాదారులు కలసివున్న ఒక సమావేశంలో రాజకుటుంబానికి చెందిన ఒక వ్యక్తి లేచి, ” ‘నా ప్రభువు అల్లాహ్” అని ప్రకటించి నందుకు ఆ వ్యక్తిని చంపుతారా? అతను తాను చెబుతున్నది సత్యమని నిరూపించే స్పష్టమైన రుజువులు కూడా తీసుకువచ్చాడు. ఆయన చెబుతున్నది నిజమే అయితే ఆయన హెచ్చరిస్తున్న శిక్ష మనపై వచ్చిపడుతుంది. పాతకాలానికి చెందిన ఆద్, సమూద్ జాతుల మాదిరి గతి మనకు కూడా పట్టవచ్చని నేను భయపడు తున్నాను” అన్నాడు. ఈ సలహాను స్వీకరించే బదులు అక్కడి వారందరూ అతడిని అవమానించారు. ఆ వ్యక్తి వారికి జవాబిస్తూ “ప్రజలారా! నేను సాఫల్యం వైపునకు పిలుస్తున్నాను. కాని మీరు అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. నా ప్రభువును నేను విశ్వసించడం మీకు ఇష్టంలేదు. మీరు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించమని కోరుతున్నారు. నేను మిమ్మల్ని సర్వశక్తిమంతుడైన, అపార కృపాశీలుడైన అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. ఆయన వైపునకే మనం మరలిపోవలసి ఉంది. ఆయనే తన దాసులను కాపాడేవాడు” అని చెప్పాడు. ఈ మాటలు విని ఫిరౌన్, అతడి అనుచరులు మండిపడ్డారు. ఆ వ్యక్తిని తీవ్రంగా బెదిరించారు. కాని ఆ వ్యక్తి తన అభిప్రాయాలు మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు అతడిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. కాని ఆ వ్యక్తి నిక్కచ్చిగా, “మీరు మీ వినాశాన్ని కొని తెచ్చుకుంటున్నారు” అన్నాడు. ఫిరౌన్ ఉగ్రుడై ఆ వ్యక్తిని చంపేస్తానని బెదిరించాడు. అల్లాహ్ ఆ విశ్వాసిని రక్షించాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేయాలని మూసా (అలైహిస్సలాం) పట్టుబట్టారు. ఫిరౌన్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బనీ ఇస్రాయీల్తో సహా ప్రజలందరినీ అక్కడకు పిలిచాడు. ప్రజలందరికీ తానే ప్రభువుననీ, వారి అవసరాలన్నీ తీర్చేది తానేనని, మూసా (అలైహిస్సలాం) వద్ద ఎలాంటి బంగారు ఆభరణాలు లేవని, ఆయన వెనుక ఎలాంటి దైవదూతలు లేరని, ఆయన ఒక నిరుపేద మాత్రమేనని ప్రకటించాడు.

చాలా కాలంగా అణచివేతలకు గురయి ఉన్న ఆ ప్రజలు తమ స్వంత ఆలోచనలను కూడా కోల్పోయిన దశలో ఉన్నారు. తాము కళ్ళతో చూసిన విషయాలను ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారు. తమ రాజుగారు చాలా సంపన్నుడు, తమకు అవసరమైన వాటన్నింటినీ ఇచ్చే స్థితిలో ఉన్నాడు. కనుక అజ్ఞానంతో వాళ్ళు ఫిరౌన్ కు విధేయత చూపి మూసా(అలైహిస్సలాం)ను నిర్లక్ష్యం చేశారు.

బనీ ఇస్రాయీల్ పై దౌర్జన్యాలకు పాల్పడినందుకు, అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి పాల్పడినందుకు ఈ ప్రపంచంలోనే శిక్ష అనుభవించవలసి ఉంటుందని ఫిరౌన్ ను హెచ్చరించవలసిందిగా అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)ను ఆదేశించాడు. అల్లాహ్ విధించే శిక్షకు ముందస్తు సూచనగా నైలు నది ఒడ్డున ఉన్న భూములను తడిపే కాలువలు రాలేదు. ప్రతి ఏటా భూములను తడుపుతూ ఉండే కాలువలు రానందున ఆ సంవత్సరం పంటలు ఎండిపోయాయి. దేశంలో కరవు నెలకొంది. అయినా ఫిరౌన్ తన అహంకారాన్ని వదలలేదు. ఆ పిదప అల్లాహ్ భయానకమైన వరదలు వచ్చేలా చేశాడు. ఆ వరదలు తీవ్రమైన వినాశాన్ని సృష్టించాయి. ఆ పిదప అల్లాహ్ గొప్ప మిడతల దండును పంపాడు. మిగిలిన కొద్దోగొప్పో పంటలను కూడా మిడతలు తినేసాయి. ఆ పిదప గుంపులు గుంపులుగా కప్పలు వారిపైకి వచ్చి పడ్డాయి. చివరిగా వారిపైకి వ్యాధులు వచ్చిపడ్డాయి. ఫలితంగా వారి శరీరాలు రక్తం ఓడసాగాయి. ఈ పరిణామం వారిని భయభీతులకు గురిచేసింది. బెంబేలెత్తి వారు మూసా (అలైహిస్సలాం) వద్దకు పరుగెత్తుకు వచ్చారు. “నీ ప్రభువుకు నీతో ఒప్పందం ఉంది కాబట్టి మా కోసం నువ్వు ఆయన్ను ప్రార్థించు. ఈ బాధలను తొలిగేలా చేస్తే మేము బనీ ఇస్రాయీల్ ప్రజలను విడుదల చేస్తాము. వారు నీ వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటాము” అన్నారు. మూసా (అలైహిస్సలాం) వారి కోసం అల్లాహ్ ను ప్రార్థించారు. అల్లాహ్ వారి బాధలను తొలగించాడు. వారి పంటలు మళ్ళీ చక్కగా పండసాగాయి. నైలు నది ఎప్పటి మాదిరిగా నిండుగా ప్రవహించసాగింది. కాని పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తమ మాటను నిలబెట్టుకోలేదు.

మూసా (అలైహిస్సలాం) సందేశంలోని సత్యాన్ని చివరకు బనీ ఇస్రాయీల్ ప్రజలు గుర్తించారు. ఫిరౌన్ బెదిరింపులను లక్ష్యపెట్టక తమ నాయకుని (మూసా) వద్దకు వచ్చి ఆయన నుంచి మార్గదర్శకత్వాన్ని కోరారు. ఈజిప్టు వదలివెళ్లడానికి వారిని మూసా (అలైహిస్సలాం) సిద్ధం చేశారు. ఈ పరిణామమే వలసగా అభివర్ణించబడింది. అల్లాహ్ ఆజ్ఞానుసారం రాత్రి చీకటిలో మూసా (అలైహిస్సలాం) తన ప్రజలను తీసుకుని సముద్రం దిశగా బయలు దేరారు. పొద్దుటికల్లా వారు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికి ఫిరౌన్ కు వారి ప్రయాణం గురించి తెలిసిపోయింది. అతడు వారిని వెంటాడుతూ సైన్యంతోసహా వచ్చాడు.

ఇస్రాయీల్ ప్రజలు అసహనానికి గురయ్యారు. ఒకతను తీవ్ర అసహనంతో, ”మన ముందు మనం దాటలేని ఈ సముద్రం, మన వెనుక శత్రు సైన్యం.. నిజంగా మనకు ఇక చావు తప్పదు” అన్నాడు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, అల్లాహ్ మనతో ఉన్నాడు, ఆయన మార్గదర్శనం కోసం ఎదురు చూద్దామన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కొద్దిగా ఊరట పొందారు. కాని మనిషి ఫలితాల కోసం తొందరపడతాడు. వాళ్ళు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చేశారు. అప్పుడే అల్లాహ్ నుంచి మూసా (అలైహిస్సలాం) కు మార్గదర్శనం లభించింది. “నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు” అన్న ఆదేశం విన్న మూసా (అలైహిస్సలాం) అలాగే చేశారు. మహావేగంతో గాలి వీయడం ప్రారంభమయ్యింది. ఎండ తీక్షణంగా కాయసాగింది. ఒక్క క్షణంలో సముద్రం రెండుగా చీలిపోయింది. కెరటాలు రెండువైపులా రెండు కొండల్లా నిలిచాయి. గాలి, ఎండల వల్ల బురద ఎండి పోయింది. మూసా (అలైహిస్సలాం) తన ప్రజలను తీసుకుని ఆ మార్గాన నడిచారు. “నా ప్రభువు నాతో ఉన్నాడు” అని మూసా (అలైహిస్సలాం) చెప్పిన మాటలను ఈ పరిణామం నిరూపించింది.

వారు వెనుకకు తిరిగి చూస్తే ఫిరౌన్, అతని సైన్యాలు వస్తూ కనబడ్డాయి. వాళ్ళు కూడా చీలిన సముద్రం నుంచే రావడం కనబడింది. భయాందోళనలతో వాళ్ళు ఆ దారిని మూసేలా అల్లాహ్ ను ప్రార్ధించమని అడిగారు. అయితే సముద్రాన్ని మళ్ళీ చేతికర్రతో కొట్టరాదని అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)ను ఆదేశించాడు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశం అప్పటికే అమలవుతోంది. ఫిరౌన్, అతడి సైన్యాలు సముద్రం చీలిపోయే మహత్యాన్ని చూశారు. కాని ఫిరౌన్ తన సైన్యాలను ఉద్దేశించి తన కాపట్యాన్ని ప్రదర్శిస్తూ, ”చూశారా! నా ఆజ్ఞతో సముద్రం చీలిపోయింది. నేను ఆ తిరుగుబాటు దారులను వెంటాడి పట్టుకోవడానికే సముద్రం నాకోసం దారి వదిలింది” అన్నాడు. వాళ్ళు సముద్రం చీలిన ఆ మార్గాన ముందుకు రావడం ప్రారంభించారు. కాని వాళ్ళు సముద్రం మధ్యకు చేరుకున్న తర్వాత యథా రూపంలో రావలసిందిగా అల్లాహ్ సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. భయాందోళనలకు గురయిన ఫిరౌన్ తన అంతం సమీపించిందని గ్రహించాడు. భీతావహుడై, “ఇస్రాయీల్ సంతతి ప్రజలు విశ్వసిస్తున్న దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడెవ్వడూ లేడని నేను విశ్వసిస్తున్నాను. ఆ దేవునికి విధేయత చూపిన వాడిగా మారుతున్నాను” అని ప్రకటించాడు. కాని అల్లాహ్ అతడి విశ్వాస ప్రకటనను స్వీకరించలేదు. ఫిరౌన్, అతడి సైన్యాలను సముద్రజలాలు ముంచేసాయి.*

* ఇక్కడ ఫిరౌన్ పిలువబడిన వాడు ఫారో రామసేస్ 2 గా ఈజిష్టాలజిస్టులు భావిస్తున్నారు. ఫిరౌన్ కు అతడి కుమారుడు మిన్ పాత్ సహాయసహకారాలు అందించాడు. క్రీ.పూ. 13/14 శతాబ్దాలలో ఫిరౌన్ ఇస్రాయీల్ సంతతి ప్రజలను అణచివేసి నిరంకుశ పరిపాలన కొనసాగించాడు. అంటే దాదాపు 3000 సంవత్సరాలకు పూర్వం. ఈ కాలం చాలా వరకు ఖచ్చితమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే 1886లో లభించిన మినపాత్ శిలాఫలకాలలో ”ఇస్రాయీలీలు పూర్తిగా నాశనం చేయబడ్డారు. వారి పునరుత్పత్తికి ఎలాంటి విత్తనాలు మిగల్లేదు” అని వుంది. అంటే ఇస్రాయీలీ ప్రజలు మూసా (అలైహిస్సలాం) తో పాటు వలస పోకముందు, సముద్రం చీలిపోయిన సంఘటనకు ముందుకాలం వరకు వారిపై కొనసాగిన జాతినిర్మూలన ఊచకోతలను ఈ శిలాఫలకాలు సూచిస్తున్నాయి. సముద్రం చీలిపోయిన సంఘటనలో ఫిరౌన్, అతడి సైన్యాలు పూర్తిగా మునిగి పోయాయి. అయితే దివ్యఖుర్ఆన్ ప్రస్తావనలు పురాతత్వవేత్తలను ఆశ్చర్య చకితులయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల పురాతత్వ వేత్తలు కనుగొన్న విషయాలు అప్పట్లో జరిగిన చారిత్రక సంఘటనలకు అద్దం పడుతున్నాయి. ఇంతవరకు పురాతన రాతల్లో ఎక్కడా లభించని చారిత్రక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రం చీలిపోయిన సంఘటన తర్వాత 2000 సంవత్సరాలకు దివ్యఖుర్ఆన్ ఈ సంఘటనను ప్రస్తావిస్తూ, ‘ఈ రోజు మేము నీ మృతదేహాన్ని భద్రంగా ఉంచుతున్నాము.. అది వారికి (ఈజిప్టువాసులకు) వారి తర్వాతి వారికి ఒక సూచన కావాలి” అని ప్రకటించింది. ఆశ్చర్యమేమంటే, ఫారో రామ్స్-2 శవం ఒక రాజశ్మశానంలో లభించింది. దానిని ప్రదర్శనగా మ్యూజియంలో ఉంచారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆ శవం మమ్మీగా మార్చక ముందు నీటి నుంచి ఒడ్డుకు వచ్చిపడిన శవం (సముద్రం బయటకు విసరివేసిన శవం). అది ఎలాంటి శవమైనప్పటికీ, ఫిరౌన్ శవాన్ని రానున్న తరాలకు ఒక సూచనగా భద్రపరచడం జరుగుతుందన్న దివ్యఖుర్ఆన్ వాక్యం నిజమని నిరూపించబడింది.

మూసా (అలైహిస్సలాం)తో పాటు బనీ ఇస్రాయీల్ ప్రజలు సినాయ్ ఎడారిలో స్థిరపడ్డారు. తన ప్రజలు ఎక్కడ స్థిరపడాలన్న విషయమై మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ మార్గదర్శనాన్ని కోరారు. అల్లాహ్ ఆయనకు ఆదేశమిస్తూ ముప్ఫయి రోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధులు కావాలని చెప్పారు. ఆ పిదప సినాయ్ కొండ వద్దకు వెళ్ళాలి, అక్కడ ఆయనకు అవసరమైన చట్టాలను ప్రసాదించడం జరుగుతుందని తెలిపాడు.

మూసా (అలైహిస్సలాం) తన ప్రజలలో డెబ్బయి మందిని ఎన్నుకున్నారు. అల్లాహ్ చెప్పిన ప్రాంతానికి, అల్లాహ్ ఇచ్చే చట్టాలను స్వీకరించడానికి తనతో పాటు రమ్మని వారిని కోరారు. వారికి నాయకునిగా తన సోదరుడు హారూన్ ను నియమిం చారు. మూసా (అలైహిస్సలాం) వారి కోసం కొంత కాలం ఎదురుచూశారు. కాని వారెంతకీ రాలేదు. మూసా (అలైహిస్సలాం) ఇక ఓపిక పట్టలేక తానే ఒంటరిగా తూర్ శిఖరానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోవడానికి ఆయన ముప్ఫయి రోజులు ప్రయాణించారు. అక్కడికి వెళ్లిన తర్వాత అల్లాహ్ ఆయన్ను ప్రశ్నిస్తూ, నీ ప్రజలు వచ్చేవరకు ఎందుకు వేచి ఉండలేదని అడిగాడు. మూసా జవాబిస్తూ, “వారు వెనుక వస్తున్నారు. నేను మీ ప్రసన్నత పొందడానికి త్వరత్వరగా వచ్చాను ప్రభూ” అన్నారు. మరో పదిరోజులు ఉపవాసాలు పాటించి పరిశుద్ధత పొందాలని ఆయన్ను ఆదేశించడం జరిగింది.

మళ్ళీ మూసా సినాయ్ కొండవద్దకు వచ్చారు. విశ్వప్రభువైన అల్లాహ్ తో సంభాషించారు. ఈ సంభాషణల వల్ల ఆయనకు అల్లాహ్ తో సాన్నిహిత్యం పెరిగింది. ఆయన హృదయం ఆధ్యాత్మిక భావనలతో నిండిపోయింది. తన భావావేశాలను వ్యక్తపరుస్తూ ఆయన, “ఓ ప్రభూ! నీ దర్శనభాగ్యం ప్రసాదించు, నేను కళ్ళారా నిన్ను చూడాలనుకుంటున్నాను” అని ప్రాధేయపడ్డారు. కాని విశ్వప్రభువు జవాబిస్తూ, ”నీవు నన్ను చూడలేవు. ఆ కొండపై నీ దృష్టి నిలుపు, అది తన పునాదిపై నిలబడి ఉన్నట్లయితే నీవు నన్ను చూడగలవు” అన్నాడు. మూసా వెంటనే ఆ కొండపై దృష్టి సారించారు. ఫెళఫెళరావాలతో ఆ కొండ కుప్ప కూలింది. ఆ ప్రభావానికి మూసా నేలపై విసిరివేయబడ్డారు. ఆయన నిర్ఘాంత పోయారు. కాని అల్లాహ్ ప్రసన్నత పొందినవారికి ఆయన కారుణ్యం ఎల్లప్పుడూ లభిస్తుంది. మూసా స్పృహలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యంగా, “ప్రభూ! సర్వ స్తోత్రాలు నీకే. నేను పశ్చాత్తాపంతో నీ వైపునకే మరలుతున్నాను. నిజమైన విశ్వాసుల్లో అగ్రభాగాన ఉండాలని భావిస్తున్నాను” అన్నారు. ఆయన ముందు అల్లాహ్ చట్టాలు లిఖించబడి ఉన్న శిలాఫలకాలు ఉన్నాయి. బనీ ఇస్రాయీల్ ప్రజలను పాలించడానికి అవసరమైన చట్టాలవి. అల్లాహ్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ మూసా, “ప్రభూ! నీవు నాకు గొప్ప గౌరవాన్ని ప్రసాదించావు. ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి గౌరవాన్ని పొందలేదు” అన్నారు. అల్లాహ్ జవాబిస్తూ, ”మూసా! ఇతరుల కన్నా నీకు ప్రాముఖ్యం ఇచ్చినా సందేశాన్ని అందజేయడానికి, నా ఆదేశాలు అందుకోవడానికి నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి నేను ప్రసాదించిన వాటిని (చట్టాలను దృఢంగా పట్టుకో, కృతజ్ఞత చూపేవారిలో ఒకనిగా ఉండు” అన్నాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజలను వదలి మూసా (అలైహిస్సలాం) సినాయ్ కొండ వద్దకు వెళ్ళి నలభై రోజులు గడిచిపోయాయి. ప్రజలు అసహనానికి, అలజడికి గురయ్యారు. అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)కు మరో పది రోజులు అధిక కాలం అక్కడ ఉంచాడన్న విషయం వారికి తెలుసు. వారిలో ఒక వ్యక్తి సామిరి. దుర్మార్గపు ఆలోచనలు కలిగిన సామిరి తమ జాతికి మరో మార్గదర్శిని వెదుక్కోవాలని ప్రచారం చేశాడు. అన్నమాట ప్రకారం మూసా (అలైహిస్సలాం) రాలేదు కాబట్టి, నిజమైన మార్గదర్శనం పొందడానికి తమకు ఒక దేవుని అవసరం ఉంది కాబట్టి, జాతి వారికి ఒక కొత్త దేవుడిని తాను వెదకి పెడతానన్నాడు. అందుకోసం ప్రజల వద్ద నుంచి బంగారు ఆభరణాలన్నింటినీ సేకరించాడు. ఒక గొయ్యి తవ్వి ఆ బంగారు ఆభరణాలను అందులో వేశాడు. పెద్ద మంట పెట్టి వాటిని కరగ బెట్టాడు. దాన్ని పోతపోస్తూ, మంత్రగాళ్ళు అమాయకులను మభ్యపుచ్చడానికి చేసే చేష్టలన్నీ చేశాడు. అలా కరిగిన ఆ బంగారాన్ని ఒక ఆవుదూడ బొమ్మగా తయారు చేశాడు. ఆ ఆవుదూడ విగ్రహం లోపల బోలుగా ఖాళీస్థలం ఉంది. అందులోంచి గాలి వీస్తే ఒక విధమైన శబ్దం వచ్చేది. వారి గతకాలం అంతా మూఢనమ్మకాలతోనే గడిచిపోయింది కాబట్టి వారు ఆ విచిత్రమైన శబ్దం మానవాతీత శక్తి అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విగ్రహాన్ని ఒక సజీవమైన దైవంగా భావించారు.

వారికి నాయకునిగా మూసా (అలైహిస్సలాం) తన సోదరుడు హారూన్ ను నియమించి వెళ్ళారు. హారూన్ ఈ పరిణామం చూసి చాలా దుఃఖానికి గురయ్యారు. వారికి నచ్చ చెబుతూ, “ప్రజలారా! మీరు మోసానికి గురవుతున్నారు. మీ ప్రభువు అపార కృపాశీలుడు, నా మాటలు వినండి, నేను చెప్పినట్లు చేయండి” అని ఎంతగా చెప్పినా వాళ్ళు వినలేదు. ఆయనకు జవాబిస్తూ, “మూసా (అలైహిస్సలాం) వస్తే గాని ఈ దైవానికి పూజలు చేయడం ఆపేదిలేదు” అన్నారు. అయితే ఒకే దేవుని విశ్వాసంలో స్థిరంగా ఉన్నవాళ్ళు ఈ అజ్ఞానులకు వేరయ్యారు. భేదాభిప్రాయాలున్నప్పటికీ శాంతి భద్రతలు కొనసాగాయి. అల్లాహ్ తో సంభాషణల సందర్భంగా మూసా (అలైహిస్సలాం)కు ఈ విషయం తెలిసింది. ”నీవు లేనప్పుడు మేము నీ ప్రజలను పరీక్షించాము. సామిరి వాళ్ళను తప్పుదోవ పట్టించాడని” అల్లాహ్ తెలిపాడు.

తిరిగివచ్చిన మూసా (అలైహిస్సలాం) తన ప్రజలు ఆవుదూడ విగ్రహం ముందు పాటలు పాడుతూ నృత్యాలు చేయడం చూశారు. ఈ అజ్ఞానపు ఆచారాన్ని చూసిన ఆయన, కోపం పట్టలేక వారి కోసం తాను తీసుకువచ్చిన చట్టాలున్న శిలాఫలకాలను క్రిందపడేశారు. తన సోదరుడు హారూన్ గెడ్డాన్ని పట్టుకుని గుంజుతూ, “వాళ్ళు తప్పుదారి పట్టకుండా ఎందుకు ఆపలేదు. ఈ దురాచారాన్ని ఎందుకు నిలువరించలేదు” అని నిలదీశారు. హారూన్ జవాబిస్తూ, ”నా తల్లి పుత్రుడా! నా గెడ్డం వదులు. ఈ ప్రజలు నన్ను బలహీనుడిగా చేశారు. వాళ్ళు దాదాపు నన్ను చంపినంత పని చేశారు. నా శత్రువులు ఆనందించేలా వ్యవహరించకు. నన్ను దుర్మార్గుల్లో చేర్చకు. ఇస్రాయీల్ సంతతి ప్రజల్లో వర్గాలు సృష్టించానని నువ్వు నిందిస్తావని కూడా నేను భయపడ్డాను” అన్నారు.

మూసా (అలైహిస్సలాం) ఆగ్రహం నెమ్మదిగా చల్లారింది. హారూన్ నిస్సహాయ స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. పరిస్థితిని సంయమనంతో చక్కదిద్దాలనుకున్నారు. అవిశ్వాసుల నాయకుడు సామిరీని పిలిచారు. “సామిరీ! నువ్వేమంటావు?” అనడిగారు. సామిరీ నిర్లక్ష్యంగా జవాబిస్తూ, ”వాళ్ళు అర్థం చేసుకోలేనిది నేను అర్థం చేసుకున్నాను. అందువల్ల, నా మనసుకు తట్టిన విధంగా చేశాను. మీ పాదచిహ్నాల వద్ద నుంచి కాస్త మట్టి తీసి ఆవుదూడ పోతపోస్తున్నప్పుడు విసిరాను” అన్నాడు. మూసా (అలైహిస్సలాం) అతడిని అక్కడి నుంచి పంపేశారు. ఆ పిదప ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “మీ ప్రభువు మీకు వాగ్దానం చేయలేదా? నిర్ధారిత సమయం చాలా ఎక్కువైపోయిందా? లేక నా పట్ల విశ్వాసాన్ని మానుకుని ప్రభువు ఆగ్రహాన్ని కొనితెచ్చుకోవాలని భావిస్తున్నారా?” అని నిలదీశారు. వారు తలలు వంచుకుని జవాబిస్తూ, ”మీ పట్ల విశ్వాసాన్ని గాని, మా సంకల్పాన్ని గాని మేము వదులుకోలేదు. కాని ఆ బంగారు ఆభరణాల భారం చాలా ఎక్కువైంది. అందుకే సామిరీ చెప్పినట్లు వాటిని మంటలో పారేశాము. వాడు ఈ బంగారు ఆవుదూడను తయారు చేసి మమ్మల్ని తప్పుదారి పట్టించాడు” అన్నారు.

ఇస్రాయీల్ ప్రజలు పశ్చాత్తాపపడుతూ, “మా ప్రభువు మాపై కరుణ చూపకపోతే, మమ్మల్ని క్షమించకపోతే మేము నిస్సందేహంగా వైఫల్యం చెందుతాము” అన్నారు. వారు మూసా (అలైహిస్సలాం)ను ప్రాధేయపడుతూ తగిన మార్గాన్ని చూపమని కోరారు. మూసా (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, ”పశ్చాత్తాపపడండి. పశ్చాత్తాపానికి, క్షమాభిక్షకు మార్గం చూపమని ప్రభువును వేడుకోండి. మీ ప్రాపంచిక కోరికలను అణచివేయండి. ప్రక్షాళన పొందండి. మీరు పరిశుద్ధులయ్యే వరకు మీలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలను నిర్మూలించండి. మీరు ఆత్మవికాసం పొందగలరు” అన్నారు. వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు. అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. ఆయన అపార కృపాశీలుడు, అమితంగా కరుణించేవాడు.

కాని సామిరీ ఎలాంటి పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తాను చేసిన పనికి బాధపడనూ లేదు. సామిరితో ఎవరూ ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదని మూసా ఆదేశించారు. ఆ విధంగా సామిరి బహిష్కరించబడ్డాడు. మూసా (అలైహిస్సలాం) ఆ బంగారు ఆవుదూడ విగ్రహాన్ని కరిగించి కరిగిన లోహాన్ని సముద్రంలో పారవేయించారు. ఆ విధంగా బంగారు ఆవుదూడ కథను ముగించారు.

బనీఇస్రాయీల్ ప్రజలను అల్లాహ్ అనేక విధాలుగా అనుగ్రహించాడు. వారికి అనేక వరాలు ప్రసాదించాడు. వారిని దౌర్జన్యాల నుంచి, అణచివేతల నుంచి రక్షించాడు. క్రూరమైన పాలకుడు ఫిరౌన్ నీటమునిగి చావడాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. ఎడారి భూమిలో వారికి త్రాగడానికి నీరు దొరకని పరిస్థితిలో అల్లాహ్ వారికి సహాయపడ్డాడు. చేతికర్రతో ఒక రాతిని కొట్టమని అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)కు ఆదేశించాడు. ఆ రాయి చీలి అందులో నుంచి పన్నెండు నీటి ఊటలు ఉబికాయి. పన్నెండు విభిన్నమైన తెగలకు ఆ పన్నెండు నీటి ఊటలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా అల్లాహ్ నీటి కరవు విషయంలో వారి మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూశాడు. మలమలమాడ్చే ఎండ నుంచి వారిని కాపాడడానికి ఆకాశాన్ని మేఘావృతమై ఉండేలా చేశాడు. వారి ఆకలి తీర్చడానికి ఒక విధమైన రుచికరమైన రేగులాంటి పళ్ళు (మన్న్), సల్వా అనబడే ఒక విధమైన పక్షి మాంసం ప్రసాదించేవాడు.

బనీఇస్రాయీల్ ప్రజలను తీసుకుని వాగ్దానం చేయబడిన పవిత్ర భూమికి వెళ్ళాలని మూసా (అలైహిస్సలాం)ను అల్లాహ్ ఆదేశించాడు. ఆ పవిత్ర భూమి సిరియాలో ఉంది. వాస్తవానికి ఈ పవిత్ర భూమి ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం)కు వాగ్దానం చేయబడింది. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సంతతిలో సన్మార్గులు, దైవభీతి కలిగిన వారు, అల్లాహ్ చట్టాలను పరిరక్షించే వారు నివసించడానికి ఈ భూమిని అల్లాహ్ ప్రసాదించాడు.*

* ఇబ్రాహీమ్ ప్రవక్త (అలైహిస్సలాం) సంతానానికి ఈ పవిత్ర భూమి వాగ్దానం చేయబడింది. వారిలో ఇస్రాయీల్ సంతతి ప్రజలు, ఇస్మాయీల్ సంతతి ప్రజలు ఉన్నారు. వారికి ఈ పవిత్ర భూమి వాగ్దానం చేస్తూ అందుకు షరతుగా వారు అల్లాహ్ ఏకత్వానికి కట్టుబడాలని, ఆరాధనలు, దానధర్మాలు చేయాలని చెప్పడం జరిగింది. బనీ -ఇస్రాయీల్ ఈ షరతుకు కట్టుబడడంలో విఫలమయ్యారు. అందువల్లనే సూరా 21:05లో అల్లాహ్ ఈ విధంగా చెప్పాడు: “తౌరాత్ ఇవ్వబడిన తర్వాత మేము లేఖనాల్లోనూ (జబూర్లోనూ) పేర్కొన్నాము. నా దాసుల్లో సన్మార్గులు మాత్రమే భూమికి వారసత్వాన్ని పొందుతారు.” (లేఖనాల్లోనూ ఇదే కనబడుతుంది. 37:29. ”సన్మార్గులే పవిత్ర భూమికి వారసత్వాన్ని పొంది అక్కడ శాశ్వతంగా ఉంటారు”)

బనీఇస్రాయీల్ కృతజ్ఞత లేని ప్రజలు. అల్లాహ్ వారిని అపారంగా అనుగ్రహించినప్పటికీ వారు చెడులకు దూరంగా ఉండలేదు. అల్లాహ్ చట్టాల పట్ల తమ నిర్లక్ష్యాన్ని కొనసాగించారు. కనాన్, హిటైట్ ప్రజల పట్టణాలను ఆక్రమించు కోవాలని మూసా (అలైహిస్సలాం) వారిని ఆదేశించారు. ఈ రెండు జాతులు బనీ ఇస్రాయీల్కు శత్రుజాతులు, బనీ ఇస్రాయీల్ ప్రజలను వెంటాడి వేధిస్తున్న జాతులు. కాని, మూసా (అలైహిస్సలాం) ఆదేశం విన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు పిరికితనాన్ని చూపారు. సాకులు చెప్పసాగారు. “మూసా! ఆ పట్టణాల్లో బలాఢ్యులైన ప్రజలున్నారు. వారు అక్కడి నుంచి వెళ్ళనంత కాలం ఆ పట్టణాల్లోకి మేము ప్రవేశించం” అన్నారు.

కాని వారిలో, నిజమైన విశ్వాసం కలిగినవారు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ, ”ఆ పట్టణాల్లోకి సింహద్వారం గుండా ప్రవేశించండి. మీకు విజయం లభిస్తుంది. మీరు విశ్వాసులైతే అల్లాహ్ పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండండి” అన్నారు. కాని బనీఇస్రాయీల్ ప్రజలు పిరికితనాన్ని వదలలేదు. “మూసా! ఆ ప్రజలు ఉన్నంత కాలం మేము ఆ పట్టణంలోకి ప్రవేశించం. కాబట్టి నువ్వు, నీ ప్రభువు వారితో పోరాడండి. మేమిక్కడ వేచి ఉంటాం” అన్నారు.

మూసా (అలైహిస్సలాం), హారూన్లు ఈ పిరికివాళ్ళను మార్చలేకపోయారు. నిరాశతో మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. ”నాకు నా సోదరునిపైన, నాపైన తప్ప మరెవ్వరిపై అదుపు లేదు. కాబట్టి అవిధేయులైన వారికి – మాకు మధ్య విచక్షణ చేయి” అని ప్రార్థించారు. దిక్కుతోచని స్థితిలో వారు మరో నలభై సంవత్సరాలు గమ్యరహితంగా తిరుగుతూ ఉండేలా అల్లాహ్ వారిని శపించాడు. మూసా (అలైహిస్సలాం)వారిని వదలి దూరంగా వెళ్ళిపోయారు. ఈ తరం ప్రజలు దిక్కు తోచని స్థితిలో గమ్యరహితంగా తిరుగాడుతూ చివరకు అంతరించారు. తర్వాతి తరాలు మాత్రమే పవిత్ర భూమిని చేరుకోగలిగాయి.

(చదవండి దివ్యఖుర్ఆన్: 28:3-43, 20:9-100, 26:1-68, 7:100-156/160, 10:75-92, 27:7-14, 79:15-26, 11:96-101, 14:5-8, 23:45-48, 17:101-104)

(1) అణచివేతకు, పక్షపాతానికి, నిరంకుశత్వానికి గురయిన జాతులు నైతికంగా దిగజారుతాయి. పరాభవాలు, అణచివేతలు వారిని కూడా తమను అణచి వేసిన నియంతల మాదిరిగా తయారు చేస్తాయి. దౌర్జన్యాలు, అణచివేతల వల్ల అల్లాహ్ పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. నిరాశావాదులుగా, భవిష్యత్తు పట్ల ఆశలేని వారిగా మారడం కూడా జరుగుతుంది.

(2) నియంతలతో అయినా సరే చక్కని వివేకంతో వాదించాలని అల్లాహ్ తన సందేశహరులను ఆదేశించాడు.

(3) ఒక సైన్యం లేదా అసత్యం ఎంత బలమైనదయినాగాని చివరకు అది సత్యం చేతిలో ఓటమిని చవిచూస్తుంది.

(4) గత సంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల ప్రజలు సంస్కరణ లను వ్యతిరేకిస్తారు.